Jul2007
ప్రతిఘటనకు జేజే
మార్చి 14-16 మధ్య నందిగ్రాంలో జరిగిన భయానక మారణకాండ పూర్తి వాస్తవాలు బహుశా ఎప్పటికీ బయటకు రాకపోవచ్చు. పోలీసుల వలయాన్ని ఛేదించుకుని బయటకు వచ్చే చిన్న చిన్న వివరాలే, వివిధ చానళ్లలో ప్రసారమవుతున్న దృశ్య శకలాలే రాష్ట్రమంతటా అన్ని సమూహాల నుంచి అనూహ్యమైన ప్రజాగ్రహాన్ని రేకెత్తించగలిగాయి. సిపిఎం పాత చరిత్రను తవ్వితీసి దాని గుణగణాలను బేరీజువేయడానికి ఇది సరైన సమయం.
నందిగ్రామ్‌కు రిహార్సల్ ఈ యేడాది జనవరిలోనే జరిగింది. సింగూర్‌లోనైతే గత యేడాది సెప్టెంబర్, డిసెంబర్‌లలో జరిగింది. గ్రామీణుల మీద పార్టీ నిర్ణయాలను- కార్పోరేట్ నిర్ణయాలను ఏకపక్షంగా రుద్దడం, కార్పోరేట్ సంస్థల లాభాల కోసం రైతుల భూమిని కేటాయిస్తున్న విషయాన్ని వారికి కనీసమాత్రంగానైనా తెలపకపోవడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇపుడా కార్పోరేట్ లాభాలకే ప్రజాప్రయోజనాల ముసుగు తొడిగారనుకోండి! నందిగ్రామ్‌లో బెదిరింపులున్నాయి. హింస ఉంది. ప్రత్యేకించి పార్టీ కార్యకర్తలు పోలీసులు కలిసి మూకుమ్మడిగా దాడులకు పాల్పడ్డారు. చివరకు మహిళలు, పిల్లలు అని కూడా చూడలేదు. తృణమూల్ కాంగ్రెస్, బిజెపి, నక్సలైట్ల ప్రేరేపిత ఘటనగా అభివర్ణించడం ద్వారా దీనిపైన లోతైన చర్చ అవసరం లేదన్న భావన కలిగించడానికి సిపిఎం ప్రయత్నిస్తోంది. పార్టీ సారధ్యంలో జరిగిన ఈ హింసను నిరసించిన వామపక్ష సానుభూతిపరులపైనా, సామాజిక కార్యర్తలపైనా బురద జల్లుతోంది. భూసేకరణకు సంబంధించి కానీ గ్రామీణులపై జరపనున్న దాడుల గురించి కానీ ఏ నిర్ణయాన్ని కూడా కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు తెలియనివ్వకుండా ఏకపక్షంగా వ్యవహరించింది. రాష్ట్రపార్టీ నూతన ఆర్థిక విధానాన్ని చేపట్టినట్టు స్పష్టమవుతూనే ఉంది. పార్టీ కేంద్ర కమిటీ కూడా దానిని ఆమోదించినట్టే కనిపిస్తోంది. ఇందువల్లే ప్రజాస్వామిక విధానాల స్థానంలో ఇటువంటి ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. కార్పోరేట్ ప్రయోజనాలతో మిలాఖత్ కావడం, కార్పోరేట్ ఇచ్ఛకు దాసోహమనడం ప్రజాస్వామిక పద్ధతుల్లో ఎప్పుడూ సాధ్యం కాదేమోనన్న అంశంపై మనం కొంచెం దృష్టి పెట్టాలి. ఎందుకంటే దేశంలో ఎక్కడా అలా జరగలేదు. పశ్చిమబెంగాల్ దీనికి భిన్నంగా ఉండదని రుజువైంది.
వామపక్ష కూటమి తొలినాళ్లలో చేపట్టిన భూసంస్కరణలు రాష్ట్రంలో రైతాంగ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడంలోనూ వారి నైతిక స్థైర్యాన్ని పెంచడంలోనూ గణనీయమైన ఫలితాలు సాధించాయి. చిన్న సన్నకారు రైతాంగం ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచాయి. సింగూర్‌లోనూ, నందిగ్రాంలోనూ మనం అదే చూశాం. మరోవైపు పరిశ్రమలు చావుదెబ్బతిన్నాయి. దాదాపు యాభై వేల ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. జూట్ పరిశ్రమ అయితే పూర్తిగా నాశనమైపోయింది. కౌలుదార్లను రిజిస్టర్ చేయడం, కొంత భూ పంపకం మినహా వ్యవసాయ విధాన పునర్నిర్మాణానికి అవసరమైన ఎలాంటి చర్యల్ని వారు చేపట్టలేకపోయారు. పంచాయితీ సంస్థలకు అధికారాలు, విధులు అప్పగించడం వల్ల అవి బలోపేతమయ్యాయి.అయితే రూపాయికున్న మరో పార్శ్వంలాగా గ్రామాల్లో వివిధ పార్టీల మధ్య ఘర్షణలు, హింస పెరిగాయి. తృణమూల్‌తో సహా అన్ని పార్టీలకు ఇందులో అంతో ఇంతో పాత్ర ఉన్నప్పటికీ పోలీసులపై పట్టు, రాష్ట్ర రాజకీయ అధికారం సిపిఎం చేతుల్లోనే ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
స్ట్రక్చరల్ అడ్జస్ట్‌మెంట్ విధానాలను చేపట్టిన 1990ల నాటినుంచి జాతీయ స్థాయిలో కొత్త మార్పులు జరుగుతున్నాయి. వరుస విజయాల ఊపుమీదున్న సిపిఎం రానురాను విమర్శను సహించలేనిదిగా, ప్రత్యర్థులను ఓర్వలేనిదిగా తయారైంది. పట్టణ సుందరీకరణ పేరుతో చిరువ్యాపారులను కోల్‌కత్తా వీధులనుంచి గెంటేశారు. రాజధానికి సమీపంలోని న్యూరాజర్హాత్ వద్ద విశాలమైన, సుసంపన్నమైన పంటపొలాలను కార్పోరేట్ సంస్థలకు కట్టబెట్టారు. డబ్బుతో పులిసిపోయిన వాళ్ల కోసం అక్కడ ఆధునిక అగ్రహారాలు నిర్మిస్తారు. ఆక్వాటిక్ సోర్ట్స్ కాంప్లెక్స్‌లు, కళ్లు చెదిరే రెసిడెన్షియల్ రిసార్టులు అక్కడ వస్తాయి. రాజధాని నుంచి అంతర్జాతీయ విమనాశ్రయానికి వెళ్లే బైపాస్ రోడ్డుకు ఇరువైపులా ఇదే వ్యవహారం. రైతాంగం నుంచి, పల్లెకారుల నుంచి భూములు లాక్కొని ధనవంతుల విలాసాలకు కేటాయించారు. ఇక్కడ ఫైవ్ స్టార్ ప్రైవేట్ హాస్పటల్స్, గేటెడ్ కమ్యూనిటీస్, విలాసవంతమైన పార్కులు, ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్లు, పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ రానున్నాయి.
అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలు కుదేలై పోగా ప్రజారోగ్యం దారుణమైన పరిస్థితిలో పడింది. కర్మాగారాలు మూలనపడ్డాయి. కేంద్రం నుంచి వచ్చే గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు సగానికి పైగా ఉపయోగానికి నోచుకోక తిరిగి కేంద్రానికే వెడుతున్నాయి. నిజమైన పారిశ్రామికీకరణపై గానీ, ప్రజాప్రయోజన పథకాలపై గానీ, ఉపాధి కల్పించే అంశాలపై గానీ దృష్టి పెట్టిన పాపాన పోలేదని మనం చెప్పొచ్చు. ఇక్కడ ప్రభుత్వ సౌజన్యంతో విలసిల్లుతున్నదల్లా అప్పర్ మిడిల్ క్లాస్ విలాసాలు, కార్పోరేట్ ప్రయోజనాలు.
తప్పుడు సమాచారపు వలయం మరో దుస్సహమైన పరిణామం. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పర్యావరణ హెచ్చరికను పెడచెవిన పెట్టి ఎలాంటి ల్యాండ్ మ్యాప్‌లు, ల్యాండ్ సర్వేలు లేకుండానే 1970ల నుంచి భూబదిలీలను నిర్వహిస్తున్నారనేది ఇపుడు స్పష్టమైంది. సింగూర్‌లో మన కళ్లెదురుగానే బహుళ పంటలు పండుతున్న భూమిని ఒకే పంట భూమిగా పేర్కొన్నారు. ఎంత భూమి బదిలీ చేస్తున్నారో, ఏ ప్రయోజనాల కోసం చేస్తున్నారో సరైన వివరాలు ఇవ్వకుండా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారు. సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగితే కూడా సమాధానం లేదు. పార్టీ పంచిపెట్టిన ‘ఫాక్ట్‌షీట్’ ఒక అసత్యాల మూట. సింగూర్‌లో ఎలాంటి హింసాత్మక ఉద్యమం జరగకపోయినా శాంతియుత ప్రతిఘటనమీద సైతం పోలీసు, పార్టీ కేడర్ల దౌర్జన్యకాండ సాగించారు. అంటే ప్రజల భూములను, జీవనోపాధిని, గ్రామాలను, పర్యావరణాన్ని, సంస్కృతిని పణంగా పెట్టినా ఈ వ్యవహారమంతా వారితో కనీసమాత్రంగా చర్చించకుండానే సాగించినా వారు పార్టీ నిర్ణయానికి తలొగ్గి ఉండాలన్న మాట. సింగూరు ప్రజల ప్రమేయం లేకుండా వారి భూములను స్వాధీనం చేసుకోవడం, వారి శాంతియుత ఉద్యమంపై దమన కాండ సాగించడం వంటి అనుభవాలు నందిగ్రామ్ రైతులు తమ భూములను, ఉపాధిని స్థిరచిత్తంతో కాపాడుకునేందుకు, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పురికొల్పాయి. జనవరి చివర్లో ఆ ప్రాంతాన్ని సందర్శించిన మాలో కొందరం అక్కడ గ్రామీణ అంతర్యుద్ధం జరిగనుందని హెచ్చరించాము.
నందిగ్రామ్ ప్రజలు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధపడబట్టే, అక్కడ అంతస్థాయిలో హింస జరగబట్టే వారికి మినహాయింపులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడింది. అదే సమయంలో పార్టీ నేతలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రత్యేక ఆర్థిక మండళ్లను రాష్ట్రంలో ఏర్పాటు చేసి తీరుతామని చెపుతున్నారు. వారు వాటికి సంబంధించి సూచిస్తున్న మార్పుల్లో కార్మికుల హక్కులకు సంబంధించిన అంశాలు లేవు. యూనియన్ల ఏర్పాటుకు సంబంధించి కానీ కంపెనీలకు దఖలు పడే అపరిమితమైన- స్థానిక చట్టాలకు లోబడని అధికారాలను అడ్డుకునే అంశాలు కానీ లేవు.
ఇక పశ్చిమబెంగాల్‌లో ఏం మిగిలింది? సుదీర్ఘమైన సుసంపన్నమైన వామపక్ష రాజకీయ సంస్కృతి మిగిలే ఉంది అని నేను చెప్పదలుచుకున్నాను. రైతాంగ వీరోచిత ప్రతిఘటనలో మనం దాన్ని చూడొచ్చు. పట్టణాలను వదలకుండా ఉపాధికోసం పోరాడుతున్న పేదల్లో చూడొచ్చు. నందిగ్రామ్ మారణకాండకు నిరసనగా, ప్రతిఘటనా పోరాటాన్ని బలపరుస్తూ అనూహ్యమైన రీతిలో రాష్ట్రంలోని పల్లె పట్టుల్నించి పట్టణాలు-నగరాల దాకా విస్తరించిన సంఘీభావ స్ఫూర్తిలో చూడొచ్చు.
అభిప్రాయాలు లేవు »సాహిత్య వ్యాసాలు