పూలగుర్తులు

పూలమ్మిన చోటనే కట్టెలమ్మాల్సి వస్తుందని అందరూ చెప్పారు నేను పూల దుకాణం పెడుతుంటే. నేను పట్టిన కుందేలుకు మూడు కాళ్లనే మొండివాణ్ని కాదు. నా మేలు కోరి చెప్పిన వాళ్ల మాట కాదనలేను. అలాగని నా పుర్రెలో పుట్టిన ఐడియాను చంపుకోలేను. అందుకని ఉభయతారకంగా పూలదుకాణం పెట్టి పక్కనే మొక్కల నర్సరీ కూడా పెట్టాను. Say it with flowers (పూలిచ్చి మీ ప్రేమను ప్రకటించండి) అని షాపుకు పేరు పెట్టాను. ఇంటర్నెట్‌ లేకపోతే ఎలా ఉండేదో కానీ, దాని పుణ్యమా అని బాగానే సంపాదిస్తున్నాను. ముఖ్యంగా అమెరికా, యూరోపు దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు తల్లిదండ్రుల్నీ, తోబుట్టువుల్నీ, చుట్టాల్నీ మరిచిపోలేదని చెప్పడానికన్నట్టు పూలు, బొకేలు ఆర్డర్లు పంపేవాళ్లు. అందుకోసం www.sayitwithflowers.co.in అన్న వెబ్‌సైట్‌ ఒకటి ఓపెన్‌ చేసాను. నా షాపులో నేనందించే సర్వీసులు, మదర్స్‌ డే, ఫాదర్స్‌ డే, బ్రదర్స్‌ డే, చిల్డ్రన్స్‌ డే, వేలంటైన్స్‌ డే ఇట్లాంటి దినాల వివరాలు పెట్టాను. నా వెబ్‌సైట్‌లో రిజిష్టర్‌ చేసుకున్న వాళ్లకు ఆయాదినాల గురించి ఇమెయిల్‌ ఎలర్ట్‌లు పంపే ఏర్పాటు కూడా చేశాను. అందువల్ల అమ్మకాలు జోరుగానే ఉన్నాయి. పూల షాపులోనే కాదు నర్సరీకి కూడా కస్టమర్లు బాగానే వస్తున్నారు. మిగతా నర్సరీల్లా కాకుండా నేనేం చేసే వాడినంటే ఏ మొక్క కొంటే బాగుంటుందో చెప్పి కొనిపించే వాడిని. పూల మొక్కల్ని కొనడానికి వచ్చే వాళ్లకు రకరకాల క్రోటన్‌ మొక్కల్ని వాటి ఆకుల అందాల్ని చూపించి కొనిపించే వాడ్ని.
కస్టమర్లతో మాట్లాడి వాళ్ల ఇష్టాయిష్టాలను బట్టి, వాళ్ల ఇళ్ల సైజులు బట్టి మొక్కల్ని సూచించేవాడ్ని. షాపు మధ్యలో రకరకాలుగా మొక్కల్ని అమర్చి చూపించేవాడ్ని. హాలు మధ్యలో మట్టి, ఇత్తడి పళ్లాల్లో నీళ్లు పోసి నాలుగు రకాల పువ్వుల్ని పెడితే ఎంత బాగుంటుందో చూపించి నాలుగైదు రకాల పూలమొక్కల్ని అమ్మేవాడ్ని.

నేను చెప్పేది కొందరికి నచ్చేది. కొందరికి నచ్చేది కాదు. కానీ వాళ్ల ఎంపికలో నేను చూపించే చొరవ మాత్రం నచ్చేది అందరికీ. కరివేపాకు మొక్క కొనడానికి వచ్చిన వాళ్లనీ, ఖరీదైన షోకు మొక్కల్ని కొనడానికి వచ్చే వాళ్లనీ ఒకేలా చూసేవాడ్ని. దాంతో ఊళ్లో మొక్క కావలసిన వాళ్లెవరికైనా ముందు గుర్తుకు వచ్చేది నా షాపే.

షాపు పెట్టిన సంవత్సరంలో చాలమంది కస్టమర్లను చూసాను. బాగా డబ్బుండి టోకున మొక్కల్ని కొనేవాళ్లనీ చూసేను. ఒకే ఒక్క మొక్కని కొన్న వాళ్లనీ చూసాను. కానీ ఒక కస్టమర్‌ మత్రం అర్థమయ్యేవాడు కాదు. ఒకరోజు బంతిమొక్క కొంటే, ఇంకో రెండు రోజుల తర్వాత గులాబి మొక్కలు రెండు కొనేవాడు. కొన్ని సార్లయితే ఐదారు మొక్కలు కొనేవాడు. అరవై ఏళ్లుంటాయి కావచ్చు. సాదా బట్టలు వేసుకునేవాడు. కొనుక్కున్న మొక్క లేదా మొక్కల్ని గుడ్డ సంచిలో వేసుకు వెళ్లేవాడు.
అతనొచ్చినప్పుడల్లా నా మొక్కల పరిజ్ఞానాన్నంతా ప్రదర్శించడానికి ప్రయత్నించే వాడ్ని. కానీ నా మాటల్ని పట్టించుకోకుండా తను కొనాల్సింది కొనుక్కు వెళ్లేవాడు. నాకు క్రమక్రమంగా ఈ కస్టమర్‌ మీద ఆసక్తి మొదలైంది. అందుకే అతడెప్పుడొచ్చినా ఏం కొన్నా జాగ్రత్తగా గమనించే వాడిని. గమనిస్తున్న కొద్దీ నాకాయన మీద ఉత్సుకత పెరిగిందే గానీ తగ్గలేదు. ఒక్కోసారి వారాల తరబడి వచ్చేవాడు కాదు. అసలు ఇన్ని మొక్కలు ఏం చేస్తున్నాడు? మళ్లీ ఎవరికైనా అమ్ముకుంటున్నాడా?
“ఈసారొచ్చినపుడు అతడిని వెంబడించి వెళ్లాలి” అని అనుకున్నాను.

నేనలా అనుకున్న కొన్ని రోజులకు రానే వచ్చాడు. అయితే ఎప్పటిలా ఒక్కడే కాకుండా ఐదారేళ్ల బాబును వెంట తీసుకొచ్చాడు ఒక రోజు మధ్యాహ్నం. మనిషి ఎప్పటికంటే గంభీరంగా ఉన్నాడారోజు. బంతీ, చామంతీ, గులాబీ – అన్నీ కలిపి ఏకంగా ఎనిమిది మొక్కలు కొన్నాడు.

కౌంటర్లో కూచున్న నా దగ్గర కొచ్చాడు డబ్బులియ్యడానికి. అతను తీసుకున్న మొక్కల్ని చూస్తూ చిన్న కాగితం మీద ఎంతయిందో లెక్కవేసి చెప్పాను. అతను పాంట్‌ జేబులోంచి డబ్బులు తీసి లెక్కపెట్టి నాకు ఇవ్వాల్సినవి తీసిచ్చాడు.

“ఎవరూ? మనవడా?” అనడిగాను.
“అవున”న్నాడు.
నేనేం మాట్లాడకుండానే తనే అన్నాడు. “కూతురు కొడుకు. టౌన్‌లో ఉంటారు. వాడు పుట్టాక ఇదే రావడం”.

కాలర్‌ ఉన్న తెల్లటీషర్ట్‌, నల్లటి నిక్కర్‌ వేసుకున్నాడు.
ఈ పూల మొక్కల షాపులో వాడొక తెల్లగులాబీ పువ్వులా ఉన్నాడు.
“నీ పేరేంటీ?” అనడిగాను.
ముద్దుముద్దు గొంతుతో ‘రమాకాంత్‌’ అన్నాడు.
నాకు రావాల్సిన డబ్బులు తీసుకుని చిల్లర ఇచ్చేను.
డబ్బులు జేబులో పెట్టుకుని షాపు బయటకు నడిచేరిద్దరూ.

వాళ్లలా బయటకు వెళ్లగానే నా అసిస్టెంట్‌ను పిలిచేను. ‘కాసేపు బయటకు వెళ్లొస్తాను, షాపు చూడమ’ని చెప్పి బయటకెళ్లి చూసేను. ఒక చేత్తో మొక్కల సంచిని మరో చేత్తో మనవడి చేతిని అపురూపంగా పట్టుకుని అతడు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. వాళ్లు ఇంకొంచెం దూరం వెళ్లేదాకా ఆగి వారిని అనుసరించాను.
టైం నాలుగవుతుంది. పడమరకు వాలుతున్న ఎండలో తాతా మనవళ్ల నీడలు తూర్పున పడుతున్నాయి. మనవడు ఏదో అడిగినట్టున్నాడు, అటువైపు తిరిగి ఏదో చెబుతున్నాడు. తలపైకెత్తి తాత మొహంలోకి చూసి మళ్లీ ఏదో అడిగాడు మనవడు. రోడ్డుమీద వాహనాల చప్పుడులో వాళ్ల మాటలు అక్కడే గాలిలో కలిసిపోతున్నాయి.
వాళ్లలా రెండు మూడు వీథులు దాటి చెరువు పక్క పెంకుటింటి పక్కన ఆగారు. నేపాళం కర్రలతో కట్టిన దడి తలుపు తీసుకుని లోపలికెళ్లారు. వాళ్లు లోపలికెళ్లే దాకా ఆగి నేనూ అటువైపు వెళ్లాను, చెరువువైపు వెళ్తున్నట్టు. వాళ్ల గేటు దగ్గరకు చేరుకోగానే తలతిప్పి వాళ్ల ఇంటివైపు చూసాను. ఇంటిముంది అరుగుమీద రెండు కుర్చీలు ఉన్నాయి. ఒక మూల గాదె ఉంది. మెల్లగా గేటు తీసి లోపలికెళ్లాను. ఇంటి తలుపు సగం తెరచి ఉంది. ఎదురుగా ఉన్న గోడమీద ఒక యువకుడి ఫొటో వేళ్లాడుతోంది.

ఇంటి పక్క ఖాళీ ప్రదేశంలో ఏదో మాటల అలికిడి వినిపించడంతో అటువైపు వెళ్లాను. గోడ దగ్గర ఆగిపోయి చూసాను. దాదాపు ఇల్లెంత ఉందో ఖాళీ ప్రదేశం అంతే ఉంది. అక్కడక్కడా పూల మొక్కలు, చిన్నవీ పెద్దవీ ఉన్నాయి. బుల్లి రమాకాంత్‌ గొంతుకిలా కూచుని సంచిలోంచి మొక్కలు బయటకు తీస్తున్నాడు. పెరట్లోని పాకలోంచి బూరిగె తీసుకొచ్చి మనవడి దగ్గరపెట్టి నుయ్యి దగ్గరకెళ్లి బకెట్‌తో నీళ్లు తీసుకొచ్చాడు తాత.

అక్కడక్కడా నీళ్లు పోసీ చిన్న చిన్న గోతులు తవ్వుతూ ఒక్కొక్క మొక్కా పాతుతున్నారు ఆ ఇద్దరూ. చల్లటి గాలికి ఆ చిన్న పూతోటలో మొక్కలు – రకరకాల రంగులవీ, వాసనలవీ – మెల్లగా హాయిగా విలాసంగా వూగుతున్నాయి.

“వీటికి నువ్వు రోజూ నీళ్లు పోయాలి నువ్వు ఉన్నన్ని రోజులు” అన్నాడు తాతయ్య.

“పోస్తాను గానీ తాతయ్యా, ఇన్ని మొక్కలెందుకు తాతయ్యా,” అనడిగాడు మనవడు.

ఆ ప్రశ్న విన్నాడో లేకపోతే పనిలోపడి ఆ మాటలు పట్టించుకోలేదో తెలీదు కానీ కాసేపు ఏమీ మాట్లాడలేదు తాత. అప్పుడే పాతిన మొక్క మొదలు దగ్గర కొంచెం మట్టి పోసి రెండు చేతులతో ఒత్తాడు.

“అసలిన్ని మొక్కలెందుకు కొన్నావు తాతయ్యా” అని మళ్లీ అడిగాడు రమాకాంత్‌.

“ఈ రోజు పొద్దున్నే ఎనిమిది మంది చనిపోయారు నీ కోసం, నా కోసం. మీ కోసం చనిపోయిన వాళ్ల కోసం మీరేం చేశారని ఎవరైనా అడిగారనుకో, ఇవి చూపిద్దాం. ఇక్కడ పూసే పూలగాలుల్లో వాళ్లు మన కళ్లల్లో మెదుల్తుంటారు,” అన్నాడు తాతయ్య.

అతడి మాటలు వింటూ పెరడంతా చూసాను. సాయంత్రపు నీరెండలో పువ్వులు కొత్త కొత్త రంగులు ప్రకటిస్తున్నాయి. నాకిప్పుడు ఆ మొక్కలు నాకు డబ్బులు కురిపించే చెట్లలాగా అనిపించడం లేదు. కొత్త ప్రాణం పోసుకున్నట్టు తోస్తున్నాయి. ఎవరెవరివో జ్ఞాపకాలకు గుర్తులుగా కనిపిస్తున్నాయి. మెల్లగా బయటకొచ్చి షాపు చేరుకున్నాను.
ఒకరోజు పొద్దున్నే పేపరు తీసి ఒక వార్త చదువుతుంటే అనిపించింది. ఈ రోజు తప్పకుండా అతడు నా షాపుకు వస్తాడనిపించింది. షాపు తెరచిన కాసేపటికి నేననుకున్నట్టుగానే వచ్చాడు. అతడికోసమే రడీగా పెట్టుకున్న గడ్డి గులాబీ మొక్కొకటి తీసి అతడి చేతిలో పెట్టాను. వద్దనలేదు. ఇంకోమొక్క వెతుక్కునే ప్రయత్నమూ చెయ్యలేదు. అతడి కళ్లలోకి చూసాను. ఉబికి వచ్చి కనుగుడ్లపై ఆగిపోయిన కన్నీళ్లు కనిపించాయి.

(మాధవ్‌, రజిత, రవి, ప్రసాద్‌లకు ఇంకా ‘అనేకానేక మందికి’)

16 అభిప్రాయాలు »కథలు

16 అభిప్రాయాలు

  1. chavakiran Jul 6, 2007 1

    బాగుంది

  2. radhika Jul 7, 2007 2

    చాలా బాగుందండి.కదిలించింది.

  3. B.AJAY PRASAD Jul 9, 2007 3

    కథ బాగుంది. కదిలించే కథ.

  4. chandu Jul 9, 2007 4

    పూలు చూస్తే కథను చదివిన వారికి రాలిన తారలు గుర్తొస్తాయి.

  5. Indu Jul 10, 2007 5

    చాలా బాగుంది మీ కథ…నిజముగా కదిలించింది..

  6. కొత్తపాళీ Jul 24, 2007 6

    కేవలం కదిలించడం కాదు – ఈ కథలో నిజంగా ఒక అద్భుతముంది. నిండు నూరేళ్ళు జీవించి ఎన్నో ఘనకార్యాలు సాధించాల్సిన యువతీ యువకులు అకాల శిశిరంలో పండుటాకుల్లా నిష్కారణంగా రాలిపోతున్న భీభత్స భయానక వాతావరణం లోంచి ఒక చిన్న ఆశా కిరణాన్ని పూలమొక్కల ద్వారా ప్రవేశ పెట్టటం, అవి అందమైన పూల తోటగా విస్తరించడంలో .. సజీవమైన ఆశ రెట్టించిన బలంతో వేళ్ళునుకుంటుంది అని సూచించటం చాలా అందమైన ప్రతీక. కథనం దృష్ట్యా కూడా కథకుడు కథలో ముఖ్య పాత్ర కాకుండా ఒక ప్రేక్షకుడిలడూత్తమ పురుషలో చెప్పటం కథలో నమ్మకాన్ని ఒక పిసరు పెంచుతోంది. కూర్మనాథ్ గారూ, సలాం!

  7. desaraju Jul 31, 2007 7

    కథ బాగుంది. అయితె, యినకా పొయితిక్ గా చెబితె బాగున్ డెది.

  8. RAMYA JYOTHI.U Aug 5, 2007 8

    ఈ కథ చాలా బాగున్నది. ఇ0దులొని భావ0్ చాలా కదిలి0చి0ది.
    చాలా ఆసక్త్తి కలిగి0చెలా కథను కొనసాగి0చారు.

  9. manasa yendluri Aug 5, 2007 9

    మీ కథ విభిన్న0గా ఉ0ది.కథా వస్తువు బాగుంది.ఇన్కా మీ నుంచి చాలా కథలు ఆసిస్తున్నాము మీ అభిమాని మానస

  10. nuvvusetty Aug 7, 2007 10

    ఎక్కడొ టచ్ చెసింది

  11. Srini Bodduluri Jul 21, 2009 11

    అవును నువ్వు పూల తొనె చెప్పావు

  12. aanandbabu Aug 10, 2009 12

    Hi Yendluri Manasa,

    How r u? I am fine. very long back i found ur address.

    kindly let me know ur mail ID

    with regards,

    anandbabu

  13. aanandbabu Aug 10, 2009 13

    ananadbabu = ubabida@gmail.com

  14. himabindu Aug 21, 2009 14

    ఇంత సున్నితంగా మీరే రాయగలరేమే అనిపిస్తుంది మీ ప్రతి కధ చదివిన సారి. చాలా ఆలస్యంగా చదివినందుకు ఫీల్ అయ్యా!

  15. kasi vennela Sep 2, 2009 15

    చక్కని భావానికి అందమైన కధారూపం ఇచ్చారు.ఏమీ తోచక క్లిక్ చేస్తే
    సరదాగా పూలతోటలో తిరిగి తిరిగి ఆర్ద్ర హౄదయాలతో పరిచయం చేసుకొచ్చిన అనుభూతి!
    మానస గారికి అభినందనలు!

  16. హెచ్చార్కె Oct 31, 2009 16

    చాల బాగా చెప్పారు కథ. ఇలాంటి సందర్భాల్లో రచయిత తాను ఎమోషనల్‍ అయిపోయి పాఠకునికి ఏమీ మిగిల్చని (దు)స్థితి తరచు ఎదురవుతుంటుంది. ఒకే ఒక్క సారి మాత్రమే కన్నీటి ప్రస్తావన తీసుకు రావడం వల్ల కూర్మనాథ్ ఆ దుస్థితిని పరిహరించారు. కథలోని తాత గారికి నమస్కారం. .__హెచ్చార్కె

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో