Sep2007
అల్వాల్‌లో సాహితీ మిత్రుల సమావేశం
తేది 15–8–07న మధ్యాహ్నం అల్వాల్‌లో సాహితీ మిత్రుల సమావేశం జరిగింది. సాహితీ మిత్రుల సమావేశానికి శ్రీ వఝల శివకుమార్ గారు అధ్యక్షత వహించగా తదనంతరం జరిగిన కవి సమ్మేళనానికి శ్రీ జూలూరి గౌరీశంకర్ గారు అధ్యక్షత వహించారు.
వఝల శివకుమార్ గారు మాట్లాడుతూ సమకాలీన ప్రజల కష్టసుఖాలను కవిత్వం సృజనాత్మకంగా నిలబెడుతుందని, ఆత్మీయతతో పిల్చుకుంటె కవులు ఒక్క దగ్గర పోగవుతారని, ఆ కవి లోకానికి కవిత్వం, సమీక్షలు ప్రోత్సాహకాలుగా పనిచేస్తాని తెల్పారు. కొత్తగా రాసేవారికి మంచి కవిత్వం చదవాలనే తపన ఉత్తమ రచనకు దారి తీస్తుందని చెప్పారు. ప్రణాళిక కవిత్వానికి చాలా ముఖ్యమన్నారు. ప్రణాళిక కవులను ఒక దారిలో ఉంచి సాహిత్య ప్రయోజనాన్ని కాపాడుతుందన్నారు. సమీక్ష ప్రణాళికలు గల కవిత్వం సాహిత్యాభిరుచిని పెంచి పోషిస్తాయని చెప్పారు.
ఏదైతే పరిపూర్ణ బతుకు ఇవ్వగలదో ఆ శక్తే కవిత్వమని జీవితంతో మమేకం చెందాలని, కవిత్వాన్ని జనం అర్థం చేసుకొనే స్థాయి పెరగాలని అందుకొరకు కవులు కొద్దిపాటి సమయం వెచ్చించి సమిష్టి కృషిచేసి సాహిత్యానుభూతిని, అభిరుచులను విశ్వవ్యాప్తం చేయాలని, ఈ శ్రమలో మంచి కవిత్వం ఆవిర్భవిస్తుందని వివరించారు. మాండలిక భాష జీవిర్భాష అని తెలంగాణ మాండలికం లోని గొప్ప పదాలను కొనియాడారు.
తెలిదేవర భానుమూర్తి మాట్లాడుతూ మాట్లాడినట్టే రాయడం బాగుంటుందని, కొత్త పదాలు కొరకు వెతుక్కోవడంలో వ్యవహారంలో లేని పదాలను పొందు పర్చడంలో రచన సహజత్వం దెబ్బతింటుందన్నారు. తెలంగాణ సంస్కృతి ఇక్కడి జీవితంతో పెనవేసుకున్న అనుభవాలు మరచిపోలేనివని బతుకమ్మ, హోళి పండుగ ఈ ప్రాంతం వారి పిండి వంటలు ప్రత్యేక మైనవన్నారు. ఊరు వాడలు విడిచి పట్టణానికి వలస వచ్చిన ప్రజలు తమది కాని నాగరికత వేషభాషల పట్ల మోజుపడి ఆసనాలు పట్టలేని విధంగా మారి పోవడాన్ని ఆయన నిరసించారు. పల్లెలోనూ పర సంస్కృతులు ప్రవేశించి మన సంస్కృతిని నాశనం చేస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. పల్లె పదాలు నుడికారాలు తర్వాతి తరాలకు అందకుండా కాలగర్భంలో కలిసిపోతున్నాయని వలసలు ఆర్థికంగా వేళ్లుపాతుకొని పల్లె వేషభాషలను లోక్లాస్ అని ఊరోళ్లు అని హేళన చేసి మాట్లాడుతున్నారని ఇది అనాగరిక హేయమైన కుట్ర అని ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలన్నారు.
తెలంగాణ ఉద్యమ కాలం నుండి నేటిదాకా తను తెలంగాణ భాషలోనే రచన చేస్తున్నానని చెప్పారు. న్యూనతగా భావిస్తే మన భాషలో ఉత్తమ రచనలు తేలేమని హెచ్చరించారు.
జూలూరి గౌరీశంకర్ ప్రతి యాభై, వంద కిలోమీటర్ ప్రాంతానికి భాష యాస మారుతుందని చెప్పారు. కనుక ఒక ప్రాంతంలోని ప్రజలకు భాషా సారళ్యత నెరవేరాలంటే మీడియా, పాఠ్యప్రణాళికలు ప్రముఖ పాత్ర పోషిస్తాయన్నారు. ఇవి దెబ్బ తీయడం వల్లనే నేడు తెలంగాణ చైతన్యం పెరిగిందన్నారు. మీడియా, పాఠ్య ప్రణాళికలలోని భాష స్థానికేతర భాషతో యాసలతో ఉండడం వలన తొందరగా అర్థంకాక ఆయాపదాలకు అర్థాలు సరిపోల్చుకుంటు వెత్తుక్కోవలసి వస్తున్నది. వ్యవహారంలో ఉన్న భాషా పదాలు తొందరగా అర్థమవుతాయి. ఇతర ప్రాంతాల మాండలికం అర్థం కాక చదువు భారమనిపించి చదువే మానేస్తున్న దీనపరిస్థితి ఇక్కడున్నది. భాషను ఒక ఉద్యమంగా ముందుకు తేవలసిన అవసరం నేడు ఆసన్నమైందని బాధ్యతను గుర్తు చేశారు. మన భాషను విరివిగా మాట్లాడాలన్నారు. విశ్వ విద్యాలయాలలోని ప్రముఖులు అకాడమిక్ సైడ్‌కు ఇచ్చినంత ప్రాధాన్యత తెలంగాణ భాషకు ఇవ్వడం లేదని సినిమాలలో తెలంగాణ భాష వ్యాపారాత్మకమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాసుల ప్రతాపరెడ్డి గారు మాట్లాడుతూ ముందుతరం వారు ఈ తరం కవుల భాషను గుర్తించకపోవడం దురదృష్టకరమన్నారు. ఎంతో సృజన, నైపుణ్యాలున్న కవులు తెలంగాణలో ఉన్నారు. సాహితీవేత్తలను ముందున్న తరాలవారు గుర్తించి ప్రచారం చేయలేదన్నారు. న్యూనతాభావం వల్ల మనం పాలకుల భాషకు అలవాటుపడవలసి వచ్చినదని పల్లె ప్రజలు సైతం ఇతర మాండలికాలను అనుసరిస్తూ తమ యాసకన్నా మిన్నా అని భ్రమపడుతున్నారని ఈ తేడా ఎందుకు వచ్చిందో కారణాలని పరిశీలించాలని అన్నారు. తెలంగాణ సాహిత్యం జీవితంలోంచి పుట్టుకొచ్చిందని తమను తాము ప్రచారం చేసుకొని భూజకీర్తులు పెట్టుకోవాలన్న కోరిక ఇక్కడి వారికి లేదన్నారు. ఇక్కడి జీవితం సంస్కృతిని చాటడానికి ప్రజల కొరకైన కళలను చాటవలసిన అవసరం మన సాహిత్య చరిత్రను బహిర్గతంగా ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
డా. నాళేశ్వరం శంకరం గారు ప్రసంగిస్తూ విశ్వ విద్యాలయాలలో తెలంగాణ సాహిత్యంపై విస్తృతంగా పరిశోధనలు జరగవల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని ఇతర విశ్వ విద్యాలయాలు, ఉస్మానియా విశ్వవిద్యాలయాలలోని పరిశోధనాశాలను పరిశీలిస్తే తెలంగాణ సాహిత్యంపై వచ్చిన పరిశోధన చాలా తక్కువ అన్నారు. ఎక్కడి ప్రాంతం వారికి అక్కడి ప్రాంత సాహిత్యం శాలను పరిశోధనకు ఇవ్వాలని అప్పుడు చాలా విషయాలు ఆవిష్కరించబడతాయని ఆ ఆవిష్కరణలు భవిష్యత్తుకు దిశానిర్దేశకాలవుతాయన్నారు.
సమావేశం రెండవ సెషన్‌కి శ్రీ జూలూరి గౌరీశంకర్ గారు అధ్యక్షత వహించారు. రెండవ సెషన్‌లో జరిగిన కవి సమ్మేళనంలో సమకాలీన పరిస్థితులను ప్రతిబింబిస్తూ కవులు ఈ వఝల శివకుమార్, జూలూరి గౌరీశంకర్, కాసుల ప్రతాప్‌రెడ్డి, డా. నాళేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాములు, ఏనుగు నరిసింహారెడ్డి, దాసరాజు రామరాజు, బి. సంపత్‌కుమార్, వేముగంటి మురళీకృష్ణ, ఎం.ఆర్. కృష్ణ, రాజ్‌కుమార్, కాసుల ఆంజనేయులు మొదలైన వారు తమ కవిత్వంతో సభికులను ఆలోచింపజేశారు. ఎం.ఆర్. కృష్ణగారు తమ గానంతో ఆకట్టుకున్నారు.
R.Surya Prakash Rao Sep 15, 2007 1
I am very happy knowing that a literary meet held at Alwal, an emerging literary centre in twin cities. I would feel more happy if some of the poems and key concepts in them are described here. I would attend literary meet, if I know about it and feel so glad.