అపరాజిత

“నన్ను ఒకప్పుడు
వీరుడనేవారు.
ఇప్పుడు అదంతా అయిపోయింది.
ఇక నా దారంతా
కష్టాలమయమే .”
- తతంక ఇయొతాంక (Tatanka Iyotanka – Sitting Bull)

తెల్లవాడి దోపిడీ ఆదివాసుల విషయంలో తన విశ్వరూపం చూపించింది. వేలఏళ్ళకొద్దీ నివసిస్తున్న ఆదివాసులను ఖాతరు చెయ్యకుండా దేశాలకు దేశాలు ఏర్పడ్డాయి. ఈ కొత్త దేశాలు ఏర్పడుతున్న క్రమంలో ఎన్నో తెగలు తెల్లవాడు జరిపిన నరమేధంలో రూపు మాసిపొయ్యాయి. తెల్లవాడికి తమలా భూమిని పంచుకునే ఉద్దేశంలేనట్టు ఎన్నో తెగలు తొందర్లోనే గ్రహించాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఎన్నో తెగలు దిక్కుతోచని స్థితిలో తెల్లవాడు ఏర్పరచిన రిజర్వేషన్లలో చేరిపొయ్యారు. ఎల్లలెరుగక స్వేచ్చగా బ్రతికిన తమను అన్ని విధాలా నిర్భందించే రిజర్వేషన్లనుంచి తమను, తమ జాతిని రక్షించుకోవడానికి కొన్ని తెగలు ఒక్కోసారి ఒంటరిగా, కొన్నిసార్లు బృందాలుగా ఏర్పడి తెల్లవాడితో ఏళ్ళకొద్దీ యుద్దాలు చేసారు. యుద్దంలోనైతేనేమీ, సంధి పత్రాల పేరిట జరిగిన కుతంత్ర నీతితోనైతేనేమి చివరికి అన్ని తెగలూ రిజర్వేషన్లలో చేరిపొయ్యారు. దానితో వారి చుట్టూ అన్ని రకాల సరిహద్దులు ఏర్పడ్డాయి. భూమిమీద వారి హక్కులను తెల్లవాడికి వదిలేసుకున్నందుకు అమెరికా ప్రభుత్వం వారికి బట్టలు,ఆహారం,వాటితోపాటు ఆల్కహాలు సరఫరా చేసింది. బోర్డింగు పాఠశాలలు ఏర్పరచి , చర్చిలు నెలకొల్పి నేటివ్ అమెరికన్లను మార్చడానికి అన్ని ప్రయత్నాలూ చేసింది . అయితే వారిని తెల్లవాడితో సమానంగా చూడాలని అమెరికా ప్రభుత్వం ఎప్పుడూ అనుకోలేదు. జాతివివక్ష వల్ల చాలా కొద్దిమందికి మాత్రమే అరకొర ఉద్యోగాలు ఉండేవి. జీవితంపట్ల ఎలాంటి ఆశలు లేక తాగుడుకి అలవాటుపడి కుటుంబాలు విచ్చిన్నం కావడం రిజర్వేషన్లలో వారికి సాధారణమైపోయింది. తమ ముందుతరాల నుంచి మార్గదర్షకత్వం లేక తాగుడుకి, డ్రగ్స్ కు అలవాటుపడ్డ నేటివ్ అమెరికన్లు రికామిగా తిరుగుతూ, గొడవలు పడుతూ జైలు పాలవడం నిత్యకృత్యమైపోయింది .

రిజర్వేషన్లో జీవితం గురించి, ఎన్ని వ్యాసాలు చదివినా ఎన్ని ఎన్సైక్లోపీడియాలు చదివినా అవగాహన కాని విషయాలు ఆ జీవితాన్ని జీవించిన వ్యక్తి అనుభవాలను చదివితే గాని అర్థం కావు .

లకోట తెగకు చెందిన మేరి క్రౌ డాగ్ (Mary Crow Dog) రిజర్వేషన్ జీవితం గురించి రాసిన స్వీయ చరిత్ర, లకోట ఉమన్ (Lakota Woman) , ఇలాంటి కథనాలలో ఒకటి .

నేటివ్ అమెరికన్లు తమ ఆచార సాంప్రదాయాలనూ , తద్వారా తమ వ్యక్తిత్వాన్నీ పోగొట్టుకుని అటు తెల్లవాడి తరహాలో కూడా జీవించలేక గందరగోళంగా తయారైన వాతావరణంలో , రోజ్ బడ్ (Rose Bud, South Dakota) రిజర్వేషన్లో పుట్టింది మేరీ బ్రేవ్ బర్డ్ (Mary Brave Bird). ఆమెది ఒక దశ వరకూ అరుదైన జీవితమేమీ కాదు. తన 18వ ఏట వరకూ ఆమె తన సహచరులలాగే జీవితం ఎటు తీసుకువెళితే అటు వెళ్ళింది . చిన్నప్పుడే ఆమె తండ్రి ఆమెను, ఆమె అక్కను పెంచే బాధ్యతను ఆమె తల్లికి ఇచ్చేసి ఎటో వెళ్ళిపొయ్యాడు. అక్కడినుంచి మొదలవుతుంది ఆమె రిజర్వేషన్ తరహా జీవితం. ఇతర్ల లాగే అక్క చెల్లెల్లు బలవంతపు బోర్డింగు పాఠశాలలో చేరుతారు. అక్కడి సిస్టర్స్ పేరుకి మాత్రమే శాంతస్వరూపులు. వారితో, అక్కడి టీచర్స్ తో తరచూ గొడవపడి దెబ్బలు తినేది మేరి . స్వతహాగా తిరగబడే గుణమున్న మేరీ కొన్ని సంవత్సరాలకు ఒక టీచరుతో గొడవపడి పాఠశాలనుంచి పారిపోయింది . ఎంతో మంది నేటివ్ అమెరికన్ అమ్మాయిల లాగే 15వ ఏటనే రేప్ కు గురయింది . అప్పటి తన స్నేహితులలాగే తాగుడుకి , డ్రగ్స్ కు అలవాటు పడింది . దొంగతనం చేసి జైలుకు కూడా వెళ్ళింది. మేరి తన జీవితాన్ని జులాయిగా బతికేస్తున్న తరుణంలో , 1970ల్లో , కొన్ని నేటివ్ అమెరికన్ తెగలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి తమ సాంప్రదాయాలను , ఆచారాలను మరచిపోకుండా , మేరిలా తమ జీవితాలను పాడు చేసుకుంటున్న యువతరానికి మార్గదర్శకంగా , తమ జాతుల ఆత్మను నిలబెట్టుకోవడం ఈ కూటమి ప్రధాన ధ్యేయం. కాని ఇలాంటి పునరుజ్జీవనం ప్రపంచలో ఎక్కడైనా, ముఖ్యంగా అమెరికాలాంటి చోట , అంత సులభంగా సాధ్యపడదు. తమపట్ల తమకే ఏహ్యభావాన్ని అలవరచుకున్న యువతరాన్ని మేల్కొల్పడమేకాక , జాతివివక్షతా భావంతో విర్ర వీగుతున్న అమెరికా తెల్లవాడికి తమ ఉనికిని, వ్యక్తిత్వాన్ని, హక్కులను చాటడానికి “అమెరికన్ ఇండియన్ మూవ్ మెంటు” గా(American Indian Movement – AIM) ఉద్యమించవలసివచ్చింది . ఉద్యమ స్పూర్తి అన్ని నేటివ్ అమెరికన్ తెగలకు వ్యాపించింది. ఉద్యమ ప్రారంభదశలోనే సభ్యురాలిగా చేరింది మేరి. AIM సభ్యులతో కలిసి ఎన్నో పోరాటాల్లో పాల్గొంది. 1890లలో ‘వూండెడ్ నీ’ (Wounded Knee) లో నరమేధం జరిగిన చోట అమెరికా ప్రభుత్వం ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించింది. 1973లో ప్రభుత్వానికి ధిక్కారంగా , ఆ స్మారక చిహ్నం దగ్గరి స్థలాన్ని ఆక్రమించుకున్నారు AIM కార్యకర్తలు. అప్పటికి మేరి నిండు గర్భిణి. ఆమెనూ, ఉద్యమాన్నీ వదిలేసి ఆమె ప్రియుడు వెళ్ళిపోయినా మూవ్ మెంట్ పట్ల ప్రేమ చావని మేరి అతనితో వెళ్ళదు . సహచరులు ఎంత వారించినా వినకుండా ‘వూండెడ్ నీ’ ఆక్రమణలో పాల్గొంది. అక్కడే తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ధైర్యం మిగతావారికి స్ఫూర్తి అయింది. ఈ ఆక్రమణ తరువాత మేరి అమెరికన్ ఇండియన్ మూవ్ మెంటులో ఒక నాయకుడైన లియొనార్డ్ క్రౌ డాగ్(Leonard Crow Dog) ను పెళ్ళి చేసుకోవడంతో ఆమె జీవితం మరో మలుపు తిరుగుతుంది. ప్రభుత్వంతో గొడవలు నిత్యకృత్యమవుతాయి . ఎంతో మంది సహచరులు నేలకొరగడం చూస్తుంది. ఎదురుదెబ్బ తగిలిన ప్రతిసారీ రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతుంది.

ఒక తెగకు లేదా ఒక వ్యక్తికి చెందిన జీవితం మాత్రమే కాక మొత్తంగా నేటివ్ అమెరికన్ జీవితం గురించి చక్కని అవగాహన ఇస్తుంది ఈ పుస్తకం. లకోట తెగ కథలకు, జానపదాలకు, ఆచార విశ్వాసాలకు, సాంప్రదాయాలకు, తెగ ప్రజల దైనందిన జీవితానికి ఈ పుస్తకం అద్దం పడుతుంది.

తన కథను ఒక చెయాన్ తెగ (Cheyenne tribe) సామెతతో ఇలా మొదలుపెట్టి :

“ఒక జాతి స్త్రీలు స్థైర్యం కోల్పోనంతవరకూ
ఆ జాతి ఓడిపోయినట్లు కాదు.
పురుషుల చేతులలోని కత్తులు కటార్లు
ఎంత పదునైనవైనా సరే,
జాతి స్త్రీలు స్థైర్యం కోల్పోతే
ఆ జాతి పోరాటంలో అంతా కోల్పోయినట్లే .”

సగర్వంగా, తన జాతి స్త్రీల తరపున, ఇలా ప్రకటిస్తుంది మేరి:

“విశ్వమంతా విస్తరించేలా
నా గొంతు విప్పుతున్నా.
నా మాట మీకు వినిపిస్తుంది:
నేను బతికే వున్నాను , బతికే వుంటాను !”

విశ్వమంతా విస్తరించాల్సిన మేరీ గొంతును తెలుగులోనూ వినిపించాలని నా ప్రయత్నం. వచ్చే సంచికనుంచి ధారావాహికగా … … …

అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం

3 అభిప్రాయాలు

  1. B.AJAY PRASAD సెప్టెంబర్ 2007 1

    ఈ వ్యాసం చాలా బావుంది. ఇటువంటి పోరాటస్ఫూర్తి కథలు, అనువాదాలు ఇప్పుడు చాలా తక్కువగా వస్తున్నాయి. నవలలకు, అనువాద సాహిత్యానికి ఆదరణ తక్కువైన ఈరోజులలో ఈ ప్రయోగం అద్భుతమైనది. మీ ధారావాహిక కోసం ఎదురుచూస్తున్నాను. మమత గారికి అభినందనలు.

  2. sampath kumar thulasi సెప్టెంబర్ 2007 2

    ఈ వ్యాసం మరియు తర్వాతి పరంపర చాలా ముఖ్యమైన సమస్యను మనకు పరిచయం చేస్తుంది. ఒక మంచి క్రుషి. అయితే, ఈ వ్యాసం కాంటెక్స్ట్ లో రిజర్వేషన్లంటే ఏమిటో తొలి పేరా లోనే కొంచెం వివరణ ఇవ్వడం అవసరం. రిజర్వుడు భౌగోలిక ప్రాంతాలని ( దాదాపు మన దగ్గర రిజర్వుడు ఫారెస్టు లాగా అని ) అర్థం కదా. లేకపోతే, మనదగ్గరి రిజర్వేషన్లలాంటివి అని అనుకునే గందరగోలానికి అవకాశం ఉంది.

  3. ఆమ్ ఆద్మీ సెప్టెంబర్ 2007 3

    చాలా బాగుంది.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో