సూక్ష్మజీవులు

మన వేదాంతులు సామాన్యంగా మనుషులు ఈ లోకంలో ప్రత్యేకమనీ, మనిషి పడుతున్న కష్టాలు తప్ప మరేమీ ముఖ్యం కాదనీ అనుకున్న పద్ధతిలో పరిష్కారాలు సూచిస్తారు. మనుషులు బతకడానికి అవసరమయే ఆక్సిజన్ దగ్గర్నుంచీ ఎక్కణ్ణుంచి వస్తున్నాయో, భౌతిక ప్రపంచంలో జరగగలిగిన చిన్నా పెద్దా మార్పులు మనుషుల జీవితాలను ఎంతగా తలకిందులు చెయ్యగలవో వారికి తెలియకపోవచ్చు. ఇలా ఎంతో అజ్ఞానంలో ఓలలాడుతున్నవారు ఇతరులకు జ్ఞానబోధ చెయ్యడం ఎంత హాస్యాస్పదమో చాలామంది గుర్తిస్తున్నట్టు కనబడదు. కనబడని జీవాల గురించి మనకీనాడు చాలా తెలుసు. ఆ శాస్త్రీయ వివరాలను గురించినవే ఈ వ్యాసాలు.

ప్రాణుల ప్రపంచంలో ఉన్నత స్థానం మనిషిదే అని శాస్త్రీయ విషయాలను ఎక్కువగా పట్టించుకోనివారు అనుకోవడం సహజం. జంతువులని గురించి రకరకాలుగా ఊహించుకోవడం మొదటినుంచీ ఉన్నదే. తెలిసీ తెలియని యుగంలో జూలుతో గంభీరంగా కనబడే సింహాలని మృగరాజు అన్నారు. చిన్నచిన్న ఎలుకలనీ, పక్షులనీ చిన్న చూపు చూడటం, పురుగులూ, కీటకాలంటే అసలు లెక్కచెయ్యకపోవడం మన సంస్కృతిలో మామూలు. ఎటొచ్చీ ఇప్పుడు సైన్స్‌ ద్వారా తెలియవస్తున్న విషయాలను బట్టి ప్రాణుల్లో వైవిధ్యం ఉండడం అవసరమనీ, స్వార్థం కారణంగానో, తెలియక చేసే తప్పుల ద్వారానో మనుషుల కార్యకలాపాల వల్ల ఇతర ప్రాణులు అంతరించిపోకుండా చూడాలనీ అంటున్నారు. మొత్తంమీద ఈ అభిప్రాయాల్లో జీవరాశి యావత్తూ మనుషుల చెప్పుచేతల్లో మెలుగుతోందనే భావన ఉంది. ఇందులో నిజం లేదు. అసలు విషయమేమిటంటే ప్రాణులన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడతాయి కాని మన జీవనశైలిని శాసించేవి సూక్ష్మజీవులు.

భూతద్దంపెట్టి చూసినా కనబడని జీవాలకు ఇంత శక్తి ఉందా అని ఆశ్చర్యం కలుగుతుంది కాని మన జీవితాల్లో వీటితో ప్రమేయం లేని అంశాలు ఏవీ లేవనే అనుకోవచ్చు. 1898లో ఎచ్‌.జి.వెల్స్‌ రాసిన ఒక నవలలో అంగారక గ్రహవాసులు భూమిమీద దాడి చేసి ఉత్పాతం కలిగిస్తారు. సైన్యాలు కూడా ఓడించలేని ఆ భయంకరాకారులంతా చివరికి భూమి మీదున్న సూక్ష్మక్రిముల బారిన పడి చచ్చిపోతారు. ఇమ్యూనిటీ లేకపోతే ఏమవుతుందో ఈరోజుల్లో మనకు తెలుసు కాని సూక్ష్మ ప్రపంచంతో మనకు ఎంత సంబంధం ఉందో ఇప్పటికీ మనం సామాన్యంగా గుర్తించం.

కళ్ళకు కనబడనివాటిని గురించి చాలా శతాబ్దాలపాటు మనుషులు పట్టించుకునేవారు కారు. ఆవగింజంత ఉన్న జీవాలను చూసినప్పుడు మాత్రం సృష్టిలోని “పిపీలికాది” వింతలను గురించి ఆశ్చర్యపడుతూ ఉండేవారు. మన దేవుళ్ళూ, దేవతలూ మనిషి రూపంలోనో, ఆటవికదశలో మొదలైన మృగ ఆరాధన పద్ధతిలో జంతువుల ఆకారాల్లోనో ఉంటారు. సూక్ష్మజీవులనేవి ఉన్నాయని కూడా తెలియదు కనక వాటికి ప్రాతినిధ్యం వహించిన దేవుళ్ళెవరూ లేరేమో! తినే పదార్థాలు కుళ్ళగా అందులోంచి వచ్చే పురుగులన్నీ స్వచ్ఛందంగా వాటంతట అవే సృష్టి అవుతున్నాయని అనుకునేవారు. గాలిలోనూ, నీటిలోనూ సూక్ష్మజీవులు లుకలుకలాడుతున్నాయని అప్పట్లో ఎవరూ ఎరగరు. ఎందుకంటే గాజు కటకాలతో హాలండ్‌లో మైక్రోస్కోప్‌ల తయారీ మొదలయేదాకా సూక్ష్మ ప్రపంచం ఒకటి ఉంటుందని కూడా ఎవరికీ తెలీదు.

సూక్ష్మజీవాల ఆకార స్వరూపాలు:
1. విరోచనాలు కలగజేసే క్రిమి, 2. ఫ్లూ, 3. విషాహార క్రిమి,
4. మలేరియా, 5. గొంతు వాపు, 6. ఎయిడ్స్‌,
7. టీబీ, 8. లైమ్‌ వ్యాధి, 9. హెపటైటిస్‌ బి

రెండు మూడు లెన్స్‌లు తగిన పద్ధతిలో అమరిస్తే మామూలుగా కంటికి కనబడని (మొక్కల) కణాల నిర్మాణాన్ని చూడవచ్చని పదిహేడో శతాబ్దంలో ఇంగ్లండ్‌లో రాబర్ట్‌ హుక్‌ నిరూపించాడు. పంతొమ్మిదో శతాబ్దంలో ఫ్రెంచ్‌ శాస్త్రవేత్త లూయీ పాశ్చర్‌ చేసిన పరిశోధనలవల్ల పాలూ, సారాయి వంటివి పులిసిపోవడానికి సూక్ష్మక్రిములే కారణమని తేలింది.

పంతొమ్మిదో శతాబ్దపు మైక్రోస్కోప్‌

అంటువ్యాధులకు కూడా బాక్టీరియా అనబడే సూక్ష్మజీవులే కారణమనీ, వాటిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలనీ త్వరలోనే అందరూ గుర్తించారు. (బాక్టీరియమ్‌ అంటే ఏకవచనం. బాక్టీరియా దానికి బహువచనం). మైక్రోస్కోప్‌లు రానురాను మెరుగుపడడంతో అంతవరకూ ఊహకు కూడా అందని ఒక కొత్త లోకం అవగాహనకు వచ్చింది. ఆధునిక యుగంలో మామూలు కాంతిమీదా, అల్ట్రావయొలెట్‌ కాంతిమీదా ఆధారపడే అతిశక్తివంతమైన సూక్ష్మదర్శిని యంత్రాలు తయారయాయి. అవసరాన్నిబట్టి శాస్త్రపరిశోధనలకు అనుగుణంగా వీటి రూపనిర్మాణాల్లో చాలా అభివృద్ధి జరిగింది. ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోప్‌ల యుగం మొదలయాక ఒక్కొక్క అణువునూ చూసి ఫొటోలు తియ్యగలగడం కూడా సాధ్యమయింది. ఈ పరికరాలన్నీ ఉపయోగించి శాస్త్రవేత్తలు రకరకాల పదార్థాల నిర్మాణాన్ని గురించీ, జీవరాశిలో మునుపెన్నడూ చూసి ఎరగని సూక్ష్మప్రాణులను గురించీ తెలుసుకున్నారు.

ప్రోకేరియోట్‌ కణం 1. న్యూక్లియాయిడ్‌, 2. తొడుగు,
3. కేశిక, 4. కణకవచం, 5.కణం పైపొర, 6. రైబోసోమ్‌లు

బాక్టీరియా జీవరాశియొక్క ప్రాథమిక స్థాయికి ప్రతీకలుగా అనిపిస్తాయి. సగటున బాక్టీరియమ్‌ సైజు ఒక మిల్లిమీటర్‌లో వెయ్యోవంతు ఉంటుంది. పెన్సిల్‌తో కాగితంమీద పెట్టిన చుక్కలో లక్ష బాక్టీరియా ఇమిడిపోగలవు. ఇవి ఏకకణజీవులు. వీటిని ప్రోకేరియోట్‌ కణాలంటారు.

యూకేరియోట్‌ కణం 1. న్యూక్లియస్‌, 2. న్యూక్లియోలిస్‌,
3. మైటోకాండ్రియా, 4. రైబోసోమ్‌లు, 5. ఎండోప్లాజ్మిక్‌ రెటిక్యులమ్‌

మొక్కల్లోనూ, ఇతర జంతువుల్లోనూ ఉండే యూకేరియోట్‌ కణాలలాగా వీటికి న్యూక్లియస్‌ (కేంద్రం) ఉండదు. వీటి డీఎన్‌ఏ చిన్న చుట్టలాగా కణం మధ్యలో తేలుతూ ఉంటుంది. కణాన్ని ఒక పలచని పొర కాపాడుతుంది. దీని గుండా అవసరాన్ని బట్టి పదార్థాలు కణం లోపలికీ, బైటికీ పోతూ ఉంటాయి. కొన్ని పరిస్థితుల్లో కణవిభజన జరిగేముందు బాక్టీరియం సైజు పెరుగుతుంది. ఆ తరవాత డీఎన్‌ఏ పునరుత్పత్తి కావడం, కణం రెండుగా చీలి మధ్యలో అడ్డుగోడ ఏర్పడడం జరుగుతాయి. దీనికి సుమారు 20 నిమిషాలు పడుతుంది.

మరికొన్ని బాక్టీరియా తమ పునరుత్పతికై స్పోర్‌ అనబడే సిద్ధబీజం, లేక బీజాణువును తయారుచేసుకుంటాయి. ఆహారం తక్కువగా దొరికే ప్రతికూల వాతావరణంలో ఈ పద్ధతి పనికొస్తుంది. ఈ సిద్ధబీజాల్లో డీఎన్‌ఏ నిక్షిప్తమై స్తబ్ధుగా పడి ఉంటుంది. వీటిలో కొన్నిరకాలు ప్రతికూల వాతావరణంలోకూడా శతాబ్దాలపాటు నశించకుండా ఉండి, అనుకూల పరిస్థితి రాగానే “మొలకెత్తుతాయి”. మరికొన్ని పరిస్థితుల్లో తమ ఉనికికే ప్రమాదం కలిగినప్పుడు ఇవి తమ సమీపంలోనో, పరిసరాల్లోనో లభ్యమయే డీఎన్‌ఏను స్వీకరించి తమ లక్షణాలను మార్చేసుకోగలవు. ఎట్టి పరిస్థితిలోనూ నాశనం కాకుండా ఉండేందుకు అవి విశ్వప్రయత్నం చేస్తూ ఉంటాయి.

మనకు ఈ సూక్ష్మజీవాలతో పనేమిటని అనిపిస్తుంది కాని వాటికీ మనకూ అవినాభావ సంబంధం ఉంది. నిజానికి అంతకన్నా దగ్గర సంబంధం ఊహించుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే ప్రతి మనిషి దేహంలోనూ సుమారు వంద కోటి కోట్ల జీవకణాలుంటాయి. వాటితోబాటుగా వెయ్యికోటి కోట్ల బాక్టీరియా కూడా ప్రతి మనిషి దేహంలోనూ కాపరం చేస్తూ ఉంటాయి. ఇలా మనలో “ఐక్యం చెందే” జీవాలను గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఈ విషయాల గురించి చెప్పుకునే ముందు బాక్టీరియా చరిత్ర ఎటువంటిదో చూద్దాం.

భూమి వయస్సు 460 కోట్ల సంవత్సరాలైతే మనకు లభ్యమైన అతి పురాతన (ఫాసిల్‌) శిలాజాల దాఖలాలను బట్టి బాక్టీరియా 350 కోట్ల సంవత్సరాల క్రితం నుంచీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈనాడు మనకు తెలిసిన బాక్టీరియాలో కొన్నిరకాలు ఆక్సిజన్‌, వెలుతురూ లేకుండా బతకగలవు. సముద్రగర్భంలో ఉన్న రంధ్రాలవంటి ప్రాంతాల్లో ఇవి నివసిస్తాయి. భూమి రూపొందిన కొత్తలో చాలా వేడిగా ఉండేది. ఇప్పుడున్నట్టుగా ఆక్సిజన్‌ కూడా ఉండేదికాదు. ఇవి అప్పటి పరిస్థితుల్లో పరిణామం చెందినవే. ఆ తరవాత మరికొన్ని రకాలు సూర్యరశ్మిని సంగ్రహించి పోషకపదార్థాలు తయారు చేసుకోవడం మొదలుపెట్టాయి. ఈనాడు కనబడుతున్న కిరణసంయోగం పద్ధతి ఆ తరవాత మొదలైంది. ఇందులో నీటి కణాలు విచ్ఛిన్నమై ఆక్సిజన్‌ విడుదల అవుతుంది. ఆ కారణంగా దానిమీద ఆధారపడి బతికే బాక్టీరియా ఆవిర్భవించడం వీలయింది.

ఆక్సిజన్‌ విడుదల చెయ్యగలిగిన జీవశక్తి ఎక్కువ కనక చెట్లలాగా ఉన్నచోటే పాతుకు పోకుండా కదలగలిగిన జంతువులు ఎన్నో పుట్టుకొచ్చాయి. మనలోనూ, జంతువుల్లోనూ జీవకణాల్లో న్యూక్లియస్‌ కాకుండా మైటోకాండ్రియా అనే సూక్ష్మ నిర్మాణాలుంటాయి. న్యూక్లియస్‌లో ఉన్నట్టే ఇందులో కూడా ప్రత్యేకంగా డీఎన్‌ఏ ఉంటుంది. అలాగే మొక్కల జీవకణాల్లో క్లోరోప్లాస్ట్‌లు ఉంటాయి. ఇవన్నీ మొదట్లో బాక్టీరియాయే అనీ, జీవకణాలపై దాడిచెయ్యబోయి వాటిలో చిక్కుకుపోయాయనీ ఒక ప్రతిపాదన ఉంది. ఈ విధంగా మొదలైన “సహజీవనం” పరస్పరం లాభదాయకం కావడంతో ఇవి జీవకణాల్లోకి వచ్చి చేరాయనీ ఊహిస్తున్నారు.

ఆక్సిజన్‌ సరఫరా అయే పరిస్థితుల్లో పరిణామం చెందిన మైటోకాండ్రియా ఆహారం నుంచి ఏటీపీ (అడినోసీన్‌ ట్రైఫాస్ఫేట్‌) అనే పదార్థాన్ని తయారుచేస్తాయి. మనవంటి ప్రాణులు పరిణామం చెందడం ఈ విధంగానే జరిగింది. ఈ లెక్కన బాక్టీరియా అనేవి మనకు పూర్వీకులు మాత్రమే కాదు. అణువణువులోనూ చేరి, మననీ, తక్కిన జంతువులనీ బతికిస్తున్న జీవిత భాగస్వాములు.

అసలు ఎవరూ లేకుండా లోకంలో ఏకాకిగా బతుకుతున్నామని ఏ వ్యక్తీ కూడా కుమిలిపో నవసరంలేదేమో. ఎందుకంటే మన జీవితాన్నీ, శరీరాన్నీ కూడా మనతో పంచుకుంటూ, అనుక్షణమూ మనతోనే గడిపే వందల కోట్ల సూక్ష్మజీవాలున్నాయి. కంటికి కనబడకుండా, నిశ్శబ్దంగా అవి మన కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ, ఒక్కొక్కప్పుడు వాటిలో కొన్నిటికి తామే కారణమవుతూ మనవెంటే ఉంటాయి. ఈ సూక్ష్మజీవులే బాక్టీరియా. మన చర్మం మీద కనబడే అతి చిన్న రంధ్రాల్లో సుమారు వెయ్యి బాక్టీరియా ఇమడగలవు. ప్రతి చదరపు సెంటిమీటరుకూ లక్ష చొప్పున మన శరీరం పైనా, లోపలాకూడా వందలకోట్ల సంఖ్యలో సంచరించే ఈ సూక్ష్మజీవుల్లో కొన్ని రోగాలు తెచ్చిపెట్టేవీ, ఎక్కువ భాగం నిరపాయకరమైనవీ, మరికొన్ని మన రోగనిరోధకశక్తిని పెంచేవీ అని తెలుస్తోంది. వీటి జనాభా ఎక్కువగా మన నోళ్ళలోనూ, ముక్కూ, గొంతుకా, పేగుల్లోనూ ఉంటుంది. కొన్ని బాక్టీరియా మన వెంట్రుకలనూ, కనురెప్పలనూ పట్టుకుని వేళ్ళాడితే మరికొన్ని మన కనుగుడ్ల మీది నీటిపొరలో జలకాలాడుతూ ఉంటాయి. మైక్రోస్కోప్‌ద్వారా తప్ప కనబడని వీటిలో కొన్ని గుండ్రంగానూ, కొన్ని కడ్డీల్లాగానూ, మరికొన్ని చుట్ట చుట్టుకున్న సర్పిలాకారంలోనూ ఉంటాయి. కొన్ని తమ తోకలను తిప్పుకుంటూ ద్రవపదార్థాల్లో ఈదగలవు కూడా. వాటి పరిమాణాన్నిబట్టి నీరుకూడా వాటికి బురదలాగా చిక్కగా, ఈదరానిదిగా అనిపిస్తుంది. పైగా వేలాదిగా కిక్కిరిసి ఉండడంతో అవి ముందుకు సాగడం కూడా కష్టమే. వాటి ప్రాణానికి మన చర్మమంతా లోతైన గోతులతోనూ (చర్మ రంధ్రాలు), చెట్ల బోదెల వంటివాటితోనూ (వెంట్రుకలు), లోయలతోనూ (చర్మంపై ముడతలు) నిండి ఉంటుంది. మైక్రోస్కోప్‌ ద్వారా చూడగలిగితే మనలో ప్రపంచ సుందరి ముఖమైనా సరే చర్మంనుంచి వేళ్ళాడే ఈ బాక్టీరియాతో గడ్డాలూ, మీసాలూ పెరిగినట్టుగా కనిపిస్తుంది.

చర్మ వ్యాధులు కలిగించే స్టాఫ్‌ బాక్టీరియా ఎలక్ర్టాన్‌ మైక్రోస్కోప్‌ చిత్రం

బాక్టీరియా స్వరూపం అతి ప్రాథమికంగా అనిపిస్తుంది. నోరూ, అవయవాలూ, మెదడు ఏదీ లేకుండా, తినదగిన రసాయనిక పదార్థాన్ని సమీపించి దాన్ని ఆరగించడం, తద్వారా శక్తిని పొందడం వీటి జీవనశైలి. మన ముఖాలమీద మాత్రమే ఉన్న బాక్టీరియా సంఖ్యే 200 కోట్లుంటుంది. అవి వేచి ఉండాలే కాని వాటి ఆహారమంతా ఎప్పటికప్పుడు చెమటద్వారా పైకి ఉబికి వస్తూ ఉంటుంది. అదంతా ఆరిపోయే లోపలే బాక్టీరియా అక్కడకు చేరుకోవాలి. వాటి ప్రాణానికి అదెంతో కష్టమైన పని. ఎందుకంటే మన ఎండిపోయిన చర్మంమంతా నిమిషానికి 10 వేల సూక్ష్మమైన పెళ్ళలుగా ఊడి, రాలిపోతూ ఉంటుంది. వాటి మీదున్న బాక్టీరియా కూడా ఆహారం అందే లోపునే వేల, లక్షల సంఖ్యలో నేల రాలిపోతూ ఉంటాయి. ఇంత హడావిడి జరుగుతున్నట్టు మనకు తెలియదుగాని, ఈ లోపలే ఒక్కొక్క బాక్టీరియమూ పెరిగి, బలిసి 20 నిమిషాల కొకసారి రెండుగా చీలిపోతూ ఉంటుంది. ఈ విధంగా 8 గంటల్లో ఒక బాక్టీరియమ్‌ పది లక్షల సంతానాన్ని ఉత్పత్తి చెయ్యగలదు.

మనం స్నానం చేసి ఒళ్ళు రుద్దుకున్నంతసేపూ ఈ బాక్టీరియా చర్మరంధ్రాల్లో దూరి దాక్కుంటాయి. “జలప్రళయం” ముగియగానే యథాప్రకారం స్వస్థానాలకు చేరుకుంటాయి. ఈ లోపల కొంత పునరుత్పత్తి ఎలాగూ జరుగుతుంది కనక బైటికొచ్చాక వీటి సంఖ్య పెరుగుతుంది కూడా. వీటిని శాశ్వతంగా వదిలించుకోవడం మాత్రం మనతరం కాదు. ఇవి వంటింటి అంట్లలోనూ, అలుకుగుడ్డల్లోనూ చేరి మన చేతులమీదికీ, ఆ తరవాత జుట్టులోకీ పాకుతాయి. వెలుతురూ, గాలీ తక్కువగా సోకే చంకలలోనూ (పసిపిల్లలైనా సరే), లాలాజలంలోనూ కూడా ఇవి జల్సాచేస్తాయి. ఇవి ఉన్నచోటల్లా మలవిసర్జన చెయ్యడంవల్లనే స్నానం చెయ్యని శరీరం కంపుకొడుతుంది. మన పెద్దపేగులో మాత్రమే ఉండే బాక్టీరియా సంఖ్య ఒక్కటే మన మొత్తం శరీరంలోని జీవకణాలకన్నా ఎక్కువ. చర్మంమీద మూడురకాలూ, గొంతులో ఎనిమిది రకాల బాక్టీరియా ఉండగా పెద్దపేగులో వందకు పైగా అనేక రకాలవి నివాసం చేస్తూ ఉంటాయి.

అసలు ఈ బాక్టీరియా ఎందుకు మనతో సహజీవనం గడుపుతాయో శాస్త్రవేత్తలకు సరిగ్గా అంతుచిక్కడంలేదు. వీటివల్ల మనకు మేలూ జరుగుతుంది, ఇబ్బందులూ తప్పవు. పరిస్థితినిబట్టి ఈ వ్యవస్థను కలహాల కాపురం అనో, కలసి ఉంటే కలదు సుఖం అనో సరిపెట్టుకోవాలి. ఉదాహరణకు చర్మంమీద ఉన్నవి బైటినుంచి సోకే ఇతర ప్రమాదకరమైన బాక్టీరియానుంచి మనను కాపాడుతూ ఉంటాయట. కానీ నోటిలో ఉన్న కొన్నిటివల్ల మన దంతాలు పుచ్చిపోతాయి. మరికొన్ని లాలాజలంలో చేరి ఆహారాన్ని జీర్ణం చేసుకోవడంలో తోడ్పడతాయి. వీటికి ఆహారనాళికలోనూ, ఉదరంలోనూ ఉన్న బాక్టీరియా సహాయపడతాయి. పెద్దపేగులో ఉన్నవి ఆహారపదార్థాలను విడగొట్టి, విటమిన్లను ఉత్పత్తి చెయ్యడంలో పాల్గొంటాయి. మనం తినే చక్కెర పదార్థాలనూ, పిండి పదార్థాలనూ కరిగించడమేకాక హానికరమైన “శత్రు” బాక్టీరియాని ఎదుర్కొంటూ ఉంటాయి. రోగాలకు ఏంటీ బయోటిక్‌ మందులను వాడినప్పుడు అవి క్రిములతోబాటు పనికొచ్చే బాక్టీరియాను కూడా నాశనం చేసేస్తాయి. దానివల్ల కలిగే ఇబ్బందుల ఉపశమనానికి పెరుగువంటిది తింటే అందులో ఉన్న ఉపయోగకరమైన బాక్టీరియా మళ్ళీ పేగులోకి చేరుతుంది. ఆశ్చర్యకరమైన సంగతేమిటంటే పేగుల్లో ఉండే కొన్నిరకాల బాక్టీరియాకు మనతో పనేమీ ఉన్నట్టు కనబడదు. వాటివల్ల ప్రమాదమేమీ ఉండదు కాని, అద్దె కట్టకుండా ఇంటో ఉన్నట్టుగా అవి తమ మానాన తాము మనతో సంబంధం లేనట్టుగా జీవిస్తూ ఉంటాయి.

బాక్టీరియావల్ల కలిగే మనకొచ్చే రోగాలన్నీ బైటినుంచి మన శరీరాలకు సంక్రమించేవే. వీటిలో కలరా, క్షయ వంటివాటికి దారితీసే అతిప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి. జబ్బుపడిన ఇతర వ్యక్తులో, జంతువులో, కల్తీ ఆహారమో, నీరో సామాన్యంగా వీటికి కారణం. అలాగే గాయాలూ, ఇతర రోగాల కారణంగా రోగనిరోధక వ్యవస్థ బలహీనపడినప్పుడల్లా ఇవి విజృంభించవచ్చు. శరీరభాగాలు గేంగ్రీన్‌ కారణంగా కుళ్ళిపోయే ప్రమాదం ఉన్నప్పుడు అందుకు కారణమయే బాక్టీరియా సంఖ్య తొమ్మిది, పది నిమిషాల్లోనే విపరీతంగా పెరిగిపోతుంది. ఇవికాక బాగా ఉడికించని ఆహారంలో మామూలు స్థాయిలో ఉండే బాక్టీరియా జనాభా ఎక్కువైనప్పుడు కూడా మన జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. తలనొప్పులూ, కడుపునొప్పులూ, విరేచనాలూ, జ్వరమూ వగైరాలకు తరుచుగా బాక్టీరియాయే కారణం. కోడిగుడ్లూ, మాంసం వగైరాల్లో ఉండే సాల్మొనెల్లావంటివి పది పన్నెండు రకాలు ఇటువంటివే. వీటిని త్వరగా ఫ్రిజ్‌లో ఉంచకపోతే మరింత ప్రమాదమనేది తెలిసినదే. వేడి సబ్బునీళ్ళతో వంటపాత్రలను కడగడం, ఆహారాన్ని బాగా వేడిగానో, చల్లగానో ఉంచడం ద్వారా బాక్టీరియావల్ల కలిగే ప్రమాదాలను తగ్గించుకోవచ్చు.

మన నోట్లో ఉండే బాక్టీరియా మనం తినే చక్కెర పదార్థాలను విడగొట్టి ఆమ్లాలుగా మారుస్తాయి. అవి పంటిమీదున్న ఎనామెల్‌ను కరిగించి పుప్పిపళ్ళకు దారితీస్తాయి. అంటే బాక్టీరియా పరోక్షంగా దంతక్షయానికి కారణమవుతాయి. పళ్ళమీదా, మన ముక్కూ, గొంతూ, కడుపూ, పేగులూ అన్నిటిమీదా బాక్టీరియా ఒక పలచని పొరగా వ్యాపించి ఉంటాయి. ఇవి ప్రవేశించరాని వ్యవస్థలుకూడా మన శరీరాల్లో కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు కండరాలూ, రక్తమూ, నాడీమండలమూ మొదలైనవి బాక్టీరియా ప్రభావానికి గురి కాకుండా రోగనిరోధక వ్యవస్థ ద్వారా కాపాడబడుతూ ఉంటాయి.

ప్రకృతిలో బాక్టీరియా అనేవే లేకపోతే జీవప్రక్రియలేవీ సాధ్యంకావు. చచ్చిన జీవపదార్థాలు కుళ్ళడానికి బాక్టీరియా చాలా అవసరం. మళ్ళీ కొత్త జీవరాశి పుట్టుకురావాలంటే ఈ ప్రక్రియలు తప్పకుండా జరగవలసిందే. చచ్చిన మొక్కలూ, జంతువులూ ఎక్కడబడితే అక్కడ పేరుకుపోకుండా మట్టిలో కలిసి మొక్కలకి మళ్ళీ ఆహారంగా పనికొస్తాయి. సరైన మోతాదులో మన శరీరాల్లో ఉన్న బాక్టీరియా మన ఆరోగ్యానికి చాలా మేలుచేస్తూ, ఇతర హానికరమైన బాక్టీరియా బారినపడకుండా కాపాడుతూ ఉంటాయి. మన శరీరాలు తమంత తాముగా తయారుచేసుకోలేని విటమిన్‌ కె వంటి పదార్థాలను ఇవి ఉత్పత్తి చేస్తాయి. బాక్టీరియా ఏమాత్రమూ సోకకుండా పెరిగిన ప్రాణులు బైటి ప్రపంచంతో సంపర్కం ఏర్పడగానే రోగాల పాలవుతాయి.

ప్రకృతిలో బాక్టీరియా

అసలు ప్రకృతిలో ప్రాథమిక భూమిక బాక్టీరియాదే. అవి భూమిని నివాసయోగ్యంగా తయారు చెయ్యడంవల్లనే పెద్ద జంతువులూ, మనుషులూ మనగలగడం సాధ్యమౌతోందని అనుకోవాలి. అవి మనకన్నా ముందొచ్చి అతి ప్రాచీన యుగంనుంచీ కొనసాగుతున్నాయి. మన తరవాత కూడా, మనిషిజాతి అంతరించిపోయి, సూర్యుడు చల్లారిపోయేదాకా బతికే ఉంటాయి.

3 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు, సైన్స్

3 అభిప్రాయాలు

  1. desaraju Sep 5, 2007 1

    మొత్తం చదవాలంటే సమయం పడుతుంది.

  2. రాకేశ్ తెలంగాణ్ Sep 12, 2007 2

    అత్యంత ఆసక్తికరమైన వ్యాసం!!
    చాలా చాలా బాగుంది.

  3. ramchandrarao Feb 19, 2010 3

    ఈ సౌక్రర్య్మ చాలా బాగుఉనధ్హి

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో