అపరాజిత – అధ్యాయం 1: హి – డాగ్ నుంచి వచ్చిన స్త్రీ

“ఒక జాతి స్త్రీలు స్థైర్యం కోల్పోనంతవరకూ
ఆ జాతి ఓడిపోయినట్లు కాదు.
పురుషుల చేతులలోని కత్తులు కటార్లు
ఎంత పదునైనవైనా సరే,
జాతి స్త్రీలు స్థైర్యం కోల్పోతే
ఆ జాతి పోరాటంలో అంతా కోల్పోయినట్లే”
- చెయాన్ సామెత

నా పేరు మేరి బ్రేవ్ బర్డ్. వూండెడ్ నీ (Wounded Knee) ఆక్రమణలో నా పాపాయికి జన్మనిచ్చిన తరువాత నాకు మరో ప్రత్యేకమైన పేరు ప్రదానం చేశారు – ఒహితిక విన్, బ్రేవ్ ఉమన్. పోరాట గీతాలు పాడుతూ పవిత్రమైన డేగ ఈకను నా జుట్టులో అమర్చారు. ఎర్ర జాతి (Red Nation) నుంచి వచ్చిన సూ (Sioux) స్త్రీగా జీవించడం అంత సులభమైన విషయం కాదు.

బుల్లెట్ల వర్షం మధ్యలో నా మొదటి బిడ్డకు జన్మనిచ్చాను. బాబు పుట్టి ఒక్కరోజు గడవకముందే మార్షల్స్ మామీద బుల్లెట్ల వర్షం కురిపించారు. బాబుని ఒక దుప్పటిలో కప్పేసుకుని ఆ దాడిలోంచి తప్పించుకున్నాను.మధ్యలో బాబుకు రక్షణగా నా శరీరాన్ని కప్పుతూ “నేను చచ్చిపోయినా ఫరవాలేదు, కాని వాడిని బ్రతకనీయమని” దేవుడిని ప్రార్థిస్తూ మట్టిలో బోర్లా పడవలసివచ్చింది.

వూండెడ్ నీ నుంచి బయటకి వచ్చిన తరువాత, నా ఆరోగ్యం కుదుటపడకముందే నన్ను పైన్ రిడ్జ్ (Pine Ridge) జైల్లో వేసి, నా పాపాయిని తీసుకెళ్ళిపోయారు. పాపాయికి పాలు ఇవ్వనందుకు నా రొమ్ములు ఉబ్బిపోయి, రాళ్ళలా గట్టిపడి ఎంతో నొప్పి పెట్టేవి. 1975లో పోలీసులు నా తలకు M-16 తుపాకులను గురిపెట్టి, నన్ను పేల్చేస్తామని బెదిరించారు. ఇండియన్ స్త్రీగా జీవించడం ఎన్నో కష్టాలతో కూడుకున్న విషయం.

నా ప్రాణస్నేహితురాలు ఆనీ మే అక్వాష్ (Annie Mae Aquash) మిక్ మాక్ (Mic Mac) జాతినుంచి వచ్చిన యువతి. అందమైన పిల్లలుండేవారు ఆమెకు. తనది ఎంతో దృఢమైన మనస్తత్వం. ఒక ఇండియన్ స్త్రీ అలాంటి మనస్తత్వం కలిగి వుండడం అంత తేలికైన విషయం కాదు. పైన్ రిడ్జ్ రిజర్వేషన్ లో ఒక డొంక అడుగున, మంచులో ఆనీ మే శవం కనిపించింది. చలికి తట్టుకోలేక చచ్చిపోయిందని పోలీసులు అన్నారు కానీ,ఆమె తలలో.38 కాలిబర్ బుల్లెట్ దొరికింది. FBI ఆమె చేతులను నరికి వేలిముద్రల గుర్తుకోసం వాషింగ్టనుకు పంపారు. వూండెడ్ నీ లో నా బిడ్డ పుట్టడానికి సహాయం చేసిన చేతులు అవి.

ఎన్ని కష్టాలు పడినా తన మంచితనాన్ని వదులుకోని మా వదిన డెల్ఫిన్ కూడా మంచులో చచ్చిపోయి కనిపించింది. ఆమె కన్నీళ్ళు ముఖంపై గడ్డకట్టుకుపోయాయి. ఒక తాగుబోతు ఆమె చెయ్యి కాలు విరిగేలా కొట్టి, నిస్సహాయంగా పడివున్న ఆమెను మంచు తుఫానులో వదిలేశాడు.

మా అక్క బార్బరా రోజ్ బడ్ లోని ఒక ప్రభుత్వాసుపత్రిలో పురుడు పోసుకోవడానికి వెళ్లింది. అనెస్తీషియానుంచి బయటపడ్డ తరువాత తెలిసింది ఆమెకు తెలపకుండా ఆమెకు కుటుంబ నియంత్రణ ఆపరేషను చేశారని. పుట్టిన పాపాయి రెండు గంటలు కూడా బతకలేదు. ఆమెకు పిల్లలు కావాలని ఎంతో కోరిక ఉండేది. కాదు, ఇండియన్ స్త్రీగా జీవించడం అంత సులువైన విషయం కాదు.

నా చిన్నతనంలో సెయింట్ ఫ్రాన్సిస్ బోర్డింగు పాఠశాలలో ఉన్నప్పుడు కాథలిక్ సిస్టర్లు “క్రమశిక్షణ” పేరిట మమల్ని కొరడాలతో కొట్టేవాళ్లు. నా పదో ఏటి కంతా ఒక పైంటు విస్కీ తాగగలిగేదాన్ని. పన్నేండో ఏట నా శరీరంతో అలక్ష్యంగా ప్రవర్తిస్తున్నానని నన్ను కొట్టారు మా సిస్టర్సు. ఇంతకీ నేను చేసిందల్లా ఒక అబ్బాయితో చేతులు కలపడమే. నా పదిహేనోఏట రేప్ కు గురయ్యాను. ఎవరికైనా మళ్ళీ పుట్టాలనే ఆలోచనే ఉంటే, తెల్ల మగవాడిలా పుట్టడానికి అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలేమో.

ఇక తెగ వీరులైనందుకు, కొంతమంది మగవాళ్లు ఒకరినొకరు తాగి తన్నుకోవడంలోనే తమ వీరత్వాన్ని చాటుకుంటున్నారు. పాతకాలంలో అయితే తమ జ్ఞానం వల్లనో, మంచితనంవల్లనో పేర్లు సంపాదించుకునేవాళ్లు. ఇప్పుడైతే తమ మంచితనాన్ని నిరూపించుకోవడానికి డబ్బు లేదు, ఉద్యోగాలు లేవు. ఇక జ్ఞానమంటారా, వారి జ్ఞానమంతా దుర్మార్గపు మూఢనమ్మకాలగురించేననీ, దాన్ని వదులుకోకపోతే ఈ ప్రపంచంలో మనలేరని, మా మగవాళ్లకు వారి టీచర్లు, మిషనరీలు నూరిపోశారు. ప్రభుత్వం పిల్లలకు ఇచ్చే ADC (Aid to Dependent Children) సౌకర్యాన్ని తమ కుంటుంబాలు సంపాదించుకునేదుకు కొంతమది మగవాళ్లు కుంటుంబాలనుంచి వేరుగా వుండేవాళ్లు. కొంతమంది మగవాళ్లు తాగివచ్చి ఆడవాళ్లను, పిల్లలను కొట్టి, కోపాన్ని తీర్చుకునేవారు. ఆ మగవాళ్లు అలా ఎందుకు చేస్తారో నేను అర్థం చేసుకోగలను. వాళ్ల మీద జాలి కలుగుతుంది, వారి ఆడవారి మీద మరీ ఎక్కువగా.

మొదటినుంచి మొదలుపెట్టాలంటే, దక్షిణ డకోటాలో రోజ్ బడ్ రిజర్వేషన్ కి చెందిన సూ జాతి స్త్రీని నేను. మాది సికాంగు తెగ. దీన్నే “కాలిన తొడ”, బ్ర్రూల్ తెగ అని కూడా అంటారు. ఈ పేరు రావడం గురించి ఒక కథ ఉంది. ఎంతో కాలం క్రితం, ఒక చిన్న సూ బృందాన్ని శతృవులు చుట్టుముట్టి వారి టిపి ఇళ్లకు, చుట్టుపక్కల గడ్డికి నిప్పు పెట్టారట. ఆ సూ బృందం శతృవులతో పోరాడుతూ మంటల నుంచి బయటపడ్డారట కానీ వారి కాళ్లు కాలిపొయ్యాయట. అలా వారికి ‘కాలిన తొడ’, మా భాషలో బ్రూల్, అని పేరు వచ్చిందట. ఈ బ్రూల్ తెగ పవిత్రమైన ఏడు సూ తెగలలో ఒకటి. ఈ ఏడు పశ్చిమ సూ తెగలను కలిపి లకోట జాతి అంటారు. తూర్పు సూ తెగలను డకోట జాతి అంటారు. ఈ రెండు జాతులమధ్య తేడా భాషలోనే వుంది. లకోటలో ‘ల’ అనేచోట డకోట వారు ‘డ’ అంటారు. వాళ్లకు ‘ల’ పలకడం రాదు.

అన్ని సూ తెగలలాగే, బ్రూల్ తెగ కూడా గుర్రాలపై ఆధారపడేవాళ్లు, మంచి అశ్వికులు, వేటగాళ్లు, గొప్ప వీరులు. 1870, 1880 మధ్యకాలంలో అన్ని సూ తెగలను రిజర్వెషన్లలోకి తోశారు. వారి అన్ని కదలికలకూ అవరోధాలు కల్పించి , వారి జీవనాధారమైన అన్నింటినీ – గుర్రాలను, ఆయుధాలను – బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. కాని దుఃఖపు మంచులో కూరుకుపోయిన వారి మనసుల్లో తమ విశ్వాసాలకు, ఆత్మ గౌరవానికి సంభందించిన ఒక చిన్న ఆశ మాత్రం, నివురుగప్పిన నిప్పుని మండించే ఒక వెచ్చని గాలితెమ్మెర కోసం ఎదురుచూస్తూ నిలిచిపోయింది.

ఒక గొప్పనాయకుడి పేరున ఏర్పడ్డ హి- డాగ్ అనే ప్రదేశంలో మా కుటుంబం స్థిరపడింది. ఆ నాయకుడి వారసులు ఇప్పటికీ ఉన్నారు. నాకు తెలిసిన ఒక ముసలామె వందేళ్లకు పైగా జీవించింది. ఆమె ఎప్పుడు పుట్టిందో ఆమెకే కాదు, ఎవరికీ తెలీదు. తను పుట్టినప్పుడు జనాభా లెక్కలు లేవట, ఇండియన్సుకు క్రిస్టియను పేర్లు ఉండేవి కాదట. ఆమె పూర్తి పేరు హి-డాగ్, అంతే. ఆమె నాతో ఎప్పుడూ అనేది” నన్ను ఎనభై ఏళ్ల క్రితం, అందంగా వున్నప్పుడు చూడాల్సింది” అని. ఆమె ముఖాన్ని నేను ఎప్పుడూ మరచిపోలేదు – నిండాపగుళ్లతో, ముడతలతో వున్నా అందంగా వుండేది.

మా అమ్మ ఇండియన్, నాన్న తెల్లవాడు. ఇండియన్ వైపు మేము బ్రేవ్ బర్డ్స్ కు, ఫూల్ బుల్సుకు బంధువులం. ముసలితాత ఫూల్ బుల్ వేణువులను తయారు చేసి వాయించేవారిలో ఆఖరివాడు. అయనవన్నీ పాతకాలపు వేణువులు. పక్షి తలతో, దుప్పి శక్తితో వుండి, అమ్మాయిని అబ్బాయి దగ్గరకు చేర్చే రకం ఆయన వేణువులు. ఫూల్ బుల్ దాదాపు ఒక శతాబ్దకాలం జీవించాడు. తన చివరి రోజు వరకు వేణువు చెక్కుతూ 1976లో చచ్చిపోయాడు. మాకు ఎంతో పవిత్రమైన పెయూట్ పూజకు నన్ను మొట్టమొదటిసారి తీసుకువెళ్ళింది ఆయనే.

వుండేడ్ నీ లో జరిగిన మొదటి నరమేధం చాలాసార్లు గుర్తుతెచ్చుకునేవాడుపూల్ బుల్ తాత. అప్పటికి ఆయన ఇంకా చిన్నపిల్లవాడు మాత్రమే. షామాన్ అయిన తన తండ్రితో కలిసి ప్రయాణిస్తూ వుండేవాడు. ఆ సమయంలో వూండెడ్ నీ దగ్గరలో జరుగుతున్న ఘోస్టు డాన్సులో పాల్గొనడానికి వెళ్ళారు. (ఘోస్టు డాన్సు అంటే తమ పూర్వీకుల ఆత్మలని తలుస్తూ కష్టకాలంలో ఉన్న తమకు దారి చూపమని వేడుకుంటూ ఒక వృత్తాకారంలో చేసే నృత్యం. అమెరికా ప్రభుత్వం నేటివ్ అమెరికన్ తెగలను అణిచేస్తున్న క్రమంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న తెగలలో ఈ ఆచారం కొత్తగా బయలుదేరింది. తమ పూర్వీకుల ఆత్మలను తమ మధ్యకు రప్పించుకోవాలని నేటివ్ అమెరికన్లు ఘోస్టు డాన్సు చేస్తున్నారని తెల్లవాడు తప్పుగా అర్ధం చేసుకుని ఈ ఆచారం పాటించకూడదని నిబంధనలు విధించారు- Translator’s note.) అప్పుడు వారు వంటి మీద ఈ నృత్యానికి తగిన బట్టలు వేసుకుని వున్నారు. ఆ బట్టలు బుల్లెట్లను అపుతాయని నమ్మేవారు. వాళ్ళు పైన్ రిడ్జ్ చేరేసరికి తెల్లసైనికులు వారిని అడ్డగించారు. ఆ తెల్లసైనికులలో కొంతమంది జార్జి కస్టర్ నాయకత్వం వహించిన ఏడవ అశ్విక దళానికి చెందినవారు. దాదాపు ఒక దశాబ్దం క్రితం ఈ అశ్విక దళం నేటివ్ అమెరికన్లు గెలిచిన ఆఖరి యుద్ధంలో తమ నాయకుడిని పోగొట్టుకుంది. వాళ్ళిప్పుడు కొంతమంది ఇండియన్లనైనా చంపవచ్చుననే ఆశతో వున్నారు. ఫూల్ బుల్ బృందం పాత తుపాకులను, విల్లంబులను, ఆఖరికి కత్తులను కూడా తెల్లసైనికులకు అప్పగించవలసి వచ్చింది. సైనికులు తమ ప్రతి కదలికను గమనిస్తూ వుండగా, టిపి ఇళ్ళను ఒక వృత్తంలో దగ్గరిదగ్గరిగా కట్టుకుని, బళ్ళను ఆ వృత్తం వెలుపలు విప్పుకున్నారు. అది చలికాలం కూడా. విపరీతమైన చలికి చెట్టు బెరడులు పెద్ద శబ్దంతో చీలిపోతున్నాయి. మరుసటి రోజు ఉదయాన్నే జనాలు మంటలు వేసుకుని చలికాగుతూ టీ చేసుకుంటున్న సమయంలో విరుగుతున్న చెట్లకొమ్మల శబ్దాల మధ్యలో మరో వింత శబ్దం వారికి వినిపించింది. అది ఒక పెద్ద రగ్గుని ఎవరో బలవంతంగా చించుతున్న శబ్దం: ఫిరంగులమోతలో కలిసిపోయి పేలుతున్న తుపాకుల శబ్దం. పెద్దవాళ్లు కన్నీళ్ల పర్యంతమవడం, ఆడవాళ్లు “మనవాళ్లను చంపుతున్నారు, వాళ్లను నరికేస్తున్నారని “ అంటూ ఏడవడం ఫూల్ బుల్ తాతకు గుర్తుండిపోయింది. వాళ్లు వున్న ప్రదేశానికి రెండు మైళ్ల దూరంలో మూడు వందలమండి సూ మగవాళ్లను, ఆడవాళ్లను, పిల్లలను మూకుమ్మడిగా హత్య చేశారు. చలికి గడ్డకట్టుకుపోయి, భయంకరమైన ఆకారాల్లో వున్న మృతదేహాలను కుక్కలను వేసినట్టు ఒక గుంతలో పడెయ్యడం చూశాడు తాత. ఆకలిగొన్న ఒక చిన్న పాపాయి చచ్చిపోయిన తన తల్లి రొమ్ములు చీకుతూ వుండడం చూశాడు.

లిటిల్ బిగ్ హార్న్ లోనో, రోజ్ బడ్ లోనో, గ్రట్టన్ లేదా ఫ్రెట్టర్మన్ యుద్ధాల్లోనో పోరాడిన నా పూర్వీకుల గురించి, వారి శౌర్యపరాక్రమాల గురించి చెప్పాలని నాకు చాలా వుంది కాని, 1880 ముందు వున్న నా కుటుంబపు చరిత్ర గురించి తెలిసింది చాలా తక్కువ. లిటిల్ బిగ్ హార్న్ యుద్ధంలో కస్టర్ పై దండెత్తిన వారిలో నా ముత్తాతలు పోరాడివుంటారని నా ఆశ, కనీసం అలా ఊహించుకోవడం నాకిష్టం, కానీ నాకు దాని గురించి నిజంగా తెలియదు. మా రోజ్ బడ్ కు చెందిన ప్రజలు జనరల్ క్రుక్ లేదా కస్టర్ల మీద జరిగిన దాడుల్లో పెద్దగా పాల్గొనలేదు. అప్పట్లో అన్ని అధికారాలూ కలిగి వుండిన మా తెగ పెద్ద స్పాటెడ్ టైల్ చేసిన శాసనాలే ఇందుకు కారణం. ఒక వీరుడిగా ఆయన డేగ ఈకలు సంపాదించుకున్నాడు కానీ అతడిని ఒక యుద్ధంలో బందీగా పట్టుకుని తూర్పున ఒక జైళ్లో వేశారు. ఎన్నో సంవత్సరాల తరువాత వెనక్కి వచ్చిన ఆయన తెల్లవాడి పట్టణాలను చూశానని, అన్ని తెగలవారందరినీ కలుపుకున్నంతకంటే ఎక్కువమంది తెల్లవాళ్లు ఒక్కో పట్టణంలో వున్నారని, దేశంలో అని తెగల దగ్గర వున్న తుపాకులు, బుల్లెట్ల కంటే ఎక్కువ ఒక్క రోజులో ఒక్కొక్క తెల్లవాడి ఫ్యాక్టరీలో తయారవుతున్నాయని చెప్పాడు. తెల్లవాడిని ఎదిరించడానికి ప్రయత్నించడం పిచ్చితనమని చెప్పాడు. నేటివ్ అమెరికన్ చరిత్రలో అతి ముఖ్యమైన 1876వ సంవత్సరంలో స్పాటెడ్ టైల్ తన తెగలోని యువకులను సిట్టింగ్ బుల్, గాల్, క్రేజీ హార్స్ లను చేరకుండా కట్టడి చెయ్యడానికి ఇండియన్ పోలీసులను నియమించాడు. (సిట్టింగ్ బుల్, గాల్, క్రేజీ హార్స్ లు లిటిల్ బిగ్ హార్న్ యుద్ధంలో నేటివ్ అమెరికనుల తరపున పోరాడిన నాయకులు- Translator’s note). కొంతమంది యువకులు, వాళ్ళలో కొంతమంది మా కుటుంబానికి చెందిన బ్రేవ్ బర్డ్స్, స్పాటెడ్ టైల్ కట్టడినుంచి తప్పించుకుని లిటిల్ బిగ్ హార్న్ జరిగిన మొంటానా (Montana) కు చేరారని చెబుతారు కాని, దాని గురించి ఎవరికైనా తెలిసింది చాలా తక్కువ. ఇటువంటి విషయాలను, రిజర్వేషన్లలో బలవంతంగా కుక్కబడిన తరువాత, మననం చేసుకోవడం అంత తెలివైన పని కాదని అనుకునేవారు. దాని వల్ల రేషన్ అందకపోవడం లాంటి ఇబ్బందులు ఎదురవుతాయని భయపడేవారు. ఈ కారణం వల్లనే మా కుటుంబంలో చాలామంది క్రిస్టియానిటీ తీసుకుని తెల్లదనానికి దగ్గరవడానికి ప్రయత్నించారు. ఈ ప్రక్రియను వెనక్కి మళ్లించడానికి ఎన్నో ఏళ్లు పట్టింది.

నాకంటే నాలుగేళ్ళు పెద్దదైన మా అక్క బార్బరా, నేను పుట్టినరోజు తనకి జ్ఞాపకం ఉందని చెబుతుంది. అది ఉరుములతో మెరుపులతో కూడిన వర్షపు రాత్రట. అప్పట్లో మాకు కరెంటు లేదు. పాతకాలపు కిరోసిన్ దీపాలు ఉండేవి. బాత్రూమ్ లేదు, కుళాయి నీళ్ళు లేవు, కార్లు లేవు. కొద్దిమంది తెల్ల టీచర్ల దగ్గర కార్లు ఉండేవి. ట్రేడింగ్ పోస్టు దగ్గర వున్న హి – డాగ్ దగ్గర ఒక ఫోను ఉండేది. ఇంతకీ ఇదంతా ఎన్నో ఏళ్ళ క్రిందటి విషయం కూడా కాదు. చాలామంది ఇండియన్ ఆడవాళ్ళలాగే మా అమ్మ కూడా నన్ను ఇంటి దగ్గరే కనవలసి వుండింది. కానీ ఏదో సమస్య వచ్చినట్టుంది. నేను పొట్టలో అడ్డం తిరిగానో ఏమో. మా అమ్మ పురిటి నొప్పులతో ఎంతో సేపు బాధపడింది. చాలాసేపయిన తర్వాత ఎవరో ట్రేడింగ్ పోస్టునుంచి అంబులెన్సు పిలిపించారు. వాళ్ళు అమ్మను రోజ్ బడ్ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. కానీ అప్పట్లో అక్కడ సర్జరీకి అవసరమయ్యే సరంజామా లేనందువల్ల అమ్మను 90 మైళ్ళ దూరంలో ఉన్న పైన్ రిడ్జ్ కు తీసుకెళ్ళారు . ఈవిధంగా నేను క్రేజీ హార్స్ ప్రజల మధ్య పుట్టాను. మా చెల్లి సాండ్ర పుట్టిన తరువాత అమ్మకు, ఆమెకు చెప్పకుండా హిస్టరెక్టమి ఆపరేషను చేశారు. ఇలాంటి మోసపూరితమైన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కొద్దికాలం కిందటి దాకా సాగేవి. కొంతమంది ఉద్దేశంలో ఎంత తక్కువమంది ఇండియన్లు ఉంటే అంత మంచిది. కల్నల్ చివింగ్టన్ తన సైనికులతో అన్నాడట: “ చిన్నా పెద్ద చూడకుండా వాళ్ళందర్నీ చంపెయ్యండి. ఈపి నుంచే పేను వస్తుంది !”

గంటల కొద్దీ సాగిన పురిటి నొప్పులనుంచి, తుపానులో పైన్ రిడ్జ్ కి చేసిన ప్రయాణం నుంచి, డాక్టర్ల నిర్లక్ష్యం నుంచి ఎలాగోలా బతికిపోయాను. మా భాషలో నన్ను ఇయెస్కా అంటారు. అంటే సంకరజాతి అని అర్థం. అలా అని నన్ను తెల్లవాళ్ల పిల్లలు ఏడిపించేవారు. కాని పెద్దయిన తర్వాత వాళ్ళు నన్నలా పిలవడం మానుకున్నారు, లేకపోతే వాళ్ళ ముక్కులు పగిలిపోయేవి. నేను ఉన్నది అయిదడుగులే కాని నేను పోట్లాటకు దిగితే ఎవరైనా బలాదూరే. నాలో తెల్ల రక్తం ఉంది. ఒక్కోసారి ఆ రక్తాన్ని శుద్ది చేసుకోవాలని అనిపిస్తుంటుంది. చిన్నప్పుడు నేను ఎవరో ఏమిటో తెలుసుకోవాలని అద్దంలోకి తెగ చూసుకునేదాన్ని. నా ముఖం, కళ్ళు, జుట్టు అంతా ఇండియనే కానీ చర్మం పాలిపోయి ఉంటుంది. చర్మాన్ని ఎర్రబరిచేందుకు ప్రైరీ (అమెరికాలోని గడ్డి మైదానాలు) సూర్యుడి కోసం, బ్యాడ్ ల్యాండ్స్ (అమెరికాలో ఇండియన్లకు పవిత్రమైన ఒక ప్రాంతం) సూర్యుడి కోసం ఎదురు చూసేదాన్ని.

నా భర్తవైపు కుటుంబానికి ఇలాంటి సమస్యలేవీ లేవు. క్రౌ డాగ్ కుటుంబంలో తెల్ల రక్తపు ఛాయలు లేవు – వాళ్ళు అత్యంత ఉత్తమ సూ జాతీయులు. కొంతమంది క్రౌ డాగ్ఇండియన్ మగవాళ్ల ముఖాలతో పోలిస్తే సెంటు నాణెం బిళ్లమీద ఎద్దుపై ఉన్న ఇండియన్ ముఖం కూడా తెల్లవాడి ముఖంలాగే అనిపిస్తుంది. వాళ్లలో గాధలకు కూడా కొరతలేదు. క్రౌ డాగ్ లలో ఒక్కొక్కరికి ఒక్కో గాధ ఉంది. తమను తెల్లదనం సోకకుండా జాగ్రత్తపడ్డారు. తెల్లవాడికి మచ్చిక అవలేదు. వాళ్లతో టై కట్టించడం, వాళ్లు చర్చికి వెళ్లేలా చెయ్యడం ఎవరి వల్లా కాలేదు. ఇండియన్ ఆచారాలను నిషేధించి, వాటిని నమ్మేవారిని జైళ్లలో పెట్టే రోజుల్లో కూడా క్రౌ డాగ్ ఇండియన్లు తమ క్రతువులు నిర్వహించేవారు. పవిత్ర నృత్యాలు చేసేవారు. క్రౌ డాగ్ ఇండియన్లు తమలాగే తెల్లవాడికి మచ్చిక కాని ఐరన్ షెల్స్, గుడ్ లాన్సెన్, టూ స్ట్రైక్స్ లాంటి ఇండియన్లతో కలిసి వారి జాతీయ వాయిద్యమైన కాన్ గ్లెస్కా (డప్పు) సగర్వంగా మోగించేవారు. ఈ నివురుగప్పిన నిప్పు ఆరిపోకుండా చూడడంకోసం చాలా బాధలు పడాల్సివచ్చింది.

మొట్ట మొదటి క్రౌ డాగ్ అప్పటికే ఓ పేరు మోసిన సూ జాతీయుడు. అతని డాలు మీద రెండు వృత్తాలు, రెండు బాణపు గుర్తులు వుండేవి. ఇవి రెండు తెల్లవాడి బుల్లెట్లకు, రెండు పౌని తెగ బాణాలకు ప్రతీకలు. ఈ మొదటి క్రౌ డాగ్ యుద్ధంలో గాయపడి మంచులో పడి వుండగా, ఒక కయోటీ (ఉత్తర అమెరికాలో తిరిగే చిన్న తోడేలు లాంటి జంతువు) అతడికి వెచ్చదనాన్ని ఇవ్వడంకోసం వచ్చిందట. తరువాత ఒక కాకి ఆయన ముందు ఎగురుతూ ఇంటిదారి చూపించిందట. అతడి అసలు పేరు క్రౌ కయోటీ అని ఉండాల్సింది. ఒక తెల్ల దుబాసీ దీన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల క్రౌ డాగ్ పేరు వచ్చింది. ఈ గొప్ప క్రౌ డాగ్, తెగ కొట్లాటల్లో భాగంగా, తన శతృవైన మరో అధిపతిని చంపి శిక్ష అనుభవించడానికి, వందమైళ్ళ దూరంలో ఉన్న డెడ్ వుడ్ అనే ప్రాంతానికి భార్యా సమేతంగా వెళ్లాడట. ఆరోజుల్లో సుప్రిమ్ కోర్టుకు ఇండియన్ రిజర్వేషన్లపై ఎలాంటి అధికారం లేదు. ఒక ఇండియన్ మరో ఇండియన్ను చంపడం నేరం కాదు. అందువల్ల ఈ క్రౌ డాగ్ కి శిక్ష పడలేదు.

ఆ తరువాత ఈ క్రౌ డాగ్ ఎన్నో సార్లు తెల్లవాడి కళ్ళు గప్పి మంచుపేరుకుపోయిన గుహల్లో, బ్యాడ్ ల్యాండ్స్ లోని కనుమల్లో ఘోస్టు డాన్సు నిర్వహించాడట. నా సొంత కుటుంబానికి అంత చరిత్ర లేకపోయినా, నా భర్త తరపు చరిత్ర ఆ ఖాళీని సులువుగా పూరిస్తుంది.

ఇప్పుడు గ్రాస్ మౌంటైన్ లో మేమున్న ప్రదేశానికే ఒక చరిత్ర ఉంది. రెండు వందల ఏళ్ళనుంచి సాగుతున్న మా భూ పోరాటమే, మా అస్థిత్వానికి మూలాంశం. ఒకసారి ఆ భూమిని పోగొట్టుకున్నామంటే, మమ్మల్ని మేము పోగొట్టుకున్నట్లే. సూ ప్రజలు ఎద్దు చర్మం మీద బొమ్మలతో కూడిన రాతలు, కాలం గురించిన లెక్కలు రాసేవారు. ఇవి మా ప్రజల చరిత్రను ఒక సంవత్సరంనుంచి మరో సంవత్సరానికి చేరవేసేవి. ఈ దేశమంతా చరిత్రమయమే. ఏదో ఒక కుటుంబం పవిత్ర స్వప్నదర్శనం చేసే గుట్టలో, పూర్వకాలం సూర్య నృత్యాలు జరిగిన జాడలో, ఏదో యుద్ధం జరిగిన ఛాయలో కనిపించకుండా ఒక్క మైలు కూడా వెళ్ళలేవు. ఏదో ఒకచోట ఏదోఒకటి గుర్తుకు వచ్చే సంఘటన జరిగి ఉంటుంది. చాలావరకు, వీరమరణమో లేక తాగడం వల్ల వచ్చిన చావు గుర్తులో ఉంటాయి. మేము చావడానికి భయపడేవాళ్లం కాదు. “చచ్చిపోవడానికి ఇది మంచి రోజు!” అన్నది మా యుద్ధపు కేక. అటూ ఇటూ పడిపోతున్న ఇళ్లు ఉంటేనేమి అది కూడా భూమే. ఈ నేలలో హాస్యాలాడుకుంటూ, పాతకాలపు గొప్ప కార్యాలను గుర్తు చేసుకుంటూ గడపడం మంచిదే. కాని సిట్టింగ్ బుల్ లేదా క్రేజీ హార్సుల సాహసకృత్యాలు మననం చేసుకుంటూ శాశ్వతంగా వుండిపోలేవు. వాళ్ల డేగ ఈకలు నువ్వు ధరించలేవు. ఉచితంగా వచ్చే వారి గాథలను నీవిగా చేసుకోలేవు. నీ చరిత్రను నువ్వే సృష్టించుకోవలసిన సమయం వచ్చింది. అదేమంత సులువైనది కాదు.

(మూలం: Lakota Woman – Mary Brave bird)

2 అభిప్రాయాలు »అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం

2 అభిప్రాయాలు

  1. ప్రాణహిత » అక్టోబర్ 2007 సంచిక Nov 3, 2007 1

    [...] తరువాయి భాగం, మమత అనువదిస్తున్న నేటివ్ అమెరికన్ల చరిత్ర అనువాదమూ, రోహిణి ప్రసాద్ వ్యాసం [...]

  2. ప్రాణహిత » అక్టోబర్ 2007 సూచిక Nov 3, 2007 2

    [...] సంభాషణ (మూడవ భాగం)   * ప్రపంచ సాహిత్యం: అపరాజిత – మమత   * ప్రత్యేక వ్యాసం: [...]

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో