సెప్టెంబర్2007
ఒక సావు
ఊర్లె ‘పల్లెబాట’ ప్రొగ్రాం.
లోకల్ మినిష్టరు, ఎమ్మెల్యే, ఖద్దరు బలగం వస్తుండ్రు.
రాత్రంతా కూసుండి ‘ఉపాది హామీ’ కూలీల లిస్టు, ఇందిరమ్మ ఇండ్ల లిస్టు, పించిని కార్డు లిస్టు అదోటి, ఇదోటి తయారు చేసిండు సెకిరెట్రి. తెల్లారే ముందట కన్నుంటుకుంది.
ఇద్దరు సుంకర్లు వచ్చిలేపితే ఆదుర్దగా లేచిండు సెకిరెట్రి. వైకుంఠం సచ్చిపోయిన సంగతి చెప్పిండ్రు. ఉరి పెట్టుకుని సచ్చిండని గూడ చెప్పిండ్రు. వాని మంచితనం గూడ కొంత చెప్పిండ్రు. చెప్పి చెప్పి ‘దిక్కు దీము లేనోడు సారు… ఊర్లెకు పదిపన్నెండేండ్ల కింద బతుకచ్చిండు… బట్టపొట్టకు తుట్టిలేకుండ బతుకుతుండె, ఏమైందో ఏమో, ఈ నడుమ అప్పుల పాలైండు’ అన్నరు.
సెకిరిట్రికి జాలి పుట్టింది అయినా ఉత్తగ చేయాలనిపించలేదు. కులంల పెద్ద మనిషిని పిలుచుకుని రానికాడరాయన్నట్టు నూర్రూపాయలు తీసుకుని ‘నార్మల్ డెత్’ అని పంచనామ రాసిండు. మినిష్టరు పోగ్రాము లేకుంటే ఈ కతనే వేరుంటుండె అనుకుంటూ ‘గంటల శవం బూడిద గావాలె, జెట్టన ఎత్తుండ్రి’ అని చెప్పిండు.
వచ్చెటోళ్లకు వసతులు, మీటింగు ఏర్పాట్లు, పనిలో పడి సెకిరెట్రీ శవం సంగతి మరిచిపోయిండు. పదిగొట్టంగ ఎందుకో యాదికచ్చింది ‘అరే, పీనుగు ఇక్కడి నుంచే పోవాలె గదా! సప్పుడు లేదు’ అనుకున్నడు. వెంటనే బండిమీద ఊరి చివరున్న వైకుంటం ఇంటికిపోయిండు.
ఇంట్ల జనమున్నరు. ఇంటిముందు తుమ్మమొద్దు మండుతుంది. అప్పుడప్పుడు సన్నని ఏడుపు వాదనలు తప్ప సందడేం లేదు. అక్కడ పరిస్థితి చూస్తే ఇప్పట్లో శవాన్ని ఎత్తేటట్టు లేరనిపించింది.
‘ఏమాయెరా, ఇప్పటికే సలిపీనుగైంది. ఇంకా ఎత్తరా, ఎత్తండ్రి’ అన్నడు సెకిరెట్రీ గరంగరంగా బయట నిలబడి.
ఎవ్వలు సప్పుడు జెయ్యలేదు. ఇంటి పక్క లింగం మాత్రం బయటకచ్చిండు ‘ఏంది, ఎత్తెడిది నా గోషి, ఏమయిందో ఎరికనై, పోలీసోళ్లు నిన్న పొద్దునపట్టుక పోయిండ్రంట పొద్దుగూకి ఇడిసిపెట్టిండ్రు. పొట్టుపొట్టు గొట్టిండ్రు. పెయ్యిమీద వాతలున్నాయి. వాడు ఆ దెబ్బలకి సచ్చిండు. మినిష్టరత్తండు గదా, రాని శవాన్ని ఆయిన ముందటనే పెడుతం. పోలీసుల కతేందో సూత్తం…’ అన్నడు కోపంగా.
సెకిరెట్రీ గుండె దడీలు మంది. ‘అరే, ఉరిపెట్టుకున్నడని ఎరుకైతే కేసులంటరు. పోస్టు మార్టమంటరు, పైసలు కర్సయితయి. పర్షానైతరు…’ భయపెట్టిండు.
లింగంకు చోటామోటా లీడర్లు ఇద్దరు ముగ్గురు జమయిండ్రు. పోలీసు దెబ్బలకే ఉరి పెట్టుకుని సచ్చిండన్నరు. ఇది లాకప్‌డెత్తుకంటే గోరమన్నరు ‘వైకుంటంకు ఎనుకముందు ఎవలు లేరనుకుంటున్నవేమో.. మేమున్నం’ అని గట్టిగా చెప్పిండ్రు.
లింగం ఆటో నడుపుతడు. ఆక్సిడెంటయి ఆటో టేషన్లనే ఉంది. కేసయింది. రోజూ పోలీసుల సుట్టూ తిరుగుతుండు. ఈ సంగతి సెకిరెట్రీకి తెలుసు.
పోలీసులు ఊర్లెనే ఉన్నరు. పెద్ద పెద్ద కుక్కలతో తొవ్వపొంట తిరుగుతున్నరు. సెకిరెట్రీ ఈ వార్తను ఎస్సై చెవుల ఏసిండు. వంద రూపాయలకు కక్కుర్తి పడ్డ సంగతి చెప్పలేదు గాని పోలీసులను రక్షించుటకే నార్మల్ డెత్ రాసినన్నడు. ఎస్సైకి చెముటలు పుట్టినయి. ఇప్పుడో అప్పుడో మీటింగు. బయటకు పొక్కితే పునాదులు కదులుతయి. ఏదో ఒకటి చెయ్యాలనుకున్నడు. లింగంను పిలుసుకున్నడు.
”లింగం, మేము కొట్టాలని కొట్టినమా, వీడు గోపాల్‌కు బాకీ ఉన్నడట. వాడు స్టేషన్ కచ్చి కంప్లెంటు రాసిచ్చె. ఏదో కాంప్రమైజు కాండ్రని బెదిరిచ్చినం, అంతే!” బతిమిలాడినట్టు అన్నడు ఎస్సై.
నిండుగా ఖాకీ బట్టలతో, చేతుల తుపాకితో ఉన్న పోలీసు బతిమిలాడే సరికి కరిగిపోయిండు లింగం. తడుముకుంటు ‘అక్కడ అదే అంటుండ్రు సార్. టేషన్ నుంచి వచ్చేటప్పుడే సొలుక్కుంట వచ్చిండట’ అన్నడు.
ఎస్సై ఇంకా తగ్గుతూ ”ఆ, టేషన్ల నీ ఆటో ఉంది తెచ్చుకో, వాళ్లను కాంప్రమైజ్ చేస్త కేసులేకుంట జేత్త…” అన్నడు.
లింగం తలూపుతూ ఇంటికచ్చిండు.
శవం దగ్గర జనం గరం మీదున్నరు. ఏ క్షణం నైనా శవాన్ని ఎత్తి మీటింగు దగ్గరికి తీసుకపోయేటట్టున్నరు. లింగం గాలిని గోపాల్ దిక్కు తింపిండు.
వత్త వత్తనే ”వాళ్లను గాదురా, మన పక్కలనే ఉన్నది పాము. మొదలు దాన్ని పట్టాలే. గోపాల్ గాడట… బాకీ ఇచ్చిండట… రేపటి వరకు పైసలు గట్టాలె లేకుంటే ఇంటి ముంగల పొయ్యి వెడుతనన్నడట. ఇజ్జత్ పోరడు. బయానికి పాణం తీసుకునే…” అన్నడు.
గోపాల్ పేరు వినంగానే మందిలోంచి రాజు ఎగిరి గంతులేసిండు. గోపాల్‌కు రాజుకు మాటల్లేవు ”వాడా, పాపాత్కుడు, పైసకు రోత దింటడు. జరాగు వాని శిలుం ఒదులాలె” అన్నడు.
అప్పుడే సెకిరెట్రీ వచ్చిండు. వత్తవత్తనే ”ఏమాయెరా.. ఎత్తండ్రి. ఇంకెంతసేపు… ఏడ్సి ఏడ్సి పొల్లగాండ్లు సొమ్మసిల్లి పోతరు” అన్నడు లింగంను చూస్తూ.
లింగం ఎనుక తొక్కుడు తొక్కిండు. రాజు ముందటికచ్చిండు.
”ఎత్తుడులేదు గిత్తుడులేదు.. వానికిద్దరు ఆడివోరగాండ్లున్నరు. నిలవడవోతే నీడలేదు. గోపాల్‌గాడు రావాలె, పిల్లలకు ఏదన్నా ఆదారం పెట్టాలె. అప్పటికిగాని కదిలేదిలేదు…” అన్నడు రాజు.
అక్కడు అందరు అదేమాటన్నరు. పాణం తీసినోడే దారి చూపాలన్నరు.
గాలి అటు నుంచి ఇటు తిరిగేసరికి సెకిరెట్రీకి తల దిరిగిపోయింది. ఒక దిక్కు మీటింగుకు టైం దగ్గరపడుతుంది. కార్లు జీబులు తీరుగుతున్నయి. ఇక్కడ ఏం చెప్పినా జనం వినేటట్టులేరు. ఏదో ఒకటి చెయ్యాలని ఆగమాగాన గోపాల్‌ను కలుసుకుని బెదురగొట్టిండు.
గోపాల్ మామూలు రైతు. సంగతి తెలుసుకుని బెదిరిపోయిండు. వసూలైన బాకిలో సగం మాకే అన్నరు పోలీసులు. మొండి బాకీలు గదా సరే అనుకున్నడు గనీ ఇంత పనైతదనుకోలేదు. ఏదో ఒకటి చెయ్యిమని సెకిరెట్రీని బతిలాడుకున్నడు.
అప్పటిమందం ఐదు వందలు నొక్కిన సెకిరెట్రీ రాజును తెచ్చి గోపాల్ ముందుంచిండు.
గోపాల్ గోసలెక్క చూసి ”రాజూ, నేనేం ఉన్న మారాజునా చెప్పు. వాని భార్యకు ఆపిరేషనంటే నిలవడ్డ. మూడు నాలుగేండ్లాయె. నా బిడ్డ లగ్గముందని అడిగిన గంతే. అసలిదంతా బ్యాంకోళ్లు చేసిండ్రురా. జీబు మీద ఇంటి మూడు సుట్లు తిరిగిరి. ఇంటికి తాళమేసి అమ్ముతమన్నరట…” అన్నడు.
రాజు నోరు తెలవక ముందే నోట్లకట్ట ఒకటి చేతులవడ్డది. నోట్లను చూసి నోట్లె తడారిపోయింది రాజుకు. పెదువులు తడుపుకుంటూ శవం దగ్గరికచ్చిండు.
అప్పటికి పదకొండు దాటింది. ఎండ ముదురుతుంది. శవం దగ్గెర ఆగి ఆగి ఏడుపులు వినిపిస్తున్నయి. జనం వస్తూ పోతున్నరు. వాకిట్ల తుమ్మమొద్దు మంట సల్లారుతుంది.
రాజు గాలిని బ్యాంకు దిక్కు తింపిండు. పర్సనల్ లోను కోసం తిరుగుతున్న ఇద్దరు ముగ్గురు పిల్లగాండ్లు ఎగిరెగిరి పడ్డరు. శవాన్ని బ్యాంకు ముందే ఉంచుతమన్నరు. సెల్‌ఫోన్లు అందుకుని మేనింజర్‌కు ఫోన్ చేసిండ్రు. ముందు వాడిగావేడిగా తర్వాత గుసగుసగా మాట్లాడిండ్రు.
మండి మండి తుమ్మ మొద్దు సల్లారి పోయింది. ఏడ్చి ఏడ్చి బార్యాపిల్లలు సొమ్మసిల్లి పోయిండ్రు. శవం మీద ఈగెలు ముసురుతున్నయి.
”తలాపుకు ముల్లెగడుదామన్నా ఇంట్ల పిడికెడు బియ్యం లేవు… ఎన్ని రోజులాయెనో వాళ్లకు తిండిలేక…” లోపలి నుంచి వస్తూ ఓ పెద్ద మనిషి అన్నడు.
లింగం, రాజు, ఇంకో ఇద్దరు ముగ్గురు పిల్లలు అది ఆకలి చావని నిర్ణయానికి వచ్చిండ్రు. ఎవలో వచ్చి నాలుగు కట్టెలను దగ్గెరికి జరిపిండ్రు. తుమ్మ మొద్దు అంటుకుంటుంది. జనంలో ఆవేశం పెరిగింది.
అంతా అయిపోయిందనుకున్న సమయంలో వైకుంటం సావు ఆకలి సావుగా మారటం సెకిరెట్రీకి భయాన్ని పుట్టించింది. అందరినీ సముదాయించాలని చూసిండు. ఎవలూ వినలేదు.
”గవర్నమెంటు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల్సిందే” లింగం అన్నడు.
”ఇద్దరు పిల్లలకు ఆదారం పెట్టాలె” రాజు అన్నడు.
వాళ్లకు సపోటుగా మిగితావాళ్లు ‘నిజమే.. నిజమే’ అన్నరు.
బయపడ్డ సెకిరెట్రీ నిమిషాల మీద ఎమ్మార్వోను తెచ్చిండు. ఏ నిమిషంల మినిష్టరు ఊడిపడుతడో, ఏ వివరాలు అడుగుతడోనని టెన్షన్‌గా ఉన్న ఎమ్మార్వో భయంభయంగా వాకిట్ల నిలబడ్డడు.
ఎమ్మార్వోను చూడంగనే జనం గుంపు గూడిండ్రు. డౌన్‌డౌన్ అన్నరు. మీదిమీదికచ్చిండ్రు. ఉరమురిమి చూసిండ్రు. ఈ చావుకు నువ్వే కారణమన్నరు.
ఎమ్మార్వో మెత్తమెత్తగా సముదాయిస్తుండు. జనం మరింత రెచ్చిపోతుండ్రు.
”రెండులక్షల ఎక్స్‌గ్రేషియా ఇయ్యాలె” లింగం అరిచిండు.
‘సరే, ఆపద్బందు పతకం కింద వారం రోజులల్ల రెండు లక్షలు ఇప్పిస్త’ ఎమ్మారో అన్నడు.
”ఇద్దరు పోరగండ్లు కూనలగుడ్లు. వాళ్ల గతేంది…” రాజు నిలదీసిండు.
”వాళ్లకు హాస్టల్ల ఏసి ఫ్రీగా సదివిస్త” ఎమ్మార్వో చెప్పిండు.
ఎండకు తెప్ప అడ్డమచ్చి గాలిసల్లపడ్డది. తుమ్మ మొద్దు సల్లారి పొగఎల్లుతుంది.
‘ఏమన్న ఉంటే ఇప్పుడే అడుగుండ్రీ. మోఖా దొరుకది… సూట్టాలెవలూ లేరా…?” లింగం అన్నడు.
ఏడ్చి ఏడ్చి కండ్లు ఉబ్బిన మేనమామ బయటకచ్చిండు. ‘ఉండవోతే ఇల్లు లేదు సారూ, ఎవలెవలకో ఇండ్లత్తున్నయి. ఒక ఇల్లు ఇయ్యిండ్రి’ అన్నడు.
‘సరే, ఒక ఇందిరమ్మ ఇల్లు రాయి’ సెకిరెట్రీకి చెప్పిండు.
”సచ్చినోడు సచ్చిండుగనీ పొల్లగాండ్లకు ఆధారం దొరికింది. ఇగ నడిచే పనులు నడువని” ఎవలో అన్నరు.
”బతికి సంపాయించకున్నా సచ్చి సంపాయించిండు తియ్యి” ఒకలు అన్నరు.
అప్పుడే వచ్చిన దూరపు సుట్టం ఒకలు అంతా విని ”మీరిచ్చేది దానికి ఏం నిండుతది. నెలనెల ఎట్లగడువాలె. చేసి పెట్టెటోడే సచ్చే…” అన్నడు.
”అవునవును… నేను మరిచేపోయిన. పించిని ఇయ్యాలె” రాజు అన్నడు.
”అదెంత పని, మన చేతులదో. ఇప్పుడే విడో పించిని పారం నింపి పంపుత…” ఎమ్మార్వో అన్నడు.
”ఇగ ఇంకేంది… ఇచ్చెటియన్ని ఇచ్చిండ్రు. పాపం, పోయిన పానానికి ఎవలేం జేత్తరు. నీయవ్వ, పోరగాండ్లు ఏడిసిసత్తన్నరు. పీనుగు లెవ్వనీ…’ ఓ ముసలాయిన యాష్టగా అన్నడు.
ఏదడిగినా ఇవ్వడానికి సిద్దంగా ఉన్నడు ఎమ్మార్వో.
ఏమడుగాలో జనానికి తోచడం లేదు.
ఎవలో ఎకురం భూమి యియ్యాలన్నరు. సెకిరెట్రీ వైపు చూసి ‘పరంపోగు భూమి ఎక్కడుంటె అక్కడ ఎకురం పట్ట జెయ్యిమని చెప్పిండు ఎమ్మార్వో.
సెకిరెట్రీ తలూపిండు.
”ఇద్దరాడిపిల్లలుంటే యాడాది యాడాది పైసలిచ్చే స్కీముంది ఒకటి. మీరు అడుగకున్నా అది గూడ చేస్తపోండ్రి… జెట్టన శవాన్ని ఎత్తుండ్రి” అన్నడు ఎమ్మార్వో.
అందరు సరేనంటే సరే అన్నరు.
వాకిట్ల తేటు పూర్తిగా సల్లారింది. ఎండగూడా సల్లవడ్డది.
ఇరువై డప్పులతో, హామీలివ్వడానికి మీనిష్టరు ఊర్లోకి అడుగు పెట్టేయాల్లకు రెండు డప్పులతో వైకుంటం శవం ఊరు దాటింది.
umesh varma సెప్టెంబర్ 2007 1
చాలా సూక్ష్మముగా రాసారు.
సంతొషము.