పాటే నా ప్రాణం – సుద్దాల అశోక్ తేజతో ఇంటర్‌వ్యూ – 1

తెలంగాణ ముద్దు బిడ్డ, తెలంగాణ పాటకు మకుటం లాంటి వాడు, సుద్దాల అశోక్ తేజ తానా మహాసభల కోసం అమెరికా వచ్చిన సందర్భంగా ఆయన పాటల నేపథ్యాన్ని, అనుభవాల్నీ, జీవన యాత్రనూ, సాహితీ యాత్రనూ, అద్భుతమైన కవిత్వం నిండిన అతని పాటల జలపాత పుట్టుక రహస్యాలను తెలుసుకోవడానికీ, కష్ట జీవుల జీవితం ప్రతిబింబిస్తూ, పద పదానా శ్రమ గొప్పతనాన్నీ, శ్రమైక జీవన సౌందర్యాన్నీ చాటే అతని పాటల జీవనాడిని పట్టుకోవడానికి ‘ప్రాణహిత’ ఆయనతో ముచ్చటిస్తున్నది. ప్రజల సాహిత్యానికి, ప్రజల ఆకాంక్షలకూ ప్రాణహితను వేదికగా చేయదల్చుకున్న మేము సుద్దాల అశోక్ తో ముచ్చటించేందుకు మాకు దొరికిన ఈ అపూర్వ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆయనతో మా సంభాషణను మీకందిస్తున్నాము. తెలంగాణ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించి తన పాట ద్వారా అత్యంత బలమైన ప్రభావాన్ని నెరపిన సుద్దాల హన్మంతు పుత్రుడు అశోక్ తేజ తన తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని అద్భుతమైన పాటలకు ప్రాణం పోస్తూ సాహితీ యాత్ర కొనసాగిస్తున్నారు. ఆయన తో మా ముచ్చట్లు ఇవీ:

ప్రాణహిత: అశోక్ తేజ గారూ! నమస్కారం! ప్రాణహిత తరఫున మీతో ముచ్చటించడానికి వచ్చాము. మాకు ఈ అవకాశం కలిగినందుకు మాకు చాల ఆనందంగా ఉంది. ముందుగా మీ గురించి, మీ బాల్యం, కుటుంబం, నేపథ్యం గురించి వివరిస్తారా!

అశోక్ తేజ: నమస్కారం! నాక్కూడా మీతో మాట్లాడే అవకాశం దొరికినందుకు చాల సంతోషంగా ఉంది!
మా నాన్న సుద్దాల హన్మంతు, అమ్మ జానకమ్మ. ముఖ్యంగా, నైజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 1944 లో రావి నారాయణ రెడ్డి అధ్యక్షతలో 11 వ ‘ఆంధ్ర మహాసభ’ భువనగిరిలో జరిగింది. దానికి నాన్న వాలంటీరు గా పనిచేయడంతో ఆయన ప్రజా జీవితం ప్రారంభమైంది. నాన్నకు చిన్నప్పటినుండీ పాటలు, కళలు అంటే చాలా ఇష్టం. అందువల్ల ఆయన తన పోరాటంలో పాటనే ప్రధాన ఆయుధంగా చేసుకున్నారు. ఆ రోజుల్లో జానపద కళారూపాలకు ప్రజల్లో విపరీతమైన ఆదరణ విస్తారంగా ఉండేది. నాన్న ఆయా రూపాలని, వాటి మీద ప్రజలకున్న ఆత్మీయత ఆప్యాయత లను అవగాహన చేసుకున్నారు. తాను చెప్పదల్చుకున్న పోరాట అంశాల్ని, తిరుగుబాటు ఇతివృత్తాన్ని ఆ రూపాల్లో చెపితే ప్రజలకు సులువుగా చేరుతుంది అని అవగాహన చేసుకున్నారు. దానికోసం ఆయన చాల హోమ్ వర్క్ చేసారు. అనేక జానపద కళాకారులని స్వయంగా కలిసి, వారితో మాట్లాడి, వారు ఆ పాటలని ఎలా అల్లుకుంటారు, ఎలా దాన్ని రూపొందిస్తారు, వారి వేషాలకు ఏయే దుస్తులు వాడుతారు, ఎట్లా అలంకరించుకుంటారు, రుమాళ్ళెలా కట్టుకుంటారు, గజ్జెలెలా వేసుకుంటారు, ఏయే సంగీత పరికరాలు, వాయిద్యాలు వాడుతారు – ఇట్లా వారి కళల గురించి ఒక్కో అంశాన్ని స్వయంగా వారితో గడిపి, సునిశితంగా పరిశీలించి ఒక పరిశోధనలా, ఒక రీసెర్చిలా చేసి నాన్న నేర్చుకున్నారు. తాను సృష్టించిన ప్రతి జానపద కళా రూపంలో తాను నేర్చుకున్న అంశాల్ని జోడించి, వాళ్ళనే, ఆ ప్రజా కళాకారులనే తన గురువులుగా స్వీకరించి తన పాటల్లో, కళారూపాల్లో తాను నేర్చుకున్నది ప్రతిబింబించారు. ప్రజలకర్థమయ్యే భాషలో రాసి, స్వయంగా పాడి, ఆడి ప్రదర్శించేవారు. నాకు తెలిసి (పెద్దలంగీకరిస్తారో లేదో కానీ) మొట్ట మొదటి తెలంగాణ జానపద ప్రజా వాగ్గేయకారుడు నాన్నే అని నేను చాల ధైర్యంగా చెప్పగలను. వాగ్గేయకారుడంటే తానే రాసి, తానే ట్యూన్ కట్టి తానే పాడి, తానే అభినయించి స్వయంగా ప్రదర్శించే వాడు. మా అమ్మ నాన్నకు బాగ తోడుగా ఉండేది. ఇట్లా ఆయన తెలంగాణ పోరాటంలో పాల్గొన్నాడు. అది చరిత్ర..

నేను మా నాన్నకు బాగా లేట్ గా పుట్టాను. అంటే మా నాన్నకు 50 వ యేట నేను పుట్టాను. నేను 24 ఏండ్లు వచ్చే సరికి నాన్న చని పోయారు. మా అమ్మ చెప్పేది – ఏంటమ్మా ఇట్లా అంటే – ‘అప్పుడు పిల్లలు వద్దనుకున్నములే నాయిన మేము – ఉరుకులు పరుగులు కదా – పోలీసోల్లొస్తే ఎక్కడ ఉరుకాలే? వాళ్లు గుర్రాల మీద వస్తే ఎక్కడోల్ల మక్కడ గప్ చుప్ అయిపోయి వాళ్లకు దొరుకకుండా గిద గిద ఉరికిపోయి, ఎక్కడ బడితే అక్కడ, గడ్డి వాములల్లనో ఎక్కడో దాక్కుని ఉండాల్సిన పరిస్థితి నాయిన – ఆ పరిస్థితుల్లో పిల్లలు కనడం కరక్ట్ కాదనుకున్నం.’ నాన్నెప్పుడు చెప్పలే ఆ విషయం. అయితే పోరాటమయిపోయి, స్వతంత్రమొచ్చి – అంటే పోరాట విరమన అయ్యాక ఎవరి ఊర్లకు వాళ్ళు పోయాక, పార్టీలో, ప్రజాసంఘాల్లో పని చేసిన కళాకారులు, కవులు మద్రాసు కు వెళ్ళిపోయారు. సినిమా రంగంలో చేరడానికి. ఒక ఆత్రేయ గానీ, ఒక మిక్కిలినేని గానీ, వరలక్ష్మి గానీ అట్లా వెళ్ళిపోయినవారే! నాన్న మాత్రం అట్లా వెళ్ళ కుండా ఏ కేంద్రంగానైతే పోరాటం ప్రారంభించాడో అదే సుద్దాల కేంద్రంగా జీవితం ప్రారంభించారు. సుద్దాలలో ఆయన ఆ రోజులలో ఆయుర్వేద వైద్యుడుగా, ప్రత్యేకంగా పరీక్ష పాసయి ప్రాక్టీసు ప్రారంభించారు. అమ్మ కుట్టు మిషన్ కుట్టేది. తను కూడా కుట్టేవాడు. ఇలా రెండు వృత్తులెన్నుకుని మా వూళ్ళో జీవితం గడిపే వారు. ఆ తరువాత నేను లేటుగా పుట్టడం జరిగింది. నాకు ఊహ వచ్చినప్పటినుండి, మా నాన్న విపరీతంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వాడు. ఎక్కడ సభ ఉందన్నా గానీ, అసలు సుద్దాల హన్మంతు బుర్రకథ దళం లేకుండా, పాటల కార్యక్రమం లేకుండా ఆ రోజుల్లో సభలు జరిగేవే కావంటే అతిశయోక్తి కాదు. అప్పుడు రావి నారాయణ రెడ్డి గారికి నెహ్రూ కన్నా ఎక్కువ వోట్లు రావడానికి కారణం సుద్దాల హన్మంతు పాట బలంగా పని చేసిందని ఆ రోజు పేపర్లు ప్రముఖంగా రాసాయి. నాన్న భాగస్వామ్యం అలా ఉండేది. నాన్న కోసం అమ్మ రోజూ ఎదిరి చూస్తూ ఉండేది. నాన్న అటు వెళ్ళాడ్రా ఇటు వెళ్ళాడ్రా అంటూ ! ఇదీ నాకు తెలిసిన బాల్యం.

ఇంక పోతే ఆర్థిక పరిస్థితి చాలా పేద వాళ్లం. చాలా పేదరికం. అప్పుడు ఒక షర్టు కుడితే మహా అంటే ఒక రూపాయి లేదా ఆఠాన దొరికేది. ఆ పేదరికం లోనే మా బాల్యం గడిచింది. నాకు టెంత్ క్లాస్ వచ్చేదాక చెప్పులు లేవు. పాంట్లు కూడా వేసుకోలేదు. అయితే ఆర్థిక పరిస్థితి ఇంత దుర్భరంగా ఉన్నా ఇంట్లో ఎప్పుడూ ఆ తాలూకు విషాదం కన్పించేది కాదు. అది నాకు బాగ ముచ్చటేసేది. నాన్న సాయంకాలం కాగానే ఎందుకయినా మూడ్ ఆఫ్ అయి ఉంటె అమ్మ ‘హార్మోనియం ఉంది కదా – దాని ముందు పెట్టుకోని కూర్చో వచ్చు కదా’ అనేది. ఇంక మా నాన్న తాను పాడుతూ, మా అమ్మ గొంతు కలుపుతూ, పిల్లలతో పాడిస్తూ, ఇంటి పక్కల వాళ్ళంతా చేరి పాడుతూ నిత్యం మా ఇల్లు ఒక పాటల పల్లకీ లా ఉండేది. ఆ రోజు మేము తిన్నం గని నాన్న తిన్నడా అమ్మ తిన్నదా అనే విషయం మాకు తెలియకుండా గడిచేది. అంతే కానీ ఎక్కడా పేదరికంతో ఉన్నం అనీ, ఇబ్బందిగా ఉందనీ, ఇంట్లో విషాదం ఉందనీ, ఊరికే దాని గురించి ఆలోచిస్తూ ఉండడం అనేది ఎప్పుడూ లేదు. అట్లా నా బాల్యం గడిచింది. ఈ బాల్యంలోనే – ఇంట్లో ఎప్పుడు కొత్త పాట వచ్చినా నాన్న ముందు అమ్మకు విన్పించే వాడు. తర్వాత మా ఊళ్ళో పార్టీ సహచరులకు వినిపించే వాడు. మూడు సార్లు ఎం. ఎల్. ఏ గా చేసిన గుర్రం యాదగిరి రెడ్డి కూడా మా వూరే. ఆయన మా నాన్న సహచరుడే! అట్లా ఆయన పాట ఊరంతా ప్రవహించేది. ఇంకోటి ఏంటంటే ఊళ్ళోకి ఎటువంటి కళాకారులొచ్చినా., ఏ కళకు సంబంధించిన వారైనా – హరికథ అయినా భాగవతులయినా – మా ఇంట్లోనే వసతి. ఊళ్ళో ఎవరు పట్టించుకోక పోయినా, మా నాన్నే తనకున్నంతలో వాళ్లకు భోజనం పెట్టించడం, వాళ్ళున్నన్ని రోజులు మా ఇంట్లోనే ఉంచుకోని, వాళ్లతో కళా రూపాలు మాట్లాడడం, వారితో పాడించడం, వాళ్ళేదన్నా చేస్తుంటే ఊరు తిరిగి సహాయం చేయడం చేసే వాడు. తర్వాత ఊళ్ళోకి ఏ పెద్ద నాయకుడు వచ్చినా తరిమెల నాగిరెడ్డి గారు కానీ, రావి నారాయణ రెడ్డి గారు కానీ, ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు కానీ, సుందరయ్య గారు కానీ, ఎవరొచ్చినా మా ఇంట్లో నే అడ్డా! వాళ్ళకు భోజనాలు కానీ, వసతి గానీ అంతా మా ఇంట్లోనే! మా నాన్నకు ఒక మంచి అలవాటు ఏంటంటే ఎంత పెద్ద వారు వచ్చినా, ఎంత సీరియస్ డిస్కషన్ అయినా సరే నాకు ఏమీ అర్థం కాక పోయినా సరే నన్ను వొళ్ళో కూర్చో బెట్టుకునే వాడు. అది నా మీద ఎత ప్రభావం కలగజేసిందంటే నాకు తెలియకుండానే సమాజం నాలో ప్రవేశించింది. నా ప్రమేయం లేకుండానే, నేను తలుపులు తీయకుండానే ప్రపంచం నా గుండె లోపలికి వచ్చేసింది.

ఇది మా నాన్న చాల గొప్ప గా, చాల తెలివిగా చేసాడు. ఏదో ప్రత్యేకంగా పిలిచి చెప్పకుండా, ‘నాన్నా ఇటు రా నాన్నా! ఇట్లా కూర్చో! మామయ్యకు నమస్కారం పెట్టు!’ అంటూ తమ మధ్య కూర్చోబెట్టుకోవడం, మధ్యలో నేను ఆడుకోడానికి పోజూస్తుంటే ‘రా నాన్నా ఇట్ల కూర్చో’ అంటూ కూర్చో బెట్టుకునే వాడు. తద్వారా నాకు వినడం అలవాటయింది. మా నాన్న అట్లా ఒక వాతావరణం సృష్టించాడు. ఇట్లా నా బాల్యం గడచింది. అప్పుడే నేను తొమ్మిదేళ్ళ వయసులోనే ‘వినవే పేదల గాథా చల్లారదు ఆకలి బాధా!’ ధగ ధగ లాడే జండా నిగ నిగ లాడే జండా!’ అంటూ నా మొదటి పాట పల్లవి రాసాను. మా అమ్మ చెప్పింది ‘వాడొ పాట రాసిండయ్యా’ అని – అప్పుడు మా నాన్న వెంటనే వినకుండా వూళ్ళో ఉన్న ముఖ్యమైన వాళ్ళను పిలిచి వారికి టీ ఏర్పాటు చేసి ‘మా వాడొక పాట రాసాడు మీరందరూ వినాలె’ అని అందరికీ వినిపించాడు. దానికో సీరియస్ నెస్ తీసుకొచ్చాడు. నేనేదో నాలుగు ముచ్చట్లు రాస్తే ఇంత ప్రాముఖ్యత ఉన్నదా అని నాకు అనిపించేలా చేసాడు. అంటే దీనిలో ఒక గౌరవముంది, ఒక గుర్తింపు ఉంది అని నాకు తెలిసేలా చేసాడు. అప్పుడు నేను పాడగానే వాళ్ళంతా చప్పట్లు కొట్టారు. అప్పటి ఆ చప్పట్ల శబ్దం ఇప్పుడు ఏ చప్పట్ల శబ్దం విన్నా మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తాయి. ఆ చప్పట్లు నన్ను వెంటాడుతున్నై. ఆ చప్పట్లు నన్ను ఇక్కడిదాకా తీసికొచ్చినయి. ఇట్లా నాకు పాట మీద ప్రేమ పుట్టించాడు మా నాన్న! తర్వాత నిర్మాణాత్మకంగా నన్ను చదువువైపు మళ్ళించాలని ఒక పెద్ద గిన్నె తెప్పించి దానిలో ఒక చిన్న గ్లాసులో నీళ్ళు తీసుకొచ్చి దానిలో నింపమన్నడు. నేను ఒక గ్లాసు పోసి మళ్ళోటి తీసుకునిరావడానికి వెళ్తుంటే ‘కాదు కాదు ఈ గ్లాసు నీళ్ళతోనే నింపాలే’ అన్నడు. ‘అట్లెట్ల నిండుతది’ అని నేనంటే ‘మరి ఎట్లయితే నిండుతది’ అని అడిగిండు. ‘ఓ! ఇంత పెద్ద గోళెం నిండ నీళ్ళయితే దానితోటి నింపొచ్చు’ అని నేనన్నాను. ‘మరి అందుకే చిన్న గ్లాసుతోటి నింపలేము కాబట్టి నువ్వు పెద్ద గోళెం నిండా నీళ్ల లాగా పెద్ద పెద్ద చదువు చదివితే అప్పుడు మంచి మంచి పాటలు రాయొచ్చు.’ అని ‘ఇంట్ల చూడు ఎన్ని పెద్ద పెద్ద పుస్తకాలున్నయో చూడు వాటన్నిటినీ చదివితే ఇంకా పెద్ద పాటలు రాయొచ్చు’ అని చెప్పాడు. అట్లా గ్రంథాలయాల దండయాత్ర నా మెదడు లోపల ప్రారంభం చేసాడు మా నాన్న! అమ్మ కూడా ఎంత చేసేదంటే ఆమె మిషన్ కుట్టుకుంటూ నాతోటి శరత్ సాహిత్యం చదివించేది. టాగోర్ సాహిత్యం చదివించేది. నా కర్థం అయ్యేదని కాదు. నేను చదివితే ఆమె వినేది. అది క్రమేణా ఎట్లా పరిణమించిదంటే ఒక వేళ మా అమ్మ మర్చిపోయినా కూడా, నేనే మా అమ్మ తో ‘అమ్మా ఆ పుస్తకం అక్కడ ఫలానా చోట ఆపేసాం కదా – మళ్ళా మొదలు పెడదామా అమ్మా!’ అనే వాణ్ణి. ఇట్లా అమ్మ చేసిన తెలివైన పని పుస్తకాల పట్ల విపరీతమైన అనురక్తి కలిగించడం. ఇట్లా అమ్మా నాన్న ల యొక్క భిక్ష నా ఇవాళ్టి ఈ స్థితి. ఇక్కడికి ఈ స్థితికొచ్చానంటే అమ్మా నాన్న లు పెట్టిన భిక్షనే!

నేను స్కూలుకెళ్తున్న రోజుల్లో ఒక నాడు మా టీచర్ మిల్టన్ రాసిన పద్యం ఒకటి పాఠం చెప్పారు. భిక్షం రెడ్డి సార్ అని చాల మంచి టీచర్ – కళ్ళు లేనప్పుడు కవి ఎట్లా ఫీలయ్యాడు అని చాల బాగా చెప్పాడు ఆ పద్యం. దాన్ని ఒక పాటలా మార్చి టీచర్కు వినిపిస్తే ఎట్లా ఉంటది అని ఆలోచన వచ్చి ‘కళ్ళు తెరిచి చూడలేను గళము విప్పి పాడగలను గుడ్డి వాణ్ణి నేను’ అని పాట రాసుకెళ్ళి స్కూళ్ళో చదవడం నా రెండో పాట. దానితో ఆ టీచర్ వెళ్ళి హెడ్మాస్టర్ ని స్టాఫ్ ని అందరినీ పిల్చుకుని వచ్చి ‘నేను పాఠం చెప్పడమేమిటి, వీడు దాన్ని యథాతథంగా ఒక్కటి కూడా పాయింట్ మిస్ కాకుండా పాట గా రాయడమేమిటి? చరణాలుగా రాసుకొచ్చాడు. వీడికసలు ఇది చరణమని ఇది పల్లవి అని ఎట్లా తెలుసు? ’ అని సంభ్రమాశ్చర్యాలు ప్రకటించాడు. నిజానికి నాకూ తెలియదు. ఊరికే పాట రాసుకోని పోయిన. మా ఇంట్లోనుండి వచ్చిన కశిపి ఉందే, వృత్తి ఉందే – పాటలు రాసే వృత్తి అదే నేర్పించింది. ఇది పల్లవి అని ఇది చరణమని అదే నేర్పించింది. అదే అందరితో నాకు చప్పట్లు కొట్టించింది. ప్రతి స్పందనని పాటగా మార్చుకోవచ్చు అనే ఒక నైజం ఒక అభ్యాసం ఒక నైపుణ్యం నాకు అమ్మ నాన్నల వల్ల నా చుట్టూ వారు కల్పించిన వాతావరణం వల్ల పరిసరాల ప్రభావం వల్ల నాకు వచ్చింది.

నేను ఎనిమిదో తరగతిలో ఫేయిల్ అయ్యాను, మళ్ళీ పదవ తరగతిలో ఫేయిల్ అయ్యాను. నేను చదువులో బాగా వీక్ స్టూడెంట్ని. పెద్ద బ్రిల్లియంట్ కాదు. చదువు మీద పెద్ద ఇష్టం ఉండేది కాదు. అట్లే శారీరకంగా కూడా నేను బాగా బలహీనున్ని. స్కూల్ లో క్లాస్ లో అందరికన్నా బలహీనంగా ఉండే వాణ్ణి. మా అమ్మ నాన్న ‘వీడు ఎక్కువ కాలమైతే బతకడు’ అనుకునే వారు. అంత బలహీనంగా ఉండే వాణ్ణి. అంత గారాబం కూడా ఉండేది. మా నాన్న ఊరూరా తిరిగి ఆయుర్వేద వైద్యం చేస్తూ సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఇంటి వైపు ఒక చెవి వేసి వినే వాడట. మా అమ్మ ఏడ్పు ఏమైనా వినబడుతుందేమో నని. ఏడ్పు వినబడితే వీడు పోయి ఉంటడు. ఏడ్పు వినబడక పోతే వీడికేమీ కాలేదని ఊపిరి పీల్చుకునే వాడు. అంత భయం భయంగా బతికాను నేను. నన్ను బతికించుకున్నారు అమ్మా నాన్నలు! అంత బలహీనుణ్ణి కాబట్టి మా స్కూల్లో నాన్న అందరు టీచర్లకు నన్ను కొట్టొద్దు తిట్టొద్దు అని చెప్పేవాడు. దానితో స్కూల్లో ఏ ఆటలో కానీ నన్ను పాల్గోనిచ్చే వారు కాదు. కబడ్డి ఆడతానంటే ‘ఇంకేమన్నా ఉందా! నీకేమన్న అయితే? కాలో చెయ్యో విరిగితే? మీ నాన్న వచ్చి మమ్మల్ని ఏమన్న అంటే?’ అంటూ దగ్గరికి కూడా రానిచ్చే వారు కాదు. మా నాన్న అంటే మంచి గౌరవం ఉండేది. పంద్రా ఆగస్టు నాడు పిల్లలందరూ రకరకాల ఆటల్లో ప్రైజులు తీసుకుంటుంటే నేను విపరీతంగా బాధ పడే వాణ్ణి. ఫైర్ తో రగిలి పోయే వాణ్ణి. హెడ్మాస్టర్ దగ్గరికి పోయి నాకు ఒక్క ప్రైజు కూడా రాలేదని ఏడిస్తే ‘ఒక్క ఆట కూడా ఆడక పోతివి నీకెట్ల ఇచ్చేదిరా ప్రైజు?’ అనే వాడు. ‘అందరు వెళ్ళి స్టేజి మీద ప్రైజు లు తీసుకుంటుండ్రు. నాకు ఒక్కటి కూడా రాలేదు’ అని మా నాన్న దగ్గరపోయి విపరీతంగా ఏడ్చాను. మా నాన్న దగ్గరికి తీసుకుని ‘చూడు నాన్నా నువ్వు ప్రైజులు ఆటలు ఆడే తీసుకోనక్కరలేదు. పాట పాడి తీసుకోవచ్చు, ఉపన్యాసమిచ్చి తీసుకోవచ్చు, వ్యాసం రాసి తీసుకోవచ్చు, వేషం వేసి తీసుకోవచ్చు’ అలా భౌతిక సంబంధమైన వాటిల్లో కాకుండా బౌద్ధిక సంబంధమైన వాటిల్లో పాల్గొని బహుమతులు పొందొచ్చు అని నాన్న చెప్పగానే ఇంక నేను వెయ్యి ఏనుగుల బలంతో నా శక్తి నంతా అటువైపు కేంద్రీకరించాను. ఇంక అప్పటినుండీ లలిత కళల్లో ఏ ప్రైజు అయినా నాకు రాకుండా ఇంకొకళ్లకు పోలేదు. మా హెడమాస్టర్ ‘ఈ అన్ని ప్రైజులు అశోక్ కిస్తే అయిపోతది కద, అనవసరంగా ఈ పోటీలు ఎందుకు, మూడు రోజులు దానికి కేటాయించడం, ఒక సారును వాటికి ఇంచార్జి చేయడం, ఈ నెత్తి నొప్పి అంతా ఎందుకు’ అనే వాడు.

తర్వాత టెంత్ ఫేయిల్ అయ్యాను. మళ్ళీ పరీక్ష రాసి పాస్ అయిన. పేదరికం అలా వెంటాడుతూనే ఉంది. ఇంటర్మీడియట్ చదవాలి. డబ్బుల్లేవు. చదువుకోవాలని బాగ ఇష్టం ఉంది. టెంత్ మొదటి సారి రాసి ఫేయిల్ అయ్యి తర్వాత పరీక్ష రాసి పాస్ అయ్యాక నా ఆలోచన చదువు వైపు మళ్ళింది. మనమెందుకు ఫేయిల్ అవుతం. మనమెందుకు తక్కువ ఉండాలే దీనిలో. చదువుల కూడా ఇంటరెస్టు తీసికొంటే బాగ చదవొచ్చు కదా అనే ఆలోచన మొదలయ్యింది. దానికి తోడు నాకు హైదరాబాదు కు పోవాలి అనే పెద్ద కోరిక ఉండేది. హైదరాబాదుల చదువుకోవాలని పెద్ద ఇష్టం. అమ్మ కు చెప్తే అమ్మ నాన్నకు చెప్పింది. ‘ఎట్లరా’ అన్నడు నాన్న. అమ్మ దగ్గర కమ్మల జత, కడియాలు ఉండె. అవి రెండు తీసికొచ్చి నా కిచ్చింది. అందుకే నేనో పాటలో రాసిన.
‘కడియాలు కమ్మలమ్మి కొడుకుల చదివించినాను
మంచంలో ఉండి వాళ్ల మంచి చెడ్డ చెప్ప పోతే
ఆడోళ్ళకు తెల్వదే మమ్మీ
అని లెక్కే చెయ్యరైరి
ఆడిదాన్నిరో నేను ఆడి దాన్ని
ఈడ ఎవ్వరికి కాని దాన్ని నేను ఏడి దాన్నిరో’
అని రాసి నప్పుడు ఈ కడియాలు కమ్మలు అనేవి మా అమ్మ నాకిచ్చినవే. అంటే ఒక రచయిత తన జీవితాన్నే తన రచనకు సబ్జక్టు గా మార్చుకుంటడు అనే దానికి ఉదాహరణ– మీ రన్నారు కద ఒక రచయిత తన జీవితాన్ని తన రచనలో ప్రతిఫలిస్తే గొప్ప ఫైర్ ఉంటుందని – అది స్పష్టంగా చూడొచ్చు నా అనేక పాటల్లో. ఆ మొత్తం అమ్మితే నాకు నూటపదో నూట ఇరవయ్యో రూపాయలు వచ్చినయి. అవి తీసుకోని హైదరాబాదుకు వచ్చేసిన.

ప్రాణహిత: మీ బాల్యం మీ నేపథ్యం మాకు కంటతడి పెట్టించింది – రచనలు చేయడం మీ వృత్తా, ప్రవృత్తా, ఈ ప్రక్రియ తో సంబంధం లేకుండా మీరుండ గలరా?

అశోక్: ఉహూ! నా శరీరం లేకుండా నేనుండగలనేమో కానీ నా పాట లేకుండా నేనుండలేను. పాట నా ప్రాణమే. మరోటి కాదు. ఇప్పటికీ నన్ను నా జీవితాన్ని సమీక్షించుకున్నప్పుడు పాటే వస్తది. నేను అనేక సార్లు మీ లాగా వచన కవిత్వం రాయాలని మొదలు పెడత. అది పల్లవై కూర్చుంటది. ఇంక నేను నిర్ణయించుకున్న. ఇంక నాకు రాదు ఈ వచన కవిత్వం. నా వల్ల కాదని. రాని దానిగురించి ఎందుకు కష్టపడాలె. పాటకే ఈ జీవితం సరిపోదు కదా – ఇంక వచన కవిత్వం ఎందుకు? అని పాటకే అంకితమయ్యాను. కాబట్టి పాటే నా సర్వస్వం.

ప్రాణహిత: మీరు మీ నేపథ్యం గూర్చి మాట్లాడుతూ మీ నాన్నగారు మీ అమ్మ గారు మిమ్మల్ని ప్రభావితం చేసారన్నారు కదా! అట్లే ఇంకా మీ రచనలని మిమ్మల్ని ఇంకేమన్నా ప్రభావితం చేసినయా? వాటి గూర్చి చెప్తారా?

అశోక్: నాకు పాట మీద నాన్న తర్వాత విపరీతమైన ఆసక్తి కలిగించిన రచయిత డా. సి.నారాయణ రెడ్డి. దానిలో సందేహం లేదు. ఎప్పుడయితే ఇంట్లో పుస్తకాలు చదవడం మొదలయ్యిందో నాకు బాగ నచ్చిన రచయిత చలం. చలం పుస్తకాలన్నీ చదివాను. టెంత్ లోపల అన్నీ చదివాను. మళ్ళీ బాగా ఎదిగిన తర్వాత మళ్ళీ మొత్తం చదివాను. ముందు అర్థమయ్యీ అర్థం కానట్టున్నా తర్వాత తర్వాత బాగ అర్థం అయినయి. తర్వాత మరో రచయిత శరత్. ఆయన సాహిత్యం కూడా మొత్తం చదివాను. తర్వాత లత అని ఇంకో రచయిత్రి ఉండేది. తేన్నేటి హేమలత. ఆమె పుస్తకాలు కూడా నన్ను విపరీతంగా ప్రభావితం చేసినయి. నాకు ఇప్పటి దాక వచ్చిన అవార్డులన్నీ కూడా, ఈ పదమూడేళ్ళ సినిమా జీవితంలో పదమూడు పద్నాలుగు అవార్డులు (నేషనల్ అవార్డు తప్ప) వచ్చినయి కదా – అన్నీ స్త్రీల గురించి రాసిన పాటలకే వచ్చినయి. కాబట్టి అంత బాగా స్త్రీ హృదయంతో మమేకమై రాసే లక్షణం నాకు రంగనాయకమ్మ, లత, చలం – వీళ్ళ రచనల వల్లనే వచ్చింది. ముఖ్యంగా చలం. చలం మాటలో ఉండే మంట నన్ను బాగా ప్రభావితం చేసింది. మాట ఇంత బలంగా ఉంటుందా అని చలం ను చదివితే అనిపించేది. అట్లే శ్రీ శ్రీ. శ్రీ శ్రీ గురించి ఒక విషయం చెప్పలే. నాకు ఇంకా అక్షరాలు రాక ముందు రాయడం చదవడం రాక ముందు మా నాన్న నాతో మహా ప్రస్థానం మొత్తం బట్టీ వేయించిండు. నేను తొలుత స్కూలు కెళ్ళినప్పుడు మా టీచర్ పిల్లలని ‘మీకేమన్నా పద్యాలొస్తే పాడమని’ అడిగినప్పుడు మిగతా పిల్లలు ‘చేత వెన్న ముద్ద’ లాంటి పద్యాలు పాడుతుంటే నేనేమో మా టీచర్ ఇంక వద్దురా ఆపురా బాబూ అనే దాక మహా ప్రస్థానం గడ గడ అప్పచేప్పేసాను. ఆయనకేమో తెలియదది. ఆయన ఆశ్చర్యంగా ‘వీడొచ్చి అదేదొ చదువుతుండయ్యా భలే ఉందది, ప్రపంచం ఊగిపోతున్నట్టుంది, వీడు ఒకటే ఊగిపోతూ వినిపిస్తున్నడు. ఏందది’ అని టీచర్ అంటే మా నాన్న అది శ్రీ శ్రీ మహాప్రస్థానం వీడికి మొత్తం నోటికొచ్చు అన్నాడు. అట్లా నాలోకి నాకు తెలియకుండానే శ్రీ శ్రీ వచ్చేసాడు. దాసరి నారాయణరావు గారు నేను ‘ఒసే రాములమ్మ’ కు పాటలు రాసినప్పుడు ఎవరితోనో ఫోనులో మాట్లాడుతూ ‘ఇండస్ట్రీకి ఓ బుల్లి శ్రీ శ్రీ ని తెచ్చాను మీకు తెలుసా? వాడి పేరు సుద్దాల అశోక్ తేజ’ అన్నారు. అట్లా అంతగా శ్రీ శ్రీ నన్ను ప్రభావితం చేసాడు. అయితే పుస్తకాలు విపరీతంగా అలవాటు అయ్యింది కాబట్టి నేను చాల విస్తృతంగా చదివా! నన్నయ నుండి నారాయణరెడ్డి దాకా, కందుకూరి వీరేశలింగం నుండి యండమూరి దాకా చదివా! కనబడ్డ ప్రతిది చదివి వదిలేసే వాణ్ణి. అది ఎట్లున్న సరే మంచిగున్న చెడ్డగున్న చదవకుండా ఉండలేను. ఇప్పటికీ ఏదయినా పుస్తకం దొరికితే చదవకుండా ఉండడం సాధ్యం కాదు. అట్లా కృష్ణశాస్త్రి, శ్రీ శ్రీ ఒక వైపు, చలం, లత, శరత్ మరో వైపు – శరత్ సాహిత్యం అంటే ఏముంది – గంపెడు పాద ధూళి, కడివెడు కన్నీళ్ళు అంటారు కదా. ఆ కడివెడు కన్నీళ్ళ గురించి పూర్తిగా తెలుసు, గంపెడు పాదధూళి గురించీ పూర్తిగా తెలుసు – అసలు శేషప్రశ్న లో కమల అనే పాత్ర అంటుంది తాజ మహల్ ని చూస్తూ ‘మహత్తర కళా ఖండాలన్నీ మానవుల హాహా కారాల నుండే ఉద్భవించినయి కావచ్చు’ అని. ఆ మాట నేను విని ‘శ్రీ శ్రీ కన్న ముందే శరత్ ఇట్లా అన్నాడు కదా’ అని మా నాన్నతో వాదించే వాణ్ణి. అందుకు మా నాన్న ‘అది తర్జుమా రా! అనువాదం అది! బెంగాలీ లోంచి తెలుగులోకి అనువాదం చేసేటప్పుడు అనువాదకుడు శ్రీ శ్రీ ని చదువుకుని ఉండడం వల్ల అలా అన్నాడు కానీ శ్రీ శ్రీ నే ముందు 1930ల్లో అన్నాడు రా!’ అనే వాడు. దానికి నేను ‘లేదు లేదు ఇది అన్నది గ్రేట్ శరత్ చంద్ర నే’ అని వాదించే వాడిని. అట్లే ప్రేంచంద్ నన్నెంతో ప్రభావితం చేసాడు – ‘గుడ్డి కళ్ళు చూడలేవు కానీ ఏడవగలవు’ – అంటే చిన్నప్పుడు ఎప్పుడో చదివిన పుస్తకాల్లో వాక్యాలకు వాక్యాలు ఇప్పటికీ గుర్తున్నయి అంటే అవి ఎంత ప్రభావితం చేసాయో మీరు అర్థం చేసుకోవచ్చు. ‘విధి కీ విధాతకూ విడదీయరాని ఆత్మీయతకూ, విశ్వ చలనానికీ మూలాధారం స్త్రీ’ అని లత రక్తపంకం అనే నవల ప్రారంభిస్తుంది. ఇట్లా పుంఖాను పుంఖాలుగా చదివాను. జ్ఞాపకముండేది కూడా!

ప్రాణహిత: అట్లే సామాజిక ఉద్యమాలు ఏవయినా మీకు స్ఫూర్తినిచ్చాయా?

అశోక్: సామాజిక ఉద్యమాలంటే ఇల్లంతా ఉద్యమంతో కూడుకున్నదే కదా! ఇంటికొచ్చే ప్రతి వాళ్ళూ ఆనాటి చరిత్ర ఘట్టాలు ఘట్టాలుగా చెప్పే వారు. మా వూరు పక్కనే వెర్మజాల లో గంట పాపిరెడ్డి అనే ఆయనను కాల్చి చంపేసారు. ఇంకో చాకలి ఐలయ్య అనే అతను ఒక్కడే తుపాకి పట్టుకోని ఊళ్ళోకి మొత్తం పోలీసోళ్ళని రాకుండా ఆపిన ఘట్టం మా నాన్న వీరోచితంగా చెప్పే వాడు. అట్లాగే ఆయనను ఏమీ చెయ్యలేని కక్షతో ఆ ఊరిని మొత్తం తగల బెట్టారు పోలీసోళ్ళు. తర్వాత ఆడవాళ్ళను నగ్నంగా చేసి బతుకమ్మ ఆడించిన సంఘటనను మా అమ్మ ఏడుస్తూ అద్భుతంగా హృదయానికి హత్తుకునేలా చెప్పేది. ఇవన్నీ ఈ ఉద్యమాలన్నీ, కొన్ని వినికిడిగా కొన్ని ప్రత్యక్షంగా – మా వూరులో, వూరు చుట్టూ ఉన్న దొరలు మా నాన్న మీద కక్ష కట్టి మా ఉన్న ఒక్క ఎకరం పొలాన్నినాశనం చేయడం, పంట చేతికి రాంగానే మొత్తం కొల్లగొట్టడం – ఇట్లా అనేక విధాలుగా మమ్మల్ని కక్ష సాధించేవాళ్ళు. చివరికి మా ఒక్క ఎకరం పాడు చేసినందుకు బదులుగా నాన్న పార్టీ వాళ్ళను, ప్రజలని ఆర్గనైజ్ చేసి రెండువందల ఎకరాల దొర పొలాలపై దాడిగా తిప్పికొట్టడంతోటి ఆ దొరల ఆగడాలు ఆగినయి. ఇవన్నీ నేను ప్రత్యక్షంగా పాల్గొన్నాను. చిన్న వాడినే కావచ్చు కానీ నా కళ్ల ముందు నా జీవితంలో భాగంగా జరిగిన ఉద్యమాలవి. అర్ధ రాత్రి దొరల పొలాలమీద ప్రజలు చేసిన దాడిలో పాల్గొన్నాను. ఇదే క్లైమాక్స్ గా వెలుగు రేకలు అనే నవల రాసాను. నా రెండొ పుస్తకంగా అచ్చయిందది. ఉద్యమ నేపథ్యం, ఉద్యమ జీవితం నా రచనల మీద బ్రహ్మాండమైన ప్రభావం కలుగ చేసింది. అట్లే నేను టెంత్ క్లాస్ తర్వాత కొంత రాడికల్స్ ఉద్యమం తో ప్రభావితం అయ్యాను. బాగా తిరిగే వాణ్ణి. 1975, 76 ఎమెర్జెన్సీ కాలంలో చురుకుగా ఉండే వాణ్ణి. మా నాన్నకు అంత ఇష్టం ఉండేది కాదు. కానీ ఖచ్చితంగా వద్దు అని చెప్పలేక పొయ్యే వాడు. పేగు సంబంధం కదా! అట్లా నన్ను ఒక సారి ఒక హత్య కేసులో ఇంకో అశోక్ అని పొరపడి మా జనగాం డీజీపీ వచ్చి సెంట్రల్ జైలు దాకా తీసుకుపోయిండు. అక్కడ ఆ హత్య చేసిన అశోక్ ని తెలిసిన ఇంకొకతను నన్ను చూసి ‘వీడు వాడు కాదు’ అని చెప్పడంతో వదిలేసారు. నాకూ హత్యకూ సంబంధంలేదని తెలిసి వదిలేసారు.

1వ భాగం | 2వ భాగం | 3వ భాగం | 4వ భాగం | ఇంటర్వ్యూ విడియో

అభిప్రాయాలు లేవు »ఇంటర్‌వ్యూలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో