Aug2007
పత్రికలను ఆధునికీకరించిన జర్నలిస్టు
దాదాపు యాభై ఏళ్ళు నిరాఘాటంగా రచనా వ్యాసంగం సాగించిన కొడవటిగంటి కుటుంబరావు గురించి తెలుగు పాఠకలోకానికి కథకుడు, నవలాకారుడు, విమర్శనాత్మక వ్యాసరచయితగా తెలుసుగాని, తెలుగులో వార, మాస పత్రికలకు అధునాతనమైన రూపురేఖలు తీర్చిదిద్దిన సంపాదకునిగా తెలియదు. ఈనాడు కథ, సినిమా మొదలైన రంగాలకు సంబంధించిన ఇన్ని వార, పక్ష, మాస పత్రికలు వేలూ, లక్షలూ కాపీలు వేసి వర్ధిల్లుతున్నాయంటే, ఆయనకి వారెంత రుణపడి ఉన్నారో, ఈ పత్రికల సంపాదకులలో కూడా ఆట్టేమందికి తెలియకపోవచ్చు.
రెండవ ప్రపంచయుద్ధానికి ముందుకాలంలో జాతీయోద్యమం, దేశభక్తి భావాల ప్రచారానికీ, సాంఘికాచార సంస్కరణలకూ, ఆధునిక సాహిత్య విధానాలు, చరిత్రపరమూ, సాహిత్యపరమూ అయిన పరిశోధనాంశాల వివరణకూ పత్రికలు కృషి చేసే రోజుల్లో – సంపాదకులు, యజమానులు అనేక కష్టనష్టాలకు ఓర్చి పత్రికలు నడిపేవారు. అంతటి ఉన్నతాశయాలు లేకపోయినా, ప్రజలలో పఠనాసక్తిని పెంచి, అంతంతమాత్రమే చదువు నేర్చినవారు కూడా చదువుకునే విధంగా మరికొన్ని పత్రికలు – చిత్రగుప్త, వినోదిని, రూపవాణి, ఢంకా మొదలైనవి – ప్రచారంలోకి వచ్చాయి. వాటికి కథలు, హాస్యం, సినిమా ప్రధానాంశాలుగా ఉండేవి.
ఆ రోజుల్లోనే చక్రపాణి, కుటుంబరావు కలిసి మొట్టమొదటిసారిగా యువతరం కోసం కొత్త తరహా సాహిత్యం – ముఖ్యంగా కథలు, నవలలు – అందించాలనే ఉద్దేశంతో ‘ఆంధ్రజ్యోతి’, తరవాత ‘యువ’ అనే మాసపత్రికలను, ‘యువ ప్రచురణలు’ అనే పుస్తక ప్రచురణ సంస్థను నెలకొల్పారు. ఆ రోజుల్లో చిత్రగుప్త, వినోదిని, ఆనందవాణి వంటి పత్రికలలో కథా సాహిత్య స్థాయి నానాటికి దిగజారసాగింది. దానితో వారు సరిపెట్టుకోలేకపోయారు. మరొకవైపు సామాజిక స్పృహ, హేతువాదం, మానవస్వభావ పరిశీలనగల కథా, నవలా సాహిత్యానికి అప్పుడు కృష్ణాపత్రిక, ఆంధ్రవారపత్రిక, భారతి, గృహలక్ష్మి వంటి పత్రికలలో స్థానం లభించేది కాదు. అందువల్ల అట్టి సాహిత్యాన్ని ప్రజలకు అందచెయ్యడం కోసం వారిద్దరు పూనుకొని, తమ పత్రికలు, ప్రచురణ సంస్థ ద్వారా కృషి చేశారు.
ఆ రోజుల్లో తెలుగు సినిమాలు అప్పుడే బాగా ప్రచారంలోకి రావడంతో వీరిద్దరి దృష్టి సినిమాలపైకి మళ్ళింది. మొదట కుటుంబరావు ఆంధ్రవారపత్రిక ద్వారా అటు సినిమా కళని, ఇటు పత్రికా ప్రచారాన్ని సామాన్యప్రజలకు సన్నిహితంగా తీసుకుపోగలిగారు. ఆనాటి ఆంధ్రవారపత్రిక అమ్మకం పదివేలు దాటడం గొప్ప విజయాన్ని సాధించినట్టే అయింది. ఇందుకు కుటుంబరావు నిర్వహించిన సినిమా శీర్షికలకు, జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి సంపాదకత్వం వహించిన వ్యంగ్యసాహిత్య విభాగం తోడయింది. ఆ పత్రికలోనే – రెండవ ప్రపంచయుద్ధానికి ముందు ఒకసారి, తర్వాత యుద్ధం జరుగుతూండగా 1942లో రెండవసారి ఆ పత్రికను దేశభక్తి సూచకంగా మూసివేసేటంతవరకూ, వీరిద్దరూ అనేక నూతన శీర్షికలు ప్రవేశపెట్టి, రచనలలో రకరకాల పోకడలు చూపి, పత్రికను సామాన్యప్రజలు ఆసక్తితో, ఉత్కంఠతో చదివేలా చెయ్యగలిగారు. ఆనాడు ఆ పత్రికకు లభించినంత ప్రచారం మరే వార, మాస పత్రికలకూ ఉండేది కాదు.
1943లో ఆంధ్రపత్రిక, ఆంధ్రవారపత్రిక, భారతి తిరిగి మొదలైనప్పుడు కుటుంబరావు దినపత్రికలో చేరారు. హోమియోపతి వైద్యం అందరికీ అర్థం అయేలా దినపత్రికలో వ్యాసాలు రాశారు. అప్పుడు ఆంధ్రవారపత్రిక చక్కని బొమ్మలు, కథానికలు, రాజకీయ, సాహిత్య విమర్శలు, చారిత్రక పరిశోధనా వ్యాసాలతో, చక్కని ముద్రణతో, పెద్ద సైజులో వచ్చినా ప్రజాదరణకు నోచుకోలేకపోయింది. ఒకే వరవడిలో భారతి, కృష్ణాపత్రిక వంటి పత్రికలు ఎన్ని వచ్చినా అన్నిటి స్థితీ అంతంతమాత్రంగానే ఉండేది. సుమారు ఎనిమిదేళ్ళు ఆంధ్రవారపత్రిక ఆ విధంగా నడిచి, చివరకు మూసివేసే స్థితికి వచ్చేసింది. అప్పుడు 1949లోనో, 1950లోనో ఆ పత్రికను కుటుంబరావుకు అప్పగించడం జరిగింది. దాన్ని సైజు తగ్గించి (అది ఇప్పటి జ్యోతిచిత్ర సైజులో ఉండేది) నేటి వారపత్రిక స్వరూపం ఇచ్చినవాడు కుటుంబరావు. అలాగే అందులో కొత్త శీర్షికలు ప్రవేశపెట్టి, కొత్త రచయితలను ప్రోత్సహిస్తూ, దాన్ని ముఖ్యంగా కథల పత్రికగా రూపొందించారు. రాజకీయ విమర్శలకు, బాలసాహిత్యానికి, సినిమాకి వేర్వేరు విభాగాలు, కథలు, నవలల సీరియల్స్, హాస్యం, వ్యంగ్యం నిండిన లిమరిక్స్ ప్రవేశపెట్టి, త్రివర్ణ ముఖచిత్రాలు, సినిమా స్టిల్స్, కార్టూన్లతో పత్రికకు పూర్తిగా కొత్త స్వరూపం ఏర్పరచింది కుటుంబరావే. వాటితో పాటు ఇంగ్లీషు నుంచి మార్క్ ట్వేన్ మొదలైన రచయితల నవలల అనువాదాల్ని ప్రవేశపెట్టింది ఆయనే. బాలల ప్రత్యేకసంచికలు దసరా పండగలకు అచ్చువేసేవారు. అందులో పిల్లల రచనలు, బొమ్మలు వేసి, అలాగే దసరాకి పోటీలు పెట్టి, ఎంతమంది రచయితలనో ప్రోత్సహించారు. ఈనాడు తెలుగుదేశంలో ఇన్ని వారపత్రికలు పెద్ద సర్కులేషన్ తో కళకళలాడుతూ వస్తున్నాయంటే అందుకు ఆయన రూపొందించిన ప్రక్రియలే కారణం. ఈనాడు రచయిత్రులు, రచయితలు పేరుపొందినవారు అనేకమంది తెలుగులో రాస్తున్నారు. వీరిలో చాలామంది కుటుంబరావు ప్రోత్సాహంతో రచన ఆరంభించినవారే. పోతే, విజ్ఞానవీథులు అనే శీర్షిక కింద ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని ప్రజలకు సులభమైన భాషలో అందించడానికి ఆయన ప్రయత్నించారు. కుటుంబరావు ఫిజిక్స్ లో పోస్టుగ్రాడ్యుయేట్ (డిగ్రీ తీసుకోలేదు). అందువల్లనే ఆయన ఏ రచన చేసినా, ఏ భావాలు ప్రకటించినా శాస్త్రీయ దృక్పథం, హేతువాదం నిక్కచ్చిగా వ్యక్తం అయేవి. భౌతికశాస్త్రాన్ని గురించి ఆయన రాసిన వ్యాసాలు యువలోకానికి శాస్త్రీయ దృక్పథం అలవడడానికి ఎంతగానో తోడ్పడ్డాయి.
ఆంధ్రవారపత్రికని ఒక దారిలో పెట్టి, సర్కులేషన్ బాగా పెరుగుతూ ఉన్నప్పుడే కుటుంబరావు మళ్ళీ తన పాత మిత్రులు చక్రపాణితో చేరి, చందమామ మాసపత్రికకు, సినిమా రచనకు దోహదం చేశారు. 1952లో చందమామలో చేరిన తర్వాత (1952 నుండి 55 వరకు ఆయన కినిమా పత్రికకు కూడా సంపాదకుడుగా వ్యవహరించారు) అందులో ఎన్నో మార్పులు తెచ్చి, జానపద కథలు, బేతాళకథలు, మాంత్రికుల కథలు, సీరియల్స్ ప్రవేశపెట్టారు. అయితే మాంత్రికులు, రాక్షసుల కథలు ఎన్ని వేసినా మూఢవిశ్వాసాలు, ఆచారాలను ప్రచారం చేసే సాహిత్యాన్ని ఎన్నడూ ప్రోత్సహించలేదు. చినపిల్లల కథలలో ఎన్ని రూపకల్పనలు చేసినా అన్నిటికీ అంతర్గతంగా హేతువాదం, మానవతావాదం రూఢి అవుతూనే ఉండేవి. కుటుంబరావు చేరిన తర్వాతనే చందమామ ఇంగ్లీషుతో సహా అనేక భాషల్లో ప్రచురణ కావడం ప్రారంభమయింది. అది పిల్లలకే కాక, పెద్దలు కూడా చదివే పత్రికగా రూపొందింది. 1952 మొదలు ఆయన చనిపోయేదాకా చందమామను నిర్వహిస్తూనే వచ్చారు.
కుటుంబరావు పెట్టిన వరవడిలోనే మొదట ఆదివారం పత్రికలు, తరవాత వారపత్రికలు, ఆ తరవాత పిల్లల పత్రికలు అనేకం వచ్చాయి. ఆయన ఫార్ములాని అనుసరించే వృద్ధిలోకి వచ్చాయి.
కుటుంబరావు చందమామలో చేరిన తర్వాత అనేక ఇతర పత్రికలకు కూడా దోహదం చేసేవారు. అందులో ముఖ్యమైనవి తెలుగు స్వతంత్ర, కొమ్మూరి సాంబశివరావు తెలుగు సినిమా, ఆనందవాణి, యువ.
తెలుగు పత్రికా ప్రపంచంలో కుటుంబరావు రచనలు పడని పత్రికగాని, ఆయన ప్రభావానికి లోనుగాని పత్రికగాని లేదని నా అభిప్రాయం. తెలుగు వార్తాపత్రికలకి నార్లవారు పెట్టిన వరవడి నేటికీ సాగుతున్నట్టే, వార, మాస పత్రికలకు, సినిమా పత్రికలకు ఆదిపురుషుడు కుటుంబరావే అని నా ఉద్దేశం.
…………….
నండూరి రామమోహనరావుగారి మాటల్లో:
చాలా ఏళ్ళనాడు కొడవటిగంటి కుటుంబరావును సన్నిహితంగా ఎరిగినవారిలో నేనూ ఒకడిని. ఆయన రెండవసారి ఆంధ్రపత్రికలో ఉద్యోగానికి వచ్చినపుడు (1948) ఆయనా, నేనూ సహోద్యోగులమైనాము. రెండేళ్ళ తరవాత ఆయనను శంభుప్రసాద్ ఆంధ్రవారపత్రికకు ఇన్ చార్జ్ సంపాదకుడుగా నియమించినపుడు నేనూ వారపత్రికలోకి మారాను. కుటుంబరావు, సూరంపూడి సీతారామ్, నేనూ – త్రీ మస్కెటీర్స్ లాగా – అదీ మా టీము.
వారపత్రిక అభివృద్ధి చేయడానికి ఆయనొక ఫార్ములా కనిపెట్టారు. All in one అనేది ఆ ఫార్ములా. అది మన నవలా సాహిత్యంలో సంధిదశ. స్వతంత్ర నవలలు వచ్చేవి కాని, అవి మేధావివర్గానికే ఎక్కువ పరిమితమై ఉండేవి. అందుచేత కుటుంబరావు వాటి జోలికి పోకుండా అనువాద నవలల ప్రచురణ మొదలుపెట్టారు. సీతారామ్ చేత, నా చేత అనువాదాలు చేయించేవారు. సుమారు ఏడాదిన్నర తిరిగేసరికి వారపత్రిక అమ్మకాలు అయిదారు రెట్లు పెరిగాయి. ఒక్క అనువాద నవలలు మినహా ఇప్పటికీ తెలుగు వార, మాస పత్రికలకు ఇదే ఫార్ములా. ఆ తరువాత చందమామలో చేరాక తన సక్సెస్ స్టోరీని ఆయన రిపీట్ చేశారు…
మూలం:
భావవిప్లవకారుడు కొడవటిగంటి – సాహిత్యసమాలోచన
ప్రగతి సాహితి,
జవాహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ,
న్యూ ఢిల్లీ
సంపాదకుడు: అశోక్ టంకసాల, జూన్ 1982
4 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు
August 6th, 2007 at 12:03 pm
ఆ రోజుల్లో సీతారామ్, నండూరి ఆంధ్రపత్రిక కోసమని ఇంగ్లీషు నవలలను అనువదించినట్టే కుటుంబరావు విశాలంధ్ర ప్రచురణలుగా రష్యన్ రచనలను అనువదించారు. అందులో మృతజీవులు అనేది ప్రస్తుతతం poddu.net లో ధారావాహికగా వస్తోంది.
December 5th, 2008 at 8:04 pm
కొడవటిగంటి వారి గురించి చాలా తెలియని విషయాలు ఈ వ్యాసంలో తెలియచెప్పారు. కృతజ్నతలు.
November 2nd, 2009 at 1:15 pm
కుటుంబరావుగారి గురించి ప్రగతి సాహితి, జవహర్లాల నెహ్రూ యూనివర్సిటీవారు ప్రచురించిన పుస్తకం నేడు అలభ్యం కాబట్టి దాని పూర్తిపాఠం మీ పత్రికలో PDF ఫార్మాటులో లభించేలా చేస్తే మా వంటి కొడవటిగంటి అభిమానుల కెందరికో మేలుచేసినవారు అవుతారు. ఆలోచించండి.
November 2nd, 2009 at 2:05 pm
ఆ పుస్తకాన్ని మళ్ళీ ప్రచురించే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా విన్నాను. దాన్ని తొలిగా టంకసాల అశోక్ వెలువరించారు.