Sep2007
యాది
నిలవెట్టిన కట్టెకు కుండదలిగిచ్చినట్టు ఆడాడ భటులు నిలవడున్నరు. ఆల్లయి నిట్టేసిన చూపులే తప్ప గింత నగుమొకం లేదు. అప్పుడప్పుడే లారీలల్ల జనం జేజేలు గొట్టుకుంట జిందాబాద్‌లనుకుంట ఆపీసు వెనుక దిగవట్టిండ్రు. లారీలల్ల డేవరు కాబిన్లనించి నాయకులు దిగి టిపిన్లకు చాయ్‌లకు గిట పోతన్నరు. పెద్ద పెద్ద మనుషులు బార్ల నిలబడుతున్నరు. పాటిచ్చిసూస్తే ఆడ దేశంలున్న జండాలన్ని కనవడవట్టినై.
మా ఊరు సుట్టు అడవి పర్వత శ్రేణులు వాగులు ఉండవట్టి శివారు పంటపొలాలు కలకలలాడుతుండేవి. యాడాదికి తొమ్మిది నెలల పొడువున పర్వతజాలొచ్చేది. పర్వత పాదభూమి దట్టమైన చెట్ల గుంపు వనం ప్రాణి సంపద, మందుచెట్లు వాటిని కాపాడే జలాశయాలు ప్రకృతికే అందాన్ని పొదిగినట్టుగ ఉండేది. బతుకమ్మ, బోనాల, ఓలి, జాతర్లు పండుగలు గిట సూడ ముచ్చటగ జరుగుతుండె.
మా ఊరు బంగారుకొండ మండల కేంద్రమైనాక ఎంత మారిపోయిందో. రోడ్లు, చౌరస్తాలు, హోటళ్లు, సిన్మాలు ఆపీసులు, పోలీసు ఠానా ఒకటా రెండా, గప్‌చిప్ బండి కాన్నించి ట్విన్ బ్రదర్స్ వొస్త్ర ప్రపంచం దాక ఎన్నో రంగులు పులుముకున్నది. ఊరు పట్నం గాలి సోకినాక పర్దేశం పోకడలు పెరిగి సిమెంటు కాంక్రీటు ఉడుకు సెగలు గనే ఉంటది గని పాడిపరిమళం, పెరుగోలె, వెన్నోలె కనిపిస్తదా?
ఈ గాంధీ బొమ్మ కాడనే కూరగాయలమ్ముకుంట అవ్వ నన్ను సదివించింది. మారు బారకాల్లొచ్చి కూరగాయలు నింపుకపొయినాక చెయ్యిరిగినట్టయింది. అవ్వ చారాణకు పావెడు జీడిపల్కులు అమ్మేది. అమ్మవోతె అడివి కొనవోతే కొరివి సుతెంగనే ఉన్నది బతుకు.
నాది పెద్ద సదువేం కాకపోయినా ”అరేయ్ రామిగా పదోదన్నా పాసైతె పటేలుకు బాంచెన్ చేసి యాడన్న కొలువిపియ్యిమని కాల్లుపట్టుకుంటారా! జర చెప్పింది వినురా” అని అవ్వ బాధపడుతుంటే చూడలేక గ్యాస్నూనె దీపంతోనే చదువుకున్న. దినం గడిస్తె దీర్ఘాయుష్యమన్నట్టు గీ చౌరస్తాల పెట్రోలు బంకు సెల్‌ఫోన్ టవర్లు వెలుస్తుంటె నా చౌకగోడల ఇల్లు దరవాజ గుంజలల్ల మన్నుపెల్లలు రాలి తరిగిపోవట్టినై. అప్పుడు కల్వ, కైకిలి, ఉప్పరి, పూడిక పనులు ఎన్నో దొరుకుతుండె. వడ్లపని కమ్మరి, కుమ్మరి, నేత, దర్జి తోలుపనులన్ని యగుశం చుట్టు శిబ్బి తీగోలె అల్లుకొని ఉండేవి. ఇప్పుడన్ని మిషిన్లొచ్చి పేగులు తెంపినట్టయింది. కుల వృత్తులన్ని ఉరితాళ్లల్ల గిలగిలకొట్టుకుంటున్నై.
శాన రోజులకు కల్యమాకు, టమాటలు గిట పెట్టుకొని కూకున్న, గింత గిరాకి కూడ రాలేదు. అండ్ల బందులు, కరిపీలు గిట ఉంటె ఇగ రెండు చేతుల తినుడే.
”ఏమయ్య, జాస ఎటు పెట్టినౌ?” సుజాత ఆకు తంబాకు గుల్ల పట్టుకొని సంకల పోరన్నెత్తుకొని చంద్రబింబమోలె ఎదురంగ నిలబడ్డది.
“పోరన్ని తీస్కోని కార్ఖాన కు పోకుమని ఎన్ని సార్లు చెప్పాలనే? ఆ ఘాటు మంచిదా?” ఆవేశం తోటి అన్నా.
”మరి ఏడుంచాలె! అయితే నువ్వు లేకుంటె నేనే సంభాళించాలె గద” అని సుజాత సమాధాన పర్చంగనె నోరు మూసుకున్న. అవ్వ కాలం జేసినసంది మాకు యెనక ముందు ఎవరు లేరని మా రెక్కల కష్టమే తప్ప ఏ ఆశాలేదు.
”ఏమయ్యా ఒగమాట చెప్పిపోనచ్చిన సర్పంచు భూమి జాగ ఇపిస్తరమ్మన్నడు. ఇయాళ్ల మన బంగరుగొండల భూమి కోసం పోరాటం జేస్తరట. ఆ పోరాటంల నిలబడ్డోల్లకే భూమి పంచుతరట. జట్టన ఆడికి పోదామని అద్దశేరే ఆకు తంబాకు పట్టుకున్న”
సుజాత మాటలల్ల జరంత ఆశ కనిపించినా అదంతా నాటకమనే నాకు తెలుసు. నాకు బుద్ధి తెల్సిన సంది రెండు ఎలచ్చన్లు జూసిన. అవ్వనైతె ఎంటికలు తెల్లగయ్యేదాక ఎందరు మారంగ చూసిందో. ”ఎప్పుడులేని భూమి జాగల పోరాటాలు, పాదయాత్రలు, కరెంటు లొల్లులు గిప్పుడెందుకు యాదికొచ్చినట్టు ఆలోచించే సుజాత. గిదంత మల్లొచ్చే ఎన్నికల కొరకే. ఒగన్ని దించి మరొకర్ని ఎక్కించేటందుకు. జండాలు మార్చేటందుకు ఎత్తుగడలు. సమానత్వమని ఎన్ని సుద్దులు చెప్పినా రాతలు చేతలు మారాలెగద” అని నేను బుదగరిచ్చిన.
”గింత సొంతభూమి మనకుంటె ఆడనే గుడిసె కప్పుకొని ఎట్లనన్న కష్టపడుదాం మనమంటె ఉపాసమో ఔపోస్నమో గడుస్తున్నది గని పోరడు పెరిగినంక గింత గంజన్నమన్న పెట్టకుంటె ఎట్ల? నా పానంల బుగులు జొచ్చింది. కాదనకు. నువ్వు కౌలు గుడ్డంల కూరగాయలు గిట చూసుకుంట ఈడనే ఉండు. మహిళల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నమని లావుగ జెప్తున్నరు గదా. గా కోటాకిందనైన తొవ్వ పుడ్తదేమో. సంకల గీ పోరన్ని చూసన్నగింత సాయం జెయ్యకపోతరా”.
సుజాత జిద్దుగ వాదన పెడుతుంటె కాదనలేక పోయిన. ఇంతట్ల సంటోడు కిర్రుమని ఏడ్చిండు. మూలకు కూకొని పోరనికిన్ని పాలిచ్చింది.
***
లారీలల్ల జీపులల్ల జనం ఇరగబడి బజార్లల్ల దిగవట్టిండ్రు. ఎన్నడులేని మా బంగారుకొండ ఉసికేస్తె రాలని మందిని చూసింది. అండ్ల కుంటోల్లు, గుడ్డోల్లు, ముసలోల్లు, పోరలు, రోగాలు నొప్పులు ఉన్నోల్లు గిట అందరున్నరు. ఒక దిక్కు పోలీసు వ్యాన్లు దిగవట్టినై అప్పటి దాకా డౌన్‌డౌన్‌లు కొట్టిన నాయకులంత పోలీస్ వాన్లను చూసి ఎగవడి మీదికి పోయిండ్రు. బంజరు భూమిలకెల్లి రాళ్లు ప్రధానపక్షం మీద పడ్డయి. పోలీసులు తుపాకుల్ని గుండ్లు సదురుకుంట కొరకొర చూడవట్టిండ్రు.
ఆడ పరిస్థితి జూస్తె ప్లాన్ పెద్దగానే ఉన్నట్లు అనుమానమొచ్చింది. ఇంతట్ల మా సుజాత జనంల కలిసిపోయింది. నాకు మతిల మతి లేకుంటయింది. గా ఒత్తులాటల ఆ లొల్లిల పోరడెక్కడ దమ్మాడక కిందిమీదైతడోనని భయంతోనే ఉన్న.
అయినా భూమి పోరాటాలు లేనోల్లు జెయ్యాలె గని లక్షాధికార్లు, కోటీశ్వరులు చేయించుడేంది. అండ్ల మా బోటోల్లు జమగూడుడేంది. ముందుగల్ల వాల్ల ఆస్తులు బీనాం భూములు పంచని. ఒక్కొక్కడు తక్కువ తిన్నడ. ఏ చిట్టి ఇప్పినా వందల – వేల ఎకరాలే. వాల్లకు నిజంగ పేదలంటె ఆపేచ్చన ఉంటె తల్కాయ కిందికి కాల్లు మీదికి జేస్తరో, పట్టపగలు సుక్కలు పొడిపిస్తరో, ఏం జేస్తరో ఏలుతున్నోల్లు వాళ్లకు తెల్వందుంటదా. ఏం జేసి భూమి ఇప్పిస్తరో ఇప్పియ్యని అప్పుడు లెక్కగని పొద్దుకెట్ల, మాపటికెట్లని తొక్కులాడే మా పనులను ఆగంజేస్తే పొట్టగడుస్తద. వాళ్లకే. పచ్చగతిని యెచ్చగుంటరు. వీల్లు జండాలు పాతవట్టిరి. పోలీసులొచ్చి పీకవట్టిరి. గట్టిగ మాట్లాడితే చట్టాలు వాడుకొని పదిరకాలుగ కేసులు పెట్టే తెలివైనోల్లు ఉండనే ఉండిరి. మార్పు మనాదికెల్లి రావాలె. మీదిమీది భాగోతాలు పర్దా ఇప్పేదాకనే.
సుజాత జనంల కల్సిన సంది నా మనసు పదిపది రకాలుగ ఆలోచన్ల వడ్డది.
***
లొల్లి ముదిరింది. పోలీసులు ఉద్యమకారులకంటె డబల్ శబల్ కనపడుతున్నరు. వాళ్లు పైపుల తోని నీళ్లు, కొడుతున్నప్పుడే టెంటు కింది నించి సగం మంది నాయకులు తప్పించుకున్నరు. గ్యాస్ ఇప్పినప్పుడు ఒక్కడు కూడ కనిపించలేదు. లాఠీలు దీసినప్పుడు జనమే ఉన్నరు. ఆవేశానికొచ్చిన మా వాడ జనం నిలబడి ప్రశ్నించిండ్రు.
ప్రశ్న అంత పాపమైందా? రాజు గాని తల పలగ్గొట్టిండ్రు. సత్తి బట్టల నిండ రక్తంతోటి గిలగిల కొట్టుకుంటున్నది. వాండ్లది మా పక్క వాడనే. నల్లా నీల్ల దగ్గర్నించి పండవడే రాత్రి దాంక కలుస్తనే ఉంటం. నెల కిందనే వాల్ల తండ్రి మందుదాగి సచ్చిండు. కౌలు సుమి ఎల్లని పంట, సావుకారు దగ్గర అప్పులు పానం దిన్నయి. తల్లి లచ్చిమి యాడున్నదో. సుజాతను యెతుక్కుంట వాళ్ల దగ్గరికి చేరిన తలలు పలగ్గొట్టినోల్లు మల్లా ఇటెంకల్ల రాలే. ఆడికి టి.విలోల్లు, పేపరోల్లు దిగిండ్రు. కుచ్చికుచ్చి ప్రశ్నించవట్టిరి. రాజుగాడేం జవాబు జెప్పెటట్టులేడు. ఆడెప్పుడో తెల్విదప్పినట్టున్నడు. సత్తికి జర కనుసూపున్నది. సత్తిని రాజు గాన్ని లేపపోయిన, సత్తి ముందరికి సైగ చేసింది. నాకు మనుసుకు పట్టలేదు.
కరంటు తంబం కాన్నించి నాకేసి మంది ఎగబడి రావట్టిండ్రు. అండ్ల ఒక సారు ముందర నడిచొచ్చిండు. ఆయన ఈపుకు పెద్ద బ్యాగున్నది. చేతుల నిండ మైకులున్నయ్.
”ఇప్పుడు టి.వి.మెన్ ప్రత్యక్ష ప్రసారం రామయ్యతో మాట్లాడుతున్నది లోకేశ్వరం” అని మొదలు పెట్టిండు. టి.వి.ల నా మాట చెప్పాలంటె నాకు శాల ఆనందం కల్గింది. గొంతు సరాయించుకున్న.
”పేదలకు భూమి రావాలంటె ఉద్యమాలు ఎంతవరకు పని చేస్తాయని నమ్ముతున్నారు రామయ్య”
”దేశం స్వేచ్ఛ సమానత్వం, సౌభ్రాతృత్వాలను సువర్ణాక్షరాల తోటి రాసుకున్నది గద సారు ఒక ఊరికింద ఉన్నభూమి మీద హక్కు ఆ ఊరివాళ్లకే ఉండాలె. ప్రభుత్వ భూమి పట్టాభూమని కాదు ఉపాధి ఉత్పత్తి భూమని ఉండాలె. భూమి మీద పెత్తనందారితనం పోవాలె…’ నేనింక చెప్పబోతుండగనే జనంలొల్లి ఎక్కువైంది. ఆహాకారాలు, ఏడ్పులు వినరావట్టినై. లోకేశ్వరం మైకులు తీసుకొని మరొక ప్రశ్న అడిగిండు.
”బతుకు దెరువుకోసం భూమి అడుగుతున్నారు కదా. మీరెంత ఆశిస్తున్నారు?”
”బతకడం పూర్తికి ఆశిస్తున్నం సారు. ముందుగల్ల చిన్న చిన్న భూమి జాగలను ఏకం జేసి కలిసి యగుసం జెయ్యాలె. వచ్చిన ధాన్యాన్ని అందరు అనుభవించాలె.
బతికినన్నాళ్లు కలిసి బతకాలె సారు. చచ్చినాంక ఏం మూట గట్టుకపోతం? ఒక్కడు జెయ్యవట్టి సృష్టి మొదలైందా? ఏ ఒక్కని కోసం సృష్టి ఆగుతదా? మనుషులు పుట్టొచ్చు చావోచ్చు కొత్త పోకడలు సంస్కృతి శాశ్వతమైతయి. మనిషింత తత్వముగల ఆలోచించాలె ఒగ పద్ధతి కామ్యాబు గాకుంటె ఇంకోపద్ధతి ఎతకాలె”
”మీ భార్య తుపాకికి బలిగావడం, పోరాటం పట్ల మీరెలా స్పందిస్తారు?”
”భార్య – మర…ణ…మా! సుజాత … తుపాకి… నాకు పిక్కలు జనికినై. కడుపుల పేగులు కదిలినై. జీవిపోయినట్టయింది. మందిని జరుపుకుంట ముందరికి పోయిన. గుంపు నడుమ సుజాత.. అదే నగుమొకం… నెత్తుటి మడుగు… కన్ను మూసిన పోరడు… పోలీసులు… వాఙ్ములాలు… సంచార పోస్టుమార్టం వ్యాను… దిక్కులన్ని చీకటైపోయినై. నా కింకేమున్నదని? బతుకుమీద ఆశ చచ్చింది. పార్టీల జండాలు సవరిచ్చుకుంట ఒకరొకరు లైను కట్టవట్టిండ్రు. గవుర్మెంటు సాయమిప్పిస్తమని వాగ్దానాలు జెయవట్టిండ్రు.
చౌరస్తాలల్లకు సంచార టెలివిజన్లొచ్చినై. టి.వి.ల నిండా నా మాటలే. సత్తి…. సుజాత.. రాజుగాడు… ఇగ కతనే ఐంది. కాలం గడిచింది. చచ్చిపోయిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిండ్రు. భూమిస్తమన్నరు. ఉద్యోగాలిస్తమన్నరు. భూమి పోరాటమంటె గిట్లుంటదనుకోలే. రాజులు మారిండ్రు.
జనాభా… వలసలు… ఊరినిండా ధరలు…టాక్సులు… ఏవీ ఆగుతలేవు.
ఎక్కడ ఖజానాలక్కడ నిండవట్టినై. ఎవరి జేబులు వాళ్లకు యెచ్చగనే గావట్టె. ఎక్కడేసిన గొంగడి అక్కడనే. మల్లా ఎలచ్చన్లు… దిక్కేది…! దారేది…! ఆలోచన్ల వడ్డ ఊరు సత్తి, సుజాత, సంటోడు, రాజుగాని యాదిల నన్ను అలుముకున్నది.
September 8th, 2007 at 11:20 pm
ముదిగొండ సంఘటనకి అక్షర రూపం మీ కత. బావుంది.
September 13th, 2007 at 9:57 pm
వ్యాసం చాలా బాగున్నది. వ్యాసం అనే కంటె గోస అంటె సరిగ్గ ఉంటదేమొ. పెద్దకులపోల్ల పార్టీల నాట్కాలు ఘోరం. ఇంక ఎన్నొద్దులు. ఏమో. చిల్లరోల్లె ఒక్క పార్టీ గావాలె. చిల్ల రోల్లె నడిపె పార్టి గావాలె. గదె దారి. చిల్లర కులపోల్లకె గాదు, బికారులైన బక్క చిక్కిన పెద్దకులపోల్లకు గూడ గదె దారి. మరి పోదాం పాండ్రి. పారాదుండ్రి. భారత దేశంల రినాయిజెన్స్ లేకుండ మన మనుసుల్ల గింతంతన్న మార్పు అస్తదా. మనిసిని మనిసిగ జూడలేని సమాజం, పుట్క తోటి జూసె సమాజాన్కి జెర్రన్న సాతనయితదా, మారుటాన్కి? గందుకని, రినాయిజెన్స్ గావాలె. కావద్దా? మరి, గీ దేశంల కులం కావురం, కులం కుత్సితం పోవుడు దప్ప ఇన్కేమన్న రినాయిజెన్స్ ఉన్నదా? చిల్లర కులపోల్ల ఎన్క, అంటరానోల్ల ఎన్క నడుసుడు సంగానికి అల్వాటు గావాలె. గసువంటి సంగమె యేమన్న ముందటికి వోతది. మెల్లగనన్న, మెల్ల మెల్లగనన్న ముందటికి వోతది.
నా మన్సు వడె గోసకు గూడ రాత రూపం ఇచ్చినందుకు ఈ సంపత్ రాసిన సంపత్ కు దండాలు.. సలాంలు… వెడ్తాండు. గీనె గిట్ట 1980ల వరంగల్ నుంచి అచ్చి గుంటూరు నాగార్జున యూనివర్సిటి ల సద్వినాయెననా?
September 19th, 2007 at 9:43 am
మస్తుగ రాసినవ్ సంపత్ భయ్!
నీ కతల తెలంగాణ పలుకున్నది. కలిసి పని చేసి, కలిసి అనుభవించాలె అనుడు మంచిగుంది.
మన యాస, మన బాసల నువ్ ఇంకెన్నో కతలు రాయాలె.