Aug2007
బాదం చెట్టు
వరండాలో నిలువుగాళ్ళపై నిలబడి
ఎండకు, వానకు చలించక కాపలా కాస్తోంది
దగ్గరకెళితే చాలు చల్లని నగవులతో స్వాగతిస్తుంది
ఆకుపచ్చని గొడుగు పట్టి
చిక్కని నీడను పరుస్తుంది
ఒక్కోసారి అరచేతుల్ని విస్తళ్ళని చేసి
గోరుముద్దలు తినిపిస్తుంది
చల్లని సాయంత్రాలు పదిమందితో కలిసి కబుర్లాడుతుంది
అప్పుడప్పుడు ఎవరూ లేనిది చూసి
పండిన ఎర్రని బాదం కాయనిస్తుంది
మన బాల్యం తిరిగి వచ్చి
తీపి వగరు పులుపులను రుచి చూస్తుంది
తాను మాత్రం వేదాంతిగా
ముసిముసిగా నవ్వుతుంది
వణికించే చలికి
శరీరమ్మీద కప్పుకున్న వేనవేల చేతులు
రక్తం గడ్డకట్టి ఎర్రగా
నేలరాలుతుంటే
గాలితో, నడిచొచ్చే పాదాలతో
దిగులు పంచుకుంటుంది
సనసన్నగా శోకిస్తూ
ఆశలన్నీ రాలిపోగా
నిలువుదోపిడీతో నగ్నమై
మూణ్ణాళ్ళు ఎండిన మోడై భయపెడుతుందా
అంతలోనే అణువణువులో దీపాలు వెలిగించుకొని
చూపులకు హారతిలిస్తుంది.
(సుశీకి కృతజ్ఞతలతో)