Jul2007
పల్లవి
పతనమవుతోన్న భూస్వామ్య సామ్రాజ్యవాద
అరాచక శిథిల వ్యవస్థనుండి
సమతా మమతలు పండే
మహోన్నత మానవత్వపు పొలాల్లోకి
నన్ను నడిపిస్తున్న నా
రాజకీయ విశ్వాసం నుండి
నా శ్వాసనుండి
నన్ను వేరు పరచాలని
ప్రజకి నేను
శత్రువునని చెప్పబోయి
కుప్పకూలి చప్పబడి పోతున్నారు పాలకులు
అబద్ధంకనే అబద్ధాల పిల్లల్లా
గుడ్డివాడు గోతిలో పదేపదే
అదేపనిగా పడిపోయినట్టుగా
ఈ దేశ చరిత్రలో
జరిగిందే మళ్ళీ మళ్ళీ జరూరుగా
జరుగుతూనే వుంది
ఎన్నికల దోవలో పల్లేరుగాయలు తప్ప
పచ్చిక బయళ్ళుండవు
పార్లమెంటరీ పంథాలో ప్రజాశక్తికి
అవహేళన అవమానం తప్ప
విజయోత్సవాలుండవు
వన్నెతరగడమేకాని మానవశక్తి పెరగదు
కొత్తరక్తం ఇంజక్ట్ కాదు
ఆకలితో నకనకలాడే
అసంఖ్యాక అశేష ప్రజారాశిని
ఎన్నికల ఊబిలోకి లాగకండి
మురవకండి
మానవ పరిణామంలో
ఏనాడైనా తిరుగుబాటుదే పై చేయి
ప్రపంచపురోగతి సాంతం
శ్రమజీవి నెత్తుటిబొట్టులోనే ఇమిడివుంది

Pallavi - CherabandaRaju
అన్నం సహించదు నాకు
ఏరోజైనా
ప్రజాపోరాటాల విజయాల్ని రచించకపోతే
ఆరోజు జీవించినట్టుండదు
ఈ మట్టి నాకు
పట్టెడన్నం పెట్టి పాలుతాపింది
రాక్షస భూస్వామ్య రంపపు కోతల్నుండి
తనను విముక్తి చేసి
రుణం తీర్చుకుంటాను
విప్లవ వీరుల త్యాగాల నెత్తుటి దీపాల్ని చేతికందించింది
గమ్యాన్ని చూపి తుదివరకూ కొనసాగమంది
గొంతులో ఊపిర్లు ఉన్నంతవరకు
మదిలో ఓనమాలు మెదిలేంతవరకు
ఈ బాధ్యతను పూలమాలగా స్వీకరిస్తాను
అనుదినం ఆయుధాల పహారాతో
కుట్రలు కూహకాలతో
చట్టాల ఉక్కు చట్రాలలో ఇరికించి హింసించి
పోరుపాట నోరునొక్కి ఊరేగాలనుకుంటున్నారు
ఇప్పటికే భూమి ఎల్లెడలా పాట పాకిపోయి
బీటలెత్తిన పొలాల్లోకి సైతం ఇంకిపోయి
మొలకెత్తి చేనులై కనుపచ్చగా నవ్వుతోంది
ప్రజల రక్తనాళాల్లో ప్రతిధ్వనిస్తోంది
పల్లవి దొరకదు
అభిప్రాయాలు లేవు »కవితలు, క్లాసిక్స్