Sep2007
ఆస్‌మాన్ కి కబూతర్
కుర్‌కుర్… కుర్‌కుర్‌మని
మక్కామశీదు మెట్ల మీద చిన్ని మున్నలేసే
జొన్నలో సజ్జలో తినుకుంటూ
వుజూఖానలో భయంభయంగా
నీళ్లు తాగుకుంటూ మీనార్ల మీద ఆటలాడుకుంటూ
మగరిబ్ నమాజ్ వేళ దాటాక గుంభజ్ గూట్లలో
దూరి గమ్మున పడుకునే మశీదు పావురం కాదు
భక్తులర్పించే పులిహోర ఆరగిస్తూ
ధ్వజస్తంభం చుట్టూనో మందిరం హద్దులోనో తచ్చాడి
సంధ్యా సమయానికి గోపురం గూటిని చేరి
విశ్రమించే గుడిపావురం కాదు
కిటికీల్లో జీవిస్తూ చినుకులు కురుస్తున్నప్పుడు
వెలుపలికొచ్చి వర్షంలో తడుస్తూ
తన చుట్టూ తను పదే పదే గుండ్రంగా తిరిగే
ఆకాశ హర్మ్యాల పావురం కాదు
మత ఛాందసానికి మగ ఆధిపత్యానికి లొంగక
అక్షరాయుధంతో ఎదురినిలిచి పోరాడే పావురం
రక్షణ లేకున్నా రాజీపడక
లోకం చుట్టుతున్న పావురం
లజ్జ, పౌరుషం, షరమ్ ఉన్న పావురం
భువిన సంచరించే నిర్భీతి పావురం
నింగిన విహరించే స్వేచ్ఛా పావురం
ఆమె ఆకాశపు పావురం