Aug2007
బేమాన్!
మనసంతా గాలిగాలి
బతుకంతా గోసగోస
లోకులు మెచ్చేదేంది
కాకులు ఇచ్చేదేంది
పాడినకాడికి సాలుతియ్
ఇగ
లాలిపాటలు ఆపుజేయ్
జోలపాటలు బందుజేయ్
అయిందొకనాడు
పోయిందొకనాడు
తెలంగాణా పదాన్ని
వడిసెలలో పెట్టి
పంటను సీరుకతింటున్న
ఆధిపత్య పక్షుల్ని గెదిమిగెదిమి కొడుత
జీవునానికి జీవునమైన
నా భూమిని బుద్దితీర గుండెల్ల అదిమదిమి పడుత
‘ఇసంత రమ్మంటే
ఇల్లంతా నాదనే
కూసుండ కుర్చీ ఇత్తే
పండ మంచమడిగె’
డప్పందుకో జమిడకందుకో
పీరందుకో బోనమెత్తుకో
ఏక్‌దో ఏక్‌దో తీన్‌మార్
పట్టు పరువు పదం కలువు
‘రామ రామ రామా
రామ సక్కని నా తెలంగాణా’
ఎవలను ఎటు పొమ్మంటలేం
దుర్జెట్ట తలరాత రాసిపెట్టుకున్నం
ఎవలను ఏమి ఇమ్మంటలేం
దిక్కుమెల్ల బతుకు గీ తరీక అడుకచ్చుకున్నం
అవ్ !
తెలంగాణా కాంగిరేసోల్లు మీకడుపుల ఏముందో
కమునిట్టోల్లు మీ మనసుల ఏం మెదులుతుందో
తెలుగుదేశమోల్లు మీ దమాక్‌ల ఏం కూసుందో
మీ గుండెలమీద సెయ్యేసుకొని
ఇమానంగా సెప్పుండ్రి
గాళ్లు మనల్ని ధోకా సెయ్యలే
కువారం పెట్టుకోక కుల్లంకుల్ల సెప్పుండ్రి దోపుకం సెయ్యలే
అక్కడి కవులు రచయితల్ని చూసి
మనకు సిగ్గురాకపాయె
సన్మానాలు శాలువాలకు ఆసపడి
గాళ్ల మంచాలు ఎత్తుకు ఎన్నొద్దులు తిరుగుతరు
అవతలోల్లు నవ్వినందుకుగాదు
తోటి యారాలు అన్నందుకు
బాధను సూసి నవ్వాల్నో ఏడ్వాల్నో తెల్వదు
అంతా అత్తగారింటికి
సద్దిమోసే కోతి భాషణలు
అంతా సుట్టంగాని సుట్టాన్ని
అలాయ్‌బలాయ్ తీసుకునే విభీషణులు
అరెరే !
‘గట్క వక్కలకు ఘనుండరా
నా పేరే భీమసేనుండరా’
పెద్దల ఒప్పందాన్ని బొందపెడ్తిరి
ముల్కీ ఆరుసూత్రాల్ని అంగట్లకొంటిరి
గిప్పుడ చే సౌ దస్…
మారె! మీరేం ముందట పడనిత్తరు
పాలుతాగిన రొమ్ము గుద్దెటోల్లు
మీరేం కానిత్తరు కానియ్యరు
సెప్పులున్నోనితోని సెప్పులు లేనోడు నడిచినట్టు
యాభైఏండ్ల తొవ్వల గుచ్చుకున్న ముండ్లతోని
మా గుండెలు తడతడ పెడుతున్నయ్
సొచ్చుడు సొచ్చుడే
ఉడుం సొచ్చినట్టు సొత్తిరి
నల్లికుట్లతనం పాయిదార్ల గుణం
నీళ్లు దోత్తిరి
నిజాల్ని దాత్తిరి
నౌకర్లు కాజేత్తిరి
బేకార్లను జేత్తిరి
జాతి అంతా ఒక్కటంటిరి
మోచేతికి బెల్లంపెట్టి నాకమంటిరి
పగోనివైతే కైరతుగుంటుం
పాలోనివైతే పైలంగుంటుం
ఉప్పేసి కూడిన పొత్తులు
తేనె పూసిన కత్తులు
మిమ్ముల్ని అనేదేమిలేదు
దొంగకు సీకటి సోపతైనట్టు
మీతోని శరీకైన బద్మాష్‌లు మావోల్లనే అనాలె
కుడుము అంటే
పండుగ అనుకునేటోల్లం
మన్నంటని మనసున్నోల్లం
మ్యాదకులం బున్యాదులం
అవ్ ! బిడ్డా
మీ ఆంధ్ర అమ్మనెత్తిమీద సెయ్యిపెట్టి సెప్పు
హైద్రాబాద్ మీదా మీ అయ్యదా
బేటా! నకరాల్ సెయ్యకు
నమ్మితే పానం ఇత్తం
నమ్మక్కరమైతే నిలువునా పానం తీత్తం
‘వారె వవ్వా! వారె వవ్వా!
డిగారడివాడు కొంపముంచెటోడే డిగారడి’
ఏషాలు సూసి పిల్లి నవ్వుతుంది
మోసాలు సూసి నక్క ఊలపెడుతుంది
యాల్ల మించుకచ్చింది
మోకా ముందుకచ్చింది
ఇగ మానాయకుల్ని
పెద్దముత్తయిదల్ని సెయ్యాలె
(స్త్రీలను కించపర్సుడు కాదు)
పసుపు కుంకుమగాజులు
కనుములకట్టి జెయ్యతుగ ఇయ్యాలె
తల్లి తెలంగాణాను కిరీటంగ మొయ్యాలె
లోకులు మెచ్చేసింది
కాకులు ఇచ్చేసింది
కపటజాజితనం
ఇసపాతక గుణం
ఉన్నజాగ మరిసెటోల్లు
తిన్నరేవు తలువనోల్లు
బతుకచ్చినోల్లకు గింతవుంటే
బతుకలేనోల్లకు ఎంతవుండాలె
పానాలగుత్తోల్లు
మీరెందుకు పోతరు
మీరెందుకు పోతరు
ఊసరవెల్లులు ఊసరవెల్లులు
వట్టి బేమాన్లు ! బేమాన్లు !
(సచివాలయం ముట్టడి చేసిన తెలంగాణ బిడ్డలకు…)
August 7th, 2007 at 10:38 am
poem bagunnadi jukanti di different tone telengana poetry lo
August 16th, 2007 at 1:02 pm
జూకంటి కవిత అద్భుతంగా ఉంది.
తెలంగాణ ప్రజల మనొభావాలకు దగ్గరగా ఉంది.
August 24th, 2007 at 2:12 am
ఇది కవిత్వమా – ఒక ప్రాంతం ప్రజల పట్ల ఇంత ద్వేషమా.. పేదరికం ఎక్కడ లేదు. రాయలసీమలో లేదా.. పలనాడులో లేదా… ప్రకాశమంలో లేదా… కవులు ప్రాంతీయ వివక్షకు వ్యతిక్రేకంగా ఉంటే మంచిదే కాని ఒక ప్రాంతంవారంతా ఒకేతీరు మనుషులు అనడం సంకుచితమే అవుతుంది. ..
August 24th, 2007 at 7:56 am
మల్లమల్ల….దీంట్లజొర్రి జూశినా… ఒక్కటైతె ఫరాఖత్..
కడుపుమండిన / మండుతున్న వాళ్ళు, కడుపులు మాడ్చేవాండ్లనుద్దేశుంచి రాసిందిది.
దీనికి -మావోల్లు బాధ్యులుగాదూ, ఈడ రాసింది -మా ముచ్చటగాదూ అన్పించినప్పుడు “భుజాలు తడుముకొనుడెందుకు”?
August 25th, 2007 at 3:33 am
భుజాలు తడుముకునేదేం లేదు. వివక్షని ఎవరూ సమర్థించడంలేదు. నేను రాసింది మరొకసారి చదివితే మంచిది. ఎదైనా రాసేముందు ఒళ్ళు దగ్గిరపెట్టుకుని రాయాలి. ఏదైనా, లేక ఎవరైనా.. ఇంతకీ ఈ పత్రిక ఒక్క తెలంగాణా వారికేనా.. కాకుంటే ఇది సాహిత్యమేనా…?
August 25th, 2007 at 3:56 am
ఈ పత్రిక ప్రారంభ సంచికను మీరు మరొక్కసారి చదవాలని మనవి.
ఏ ప్రాంతపు కవులైనా – తమ తమ భావాలను, అనుభవాలను వ్యక్తపరుచుకోవడానికి ఇది ఒక చక్కని వేదికగా ఎదుగుతున్నది. దీన్ని ప్రారంభించినవాళ్ళ ఉద్దేశ్యంకూడా అదే!
తెలంగాణతో పాటు, మీరు పేర్కొన్న పలనాడు, సీమ ప్రాంతాలప్రజల జీవనపరిస్తితులు, బాధలు తెలుసుకోవాలనే పాలకులు లేకున్నా, పాఠకులకైతే కరువు లేదు కదా..
కడుపులు మండుతన్నప్పుడు, నిప్కలుగక్కేందుకు వేళైనప్పుడు, ఆ ప్రాంతం…ఈ ప్రాంతం అన్నది ఎవ్వరూ చూడరు, అడుగరు.
భావవ్యక్తీకరణ (వస్తువు) ముఖ్యంగానీ, భాష, వ్యక్తులు, ప్రాంతీయత ప్రధానంగాదు.
దయచేసి గమనించగలరు.
August 29th, 2007 at 3:00 am
రాకేశ్ గారూ
మీరు రాసినదానిని నేను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాను. దయచేసి భావవ్యక్తీకరణ వస్తువు ఒకటే ఎలా అవుతాయో వివరించగలరు. అలాగే ఏదైనా రాసేటప్పుడు భాష వ్యక్తులు, ప్రాంతీయత ఎందుకు ముఖ్యంకాదో అర్థం కాలేదు. ఇది అప్రజాస్వామ్యకం కాదా.
అలాగే దయచేసి మరొక చిన్న విషయం గమనించమని మనవి. హైదరాబాద్ లో స్థిరపడిన తెలంగాణేతరులకంటే తెలంగాణేతర జిల్లాల్లో దుర్భరపరిస్థితులు అనుభవిస్తున్నవారే ఎక్కువగా ఉన్నారు. మీ కడుపులు మాడుస్తుంది వారా. మీ పరిస్థితికి కారణం వారేనా.. అలాగే తెలంగాణాలో ఉన్న ప్రతిసమస్యకీ ఆంధ్రులే కారణమా. మరి తెలంగాణేతర జిల్లాలోని దుర్భరపరిస్థితుతలకు కారణం ఎవరు. అసలైన దోపిడీ మూలాలలోకి వెళ్ళకపోతే ఇవన్నీ పసలేని వాదనలుగానే మిగిలిపోతాయి. పరస్పర ద్వేషమే మిగిలిపోతుంది.
మీరు చెప్పిన పాలకులు పాఠకులేమిటో గందరగోళంగా ఉంది. వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.
ఇక మీరు చెప్పినట్లు పత్రిక ప్రారంభ సంచిక చూశాను. అన్నిప్రాంతాల ప్రజల మనోభావాలకు వేదిక కావలనుకోవడం నిజమే కాని వారు దానికి కట్టుబడినట్లు లేదు. ప్రాంతీయ ద్వేషాన్నివెళ్ళగక్కుతున్నట్లుగా ఉంది. ఇదెక్కడి న్యాయం. వారికి ప్రాంతీయ పక్షపాతం ఉందని అనడమం లేదు. ప్రచురణకి ఎంపిక చేసేటప్పుడు అన్ని ప్రాంతాలవారి మనోభావాలను దౄష్టిలో పెట్టుకోవాలి. ప్రాంతీయ వివక్షత ప్రతిఫలిస్తే మంచిదే.. ప్రాంతీయ ద్వేషం వద్దని నా వినయపూర్వక మనవి. అలాగే మీకూ…
పక్కనే ఉన్న పాకిస్తాన్ దేశాన్ని మనం ప్రేమించాలి. మరి ఈదేశమంలో ఉన్న తెలంగాణేతరులని ద్వేషీంచడం ఎందుకో…
August 29th, 2007 at 6:30 am
మేరే భాయ్ విపుల్,
ఇదంతా మొదలైంది, ఈ కవితతోనే కదా.. దాని గురించే విశ్లేషిద్దాం.
దయచేసి -సరిగ్గా మీకు అభ్యంతరకరమని OR out-of-context అని అనిపిస్తున్న పదాలేవో, వాక్యాలేవో తెల్పండి.
మీతోపాటు నాకూ, ఇంకొందరికి తప్పనిపిస్తె, రాసినవారికి చెప్దాం…
కనీసం కవితలల్లో “తప్పు వర్ణనలను, పదాలను” (ఒకవేళఉన్నట్టు మనం గుర్తించి) సరిదిద్దగలిగినప్పుడె కదా, ప్రాంతీయవాదాల్లోనూ, ప్రజల జీవితాల్లోనూ చేయాల్సిన అసలు Corrective actions చేపట్టడానికి సిద్ధమయ్యేది!!
August 30th, 2007 at 5:11 am
ఈ కవితలో కపటజాజితనం/ ఇసపాతకగుణమం / తల్లిపాలుదాగి రొమ్ములు గుద్దుకునేటోళ్ళు/ మీకైతే తల్లితెలంగాణా మాకైతే అమ్మ ఆంధ్ర / ఊసరవెల్లులు / వగైరా పదాలు తెలంగాణేతరులను కించపరిచేవిగా లేవా..
September 18th, 2007 at 2:52 am
రాజకీయపు పొలికేకలు తప్ప, కవిత్వం నాస్తి.