సెప్టెంబర్2007
తానుండిన కాలానికి తానె ఉషస్సయినాడు

కాళోజీ
తన బతుకంతా ప్రజల తరఫున వకాలత్ తీసుకొని వాండ్ల కోసరం పోరాటం జేసినవాడు కాళోజీ. తెలంగాణ లోపట రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక, సామాజిక ఉద్యమాలన్నిటి తోటి ముడిపడ్డ బతుకు కాళోజీది. కాళోజీ ‘దఖల్’ గాని లేకపోతే ఆయనను ఉదహరించకుండగాని లేని తెలంగాణ చరిత్ర, తెలుగు సాహిత్య చరిత్ర లేనేలేదు.
”అవనిపై జరిగేటి అవకతవకలు జూచి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు, పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె, మాయ మోసముజూసి మండిపోవును ఒళ్లు, పతిత మానవుజూచి చితికి పోవును మనసు, పరుల కష్టాలతో పనియేమి మాకనెడు అన్యులను గని యైన హాయిగా మనలేను, ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు” అని అన్నడు ‘నా గొడవ’ల కాళోజీ. ఓ తీరుగ జూస్తే ఇది ఆయన బతుకు ఫిలాసఫీ.
ఇట్ల అవకతవకల జూసి ఊర్కునుడు గాదు, ఆ అవకతవకలకు కారణమైన వాండ్లను ప్రశ్నించడం, వాండ్ల భావాల తోటి ఏకీభవించకపోతే, అవి అన్యాయమైనవైతే అసమ్మతి తెలుపటం, వాండ్ల పద్ధతుల పట్ల నిరసన ప్రకటించటం ఇంకా, తర్వాత వాటిని ధిక్కరించటం కాళోజీ కవిత్వం లక్షణాలు. కవిత్వమే కాదు అవి ఆయన బతుకు లక్షణాలు. ఎందుకంటే కవిత్వమూ బతుకూ రెండు వేరే వేరే లెవ్వు కాళోజీకి. చెప్పుడోటి చేసుడోటి కాళోజీకి తెలువదు.
విద్యార్థి దశ నుంచి అంటే ప్రజాజీవితంల ప్రవేశించిన దగ్గర్నించి చివరి వరకు అందుకు భిన్నంగ లేడు. అన్యాయాన్నెదిరించటం, ప్రశ్నించటంతోటే జీవితమంతా గడిచింది కాళోజీకి.
ఏ పాలకులైనా ప్రజలకు మేలు చేసే పనులు చేయకపోయినా చేటు చేసే పనులు చేసినా ఆ పాలకులకు రోజులు దగ్గరపడ్డట్టే అని కాళోజీ అన్నడు.
1946లో ఆనాడు హైద్రాబాదు రాష్ట్రంలో ప్రజలపై జరిగిన దౌర్జన్యాలు, దమనకాండ, దౌర్జన్యకారుల తోటి పాలకుల లోపాయకారి వ్యవహారాలను చూచి కాళోజీ ఇట్లన్నడు.
‘రక్షణకు ఏర్పడ్డ బలగము రక్కసుల పక్షంబు చేరిన
రాక్షసుల ఇష్టానుసారం రాజ్యమును నడిపించినట్లే’
అంతేకాదు,
‘బూజు పట్టిన రాజభారం మోయజాలక జానపదులు
రోజుచుండే దేశమేలెడు రాజు రోజులు నిండినట్టే,
కల్లగాదిది కైతగాదిది కాలదేవత గర్భవేదన
అరసి కాళోజీ వచించుట అనుభవముకు వచ్చినట్టే’,
అనికూడా అన్నడు.
ఆయన అన్నట్లే 1948లో నిజాం ప్రభుత్వం పతనమయింది. కవి ద్రష్ట అన్నరు గద అందుకే.
అవ్వాళ్ల ఆ పాలకులను హెచ్చరించినట్లే, ఇవ్వాళ సమాజంలో పౌరులపై జరుగుతున్న అన్యాయాలకు దోపిడీలకు వ్యతిరేకంగా ప్రజల పక్షం నిలిచి ప్రశ్నించిండు కాళోజీ. కాళోజీ ఏవంటడంటే, ‘లాల్‌ఖిలాపై ఎత్తిన జెండా కొత్తదే గాని దాన్ని ఎగరవేసిన దండా (జెండాకర్ర) నాదిర్‌షా కాలందే’. జెండా మారింది గాని దండా మారలేదు. పతాకం మారింది గాని పాలన మారలేదు అని. ప్రజలు ఇవ్వాళ గూడ దౌర్జన్యకారుల దౌర్జన్యాలకు దోపిడీ దారుల దోపిడీలకు గురి అవుతునే వున్నరు. అందుకే కాళోజీ జీవితమంతా ప్రశ్నిస్తనే వున్నడు.
కాళోజీకి కనిపించని దేవుని కంటే, కనిపించే మనిషంటేనే ఇష్టం. మనవాండ్లు చెప్పినట్టు దేవుడు సాక్షీభూతుడే కావచ్చు, మనిషి చేస్తున్న అన్యాయాలను చూచి లెక్కగట్టి ఉన్నవనుకుంటున్న పరలోకంల లెక్క చుప్త జేస్తడు గావచ్చు. కాని కాళోజీకి అది ఇష్టం లేదు. అందుకే, జరిగిందంతా చూస్తూ ఎరగనట్టు పడివుండగ సాక్షీభూతుణ్ని గాను, సాక్షాత్తు మానవుణ్ని’ అన్నడు. జరుగుతున్న అన్యాయాలకు స్పందించిండు. తన నిరసన గళం విప్పిండు. విప్పి ప్రశ్నించిండు.
కాళోజీ ఏం చెప్పినా సామాన్య ప్రజలను దృష్టిల వుంచుకునే చెప్పిండు. ‘దీపావళి’ మీద చాన మంది కవిత్వం రాసిండొచ్చు. కాని కాళోజీ రాసింది చూస్తే ఆయన దృష్టి ఎట్ల వున్నదో తెలుస్తది.
‘మిద్దె మేడల మీద మింటి చుక్కల దాక
వేయిరంగుల వెలిగె వింత దీపాలు
ఊరి వెలుపల వున్న పూరిగుడిసెల దూరి
లోని చీకటి బాపలేని దీపాలు
దోచి దాచిన దెంతో దుర్భాగ్యులకు జూప
ధనపూజ చేయించు ఝర్మదీపాలు
రక్కసుని చావుచే రంజిల్లె జగమంచు
కోటి వెల్గుల చాటెనాటి దీపాలు
రక్కసులు బాధింప రక్షణే లేదంచు
కోటి రీతుల జెప్పు నేటి దీపాలు”
1945ల రాసిన గేయం ఇది. దీపావళులెన్ని వచ్చినా పూరి గుడిసెల లోపటి చీకట్లను పారదోల లేకపోతున్నయని కాళోజీ ఆవేదన.
1944ల జనగామ, నల్లగొండ ప్రాంతాల లోపల రైతుల మీద కూలీల మీద జరిగిన దౌర్జన్యాలకు, అణచివేతకు బాధపడి రాసిన కవితల - ప్రజలు ఈ దౌర్జన్యాలు సహిస్తూ ఎంతకాలం వుండాలె వాండ్లకు విముక్తి లేదా అంటడు.
”నవయుగంబున నాజీవృత్తుల నగ్ననృత్యమింకెన్నాళ్లు?
దమననీతితో దౌర్జన్యాలు పోషణ బొందేదెన్నాళ్లు
దొంగలు దొంగలు వూళ్లు పంచుకొని దొరలై వెలిగేదెన్నాళ్లు
బాధలుపెట్టి పలుకనీయని పాపుల భయమింకెన్నాళ్లు
ప్రజాదరణ కోల్పోయి దేశమును పాలనచేసేదెన్నాళ్లు
శాంతిభద్రతల పేర దుష్టతను సమర్థించుటింకెన్నాళ్లు
తత్త్వభేదముని మనలో మనకే తన్నులాటలింకెన్నాళ్లు
ప్రజాశక్తికి పరీక్ష సమయం ప్రతీక్ష మనకింకెన్నాళ్లు”
అని నిలదీసిండు. బాధలుపెట్టి పలుకనీయని పాపుల భయమింకెన్నాళ్లు అని కాళోజీ రాసిందాంట్ల ఒక ఉర్దూ సామెత, వెత వున్నాయి. దౌర్జన్యం చేసేవాడు చేసిపోతే ఏడ్చేవాడు ఏడుస్తడు. కాని కొందరు దౌర్జన్యం చేసి ఏడువ గూడ ఏడ్వనియ్యరు. ‘జాలిమ్ మారే ఔర్ రోనే భీ నహీ దియే’ అని కట్టి ‘ఏడ్వకు, ఏడిస్తె తంత - ఆఁ’ అనుడన్నమాట. ఆనాటి పాలకుల, పాలితుల పరిస్థితులకద్దం పట్టిన వ్యవహారం ఇది.
ఎన్ని చేసినా, ఎంత చేసినా, ఎన్ని అభివృద్ధికరమైన పనులు చేసినమని చెప్పుకున్నా, సామాన్యుడైన రైతు పరిస్థితి మెరుగుపడకపోతే దేశం తీవ్రంగ నష్టపోతది. దేశం, రైతు మీదనే ఆధారపడి వున్నది గద. ప్రజలకు తిండిపెట్టే రైతు బాగుంటె గదా అందరి ఆటలు సాగుతాయి.
‘నర్తకుని నాట్యాలు, గాయకుని గాత్రాలు, వాదితృని వాద్యాలు శిల్పకుని శిల్పాలు చిత్రకుని చిత్రాలు, అంగనల అందాలు, కందర్పు కయ్యాలు కవిరాజుకొవ్వాలు కర్షకా నీ కర్రు కదిలినన్నాళ్లే’ అని రైతు ప్రాముఖ్యాన్ని కాళోజీ ‘50′ ఏండ్ల కిందటి కవితల చెప్పిండు. మనం గూడ అంటున్నం గత రైతే వెన్నెముక దేశానికి అని. కాని ఆ రైతన్న వెన్నెముకను చాతనైనన్ని తీర్ల విరగ్గొట్తున్నం.
కాళోజీ, తన కవిత్వాన్ని సామాన్య ప్రజలనుద్దేశించి రాసిండు. ఆయనేమన్నడంటే - ‘పది వుపన్యాసాలు చెయ్యలేని పనిని ఒక కథ చేస్తది. అట్లనే పది కవితలు చెయ్యలేని పనిని ఒక గేయం చేస్తది’ అని.
‘కాళోజీకి కవిత్వం పరమావధిగాదు. మానవత్వం పరమావధి. ఇంట్ల సంభాషణవలెనే, ప్రజల మధ్య ప్రసంగం వలెనే కవిత్వం ఆయనకు ఒక సామాజిక వాహిక’ అన్న మిత్రుని మాటలు ఇక్కడ ఉటంకించటం అప్రస్తుతం గాదు. అందుకే ఏది చెప్పినా సూటిగ చెప్పిండు కాళోజీ. ప్రపంచంల వున్న వ్యత్యాసాలను మనం చూస్తునే వున్నం. ఆ వ్యత్యాసాలు చెయ్యంగనే ప్రపంచంల అవకతవకలు జరుగుతున్నయి.
ఒకడు తన అవసరాలకంటే ఎక్కువగ సంపాదించి పెట్టుకుంటడు. ఇంకోనికి అవసరాలే తీరయి. సంపదంతా ఒక్క దగ్గరే పోగుపడి సామాన్యునికి అందుబాటుల లేకుండ పోతున్నది.
‘అన్నపురాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట
హంసతూలికలు ఒకచోట, అలసిన దేహాలొకచోట
సంపదలన్నీ ఒకచోట, గంపెడు బలగంబొకచోట
కమ్మని చకిలాలొకచోట, గట్టి దవడలింకొకచోట’
అంటడు. ఈ వ్యత్యాసాలు తొలగనిదే సామాన్యుడెట్ల బాగుపడ్తడని కాళోజీ ఆవేదన.
అసలు ప్రజలను పట్టించుకోకుండ, పాలకులు, సమాజం లోపటి పైవర్గాలు తమతమ సంపదలను పెంచుకుంటు పోతున్నరు. అగచాట్లు పడుతున్న ప్రాణమైనటువంటి అల్పమానవు నడిగేదెవండు? అని ఆయన ఆరాటం. ‘శాశ్వతము కానట్టి సంపదల సమూబార్చి స్వార్థాలు సాధింప సమకట్టె భూనాధుమన్ననల బడయుటకు మార్గములవెదకుచు పడరాని అగచాట్లు పడునట్టి ప్రాణుల అల్పులగు మానవుల నడిగేదెవండు?’ అందుకనే, పాలకులు స్వార్థభావన లేకుండ మానవసేవ జేస్తే, దేవుడనే వారుంటే, వాని మన్ననలకు పాత్రులయితరంటడు కాళోజీ. సామాన్య మానవుడే దేవుడు, వేరే దేవుడు లేడని అంటరు.
పంట పండిచే రైతులు, కల్తీ విత్తనాల తోటి, కల్తీ ఎరువుల తోటి, కల్తీ మందుల తోటీ ఎంత వేదనననుభవిస్తున్నరో మనం చూస్తున్నదే. ఆ రైతు ఉపాసం పంటే, పంట పండించే ప్రాణాలే ఉపాసం పంటే, రాజ్యానికి రక్షణ ఎక్కడ? అని 1942లనే అన్నడు. ”పండించు ప్రాణాలు పస్తు పడ్డాక, పాడు రాజ్యాన్ని కాపాడుకుంటేమి?’ అని.
ఆనాడు హైద్రాబాదులో జరిగిన ఉద్యమాలల్లో పల్లె పల్లెలో జరిగిన దౌర్జన్యాల్ని చూచి తల్లడిల్లి రాసిన ‘చాలింక’ అన్న గేయం కాళోజీ ధర్మాగ్రహాన్ని చెప్తది.
”రక్కసి తనముకు పిశాచవృత్తికి దొరికిన రక్షణ చాలింక
పాలనపేరిట పల్లె పల్లెలో జరిగే పాపము చాలింక
బీదల సర్వస్వముతో ధనికులు చేసే బేరము చాలింక
మూతులు నాకుచు ఆత్మవంచనతో కట్టిన మూటలు చాలింక” అంటడు.
పాలకులు దోపిడిదారులకు రక్షణ ఇచ్చి, వాండ్లను కష్టపడే వాండ్ల కంట పాలకులు దాచిపెట్టినా, ఏదో ఒక రోజు వాండ్ల రోజులు అంతమౌతయి. అన్ని రోజులూ దోపిడిదారుల కచ్చిరావు.
‘కాజేయు వారలను కష్టించువారల కంటే పడనీకుంట కాపాడు చుండిన
కోటగోడలు నేల కూలుతున్నాయి. కోటగోడలు నేల కూలుతున్నాయి’
ఎప్పుడు గూడ ”అయ్య నీ బాంచెన్ కాల్మొక్త’ అనేటోడు అట్లనే వుండడు. వాడు దొర గొంతును అదిమే రోజు వస్తది. రావాలి అనేది కాళోజీ ఆశంస.
ఏ ప్రభువైనా పాలకుడైనా కేవలం పట్నాల పట్లనే దృష్టి కేంద్రీకరించి అన్ని అవకాశాలు కలుగ చేసుకుంటుపోతే పల్లెలు ఏంగావాలె? అక్కడి సామాన్య ప్రజలేం గావాలె? రైతులేం గావాలె?
”రాణివాసములోన రంజిల్లు రాజా రైతు బాధల దీర్చి రక్షించవలేవా
పట్టణపుసొగసుకై పాటుపడు రాజా పల్లెకందము గూర్చు ప్రతిభయేలేదా
భూములన్నియు నీకు భుక్తమైనట్లు పల్లె పేదల బాది పన్ను లాగెదవా
పోషించు వాడవని పూజించు జనుల పీఠమెక్కిన దారి పీడించుటేనా
సామాన్య జనులకు చైతన్యమొడవ చతురంగ బలముండ జంకేల రాజా
ప్రజలను హింసించు ప్రభువు మాకేల వధియింప భక్షింప వనరాజులేడా?”
అని ప్రజల తరఫున నిలబడి ధైర్యంగ ప్రశ్నించిండు. ఇవ్వాళిటి భూసేకరణలు, భూ పంద్యారాలు, కండ్ల ముందట వున్నయేగదా.
ఏ ప్రభువైనా, పాలకులైనా, అధికారంలో వున్న వాళ్లూ, ప్రజల మీద, ప్రజా సంస్థలమీద పగపట్టడం పనికిరాదని నిరంకుశత్వంతో నీల్గకూడదని ఎంత గట్టి కట్టయైనా పిల్లి చాష్టలకోసం చిన్న చిల్లి పొడిచినా అది పెద్దదయి నీటి ప్రవాహానికి తలవంచక తప్పదని, ప్రజాబలం అటువంటిదని చెప్తడు కాళోజీ. ప్రజల శక్తి నివురు గప్పిన నిప్పువంటిదని అది వెలిగిందంటే నింగిని ముట్తదనీ ‘అయ్యా బానిసను అన్న పౌరుడే అయ్యా గొంతుకను అట్టే అదుమున్’ అని ఘాటుగ చెప్తడు. 1946 మాట ఇదొ అట్లనే, ఆ తర్వాత దేశంలోపట, రాష్ట్రంలోపట పరిస్థితులు మారి ఆందోళనలు చేలరేగినప్పుడు శివప్రవచనాలు పలికి, శాంతియాత్రలు చేసి శాంతిగ వుండండి ప్రజలారా అని ప్రవచనాలు చెప్పే పాలకులను అంతే ఘాటుగ అడిగిండు. ‘గుండె మాడి పోతుంటే బ్రతుకు చితికిపోతుంటే, కండ కరిగిపోతుంటే, ఎముక విరిగిపోతుంటే, శాంతి శాంతట శాంతి’ శాంతి తిమిరాన్ని చిందుతున్నది. శాంతే పుచ్చలల్లుతున్నది. పొదుగు విషం చెపుతున్నది. కాపే పొలం మేపుతున్నడు. రక్షణే భక్షిస్తున్నది. ఈ పరిస్థితుల్ల శాంతి ఎట్ల? అవు. శాంతిగ మెలగుట మంచిదే కాని శాంతి పరిస్థితి కలదా సఖుడా అని నెయ్యమై మందలిస్తడు. కాళోజీ ఏం చెప్పినా సామాన్యుని దృక్కోణం నుంచే చెప్పిండు. వాని తరఫున్నె ఎవనితోటైనా మాట్లాడిండు ‘నా గొడవల’.
ఆయన ఆరాటం అంతా మానవుని గురించే. కాళోజీ రామేశ్వరావు గారన్నట్లు ‘నేనెప్పుడు మనిషిని గురించి అడిగినా నాకు జనాభా లెక్కలు చూపకండి. మనిషి (ఇన్సాన్) మానవత్వమున్న మనిషి గురించి చెప్పండి అన్నట్లుగానే మానవుని మానవత్వం గురించే బతుకుంతా పాకులాడాడు. ఈ కుహనా విలువలున్న సమాజంలోపట మానవత్వం మంట్లె గలుస్తున్నదని సమాజమంతా బిన్ (మర) సతుగ మారిందని అంటడు. మనిషి మనిషిని మనిషిగ చూచే వీలులేనంతగ సమాజం, మనిషి హృదయం కలుషితమైందంటడు.
‘మానవుని మానవుడు మానవుని మాదిరిగ మన్నించలేనంత మలినమైనాది మానవుని హృదయంబు మలినమైనాది, జాతియని, రీతియని, దేశమని, వేసమని విసము గక్కే వింత బిసగమారినది. ఆధునిక ఆర్భాటమందణిగి ఆ పనియె ఆత్మజచ్చీ జనుల అడివియైనాది. మానవుని హృదయము మలినమైనది’.
తను ఏం జేసినా, ఏం చెప్పినా, ఏం రాసినా సామాన్యునికి చేరాలనేటటువంటిదే కాళోజీ ఉద్దేశ్యం.
మానవుల సహజమైన చిత్తవృత్తి గురించి, దాని నతీజ గురించి చెప్తూ
రాయి రువ్వినా, రాకెట్ విసిరినా, గిట్టనివానిని కొట్టుటకే కద
కాలనడిచినా కారుయెక్కినా, కోరిన చోటికి పోవుటకే కద
గేను కొరికినా కేకు నములినా ఆకలి మంటను ఆర్పుటకే కద
ఆకు కట్టినా కోకచుట్టినా తోచిన కాడికి దాచుటకే కద-
ఈ సామాన్యమైన సామాన్యుల భాషే కాళోజీ తన కవిత్వాని కెంచుకున్నది. ఎవరికోసరం మనం చెప్తున్నమో వానికి తెలువాలె. దాన్ని వాడు ఆచరణల పెట్టాలె కద. పెట్టాలంటే తెల్వాలె గద? వాని బాసయాసల చెప్తేనే వానికి తెలుస్తది అదీ సంగతి.
అరవ చాకిరి చేసినా, సామాన్యునికి గుర్తింపు లేదని, ఆరుగాలం వెన్ను విరుగుతున్నా, అనాదరణ, అవహేళనలే వానికి మిగుల్తున్నయని, మస్కా గొట్టేవానికే గుర్తింపు దొరుకుత్నుదన్న సత్యాన్ని చెప్తూ -
మాడుపొట్టతోడ తాను గాడిద చాకిరి చేయగ
తోకవూపి మూతినాకు తుచ్ఛలకే వైభవాలు
వెన్నుపూస బొక్కవిరుగ తన్నుకొని మోసినను
అనాదరణ అవహేళన సనాతనము ఈ జగాన” అంటడు.
అనామకుని ధీశక్తిని అడగేవాడే లేడు. అంతా ఆడంబరాలే.
ఈ సమాజంలో రెండేరెండు రకాలు. కుటిలమతులు, దేబెమొగాలు. జగతిలో రెండే రెండు రకాలు. దేబెమొగాలను చూస్తే కుటిలమతుల కెప్పుడూ ఆనందమే. వీండ్లను దోచుకోవచ్చునని. అయితే ఆ దేబెమొగాలు తెలివి తెచ్చువోవాలనేది కాళోజీ కోరిక.
కాళోజీ తన కవిత్వాన్నంతటినీ సామాన్యున్ని పునాదిగ చేసుకునే రాసిండు. అందుకోసమే ఆయన దాన్ని ( నాగొడవను) కాలానికి ప్రతికూలంగ పారేది, పోరేది అన్నడు. ఈ పోరాటంల కాంప్రమైజే లేదు కాలునకే కాదు మహా కాలునకును ఏనాడును జీ అనని కాళోజీతో అంటున్న అన్నడు. దాంట్ల సమాభావనలే. సమరస భావనలే. నీనా భావనలే, మన భావనలే. అది ఎదచించుకొని పారునది. సామాన్యుని దుఃఖం పతెగ ఎందరాగ బట్టినా ఆగకుండ వెక్కివెక్కి పచ్చేదే. ఎద చించుకు పారేదే.
ఆయన కవిత్వం - ఆ మాటకొస్తే ఆయనే చెప్పుకున్నడు. తాను కవిత్వం రాస్తున్ననని అంటలేడు. ”నా సమకాలంల జరిగిన జరుగుతున్న సంఘటనలకు అన్యాయాలకు అక్రమాలకు దోపిడీలకు దౌర్జన్యాలకు స్పందించి, వాటికి కారణమైన వాండ్లను ప్రశ్నించిన సామాన్యుని తరఫున, అది మీరు కవిత్వమంటే మంచిదే. అనకున్నా అదేపాయె అని. ఆయన కవిత్వంల నిత్యాసత్యాలనదగ్గ పంక్తులు బోలెడున్నయి. లోకానుభవం తోటి వెనుకటి పెద్దలు చెప్పిన సామెతలవంటివి ఉన్నయి. అవ్వన్నీ సామాన్యుని పక్షమే.
‘హెచ్చుతగ్గులున్న చచ్చిపోవు సమాభావము
సమాభావము లేని చోట సామ్యవాదముత్తమాట
సాగిపోవుటె బ్రతుకు ఆగిపోవుటె చావు
ఆగిపోదలచిన సాగనే లేవెప్పుడు
తొలగి త్రోవెవడిచ్చు త్రోసుకొని పోవలయు
బ్రతుకు పోరాటము పడకు ఆరాటము’
ఇట్ల చిన్న చిన్న మాటలల్ల, ప్రజలకు అర్థమయ్యే వాండ్ల భాషల యాసల చెప్పిన కాళోజీని గత కవులతో పోల్చవలసి వస్తే, ఒక వేమనతోటి పోల్చవచ్చునేమో? ఆడంబరాలను రోసి, ప్రజలల్ల తిరుగుతు, ప్రజల తోటి ముచ్చట్లు పెట్టుకుంట ప్రజల మనిషి అనిపించుకున్నడు వేమన. అట్లనే కాళోజీ. అసలు మనిషంటే కాళోజీ దృష్టి తోటి చూస్తే చాన చిత్రమనిపిస్తది. ఓపారి జడ్చర్లల ఒక సభ జరుగుతున్నది. అక్కడ వేదిక మీద కాళోజీ, కాలేజీ ప్రిన్సిపాల్ ఇంక కొందరున్నరు. ఇంతట్ల ఒక కుర్చి తక్కువైందనిపించి, ప్రిన్సిపల్ అక్కడెవరన్న మనిషుంటె పిల్చి ఓ కుర్చి తెప్పించండి అన్నడు. కాళోజీ చట్టుక్కున మనం అందరం మనుషులంగాదన్న మాట. వారు పని జేస్తరు గనక, శ్రమపడ్తరు గనుక మనిషి. నిజంగా వాడే మనిషి అన్నరు. అదీ మనిషికి కాళోజీ నిర్వచనం.
1940ల రైతుల కష్టాల గురించి రాసిన కాళోజీ 1960ల రాసిన గేయంల గూడ రైతు పక్షమే వహించిండు.
‘విత్తనాల గింజలతో విందులారగించి త్రేన్చి
వ్యవసాయం సాగదనుచు వగలమాటలెన్నాళ్లు
కర్రు ఎద్దు లేదనుచు కుయ్యొమొర్రో యను రైతును
మరనాగలి వివరాలతో, మాటు చేయుటెన్నాళ్లు
బావి పూడ్కె తీయలేక బావురుమను కాపన్నను
పవరు పంపుతీగలతో భంగపరచుటెన్నాళ్లు’ అన్నడు
ఇవ్వాళ్ల రైతుల పరిస్థితుల గురించి వస్తున్న వార్తలు చూస్తే చేస్తున్న ప్రచారం చూస్తే, ఈ గేయం ఇవ్వాళ గూడ రెలవెంటే. వ్యవసాయ అభివృద్ధి పేరిట కోట్లకు కోట్లు ఖర్చు పెడ్తున్నా, కాస్తు అవుతున్న ఆయకట్టు తగ్గుతున్నదనే గణాంకాలు చెప్తున్నయి గద. ‘మిరియాల పాలు ఖర్చు, పుచ్చిన జొన్నల సేద్యం’ అని బనాయించిండు కాళోజీ. ఇదంతా ఇల్లు విడిచి పందిరి వేసే బుద్ధి అని చురకలుపెడ్తడు.
సామాన్యున్ని ఆలోచించకుండ చేసి, వాడేం ఆలోచించాల్నో మనమే చెప్పి వాణ్ని బానిస వలె చెయ్యాలని చూస్తున్నరు. ప్రజలందరు గొర్రెలని భావిస్తున్నరు అంటరు కాళోజీ. ప్రజలను దగాచేస్తున్నరు. దగా గడ్డి కరిపించి వగలగాలి పీల్పించి వగల వీళ్లు తాపిస్తున్నరు. అనీ అంటడు. సామాన్యుని అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఆడుతున్న దొంగ నాటకాలకు తెరవేయలని హెచ్చరిస్తడు కాళోజీ.
సామాన్య ప్రజలు భయం భయంగా బ్రతుకుతున్నరు. తమ దైనందిన క్షేమాన్ని ఆకతాయి వర్గం దగ్గర కొనుక్కోవాల్సిన పరిస్థితులు వచ్చినయని బాధపడ్తడు. ప్రజల సాహసం గొప్పది, నివురు గప్పిన నిప్పు అది. అంటూ, నివురు గప్పిన నిప్పుగ వుంటూ నింగి ముట్టే జానపదుల సాహసాన్ని శంకించవద్దని హితవు చెప్తడు.
సామాన్యుని బతుకులు,
బొర్రడాకలి మీద బుర్రసమ్మెట పోట్లు,
నడుమ మిడుకుచు నలుగు ఎడద ఏడుపు కాట్లు
అయ్యయ్యో మన బతుకులు
అడుగడుగున గతుకులు -
ప్రతివాని ఎదలో పొంగిపారెడి అగడు
ప్రతివాని మొగములో చిందులొదడ బెగడు. అని
సామాన్యుని బతుకు, అగడును లోపల దాచుకున్న బెగడు వతుగ అయిందని పరిస్థితులను కండ్లకు కట్టిస్తడు.
ప్రజలంటే సామాన్యులు కారు. ‘పెత్తనాల మదమణచగ సత్తాదారులు’ ప్రజలు. అయితే ఆత్మశక్తిని ప్రదర్శించగలగాలె. ప్రజాస్వామ్యం లోపట ప్రజలే మేటి. సామాన్య ప్రజకు కావలసింది, లేదా వాండ్లకున్న సమస్యంతా కూటి సమస్య, గూటి సమస్య, గూటి లోపటి గువ్వల జంట సమస్య. ఈ సమస్యలు తీరందే, కర్మయోగం, గీతా బోధలు వ్యర్థం వ్యర్థం అంటడు. ఎందరో ఎప్పటి నుంచో రాస్తున్నా ఇవ్వాళ్టికీ పరిస్థితి బాగుపడలేదనీ, ‘కంఠములెన్నో’ అరిగెను, కంటకాలు మాత్రం తరగలేదని, లోకం తంటాలు తీరలేదనీ” బాధపడ్తడు.
కాళోజీకి బతుకు మీద గొప్ప విశ్వాసం. అందుకే అంటరు బతుకు తప్పదు. బతక్క తప్పదు. శాస్త్రం తప్పుతుంది, ధర్మం తప్పుతుంది, న్యాయం తప్పుతుంది కాని బతుకు తప్పదు. బతక్క తప్పదు. అనేది కాళోజీ మాట.
సామాన్యుల పండుగ ‘బతుకమ్మ’ గురించి ఆయన రాసిన కవిత బతుకు విషయంల ఆయన దృష్టికి ఉదాహరణ. ప్రపంచంలోపట బతుకును పర్సానిఫై (personify) చేస్తున్న పండగ ఇంకెక్కణ్నన్నా ఉన్నదో లేదో అనుమానమే. తెలంగాణకు మాత్రం అది ప్రత్యేకం అనేటోడు కాళోజీ.
రాజకీయాలు కాదు ప్రజాకీయాలు కావాలనేది ఆయన సిద్ధాంతం. ఎలక్షన్లు - గెలిచిన వాని, రాజకీయాల, రాజకీయ పార్టీల సంబరంగ వుండవద్దు. ఓటర్ల సంబరంగ ఉనప్పుడు అది నిజమైన ప్రజాస్వామ్యం. ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద అచంచల విశ్వాసమున్నది కాళోజీకి.
చరిత్ర కారుడెప్పుడూ జరిగిన చరిత్రను, తర్వాతి కాలంల సేకరించిన, కొంత విని రాస్తాడు. కాళోజీ ప్రజల్ల తానొక్కడై ప్రజా ఉద్యమాలల్ల పాల్గొని సమకాలీనుడుగా ప్రత్యక్షంగా చూచి రాసిన కవిత్వం ఆయనది. చిత్తశుద్ధి వున్న కవిత్వం.
దేవులపల్లి రామానుజరావు అన్నట్లు కాళోజీ ఎక్కడ వున్నా ఏం చేసినా ఆయన ప్రజల మనిషి. ప్రజల గొడవే కాళోజీ గొడవ. ఆయన కవితా సంపుటాల్లోని ప్రతి పేజీ ఇందుకుదాహరణ. ప్రజల సమస్యలే ఆయనను కవిగా పలికించినవి… ప్రజా హృదయాల స్వరూపం, ఇందులో సమగ్రంగ మనకు కనిపిస్తుంటది. ప్రజల భాషలో ప్రజల హృదయాలను ప్రదర్శించిన తెలుగు కవి కాళోజీ. అందుచేతనే నూటికి నూరుపాళ్లు ‘ప్రజాకవి’.
వరవరరావు అన్నట్లు ‘కాళోజీ అణగారిన శ్రమజీవులు నిర్మించిన పోరాట చరిత్రతోపాటు నడిచి బతుకంతా దేశానిదైన మనిషి’.
కాళోజీ గొడవ మౌలికంగా మనిషి గొడవ. ఆయన రక్తమాంసాలున్న మనిషి. సత్యాన్వేషి. నిత్య పథికుడు. నిత్యాన్వేషి. నిత్య పథికులైన రక్తమాంసాలున్న మనుషులందరికీ అర్థమయ్యే భాష ఆయనది.
లోక్‌నాయక్ జెపి ని స్మరిస్తూ ఆయన రాసిన ”పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది” అన్న మాటలు అక్షరాల ఆయనకు వర్తిస్తాయి.
ఖలీల్ జీబ్రాన్ ప్రాఫెట్‌లో ‘అల్‌ముస్తఫ’ను తానుండిన కాలానికి తానే ఉషస్సయిన వాడు’ అంటరు. ప్రజా కవి కాళోజీ కూడ తానుండిన కాలానికి తానే ఉషస్సయి వెలుగు జాడ చూపినవాడు.
g.laxman rao సెప్టెంబర్ 2007 1
ramashastri gari vyasam kalojini koloji velugunu chupindi dhanyavadalu.
రాకేశ్ తెలంగాణ్ సెప్టెంబర్ 2007 2
కాళోజీ రచనలగురించి అద్భుతంగా రాసిన నాగిళ్ళ శాస్త్రి గారికీ, ప్రచురించిన ప్రాణహితకూ హృదయపూర్వక నమస్సులు.
ఇంకా తనివి తీరలేదు… can we have some more like this please.
ఆమ్ ఆద్మీ సెప్టెంబర్ 2007 3
quote:
‘లాల్‌ఖిలాపై ఎత్తిన జెండా కొత్తదే గాని దాన్ని ఎగరవేసిన దండా (జెండాకర్ర) నాదిర్‌షా కాలందే’. జెండా మారింది గాని దండా మారలేదు. పతాకం మారింది గాని పాలన మారలేదు.
unquote:
అద్భుతంగా రాశారు.