సెప్టెంబర్2007
పారిస్ రివ్యూ - పాబ్లో నెరూడా ఇంటర్‌వ్యూ - 2
(గత సంచిక తరువాయి)
ప్ర: మీరు పేరెందుకు మార్చుకున్నారు? పాబ్లో నెరూడా అనే పేరు ఎందుకు ఎంచుకున్నారు?
నె: నాకు సరిగ్గా గుర్తు లేదు. నేనప్పుడు పదమూడో పద్నాలుగో ఏండ్లున్నాననుకుంటా! నేను కవిత్వం రాయాలనుకోవడం మా నాన్నకు సుతరామూ ఇష్టం లేదు. నేను రాయడం వల్ల నాకు మా కుటుంబానికీ వినాశం కలుగుతుందనీ, ముఖ్యంగా నన్ను పూర్తిగా పనికి రానివాడిగా తయారు చేస్తుందని ఆయన – మంచి ఉద్దేశ్యంతోనే – నమ్మే వాడు. ఆయన అట్లా నమ్మడానికి మా కుటుంబానికి సంబంధించిన కారణాలుండినై. కానీ ఆ కారణాలు నన్నంతగా ప్రభావితం చేయలేదు. మా నాన్న నుండి తెప్పించుకోవడానికి నేను చేసిన మొదటి పని పేరు మార్చుకోవడం.
ప్ర: చెక్ కవి ఝా నెరూడా స్ఫూర్తితో పెట్టుకున్నారా మీ పేరు?
నె: నేనాతని కథ ఒకటి చదివాను. ఆయన కవిత్వం నేనెప్పుడూ చదవలేదు. కానీ ఆయన ‘మాలా స్త్రానా కథలు’ అని ప్రాగ్ లోని మురికివాడల్లోని నిరుపేదల గురించి కథలు రాసాడు. బహుశా నా పేరు అక్కడి నుండి వచ్చి ఉంటుంది. నేనన్నట్టు ఇదంతా చాలా చాల ఏండ్ల కిందటి విషయం. నాకు సరిగా గుర్తు లేదు. ఐతే చెక్ ప్రజలు నన్ను వాళ్ల వాడి ననుకుంటారు. నాకూ వాళ్ళతో మంచి స్నేహ సంబంధం ఉంది.
ప్ర: మీరు చీలీ కి అధ్యక్షుడిగా ఎన్నికయితే రాయడం కొనసాగిస్తారా?
నె: నాకు రచన చేయడం ఊపిరి పీల్చుకోవడం లాంటిది. ఊపిరి తీసుకోకుండా బతుకలేను, అట్లే రాయకుండా జీవించలేను.
ప్ర: రాజకీయంగా ఉన్నత స్థానాల్లోకి ఎదిగి సఫలీకృతమైన కవులెవరయినా ఉన్నారా?
నె: పరిపాలిస్తున్న కవుల యుగంలో మనమున్నాము. మావో సె– టుంగ్, హో– చి– మిన్ ల పేర్లు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. మావోలో ఇంకా గొప్ప లక్షణాలెన్నో ఉన్నాయి. ఆయన గజ ఈతగాడు. నేను కాను. అట్లే మహాకవి లెపాల్డ్ సెంఘార్ సెనెగల్ అధ్యక్షుడు. మరో సర్రియలిస్టు మహాకవి ఐమే సిజేర్ – మార్టినీక్ లో ఫోర్తె–ది–ఫ్రాన్స్ కు మేయర్ గా చేస్తున్నాడు. నా దేశం లో కూడా కవులు రాజకీయాల్లో అనేక సార్లు కలుగజేసుకున్నారు. ఎవరూ అధ్యక్షులుగా ఇంకా ఎన్నుకోబడలేదనుకోండి. అట్లే లాటిన్ అమెరికా లో అధ్యక్షులైన రచయితలున్నారు – వెనెజ్యులా అధ్యక్షుడిగా చేసిన రోములో గాలెజోస్ ఉన్నాడు.
ప్ర: మీరు అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రచారాన్ని ఎలా కొనసాగిస్తున్నారు?
నె: ఒక వేదిక ఏర్పాటు చేయబడుతుంది. ముందు ఉత్తేజపరిచే జానపద గీతాలుంటాయి. తర్వాత బాధ్యులొకరు మా ప్రచారానికి ఉన్న రాజకీయాల గురించి నిర్దిష్టంగా వివరిస్తారు. తర్వాత నేను మాట్లాడేది తక్కువ రాజకీయాలతోనూ ఎక్కువ కవిత్వాత్మకంగానూ, స్వేచ్చాయుతంగా ఉంటుంది. నేను దాదాపు ఎప్పుడూ కవిత్వం చదవడంతో ముగిస్తాను. నేను కవిత్వం చదవక పోతే ప్రజలు నిరాశ పడతారు. అయితే వాళ్ళు నా రాజకీయ అభిప్రాయాలని కూడా వినాలనుకుంటారు. నేను రాజకీయార్థిక అంశాలెప్పుడూ మర్చిపోను ఎందుకంటే ప్రజలకు వేరే తరహా భాష కూడా అవసరం.
ప్ర: మీరు కవిత్వం చదివాక ప్రజలు ఎట్లా స్పందిస్తారు?
నె: నన్ను ప్రజలు గొప్ప భావేద్వోగంతో ప్రేమిస్తారు. కొన్ని ప్రాంతాలకు నేను వెళ్ళలేను వెళితే బయటికి రాలేను. తోసుకొచ్చే సమూహాల్నుండి నన్ను రక్షించడానికి నా చుట్టూ భద్రతా వలయముంటుంది. అట్లా దాదాపు అన్ని చోట్లా జరుగుతుంది.
ప్ర: చీలీ అధ్యక్ష పదవి, నోబెల్ బహుమతి – మిమ్మల్ని దానికి చాలా సార్లు పేర్కొనడం జరిగింది – ఈ రెండూ మీ ముందుంటే మీరు దేనిని ఎంచుకుంటారు?
నె: అటువంటి ఊహాతీత విషయాల గురించి నిర్ణయాల ప్రసక్తే లేదు.
ప్ర: కానీ ఒక వేళ చీలీ అధ్యక్ష పదవీ నోబెల్ బహుమతీ ఒక బల్ల మీద నుంచితే?
నె: నేను వెళ్ళి వేరే బల్ల వద్ద కూర్చుంటాను.
ప్ర: సామ్యుయల్ బెకె కు నోబెల్ బహుమతి ని ప్రదానం చేయడం సరి న్యాయమైనదే అంటారా?
నె: అవును, నేను న్యాయమైందనే నమ్ముతాను. బెకె క్లుప్తంగా రాసినా అద్భుతమైన విషయాల గురించి రాసాడు. నోబెల్ బహుమతి ఎవరికొచ్చినా ఎప్పుడూ సాహిత్యానికి గొప్ప గౌరవం లభిస్తుంది.
నేను బహుమతి సరైన వ్యక్తికి లభించిందా లేదా అనే దాన్ని గూర్చి వాదించను. ఈ బహుమతి ప్రాముఖ్యత ఏంటంటే – ప్రాముఖ్యత ఏదైనా ఉంటే – అది ఆ రచయితకు గొప్ప గౌరవాన్ని ప్రసాదిస్తుంది. అదీ ముఖ్యం.
ప్ర: మీ అత్యంత గాఢమైన జ్ఞాపకాలేవిటి?
నె: నాకు ఖచ్చితంగా తెలియదు. బహుశా నా జీవితంలో అత్యంత గాఢమైన జ్ఞాపకాలు నేను స్పెయిన్ లో గడిపిన జీవితం తాలూకువి. ఆ అద్భుతమైన కవుల ప్రపంచంలో నేను గడిపిన క్షణాలు ఎన్నడూ మరువలేను. అటువంటి సౌభ్రాతృత్వం గల కవుల సమూహాన్ని నేనింతవరకూ అమెరికన్ ప్రపంచంలో చూడలేదు. బ్యూనో ఏరీస్ లో అన్నట్టు ఇక్కడ అన్నీ ఎలాక్రానియోస్ (గుసలు గుసలు).
ఫాసిస్టు నియంతృత్వ క్రూర వాస్తవాలని బహిర్గత పర్చిన స్పెయిన్ అంతర్యుద్ధం ఆ కవుల సమూహాన్ని ఛిన్నాభిన్నం చేసింది. నా స్నేహితులంతా చెల్లాచెదురయ్యారు. గార్షియా లోర్కా, మిగుయేల్ హెర్నాండేజ్ లాంటి కొందరు నిర్మూలించబడ్డారు. మరికొంత మంది ప్రవాసంలో మరణించారు. ఇంకా కొంత మంది ప్రవాసంలోనే బతుకుతున్నారు. నా జీవితంలోని ఆ ఘట్టం సంఘటనలతో చాల రిచ్ గానూ, ప్రగాఢ భావోద్వేగాలతోనూ నిండి ఉంది. నా జీవితం ఒక ప్రధానమైన మలుపు తిరగడానికి అది కారకమైంది.
ప్ర: మిమ్మల్ని ఇప్పుడు స్పెయిన్ లోనికి ప్రవేశించనిస్తారా?
నె: నన్నెపుడూ అధికారికంగా స్పెయిన్ లోనికి రానివ్వకుండా ఉత్తర్వులు జారీ చేయలేదు. నిజానికి ఒకానొక సందర్భంలో అక్కడ చీలియన్ ఎంబసీ నన్ను కవిత్వం చదవమని ఆహ్వానించింది కూడానూ! బహుశా నన్ను స్పెయిన్ లోనికి రానిస్తారేమో! నేను దాన్నొక పెద్ద సమస్యగా చేయ దల్చుకోలేదు. ఎందుకంటే స్పెయిన్ ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడిన వారిని ఆహ్వానించడం ద్వారా తన ప్రజాస్వామిక స్వభావాన్ని బయట పెట్టుకునే ప్రయత్నం చేస్తూండవచ్చు!
నన్ను, నా ప్రవేశాన్నీ చాలా దేశాల ప్రభుత్వాలు తిరస్కరించాయి. నన్ను చాలా దేశాలు బయటకు పంపాలనీ చూసాయి. ఇది తొలి రోజుల్లో నాలో బాగా చిరాకు పుట్టించేది. ఇప్పుడంత లేదు. పర్వా లేదు.
ప్ర: లోర్కా చనిపోవడానికి ముందే మీరు రాసిన ఓడ్ తన విషాదాంత జీవితాన్ని ముందే ఊహించింది.
నె: అవును. ఆ కవిత చాలా చిత్రమైంది. ఎందుకంటే లోర్కా చాల ఆనందంగా ఉండేవాడు. చాలా సంతోషంగా ఉండే వాడు. అట్లాంటి వ్యక్తులని నేను చాలా తక్కువ మందిని ఎరుగుదును. చాలా అరుదైన వ్యక్తి ఆయన. అతను జీవితం లోని ప్రేమసారానికి పరిపూర్ణ అవతారం. అతని జీవితంలోని ప్రతి నిమిషాన్నీ గొప్పగా ఆనందిస్తూ, సంతోషిస్తూ గడిపాడు. అటువంటి వ్యక్తిని హత్య చేసిన నేరం – ఫాసిస్టు నేరాల్లో ఎన్నడూ క్షమించరాని నేరం.
ప్ర: మీరు అతన్ని మీ కవితల్లో చాలా సార్లు ప్రస్తావిస్తారు. అట్లే మిగుయేల్ హెర్నాండేజ్ ను కూడా
నె: అవును. హెర్నాండేజ్ నా కొడుకు లాంటి వాడు. కవిగా నా శిష్యుడి లాంటివాడు. అతను జైలు కెళ్ళి లోర్కా మరణం గురించిన అధికార ప్రకటనను వ్యతిరేకించాడు కాబట్టి చనిపోయాడు. ఒకవేళ తాను చెప్పేది నిజమైతే ఫాసిస్టు ప్రభుత్వం హెర్నాండేజ్ ని మరణించేదాకా ఎందుకు జైలు లో పెట్టింది? చీలీ దౌత్యకార్యాలయం సూచించినట్టు కనీసం అతన్ని ఆసుపత్రికి ఎందుకు తరలించలేదు? నా దృష్టిలో హెర్నాండేజ్ ది కూడా హత్యనే!
ప్ర: మీరు మీ భారత దేశం లో గడపిన రోజుల్లో ఏది బాగా గుర్తు చేసుకుంటారు?
నె: నేను భారతదేశంలో గడిపిన జీవితం నేను అంతకు ముందెన్నడూ ఊహించనిది. నేనటువంటి జీవితానికి సిద్ధంగా లేను కూడా! ఆ అపరిచిత ఖండం తేజస్సు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసినా అక్కడి నా జీవితమూ సుదీర్ఘమైన ఒంటరి తనమూ నన్ను నిరాశ కు గురి చేసినయి. కొన్ని సార్లు నేను బయటపడడానికి వీల్లేని, ఒక అద్భుతమైన టెక్ని కలర్ సినిమాలో చిక్కుకు పోయినట్టు అనిపించేది.
చాలా మంది అమెరికన్లను, విదేశీయులకు భారతదేశంలో దొరికిన మార్మికత నేనెన్నడూ అనుభవించలేదు. వారి వారి వేదనలకూ, ఆరాటాలకూ మత సంబంధమైన సమాధానాలు వెదుక్కునే వాళ్ళు భారత దేశాన్ని విభిన్నంగా చూసారు. నన్ను మటుకు, నిరాయుధమై, సామ్రాజ్యవాదం కింద నలిగిపోతున్న ఆ దేశం సామాజిక పరిస్థితులు విపరీతంగా కదిలించినయి. నేనప్పటి దాకా అభిమానించిన ఆంగ్ల సంస్కృతి, అంత మంది హిందువులను మేధోపరమైన బానిసలుగా మార్చడం చూసి దాని పట్ల ఏహ్య భావం కలిగింది. నేను దౌత్య కార్యాలయంలో పని చేసినా, ఆ దేశంలోని అనేక మంది తిరుగుబాటు దార్ల తోటి, విప్లవకారుల తోటీ కలిసి తిరిగాను. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని తర్వాత ఆ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన అనేక మంది విప్లవకారులతో పరిచయాలు పెంచుకున్నాను.
ప్ర: మీరు మీ ‘రెసిడెన్స్ ఆన్ ఎర్త్’ ని భారతదేశంలోనేనా రాసింది?
నె: అవును. కానీ భారత దేశం నా మీద మేధో పరమైన ప్రభావం ఏమీ కలింగించలేదు.
ప్ర: మీరు హెక్టర్ ఇయాందీ అనే అర్జెంటీన్ కి కదిలించే అద్భుతమైన ఉత్తరాలు రాసింది కూడా భారత దేశం నుండే కదా?
నె: అవును. ఆ ఉత్తరాలు నా జీవితంలో చాలా ముఖ్యమైనవి. అతను రచయిత. నాకు అంతకు ముందు పరిచయం లేదు. అయినా ఒక మంచి స్నేహితుడిలా అతను నాకు వార్తలని, పత్రికలని పంపి నా సుదీర్ఘ ఒంటరి తనం నుండి రక్షించాడు. కొన్ని ఏండ్ల తరబడి స్పానిష్ మాట్లాడే ఒక్క మనిషి కూడా లేక నేనసలు నా భాష తోటే సంబంధం కోల్పోతానేమో అనిపించింది. రాఫేల్ ఆల్బర్టీ కి రాసిన ఒక లేఖలో స్పానిష్ నిఘంటువు కోసం అడిగాల్సి వచ్చింది. నన్ను దౌత్య కార్యాలయంలో నియమించినా అది చాలా తక్కువ స్థాయి ఉద్యోగం. స్టైపండు ఉండేది కాదు. తీవ్రమైన పేదరికంలో, అంతకంటే దుర్భరమైన ఒంటరితనంలో జీవించాన్నేను. వారాల తరబడి మరో మానవ మాత్రుడు కనపడే వాడు కాదు.
ప్ర: అక్కడ ఉన్నప్పుడే మీరు హోసీ బ్లిస్ తో ప్రేమాయణం నడిపారు కదా! మీరు ఆమెను అనేక కవితల్లో ప్రస్తావించారు కూడా కదూ?
నె: అవును. హోసీ బ్లిస్స్ నా కవిత్వంపై ప్రగాఢమైన ముద్ర వేసింది. నేనామెను ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాను. ఈ మధ్య రాసిన పుస్తకాల్లో కూడా!
ప్ర: అంటే మీ రచనలు మీ వ్యక్తిగత జీవితంతో ముడివడి ఉన్నాయన్న మాట!
నె: అవును. సహజంగానే! కవి జీవితం అతని కవిత్వంలో ప్రతిఫలించాలి. అది కళ కు జీవితానికీ సంబంధించిన నియమం.
ప్ర: మీ రచనలని వివిధ దశలుగా విభజించవచ్చునా?
నె: దీనికి సంబంధించి నాకు నిర్దిష్ట అభిప్రాయాలేవీ లేవు. నాకు సంబంధించి నాకూ నా రచనలకూ దశలేవీ లేవు. విమర్శకులు కనుక్కున్నారు. నేనేమైనా అనదల్చుకుంటే నా కవిత్వానికి ఒక జీవికున్న దశలున్నై. నేను బాలునిగా ఉన్నప్పుడు బాల్య దశ, యుక్తవయస్సులో ఉన్నప్పుడు కౌమార దశ, నేను తల్లడిల్లినప్పుడు నిస్పృహ నిర్జన దశ, నేను సామాజిక పోరాటంలో ఉన్నప్పుడు ఉద్యమ దశ – అట్లా వివిధ దశలుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ దశలన్నీ ప్రస్తుతం నా కవిత్వంలో ఉన్నయి. నేనెప్పుడూ నా అంతర్గత అవసరం దృష్ట్యానే రాసాను. బహుశా రచయితలంతా ముఖ్యంగా కవులంతా అట్లాగే రాస్తారనుకుంటా!
(మిగతా వచ్చే సంచిక లో)
అనువాదాలు, ఇంటర్‌వ్యూలు, ప్రపంచ సాహిత్యం