Sep2007
ఇది ఇండియా!
కలాన్ని కాలరాసే
ఒక కత్తో ఒక భక్తో
రికార్డునుండి తొలగించాల్సిందే!
ఏడురంగులు ఒక్కటై కలిసి ఉన్న
ఇంద్రధనుస్సులాంటి దేశం కదా
అన్ని మాటలూ మాట్లాడవచ్చు
అన్ని వేషాలూ వేయవచ్చు
అది ఉన్నందుకేకదా అత్యంత గౌరవం దక్కుతుంది
ఆశ్రయమిచ్చి
నమ్మించి నాశనం చేసే వ్యవస్థ కాదిది
ఆడవాళ్లను ఆదరణగా చూసే సమాజమిది
ఆత్మహత్య ఒక నేరంగా భావిస్తున్న
రాజ్యాంగంలో
బహిరంగంగా ఒకరిని
హత్య చేస్తాననటం నేరాతినేరం
ఒక ఆలోచన్నీ ఒక అవగాహన్నీ
హరించే శక్తి హక్కుల్లో రాసుకోలేదు
ఒక గౌరవాన్నీ ఒక మర్యాదనీ
తృణీకరించే అధికారం
విధుల్లో పొందుపరుచుకోలేదు
అడ్డంకులు లేని రహదారికోసం
అడ్డుగోడలు లేని నివాసం కోసం
అరచేతి మీది వేళ్లలా ఉన్న వాళ్లం
స్నేహహస్తాన్ని అందిస్తున్న వాళ్లం
శత్రువు లెదురైతే
అన్ని వేళ్లు మడిచి పిడికిళ్లవుతున్నవాళ్లం.
వలువలు వొలిచే దుశ్సాసనులంకాదు
విలువలు పంచే భారతీయులం
మతబుసతో కాటేసే పాముని
ఏ వర్ణం సహించని చీమలు క్షమించవు
ఎవడికి వాడు చాపేసుకు కూర్చుని
మౌనవ్రతం చేసుకుంటే ఎవడికీ బాధ ఉండదు
దొంగతనం మాని పుట్టలో కూర్చుని
తపస్సు చేస్తే
వాడు మహర్షి అయ్యాడు
నువ్వూ నీ సందింట్లో కూర్చుని
మౌనం వహించు
గుణవంతుడివౌతావు
అలాకాక
బయటికొచ్చి బహిర్గతం చేశావు కాబట్టి
భంగపడ్డావు
అక్షరాన్ని గానీ ఆమెను గానీ తప్పుపట్టడానికి వీల్లేదు
రాయటం స్వేచ్ఛ
అధికారముంది కదాని
ముష్టిఘాతానికి దిగటం మూర్ఖత్వం
ఆమెను బహిష్కరించాలంటే
మాట్లాడే హక్కులు లేని రాసుకునే హక్కులు లేని
దేశానికెళ్లండి
లొసుగులు ఉన్న ముసుగులువున్న
మతతత్వం ఉన్న రాజ్యానికెళ్లండి
మీరనుకున్నట్టు నడుస్తుంది
మీకు కీర్తి కిరీటాలను తొడిగిస్తుంది.
September 5th, 2007 at 2:05 am
ఆవేశం వుంది. ముగింపు మాత్రం బాగోలేదు.
September 5th, 2007 at 2:35 pm
ఈ కవిత చదివి చాలా ఆశ్చర్యం వేసింది. కందుకూరి శ్రీరాములు లాంటి సీనియర్ కవి ఇట్లా రాయడం చాలా ఆశ్చరకరమై! మన దేశం లో ఎప్పుడు ఎక్కడ స్త్రీలని గౌరవించారో – సతీ సహగమనమా, మను ధర్మమా, చాతుర్వర్ణ వ్యవస్థా – ఏది గొరవించిందో – ఆయనకే తెల్వాలి . అయినా తస్లీమా మీద జరిగిన దాడిని ఎక్కడ జరిగినా ఖండించాలె గానీ వేరే దేశం కు పోయి చేసుకోండి అంటడేంది? కవిత్వం రీత్యా చూసినా ఇదేమంత మంచి కవితేం కాదు. వస్తువు, కవి అవగాహనా రాహిత్యం వల్ల దెబ్బ తిని మొత్తం కవితనే పేలవం గా మార్చేసింది. వస్తువు పట్ల, చెప్ప దల్చుకున్న విషయం పట్ల సరి అయిన అవగాన లేక పోతే కవిత ఎంత సీనియర్ కవి అయినా ఎట్లా తేలి పోతుందో స్పష్టం అవుతుంది ఇది చదివితే!
September 18th, 2007 at 3:14 am
సభ్య సమాజం ఖండించాల్సిన విషయమే. కానీ, ఖండించాల్సిన ప్రతివిషయాన్ని కవిత్వం చేస్తామనే ధోరణి కవిత్వాన్ని నీరుకారుస్తుంది. ఆవేశాన్ని ఆపాదించుకుని వ్రాస్తే ఇలాంటి పేలవమైన రచనలే బయల్పడుతాయి.
అలానే సీనియర్లని, జూనియర్లని కవులని బేరీజు వేయవచ్చేమోగానీ, కవిత్వాన్ని కాదు. సీనియర్ కవులైనంతమాత్రాన, వ్రాసినదల్లా కవిత్వమనే ధోరణి కూడా కవిత్వానికి చేటు చేస్తుంది.
September 18th, 2007 at 7:10 am
యేవిటిది? కవిత్వం పేరుతో వ్యాసాలా రాయడం?
October 24th, 2007 at 2:54 am
ఈ కవితకు ఒక రూపం లేదు.వచనాన్ని రాసి పారేసి దాన్ని కవిత అనడం క్షమించరాని నేరం.
దయ చేసి నీతులు చెప్పడానికి, పొలి కేకలు పెట్టడానికి, మీరు ద్వేషించే వర్గాలను తిట్టడానికి కవిత్వాన్ని ఉపయోగించుకోవద్దని మనవి.
October 24th, 2007 at 4:50 am
అన్న రమణ ఇక్కడో లింకిస్తున్నా. అది ఎలా కవిత్వమౌతుందో చెప్పు.
http://www.aavakaaya.com/showArticle.aspx?a=li&articleId=21&pageNo=0