సెప్టెంబర్2007
పొలిమేర్లకి పారీలు మా బతుకులకి గోరీలే!
రాలూ రప్పలూ ఏరి
సెట్టూ సేమా కొట్టి
పురుగు పుట్రను తరిమి
దారి డొంకా చేసి
కుంటా సెలమ తొవ్వి
యాపసెట్టో సింతసెట్టో పెంచి
గడ్డో తాటాకో నిట్టాళ్ళ మీద కప్పి
ఈ ఊర్ని మణసల సందడితో నింపేరు మా అవ్వా తాతోళ్ళు
ఈ ఊరు సుట్టు పొలాలని పుట్టించేరు
గుండెల్తో కండల్తో పనిజేసి మా పెద్దోళ్ళు మోసపోయేరు
కట్టేనికి పాపం పుణ్ణేనికి ఇలువిచ్చిన మావోళ్ళు వోడిపోయేరు
అది మొదలు మా బతుకులు బయలు జెయిలయ్యాయి
సీవలు పుట్టలు పెట్టినట్టు
తేనీగలు తుట్టె కట్టినట్లు
మేం కట్టిందే మావూరు
ఇప్పుడది పనిదొంగల పెత్తందార్ల యాపార్ల వూరయ్యింది
మేం పుట్టినూరు బతికినూరు
మాదికానివూరు మాది కావాల్సిన వూరు
కోయిలల్ని పొదిగిన కాకుల యాతన మాది
మాదిక్కడ కౌలు బతుకైనా కాని కూలిబతుకు
మేమిక్కడ మానవగౌరవం దక్కని చాకిరి గొడ్లం
ఊరి దొరిరికం మా నోటికాడి బువ్వని
కాళ్ళకింద బూమిని మింగేసింది
మా ఇండ్ల సుట్టూ పంటసేలు
మేం పన్జేస్తున్న సేలు
కూలికి నాగలి గొడుతున్నప్పుడు
మాయెంటే కొంగలు పిట్టలు సాళ్ళపై ఎగిరింది ఈ సేలల్లోనే
వూరి పిల్లలు ఆడుకోనీయకుండా కసిరి కొట్టినపుడు
మా పిల్లలకి ఆటస్థలాలయ్యింది ఈ బీళ్ళే యీసేలే
మొక్కల చీడని చిదిమేస్తూ మా ఆడపిల్లలు
పెద్దమనుషులయ్యింది ఆ గట్లమజ్జెనే
ఊరి పిచికలకి పరిగె కంకులు
పొయిలోకి దుంపలు ఏరుకుంది ఈ పొలాల్లోనే
కామందుల కామానికి మా ఆడోల్లు సెరలు బడిందీ
మా మొగోళ్ళు దెబ్బలు తిన్నదీ ఈ సేలల్లోనే
వూరు మాదారుల్లో అంటరాని పల్లేర్లు పోస్తే
మా కళ్ళకు వివక్షల గంతలు కడితే
బాటనిచ్చిందీ పచ్చని పలకరింపయ్యిందీ ఈ సేలే
వూరు మా మొలలకు ఇనుప కచ్చడాలు బిగిస్తే
వూడబెరికింది ఈ సేలల్లోనే
మేం పన్జేసిన సేలు
మాయి కాని సేలు
మాయి కావల్సిన సేలు
కొండలు కోరీలు తవ్వుకోవాలంటే
సిమెంటు మరలు పెట్టుకోవాలంటే
ఇమానాలు నౌకలు ఆపుకోవాలంటే
కారులు ట్రక్కులు తిప్పుకోవాలంటే
చాపలు రొయ్యలు సాగు చెయ్యలంటే
తోటలు తోపులు పెంచుకోవాలంటే
సెజ్జులు సాపులు కట్టుకోవాలంటే
మేం ఊళ్ళొదలాలా?
పల్లెలొదలాలా?
పేణాలొదలాలా?
కారంచేడు ముదిగొండలు మిగలాలా?
సెజ్జుకి ముగ్గు పోస్తామంటే
మేం వొప్పుకోం
పుట్టి పెరిగిన నేల వొళ్ళో
సీసా పెంకులు సీలమండలు మొలిపిస్తే
మేం సూళ్ళేం
మావూరు ఖాళీ చేపిస్తే మేం ఊరుకోం
పొలిమేర్లకి పారీలు మా బతుకులకి గోరీలే!
వామన వారసులకి బలి తాతలా మేం బలికాం
మా గుడిసెలకి బారెడు నేల కావాల
మ శవాలాకి శారెడు బూమి కావాల
మా గొంతులకి గుక్కెడు నీళ్ళు కావాల
దున్నుకోను ఎకరం దుక్కి కావాల
మా నేల మాగ్గావల
మా ఊరు మాగ్గావాల
నల్లదొరలైనా తెల్లదొరలైనా తేలిపోవాల
మాకడ్డమొస్తె గవురుమెంటైనా కూలి పోవాల
ఇయ్యాల ఇప్పుడే తేలాల
(ముదిగొండ అమరులకి)