కథ 2006 - ఒక సమీక్ష

Katha - 2006 Cover page
Katha - 2006 Cover page
కథాసాహితి వారు ప్రచురిస్తున్న వార్షిక కథా సంకలనాల్లో ఇటీవలి రెండు మూడు సంకలనాల గురించి, “అబ్బ, ప్రతీ కథలోనూ సమస్యలూ, కష్టాలూ, ఆకలిచావులూ అంటే భరించడం కష్టమండీ,” అన్న ఫిర్యాదు విన్నాను. కథ 2006 సంకలనంలో చోటు చేసుకున్న కథలు ఆ ఫిర్యాదుకి మంచి సమాధానమివ్వగలవు.

2006 సంవత్సరంలో వివిధ పత్రికల్లో ప్రచురితమైన 13 మంచి కథలతో కథాసాహితి వారు 17వ వార్షిక కథా సంకలనం “కథ 2006″ ని వెలువరించారు. వర్ధమాన తెలుగు చిత్రకారుడు గిరిధర్ గౌడ్ రచించిన అందమైన నీటివర్ణ చిత్రంతో ఆకర్షణీయమైన ముఖపత్రం రూపొందించారు. ఈ వార్షిక సంకలనాలు మొదలైనప్పటి నించీ ఈ ప్రయత్నానికి బాసటగా నిలిచి 2006 లో తనువు చాలించిన ప్రసిద్ధ రచయిత, విమర్శకుడు, శ్రీ వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారి స్మృతికి ఈ సంకలనాన్ని అంకితమివ్వడం సముచితంగా ఉంది.

సమకాలీన జీవితాన్ని వివిధ కోణాల్లోంచి ఆవిష్కరించేదే గదా మంచి సాహిత్యం! ఈ కథల్లో కథా వస్తువు జీవితమంత వైశాల్యాన్ని ప్రదర్శిస్తోంది. అలాగని ఇవి అలవోకగా చదివి పారేసే కథలు కావు - వీటిలో కొన్నైనా మీ బుర్రలో దూరి ఆలోచనలు రేపెడతాయి, ఒక్కోచోట నరాల్ని పొంగిస్తాయి, ఇంకోచోట గుండెని సన్నగా నులిపెడతాయి - వెరసి మీ మనసుకి హత్తుకుంటాయి.

మరొక కథన ప్రక్రియ లేదన్నట్టుగా తెలుగు కథని శాసించింది వాస్తవిక కథనం. ఈ బంధాన్ని కొద్దిగానైనా సడలించుకుని సర్రియలిజం, మేజికల్ రియలిజం, నాటకీయ కథనం, పౌరాణిక, బౌద్ధ జాతక కథనాల వంటి విభిన్న ప్రక్రియల్లో రాసిన కథలు ఈ సంకలనంలో చోటు చేసుకోవడం ఆహ్వానించదగిన పరిణామం. కథనంలో కొత్తదారులు వెదికేందుకు వర్తమాన రచయితలకి ఇది ప్రోత్సాహకమవుతుందని ఆశిద్దాం. రచయితలుగా పాఠకులకి చిరపరిచితమైన పేర్లతో పాటు ఇంతకు ముందు ఎక్కువగా కనపడని రచయితలు ఈ సంకలనాల్లో పరిచయమవుతున్నారు. వీరు మళ్ళీ మళ్ళీ కనబడాలని ఆశిద్దాం.

రామాయణంలో అయోనిజ సీత, అమలినత్వానికి రూపంగా బ్రహ్మ సృష్టించిన అహల్య ఒకరికొకరు తారసపడి స్నేహితులైతే వారి సంబంధం ఎలా ఉండి ఉంటుందనే ఊహతో ఓల్గా రాసిన కథ “మృణ్మయనాదం.” పురుషాధిక్య సమాజపు అమానుషత్వాన్ని అహల్య దుర్భరమైన శాపంగా భరిస్తే, అవమానకరమైన శీల పరీక్షలుగా సీత ఎదుర్కొంది. వారి అనుభవాల్లో, పరిణతి చెందిన వారి ఆలోచనల్లో ఆధునిక స్త్రీపురుషులు చాలా నేర్చుకోవచ్చు.

పంటలు పండక అప్పుల భారంలో మునిగిన రైతు, ప్రవేశ పరిక్షల పరుగుపందెంలో దెబ్బ తిన్న విద్యార్ధి, వ్యాపారంలో నష్టపోయిన షావుకారు, గృహహింస దుర్భరమైన గృహిణి .. ఒక కథ కాదు, ఒక గొంతు కాదు, ఒక ఆక్రోశం కాదు - మన ప్రస్తుత సమాజాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మతలన్నిటినీ శస్త్రం చేసి బయటికి లాగి కడిగి ఎండేస్తుంది పి. సత్యవతి గారి “ఆత్మలు వాలిన చెట్టు.”

“మా నాన్న, నేను, మా అబ్బాయి” కథలో పెద్ద సమస్యలూ, అంతర్యుద్ధాలూ, తిరుగుబాట్లూ ఏమీ లేవు, కానీ నేటి కాలపు మధ్య తరగతి జీవితంలో మూడు తరాల మధ్య సంబంధాన్నీ, భేదాన్నీ సాలోచనగా మన ముందుంచారు సీనియర్ పాత్రికేయులు కల్లూరి భాస్కరం. వస్తువులోనూ, కథనంలోనూ ఒక అపురూపమైన సెన్సిటివిటీతో ఈ కథ విలక్షణమైనది.

“మాయి ముంత” లో మూగ జీవం పడే ప్రసవ వేదనలోనూ తన మాతృత్వపు ప్రతిబింబాన్నే చూసిన ఒక తల్లి కథని చూస్తాం. తెలంగాణా పల్లె జీవితాల్ని తన కథల్లో సమర్ధవంతంగా ఆవిష్కరిస్తున్న రచయిత పెద్దింటి ఆశోక్ కుమార్ చిక్కటి ఆర్ద్రతతో కమ్మటి మాండలికంలో ఈ కథని మలిచారు.

స్థలం ప్రకృతి అందాలకి నిర్వచనమైన అరకులోయ. సమయం కలని నిజంగా భ్రమింప జేయగల వెన్నెల రాత్రి. తోటి ప్రయాణికులు పక్షిలా గాలిలో ఎగరాలని ఆరాటపడే మనిషి, మనిషిలా నేలమీద నడవాలని ఆతృతపడే పక్షి. ఈ సందిగ్ధ పరిస్థితిలో ఏది కల, ఏది నిజం అనే ప్రశ్న కూడా అసంబద్ధమేనేమో! భగవంతం రచన “అతడు .. నేను .. లోయ చివరి రహస్యం” సర్రియలిస్టు ధోరణిలో కలకీ వాస్తవానికీ మధ్య సరిహద్దును చెరిపేస్తూ అంతశ్చేతనలోని అస్పష్టతకి అద్దం పడుతోంది.

అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల్లో అపర కుబేరుడైన వ్యాపారవేత్తకి మానవత్వంలో ఓనమాలు దిద్దించిన ఒక పేదపిల్ల నిస్వార్ధ ప్రవృత్తిని సున్నితంగా చిత్రించింది దగ్గుమాటి పద్మాకర్ రచన “యూ టర్న్.”

జాతక కథ (బి. అజయ్ ప్రసాద్), ఊడల్లేని మర్రి (స.వెం.రమేశ్), గేటెడ్ కమ్యూనిటీ (అక్కిరాజు భట్టిప్రోలు), అతను అతనిలాంటి మరొకడు (డా. వి. చంద్రశేఖర రావు), వేట (వి.ఆర్. రాసాని), జీవఛ్ఛవాలు (పి. చిన్నయ్య), యవనిక (గొరుసు జగదీశ్వర్రెడ్డి) ఈ సంకలనంలోని ఇతర కథలు.

ఈ కథల్లో అధికశాతం ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో మొదట ప్రచురితమైనాయి. కొన్ని వార్త ఆదివారం అనుబంధంలోనూ, రెండు అరుణతారలో ఒకటి నవ్య పత్రికలో ముద్రితమైనాయి. గత సంకలనాలతో పోల్చుకుంటే తెలుగులో మంచి కథలకి వేదికలు కరువైపోతున్నాయా అనే భయపెట్టే ఆలోచన రాక మానదు. మంచి తెలుగు కథలు చదవాలని కోరుకునే పాఠకులందరూ దీన్ని గురించి ఆలోచించాలి.

క్రమం తప్పకుండా, ప్రచురణ విలువల్లో రాజీ పడకుండా ఏడాదికొక ఉత్తమ కథల సంకలనం తీసుకురావడం తేలికైన పని కాదు. సంపాదకులు వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ అభినందనీయులు. కొన్నేళ్ళుగా తానా ప్రచురణల కమిటీ ద్వారా ఈ సంకలనాల ప్రచురణకి ఆర్ధిక సహాయం అందిస్తూ తానా ఒక మంచి పని చేస్తోంది. ఈ విషయంలో తానా అధ్యక్షులు డా. బండ్ల హనుమయ్య, ప్రచూరణల కమిటీ అధ్యక్షులు డా. జంపాల చౌదరి చూపుతున్న చొరవ ప్రశంసనీయం.

పుస్తక సమీక్షలు

ఒక అభిప్రాయం

  1. sreedasyam అక్టోబర్ 2007 1

    katha 2006 samputipai s.narayanaswamy garu chesina sameeksha bagundi. mokkubadiga sameekshinchadam kakunda indali kathalanugoorchi chakkagaa vishleshincharu. uttama kathalatho koodina sankalanaalanu kramam thappakunda veluvaristunna kathaasahithi samstha krushi abhinandaneeyam. maayi muntha katha mallee malle chadavalanipistunnadi. best of luck

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో