జులై2007
నీ మృత్యువుతో
నీ మృత్యువుతో
ఈ వర్షం లావాయై పొరలింది
చైతన్య దిక్కుల నుంచి
గంధకధూమం ఎగిసింది
నలుదిక్కులా
ఉక్కును ముక్కలు చేసిన వాసన కమ్మింది
కనిపించనివి ఏఏ మసకమసక విధ్వంసన దృశ్యాలో
జైలు కటకటాలా
సంకెళ్లా
మనస్సు నావరించిన భీరత్వపు గొలుసులా
నోటికీ, కలానికీ పడ్డ తాళాలా
లేదా అన్నీ ఒక్కసారేనా
నాకో చీకటికొట్టు కనిపిస్తున్నది
దాని ఉక్కగోడల మీద
బొట్లు బొట్లుగా కారిన నీ నెత్తురు చేసిన రంధ్రాలనుంచి
కిలకిలలాడే పక్షుల స్వేచ్ఛా తరంగాల్లో పుష్పిస్తున్న
సమస్త ఆకాశం తొంగిచూస్తున్నది
ఒక విప్లవకారుని మరణంలో
ఎందరు మృతులు సజీవులవుతారో
ఎవరికి తెలుసు
అచేతన సమాజం లేచినిలుస్తుంది
అతని నరాల్లో నెత్తురాగితే
కోట్లాది రక్తనాళాల్లో ఆగిన నెత్తురూ ప్రవాహమౌతుంది
నా ముందు ఊగుతూ విస్తరిస్తున్న పొలాలు
నిప్పులు చిమ్ముతూ నింగికెగుస్తున్న మొహాలు
విప్పారుతూ పొంగిపోతున్న గుండెలు
నాకు తూటాలశబ్దం వినవస్తున్నది
చెయ్యి విసిరి చిన్న పురుగును పట్టుకున్నట్లు
ఆ శబ్దాన్ని కమ్మేసిన గర్జనకూడ వినవస్తున్నది
నేను నిన్ను చూడలేదు
ఎడదల్లో ఎడారులు
ఆలోచనల్లో అరణ్యాలు
కడుపులో ఆకలి పర్వతాలు
కళ్లల్లో నదులు
శ్వాసల్లో తుఫానులు
స్వరంలో బంధించబడ్డ పొలికేకలు
చేతివ్రేళ్లపై
ఆటవిక మృగాల పంజాదెబ్బల గుర్తులు
పాదాలు రేపుతున్న ధూళిలో
బీళ్లైన ఊళ్ల దుఃఖాల మధ్యవెక్కిళ్లు
వేస్తున్న ప్రతి అడుగునూ
తోసేస్తున్న అన్యాయ సముద్రాల మీంచి వీచే తేమగాలి
ఉన్న ఆ ఆవాసాలలో
నేను నీ వెంట తిరుగలేదు
నువ్వు కాగడా అందుకొని సాగిపోయిన బాట
మనసు చీకట్లను కాంతిపుంజాలతో నింపిన చోట
విప్లవకారుడు మరణించినపుడు
మూగచరిత్రకు మాటలు వస్తాయి
భూగోళం ఒక్కచోటికి ఒదుగుతుంది
ప్రకృతి అతడు రాసిన గీతాలనాలపిస్తుంది
ప్రతి గుండెమీంచి బరువుబండలు తొలగిపోతాయి
నువ్వు మరణించిన తర్వాత
నువ్వు నాతో మాట్లాడుతున్నట్లు
నా దగ్గరకూర్చున్నట్లు అనిపిస్తున్నది
ముందర మంటలమీద కాపిన
విశాలమైన డప్పు ఒకటి ఉన్నది
లెక్కలేనన్ని చేతులు దానిని మోగిస్తున్నాయి
స్వేచ్ఛాగీతాలు అలపిస్తున్నాయి
నాకాభాష తెలియదు
కాని ఆ సందేశాన్ని
ఈ వర్షంలో గొడుగులా పట్టుకుంటాను
విప్లవకారుడు మరణించినపుడు
భాషాగోడలు కూలిపోతాయి
జాతి, ప్రాంతం, రాష్ట్రం
సరిహద్దులు చెరిగిపోతాయి
తిరుగుబాటు ఇష్టమైన పక్షిలా
భుజాలమీద కూర్చోపెట్టుకొని
నేను నీవెంట
లేచినడుస్తూ ఉంటాను
నినాదాలను క్రియలుగా మారుస్తూ
ఈ వర్షం
నీ మృత్యువుతో లావాయై పొరలింది
మరిమేము, ఉక్కుగా మారాము.
బంధనాలు విరిగిపోతున్నాయి
తొందర్లోనే ఈ గంధకధూమం
నీలలహరిలో ఒళ్లువిరుచుకునే
అగ్నిశిఖలుగా మారిపోతుంది
బానిస సంస్కృతి దగ్ధమవుతుంటే
వెలువడే ఒక వాసన
ఈ నేలంతా వ్యాపిస్తుంది
విప్లవకారుడు మరణించినపుడు
నిరీక్షించే అవధి
దగ్గరపడుతుంది
నీ మృత్యువుతో
ఆ ఆవాసంలో తేజస్సు
మరింత దగ్గరగా కనిపిస్తున్నది
చెర బండ రాజుకుంటున్నది
(అది నీపేరు)
పాకుతూ పాకుతూ
భూమిని సమతలం చేసి కానీ అది ఆగదు
లక్షల చితిమంటల్లోంచి
ఎగసిన శ్వేతాగ్నివలె
శతాబ్దాలదాకా జ్వలిస్తూ నువుచూస్తూ ఉంటావు.
మా అందరినీ
మా చేతుల్లో
నువ్వు అందించిపోయిన
ఈ విప్లవ కేతనాన్నీ
(1983)