భూమి దు:ఖం

ఎంత ఆపుకుందామన్నా సుందరయ్యకు దు:ఖమాగడం లేదు. కన్నీళ్ళు ఎక్కడనుండి ఎగదన్నుకొస్తున్నాయో… గొంతు దగ్గరపడి… ఉక్కిరి బిక్కిరైపోతూ, సుడిగాలిలో ఒట్టి కాగితపు ముక్క వలె… కడుపులో ఎవరో చేతులుపెట్టి ఊర్చేస్తున్నట్టు… నాభి దగ్గర్నుండి ఏడుపు పొంగి పొంగి… తమాయించుకోవడం వశం కావడంలేదు సుందరయ్యకు. యిక ఆరిపోబోయేముందు వత్తిలా రెపరెపలాడుతూ… మనిషి… దు:ఖంతో సుళ్ళు తిరిగిపోతున్నాడు.

కన్నీళ్ళనుండే ఎదురుగా గడియారం దిక్కు చూశాడు. రాత్రి… మూడు గంటల పది నిముషాలు. చూట్టూ అంతా నిశ్శబ్దం… ఎక్కడా ఏ అలికిడీ లేదు.

వెల్లకిలా నులకమంచంపై పడుకుని తలకింద రెండు చేతులనూ పెట్టుకుని గంటలకు గంటలు ఎప్పట్నుండో అలా పైకప్పులోకి చూస్తూ ఉండిపోయిన సుందరయ్యకు మనసంతా గర్రుకొట్టిన పొలంలా ఉంది. గుండెల్లోకి ఎవరో ఉలులను దిగ్గొడ్తున్నట్టు… శరీరం ఖండఖండాలుగా విడిపోతున్నట్టు… కళ్ళముందే అంతా ముక్కలు ముక్కలుగా ధ్వంసమైపోతున్నట్టు…

ఎలా జరిగిందంతా… ఒక్క రెండు నెలల్లోనే… యింత బీభత్సం… యింత వ్యాపారం… యింత దురాక్రమణ… యింత దగా… మనుషులు మనుషులను కొనడం… మనుషులు భూములను కొనడం… మనుషులు కాగితపు ముక్కలకంటే హీనంగా పీలికలు పీలికలైపోవడం… మట్టికి రెక్కలు రావడం… ఒర్రెలు, బోళ్ళు, వాగులు, గుట్టలు, అన్నీ డబ్బుగా మారిపోతుండడం… ఏమిటి… ఏమిటిదంతా.

సుందరయ్యకు అంతా… యింకా ఓ అర్థంగాని మాయవలెనే అనిపిస్తోంది. అతనికి ఈ భూమిని మింగేసే చిచ్చు ఎక్కడ పుట్టిందో అర్థం కావడం లేదు. ప్రశాంతంగా ఉండే తమ ఊళ్ళోకి అకస్మాత్తుగా ఈ పెద్ద పెద్ద కార్లు, ఖడక్‌ బట్టల మనుషులు, అన్ని చేతి వ్రేళ్ళకూ బంగారు ఉంగరాలు పెట్టుకున్న తెల్లసీమపందుల్లాంటి ఘరానా వ్యక్తులు ఎక్కడనుండి ఊడిపడ్తున్నారో అర్థం కావడం లేదు.

ఒకరోజు రెండు కార్లొచ్చాయి. సర్పంచ్‌తో, ఒక వార్డు మెంబర్‌తో రహస్యంగా మాట్టాడారు. ఆ వచ్చినవాళ్ళు సీసాలకు సీసాలు తాగారు. ఊరి బయటికి పోయి పొలాలు, తాళ్ళు, చెరువుకట్ట, మైసమ్మగుట్ట, హనుమంతుని గుండు… అంతా కలియదిరిగి సాయంత్రానికి వెళ్ళిపోయారు.

యిక మర్నాటినుండి ఏ చెట్టుకింద చూచినా గుంపులు గుంపులుగా మనుషులు. దిక్కుమాలిన వాళ్ళ చేతిలో సెల్‌ఫోన్లు… హలోహలోలు… సాయిబు హోటల్‌ నిండా రాత్రికి రాత్రులు మందు సీసాలు రావడాలు… ఎవరినోట విన్నా భూమిని అమ్ముకోవడం గురించే ముచ్చట్లు. అమ్ముకోకుంటే ముంచుకు రాబోయే ముప్పు గురించి బెదిరింపులు… భయపెట్టడాలు… భయపడడాలు… అంతా ఓ యుద్ధ వాతావరణం.

సుందరయ్య సూటిగా సర్పంచ్‌ రామలింగంను అడిగాడు… ‘ఎందుకు ఊర్లోని జనమంతా యిట్ల బిత్తర పడిపోతున్నారు. ఏం జరిగిందసలు…’ అని.

”మొన్న వాళ్ళొచ్చి చెప్పిండ్రు గదా… నువ్విన లేదా… మన ఊరంతా ఆ ఎస్సీజడ్‌ల పోతాందట… భూములను ప్రభుత్వం తీసుకుని మనను ఊరు ఖాళీ చేయమంటదట. మన భూములకు సర్కార్‌ లెక్క ప్రకారం ఏ పైసో పర్కో కట్టిచ్చి ఎక్కడన్నా పునరావాసం ఏర్పాటు చేస్తదట. గీ విషయం విన్న కానుంచి అసలు సంగతేందని రోజూ హైద్రాబాద్‌కు తిరగతనే ఉన్న.”

”ఏం తెల్సింది మరి.”

”పోవుడైతే ఖాయమిన తేలింది.ఢిల్లీనుంచి శాంక్షనైన కాగితాలను పట్టుకుని నిన్నచ్చిండ్లు చూడు. ఆ ఎర్రటి పొడుగుకార్ల… వాళ్ళ దగ్గర అన్ని కాగితాలున్నయ్‌. పన్నెండు ఊర్లు పోతాన్నై. మెత్తం నాల్గువేల ఎకరాలు కావాల్నట వాళ్ళకు. గవర్నమెంట్‌ మన ఊర్లుపేర్లు చెప్పి, ఆర్డరిచ్చి ఓసారి పోయి చూచుకొని రమ్మన్నదట. వచ్చిండ్లు వాళ్ళు, బాజాప్తా కాగితాలున్నయ్‌ వాళ్ళ దగ్గర.”

”నాకర్థంగాలే… మన వూళ్ళను వాళ్ళకెందుకిస్తరు.”

”గదే మత్‌లబున్నది… గవర్నమెంట్‌ అందరికి ఉద్యోగాలు యిప్పిచ్చి ఈ దేశాన్ని డెవలప్‌ చేయాలని పెద్ద పెద్ద సార్లతోని విచారించి ‘స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్స్‌’ అని కొన్నింటిని ఏర్పాటు చేస్తోంది. ఈ మన ఊళ్ళన్నింటిని ఒక గ్రూప్‌కిస్తంది. వాళ్ళు ఈ వేల ఎకరాల జాగను సాఫ్‌ చేసి యిక్కడ ఐటి పార్క్‌ తయారు చేస్తరు… ప్రపంచంల అమెరికా, లండన్‌ గిట్ల అన్ని దేశాలనుంచి జనం డైరెక్ట్‌గ మన ఏరియాకొస్తరు బ్యారం గురించి - కంప్యూటర్‌ల్ల మన పోరగాండ్లు బాగ హుషారు గదా. యిగ యిక్కడ ఉద్యోగాలే ఉద్యోగాలు… గట్ల…”

”అద్సరేగని… ఎవనికో ఉద్యోగం కావల్నని యిక్కడ ప్రశాంతంగున్న మనల ఎల్లగొట్టుడేంది.”

”అరే అదంతే బై… పదూర్లళ్ళ అంతా కలిపి ఓ వేయిగడప - రేపు యిక్కడ యిండస్ట్రీ పడితే వేలమందికి ఉద్యోగాలు…”

”మరి మన భూములు?”

”గదే యిప్పుడు ముందున్న సంగతి… యిప్పుడు మన ఊర్లె ఎకరానికెంత ధరుంది. మా అంటే ఎకరాకు ముప్పయివేలు… ఉన్న సగం ఊరి భూములల్ల రాళ్ళు రప్పలేనాయే… రెండు గుట్టలే ఉండే… గవర్నమెంట్‌ రేపు ఖాళీ చేయిస్తే ఎకరానికి యిరవై వేలిస్తే మహా ఎక్కువ. నిన్న కార్లర్ల వచ్చిన ఆసామితోని మాటాడిన… మా ఊరి భూమంతా గుత్తకు కొనుక్కో. మాకు మాత్రం మంచి రేటియ్యి. నువ్వు ఎట్లన్న ఎవరికన్న అమ్ముకో అన్న నేను… ఏమంటవ్‌ నువ్వు”

”మనం భూమి యియ్యకుంటే ఏం జేస్తరు” అన్నాడు సుందరయ్య అమాయకంగా.

”ఏం జేస్తరా… నీ భూమి కొనరు. అందరు అమ్ముకోని పోతే నువ్వొక్కనివుండి ఏంజేస్తవ్‌. అటెంక అగ్గువగ్గువకు ప్రభుత్వం నీ భూమిని గుంజుకుంటది. యిట్లాంటప్పుడు నల్గురితో నారాయణ.”

”అరే. గదేంది సర్పంచ్‌గారూ… తరతరాలుగా ఈ భూమిల పుట్టి ఈ భూమిల పెరిగి యీ భూమితోనే బతుకుతున్నోళ్ళం… ఈ భూమిని యిచ్చి ఎట్ల పోతం… ఏడికి పోతం… ఎన్ని రూపాయలిచ్చినా ఈ భూమి మన పెయ్యిల ఒక అంగం లెక్కుండె. ఎట్ల వాళ్ళ పాలు చేస్తం…”

”సుందరయ్యా… రోజులు గట్లచ్చినై… విచారించుకో… నేనైతే… ఆ బడాబాబులతోని మాట్లాడి ఎకరానికి నాల్గు లక్షలియ్యన్న… అటెంక వాళ్ళిష్టం… మీ అందరి యిష్టం’ సర్పంచ్‌ రామలింగం హీరోహోండా స్టార్ట్‌ చేసిండు.

సుందరయ్యకు ఏమీ తోచక పిచ్చిపిచ్చిగా చూస్తుండగానే సర్పంచ్‌ అన్నాడు. ”ఒకవేళ… రేటు వస్తే అమ్ముకోవడమే మంచిది సుందరయ్యా… ఈ చాన్స్‌ పోతే ఈ మన ఊరికి యింత లోపలికచ్చి ఎకరానికి యిరవైవేలు గూడివ్వడెవడు…చానమంది నా దగ్గరికచ్చి మంచి రేటస్తే అమ్ముదామనే అంటాండ్లు…”

”…..”

”నీకెంతుంది భూమి”

”పది ఎకరాల ఇరవై గుంటలు”

”మరింకేంది నలభై లక్షలు… ఎపుడైన చూస్తవా జన్మల అంత డబ్బు… హాయిగమ్ముకొని ఎక్కడైన కొంత భూమి కొనుక్కుని పిల్లల్ని తీసుకొనిపోక… ఏందయ్యా, తరతరాల భూమి అంటవ్‌… నో సెంటిమెంట్‌… ఆలోచించుకో…” రామలింగం వెళ్ళిపోయాడు.

ఎక్కడో కుట్ర జరుగుతోందనుకున్నాడు సుందరయ్య.

ఎవడో ఢిల్లీనుండి యిక్కడి పదిరవై ఊళ్ళను కబ్జా చేయడమేమిటి. యిక్కడ ఏదో కార్ఖాన పెట్టడమేమిటి… వాడెవడో ఎవనికో ఉద్యోగాలిస్తాడంటే తాము ఊళ్ళమ్ముకొని తమ బతుకులను మట్టి పాల్జేసి వెళ్ళిపోవడమేమిటి…

అప్పటినుండి సుందరయ్య తనువంతా కళ్ళు, చెవులు చేసుకుని ఊర్లోని ప్రతి ఒక్కరినీ పరీక్షగా గమనించడం మొదలెట్టాడు.

ప్రతి సాయంత్రం… ఎక్కడనుండొస్తున్నాయో… ఊరు ఊరంతా, ఆడా, మగా అందరూ సీసాలకు సీసాలు తాగుతున్నారు. బిర్యానీ పొట్లాలొస్తున్నాయి ఎక్కడినుండో, మనుషులు గుంపులు గుంపులుగా కాకుండా ఎవనికివాడే రహస్యంగా ప్రవర్తిస్తున్నాడు. ప్రతివాడూ తన కడుపులో ఏముందో బయటికి చెప్పకుండా ఎదుటివాని విషయాన్ని పసిగట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఊరు ఊర్నంతా ఓ మాయ, ఓ నిషా, ఓ కనికట్టు కమ్మేసింది.

ఎవనినోట విన్నా ఎకరాలు… లక్షలు… చాకలి, మంగలి, మాల, మాదిగ, ఏ కులపోడైనా… తమ భూమిని ఉజ్జాయింపుగా లక్షల్లోకి లెక్కకట్టుకుని… ఆ లక్షలతో ఏంజేయాలని… ఆ కట్టలతో ఎలా ఎక్కడ స్థిరపడాలని… ఎన్నడూ లక్షల ముఖం చూడని మనుషులు కలల కౌగిళ్ళలో ఉక్కిరిబిక్కిరైపోతూ…

……….

మొట్టమొదట క్షురకుడు రాములు తన రెండెకరాల భూమిని అమ్మి ఇబ్రహీంపట్నం పోయి రిజిస్ట్రేషన్‌ చేసి ఆరు లక్షల రూపాయలను తెచ్చాడు ఒక చేతిసంచి నిండా. సాయిబు హోటల్‌లో అందరికీ చూపించాడు కట్టలను. అన్నీ వందల రూపాయల కట్టలు. చూచినవాళ్ళందరి దిమ్మతిరిగిపోయింది.

రాములను ఎవరో కార్లో తీసుకొచ్చి సాయిబు హోటల్‌ ముందర దించి వెళ్ళిపోయారు. అతను అప్పటికే పీకలదాకా తాగి వత్తి అంటించిన చిచ్చుబుడ్డిలా ఉన్నాడు. అప్పటికే అక్కడ ఎప్పట్నుండో ఎదురుచూస్తున్న రాములు పెళ్ళాం సాయమ్మ మొగుణ్ణీ, డబ్బునూ ఒడిసి పట్టుకుని… ” ఈనోట్లు పాడుగాను… కొరుక్కతింటమా వీటిని… యిరవై ఏండ్లనుంచి రెక్కలు ముక్కల చేసుకున్న భూమి తల్లిపాయె… ఈ చేతుల్తోటి నాటిన, కలుపు తీసిన, నాల్గుమెతుకులు తిన్న … పాసిపాయె…” ఒకటే ఏడ్పు… ఆమె విలవిలా ఏడుస్తూనే తాగి ఊగుతున్న మొగుణ్ణీ, డబ్బు సంచినీ నడిపించుకుంటూ… చీకట్లో… కనబడకుండాపోయింది కాసేపటికి.

తర్వాత నిశ్శబ్దం…

ఎదురుగా… అంతా చీకటి…

సుందరయ్య సాయిబు హోటల్లో… గుడ్డిదీపపు వెలుగుముందు మౌనంగా కూర్చుని ఆలోచిస్తున్నాడు.

రెండెకరాలు… ఆరులక్షలు.

నిజానికి ఎక్కువరేటే…

యింతరేటు పెట్టికొన్నోడు… వ్యవసాయమంటేనే తెలువనోడు… ఈ భూమిని కొని ఏంజేస్తడు.
తప్పకుండా అంతకన్నా ఎక్కువకు ఎవనికో అమ్ముతడు. లేదా అంతకంటే ఎక్కువ డబ్బును ఈ భూమిలోనుండి ఏదో రకంగా పుట్టిస్తడు… ఐతే,

భూమికి మనిషికీ… ఇట్టి మట్టికీ, డబ్బుకూ ఉన్న సంబంధమే ఉందా. ఏండ్లకు ఏండ్లు ఈ భూమిని దున్ని, ఈ మట్టిని పిసికి, ఈ నేలపై నడిచి ఈ గాలిని పీల్చి, ఈ పచ్చని చెట్లనీడన విశ్రమించి- ఒక తల్లితో పిల్లలకు ఏర్పడే అనుబంధంవంటి సంబంధం సంగతేమిటి. కాలికి ముల్లు గుచ్చుకుంటే కంటికి నీరొస్తదిగదా… మట్టిని నమ్ముకున్న మనిషికి గుండెపగిలి… భూమినుంచి మనిషి విడివడి వేరయ్యేదెట్లా.

ఈ అనుబంధం విలువ ఎంత.

అనుబంధం ఉన్నంత మాత్రాన డబ్బుతో కొలువబడే విలువలు మార్తాయా. మట్టిముంతలో ఉండే నీళ్ళు, కల్లు, బంగారం వంటి పదార్ధం విలువలు మార్తాయిగానీ మట్టిముంత విలువ అంతే ఉంటుంది కదా.

ఆనాటి రాత్రే సుందరయ్య ఇంటికి తిరిగొచ్చి… అన్నం తింటూండగా పెద్దకొడుకు రాజకొంరు అన్నాడు - ”మన భూములను కూడ అమ్ముదామానె” అని.

ఊరు ఊరికంతా భూమిని అమ్ముకోవడం పిచ్చి కమ్మేసింది. ఒకప్పుడు ప్రతి ఒక్కరూ భూమిని నమ్ముకున్నవాళ్ళు. వ్యవసాయం పనుల మెళకువలు ఒకర్నుంచి మరొకరు తెలుసుకుని పోటీపడి పంటలు పండించి నిండుకుండల్లా పండువెన్నెలై బతికినవాళ్ళు…

ఏమిటీ మైకం… ఏమిటీ డబ్బు నిషా… మనిషికి అవసరాలను మించిన యింత డబ్బు అవసరమా. ఎప్పుడూ ఓ ఐదు పదివేల రూపాయలకంటే ఎక్కువ డబ్బు ముఖం చూడని ఈ జనం లక్షలకు లక్షలు కట్టలు కంటబడగానే కల్లుతాగిన కోతులై పిచ్చి పిచ్చిగా చేస్తున్నరు.

”…ఏమంటవే నాయిన… షేక్‌ సాయిబు నిన్న హైదరాబాద్‌ పోయి కనుక్కున్నడట… వాడెవడో ఓ రెండొందల ఎకరాలు కొని యిగ ఊకుంటండట… అటెంక మిగతా భూమి పడావ్‌ పడ్తది. ఆలస్యమైతే మనం గవర్నమెంటు చేతిల్నే పెట్టాలె. వాడేమిస్తడు… మన్ను… దీపముండగనే యిల్లు సక్కబెట్టుకోమన్నరు పెద్దలు…”

సుందరయ్య అన్నం ముద్ద నోట్టో పెట్టుకునేటోడు చటుక్కున ఆగి ముప్పయేండ్ల కొడుకు ముఖంలోకి చూచిండు, రాజకొంరు ముఖం భూమిని అమ్ముకుంటే రాబోయే లక్షల కొద్దీ డబ్బు ఊహతో కైపెక్కి తోమిన రాతిగిన్నెలా ఎర్రగా, ఉద్విగ్నంగా ఉంది.

సుందరయ్య ఏమీ మాట్లాలేదు. ఒక సూటి చూపొకటి చూచి…

మళ్ళీ తలవంచుకుని అన్నం తినడం మొదలెట్టాడు.

ప్రక్కనే భార్యభూదేవి కుప్పబోసిన దు:ఖంలా కూర్చొని అన్నంగిన్నెల దిక్కూ, నేల దిక్కూ చూస్తోంది. హాల్లోనే గడంచె మీద రాజకొంరు యిద్దరు పిల్లలు,… రాణి, రవి నిద్రపోతున్నారు. కోడలు ప్రక్క అరుగుమీద ఏదో చెరుగుతోంది చేటతో.

సుందరయ్యకు హైద్రాబాద్‌లో హాస్టల్‌లో ఉండి డిగ్రీ చదువుకుంటున్న రెండో కొడుకు శీను జ్ఞాపకమొచ్చాడు. యిద్దరే పిల్లలు తనకు… కొడుకులు… పెద్దోడు ఊళ్ళోనే పది ఫెయిలై యిక తన వ్యవసాయ పనుల్లో వెంటున్నడు. రాజకొంరు తర్వాత పన్నెండేళ్ళకు పుట్టిన శీనుకైనా నాల్లు అక్షరాలు చెప్పించాలని పట్నం పంపి… హాస్టల్లుంటడు. బాగానే చదువుతాన్నంటడు. సెలవుల్ల వచ్చినపుడు వ్యవసాయం పనులు చేస్తడు. హుషారే భూమి పనులల్ల.

రొండేండ్ల కిందనే భూమినంత మీ యిద్దరి పేర చేసిన గదరా రాజకొంరు. నీది ఎనిమిదెకరాలు… తమ్మునికి నాల్గు. భూమిని ఉంచుకునుడా. అమ్ముకునుడా మీ యిష్టం. తమ్ముణ్ణి కూడా అడుగు…”

”రేపు పట్నం పొయ్యి రానా”

”నీ యిష్టమన్న గదా”

”నువ్వు మనస్పూర్తిగా చెప్తలేవే నాయినా…”

” ఏం జెప్పేది బిడ్డ… నడమంత్రపు డబ్బు కట్టలకట్టలు గుట్టలోల్గె వచ్చి నెత్తిలపడి మనుషులను పాపబట్టె… ఉన్న తావిడిచి ఏడికి పోతం బిడ్డా… అంతా మాయ. మనుషులను మాయ కమ్మేసింది. ఎవనిమాట ఎవడింటడు… కానీ…”

సుందరయ్య కంచంల చేతుల కడుక్కుని లేచి బయటకి… వాకిల్లోకి వెళ్ళిపోయాడు. బయట వెన్నెల పిండారబోసినట్టు తెల్లగా పరుచుకుని ఉంది ఊరినిండా.

ఊరంతా నిశ్శబ్దం.

ఎక్కడో ఊరకుక్క మొరుగుతోంది.

అందరి యిండ్లలో యింతే. తర్జన భర్జన. లోలోపల పిసుకులాట. కుమ్ములపెట్టిన కందగడ్డోల్గె… కుతకుతఉడికిపోవుడు. పైకి మాత్రం అంతా నిశ్శబ్దమే. నివురుగప్పిన నిప్పు.

…………….

నెలరోజుల గడిచిందో లేదో.

ఊరు ఊరంతా దాదాపు అందరూ భూమిని అమ్మేశారు. వాడెవడో కార్లలో ఊరికి రావడం మానేశాడు. వీళ్ళే ఏ సర్పంచ్‌నో, వార్డు మెంబర్‌నో పట్టుకుని పోవుడు… రిజిస్టర్‌ చేసుడు… డబ్బు తెచ్చుకొనుడు…
రాత్రింబవళ్లు తాగుడు… ఊళ్ళో కొత్తగా రెండు వైన్‌షాపులు పడ్డయి.

ఊరు సగం కన్నా ఎక్కువే ఖాళీ ఐంది.

గూన పెంకల యిండ్ల ముందట కొన్ని కొత్త కార్లు కనిపిస్తానై. పైసున్నపుడే సుఖం. ఎంజాయ్‌ చెయ్యి అంటున్నరు. చదువురానోళ్ళు కూడ సెల్‌ఫోన్ల మాట్టాడ్తున్నరు…

సుందరయ్యకు అంతా వెనుకట విఠలాచార్య సినిమాల చూచినట్టు వింతగా నమ్మశక్యం కాకుండా , నిజమే మాయవలె… గమ్మత్తుగా ఉంది.

రాజకొంరు సర్పంచుతోని భలే దోస్తి చేస్తాండీ మధ్య… వాళ్ళిద్దరి చిన్నప్పుడు ఒకటే బడి.

ఐతే ఊరు ఊరంతా నిద్రపోతున్న కూకేటిపాము వలె ఉంది. అందరి కళ్ళలో భయం. లక్షలకు లక్షల రూపాయలను ఎక్కడ దాయాల్నో తోచని భయం. ఏమైతదోనన్న ఉద్విగ్నత. నిన్నటిదాకా రాళ్ళు రప్పలనుకున్న భూమి లక్షలను కురిపించడం… యిదంతా ఏంది?

సుందరయ్యకు… గత దినం రాత్రి తనకూ, రాజకొంరుకూ నడుమ జరిగిన సంభాషణ జ్ఞాపకమొచ్చింది. అప్పుడు భూదేవి కూడా ఉంది ప్రక్కన. మౌనంగానే విన్నది అంతా… నిజంగానే భూదేవిలా.

”నాయినా… జాగ్రత్తగ ఇను. రామలింగం చెప్పిండు. యిగ మనూళ్ళె భూమి అంతా ఐపోయింది. ఒక్క మన పన్నెండెకరాలు, రామలింగం ముప్పయిరెండు, గా మన్నెపోళ్ళయి ఎనిమిదెకరాలు… గిదే మిగిలింది. రామలింగం మొన్న హైరదాబాద్‌ పోయి కపూర్‌ సాబ్‌తోని మాట్లాడిండట. లాస్ట్‌ కాబట్టి మన ఎకరాకు ఐదు లక్షలిస్తునన్నడట. మనకు జుమ్‌లా అరవై చిల్లరస్తది. యిగ అమ్ముదమే. లేకుంటే ఒంటరోళ్ళమైపోతం. మంచి రేటే ఇది. అందరికంటె ఎక్కువ. బయటకి చెప్పొద్దు. లొల్లయితది. రేపే పొద్గాల చీకట్ల రామలింగం, నేను పట్నం బయల్దేర్తానం. తమ్ముణ్ణి అట్లనే వెంటబెట్టుకోని ఇబ్రహీంపట్నంల రిజిష్టర్‌ చేసి రాత్రివరకు డబ్బుతోని పైలంగ యింటికస్త. రాజకొంరు చెబుతూనే ఉన్నడు.

ప్రక్కన కోడలు గోడకు చేరగిలబడి వింటూనే…

”ఆర్వయ్‌ లచ్చలా…” అంది మధ్యలో షాక్‌తిన్నట్టు… ఉండబట్టలేక…

”ఒర్రకే పిచ్చిదాన…” గదమాయించిండు రాజకొంరు.

ఆమె లేచి నిశ్శబ్దంగా బయటికి వెళ్ళిపోయింది. సుందరయ్యకు ఒళ్ళంతా తిమ్మిరెక్కినట్టు ఉంది. ఎవరో సుత్తెతో బలంగా బాదినట్టు. అంతా దిమ్మెక్కి పోయినట్టు.

రాజకొంరు ముఖంలోకి ఓ అర్ధం లేని పిచ్చిచూపొకటి చూచి… సుందరయ్య కూడా యింట్లోనుండి బయటికి నడిచాడు భారంగా.

అప్పుడు కూడ యిలాగే… ఆకాశం నుండి బగారప్పొడి రాలుతున్నట్టు పిండి వెన్నెల. వెన్నెట్లో, వాకిట్లో నులకమంచంపై వెల్లగిలా పడుకుని…

ఆకాశంలోకి చూస్తుంటే.

అన్నీ మబ్బులే…వెండి మబ్బులు…

పిచ్చి మబ్బులు… పిచ్చి చంద్రుడు… పిచ్చి ఆకాశం… పిచ్చి భూమి-

…………………

”భూదేవి ఏంజేస్తానవే. నిద్రస్తలేదు’ అన్నాడు సుందరయ్య భార్యనుద్దేశించి.

ప్రక్కనున్న నులకమంచంలో భూదేవి యిటు వైపు తిరిగి… ”నాక్కూడ నిద్రపడ్తలేదు. యివ్వాల్టి తోటి దిక్కులేని పచ్చులమైపోయినమనిపిస్తోంది.”

”డబ్బుందిగదనే…బస్తానిండా నోట్లే… నీకొడుకు తెచ్చిండు గదా…”

”ఏం జేస్కుంటవ్‌… బంగారాన్ని తింటవా… తింటాన్కి నాల్గు మెతుకులు కావాలె గా”

”…..” సుందరయ్య మాట్లాడలేదు. అతనికి రాత్రి జరిగిన సంగతులన్నీ జ్ఞాపకమొచ్చినై. ఆరోజు రాత్రి… పదిగంటలు దాటిందేమో… అనూహ్యంగా తన యింటి ముందు వాకిట్లో కొత్తకారు సర్రున వచ్చి ఆగింది.

ఎవరబ్బా అని ఆశ్చర్యంతో తనూ, భూదేవీ, కోడలు, యిద్దరు పిల్లలు… అందరూ బిలబిలమని అరుగుపైకి ఉరుకొచ్చి చూస్తే…

కార్లోనుండి రాజకొంరు దిగుతున్నడు. దిగి డ్రైవర్‌కు రెండు వందరూపాయల నోట్లివ్వగానే, కార్‌ను అటుయిటు సర్ది సరిగ్గా చెట్టుక్రింద నిలబెట్టి నమస్తే పెట్టి వెళ్ళిపోయిండు. వాడు పోయిన తర్వాత చిన్నకొడ్కు శీను దిగిండు చేతిలో నల్లటి పెద్ద బ్యాగ్‌తో. టకటకా యింట్లోకి నడుచుకుంటూ అందరే వచ్చి… శీను బ్యాగ్‌ గడంచెపైన పెట్టి… అరుగుల దిక్కున్న పెద్దదర్వాజ మూసి…

”నాయినా…రావే…ఒక్కసారి ఈ బ్యాగ్‌లకు చూడు…” అన్నాడు వెలిగిపోతున్న ముఖంతో.

అని బ్యాగ్‌ను తెచ్చి తనకూ, తల్లి భూదేవికీ చూపించాడు. అన్నీ కట్టలకట్టలు డబ్బు. నిండా కుక్కి కుక్కి సంచినిండా సర్ది తెచ్చిండ్రు.

”దీన్ని అందాక గీ గుమ్మిల పెడ్త. రేపు చూద్దాం… వీటి సంగతి…”

ఈలోగా రాజకొంరు మరో ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో తెచ్చిన చికెన్‌ బిర్యానీ పొట్లాలను, మిఠాయి పొట్లాలను విప్పి గడంచపైన సర్దిండు. యిల్లంతా బిర్యానీ వాసన, స్వీట్ల ఘుమ ఘుమ వ్యాపించింది. పిల్లలు ఎగబడి తినడం ప్రారంభించి…

సంబరం దాదాపు రెండు గంటలు…

రాజకొంరు చెప్పుకొచ్చాడు. హైద్రాబాద్‌ల ఎలా యికమత్‌గ భూమిని ఐదు లక్షలకు ఎకరం చొప్పున అమ్మిందీ, ఎలా మారుతి కార్‌ కొన్నదీ… ఎలా క్యాష్‌ను జాగ్రత్తగా పట్టుకొచ్చిందీ. శీనూ వంత పాడాడు అన్నతో… యిద్దరి ముఖాల్లోనూ డబ్బు తాలూకు అంతులేని ఆనందం.

పన్నెండు దాటేదాకా ముచ్చట్లు పెట్టీ పెట్టీ… పిల్లలు కొత్తకార్లో ఆడీ ఆడీ…

రాజకొంరు శీను కోసం ఒక ప్రత్యేకమైన స్వీట్‌ను తినిపిస్తూండడం ఎందుకో సుందరయ్య యాధృచ్చికంగా గమనిస్తూ… గమనిస్తూ…

చివరకు పన్నెండు దాటిన తర్వాత…

చిన్నాయన శీనుతో కలిసి పిల్లలిద్దరూ కొత్త కార్లోనే నిదురపోయారు. రాజకొంరు, కోడలు గుమ్మిపక్కనున్న వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు.

యిక నిశ్శబ్దం మిగిలి… ఎనగర్రకింద హాల్‌లో … సుందరయ్యా భూదేవి…

ఎవరి నులక మంచాల్లో వాళ్ళు ఎడతెగని ఆలోచనలు. తామిద్దరూ కొత్తగా పెళ్ళి చేసుకుని ఈ ఊరికి కాపురమొచ్చి… బంగారం అమ్మి కొద్దిగా చెల్క సంపాదించుకుని… యిద్దరికిద్దరూ రెండు జతల కాళ్ళు, రెండు జతల చేతులుగా వ్యవసాయం చేసి చేసి…

ఎన్ని ఎండలు… ఎన్ని వానలు… ఎన్ని వరదలు… ఎన్ని కరువులూ… వానలకోసం ఎన్ని ఎదురుచూపులూ…

భూమిని పొతం చేసుకుని… చెల్లను పొలం చేసి, రాళ్ళను చేన్లు చేసి…

భూమి పండి… పంటలై, భూదేవి కడుపు పండి పిల్లలై,

బతుకంతా కాయకష్టం… రాత్రింబవళ్ళు కనురెప్పలా కాపలా, రెక్కలు దించని ప్రయాణం…

ఎప్పుడూ భూమి… మట్టి… మొక్క… చెట్లు… పచ్చని ప్రకృతి… చల్లని గాలి… అదో లోకం.

ఎందుకో సుందరయ్యకు మళ్లీ దు:ఖం ముంచుకొచ్చింది.

”యిక రేపట్నుండి… తన పొలం తనది కాదా… తన బావి, తన పంపు తన నీళ్ళ ట్యాంక్‌…

తను తీసిన పంటకాల్వలు… యివన్నీ తనవి కావా…’

రాత్రి చూచిన డబ్బుసంచి మెరిసింది కళ్ళలో. కళ్ళనిండా నీళ్ళు… ఎగిసెగిసి వస్తున్న ఏడుపు, నిద్రపోని కళ్ళు ఎర్రగా… మండుతున్నాయి.

గోడ గడియారం చూశాడు సుందరయ్య, ఐదు కావస్తోంది.

యిక వశం కావడంలేదు. మంచంలోనుండి లేచి కిటికీలోనుండి బయటికి చూశాడు.

తెలతెలవారుతోంది.

చెట్టుకింద కొత్తకారు.

బట్టలేసుకుని, చేతిలోకి కర్ర తీసుకుని సుందరయ్య చెప్పులు వేసుకుంటూండగా,

‘ఏడ్కి పోతానౌ గింత పొద్దున’ భూదేవి మాట విన్పించింది.

భార్య దిక్కు అతి దీనంగా చూచి ‘యిక ఆఖరిసారి తనివి తీరా పొలాన్ని చూస్కొని వస్తనే. మనసంతా కాల్తున్న కాష్టం లెక్కున్నది. భూదేవి వస్త’ అని ఒక్కడే వీధిలోనుండి… మట్టి బాటపైనుండి పొలం దిక్కు…

పదినిమిషాల్లో పొలం గట్టుపైకి చేరి…

మోటార్‌ స్విచ్‌ను ఆన్‌చేసి, మొన్ననే పూడిక తీయించిన బావిలోనుండి నీళ్ల బయ్‌మని సంప్ ల పోస్తుండగా… రెండు చేతులనూ నీటిజాలులో చొప్పించి… చిన్నపిల్లాడిలా పులకించి… చుట్టూ పచ్చని పొలాన్ని కలియజూసి, పొలాలు… పొలాలకవతల తాటిచెట్లు… పైన కట్ట, ఆపైన గుండ్లు… గుట్టలు…
ఆపైన తెలుపెక్కుతూ తెలవారుతున్న ఆకాశం…

తన భూమి… తన పొలం… తన చెట్లు… తన గట్లు… తన ఆకాశం…

సుందరయ్య దబాల్న పడిపోయాడు సంప్‌లో. పైన నీటి జాలు ఉధృతంగా దూకుతూనే ఉంది.

చుట్టూ… తిరుగుతున్న పంప్‌ చప్పుడు, నీటి చప్పుడు, తలలూపుతున్న వరిపైరు చప్పుడు… చల్లని గాలి చప్పుడు.

పావుగంట తర్వాత ఎవరో పరుగెత్తుకుంటూ వచ్చారు రాజకొంరు దగ్గరికి… పొలం దగ్గర సంప్‌ల మీ నాయిన సచ్చిపడున్నడు’ అనే వార్తతో,

వార్త విన్న రాజకొంరు షాక్‌ తిని భోరున ఏడ్వలేదు. ఆ వచ్చిన వాడు వెళ్ళిపోగానే… కొత్త మారుతి కార్‌ దగ్గరికి హడావుడిగా వెళ్ళి డ్రైవింగ్‌ సీట్‌లో పడుకున్నట్టు ఉన్న తమ్ముడు శీను ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. ప్లాన్‌ చేసిన ప్రకారమే విషం కలిపి తను యిచ్చిన స్వీట్‌ను కడుపునిండా తిన్న తమ్ముడు. శాశ్వతంగా వెళ్ళిపోయాడు. కారు వెనుక సీట్లో తన పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు యింకా.

తృప్తిగా… సంతోషంగా నోట్ల కట్టలు దట్టంగా అలాగే ఉన్నాయి.

తండ్రిపోయాడు. తమ్ముడూ పోయాడు…

ఎదురుగా నులకమంచంలో తల్లి భూదేవి వెల్లగిలా పడుకుని కనిపించింది రాజకొంరుకు. ఆమె కళ్లు నిశ్చలంగా ఉన్నాయి.

ఆమె బతికే ఉందో, చచ్చేపోయిందో అతనికి అర్థం కాలేదు-

కథలు

3 అభిప్రాయాలు

  1. B.AJAY PRASAD ఆగస్టు 2007 1

    ఈ కథని ఇంతకుముందు వార్త ఆదివారం పత్రికలో చదివాను. చాలా మంచి కథ. ఇవాళ రావలసిన కథ. రచయితకు అభినందనలు.

  2. రాకేశ్ తెలంగాణ్ ఆగస్టు 2007 2

    ఎంతబాగా రాశారు, చంద్రమౌళి గారూ…..

    ===================================
    భూమికి మనిషికీ… ఇట్టి మట్టికీ, డబ్బుకూ ఉన్న సంబంధమే ఉందా. ఏండ్లకు ఏండ్లు ఈ భూమిని దున్ని, ఈ మట్టిని పిసికి, ఈ నేలపై నడిచి ఈ గాలిని పీల్చి, ఈ పచ్చని చెట్లనీడన విశ్రమించి- ఒక తల్లితో పిల్లలకు ఏర్పడే అనుబంధంవంటి సంబంధం సంగతేమిటి. కాలికి ముల్లు గుచ్చుకుంటే కంటికి నీరొస్తదిగదా… మట్టిని నమ్ముకున్న మనిషికి గుండెపగిలి… భూమినుంచి మనిషి విడివడి వేరయ్యేదెట్లా.

    ఈ అనుబంధం విలువ ఎంత.

    అనుబంధం ఉన్నంత మాత్రాన డబ్బుతో కొలువబడే విలువలు మార్తాయా. మట్టిముంతలో ఉండే నీళ్ళు, కల్లు, బంగారం వంటి పదార్ధం విలువలు మార్తాయిగానీ మట్టిముంత విలువ అంతే ఉంటుంది కదా.
    ==============================
    ఎంతటి అద్భుతమైన పదాలు….. హాట్సాఫ్ టు యూ…….

    15 ఏళ్ళ క్రితం, నా freind కూడా, ఢిల్లీ నగర విస్తరణలో ఊళ్ళకు ఊళ్ళు ఎలా తుడిచిపెట్టుకు పోయాయో చెప్పి విలపించిన దృశ్యం మళ్ళీ మీ కథ చదువుతుంటే ఫ్లాష్-బాక్ లాగా సాక్షాత్కరించింది.
    ఇంకా…. ఇంకా.. ఇలాంటి ఎన్నో ఆణిముత్యాలను మీ కలంనుంచి ఆశిస్తూ….

    జై తెలంగాణ!!

  3. radhika ఆగస్టు 2007 3

    చాలా మంచి కథ. చాలా బాగా రాశారు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో