Aug2007
నీ నవ్వు
మూలం: పాబ్లో నెరూడా
అనుసృజన: సుధాకిరణ్
కావాలంటే
నా నుంచి అన్నం ముద్దని లాగేసుకో,
ప్రాణ వాయివునీ లాగేసుకో,
నీ నవ్వుని మాత్రం దూరం చేయకు-
పెదవుల మీద విరిసిన గులాబీ పువ్వునీ,
ఆనందంతో వురకలేసే జలపాతాన్నీ,
మిలమిలలాడే వెండి వెన్నెల కాంతినీ
దూరం చేయకు
నా పోరాటం కఠోరమైంది కదా
ఎంతకీ మారని లోకం జడత్వాన్ని చూసి
దిగులు పడతానా
ఆకాశాన్ని వెలిగించే నీ నవ్వు
నా ముందు మూసుకుపోయినట్లున్న
తలుపులన్నిటినీ తెరుస్తుంది
ప్రియా,
చీకట్లు ముసిరిన కాలంలో
వెలిగించిన దీపం నీ నవ్వు
నేను క్షతగాత్రుడనై
వీధులన్నీ రక్త సిక్తమైన వేళ
వొరిగిపోతున్న నా చేతుల్లో
కొత్త ఆయుధమై నీ నవ్వు
నన్ను నిలబెడుతుంది
ప్రియతమా
నీ నవ్వు
శీతల సంద్రపు
అలల తరగలపై తళతళలాడాలి
ప్రియతమా
వసంత రుతువులో
నే నిలువెల్లా నిరీక్షించే నీలి పుష్పమై,
నా దేశాన్ని ప్రతిధ్వనించే గులాబీ పువ్వై
నీ నవ్వు విరబూయాలి
నువు నవ్వాలి
పగలూ, రాత్రీ
చందమామ దోబూచులాడే సంధ్య వేళల్లో
వంపులు తిరిగిన వీధుల ఒంటరి దీవిలో
నీ నవ్వులే ప్రతిధ్వనించాలి
నిన్ను అమితంగా ప్రేమించే
ఈ అమాయకుణ్ని చూసి నవ్వు
కానీ
నేను కళ్ళు తెరిచినా,మూసినా
అడుగు తీసి అడుగేసినా
నీ నవ్వే కదలాడాలి
అన్నం ముద్దని లాగేసుకో
ప్రాణ వాయివునీ
వెలుతురునీ,వసంతాన్ని లాగేసుకో
కానీ నీ నవ్వుని మాత్రం దూరం చేయకు
నీ నవ్వే గనక లేకుంటే
నేను మరణిస్తాను
ఒక అభిప్రాయం »అనువాదాలు, కవితలు, ప్రపంచ సాహిత్యం
April 5th, 2009 at 11:53 am
చాలా బాగుంది.