విశాల ప్రజాస్వామిక సాహిత్య వేదిక అవసరం ఎంతైనా ఉంది – నిఖిలేశ్వర్

Nikhileshwar
Nikhileshwar
“ప్రజాస్వామిక విప్లవం కోసం కృషి చేసేటందుకు
విశాల ప్రాతిపదిక పై సాహిత్య వేదిక ఏర్పడాలి”
- – - – - – -
“దిగంబర కవిత్వం సామూహిక సృష్టి –
ఏ ఒకరూ నాయకుడు కానీ ప్రయోక్త కానీ కాదు”

1960 దశాబ్దంలో తెలుగు సాహిత్యంలో నెలకొని ఉన్న జడత్వాన్ని బద్దలు కొడుతూ ఆ నాటి సమాజానికి షాక్ ట్రీట్‌మెంట్ గా దిగంబర కవితోద్యమం ముందుకొచ్చింది. ఆరుగురు దిగంబర కవులు తమ కవిత్వంలో వాడిన భాష, ఉపమానాలు, తీసికొన్న వస్తువు, వెలిబుచ్చిన భావాలూ చాలా శక్తివంతమైనవి. అధికారం, హోదాల కోసం అర్రులు చాచే దళారీ తనాన్నీ, కపట మర్యాదలనూ, కుహనా విలువలనీ ఇంకా సమాజం లో చలామణీ అవుతున్న అనేకానేక హేయమైన సంప్రదాయాలనూ దిగంబర కవిత్వం చాచి లెంపకాయ కొట్టింది. అయితే దిగంబర కవిత్వాన్ని ఆక్షేపిస్తూ ప్రముఖ విమర్శకుడు రారా (రాచమల్లు రామచంద్రా రెడ్డి) “సమాజం ఇంతగా కుళ్ళిపోయిందా” అని రాసారు. మరో వైపు, సమాజాన్ని మార్చాలంటూ ముందుకొచ్చిన కొత్తదనాన్ని దేన్నయినా భుజాన మోసే శ్రీ శ్రీ దిగంబర కవిత్వాన్ని ఇంగ్లీషు లోకి అనువాదం చేసి తన మద్దతునూ, ప్రోత్సాహాన్నీ అందజేసాడు. 1969 కల్లా మూడో సంపుటాన్ని ప్రకటించిన దిగంబర కవుల్లో నలుగురు తర్వాత 1970 లో ఏర్పడ్డ విరసంలో భాగమైనారు. “నన్నయను నరేంద్రుడి బొందలోనే నిద్రపోనియ్యి/ లేపితే కాళ్లు పట్టి లాగుతాడు” అంటూ దిగంబర కవిత్వం మొదటి సంపుటంలో మొదటి కవితను రాసిన నిఖిలేశ్వర్ గారు ఆనాటి నుండీ ఈ నాటిదాకా తన సాహిత్య ప్రస్థానం కొనసాగిస్తున్న అలుపెరుగని సాహితీ పథికుడు. తెలుగులోనే కాదు హిందీ లో కూడా విశేషమైన సాహిత్య కృషి సల్పిన నిఖిలేశ్వర్ గారితో ప్రాణహిత ముచ్చటించింది. దిగంబర కవిత్వం గురించీ , ఆనాడు దాని ప్రాసంగికతను గురించీ, అట్లే నిఖిలేశ్వర్ గారి సాహితీ ప్రస్థానం లోని ముఖ్యమైన అంశాలనీ , ప్రస్తుత సమాజ, సాహిత్యాల గురించి ఆయన అభిప్రాయాలను ఈ తరం సాహితీ ప్రియులకు అందచేయాలన్న ఉద్దేశ్యంతో జరిగిన మా సంభాషణ ఇదీ!

***

ప్ర: మీ బాల్యం, నేపథ్యం, కుటుంబం, జీవనయాత్రల గురించి చెప్పండి.
జ:
నల్లగొండలోని భోనగిరి దగ్గరి వీరవల్లి గ్రామంలో నేను నిరక్షరాస్యుడైన రైతు కుటుంబంలో పుట్టాను. నేను శిశువుగా ఉన్ననాడే నాన్నను కోల్పోయాను. మా అమ్మ నన్ను హైదరాబాద్ లో పెంచి పోషించింది. ఆమె వజీర్ సుల్తాన్ టొబాకో కంపనీలో, అంటే చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీలో ముప్పై సంవత్సరాల పాటు కార్మికురాలిగా పని చేసి నన్ను చదివించింది. తొలి దశలో నాపై నెహ్రూ సోషలిజమ్, ఆర్యసమాజం ప్రభావం ఉన్నాయి. మిలిటరీలో సివిలియన్ స్కూల్ మాస్టర్ గా, ఎయిర్ ఫోర్స్ లో క్లర్క్ గా, గోలకొండ పత్రికలో సబ్-ఎడిటర్ గా పని చేసి, ఆ తర్వాత కేశవ స్మారక విద్యాలయంలో ఇంగ్లిషు బోధించే ఉపాధ్యాయుడిగా ముప్పై సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను.

ప్ర: మీ రచనలకి స్ఫూర్తినిచ్చిన, మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలు ఏమిటి? ఇంతవరకు చేసిన రచనల వివరాలు…
జ:
నా రచనలకు స్ఫూర్తినిచ్చిన అంశాలు – పేదరికంలోని నా జీవితం, తర్వాత ఇంగ్లిష్ లో, హిందిలో విస్తృత సాహిత్య పఠనం. మొదట్లో ప్రేమలో పడి ఎంకి పాటలతో మొదలై క్రమంగా శరత్, ప్రేమ్‌చంద్, శ్రీశ్రీ, చలం రచయితల ప్రేరణ. తరువాత ప్రజా ఉద్యమాలు, విప్లవ పోరాటాలు, పౌరహక్కుల ఉద్యమం, ఇవన్నీ నిరంతరం ముందుకు నడిపించాయి.

ఇక ఇంతవరకు నేను ప్రచురించిన పుస్తకాలు- కవిత్వంలో దిగంబర కవుల మూడు సంపుటాలు, మండుతున్న తరం, ఈనాటికీ నాలుగు శతాబ్దాల సాక్షిగా నా మహానగరం, ఎవరీ ప్రజాశత్రువులు, జ్ఞాపకాల కొండ. ఇక వచనంలో గోడల వెనుక (జైలు జ్ఞాపకాలు), విరసంపై సంస్థాగత సిద్ధాంత విమర్శ, ప్రపంచ సాహిత్యంలో తిరుగుబాటు ఉద్యమాలు, ఎవరిదీ ప్రజాస్వామ్యం, ఏ విలువలకీ ప్రస్థానం, నిఖిలేశ్వర్ కథలు. ఇక అనువాదాలు – హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర పుటలు, మృత్యు (చలం నాటిక హిందీలోకి), మరో భారతదేశం, ఆకాశం సాంతం, శబ్దగగనం.

ప్ర: రచనలు చేయడం మీ అభిరుచా, జీవన విధానమా, లేక భావోద్వేగమా? ఈ ప్రక్రియతో సంబంధం లేకుండా మీరు ఉండగలరా?
జ:
రచనలు చేయడం నా జీవితంలో విడదీయలేని భాగం. సాహిత్య ప్రక్రియతో సంబంధం లేకుండా ఉండలేను.

ప్ర: మీ కవితా వస్తువు, శిల్పాల వెనుక ఉండే ఆలోచనా స్రవంతిని వివరిస్తారా?
జ:
నేను పాటలు, పద్యాల నుంచి క్రమంగా వచన కవిత్వంలోకి వచ్చాను. ప్రయోగాత్మకంగా కవిత్వం రాస్తూనే శిల్పపరంగా ప్రతీకలను, వాక్యనిర్మాణాన్ని లయతో పాటు భావప్రధానంగా మలిచిన కవితా యాత్ర నాది. క్లుప్తతను పాటించి భావోద్వేగాన్ని ఆయా అంశాల మీదుగా వ్యక్తం చేసాను. నా ఆలోచనా స్రవంతి ఆధ్యాత్మిక భావజాలం నుంచి మొదలై మార్క్సిస్టు చింతనలో నిరంతర శాస్త్రీయమైన మార్గంలో సాగుతుందని అనుకుంటున్నాను.

ప్ర: మీరు ప్రముఖ దిగంబర కవిగా తెలుగు సాహితీ లోకానికి సుపరిచితులు. మీ దిగంబర కవితా ప్రస్థానం ఎలా ప్రారంభమైంది?
జ:
మా దిగంబర కవితా ప్రస్థానం మా ఆరుగురు యువకుల నిరాశా, నిస్పృహలు, కోపోద్రిక్త స్వభావంతో వ్యవస్థ మార్పు కోసం, ధర్మాగ్రహం (righteous anger) అనే భావావేశంతో మొదలయింది.

ప్ర: మీరు దిగంబరకవులు తొలిసారి ఎప్పుడు ఎలా కలుసుకున్నారు? మీ కేంద్ర స్థానం హైదరాబాదు కదా, ఆ నాటి జ్ఞాపకాల్ని ఏమయినా నెమరేసుకోగలరా? మీరెలా కల్సుకునే వాళ్లు, ఎక్కడ కల్సుకునే వాళ్ళు, కల్సుకుని ఎలా కవిత్వం, రాజకీయాలు, వగైరా చర్చించుకునే వాళ్ళు – ఎట్లా ఉత్తేజం పొందే వాళ్ళు? అట్లాంటి వివరాలు ఈ తరం కోసం అందించడానికి మీ స్మృతిపథంలోకి నడచి వెళ్ళగలరా?
జ:
తప్పకుండా. గతంలో Free verseలో అంటే వచన కవితలో వివిధ రీతుల్లో రచనలు చేసి, అసంతృప్తి చెంది, మేము క్రమంగా, విస్తృతంగా ఒక సామాజిక అధ్యయనంతో, అలాగే ఒక సార్థకత చెందవలసిన అంశంతో, ఆ సాహిత్య లక్ష్యంతో బయలుదేరాం. మౌలికంగా అసలు కులం, మతంతో ముడిబడిన పేర్లనే మార్చుకోవడం మంచిదనుకొని, మొదలు మా స్వభావ, ధోరణులకు అనుగుణంగానో, ప్రతీకాత్మకంగా మేము అంతా కూడానూ నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, నగ్నముని, చెరబండరాజు, భైరవయ్య, మహాస్వప్న అనే పేర్లతో ఉద్యమం ప్రారంభించాం. ఇక 1965 నుంచి 1968 మధ్య మూడు సంపుటాల ఆవిష్కరణ ఒక విలక్షణమైన చరిత్ర సృష్టించింది. మొదటి సంపుటిని హైదరాబాదులోనే అర్థరాత్రి పూట నాంపల్లి పాండు అనే రిక్షావాడు ఆవిష్కరించాడు. ఇక రెండవ సంపుటిని విజయవాడలో అర్థరాత్రి పూటే జంగాల చిట్టి అనే హోటల్ సర్వర్ ఆవిష్కరించాడు. ఇక మూడవ సంపుటిని విశాఖపట్టణంలో అర్థరాత్రి పూటే ఎడమనూరి యశోద అనే ఒక బిచ్చగత్తె చేత ఆవిష్కరించాము. ఈ ఆవిష్కరణలన్నిటికి కూడానూ ఆ రోజుల్లో సాహిత్యవేత్తలు, అలాగే కవులు అనేక మంది హాజరైనారు. ఆ ఆవిష్కరణల ప్రధాన లక్ష్యం ఏమిటంటే అట్టడుగు శ్రమజీవులకి సామాజిక న్యాయం జరగాలనే ఆశయం. మూడో సంపుటిని ఆనాడే మేము భూస్వాముల చేతుల్లో హత్యకి గురయిన దళిత యువకుడు కంచికచెర్ల కోటేశుకి అంకితం ఇచ్చాం. మా ఆరుగురు దిగంబర కవులమూ నిరంతర చర్చలు, విమర్శ, ఆత్మవిమర్శలతో పాటు, ప్రతి కవితా ఖండికను అందరూ చదివి, నిక్కచ్చిగా లోపాలు ఎత్తి చూపి తిరిగి రాయించేవాళ్లం. ఈ దిగంబర కవితా ప్రస్థానంలో మాకు సంచాలకుడు సుబ్రహ్మణ్యం, విమర్శకుడు కె. కె. రంగనాథాచార్యుల స్నేహం, సహకారం అన్ని విధాలా ఉండేవి.

ప్ర: మిమ్మల్ని ఆ రోజులలో అమితంగా ప్రభావితం చేసిన సామాజిక సాహిత్య అంశాలు వివరిస్తారా? ప్రపంచవ్యాప్తంగా ఆ నాడు ఎటువంటి పరిస్థితులు ఉండినయి? ఎటువంటి ఉద్యమాలు, రాజకీయాలు, తాత్విక వివేచనలు ప్రబలంగా ఉండినయి? మీ మీద వాటి ప్రభావం ఎటువంటిది?
జ:
ఆ రోజుల్లో మమ్మల్ని అమితంగా ప్రభావితం చేసిన సామాజిక సాహిత్య అంశాలు ముఖ్యంగా సామాజికంగా బాగా ప్రబలిన కులతత్వం, వర్గ సంఘర్షణ, మతఛాందసం, రాజకీయాల్లో, సినిమాల్లో, వివిధ రంగాల్లో నెలకొన్న ఆత్మవంచన, సిగ్గులేని నటన – ఇవన్నీ కూడా మమ్మల్ని బాగా కదిలించాయి. సాహిత్యపరంగా ఛాంధసవాదులని, సాంప్రదాయాన్ని ప్రోత్సహించే అకాడమీయులు, యువరచయితల నిజాయితీని రచనాపరంగా తొక్కిపెట్టడం – ఇవన్నీ కూడానూ మమ్మల్ని కదిలించాయి. ఇక తాత్వికంగా వ్యక్తిగత అన్వేషణతో పాటు నీతి నిజాయితి కోసం అస్తిత్వవాదం మొదలు మార్క్సిజం, మావో అలోచనా విధానం దాకా మా ప్రయాణం సాగింది.

ప్ర: మీ మీద బీట్ పోయట్స్ ప్రభావం ఉందంటారు కదా? ఏ ఏ కవులు మిమ్మల్ని ప్రభావితం చేసారు? ఎందుకు?
జ:
ఆ విషయానికొస్తే మా మీద బీట్నిక్ కవుల ప్రభావం అసలు లేదు. చాలా మంది విమర్శకులు గుడ్డిగా అంతకముందు వచ్చింది కాబట్టి ఇది వాళ్ళ అనుకరణ అనుకుంటారు, కాకపోతే అది తప్పు. సరైన అవగాహన కాదది. చారిత్రికాంశం కూడా కాదు. దిగంబర కవుల రెండవ సంపుటి ఆవిష్కరణ జరగబోయే ముందు నేను ఆయా పత్రికల గ్రంధాల ఆధారంగా సమాచారం సేకరించి ప్రపంచ సాహిత్యంలో యువతరం తిరుగుబాటు అనే సుదీర్ఘమైన వ్యాసం ఒకటి రాసి ఆనాటి భారతి సాహితి పత్రికలో ప్రచురించాను. అలెన్ గిన్స్‌బర్గ్ (బీట్ పోయెట్) రాసిన ‘హౌల్’ పోయెమ్ మొదలైన కవితలను మేము 1969, 1970 ల మధ్య చదివాం. అసలు 1968 నాటికి మా దిగంబర కవుల సంపుటి వెలువడింది. కాబట్టి బీట్నిక్ కవుల ప్రభావం ఉందనేది వాస్తవం కాదు.

ప్ర: దిగంబర కవిత్యోద్యమం సామూహిక సృష్టి గా చూస్తారా లేక వ్యక్తిగత కృషి ఫలితమా? దిగంబర కవిత్యోద్యమానికి ఎవరైనా నాయకత్వ పాత్ర వహించారా? ప్రయోక్త గా ఎవరినైనా పేర్కోవచ్చునా?
జ:
దిగంబర కవిత్వం ఒక సామూహిక సాహిత్య సృష్టి. నగ్నముని చొరవ ఉంది. కాదనము. కాని మేము ఏనాడు, ఎవ్వరినీ, నాయకుడిగానో లేక ప్రయోక్తగానో పేర్కొనలేదు. అసలు చర్చ రానేలేదు. ఇక ఇప్పుడు తన ఆత్మసంతృప్తి కోసం నగ్నముని తనను తాను ప్రయోక్తగా ప్రకటించుకోవడం ఆయన వ్యక్తిగతమైన కీర్తి కండూతిని, అహంకారాన్ని బహిర్గతం చేస్తున్నది. అసలు వాస్తవం చెప్పాలంటే దిగంబర కవిత్వాన్ని అన్ని భాషల్లోకి విస్తృతంగా తీసుకెళ్లినవాన్ని నేను. అనువాదాలు చేసి, విమర్శనాత్మక వ్యాసాలు రాసి, ఉపన్యసించి దిగంబర కవుల గురించి విస్తృతంగా చెప్పడం చేసిన తర్వాత ఇప్పుడేమో నగ్నముని నాయకత్వం కోసం తాపత్రయ పడడం చాలా వింతగా ఉంది.

ప్ర: దిగంబర కవిత్వం మొదటి సంపుటం నుండి మూడో సంపుటి వరకు జరిగిన మార్పులు – కవిత్వ పరంగానూ, తాత్వికత పరంగానూ, రాజకీయ పరంగానూ – వివరిస్తారా?
జ:
దిగంబర కవుల కవితా ప్రయాణం మూడు సంపుటాల్లో నిక్షిప్తమై ఉంది. మొదటి సంపుటిలో కేవలం యువకుల కోపోద్రిక్త స్వభావంతో పాటు ఆత్మశోధన, నిజాన్వేషణ కనిపిస్తాయి. రెండో సంపుటి ద్వారా కవితాపరంగా వచన కవితా రూపాన్ని ‘దిక్’ అని లేదా దిక్కులని వ్యవహరించి, సామాజిక తాత్విక అవగాహనతో అస్తిత్వవాదానికి లోనైనప్పటికీ మార్క్సిస్ట్ అవగాహనతో దిగంబర కవుల మానిఫెస్టోను ముందుమాటలో ప్రచురించాం. మూడవ సంపుటి నాటికి ఈ వ్యవస్థ సమూలమైన మార్పుకి సాయుధ పోరాట మార్గాన మావో అలోచనా విధానంతో జరుగుతున్న రైతాంగ కార్మిక పోరాటాల స్ఫూర్తిని పొందాం.

ప్ర: ఆ నాటి సమాజ పరిస్థితులకు దిగంబర కవిత్వం ప్రాసంగికత ఎట్లాంటిది? అది నెరపిన ప్రభావం ఎట్లాంటిది? మీరానాడు తీవ్రంగా అధిక్షేపించిన సమాజం కన్నా హీనమైన పరిస్థితులు నేడున్నాయి కదా – మరి ఈ నాడు దిగంబర కవిత్వం అవసరం అప్పటికన్నా ఎక్కువుంది అని మీరనుకుంటున్నారా?
జ:
ఆనాటి సమాజాన్ని దిగంబర కవిత్వం కుదిపి వేసింది. షాక్ ట్రీట్‌మెంట్ (Shock treatment) ఇవ్వడంతో పాటు, యువతరంలో తిరుగుబాటు లక్షణాన్ని, సామాజిక బాధ్యతని పెంచింది. ఈనాటి పరిస్థితుల్లో యదార్థ స్థితిని బద్దలు కొడుతూ మరో దిగంబర కవితోద్యమం రావలసి ఉంది. అయితే ఉద్యమాలు నిర్దిష్ట సామాజిక అవసరాలకు అనుగుణంగా కొత్త రూపంలో వస్తాయి తప్ప పునరావృతం కావు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.

ప్ర: ప్రపంచంలో ఆకలి ఉన్నంత వరకూ మార్క్సిజాన్ని సవాల్ చేసే దమ్ము ఎవరికీ లేదు అని దిగంబర కవిత్వం మూడో సంపుటి ముందుమాటలో ప్రకటించారు కదా – ఇప్పటికీ అది నిజమనుకుంటున్నారా?
జ:
నిజమే! సామాజిక న్యాయం కోసం దిశను చూపుతున్న మార్క్సిజానికి ఒక ప్రత్యామ్నాయం లేనంతవరకు, ఇప్పటివరకు అదే నిజమని నమ్ముతున్నా!

ప్ర: దిగంబర కవిత్వం నుండి మీరు విప్లవ సాహిత్యోద్యమం లోకి ప్రయాణించారు కదా – అది అప్పుడు అనివార్యమైనదా? ఎందుకు?
జ:
ఆ రోజుల్లో దిగంబర కవుల్లోని వైరుధ్యాలు, వ్యక్తిగతమైన విభేదాలు, అలాగే ఇంకొంత అస్పష్టత ఉండినయి. వీటన్నిటి నుండీ క్రమంగా ఒక స్పష్టత కోసం, సరియైన దిశ కోసం, విప్లవ సాహిత్యం వైపు పయనించడానికి ఒక రకంగా దారి తీసింది. ఆ రకంగా స్పష్టత, నిర్దిష్టత కోసం అది అనివార్యమైపోయిన దశ కూడా.

ప్ర: విప్లవ సాహిత్యం ప్రాసంగికత , అది సాధించిన విజయాలు – మీ దృష్టిలో దాని లోపాలు, ఇంకా ఏ విధంగా విరసం, విప్లవ సాహిత్యోద్యమం కొనసాగి ఉంటే బాగుండేది?
జ:
ఆనాటి విప్లవ సాహిత్య ఉద్యమం ఒక చారిత్రిక అవసరం. అయితే దాని ప్రాసంగికత లేదా రిలవెన్స్ క్రమంగా కోల్పోతున్న దశ ఏర్పడింది. ఎందువల్లనంటారా? విప్లవ రాజకీయ గ్రూపులతో ఏదో ఒకదానితో ముడిపడి, ప్రచార వేదిక కాకుండా, విస్తృతమైన దిశలో విప్లవ వేదికగా ఒక విశాల వేదికగా ప్రజాస్వామికంగా సాహిత్య సాంస్కృతిక విప్లవ శక్తుల్ని కలుపుకుని నిర్వహించి ఉంటే విరసం విస్తరించి వుండేది. కానీ ఆ లక్ష్యాన్ని అది నెరవేర్చలేదనే మేము 1976 లోనే విరసం నుంచి రాజీనామా చేశాం. విప్లవసాహిత్యోద్యమ విజయాలూ, వైఫల్యాలూ రెండూ వున్నాయి. ఇప్పుడు, ఈనాటి సామాజిక న్యాయానికి, రాజకీయానికీ, ముఖ్యంగా ఈనాటి సామాజిక, రాజకీయ యదార్థ స్థితిని అనుసరించి, విరసం పునరాలోచించి తన వ్యవహార శైలిని, ఆలోచనా విధానాన్ని మార్చుకుంటే తప్ప దాని ప్రాసంగికత నెరవేరదు.

ప్ర: తెలుగులో మొట్ట మొదట జైలు జ్ఞాపకాలు రాసింది మీరు, తెలుగు నుండి ఇతర భాషల్లోకి సాహిత్యం అనువాదం కావాలని మొదట గుర్తించింది మీరు, దిగంబర కవిత్వం, మండుతున్న తరం, ఈనాటికీ, నాలుగు శతాబ్దాల నగరం, ఎవరు ప్రజాశత్రువులు, జ్ఞాపకాల కొండ, గోడల వెనుక లాంటి పుస్తకాలు, ఇంకా అనేక అనువాదాలు ప్రచురించిన మిమ్మల్ని తెలుగు సాహిత్య విమర్శకులు తగినంతగా గుర్తించక పోవడం పట్ల మీరు ఎట్లా భావిస్తున్నారు?
జ:
నిజమే. ఇది చాలా వాస్తవం. నా గోడల వెనుక (జైలు జ్ఞాపకాలు) అప్పుడే హింది, ఇంగ్లీషు, పంజాబీ, కన్నడలోకి అనువాదమై ప్రచురించబడ్డాయి కొంత. ఇక తెలుగు సాహిత్య విమర్శకులు నా రచనల్ని, సాహిత్య ప్రయాణాన్ని, తగినంతగా గుర్తించలేదు అనేమాట వాస్తవమే. అసలు పైరవీలతో, వ్యక్తిగత సంబంధాలతో, రాగద్వేషాలతో, పూర్వాభిప్రాయాలతో (prejudices) తో విమర్శకులు అంచనాలు వేసినంత కాలం ఈ నిర్లక్ష్యాన్ని భరించవలసిందే. నిజాయితీతో, రచనా పరంగా, సాహిత్య ప్రమాణాలను పాటిస్తున్న విమర్శకులు మన తెలుగులో ఎంతమంది వున్నారు చెప్పండి?

ప్ర: భావ సారూప్యం కల రచయితలు ఒక సంఘంగా కలిసి పని చేయాల్సిన ఆవశ్యకత గతంలో కన్న ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నదా? మీ అభిప్రాయం?
జ:
తప్పకుండా! భావ సారూప్యత కల రచయితలు ప్రజాస్వామికంగా నిర్వహించగలిగిన ఒక వేదిక ద్వారా పని చేయాల్సిందే. 1970 మొదలుకొని ముప్పై ఏడు సంవత్సరాల్లో విరసం, జనసాహితి, ఇలా రకరకాల సంస్థలు వచ్చాయి. తర్వాత మళ్ళీ మిత్రులంతా కలిసి బేధాభిప్రాయాలు ఉన్నప్పటికి కూడానూ, కలిసి కూర్చుని, మాట్లాడి ఒక విశాల వేదిక నిర్మించుకోవాల్సిన ఆవశ్యకతను అందరూ గుర్తించారు. కాని ఆచరణకు వచ్చేసరికి అది ఏమవుతున్నదంటే, తిరిగి ఎవరి గ్రూపు రాజకీయాలు వారివి, ఎవరి ప్రెజుడిసెస్ వారివి. అందువల్ల ఏమవుతున్నది అంటే ఆచరణలో అది సాధ్యం కావడం లేదు. అలా కాకుండా వారి వారి వ్యక్తిగత గ్రూపు ప్రయోజనాలని గాని లేదా సంకుచిత ప్రయోజనాలని గాని దూరంగా నెట్టి, విస్తృతమైన సాహితీ వేదికని ఏర్పరిచి, ప్రజాస్వామిక విప్లవం కోసం కృషి చేయగలిగితే తప్పనిసరిగా అది నెరవేరుతుంది అనుకుంటాను. దానికోసం కొత్త తరం వాళ్ళు నడుం బిగించవలసి ఉంది.

ప్ర: చారిత్రికంగా భారత దేశంలో ముస్లిమ్ లు ఎక్కువ శాతం దళితులనుండి వచ్చిన వారే అన్న ఒక వాదన ఉంది. ముస్లిమ్ వాద అస్తిత్వ ఆకాంక్షపై, ఆ ఆకాంక్షని ప్రతిఫలిస్తూ ముందుకొస్తున్న సాహిత్యంపై మీ అభిప్రాయం?
జ:
భారతదేశంలోని ముస్లిం మైనారిటీ వర్గానికి తప్పకుండా సామాజిక న్యాయం లభించాల్సిందే. మతపరంగా కాకుండా వారిని భారతీయులనే సమానస్ఠాయిలో గౌరవించాలి మనం. అయితే, ప్రస్తుతం తెలుగులో వస్తున్న ముస్లింవాద, లేద ఇస్లాంవాద రచనలు క్రమంగా అస్ఠిత్వ నిరూపణ లేక రక్షణ పేరుతో మతతత్వానికి లోనై, సంకుచితమై, సెక్యులర్ భావనని విస్మరిస్తున్నాయి. ఈ ప్రమాద స్థాయిని వాళ్లు తప్పించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కష్టం.

ప్ర: జ్ఞాపకాల కొండ నేపధ్యాన్ని వివరిస్తారా? దాని వెనకవున్న ప్రేరణ ఏమిటి?
జ:
నా జ్ఞాపకాల కొండ కవిత్వ నేపద్యంలో యాదగిరి గుట్ట, భోనగిరి కోట పరిసరాలు, చరిత్ర ఇవన్నీ దాగి వున్నాయి. నా బాల్యంలో ముద్రవేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరటం ప్రేరణ వుంది దానికి.

ప్ర: మీరు తెలుగు లోనే కాకుండా హిందీ లో కూడా రచనలు చేసారు కదా? మన తెలుగు సాహిత్యానికీ హిందీ సాహిత్యానికి సారూప్యత, తేడాలు వివరిస్తారా?
జ:
నేను హిందీ, ఇంగ్లీషులలో కూడా చాలా రచనలు చేశాను. అనువాదాలే కాకుండా, మౌలికంగా, హిందీ ఇంగ్లీషులలో కవిత్వం, వ్యాసాలు రాశాను, ప్రచురించాను. త్వరలోనే ఆ సంకలనం వెయ్యాలని ఆలోచిస్తున్నాను. అయితే తెలుగు, హిందీ సాహిత్యాల మధ్య సారూప్యత, తేడాల అధ్యయనానికి వచ్చేసరికి మనం గమనించాల్సింది ఏమిటంటే అటు ప్రేమ్ చంద్ మొదలుకొని, ఇటు మనకు ఉన్న ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు, మిగతా సాహితీవేత్తలు, శ్రీ శ్రీ వగైరాలను చూసినపుడు ఒక క్రమంలో, ముఖ్యంగా అభ్యుదయ సాహిత్యోద్యమ క్రమంలో హిందీకి తెలుగుకి చాలా సారుప్య సాహిత్య స్వభావాలు వున్నాయి. తరువాత తరువాత హిందీలో మినీ కవిత, మినీ కహానీ అనే పద్దతిలో వాళ్ళు ఒక కొత్త ప్రయోగం మొదలుపెట్టారు. అలాగే క్రమంగా హిందీలో కనబడింది ఏమిటంటే, ఎక్కువగా నవలల వైపు దృష్టి సారించారు. కొంత కవిత్వ ధోరణి తగ్గింది. అట్లాగే హిందీలో పెద్ద పత్రికలు సాహిత్యాన్ని ప్రోత్సహించడం లేదు. హిందీ భాషను మాట్లాడే అనేక రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న అనేక ప్రాంతాల్లో చిన్న పత్రికలు మాత్రం విస్తృతంగా సాహిత్య చర్చ చేస్తున్నాయి.

ప్ర: ఈ దశాబ్దంలో ఉధృతంగా మనని ముంచెత్తుతున్న ప్రపంచీకరణ పై మీ అభిప్రాయం? అది అట్టడుగు వర్గాల ప్రజలపై, మూడో ప్రపంచ దేశాల ప్రజలపై ఎటువంటి ప్రభావం నెరపుతోంది?
జ:
గ్లోబలైజేషన్! ప్రపంచీకరణ ఈ రోజు అమెరికా, చైనావంటి అభివృద్ధి చెందిన దేశాలకి అన్ని రకాలుగా ఉపయోగపడుతోంది. భారతదేశంవంటి వెనుకబడిన దేశాల్లో అది నెగటివ్ ప్రభావాన్ని చూపుతున్నది. రైతుల ఆత్మహత్యలు, చేతివృత్తుల వాళ్ళు ఉపాధి కోల్పోవడం, అలాగే చిన్న పరిశ్రమలు నిస్సహాయంగా పడిఉండడం, ఇవన్నీ కూడా ఒకరకంగా నెగటివ్ ప్రభావమే. భారతదేశం ఇతర దేశాలకు విస్తృతమైన మార్కెట్ గా ఉపయోగపడుతుందే తప్ప మనం మన ఉత్పత్తుల్ని ఇతరదేశాలకు ఎగుమతి చేసి లాభాలు పొందగలుగుతున్నామా అంటే చాలా తక్కువే. మన దేశంలోని మేధోవలస ఉన్నదే, ఈ యువతరం బ్రెయిన్ డ్రెయిన్ మూలంగా కొన్ని కుటుంబాలు బాగుపడవచ్చు కానీ జాతీయంగా, రైతాంగ శ్రామిక వర్గానికి ప్రపంచీకరణ శాపంగా పరిణమిస్తోంది.

ప్ర: సమస్యలపైనా, రాజకీయ అభిప్రాయాలతో సాహిత్యం సృష్టించడం సరైంది కాదు అని ముందుకొస్తున్న ‘కొత్త’ సాహిత్య ప్రమాణాలపై మీ అభిప్రాయం?
జ:
ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ దృక్పథం, సమస్యలపై స్పందన లేకుండా ఉత్తమ సాహిత్య సృష్టి ఏనాడూ జరగలేదు, జరగదు కూడా! అయితే fiction! Pulp fiction! వినోదాత్మక సాహిత్యం అంటారే దాని దారి వేరు. అది పాపులిస్ట్ సాహిత్యం. ఇక్కడ ప్రస్తుతం ఈ వాదన ఎందువల్ల వచ్చిందంటారు? కేవలం సౌందర్య దృష్టితో కళాత్మక విలువల్ని కాపాడాలన్న ఆతృత కొద్ది ఈ కొత్త వాదన మళ్ళీ ముందుకొచ్చింది. అయితే వాస్తవం ఏమిటంటే నేలబారు రచనలు రాకుండా ఉండాలంటే ఏ ప్రక్రియలోనైనా సాహిత్యపరమైన శిక్షణ, అభ్యాసం అవసరమే. అందువల్ల సాహిత్య విలువలు, ప్రమాణాలు మనం రక్షించుకోవాలనుకున్నప్పుడు సామాజిక దృష్టి, చైతన్యం వీటిని కాపాడుకోగలిగితే ఈ కొత్త వాదననేది ఒక రకంగా మళ్ళీ పాత వాదనలోకి వెళ్ళిపోతుంది.

ప్ర: రచయితకు సామాజిక చైతన్యం ఎలా అవసరం? కవులకు మీరు ఇచ్చే సందేశం?
జ:
రచయిత వ్యక్తిగా సామాజిక, సాహిత్య, రాజకీయ అవగాహన ఉన్నపుడే చైతన్యవంతుడిగా రచన చేయగలడు. వ్యక్తిగత స్వభావంతో పాటు తనకు సామూహిక ప్రతిస్పందనా బాధ్యత కూడా ఉందన్న అంశాన్ని విస్మరించకూడదు. సామాజిక న్యాయం, సత్యాన్వేషణలో నిర్భయంగా తాను నమ్మినదాని కోసం మానవీయాంశతో రచనలు చేసినపుడే సార్థకత అని అనుకుంటున్నాను. ఈ విలువలు మన రచయితలు పాటించగలిగితే, సహజంగానే వారు తమ రచనకి, సమాజానికి న్యాయం చేయగలరనుకుంటున్నాను.

ఒక అభిప్రాయం »ఇంటర్‌వ్యూలు

ఒక అభిప్రాయం

  1. Rohiniprasad Aug 7, 2007 1

    ముఖపత్రంలో మీరు పొందుపరచిన కుటుంబరావుగారి ‘కోట్’ విరసం ఆవిర్భావానికి కొన్నేళ్ళ ముందే రాసినది. అందుచేత ఆయన దిగంబర కవితా ఉద్యమాన్ని ఆహ్వానించడం క్షణికావేశంలోనో, రాజకీయలబ్ధి కోసమో చేసినది కాదు. నేను హాజరయిన విశాఖ వైద్యకళాశాల ఉదయపు సమావేశంలో (1970) కూడా ఆయన ఈ కవిత్వాన్ని నిస్సంకోచంగా స్వాగతించారు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో