మరణం లేని ‘బా’ కథలు

జీవితాన్ని చేరబిలుచుకుని, తలనిమురుతూ, కన్నీటిని తుడుస్తూ, అలసటను పోగొడుతూ, లాలించే రహస్యమేదో బహుత్‌ ఖూబ్‌గా తెలిసిన వాడు రహమతుల్లా. నాయినను గురించి చెప్పినా, అమ్మను గురించి మాట్లాడినా, భాష, మతం, ఆకలి, ఈతి బాధలు – దేనిని గురించి ఏకరువు పెట్టినా, ముందుగా మనల్ని తనకైవసం చేసుకని, ఊపిరాడనీయని, వశం కాని శిల్ప విన్యాసంతో, అతని ఎంటే పడికొట్టుకు పోయేటట్టు మనల్ని మార్చేసే కామ్‌గారీతనం కూడా అతనికి ఎంతో బాగా తెలుసు. సిద్ధాంత రాద్ధాంతాలు చేయడుగాని, అతనికి స్పష్టమైన, బతుకు తాలుకు, మట్టి తాలుకు నిబద్ధత భర్‌పూర్‌గా, సజీవంగా ఉంది. కనుకనే అతడు కాళోజీ ఆలోచనా ధోరణికి ఆకర్షితుడయ్యాడు. పొట్లపల్లి రామారావు గారిని ఆశ్చర్యచకితం చేశాడు. తనతోటి వారిని తన రచనల చేత మంత్ర ముగ్ధులను చేస్తున్నాడు.

ఈ ‘బా’ సంపుటి ఒక ఆక్రందన, ఒక ఆయాసం, ఒక కన్నీటి స్రవంతి, ఒక బిగించిన పిడికిలి, ఒక సున్నితమైన చురక, ఒక హెచ్చరిక అవుతుంది. ఏకకాలంలో ముస్లిం జీవితాల్ని విశ్లేషిస్తుంది, జల్లెడ పడుతంది. అనుభూతులకు లోనుగావించి అతలాకుతలం చేస్తుంది. ఎవరి హృదయపు గదుల్లోకి వారిని పోనిచ్చి, ఆత్మదర్శనం చేసుకునే అవకాశాన్నిస్తుంది. అలాగే, నిలదీస్తుందికూడ.

బతుకు తాలూకు అన్ని పార్శ్వాలే యిందలి కథలు. రచయిత ఎవరి వ్యధలనూ వదలడు. ‘తానంటే తన చుట్టు వున్న వారందరూ’ అని తలుస్తాడుగనుక రహమతుల్లా అందరి గోడులనూ, గొడవలనూ పట్టించుకుంటాడు. అందరి బాధలను స్పృశించే బాధ్యతను తలకెత్తుకుంటాడు.

1996 నుంచి 2004 దాకా ఈ కథల విస్తృతి ఇరవయ్యో శతాబ్దపు అంతాన్ని తాకుతూ ఇరవయ్యొకటో శతాబ్ది ప్రారంభాన్ని సంకేతించింది సంపుటి.

”హజార్‌బార్‌ నర్గీస్ అప్నీ బేనూరీ పర్ రోతీహై
బడీ ముష్కిల్‌ సె పైదా హోతా హై చమన్‌మె దీదావర్‌ కా”

నర్గిస్‌లో మానవ సంబంధాలను, ముఖ్యంగా తల్లిదండ్రుల సంబంధాలను కొత్తకోణాలతో విశ్లేషించాడు రహమతుల్లా. అమ్మ అసలు (నిజం) అయితే, అమ్మ కేవలం నమ్మకమేనంటాడు. ఎందరెందరినో జీవితం కసిగా, కఠినాతి కఠినంగా లాగిపెట్టి బలంగా ఒక తన్ను తన్నడం – మనం చూస్తుంటాం. అది నర్గిస్‌ విషయంలో ఎట్లా జరిగిందో చిత్రితమైంది కథలో. (బండి రంధ్రాల్లోంచి బయటకు చూసినందుకే తండ్రి చేత ఒకసారి దెబ్బలెట్లా తిన్నదో జ్ఞాపకం చేసుకుంటుంది)

ఆమెలోని భయం, చొరవలేమీ, న్యూనత – కార్యాలయంలోనికి కొత్తగా అడుగుపెట్టింది లగాయతు, ఎట్లా వెంటాడి వేధించాయో, ఎట్లా బతుకులోకే తిరిగి దారి తీయాలో వ్యక్తమైంది. తండ్రి, భర్త అనే యిద్దరు వ్యక్తులు తనని పరాన్నభుక్కుగా మార్చి సంగతి తెలుసుకున్న తనకు తన హృదయమొక మొహరం నాటి అలావాగా మారినట్టు ద్యోతకమౌతుంది.

పులుల్లా ఎదిగిన మతోన్మాదులు, జింకల్లాంటి సెక్యులర్‌ శక్తులు,
మేకల్లాంటి ముసల్మానులు, సామాన్యప్రజలు….

మానసిక వికారం, అశాంతి, ఆందోళన, భయం, కసిని అనుభవించిన యూసుఫ్‌ ఆత్మక్షోభ ”బోర్డర్స్‌”. ఈ కథ చదివేందుకే బోలెడన్ని దిటవుగుండెలు కావాలి. అతని డైరిని తెరిచి చూస్తే అంతర్మధనమంతా అర్థమౌతుంది మనకు. నిలువునా దగ్ధమౌతాం మనం. సతి సహగమనాలు, మతోన్మాదుల మానభంగాలకు పశువులు సైతం చచ్చిపోయే దృశ్యాలు కళ్లకు కడతాయి. ”మాల మాదిగల నుంచి ఇస్లాంకు వురికాం, ఇప్పుడేం చేయాలనే ప్రశ్న కెలుకుతూ ఉంటుంది. కనిపించని గోడు మరింత పెద్దదౌతూ వుండటం, దేశమంతా రెండే కాలనీలుగా గోడలతో పునర్‌ నిర్మాణమయ్యే ఘోరం జరిగిపోతుంటే యిక అదొక సామరస్యం మసైన సందర్భం. సెక్యులరిస్టులు చేతులెత్తేసిన సమయంకాగా – కాళ్లు చేతులు బేడీలతో కట్టి పడేసిన యూసుఫ్‌ స్థానంలో అనూహ్యంగా మనం.
అశాంతి అదృశ్యంగా ఉంటుంది. కాని, అదే కదూ నరకమంటే…

‘జీవితం చాలా బరువై చేతుల్లోంచి జారుపోతుంటే’ పట్టుకునే విఫలయత్నం బతుకు పొడుగునా చేస్తూనే బలైనవాడు బిచారా అఫ్జల్‌. సగటు మనిషి. అట్టడుగువర్గపు ఉద్యోగి. అతని సంపాదనకూ సంసారానికీ ఎక్కడా పొంతన వుండదు. బీడీలకూ, చాయ్‌కీ కూడా మొగం వాచిపోవటం. దైవభీతి, నమాజుల మీద శ్రద్ధ – అన్నీ వున్నాయి కాని నోట్లోకి మెతుకులే వుండవు గతకటానికి. హదీస్‌లు వింటాడు, మన్నత్‌లు చేసుకుంటాడు. జిమారత్‌ మీద పరిపూర్ణ విశ్వాసం కలిగివుంటాడు. కానీ, ఏదీ నెరవేరదు. ”డబ్బు మిగిలించటంకన్నా చాంద్‌ తారాలను కిందకు దించటమే తేలిక” అని అర్థమౌతుంది. ఇంకేం చేస్తాడు ”మందనుంచి తప్పిపోయిన గొర్రె మాదిరి” పడికొట్టుకుంటూ, గమ్యంలేని నడకకు ఉపక్రమించటం తప్ప. ”పేదరికపు పద్మవ్యూహంలోంచి బయట పడేయు తండ్రి” అని నిత్యం ప్రార్థించేవాడు అల్లాని. కాని, అతడదే గరీబీకే పింజరాలో బందీయై విలవిల్లాడిన పక్షే అయ్యాడు. కడకు, ఈ కందూర్‌లూ, నమాజులు, క్షణిక ఉపశమనాలను కాదని, అన్నింటికీ మూలమైన జీవితాన్ని ఎద్దులా భరించనైనా భరించాలి లేదా పులిలా ఎదిరించనైనా ఎదిరించాలని సమీక్షించుకునేప్పటికి అతని మీదకు అనివార్యమైన చరమాంకం క్రూరంగా మూగనే మూగుతుంది.

”రావి చెట్లో మొలచిన వేప చెట్టులా కలిసిపోయినోళ్లం
అసలు మేము సాయిబులన్న స్పృహే ఉండేది కాదు”

సోదరీమణి (కరీమున్‌) స్మృతి గీతం, ఒక విషాదపు నోస్టాల్జియా – ”పీపల్‌ మే నీమ్‌ కా పేడ్‌”. ”జీవంతో బతికిందంతా స్కూలు రోజుల్లోనే” అన్నప్పుడు, పేదరికాన్ని స్నేహితున్నీ, ఆత్మీయతలనూ, అల్లరి చేష్టలనూ, అన్నీన్నీ, ప్రసాదాల్ని సమంగా పంచుకున్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు వుండే దగ్గరితనాన్ని చిత్రిస్తున్నప్పుడు పాఠకుడు ఆపాద మస్తకం చలించిపోతాడు. లోకంలో ఏర్పడుతున్న ఖాళీ ఏమిటో చాల స్పష్టంగా అర్థమౌతుంది. మనమేం పోగొట్టుకుంటున్నామో మనకు తెలిసివస్తుంది. మునుపు ఏనాడూ ముట్టుకోని కులమతాల దారిద్య్రం ”మేము – మేము తప్ప వేరెవరులేరు, వుండకూడదనే దమ్యపు నీతి” యిప్పుడెందుకు చోటు చేసుకుందో ఆరమ జూసే ప్రశ్నల పరంపర మనల్ని అవాక్కులను చేస్తుంది.

”చినిగిన బట్టలు తొడుగుతున్నప్పుడు, ఎప్పటివో పాతకాలపు
పొట్టి గౌనులను ఎదుగుతున్న కూతుర్ల తొడలు కన్పించకుండా కప్పెట్టటానికి
కిందికి లాగి లాగి విఫలమౌతున్నప్పుడు నిజంగా ఆ తల్లి చౌరస్తాలో
నగ్నంగా నిలబడినట్లే కళ్లు, గుప్పిట్లో మూసుకుని విలవిలవాడి…’

అలావా నిప్పుల్లో నడిచేవాళ్లకు యాడాదికొకనాడు చేస్తారు, కాని ‘అమ్మీజాన్‌’ మాత్రం జీవితం పొడవునా, యేడాదికి మున్నూట అరవై రోజులూ అలావా నిప్పుల మీది నడక కన్న భయంకరమైన సాహసాలే చేసింది. భూమిని మించి సహనాన్ని మోసింది. శూన్యాన్ని మించిన ఖాళీతనాన్ని తన తనువంతా నింపుకొని తల్లడిల్లింది. ”చాలీచాలని డబ్బులతో సంసారాన్ని నడపడం లాంటి నరకాతి నరకాన్ని’ బతికినంతకాలం చవిచూసింది. చేసేది లేకపోయినప్పుడు ‘నమాజ్‌ పూర్తయ్యాక సిద్దులోనే వుండిపోయి ఏకాంతంగా, ఎవరికీ కన్పించకుండా ఎంతగానో ఏడ్చింది. క్షమించింది. తన కొడుకును, కులంగాని – మతంగాని కోడలునూ, వారి సంతానాన్ని, మౌనంగా రోధిస్తూ, మూగవేదనను అనుభవిస్తూ. మందిలో వుంటూనే ఆమె ఏకాకి అయి, కావాల్సిన వారికి కాకుండా పోయిన సత్యాన్ని, శోకాన్ని ఈ రచయిత ఏకరువు పెట్టిన తీరు – అనన్యసామాన్యమైనదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అవును, ఈతని మాటల్నే పునశ్చరణ చేసుకోవాలంటే ”తల్లితల్లే, పిచ్చిదైనా, ఎడ్డిదైనా, పేగు బంధాన్ని తెంచుకోదు. ఇంకా విచ్ఛినం కాకుండా పవిత్రంగా మిగిలున్న మానవీయ సంబంధం అదొక్కటే కదా”.

”జుదాయీ మనస్సును విపరీతంగా విశృంఖలంగా ప్రవర్తించమంటుంది”

మీర్జా మొదటి సారి మస్జీదుకు వెళ్లాడు. అల్లా మీద భక్తో, భయమో అందుకు కారణం కాదు. మానసిక హింసనుంచి బయట పడటానికి వెళ్లాడు. ముల్లా ఎంత గొప్పగా చెప్పినా అవి సత్యాలు కాలేదు. అన్ని సమస్యలకు పరిష్కారం ఖురాన్‌, అన్ని రోగాలకు మందు హదీసు, అద్భుతమైన జీవితానికి ఇస్లాం – అనియన్నాడు. కాని, మీర్జా విషయంలో అవి వాస్తవాలు కాలేదు. అతని బాధల్లా వేరు. ”దొరికినట్లే దొరుకుతూ ఇంతలోనే జారిపోతుంటే ప్రేయసి ప్రియుడికి మహా నరకం” అని మాత్రం బాగా అర్థమైంది. ప్రేమకూ మతానికీ వున్న లంకె మరింత బాగా అర్థమైంది. మహేశ్వరి జపంతోనే సరిపోయింది. హృదయంలోని బాధా స్పందనను గమనిస్తూ కూర్చోవడం కన్నగొప్ప మెడిటేషన్‌ లేదనిపించింది. ఆత్మకింపైన ఒక విషయం కోసం అన్ని విషయాలను సన్యసించడమే ధ్యానం అనుకున్నాడు. ”లోకపు విలువల నుంచి, గొప్పతనాలనుంచి పూర్తిగా నగ్నమైపో…’ అని సమాధాన పర్చుకున్నాడు.

”చండాలపు ప్రపంచానికి అలుపొక నమూనా
పురుషుల్తో కలిసి పని చేయాల్సిన అనివార్యత
స్త్రీలను మనుషుల్లా మెదలనివ్వని పురుషులు
మాటా చూపూ చర్య ఆలోచనా అంతా అసహజం, కామం”

”తన సంపాదన మీద తనకు స్వేచ్ఛలేక పోవటమే తన నరకానికి ప్రధాన కారణ”మని పర్వీన్‌కు అర్థ కావించిన కథ ”బందీ పింజరేకే బినా”. కుటుంబ సభ్యుల అనుమానాలు, నిఘాచర్యలు నిత్యం ఆమెను నిలువునా, మానసికంగా చీల్చుతూ వచ్చాయి. తన ప్రమేయం లేకుండానే తన జీవితం నరకప్రాయమైంది. మన సమాజంలో యిటువంటి ఈడుస్తున్న నరకాలకు పర్వీన్‌ ఒక్కతే ప్రతీక కాదు. ప్రతి అంగుళమంగుళమూ సగటు పర్వీన్‌లే. మానసిక క్షతగాత్రులే. మరదోంకీ సుకూన్‌ బచ్చోంకీ మషీన్ లే. చీకట్లోంచి లేచి తిరిగి మరణ సదృశ్యమైన బతుకు బతికే వాళ్లే. బతుకు ఎట్లా నడుస్తున్నా బత్క తప్పదని ఈసడించుకుంటూ, అసహ్యించుకుంటూ, ”అసాధ్యమైన ఆశల్ని తలచుకోవడమే మనిషి విషాదమని అనుభవం” కావటానికి అట్టే కాలం పట్టదు. చివరకు ”ప్రపంచ పంజరంలో చిక్కుకున్న పక్షి పర్వీన్‌ స్వేచ్ఛను సాధించుకోకుండా బందీలా మౌనంగా ఇంకా ఎంతోకాలం వుండదు.”

”ముందు అమాయకత్వం నుంచి బయటపడు… నువ్వు కావాలనుకునే వాళ్లు, నీకు నచ్చే వాళ్లు లోకంలో చాలామంది వున్నారు. నీ దేశంలో నువ్వు కిరాయి వాలా మాదిరి బతకాల్సి వస్తున్న పరిస్థితుల్ని అర్థం చేసుకో…”

”కిరాయ్‌ మకాన్‌” ఒక ప్రతీకాత్మక కథ. ఒక దేశంలో బ్లాక్‌డేలను పాటించాల్సి వచ్చిన దౌర్భాగ్యాన్ని గురించి వివరించిన కహానీ. మత దురహంకార చర్యల పర్యవసానాలకు నిషానీ. అబ్దుల్లా పడ్డ అగచాట్లను ఏకరువు పెట్టాడు రచయిత యిందులో. బతుకే అవతలకి అతడి నొక ప్రపంచం వెళ్లగొట్టజూసే పని చేస్తుంటే అతడు బేజారెత్తి పారిపోజూసినప్పుడు తోటి వాళ్లు భరోసా యిచ్చారు. అదే అతని ఉద్యోగం నిలబెట్టింది. కాని, వివక్ష వివక్షే అయ్యింది. అభద్రత భద్రంగానే వుండిపోయింది – నిరంతరం వెంటాడుతూ. అయితే, ఒక అభద్రతనుండి యింకో అభద్రత వరకు ప్రయాణించే లోపలే కొంత రిలీఫును అబ్దుల్లా కనుగొనబోవడం విశేషం.

”ఫుట్‌పాత్‌ బతుకులన్నీ బహుజనుల బతుకులే”

ఈ ప్రపంచంలో యింకేమీ వున్నా లేకున్నా ఫుట్‌పాతులుంటాయి. అయితే, గమ్మత్తేమిటంటే, అవి వుంటాయి గాని వుండవు. ఎందుకంటే, వాటిని ఎవరో చేతివాటంగల వారు ఆక్రమిస్తారు. అవి ఎవరికోసమైతే ఉద్దేశించబడతాయో అక్కడి నుండి వారినే తరిమేస్తుంటారు, లేదా అంతమొందిస్తుంటారు. అదే జరిగింది ఈ కథలో కూడ తాపసి వంటి వృద్ధుడికి, ఒక ఊదుబత్తీల స్వామికి. ఫూట్‌పాత్‌ తప్ప నిజానికి ఎవరూలేని ఏకాకిని. అందరూ అతనికి సలహాలిచ్చే వారే. సన్యాసితనం నుండి బయటపడమన్నవారే. బతుక్కొక తెరువు చూపటం తప్ప అన్నీ యిచ్చిన వారే. మృత్యువు రూపంలో ఫూట్‌పాత్‌రీ అతని మౌనానికి, ఆవేదనకు, అలసటకు, ఒంటరితనానికి విముక్తినిచ్చింది. కథ ముగిసినా ఫుట్‌పాత్‌ ఘోష ఆగదు.

”దరిద్రంలో ఉన్న మనుషులకు చదువుండదు, అన్నం వుండదు,
ఆలోచించడం తెల్వదు” – ”ఎద్దు కాళ్లకో, బా కాళ్లకో జీవితం మొత్తం
సాష్టాంగ పడినా తీరని రుణం”

పుట్టిన ఏ ప్రాణికైనా మరణం వుటుంది. కాని ఈ రచయిత దృష్టిలో, బా (నాన్న)కు మరణం లేదు. ఎందుకంటే, కష్టాలకు, దుఃఖాలకు, నొప్పులకు, ఆకళ్లకు, అవమానాలకు, త్యాగాలకు మరణం వుండదు గనుక. ‘బా’లకు (తండ్రులకు) జన్నత్‌ తెలుస్తుందో లేదోగాని దోఝక్‌ మాత్రం చాలబాగా తెల్తుంది. బా బతుకు అంతా కలిపి ఒక బండి బతుకు బండి. ”నిండు బండి గతుకుల్లో గుంటల్లో తోలటం పెద్ద సర్కస్‌”. అయినా, కడదాకా తోలాడు బా. సంసారమనే బండిని కూడ అచ్చం ఎద్దుబండిలాగానే తూలుకుంటూ పోయాడు. ఎద్దు బండి కదిల్తేనే బువ్వ. బాబ్రీ మసీదు కూలీనట్టగానే ‘బా’ బండి ఇరుసు విరిగి బండి కూడ కుప్పకూలింది. అదే సంవత్సరం స్వరాజ్యం వచ్చినప్పటినుండి షురూ అయిన బండితోలే పని అప్పటితో ముగిసింది. ”హల్కా, ఖర్చు తక్కువ గుర్రబండి నుంచి, భారం, ఖర్చెక్కువ, ఎద్దుబండి నుంచి – తనే ఓ ఎద్దులా లాగే చక్కబండిదాకా బా జిందగీ”. ”బా కథ కథ కాదు ఎత. అతని మృత్యువు కారణంగా ఏడ్చీ ఏడ్చీ ఏడ్చీ శక్తిలేక ఏడుపాగక ‘అదేపనిగా ఏడుస్తూనే వుండిపోయిన మా (అమ్మ) సోదంతా, బాధంతా, కుటుంబ సభ్యుల రోదనంతా కలిపి ‘బా’ ! బతికినా చచ్చినా బా బతికే వుంటాడు. రక్తంలో రక్తమై, ఊపిరిలో ఊపిరై. అయినవారి గుండె గూళ్లలో – స్మశాన వాటుకల్లో. అవును, ‘కొండంత అమాయక ప్రేమను పంచినా ‘బా’ మరణించలేడు.

‘బా’ కథలు చెప్పిన రహమతుల్లా బాధల్లో, కోరికల్లా ఒకటే. మనిషితనాన్ని నిలబెట్టడం. తండ్రి పేరిట, తల్లి పేరిట మనిషిని తలవటం. దేశమనే యింటిని చక్కబెట్టటం. దేశంలోని దరిద్రులను, నిరుపేదలను, అంటరానివారిని, వివక్షకు గురయ్యేవారిని, వెలివేయబడుతూ, బలిచేయబడుతూ, నిత్యం లోలోపలే తొలచబడుతున్నవారి పక్షం వహించడం. వారిని గురించి రచనలు చేయటం. ఈ పనిలో/బాధ్యతలో అతడు ఎంతగానో రాణించాడు. అగ్రభాగాన నిలిచాడు. అతడి వచనం వచన పద్యంలోకే మారుతూ వుంటుంది. అతని వాక్యాలు వెంటాడుతూనే వుంటాయి. ఉదాహరణకు –
”మంటరంగు సూర్యుడు, ప్రసవ నరకాలు పతిసహగమనం, పేదరికపు పద్మవ్యూహం గాడి ఆయెతో చుల్లా సులిగునా” వంటివి కొన్ని.

ఇక అతని వర్ణనలు మన చెవుల్లో గింగురుమంటూనే ఉంటాయి.
ఉదాహరణకు –
యుద్ధ జీవితం ఏదో వొక రూపాన్ని తప్పక తీసుకునే తీరుతుంది (పే.16)
మతోన్మాదుల మానభంగాలకు పశువులైనా చచ్చిపోతాయి (పే. 20)
జీవితం చాలా బరువైపోయి చేతుల్లోనుంచి ప్రేయసి జారిపోతున్నది (పే. 29)
చర్మాన్ని చీల్చుకొని బొక్కలు బయట పడనున్నట్లు సాయిబుల పీరుమాదిరుందామె (పే. 39)
కానీ, అన్నీ అనుకుని ప్రేమించం కద (పే. 48)
గొంగడి పురుగు మానవాకృతిలో పాకుతున్నట్లు కల (పే. 59)
దృశ్యాలు దృశ్యాలుగా దుస్వప్నాలు (పే. 62)
ఎలక్ట్రిక్‌ స్థంభాలు నడుములు వంగి పోయిన ముసలోల్ల మాదిరి కనిపిస్తున్నాయి (పే. 77)

”బా”
రహమతుల్లా కథలు
జంగ్లి పబ్లికేషన్స్‌
104, సాయి చైతన్య అపార్ట్‌మెంట్స్‌
సాయినగర్‌, చైతన్యపురి, హైదరాబాద్‌.
వెల. రు. 20
ప్రతులకు : నవోదయ, దిశ, సహచర, తెలుగుబుక్‌ హౌస్‌,
విశాలాంధ్ర, ప్రజాశక్తి అన్ని బ్రాంచీలు

పుస్తక సమీక్షలు

ఒక అభిప్రాయం

  1. sreedasyam అక్టోబర్ 2007 1

    baa kathalapai venu sankoju sameeksha chadivaka writer thana kathallo velibuchina Bhaavalu, kathalloni vastavika paristhithulu, thallipadda avedana kadilinchai. sameekhsa chadivaka pustakam chadavaalanipistunnadi

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో