Sep2007
పాటే నా ప్రాణం – సుద్దాల అశోక్ తేజతో ఇంటర్‌వ్యూ – 2
ప్రాణహిత: మీ ప్రాపంచిక దృక్పథం, ఆలోచనా స్రవంతి గురించి వివరిస్తారా?
అశోక్: ఈ ఆలోచనా దృక్పథం, ప్రాపంచిక దృక్పథం ఇదంతా కాదు గానీ మొత్తం మీద ఒక్కటి – నేను చూసి ఎక్కడయితే బాధ పడుతానో, నేను ఎదురుగా చూసింది ఏదయితే నాకు బాధ కలిగిస్తందో దాన్ని పాటగా మార్చే ప్రయత్నం చేస్తాను. లేదా నేను ఏదయినా ఒక వార్త విన్నప్పుడు ఆ బాధ ను ఊహించగలను. అది స్వయంగా నేను అనుభవించినట్టు ఊహించగలను. చిన్నప్పటినుండి నాటకాలు రాయడం, డైరక్షన్ చేయడం, పాత్రలు కల్పించడం, ప్రదర్శించడం కూడా ఉంది కాబట్టి ఊహించగలను. మా నాన్న ఒక్కటే చెప్పే వాడు – ఏదేమైనా సరే రా ఈ భూమి మీద పుట్టే వాడెవడయినా సరే వారికి ఆకలి పేదరికం కన్నీళ్ళు ఉండకూడదు. అదే నాకు ప్రాపంచిక దృక్పథం. అంతే తప్ప నేనేదో పెద్ద పెద్ద పుస్తకాలు చదివి ఉండలేదు. ఆయన చదువుకున్నడు. మా నాన్న చెప్పంది నమ్మాను. అందరూ బాగుండాలి, అందరికీ సమాన అవకాశాలుండాలి. అనేది నేను బాగా నమ్ముతాను. ఇది నా రచనకు మూల సూత్రం.
ప్రాణహిత: మీరు మీ నేపథ్యంలో మీ నాన్న గురించి చెప్పారు కదా! అయితే తెలంగాణ పోరాటంలో మీ నాన్న గారి పాత్ర, ఆయన చేసిన రచనలు – ఆయన రాసిన పాలబుగ్గల జీతగాడా మనందిరికి నోటికొచ్చిందే – అది కాక ఇంకా ఆయన చేసిన ఇతర రచనలు, పాటల వివరాలు చెప్తారా?
అశోక్: నాన్న ఉద్యమ కాలంలో, ఉద్యమ జీవితంలో రాసినవి ఎక్కడ రాసినవి అక్కడే అట్లా వదిలేయడం వల్ల చాలా రచనలు నోటు బుక్కుల్లో, పుస్తకాల్లో ఉండడం అవి పోగొట్టుకోవడం వల్ల కొన్ని వందల పాటలు మిస్ అయినయి. అన్నీ వినికిడి చెపుతా ఉంటేనే కొన్ని గుర్తుండేవి, కొన్ని మళ్ళీ రాసే ప్రయత్నం చేసే వాడు. అట్లా చాల పాటలు మళ్ళీ రాసి ఒక పుస్తకంగా వేద్దామంటే పుస్తకం వేసే అవకాశం లేదు. తర్వాత మా నాన్న దగ్గరికి వచ్చే అనేక మంది కళాకారులు పాటలు రాయడానికి బద్ధకించే వారు – నాన్నేమో ఇంట్ల ఉండేవాడు కాదాయె – నాలుగు రాసుకుంటే ఎనిమిది చింపుకు పోయే వాళ్ళు నోటు బుక్కుల్లోంచి. మా నాన్న తర్వాత ఎప్పుడో చూసుకుని అయ్యో పాటలేమయినయి అంటే అమ్మ అనేది – నువ్వు వాళ్ళను నమ్మి ఇస్తే అట్ల చింపుకుపోయిరి అనేది.
నాన్న ఉద్యమ జీవితంలో ఒక సంఘటన నాకు బాగా గుర్తుంది – ఒక సభ జరుగుతూ ఉంటే నాన్న పాట పాడుతుంటే దొరలు పంపిన పోలీసోళ్ళు, గూండాలు, రజాకార్ల కిరాయి మూకలు దాడి చేసారు. రాళ్ళు విసిరారు. నాన్నకు దెబ్బ తగిలి రక్తం వచ్చింది. అయితే స్టేజి పక్కనే ఉన్న ఒక 70 ఏండ్ల ఆవిడ ఒకామె ‘వచ్చినోళ్ళు 30 మంది మీరు 3000 మంది – వాళ్ళు కొడితే మీరెట్ల ఊకుంటరు – దెబ్బకు దెబ్బ వెయ్యహె వెయ్యి’ అందట. ‘దెబ్బకు దెబ్బ వెయ్యహే వెయ్యి’ అని ఆమె అనగానె మా నాన్న వెంటనే ‘దెబ్బకు దెబ్బ వెయ్యహే వెయ్యి’ అంటూ స్పాంటేనియస్ గా బ్రహ్మాండమైన ఉద్రేకాన్నీ, ఊపునూ కలిగించే పాట పాడాడట. అది వినగానే ప్రజలంతా ఒక గొప్ప ఉద్రేకానికి ఉత్సాహానికి గురై పోలీసోళ్ళమీద, గూండాల మీద, రజాకార్ల మీద తిరుగబడ్డారట. ఉరికిచ్చి కొట్టి తరిమారట. అద్భుతమైన దృశ్యం. అసలు ఎప్పటికైనా వీర తెలంగాన సినిమా తీస్తే ఇది పెట్టాలని నా కోరిక. అట్లా అనేక అద్భుతమైన పాటలు రాసారు నాన్న. అట్లే మరో పాట ‘ఆహా మంటలు మంటలు దేశమంతట ఆకలి మంటలు – ఇంకెన్నాళ్ళో ఈ నరకం – ఇంకెందులకీ చెలగాటం – మా పొట్టలు కొట్టీ గింజలు – దాచి పెట్టిరి తిండి దొంగలు – మా కడుపుల పేగుల అరపులు వెలువడి రూపొందెను సమ్మెలు చెలరేగినవవి నలుమూలలు కొనసాగును విప్లవ జ్వాలలు’ ఇలాంటి పాటలు చాలా రాసారు. తర్వాత గొల్ల సుద్దులు, లత్కొరు వేషాలు ఇట్లా అనేక కళారూపాలు, అనేక పాటలు నాన్న రాసారు.
ప్రాణహిత: మరి నాన్న రాసిన పాటలు కళారూపాలు అన్నీ ఏదైనా పుస్తక రూపంలో తెచ్చే ప్రయత్నం జరిగిందా?
అశోక్: ఇప్పుడు చేస్తున్నాం. నాన్నది ఈ సంవత్సరం శతజయంతి సంవత్సరం. నాన్న 1907 లో జన్మించారు. ఈ సందర్భంగా ఒక ప్రారంభ సభ జరపాలని ప్రయత్నం. ఈ సందర్భంగా ఒక పేపరు ప్రకటన ఇచ్చి, ఆయన రచనలు ఎవరి దగ్గరైనా ఉంటే అన్నీ సేకరించి ‘సుద్దాల హన్మంతు సాహిత్యం’ అని వేద్దామని ఆలోచన.
ప్రాణహిత: ఏ నెలలో పుట్టారు నాన్న గారు?
అశోక్: నెల తెలియదు. సంవత్సరం మాత్రం ఇది. అది కూడా నేను అంచనా వేసాను. నాన్న తనకు కాన్సర్ వచ్చినప్పుడు అన్నడు ‘తాత కూడా 75 ఏండ్లకే చని పోయాడురా నేను కూడా 75 కే పోయేటట్టున్న’ అని. ఆయన 1982 లో చనిపోయాడు. అంటే అప్పటికి 75 అంటే 1907 లో పుట్టి ఉంటారని అంచనా వేసాను.
ప్రాణహిత: మీ నాన్న పాటల్లో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పాట ఏది?
అశోక్: అదే ఇంతకు ముందు చెప్పింది ‘దెబ్బకు దెబ్బకు వెయ్యహె వెయ్యి’ . గొప్ప ఉద్రేకమున్న పాట. నేను ఎప్పుడు ఉద్రేకమైన పాట రాయాలన్నా అట్లానే రాయాలని – ఉదాహరణకు ఒసే రాములమ్మ కు రాసిన పాటైనా ఇంకేదైనా దానిక్కావల్సిన దినుసుని నాన్న దగ్గరినుండే తీసుకుంటా! సినిమాల్లో అంతకు ముందు ఉద్రేకభరితమైన పాటల్ని శ్రీ శ్రీ రాసే వారు. మీకు గుర్తుండే ఉంటుంది. ఆ ఉద్రేకం సృష్టించడానికి సంస్కృత సమాసాలు వేసే వారు. ఉదాహరణకు ‘మూయించిన ఒక వీరుని కంఠం వేయి గొంతుకల విప్లవ శంఖం పతిత దళిత జన రణ హుంకారం ప్రళయ కాల దిగ్గజ ఘీంకారం’ అంటూ రాసారు. ఆ సమాసాలు ఎవరికి అర్థం కాక పోయినా వాటిల్లోంచి జనించే విద్యుత్తు వల్ల గొప్ప ఉద్రేకం కలుగుతుంది. నేను సినిమాల్లోకి వెళ్ళినప్పుడు మా డైరెక్టర్ గారికి ఒక విషయం చెప్పా ‘ సార్ ! విప్లవం పాటలకు సంబంధించి శ్రీ శ్రీ గారి ఒరవడి ఉంది. క్లిష్టమైన సంస్కృత పదాలతో రాయడం. నేను మా నాన్న దగ్గరి నుండి ఒకటి నేర్చుకున్నా! తేలిక పదాలతో అంతే ఫోర్సు సృష్టించవచ్చని. ప్రయత్నం చేయనా’ అని అడిగా. దానికాయన ‘ఓ అయితే ఇంకేం. బ్రహ్మాండం. అట్లయితే ఇంకా మంచిది కదా’ అన్నారు. దానితో నేను ఒసే రాములమ్మ లో అట్లా ప్రయత్నం చేసి పాట రాసాను.
‘నేను చచ్చి పోతున్నా రేపే డప్పై పుడతా
నీ ప్రస్థానానికి నే విప్లవాల దరువౌతా
కాలుతున్న నరం నరం నీ పాటకు స్వరమైతే
కమిలే నా కను పాపలు చూపై నీతో ఉంటై
నా గొంతుక మూయిస్తే వేయి గొంతులై వస్తా
చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మా
భగత్ సింగు నురి దీస్తే తిరుగుబాటు ఆగిందా
సఫ్దర్ హష్మిని నరికితే పాట మూగ పోయిందా’ – అని ఒక కొత్త కారక్టర్ ని తీసుకొచ్చా.
ఇట్లా తేలిక పదాలతో నిప్పులు పుట్టించొచ్చు అని నా కంటూ ఒక ఒరవడి సృష్టించుకున్నా. మా నాన్న దగ్గర నేర్చుకున్నదది. సినిమా రంగంలో అంతకు పూర్వం అట్లాంటి పాటలు సంస్కృత పదాలతో ‘ధర్మక్షేత్రం కురుక్షేత్రం కురుపాండవ రోషాగ్నుల రణ క్షేత్రం రథ గజ హయ పదాది దళ …” అంటూ సాగేవి. దాన్ని నేను తేలిక చేసే ప్రయత్నం చేసా. సుద్దాల హన్మంతు వర్స్ శ్రీ శ్రీ ఫోర్స్ తీసుకురావాలని అనుకునే వాణ్ణి.
ప్రాణహిత: ఇంక పాటల కొస్తే మీ పాటల జలపాతాల పుట్టుక రహస్యం తెలుసుకోవాలని ఉంది. పాట దాని పుట్టు పూర్వోత్తరాలగురించి మీరో అద్భుతమైన పాట రాసారు కదా! ఆ పాట నేపథ్యం చెప్తారా?
అశోక్: తప్పకుండా! పాట గురించి నేను ప్రజల్లో విన్నది ‘పని – పాట’ అని. పని పద్యం అని కానీ పని శ్లోకం అని కానీ ఎందుకనలేదు అని ఆలోచించాను. పని కి పాటకు ఏదో విడదీయరాని పేగు సంబంధముంటే తప్ప అట్లా అనరు కదా అని నాకు అనిపించింది. శంకరుని ఢమరుకం నుండి పాట వచ్చింది అనే ప్రతిపాదన ఉంది. అట్లే సామవేదం నుండి వచ్చింది అని ‘సామవేదం గాన ప్రభా’ అని వేదాలకు సంబంధించిన ప్రతిపాదన ఉంది. ఈ రెండు కూడా విన్నవే చూసింది కాదు. అపౌరుషేయాలు. వేదాలే అపౌరుషేయాలు. విన్నవే. కానీ పని పాట అన్నది విన్నది మాత్రమే కాదు చూసింది కూడా! బాగ తెలిసిన జ్ఞానం నుండి వచ్చిందది. ఎవరో చెపితే విన్నది కాదు. ఇప్పటికీ మన అనుభవం లోకి వస్తున్న విషయమది. దీని మీద నేను చాల పరిశోధన చేసాను. చాల డీప్ గా వెళ్ళి చాల కృషి చేసాను. మార్క్సిజం కవిత్వం అనే పుస్తకం, ఓల్గా సే గంగా – రాహుల్ సాంకృత్యాయన్ – ఇట్లా చాల పుస్తకాలు చదివాను – పాట నేపథ్యం లో మానవ పరిణామం గురించి తెలుసుకునే ప్రయత్నం చేసాను. నేను దాదాపు ఒక రెండు మూడు వేల పాటలు రాసాను. అందులో దాదాపు మూడు నెలలు కృషి చేసి రాసిన పాట ఇది. ఇంతవరకూ ఇప్పటి దాకా రకరకాల పాటలొచ్చినయి. కానీ పాట పుట్టుకని, పనిలోంచే పాట పుట్టిన విషయాన్ని వివరిస్తూ, ఫిలసాఫికల్ గా తాత్వికంగా వివరిస్తూ పాట రాలేదు. నేను మా వూళ్ళో పరిశీలించిన అనేక విషయాల ద్వారా పాట పుట్టుక నాకు అవగతమైంది. ఉదాహరణకు మా వూళ్ళో చాకలి వాళ్ళు పల్లకీ మోసే వాళ్ళు. నేను చిన్నప్పుడు వాళ్లని బాగా చూసే వాణ్ణి. వాళ్ళెంత అద్భుతంగా పల్లకీ మోసే వారంటే ఎంత స్పీడు గా నడుస్తున్నా పల్లకీ కదిలేది కాదు. వాళ్ళ కాళ్ళు చేతులే కదిలేవి. వాళ్ళది పల్లకీ మోయడంలో ఎంత టెక్నిక్ అంటే పల్లకీ లో కూర్చున్న అమ్మాయి జడలో ఉన్న మల్లె కంది పోకుండా ఆమె తాగిన చల్ల కడుపులో కదలకుండా అంత సుకుమారంగా ఆమెను గమ్యానికి చేర్చే వారు. బరువంతా భుజాల మీద మోస్తూ కాళ్ళలో స్పీడు మేయింటేన్ చేసే వారు. దానికి ఒక తూగు కోసం ‘ఒహోం ఒహోం హోం ఒహోయ్ ఒహోం ఒహోం హోం ఒహోయ’ అంటూ మోసే వాళ్ళు. ‘బిర బిర బిర బిర పద పద పద పద ఒహోం ఒహోం’ అంటూ ఆ శబ్దం నన్ను వెంటాడేది. నాకు బాగ కోపం వచ్చేది. వాళ్ళేమో అట్లా చెమటలు కక్కుతూ మోస్తూ ఉంటే మా వూరి దొర్సాని పల్లకీ లో వెళతా ఉంటే! ఆమె దిగి నడవొచ్చు కదా అనిపించేది. ఇట్లాంటి దృశ్యాలు అనేకం చూసా. తర్వాత ‘ఆరోజుల్లో గిర్నీ లు లేవుకదా.. దొర ఇంట్లో కార్యాలకు ఊళ్ళోని ఆడవాళ్ళంతా వెళ్ళి దంచెటోళ్ళం నాయినా వేరే వాళ్ల ఇంట్లో అయితే వాడకట్టోళ్ళమంతా వెళ్ళే వాళ్ళం.’ అని అమ్మ చెప్పేది. ఇట్లా చాల కష్టపడి రాసా. ఇది రాసి దాదాపు 15 ఏండ్లు అవుతోంది. నేను టీచర్ గా ఉన్నప్పుడే రాసా. అయితే ఇది రాయడానికి ముందు మరోటి జరిగింది. నేను రోజూ ఇంటికి లేటుగా వస్తుంటే మా ఆవిడ ‘ఏంది నీకేం పనిపాటా లేదా రోజూ లేట్ గా వస్తరు పెళ్ళయి పదేళ్ళయింది ఎప్పుడూ ఏడింటికి రారు రోజూ పది దాటుతది వచ్చేసరికి’ అంటే ‘నా పనే పాట కదా – అట్లంటవేంది’ అన్నాన్నేను. దానితో నాకు సీరియస్ నెస్ ఎక్కువయి ఎప్పటినుండొ అనుకుంటున్న కదా పాట గురించి రాయాలి అని అనుకుంటూ మొదలు పెట్టి రాసా ఈ పాట
“ ఆగడాల ఆ గడీల
దినగండపు ఏలుబడిలో
మెడలు వంచి దొర మేనా
పదిలంగా మోయు వేళ
పద పద పద నడు నడు నడు
బిర బిర బిర పద పద పద
పద పద పద మంటూ
ఆపాదమస్తకం శ్రమిస్తూ
ఒహొహోం హోం ఒహోం హోయ్
ఒహొహోం ఒహోం హోయ్
ఒహొహోం అనే
ఆయాసమే అయినదిరా జానపదం’
టప టప టప టప
టప టప టప టప
చెమట బొట్లే తాళాలై పడుతుంటే
కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాటా పనితో పాటే పుట్టింది’
–––––––––––––––––––––
ఇందులో శ్రమగతి అనే మాట ఎందుకు పెట్టానంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ పని జరుగుతున్నా దానికి ఒక మీటర్ ఉంటుంది. కొలిమిలో సమ్మెట కొట్టి మళ్ళీ కొట్టేదానికి మధ్య దూరం సమానంగా ఉంటుంది. ఆ తాళం కరక్టుగా ఉంటుంది. అట్లే కలుపు తీస్తూ స్త్రీలు – పాట పాడుకుంటూ కలుపు కోసి తీసేసే మధ్య దూరం సమానంగా ఉంటుంది. అట్లే శాలోల్లు మగ్గం నేస్తూంటే దానిక్కూడా ఒక మీటర్, అట్లే బట్టలుతికే చాకలి వాళ్ళ పనిలో మీటర్ – అందుకే దాన్నే శ్రమగతి అన్నాను. అట్లే నెత్తి మీద బరువు ఎత్తుకోని మోసే స్త్రీ కాళ్ల శబ్దం బరువెక్కువయినా కొద్ది ఎక్కువవుతుంటది. ఒకే మీటర్ తో పడుతయి ఆమె అడుగులు.
అట్లే పనిముట్లు ఎవరు పుట్టించారు. వాటికి ఒక టెక్నాలజీ ని అతుకుబెట్టి ఎట్లా కొందరు స్వంతం చేసుకున్నరు అని ఆలోచించి ఈ కాన్సెప్టు తో ఒక పాట రాసాను.
‘పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది’
ఇది ఎట్లా వచ్చిందంటే రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం వచ్చినప్పుడు అగ్ర కులాల వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ మైన మాకు అన్యాయం జరుగుతుంది అని నిమ్న కులాల వాళ్లకు తెలివి లేదు, మెరిట్ లేదు అని పెద్ద లొల్లే చేసిండ్రు. అప్పుడు అనిపించింది. అసలు మెరిట్ అంటే ఏమిటి, అది ఎవరు స్వంతం, ఎవరు సొత్తు – ఈ పరికరాలన్నీ పనిముట్లన్నీ ఎవరు తయారు చేసిండ్రు – దొరలు చేసిండ్రా, దొర బిడ్డలు చేసిండ్రా – ఒక పనిముట్టు చేయడం ఎంత తెలివితో ఎంత మెరిట్ తో కూడుకున్న విషయం? అట్లాంటి పరికరాలు తయారు చేసిన శ్రమజీవులకు మెరిట్ లేదంటుండ్రేంది అని ఈ పాట రాసాను.
‘పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది
పనినొక సంస్కృతి చేసిన ఘనత కష్టజీవిది
కష్టజీవులందించిన శ్రమ సంస్కృతి మనది ’
అని రాసాను.
ప్రాణహిత: చాలా బాగుందండీ! మీరు పాట జలపాత పుట్టుక రహస్యం చెబుతూ ఉంటే మాకు వొళ్ళు గగుర్పొడుస్తోంది.
అశోక్: పాట జలపాత పుట్టుక రహస్యమంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. నేను ఎక్కడి నుంచి ఆ రహస్యాన్ని కనుక్కున్నానంటే ఎక్కడ దాన్ని పట్టుకున్నానంటే ..
ప్రాణహిత: మేము అదే అడగబోతున్నాము
అశోక్: నేను టెంత్ తర్వాత ఇంటర్ చదవడానికి నగరం వచ్చినప్పుడు డబ్బుల్లేవు, పేదరికం – బిల్డింగులు కట్టే మేస్త్రి దగ్గర ఉప్పరి పని సంపాదించుకొన్నా లేబర్ గా శని ఆదివారాలు వెళుతుండే వాణ్ణి. మొన్నటిదాక నా భుజమ్మీద రాళ్ళు మోసిన కాయ అట్లే ఉండేది. అప్పుడు రబ్బరు తొడుగులు ఉండేవి కాదు. స్లాబ్ పోసిన్నాడు ఒక వెయ్యి సార్లు సిమెంటు తట్టలు నిండు తట్ట ఇట్నుంచి అటు ఖాళీ తట్ట అట్నుంచి ఇటు అందించే వాణ్ణి. ఇంక ఆ రాత్రి తిండి తినడం చాలా కష్టమయ్యేది. చేతులన్నీ పొక్కులు పొడిచి పగిలిపొయ్యేవి. ఒక రోజు మధ్యాహ్నం ఇట్లానే పొక్కులు పొడిచి తినలేక పోతే ఒక లంబడోళ్ళ తల్లి నాకు అన్నం తినిపించిన సంగతి నేను జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఆ రోజు కారం అన్నం కలుపుకోని వచ్చిన సద్దికి. పొక్కులతో పగిలిన చేతులని ఆ అన్నం లో ముంచంగనే విపరీతమైన మంట. తినిపోలేక పోయా! అప్పుడు ఆ లంబడోళ్ళ తల్లి తినిపించింది. నాకు పాట రహస్యం పనే నేర్పించింది. పనిలోంచి ట్యూన్ వస్తుందని నాకు ఆ ఉప్పరి పని చేసేటప్పుడు అర్థమయ్యింది. చేతిలో జబ్బ తట్ట పట్టుకోని తాపీ తో గోడకు సిమంటు చక చక చక కొడుతొంటే చూసే వాణ్ణి. దీనిలో బలే మీటర్ ఉంది కదా అనుకున్నా! అప్పుడే
‘రాయి సలాక ఇసుక ఇటుకా
తాపీ తట్టా సిమిటీ చెమటా
గోడ మీదా గోడా
మేడ మీదా మేడా
కట్టిపోరా కూలోడా
పట్టణాలలో మేడా!’ అని
‘కాళ్ళూ జాగరత్తా
ఏళ్ళూ జాగరత్తా (ఏళ్ళెందుకన్నా నాకు పగిలినయి కాబట్టి)
నడుం జాగ్రత్తా
నడువు జాగరత్తా’
ఇలా వర్కు జరిగే వేగంలో ఒక ట్యూన్ ఉందని, ఒక మీటర్ ఉందనే రహస్యం నాకు పనే, వర్కే చెప్పింది. బరువైన బస్తాలెత్తే హమాలోల్లను చూసినప్పుడు బరువును వీపు మీది నుంచి తీసి లారీ లో వేసేటప్పుడు ఉండే తూగు – దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసా. ఆ పాట వాళ్ళకు, ఆ శ్రమజీవులకు వినిపిస్తే వాళ్ళెంతో సంబర పడ్డారు. అట్లే గద్దర్, మా నాన్న పాటల్లో అనేక రహస్యాలని తెల్సుకున్నా. కవిత్వమే కాదు పాటకూడా ఒక ఆల్కెమీ నే. పాట ఒక రహస్తంత్రిక. దాన్ని మీట గల రహస్యం ఒక సుద్దాల హన్మంతుకు తెలుసు ఒక గద్దర్ కు తెల్సు. అదిగొ అక్కడ్నుంచి పాట జలపాత పుట్టుక రహస్యాలు తెల్సుకున్నాను.
1వ భాగం | 2వ భాగం | 3వ భాగం | 4వ భాగం | ఇంటర్వ్యూ విడియో
(మిగతా వచ్చే సంచిక లో)
అభిప్రాయాలు లేవు »ఇంటర్‌వ్యూలు