అడుగుజాడలు

”అమ్మా సుజీ, లేమ్మా కాఫీ తాగుదువు గానీ…”

నాన్న అంత ప్రేమగా పలకరిస్తుంటే బదులు చెప్పకుండా వుండలేకపోయాను.

”గంటనుంచీ నాన్నమ్మ పిలుస్తుంటే పలక్కుండా వున్నావంట. యీ మాత్రం దానికే యిట్లయితే ఎట్ల తల్లీ. యిట్లాంటివి యింకా ఎన్ని చూడాలో. యీ పదైదేండ్లలో నేనెన్ని చూసిండాలి చెప్పు. లే, లేచి కాఫీ తాగు”

నాన్న బ్యాంకు నుంచి రాగానే నానమ్మ చెప్పేసినట్లుంది. యిక యీ సాయంత్రం మొదలు రాత్రంతా నాన్న తనను వూరడించగలడు, అనునయించగలడు, పది అమ్మలై తనను లాలించగలడు, ఎంత మంచి నాన్న. బొద్దుగా నల్లగా వినాయకునిలానే వుండొచ్చు గానీ నాన్న, అమ్మంతటి నాన్న, నాకు నాన్నే అమ్మ.

”లేరా బుజ్జీ, అన్న మెసేజ పంపాడు చూసావా. నానమ్మ నిన్ను చూసి దిగులు పడుతోంది చూడూ…”

నాక్కూడా దిగులు చాలనిపించింది. వాడెవడో కోన్‌కిస్కా గొట్టంగాడి కామెంట్‌కు నేనెందుకంత ప్రాధాన్యతివ్వాలీ? నా మంచి నానమ్మనూ, నామంచి నాన్ననూ ఎందుకు క్షోభ పెట్టాలీ… నో.. నెవర్‌… ‘సుజీ, గాళ్‌ గెటప్‌’ సెల్ఫ్‌ సజెషెనిచ్చుకొని, దిగ్గున లేచి, మంచం మీద పద్మాసనం వేసుకొని, కూచుని చూద్దునా, బెడ్‌రూం వాకిలికి ఆనుకొని నానమ్మ, నా బెడ్‌ దగ్గరగా నాన్నా దిగులుగా నిల్చుని వున్నారు. సరిగ్గా సమయానికి,

”అమ్మా” అంటూ సునందత్త యింట్లోకి వచ్చింది.

అత్త నానమ్మ దగ్గర ఆగి ”ఏమ్మా ఏమైంది, అంత సీరియస్‌గా వున్నారు. ఆరోగ్యం బాగా లేదా” అంటూ నా దగ్గరకొచ్చి ”ఏమే సుజీ నీకా, మీ నాన్నకా” తలమీద చేయివేసి వేడి ఏమైనా వుందానన్నట్లు చూసింది.

”ఎవరికైతే ఏంలే మొత్తానికి యీ యింటికే బాగాలేదు, యింటి కొచ్చినోళ్లూ, యింటి నుండి పోయినోళ్లు చేసిన నిర్వాకాలు తక్కువవా, మేము ఆనందంగా వుండడానికి” నానమ్మ నిష్ఠురంగా అంటుంటే.

”ఓహో, మళ్లా పాతపురాణాలు యిప్పి ముందుకుప్ప పోసుకున్నారా… మీరు బాగుపడరు… ఏమే సుజీ వీళ్ల వుపదేశాలూ, వ్యాఖ్యానాలూ పట్టిచ్చుకున్నావంటే నువ్వంతే…”

”అవును. నువ్వు చానా బాగుపడ్డావు. నీ దారిలో నడిస్తేనే అదీ బాగుపడుతుంది. మేము చెప్పినట్లు వింటే అది చెడిపోతుంది, సిగ్గులేకుంటే సరి చేసింది చాలక…” నానమ్మ శృతి తప్పుతోందనిపించింది నాకు.

”అమ్మా… అంటే నేను చెడిపోయినాననా నీ వుద్దేశ్యము, నేను చేసింది తప్పనా, లేక పదేండ్లుగా నీకు అర్థం చేయించలేకపోవడమేనా నా తప్పు…”

అత్త గొంతులో బాధ స్పష్టంగా తెలుస్తోంది. పాపం అత్తకు ఎంతటి వోపికో, యిట్లాంటి ఎత్తిపొడుపు మాటల్ని యిప్పటికి వందల సార్లు భరించి ఉంటుంది.

”సునందా నువ్వు జీవితకాలమంతా వివరించినా అమ్మలాంటివాళ్లు నిన్ను అర్థం చేసుకోలేరు. అమ్మ మాటల్ని వొదిలేయ్‌. అయినా పిల్లాపాపల్ని కనం, వుద్యమాలని దేశమ్మీద తిరుగుతాం, అంతే మా సంసారం, అనేవాళ్ల పద్ధతులు ఎవురికి అర్థం అవుతాయి చెప్పు…” నాన్న కల్పించుకునే సరికి, విషయం దారి తప్పిందనిపించింది నాకు.

”అమ్మ సరే, నీమాటా అంతేనేమన్నా… నువ్వు చెప్పు నేను చేస్తుంది తప్పా…”

”ఎవరికి వాళ్లకు వాళ్లు చేసింది తప్పు అన్పించదు. ఎదుటివాళ్లకు, దాన్నుంచీ బాధ అనుభవించే వాళ్లకు తెలుస్తుంది, అందులో తప్పొప్పులు”

”అంటే నేను తప్పు చేసాననీ, దాన్నుంచీ నువ్వూ అమ్మా యిప్పటికీ బాధపడుతూనే వున్నారనీ కదా అర్థం. అంతే కదన్నా” అత్త నిలదీస్తోంది.

”నువ్వు చేసిందానికి యింకొకరు చేసిందానికీ నేను, వాడే కాదు, యిప్పట్నుంచీ యిది గూడా బాధపడుతుంది” నన్ను చూపిస్తూ నానమ్మ గట్టిగా అంది.

”అంటే యిప్పుడు మీరు ముగ్గురూ, వున్నదున్నట్టుగా నా గురించి మాట్లాడుకుంటున్నారా, అంతకంటే యీ సాయంకాలం మీ కింకేమీ పనిలేదా… ఏమే సుజీ ఏంది యిదంతా… ” అత్త అంతే గట్టిగా అడిగింది.

”అత్తా నీ విషయం కాదు. వేరే విషయంలే. నీకు సంబంధించింది కాదు. అనవసరంగా నానమ్మ నిన్ను కలుపుకొంటోంది. మొన్నొచ్చారని చెప్పానే, పెళ్లి సంబంధం వాళ్లు, ఆ వెధవలు ఏదో కామెంట్‌ చేసారంటా, అదీ” అన్నాన్నేను కల్పించుకొని. నేను చెప్తూంటే నాన్న యిబ్బందిగా ముఖం పెడుతున్నాడు.

”కామెంట్‌ ఏమనీ, నా గురించా…”

”నీ గురించి కాదులే” నాన్న అందుకున్నాడు. ”యింక వొదిలెయ్‌…”

”మరెవరి గురించి…”

”యీ యింటి కోడలు గురించి” నానమ్మ వ్యంగ్యంగా అని, ”యీరోజు వాళ్లమ్మ గురించి అన్నోళ్లు, రేపు వాళ్లత్త గురించీ అంటారు. మీరిద్దరూ కలిసి దీనికి పెండ్లి కాకుండా చేస్తారు” కొనసాగించింది. నాన్న ”అమ్మా… ” యిబ్బందితో వారిస్తూ అన్నాడు.

యిక నానమ్మను ఆపి వాతావరణాన్ని తేలిక పరుద్దామనుకొని, నానమ్మను ఒక్క గెంతులో చేరుకొని
”ఏమే ముసల్దానా ఎందుకట్లా అరుస్తావు” అంటూ బుగ్గల్ని సాగదీస్తుంటే, నాన్న నవ్వుతూ

”ఆ ముసల్దాన్ని బతకనీవే యింకొక పదేండ్లన్నా… నీ పెళ్లి చూసి, నీ బిడ్డల్ని ముద్దు చేయోద్దూ…” అంటూ దగ్గరికొచ్చాడు.

”వదలవే మొద్దూ, మధ్యాహ్నం నుంచీ నన్ను హడలు గొడితివి కదనే దొంగముండా” అంటూ నానమ్మ నా బుగ్గల్ని నిమురుతోంది.

నానమ్మ బుగ్గల్ని వదిలేసి, ఒక్కసారి నా నటనా చాతుర్యాన్ని చూపిద్దామనుకొని, నాన్న కాలర్‌ పట్టుకొని

”ఏయ్‌, బాలాజీరావ్‌, నిన్నెవడు పిలుచుకురమన్నాడు, వాణ్నెవన్నో గొట్టంగాణ్ని, వాడేమనుకుంటున్నాడు నన్ను. యీ సామ్రాజ్యానికి యువరాణినని వాడికి తెలీదా. నువ్వైనా చెప్పాలా వద్దా… ఆఁ…” అంటూ గుడ్లురుముతూంటే,

”చాల్లేవే వేషం, మధ్యన వీడేమి చేసాడనీ, నిన్ను ముద్దు చేసీ, చేసీ యిట్లా తయారైనావ్‌ పిల్లవు. నిజంగానే నీకు పెళ్లి చేయాల్సిందేనే బెత్తంతో, అతి ఎక్కువైపోతోంది” నానమ్మ నాన్న కాలర్‌ను విడిపించింది.

అత్త ముఖంలో మెల్లగా సిరియస్‌నెస్‌ విడిపోతోంది. యిప్పుడింట్లో వున్న సమస్యకు తను కారణం కాదన్న అసలు విషయం కూడా తనకు అర్థమైనట్లుంది.

”ఏయ్‌ వసుంధరమ్మా కొడుకును వెనుకేసుకొస్తున్నావా, యింతవమానం నాకు జరిపించిందానికి నీ కొడుక్కు పనిష్మెంట్‌ తప్పించలేవు” అంటూ నాన్నను వెనుకనుండీ తోసుకుంటూ

”పదా, అట్లా షికారుకెల్దాం, అత్తా నువ్వూరా…” అత్తను పిలుస్తూ నాన్నను బయటికి లాక్కెళ్తున్నాను.

అత్త నవ్వుతూ ”చీకటి పడుతూందే పిల్లా, యిప్పుడెందుకూ, నాకు అమ్మతో పనుంది” అత్త ముఖం చాలా ప్రసన్నంగా వుందిప్పుడు. అత్త ఏ పరస్థితుల్లోనూ బాలెన్స్‌ కోల్పోదు. ఒకవేళ కోపమొచ్చినా కాస్సే పే.

”ఏమే యిప్పుడు పోయి బయట యిద్దరూ చిరుతిండ్లు తిండానికా… ఆఁ… వద్దూ…” అంటోంది నానమ్మ.
అయినా ఆమె మాటల్ని ఖాతరు చేస్తామా తండ్రీకూతుళ్లం మేమింద్దరం ఎప్పుడైనా?

”అమ్మా పాప నిద్రపోయిందా” నాన్న, నానమ్మను అడుగుతున్నాడు.

”ఆఁ, నిద్రపోయిందిరా… మధ్యాహ్నం ఎంతగా ఏడ్చుకుందో ఏమోరా, ఏది వినకూడదనుకున్నామో అదే వినాల్సి వస్తోంది. చూడు నాయనా, ‘తల్లి అలాంటిదైతే యింక కూతురూ అంతేనేమో’, అన్నాడంటరా వాడు. పిల్ల నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చుగానీ యిట్లా పనికిమాలిన మాటల్రా అనేది” నానమ్మ ఏడుస్తున్నట్లుంది.

”అమ్మా యిదంతా నేను చేసుకునిందే, అందుకే జీవితమంతా అవమనం భరిస్తున్నాను. యిప్పుడిక యేమీ తెలియని నా బిడ్డకూ అవమానాలు తప్పేట్లు లేవు” నాన్న బాధను నేను వినలేకపోతున్నాను.

”సరే వొదిలేయప్పా, దీంట్లో నీ తప్పేంవుంది, ఆ మహాతల్లి చేసిన పనికి, చేసుకున్నందుకు నిన్నూ, పుట్టినందుకు పిల్లల్నీ హింసపెడతా వుంది”

”వొద్దమా, అవన్నీ అనుకొని లాభం లేదు. మన ఖర్మ మనం అనుభవించక తప్పదు, యింకరా పాపకు మెలుకువొస్తుందేమో”

”తల్లేమో అట్ల వెళ్లిపోయిందంటా, అత్తేమే సంగాలెంట తిరుగుతుందంట అని జనాలంతా అనుకుంటుంటే యీ పిల్లకు సమ్మంధాలెమోస్తాయిరా, యీ పిల్ల గురించే నా బాధంతా”

”ఏం చేద్దాం. మన యింటి కథ అట్లా వుంది…”

నేను నిద్రపోయాననుకొని నాన్న లైట్లార్పేసినట్లున్నాడు. నిజంగా నాకు నిద్ర పడుతుందా? తల్లిలేని బిడ్డలకు నిద్రొస్తుందా? నాకు అమ్మ కావాలి, అమ్మొస్తుందా? గట్టిగా ”అమ్మా” అని అరవాలనిపిస్తోంది. అరవగలనా? అరిస్తే మాత్రం ఆమెవొస్తుందా. ఎక్కడుంది? ఎందుకు మమ్మల్ని వొదిలిపోయింది. నాన్నా, నానమ్మ అమ్మ గురించి నా ఎదురుగా ప్రస్తావించరు, నాన్న చాలా కఠినంగా వుంటారీ విషయంలో. అయితే చిన్నప్పుడ్నుంచీ నానమ్మ పరోక్షంగా అమ్మ గురించి చాలా విషయాలే చెప్పింది. నానమ్మ ప్రకారం మాత్రం అమ్మ ‘కండ కావరంతో వెళ్లిపోయింది’.

అత్త నాకన్నా పది, పన్నేండేండ్లు పెద్దైనా, అమ్మ తర్వాత అమ్మనే. నాకు మంచి స్నేహితురాలు కూడా. బుద్ధి వొచ్చే వయసుకు, నేను అడిగే ప్రశ్నలకన్నింటికీ సమాధానంగా,

”యిదుగో యీ పుస్తకం చదవవే, యిది నువ్వు చదవాల్సిన పుస్తకం” అని అత్త తనతో ‘మైదానం’ చదివించింది. అత్త తనతో యింకా చాలా పుస్తకాలు చదివించింది. అన్నింటిలోకి మైదానాన్ని ఎన్నిసార్లు చదివుంటానో, మొదట్లో మైదానం ఎంత చదివినా అర్థమయ్యేది కాదు, అర్థమయిన తర్వాత చలం మ్మీదా, చలం పాత్ర రాజేశ్వరి మీదా ఎంత కోపమొచ్చేదో. అదే మాట అత్తతో అంటే

”జీవితంలో వాస్తవం అలాగే వుంటుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. రాజేశ్వరిని అర్థం చేసుకునే సంస్కారం కోసం ఘర్షణ కూడా పడాలి” అంది.

నాన్న, చలం మైదానంలోని ముక్కుపొడం లాయరైతే కాదు గానీ, అమ్మ మాత్రం రాజేశ్వరేనట. ఆమె వెళ్లిపోయాక యిక తిరిగి చూళ్లేదు. అన్నా, నేను యిద్దరం ఎట్లా వున్నామో అని ఆమెకేమీ అన్పించలేదేమో, అయినా నా పిచ్చిగాకపోతే వొకసారి వదిలిపోయిన యింటికి తిరిగి ఎలా వస్తుంది. తిరిగి రాలేకా, మమ్మల్ని మరవలేకా, గిల్టీఫీలింగుతో ఎంత యాతన పడ్డదో, బతకడానికి ఎన్ని యిబ్బందులు పడుతున్నదో, యిప్పుడెక్కడున్నదో యేమో గాని తను గుర్తురాని రోజంటూ వుందా. నా పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలైనప్పట్నుంచీ మా యింటిని మరీ నీడలా వెంటాడుతోంది. ‘పరువూ, ప్రతిష్ఠా, సంపదా దేనికీ కొదవలేని తన కొడుక్కి అమ్మ మాయని మచ్చలా మిగిలిందని’ నానమ్మ బాధపడుతూ వుంటుంది. అయినా వొక్కోసారి నాకే అన్పిస్తూ వుంటుంది నాన్నను ఏ స్త్రీ అయినా ఎట్లా ప్రేమిస్తుందని, సంపదలుంటేనే చాలా, శరీరానికి లాలింపు వొద్దా? మమ్మల్నింతగా చూసుకుంటున్న నాన్న అమ్మనెందుకు లాలించలేదో, లేదా యీయన లాలింపు ఆమెకు చాల్లేదో. ఆమె వెళ్లిపోయినా నాన్న యింకే స్త్రీని చూడకుండా మాకెంతో ప్రేమ నందించాడే, ఆమెకు మాత్రం ఆమె శరీరమే ముఖ్యమో, చలం కథల్లోని అరాచకత్వమంతా ఆమెలో కన్పించి కోపమొస్తూ వుంటుంది. చలం చెప్పే స్వేచ్ఛ వినడానికి బాగానే వుంటుంది. ఆచరిస్తే అమ్మ కథలా వుంటుంది. చివరకు కన్న బిడ్డల్ని కూడా చూసుకోలేని హీనస్థితిగా వుంటుందా స్వేచ్ఛ. అందుకే సునందత్త అంటుంటుంది ”ఆర్థిక స్వాతంత్య్రం లేకుండా చెలం గిలం తత్వాలు చెల్తే నయ్‌” అని.

”అత్తా, అమ్మ చేసింది తప్పా” అని అడిగినప్పుడల్లా

”ఎందుకే ప్రతిసారీ తప్పు తప్పు అనుకుంటావ్‌, ఆమె వున్న పరిస్థితుల్లో అట్లా చేసిందేమో, ఆమె వెళ్లిపోయిన కొత్తలో నేనూ, తిట్టుకున్నానేమో గానీ, యిప్పుడు నాకున్న అవగాహనకు ఆమె చేసింది తప్పని నేననను” అంటుంది.

ఎప్పుడు నిద్రపట్టిందో యేమో గానీ, నాన్న వచ్చి మెల్లగా భుజం తట్టగానే మెలుకువొచ్చేసింది. లేచి మంచం మధ్యగా పద్మాసనం వేసుక్కూచున్నాను. నాన్న మెల్లగా పిలిచి, నిశ్శబ్దంగా వుండమని సైగ చేసి తనవెంట తీసుకెల్తూన్నాడు. పెరటి తలుపులు నిశ్శబ్దంగా తెరుచుకున్నాయి. తోటలోకెళ్లా. అది మా యింటి వెనుక తోటేనా? అన్పించింది. ఎంతో విశాలంగా మైదానంలా వుంది. ఎటు చూసినా పరుచుకున్న పచ్చిక, పచ్చని చెట్లూ, ఎన్నో రకాల తీగలూ వాటికి గుత్తులు గుత్తులు పూలూ, పళ్లూ. పక్షుల కిలకిలలతో, ఎంతో మనోహరంగా వుందా తోట. తోట మధ్యగా పెద్ద వూయల. అందులో ఒకామె కూర్చొనుంటే ఒకతను వూయల వూపుతున్నాడు. నేను నాన్న వెనుకనే నిశ్శబ్దంగా వెళ్లాను. నాన్న ఒక పొదమాటున నిల్చుని వాళ్లనే చూస్తున్నాడు. కళ్ల వెంబడి దుఃఖం, పొంగుకు వస్తోంది. ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ, విఫలమవుతున్నాడు. వున్నదున్నట్టుగా, నాన్న ఎప్పుడూ లేనంత కోపంతో వూగిపోయాడు. అంతే పొదమాటునుండీ బయటికొచ్చి వూయల వూపుతున్న అతన్ని పట్టుకొని తోసేసాడు. వూయలలో వున్నామెను తిడుతున్నాడు. ఆవేశంగా అరుస్తున్నాడు. ఆమె యేదో అంటోంది. చేతుల్తో ‘యింత లావు’ అన్నట్లు చూపిస్తోంది. నాన్న ఆయాసపడిపోతూ వుంటే, కింద పడ్డతను పైకి లేచి నాన్ననీ తోసేసాడు. నాన్న మీదికి పక్కనే వున్న రాయిని ఎత్తి వేయబోతూంటే, ఆమె అడ్డుకొని అతన్ని పక్కకు తీసుకుపోతోంది. నాన్న కిందపడుతూనే నేను పొదమాటు నుండీ పరిగెత్తుకొచ్చి ”నాన్నా, నాన్నా” అంటూ ఏడుస్తున్నాను. వూయల వూగినామె తనను చూసి తన దగ్గరకు రావాలని చూసింది గానీ, అతను ఆమెను లాక్కెల్తున్నాడు. నాన్న తనను పట్టుకొని ‘పాపా’ అంటూ యేడుస్తున్నాడు. ”నాన్నా” అంటూ తనూ బావురుమంది.

”ఏమ్మా సుజీ, ఎందుకట్లా కలవరించుకుంటున్నావు” అంటూ నాన్న పలకరిస్తుంటే మెలుకువొచ్చింది. ఎదురుగా నాన్న, కలలో కిందపడిన నాన్న. నాన్నను చూస్తుంటే దుఃఖం పొంగుకు వచ్చింది. యింత అపరాత్రయినా బిడ్డల్ని కనిపెట్టుకునుండే నాన్న, నిజంగా జీవితంలో కిందపడ్డాడు.

”ఏమ్మా ఎందుకలా అరిచావూ, యేదో పీడకల కదా. యిద్దో యీ మంచినీళ్లు తాగి స్థిమితంగా పడుకో…’ అంటున్నాడు నాన్న. టీపాయ్‌ మీద గ్లాస్‌ పెట్టిన శబ్దం లీలగా వినిపించింది. మళ్లీ మగత కమ్ముకుంటూ వుంది.

‘ఏం నాన్నా అమ్మను ప్రేమించినతన్ని నువ్వూ ప్రేమించగూడదా’ అని అడుగుదా మనిపించింది. అలా అడిగితే నాన్న నన్ను యిప్పటిలా ప్రేమించగలడా. ఏమో నాన్న కూడా మగవాడే కదా. పరాయి మగాడితో స్నేహించే భార్యను ఓర్వగలడా. ఓర్వగలిగిన సహనం మగాడికి సమాజం యిస్తుందా. యిస్తే మాత్రం అలాంటి వాళ్లను లోకం ఏమంటుంది? చేతకాని వాడనదా? అందుకే అత్త అంటుంటుంది ”అసలీ వివాహ వ్యవస్థే మొత్తంగా మారా”లని ఆ మారనందుకే కొందరైనా స్త్రీలు మైదానాల్లోకి వెళ్లిపోతుంటారు. అత్త గూడా తనకు నచ్చినవాడితో మైదానంలోకి వెళ్లిందే. ఒకసారి ఆ మైదానలోకి వెళ్తే ఎంత బాగుంటుందో,

‘ఏం సుజీ మైదానంలోకెల్దామా…’ మనసు తహతహలాడింది, ‘సుజీ గెటప్‌, పదా,’ అనుకున్నది ఆలస్యం ఎదురుగా ‘మైదానం’… అదే పచ్చదనం, లతలూ, అదే పూల గుత్తులూ, పక్షుల కిలకిలలూ, నునువెచ్చని వెలుగులో మనుషులెంత ఆనందంగా వుండొచ్చీ మైదానంలో, అలా నడచి వెల్తూంటే అక్కడక్కడా జంటలు, జంటలు. కొన్ని చోట్ల గుంపులు, గుంపులు సమూహాలు అంతా కొత్తలోకం మనుషులు.

‘ఎక్కడైనా అమ్మ కన్పిస్తుందేమో వెదకాలి’ అనుకుంటూంటే,

‘రా సుజీ అట్లా వెళ్లి వెదుకుదాం’ అని విన్పించింది. తీరా చూస్తే అత్త!

‘నువ్వెప్పుడొచ్చావ్‌ యీ తోటలోకి’ అంటూ ఆనందంతో చేయి పట్టుకుంది.

ఇద్దరూ అలా గాల్లో విహరిస్తున్నారు. కాస్త దూరం వెళ్లేసరికి, వూయలలో వొంటరిగా వూగుతూ ఒకామె. తమను చూసి దగ్గరికి రమ్మని పిలుస్తోంది.

బెరుకుతోనే దగ్గరికెల్తే యిద్దరినీ ఎంతో యిష్టంగా ముద్దు పెట్టుకొని

‘ప్రేమకు హద్దులు లేవు’ అని ‘మగాడు ఎంతమందినైనా ప్రేమించినపుడు, స్త్రీ కూడా ఎంతమందినైనా ప్రేమించొచ్చు. వాళ్లతో తిరగొచ్చు’ అంది.

ఆ మాటకు నాకు కోపం వచ్చి ‘నేను నా బిడ్డనే అనుకోండి, యీ మైదానంలో మీతోనూ, నాతోనూ ఒకతనే తిరగాలనుకుంటే ఎలా’ అన్నాన్నేను. అత్త నావైపు ప్రశంసగా చూసింది.

అందుకామె బిత్తరపోయి ‘అలా యేం కాదు. నిర్ణయించుకునే స్వేచ్ఛ నీకుండే అంతే’ అంది. ‘నా కేమీ అర్థంకాలేదన్నాను’.

‘మగవాడు చేస్తున్నప్పుడు మనమెందుకు చేయకూడదూ, మనమూ చేస్తే మగవాళ్లకు పిచ్చికుదురుతుంది’ అంది తను.

అంతలో తెల్లని బట్టల్లో మెరిసిపోతూ చేతిలో పుస్తకంతో ఒకామె,

‘యిటురండి, ఆమె మాటలు వినకండి అది అరాచకమవుతుంది. స్త్రీ విముక్తికే కాదు, మొత్తం మానవ విముక్తికే ప్రణాళికలు సిద్ధం చేద్దాం రండి’ అంటోంది

అత్త ఆమె మాటలకు, నాగస్వరం విన్న నాగుపాములాగా నన్ను అటువైపు లాక్కెళ్లింది. ఇద్దరం ఆమె వద్దకు పరిగెత్తాం, పరిగెడుతూ నేను తూలాను, అత్త నన్ను పట్టుకోబోయేంతలో ‘దబ్బు’న పడ్డాను.

”అబ్బా” అనకుంటూ కళ్లు తెరిస్తే మంచం పక్కన నేలమీదున్నాను.

నిద్రలో మంచం మీదనుంచీ దొర్లిపడినట్లున్నాను. తలకు తగిలిన నొప్పితో పద్మాసనం వేసుకొని మంచానికి ఆనుకొని నేలమీద అలాగే కూచుండిపోయాను, కలలోని మైదానం గురించి ఆలోచిస్తూ… మంచి నీళ్ల గ్లాస్‌ అందుకున్నాను.

నాన్న బ్యాంకుకు వెళ్లిపోతూనే, నేను గబాగబా రెడీ అవుతుండడం చూసి ”ఏమ్మా ఎక్కడికి బయల్దేరుతున్నావ్‌” అంది నానమ్మ.

”నానమ్మ వూరికే యింట్లో కూచోవడమెందుకు, బిఎడ్‌ రిజల్ట్స్‌ వచ్చేదాకా ఆగడం ఎందుకనీ మాంటిస్సోరీ స్కూల్లో అప్లికేషన్‌ యిచ్చొద్దామని వెల్తూన్నా…” అన్నాను.

”మంచి పనే వెళ్లమ్మా, త్వరగా వొచ్చేయ్‌” లేత ఆకుపచ్చ నేత చీరలో, నల్లని నానమ్మ బలే ముద్దొస్తూంటే,

”సరే నానమ్మ, మామంచి నానమ్మ” అంటూ తన బుగ్గలు సాగదీసి బయటపడ్డాను.
వుదయం పది గంటలవుతూంటుంది. ఎండ మదురుతూంది.

స్కూలుకు వెళ్లేదారిలోనే అత్తా వాళ్ల గది. స్కూల్‌ కెళ్లేకన్నా ముందే యీ దేవినే దర్శించుకుందామని వెళ్లేసరికి అత్త స్నానాని కెల్తూవుంది.

గది వాకిలి మూస్తున్నదల్లా ఆపి, ”కలెక్టరేట్లో గృహహింస మీద ధర్నా వుంది వెల్దాం, స్నానం చేసొస్తా, కూచో” అని తనను లోపల కూచోమని చెప్పి వెళ్లింది.

ఒక పెద్దగది, దానికెదురుగా ఒక చిన్న వంటగది. బయట కంపౌండ్‌లో యింటివాళ్లతోపాటు కామన్‌గా వాడుకునే లెట్రిన్‌ బాత్‌రూం. మామూలు భాషలో అదొక బ్రహ్మచారుల గదిలావుంది. ఇద్దరుండే ఆ గదిలో వున్న యిద్దరూ ఆడామగా కావడమే యాదృచ్ఛికం.

అత్త పెళ్లి శంకర్‌ మామతో అన్ని రకాలుగానూ తిరుగుబాటే. అసలు వాళ్లిద్దరిదీ దండల పెళ్లి కూడా కాదు. వూరికే కలిసుంటున్నారంతే. యిద్దరు స్నేహితులు కలిసున్నట్లు. యిద్దరూ ప్రజాసంఘాల్లో పనిచేస్తారు. ఎవరి సంఘం వాళ్లదే. ఆయన పనుల్లో ఆయనా, యీమె పనుల్లో యీమె తిరుగుతుంటారు. దినాలకు దినాలు బయటుంటారు. పెళ్లైయిన్నేళ్లయినా, పిల్లల్ని కనలేదు. కనమంటారు కూడా. అందుకే నానమ్మ అత్తను ‘బాగుపడదు ముండ’ అని తిడుతుంది. నాన్న ఎంతో చెప్పి చూసాడు, ‘వుద్యోగమిప్పిస్తాను యిద్దరికీ, ఆ కమ్యూనిస్టుల వెంబడీ, హక్కుల సంఘాల వెంబడీ తిరగొద్దని’ యిద్దరూ వినరూ. యిద్దరిదీ పుస్తకాల లోకం. చిన్న పాటి పత్రిక కూడా ప్రచురించే పని కూడా చేస్తుంటారు. ఎటు చూసినా పోస్టర్లు, కరపత్రాలూ గదిలో, గుట్టలు గుట్టలు పుస్తకాలున్నాయి. హాళ్లోనుంచీ వంటగదిలో కెళ్లాను. అత్త వంట చేసేసి నీట్‌గా సర్ది వుంచింది. వంటగదిలో కూడా షెల్ఫ్‌ల నిండా పుస్తకాలే.

టేబిల్‌ మీద, రాస్తూ మధ్యలో ఆపేసిన పేర్లు గాలికి రెపరెపలాడుతున్నాయి. తీసి చూసాను. ‘సాల్వాజుడుం నేపథ్యంలో స్త్రీలమీద హింస’ వ్యాసం చదువుతూంటే వొళ్లు గగుర్పొడిచింది.

అంతలో అత్త వచ్చేసింది. ‘ధర్నాకై కలెక్టరేట్‌ వెళ్లాలి’ అనుకుంటూ గబాగబా రేడీ అవుతూ

”ఏమే నిన్నంతా విషాదమొగం అభినయించావా” అన్నది.

”లేదత్తా… అమ్మ నాస్టాల్జియా లాగా పట్టుకుంది. ఆ గొట్టంగాడొకడు యేదో అన్నాడనీ…”

”యింట్లో వూరికే వుంటే మరి యిట్లాగే, నీ వెంటపడి పెళ్లి చేస్తామంటారు… పెళ్లి సమ్మంధాల పేరుతో యిలాంటి కామెంట్లూ వింటుంటావు”

”ఏం చేయమంటావు, మరి చదువైపోయింది… నీలాగా వుద్యమాల్లో తిరగమంటావా?”

”వ్యంగ్యమొద్దు. వుద్యోగమేదన్నా చూసుకోవే. యిప్పుడు వుద్యమాలు కూడా ఏమీలేవు. అంతా స్తబ్దతే. యిప్పుడు మనుషుల్ని మిగిలించుకోవడం కూడా కష్టంగా వుంది. మీ తరం వాళ్లను కనీసం సానుభూతిపరులుగా నన్నా మిగుల్చుకుంటేనూ గొప్ప విజయమేనే”

”వుద్యోగం చేసుకున్నా పెళ్లి తప్పదు. ఎవడ్ని చేసుకున్నా వాడు నా మీద అధికారం చెలాయించడం, వాడింటికి నేను పోవడమే కదత్తా…”

”అంటే వాడే నీ యింటికి రావాలా… ఏదో నవల్లో అనుకుంటా ఓల్గా రాసింది, అదీ వొక ప్రయోగమే, దానికెంత సమ్మతి దొరుకుతుంది? యిపుడున్న కుటుంబ సమ్మంధానికి అది ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందా?”

”అది కాకుంటే అంతకన్నా మంచి పద్ధతి, మెరుగైందీ లేదా, ఎవరింట్లో వాళ్లుంటూ, ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూ, స్నేహితుల్లా కలుసుకునే లాంటిదుంటే, ఎంత బావుంటుంది. పిల్లల్ని యిష్టమైతే కంటారు లేదంటే లేదు, కంటే యిద్దరూ కలిసి పెంచుతారు, లేదా పెంచే వాళ్లుంటే వాళ్లకిచ్చేస్తారు, నమ్మిన పనుల్ని చేస్తారు”.

నా మాటలకు, అత్త పగలబడి నవ్వుతూ, నా చెవిని మెలిపెడుతూ ”ఏమే నామీదనే జోకా” అంది.

నవ్వుతూ ”కాదత్తా యీ మార్గమే నిజమైన మైదానం అనిపిస్తుంది నాకు. ఆడవాళ్లకు అప్పుడే స్వేచ్ఛ. నిజంగా సీరియస్‌గా చెబుతున్నా” అన్నా

”సుజీ, అది నిజంగా కలనే, దానికోసం ఎన్ని వుద్యమాలు రావాల్సి వుందో”

”ఈ తొక్కు జనజీవన స్రవంతి సంసారం ఎంత అసహ్యంగా వుందో చూపించే జంటలు చేసే వుద్యమాలు అవే కదత్తా”

”అవునవే నిజమైన స్త్రీ వుద్యమాలు. అయితే యివన్నీ ప్రయోగాలేనే, యిపుడున్న ఫ్యామిలీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతాయా అన్నది కాలం ముందున్న ప్రశ్నే…”

”ఏమన్నా కానీ, మా నాన్నకు చెబుతాను యిలాంటి దాన్ని అంగీకరించేవాడు దొరికే వరకు నేను పెళ్లే చేసుకోనని”

నా ఈ మాటకు అత్త నవ్వుతూ

”మీ అమ్మ వొక మైదానంలోకి అడుగుపెట్టింది. నవ్వు దాన్ని సుసంపన్నం చేయాలనుకుంటున్నావు కదా…” అంటూ బీగం (తాళం) చేతికి తీసుకుంది.

గది తలుపులేసి యిద్దరమూ కలెక్టరేట్‌ వైపు నడిచాం.

ఒక అభిప్రాయం »కథలు

ఒక అభిప్రాయం

  1. ప్రాణహిత » అక్టోబర్ 2007 సంచిక Nov 3, 2007 1

    [...] నేపథ్యంలో జి. వెంకటక్రిష్ణ రాసిన ‘అడుగుజాడలు’ స్త్రీ పురుష సంబంధాలని చలం గారి [...]

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో