పాటే నా ప్రాణం – సుద్దాల అశోక్ తేజతో ఇంటర్‌వ్యూ - 3

ప్రాణహిత: దాదాపు రెండు వేల ఏళ్ల తెలుగు సాహిత్యంలో రైతును అనేక విధాలుగా వర్ణించారు. రైతు గురించి పద్యాలు రాసారు.

అశోక్: రైతు రామాయణం రాసాడు ఒకాయన.

ప్రాణహిత: అవును! ఏటుకూరి వెంకటనర్సయ్య రైతు మీద కావ్యం రాసారు. అట్లాగే దువ్వూరి రాంరెడ్డి కూడా రైతు గురించి రాసారు. శ్రీశ్రీ ‘పొలాలనన్ని హలాలు దున్ని’ అని రాసారు. కానీ మీరు రైతుని ఒక కొత్త పద్ధతిలో పట్టుకున్నారు. చందమామతో పోలుస్తూ ‘ఆకుపచ్చ చందమామ’ అన్నారు. ఆ పాట జలపాత రహస్యం చెప్తారా?

అశోక్: నేను హైదరాబాద్ లో నానా కష్టాలు పడి తర్వాత వెళ్లి కరీంనగర్ మెట్‌పల్లిలో గవర్నమెంట్ టీచర్ గా ఉద్యోగం తెచ్చుకున్నాను. నేను ఉద్యోగానికి వేరే ఊరికి సైకిల్ మీద వెళ్లాలి. అయితే మన దృష్టి ఎప్పుడూ పాట వైపే ఉంటది కద! నేను ఒకరోజు పొద్దున్నే, సూర్యోదయం కన్నా ముందే వెళ్లాల్సి వచ్చింది. అరవై డెబ్భై ఎకరాల పొలాల మధ్య ఒకతను వచ్చి నీళ్లు కడుతున్నాడు. అలాగే చూసాను. అసలు శ్రమ ఎంత అందంగా ఉంటుందనేది నేను బాగా చూసినవాన్ని, పల్లెటూర్లలో ఎక్కువ కాలం ఉన్నాను కాబట్టి. అబ్బ ఇతను నిజంగా ఆకుపచ్చ చందమామ లెక్క ఉన్నడు కదా! అని నిజంగా అక్షరాలా ఇట్లా అనుకున్నాను నేను. సైకిలు ఆపి ‘భలే ఉన్నడయ్యా! ఆకుపచ్చ చందమామ లెక్క ఉన్నడయ్యా!’ అని అలవోకగా వచ్చినటువంటి మాట అది. రైతుని ఆకుపచ్చ చందమామ అన్న మాట బాగుందే, నేను చదువుకున్న పుస్తకాల్లో ఎక్కడ తగల్లేదే అని అనుకున్నాను. ఇదేదో బాగుంది అని అనుకోగానే చందమామ అంటే ఆకాశంలో చందమామ జ్ఞాపకం వచ్చింది. ఇద్దరినీ పోలుస్తూ రాస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన వచ్చింది.

‘ఆకుపచ్చ చందమామ నువ్వేలే నువ్వేలే
నీకు మచ్చలేడా లేనే లేవులే లేవులే
మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది
మన్నుల నుండి అన్నం తీసే మహిమ నీకున్నది
మింటి చుక్కలల్లో వాడు
చెమట చుక్కలల్లో నీవు’

ఇది ఈ పద్ధతిలో రాయడానికి నేను ఒకటి అనుకున్నాను. కృష్ణశాస్త్రి సుతిమెత్తని, హృదయాన్ని అలా ఒక గాలి అలలాగా తగిలే పదాలు రాయడంలో మంత్ర సిద్ధహస్తుడు. రియలిస్టిక్ పాటలు రాయడం, ఒక ఫోర్స్ తో పాటలు రాయడం, ఎంత గొప్ప ఆలోచన ఇది అని అనిపించేట్టు రాయడం శ్రీశ్రీ లక్షణం, అట్లానే మా నాన్న లక్షణం. నేనేమనుకునే వాన్ని అంటే - ‘ఒక స్థానం ఖాళీగా ఉంది. ఈ రెంటినీ కలిపి ఒక పాట సృష్టించే పాటల రచయిత కోసం ఇప్పుడు సాహితీ ప్రపంచంలో ఒక సీటు ఖాళీ ఉంది. అదెవరూ ప్రయత్నం చేస్తలేరు. I want to be that. అటువంటి ప్రత్యేక బాణి ఒకటి తయారుచేసుకుంటే బాగుంటుంది కదా. నాకంటూ ఒక ఫార్మాట్ (format) ఒకటి తయారుచేసుకుంటే బాగుంటుంది కదా’ అని అనుకున్నాను. మా నాన్న ఒక మాట అనేవాడు ‘ముందుకు నడిచిపోయిన తర్వాత, వెనకకు తిరిగి చూస్కుంటే మన పాటలు ఎర్ర జెండల లెక్క మెరవాల్రా అక్కడక్కడ’ అని. ఆడోటి ఆడోటి జెండలు నాటుకుంట పోయినట్టు ఉండాల్నట. ‘గుంపుల గోవింద లెక్క కలిసి పోవద్దురా! వంద మంది కలిసిపోతే ఎవరి అడుగుజాడలు ఏవో గుర్తు పట్టవు. మన అడుగు జాడ, పాద ముద్ర ఎనకకు తిరిగి చూస్కుంటే జెండల్లాగ మెరవాలిరా,’ అన్న మాట నా హృదయంలో నిలిచిపోయింది. మనకంటూ ఒక ముద్ర, ఒక స్టైల్ ఉండాలి. అందరూ అదే సబ్జెక్ట్ రాస్తారు కదా! ఇంకోటి రైతు గురించి రాసినప్పుడు ఎప్పుడు కూడా, ఒక ఉద్యమ నేపథ్యంలో రైతు గురించి మాట్లాడడం, అయిపోవడం, తర్వాత రైతు గురించి ఇంకేదో సందర్భంలో రాయడం, అయిపోవడం. అట్లా కాకుండా ఒక సజీవమైన శిల్పం లాగా ఒక పాట రాసి అక్కడ పెట్టేస్తే ఉద్యమాలున్నా లేకున్నా ఒక రామాయణం లాగా, ఒక మహాభారతం లాగా, ఒక మంచి పద్యం లాగా ఎప్పటికీ పనికొచ్చేటట్టు, universal గా, అన్ని కాలాల్లో నిలిచిపోయేటట్టుగా, ఒక పాట ఎందుకు రాయొద్దు రైతుకి అనిపించింది. ఇవ్వాళ్ల ఈ ఉద్యమం ఉంది రైతు మీద పాట రాసాం, అయిపోయింది. మళ్లా కరెంట్ ఉద్యమం వచ్చింది. కరెంట్ ఉద్యమంలో రైతు వేరు, ధరల ఉద్యమంలో రైతు వేరు. మా నాన్న రాసాడు కదా!

ఇదే రామరాజ్యమా!
ఇదే ప్రజాస్వామ్యమా!
నిదానించి మదిని గాంచి
యధార్థమ్ము పలుకుమా!
నా తెలుగు బలగమా!

రైతు కల్లమందు ధాన్య రాసికి విలువుండబోదు
మార్కెట్లో జేర్చిన మరునాడు ధరకంతులేదు
పేద మధ్యతరగతుల బాధ తెలుప సాధ్యమవదు

ఇట్లా ఇవన్నీ విన్నవాన్నే గదా! అయితే నాకేమనిపించిందంటే ఒక అమర శిల్పి ఒక శిల్పం చేసి పెట్టిపోతే అట్లానే ఉంటుంది కదా అట్లానే రైతు మీద ఒక చిత్రం అట్లా పెట్టి పెట్టేయాలి అన్నది ఎప్పటినుండో మనసుని తొలుస్తున్న సమస్య. అందుకే ఈ ప్రయత్నం చేసాను.

‘వానకాలమొస్తే మబ్బు కప్పుకోని మరుగాయె జాబిల్లి నవ్వు’

వానల్లో చంద్రుడు సరిగ్గా కనపడడు మబ్బులు కప్పుకోని. వానకాలంలో బురద పొలంని దున్ని బయిటికొచ్చినటువంటి రైతుని ఒకసారి మీరు ఊహించుకుంటే మోకాళ్ళ దాక బురదలో మునిగి, మొహం అంతా బురద చిల్లి ఈన కూడా సరిగ్గా కనబడడు, అస్పష్టంగా ఉంటడు.

‘వానకాలమొస్తే మబ్బు కప్పుకోని మరుగాయె జాబిల్లి నవ్వు
వానల్లో వరదల్లో బురద జిల్లి ఉన్న మసక జాబిల్లి నువ్వు
మేఘాల సొగసు వాడు
మాగాణి తేజస్సు నీవు
ఆకుపచ్చ చందమామ నువ్వేలే నువ్వేలే’

‘రోజుకొక్క రంగు మారిపోతుంటుంది పున్నమి వెన్నెల దీపం’

పున్నమి మెల్లమెల్లగా అమవాసై నెలవంక అయితది.

‘రోజుకొక్క రంగు మారిపోతుంటుంది పున్నమి వెన్నెల దీపం
పూటకొక్క తీరు వంగిపోతుంటుంది పుట్టెడు కష్టాల రూపం
అమవాస నెలవంక వాడు ఉపవాస నెలవంక నువ్వు’

రైతు కూడా కడుపు లోపలికి పోయి నెలవంక లాగా ఉంటడు.

ఇట్లా రైతుకి ఒక శాశ్వతమైనటువంటి- వాక్యం రసాత్మకం కావ్యం కదా- గేయం రసాత్మకం కావ్యం లాగా నా వంతుకి ఆయన పాదాల మీద ఒకటి వేయాలనుకొని రాసినటువంటి పాట.

ప్రాణహిత: మీరు తెలుగు సాహిత్యంలో చాలా పాండిత్యం గడించారు గదా! రకరకాల రచయితలను చదువుకున్నారు.

అశోక్: చదువుకోవడం జరిగింది. పోతే ఈ కావ్యాలు చదివడం వల్ల వచ్చిందే ఇది. ఏదీ ఒక శిల్పం లాగా ఒక గేయం ఉండిపోవాలనుకునే ఆలోచన. ‘నల్లనివాడు, పద్మ నయనమ్ముల వాడు’ అనగానే శ్రీకృష్ణుడని మనకి నిలబెట్టి పోయాడు పోతన. అట్లానే ‘ఆకుపచ్చ చందమామ’ అంటే రైతు అని వందేళ్ల తర్వాత కూడా అనుకునేటట్టు నిలబెట్టి పోవాలని ఆలోచన రావడానికి వీళ్లను చదువుకోవడమే కారణం. అట్లా నాకు మేలు చేసినయి ఆ కావ్యాలు కూడా!

ప్రాణహిత: అట్లాగే వాళ్ళ భాష కాని, పదబంధాలు గాని, సంస్కృతానికి సంబంధించిన వ్యవహారం గాని మీ పాటల్ని ప్రభావితం చేసాయా?

అశోక్: ప్రభావం లేదు అనడం అబద్ధం అవుతది. కాని నాకు చదువుకున్నటువంటి ఆ పదబంధాలు, సమాసాలు ఏం నేర్పినయంటే ఏ భావం అయితే ఈ చరణంలో పెట్టాలో ఆ భావానికి సంబంధించినటువంటి అక్షరాలు కొన్ని ఉంటయ్. వాటిని తీసుకొచ్చి పెట్టినపుడు ఆ ఫీల్ అగ్నిపర్వతం లాగా పేలుతది, విస్ఫోటనం లాగా వెలుస్తది అనేది ఒక రహస్యం. నన్నయ పద్యం ఒకటి ఉంది. జ్ఞాపకం లేదు ఇప్పుడు. కావాలనే మర్చిపోయాను. వందల పద్యాలు వచ్చేవి, తేలిక పదాలు రావాలని కొన్ని పద్యాల్ని కావాలనే మర్చిపోవడానికి నేను విపరీతమైన ప్రయత్నం చేసాను. ఎందుకంటే నా పాటలోకి వచ్చి నన్ను కలుషితం చేస్తాయి అని. ఎందుకంటే పొల్యూట్ (pollute) అయిపోతాం కదా! గ్రాంధిక పొల్యూట్. అయితే నన్నయ తన పద్యంలో సర్పయాగం చేసేటప్పుడు ఒక పాముని అహ్వానిస్తుంటడు. అహ్వానించేటప్పుడు, ‘అయ్య:’, ‘సహస్’, ‘ఫనస్’, అని ‘అ:’ లు, ‘స్’ లు వాడుతాడు. అంటే మనం కళ్ళు మూసుకోని వింటే సరిగ్గా పాము బుస కొట్టుకుంటూ వస్తున్నటువంటి శబ్దం వినపడ్తుంటదన్న మాట అర్థాన్ని మర్చిపోతే. అది శాబ్దిక ప్రభుత్వం ఉన్నవాళ్లు చేసేటువంటి ప్రయత్నమన్న మాట. ఇది నాకు అనేక పాటలల్ల ఉపయోగపడింది.

‘పల్లె ఆడవాళ్లు వడ్ల దంపుళ్లు
ఊపిరి తిత్తుల ఒత్తిడి ఒత్తిన’

అన్నపుడు నిజంగా వడ్లు దంచినటువంటి ఆడవాళ్లు లేచి ఏడ్చినటువంటి సంఘటన నాకు జ్ఞాపకం. ‘నిజంగనే బిడ్డా! మాకు ఊపిర్ల ఏదో పెద్ద గుండు పెట్టుకున్నట్టు అయితది ఎక్కువ సేపు దంచితే’ అన్న మాట నేను విన్నానంటే I got that secret. ఏ భావాన్ని వ్యక్తీకరించినప్పుడు ఏ మాటల్ని వేస్తే ఆ భావాన్ని అవి కరెక్ట్ గా తెలియజేస్తాయో - అర్థం తెలియని వాళ్లు విన్నపుడు కూడా, భాష రానివాడు విన్నపుడు కూడా, ఆ భావం అర్థం కావాలన్న మాట. అది పురాణ కవులు నాకిచ్చినటువంటి భిక్ష.

ప్రాణహిత: Elliot కూడా అదే అంటాడు. ‘Poetry should communicate even before it is understood.’ శ్రీశ్రీ లో మీకు అది బాగా కనబడుతుంది.

అశోక్: అవును. శ్రీశ్రీ అనే కాదు శ్రీనాథున్ని చూడంది. శ్రీనాధుడి ఒక పద్యంలో కాశీలో కుండ ఎత్తేసేటప్పుడు కుండ ముక్కలయిపోయినట్టు పదాలు ధ్వనిస్తాయి. అట్లాగే చాలామంది ఎక్కువ పట్టించుకోలేదు కానీ వానమామలై వరదాచార్యులు అని ఒకాయన ఉంటడు. పోతన కావ్యాన్ని రాస్తడు. ఎదురు రాయి తగిలినప్పుడు ఎట్లాగైతే ఎడ్ల బండి ఎగిరి పడుతుందో దాని గురించి ఇట్లా రాస్తాడు, ‘ఠాం……..గ్ మని కదిలి ప్రకట గతిన శకటమొకటి నిలిచె’ Of course! ఆ సబ్జెక్ట్ మనకి పనికిరానిదే కావచ్చు. కాని ఆ రహస్యాన్ని గనక మనమనుకున్నటువంటి సబ్జెక్ట్ తో మనం పెట్టగలిగినప్పుడు ఇంకా ఫోర్స్ గా వస్తుంది పాట. ‘పాట ఒక శతఘ్ని’ అంటాడు మా నాయన. ‘పాట ఒక శతఘ్ని రా! వంద ఉపన్యాసాల కన్నా ఒక పాట మేలు చేస్తది’ అన్నాడు. అట్లా ప్రాచీన సాహిత్యాన్ని కూడా చదివి ఉన్నప్పుడు, ఆ రహస్యాన్ని కూడా తెలిసి ఉన్నపుడు, దానిని మన పాటల్లో పెట్టగలిగితే అద్భుతంగా ఉంటుంది.

ప్రాణహిత: ఈ తరం కవులు కొంతలో కొంత అన్నా ప్రాచీన సాహిత్య అధ్యయనం చేయాలని మీ అభిప్రాయం.

అశోక్: అవును. అయితే అందులో ఉన్నటువంటి స్త్రీ వర్ణనలు, అంగాంగ వర్ణనలు మీరు తీసుకోనవసరం లేదు. నీకు నచ్చనిది నీవు వదిలెయ్, కాని ఆ పుస్తకాలే చదువొద్దు, అసలు దాంట్లో ఏమీ లేదనడం మాత్రం నేను నమ్మను. చాలా మంది ప్రోగ్రెసివ్ రచయితలు నన్ను ఈ విషయంలో వ్యతిరేకిస్తరు కాని నా అభిప్రాయం నాది. నేను మాత్రం ‘చదివి ఉండండి, దాంట్లో కూడా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలున్నాయ్’ అని అంటాను. ఇప్పుడు గద్దరన్న కూడా ఒక పాటలో ‘భుజం మీద తట్ట సుర్ర సుర్ర కాలబట్టె’ అని అంటాడు. ‘సుర్ర సుర్ర కాలబట్టె’ అన్న దగ్గర ఇంకేదన్నా ‘అగ్నిలాగ కాలబట్టె’, నిప్పులాగా కాలబట్టె’ అని ఎందుకు అనలే ఆయన. ‘సుర్ర సుర్ర కాలబట్టె’ అనడం లోపల ఆ ‘ర’ అనే శబ్దం వేసి దానికి వత్తు వేయడంతో మంటకి, ఆ తాలూకు అనుభూతికి – నువ్వు కళ్ళు మూసుకున్నా కాని నీకు సుర్ర సుర్ర కాలుతది. అంటే మనం విన్న శబ్దం కూడా భావాన్ని నీలో కలిగించాలె. పువ్వు వికసించినట్టు రాస్తే మనసులో పువ్వు వికసించాలె.

‘మనసున మల్లెల మాలలూగెనే!
కన్నుల వెన్నెల డోలలూగెనే!’

నువ్వెంత నాస్తికవాదివైనా కానీ, ఎంత ప్రోగ్రెసివ్ ఆలోచన ఉన్నోనివైనా కానీ మనసుల మల్లెలు నీకు వికసిస్తయా లేదా చెప్పు.

ప్రాణహిత: నాస్తికవాదులకి మల్లెలు వికసించవని అన్నరా ఏంది.
(అందరూ నవ్వులు)

అశోక్: మాట చెప్తున్నా! ఇదేందయ్యా గొడవా అని అనేవాళ్లు ఉన్నా పదాల అల్లికలో ఉన్న అద్భుత రహస్యం గురించి అంటున్నా. వచన రచయితల గురించి నాకు ఎక్కువగా తెలియదు కాని ఆ రహస్యం పాటల రచయితకు తెలిసి ఉంటే ఉపయోగపడుతుంది. పాట అనేది ఒక oral form, మౌఖిక ప్రక్రియ. ఇక్కడ పాడుతుంటే, ఐదు వేల మంది కూర్చుంటే, ఆఖరి వానికి కూడా మాటతో పాటు, భావం కూడా వాని గుండెలోకి వెళ్లాలి.

‘రివ్ రివ్ రివ్ రివ్ రివ్ రివ్’ అని ఎందుకు అన్ననంటే గాలి యొక్క శబ్దమది. ‘రివురివ్వున చల్లగ’ అని కూడా అనొచ్చు. అట్లానే ‘చెరరరరర చెరరరరర చెర్రుమని’ అని ఎందుకన్నానంటే పిడుగు శబ్దాన్ని అక్కడ పెట్టాం. అట్లా మీకు కళ్లు మూసుకున్నా పిడుగు శబ్దం వినిపిస్తది. ఎందుకంటే మనం రాసేటివన్నీ ప్రపంచంలో అందరికీ ఎరుకున్న ముచ్చట్లే! ఎరుకున్న ముచ్చటని మనం ఎరుక దగ్గర ఎరుక గలిగి పెడితే వాడికి ఎరుకైతది. నేను ఎన్నుకున్న దారి ఇది. నేను succeed అయ్యాననే అనుకుంటున్నాను ఆ విషయంలో.

ప్రాణహిత: సాధారణంగా పాటలు రాసే కవులు పాట రాసే ముందు ఒక బాణీ అనుకొని పాట రాస్తారు. కొంతమంది, మాత్రా ఛందస్సు తెలిసినవాళ్లు, ఛందస్సులో పాట రాసి దానికి బాణి కడ్తారు. మీరు ఏ పద్ధతిని అనుసరిస్తారు. మీరు మన సంభాషణలో ఈ విషయం తడిమారు. ఇంకా కొంచెం స్పష్టంగా చెప్పండి.

అశోక్: మా నాయన పద్ధతినే నేను వాడేది. ఎట్లా అంటే పాడుకుంటూ రాసుకునే అలవాటు. పాటలు ఎప్పుడు కూడా పాడుకుంటూ రాసినవాళ్లవే అద్భుతంగా జనంలోకి వెళ్తాయి, ఎక్కువ కాలం నిలిచి ఉంటాయి. పాడుకుంటూ రాసినవాళ్ల గొంతు ఘంటసాల లాగా ఉండనక్కరలేదు, గద్దరన్న లాగా ఉండనక్కరలేదు, సుద్దాల హనుమంతు లాగా ఉండనక్కరలేదు. కాని పాడుతూ రాసినప్పుడు పాట ఎక్కడా ఎదురు రాదు, పాట తట్టు తాకదు, సాఫీగా వెళ్లిపోతది. పాటకు, కవిత్వానికి ఉన్న తేడా అదే కదా! మీరు కవిత్వం చదువుతరు, మేము పాడాలె. పాడినప్పుడు తాళం ఎదురెక్కుతది ఒకొక్కసారి. తట్టుకుంటదన్న మాట. కాబట్టి ఆ పాట తూగు కనుగుణంగా మన రచన పోగు ఉండాలె. కాబట్టి పాడుకుంటూ రాసుకుంటే బాగుంటదని మా నాయన మాకు చెప్పిండు. చాలామంది గొప్ప పాటలు రాసినటువంటి రచయితలు కూడా, నారాయణ రెడ్డి కూడా నాకు చెప్పిండు, ‘నేను కూడా పాడుకుంటా రాస్తానయ్యా’ అని. ఇంకోటి ఏంది తెలుసా! చాలా మందికి తెలియనిది ఏంటంటే సబ్జెక్ట్ తోనే ట్యూన్ పుడ్తది. ఇది చాలా మంది వేరే లెక్క అనుకుంటరు. ఇప్పుడు మనం ఏ సబ్జెక్ట్ రాస్తే –

‘కన్నతల్లీ మమ్ముల కన్నప్పటి నుండీ
కడుపునిండా తినలేదు మెతుకు
కంటినిండా కనలేదు కునుకూ

అవ్వ కడుపుల ఉన్న ఆ తొమ్మిది నెల్లు
అస్సలు తెల్వయి మాకు ఆకలి దూపలు
తల్లి పేగుల దాగి
తల్లి నెత్తురు దాగి సల్లంగ ఉంటిమి ఉన్నన్ని రోజులు
పడగానే భూమ్మీద మొదలాయే ఏడుపు’

ఇది రాసినప్పుడు నాకీ సబ్జెక్టే ట్యూన్ ఇచ్చింది. దీన్ని మనం ‘టప టప టప’ పాట పద్ధతిలో చదవగలమా? అసలు సాధ్యమవుతుందా! నేనేమంటనంటే కథావస్తువే బాణీ ఇస్తది. నీవు విపరీతమైన పాటలు వినుంటే. అనేక వేరే పద్ధతులు ఉన్నవాళ్లు పాట రాయాలంటే వాళ్లకి తోచదు కావచ్చు. పాటలు రాసేవాడు పాటలు వింటడు. పాటలు అంటుంటడు. అది సినిమా పాటే కావచ్చు ఇంకే పాటలైనా కావచ్చు. పాటలు బాగా వినంగ వినంగ ఆ భావానికి రాగానికి ఉన్న దోస్తీ కుదిరినప్పుడే పాట నిలబడ్తది. పాట భావానికి రాగానికి తాళానికీ లంకె కుదరనటువంటి ఏ పాటైనా ఇంతవరకు నిలబడలేదన్న సంగతి ఒక నగ్న సత్యం. చాలా మంది ఈ పాట చాలా బ్రహ్మాండంగ ఉంది ఎందుకో నిలబడలేదయ్యా అంటే దాని అర్థం ఏంటంటే దాని భావానికీ ట్యూన్ కీ కుదరలేదన్న మాట. అక్కడ పాట ఫెయిల్ అవుతది. అట్లా నా పాటలు కూడా ఫెయిల్ అయిన పాటలు ఉన్నయి.

ప్రాణహిత: తనకూ ప్రపంచానికీ మధ్య సామరస్యం కుదిరేదాకా కవి చేసే అంతర్బహిర్యుద్ధాలే కవిత్వం అని చలం అన్నారు. మీ ఏ యుద్ధం మీతో ‘నేలమ్మ నేలమ్మ’ పాట రాయించింది? అందులో ఒక అద్భుతమైన ప్రయోగం ఉంది, ‘గంధమే పూసిందహో పొందుగా హొయాంగ్ హో’ అని. అది కొంచెం వివరిస్తారా?

అశోక్: భూమి మీద పాట రాయాలని కూడా నేను మనం ఉన్నా లేకున్నా మన వెనుక మన జెండాల్లాగా మన పాటలు ఉండాలన్న దాని గుర్తుగానే రాసాను. ఒక స్త్రీ మీద, ఒక ఢెబ్బై ఎనభై ఏళ్లు కన్నీళ్లలో గడిచిపోయిన ఒక జీవితం మీద, ఒక రైతు మీద, ఇట్లా ఒకొక్క ప్రతీక మీద, సమాజంలో నలిగిపోతున్న పేదవాళ్లు, ‘అధోజగత్ సహోదరులు’ అంటరు, వాళ్లందరినీ ఒకొక్క ప్రతీకగా తీసుకొని ఒకొక్క పాట వాళ్లకు ఇచ్చేయాలి అని అనుకుంటున్న సందర్భంలో రాసాను. నేను రెండే రెండు ఆలోచనలు చేస్తాను. ఒకటి ఎవరి మీద పాట రాయాలి. రెండు ఏ పుస్తకం కొత్తగా వచ్చింది. నా జీవితం మొత్తం ఈ రెండే ఆలోచనల మీద నడుస్తుంది. అంటే నేను అన్ని పుస్తకాలు చదవకపోవచ్చు. నాకు అందుబాటులో ఉన్నవి.

బిడ్డకి పెళ్లి చేసినపుడు కుడకలో పాలు పోసి ఒక బొమ్మ ఇస్తరు. ఆ బొమ్మ ఇచ్చి ఒకొక్క బొమ్మతోని ఇట్లా అనుకుంట భర్త చేతుల పెట్టి, అత్తమామల చేతుల పెట్టేటప్పుడు తల్లీదండ్రీ విపరీతంగ ఏడుస్తరు. అంతకముందు బ్రహ్మాండమైన సంతోషంగా ఉంటది వాతావరణం. నేను వందల సార్లు ఏడుస్తుంటే చూసిన, నేను కూడా బాధ పడ్డా! అంతెందుకు మా ఆవిడను నాకప్పగించి వాళ్లు ఏడుస్తుంటే నేను ఏడ్చిన. అయితే మా దోస్తులు అన్నరు, ‘మీ ఇంటికే వస్తుంది నువ్వెందుకేడుస్తున్నవురా బాబూ!’ అని. ‘ఎందుకోరా భాయ్ వాళ్లేడుస్తుంటే నాకు ఏడుపొస్తుంది’ అని నేను. అయితే తర్వాత మా ఆవిడ నన్ను వెక్కిరించింది. ‘అవును మా అమ్మ నాన్న ఏడుస్తుంటే నువ్వెందుకు ఏడుస్తున్నవు. నేను నీ దగ్గరికే వస్తుంటిని,’ అని. ‘నువ్వు నా దగ్గరికి వస్తున్నవని ఏడ్వలేదు. మీవాళ్లని వదిలిపెడుతున్నవని వాళ్లు ఏడుస్తుంటే నేను ఏడ్చినా’ అని చెప్పిన. అయితే నేను వరిచేలను చూసినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. - నేను నాగలి దున్నిన, గొర్రు కొట్టిన, వరాలు చెక్కిన, కలుపు తీసిన, మాకు ఉన్న ఎకరం పొలంలో. నాకు పొలం పని మొత్తం వచ్చు. నేను ఫెయిలయి ఖాళీగ ఉన్న రోజుల్లో ఇవన్నీ నాకు బాగా జీవితాన్ని ఇచ్చినయ్. అందుకే మనిషి రెండు సార్లు ఫెయిల్ కావాలనిపించింది నాకు. - వరి కోసినంక మూటలు కట్టి పెడ్తరు కదా, కల్లంలకు కొట్టడానికి తీసుకపోయిన తర్వాత, మీరు వరి మడులను చూసినట్టు అయితే ఎక్కడికక్కడ పగిలిపోతయి, నెర్రెలు వాస్తయి. వాస్తవానికి నెర్రెలెందుకు వాస్తయంటే అప్పటిదాక నీళ్లు కడ్తం, తర్వాత నీళ్లు ఆపేస్తం, నీళ్లు పట్టినపుడు పచ్చి బురద ఉంటది, నీళ్లు ఆపుతున్నా కొద్ది ఎక్కడికక్కడ ఎండిపోయి పగుళ్లు ఏర్పడుతయి. ఇది జరిగే సత్యం. నాకేమనిపించిందంటే ‘ఇప్పటిదాకా నామీద ఉన్న బిడ్డలు వెళ్లిపోతున్నరు కదా, వాటిని కడుపుల దాచుకుంటిని, మొలకలు పెట్టంగ చూస్తిని, అది చేస్తిని, ఇది చేస్తిని, ఇవ్వాళ వరి కోయంగనే ఖతం వెళ్లిపోతనే ఉన్నయి. నిర్దాక్షిణ్యంగా బండికెత్తుకోని తీసుకపోయింరు. ఆడపిల్లను పల్లకి కెత్తుకోని తీసుకపోయినట్టు నా బిడ్డల్ని వీళ్లు తీసుకోని వెళ్లిపోతనే ఉన్నరు. నేను మళ్లీ ఒక్కదాన్నే కదా! మళ్లీ నాకు బిడ్డలు లేని కొరతే గదా! మళ్లెప్పుడు వానలు పడాలె?’ అని బాధ పడుతూ నేలమ్మ గుండె పగిలి ఏడుస్తుందేమో అన్న ఆలోచన వచ్చింది. ఇది నేలమ్మ పాట రాయడానికి కారణం. ఇంకోటేందంటే నేలనగానే కేవలం రైతులకు సంబంధించి రాస్తే, లేదా చెట్లకు సంబంధించి రాస్తే సరిపోదు. ‘పుడమి తల్లి పురిటి నొప్పులు కొత్త సృష్టిని’ అని ఆయన అన్నాడు. పుడమి తల్లి గురించి చాలా పెద్దగా కూడా రాయొచ్చు, చాలా పెద్ద కాన్వాస్ మీద కూడా దీనిని తీసుకోవచ్చు. ఇక పోతే ఈ నేల మన సుద్దాలది మాత్రమే కాదు కదా, భారతదేశానిది మాత్రమే కాదు కదా, మొత్తం ప్రపంచానిది. ఒక ఇంటర్నేషనల్ సాంగ్ లాగా రాయాలని అనుకున్నాను. అట్లాగే గర్భవతులైన ఆడవాళ్లు గుడి చుట్టు ప్రదక్షినలు చేస్తరు కొడుకు పుట్టినా, బిడ్డ పుట్టినా మంచిగుండాలని. నేలమ్మ కడుపుల కూడా సింగరేణి ఉంది. - కరీంనగర్ నేపథ్యం కదా, పద్నాలుగేళ్లు ఉన్న కదా - అటువైపు పోయినప్పుడు ఒకాడామె చెప్పింది, ‘ఏముంది నాయనా! భూమిలకు పోయి పైకచ్చుడంటే బొందలకు పోయి పైకొచ్చినట్టే కాదు బిడ్డా! పొద్దున పోతే మళ్ళి వాడు సరిగ్గ బయిటికి ఒత్తడో రాడో! పోతే పోయినట్టేనాయె! ఎందరో బిడ్డలు అందులకు పోయి అందులనే కూలిపోయి అట్లనే సచ్చిపోయిరి. వాడు లోపలికి పోయి మళ్ల బయిటికి ఒచ్చెదాక నమ్మకమే లేకపాయె.’ అట్లా చెప్తుంటే ఈ బాధ నేలకు కూడా ఉంటది కదా! గర్భవతులైన వాళ్ళు గుడి చుట్టు ప్రదక్షిణాలు చేస్తుంటే ఇది సూర్యుని చుట్టు ప్రదక్షిణాలు చేస్తుంది కదా! సూర్యుని చుట్టు ప్రదక్షిణాలు చేయడం కూడా దీని కోసమే చేస్తుంది కావచ్చు. అంటే దానికి ఒక ఉపమానాన్ని ఆపాదించడం. కవి చేసే పనే అది కదా! ఇట్లా నేను చూసినటువంటి అనేక సంఘటనలు ప్రత్యేకంగా రాసి పెట్టుకోకున్నా లోపల పోగు పడుతుంటాయి. ఇది అనుకున్న తర్వాత నేను ఈ పాట రాసాను.

నేలమ్మ నేలమ్మ నేలమ్మా
నీకు వేల వేల వందనాలమ్మా!
నేలమ్మ నేలమ్మ నేలమ్మా!

సాలేటి వానకే తుళ్లింత
ఇంక సాలు సాలుకు నువ్వు బాలింత

మా అక్కకి బిడ్డ పుట్టినప్పుడు, మూడు రోజులయింది ఆమెకి బిడ్డ పుట్టి, నేను మా అక్క మీద పోయి ఆడుతున్న, అంటే గట్టిగ మీద పడేటట్టు, దెబ్బ తాకేటట్టు, ఉరికురికి ఇట్ల తాకుతున్న చాలా చిన్న వయసులో. తాకుతుంటే మా అమ్మమ్మ అన్నదన్న మాట, ‘అది పచ్చి బాలింతరా, ముట్టుకుంటే అంత పచ్చి పచ్చిగ ఉంటది, నొప్పి నొప్పిగ ఉంటదిరా, దాన్నట్ల ముట్టకురా’ అని. అంటే పచ్చి బాలింతల్ని ముట్టుకుంటే నొప్పి నొప్పిగ ఉంటదనేది తెలుసు. అయితే చెప్పులు లేకుండా నేను వాన కాలంలో తొలకరి వర్షాలు పడంగనే నడుస్తుంటే ఎక్కడ కాలేస్తే అక్కడ, ‘క్‌ష్…’ అని మట్టి లోపలికి పోతుంటదన్నమాట. నేలమ్మ కూడా పచ్చి బాలింత లెక్కనే ఉంది అని అనిపించేది నాకు మనసులో. పచ్చిబాలింత అన్న మాట ఈ నేల మీద చెప్పులు లేకుండ నడిచినప్పుడు - చెప్పులే లేవు. లేకుంటా అంటే ఉండి కాదు - అలా లోపలికి పోయినప్పుడల్లా నాకు ఆ ఫీల్ వచ్చేది నేల పచ్చి బాలింత లాగా ఉంది కదా అన్ని మొలకలు వచ్చి అని. వానకాలంలో అప్పుడే అంత గరక మొలుస్తది. అందుకే -

సాలేటి వానకే తుళ్లింత
ఇంక సాలు సాలుకు నువ్వు బాలింత
నీళ్లనే చనుబాలుగా
గాలినే ఉయ్యాలగా
పక్కల్ల డొక్కల్ల రెక్కల్ల
నీవు సక్కంగ మోసేవు మొక్కల్ల
పరువమొచ్చి చేను వంగే
పైరు కాపు మేను పొంగే
పంట బిడ్డల రైతు బండి కెత్తినంక
పగిలి పోతుందమ్మ నీ కన్న కడుపింక
నేలమ్మ నేలమ్మ నేలమ్మా

తల్లీ! నువు నవ్వితే మాగాణి
యెద తలుపు తీసావంటే సింగరేణి

వీలయినంత మేరకు ప్రాస కలిసొస్తే వేయాలనే ఆలోచన నాకు. కలవకుంటే వదిలేస్త నేను. కలిసొస్తే మాత్రం బాగా పేలుతది. ‘ప్రాస తెలిసి వాడితే ఫిరంగం లాగా ధ్వనిస్తది. తెలియకుండా వాడితే పెంటకుప్పల రాయేసినట్టు ఉంటద’ని శ్రీశ్రీ చెప్పిండు. సినిమాల్లో చూడండి ఒక హోటల్లో టిఫిన్ లిస్ట్ లాగా ఉంటయి ప్రాసలు. పరమ అసహ్యం వేస్తది కొన్ని కొన్ని పాటలు వింటే. కాని తెలిసి వేసిన ప్రాస అద్భుతంగా ఉంటది.

తల్లి నువు నవ్వితే మాగాణి
యెద తలుపు తీసావంటే సింగరేణి
తనువునే తవ్వి తీసినా
మనుసునే తొలిచేసినా
పొట్ట తిప్పలకు బిడ్డలు
నీ పొట్టలో పడుతున్న తిప్పలు
ఏరోజు కారోజు తీరీ
నూరేళ్ల ఆయుష్షు కోరీ
కడుపులో తిరిగేటి కొడుకులకై నువ్వు
తిరుగుతున్నావేమో సూర్యుని గుడి చుట్టు నేలమ్మా
నేలమ్మ నేలమ్మ నేలమ్మా
నీకు వేల వేల వందనాలమ్మా!
నేలమ్మ నేలమ్మ నేలమ్మా!

మనం వ్యక్తం చేసిన ఏ భావమైనా కూడా అపూర్వమైనవి, అంతకు పూర్వం ఎవ్వరూ ఈ విధంగా ఆలోచించనివి నేను ఆలోచించాలన్నది నాకు మొదటి నుంచి ఒక విపరీతమైన కాంక్ష. ఒక విపరీతమిన కుతి అనుకోండి. కొత్తగా చెప్పాలి, ఇంతకముందు ఎవరూ చెప్పి ఉండకూడదు అనేది.

తైలాలు పూసింది నైలు నది
నీకు తలస్నానమయ్యింది గంగానది

గంగ అనగానే ఒక పవిత్రత. గంగ అనగానే ఇది మనది. నైలు నది మనది కాదు కదా. అది నూనె రాసింది, ఇది మాత్రం స్నానం చేపించింది. ప్రక్షాళన చేసింది నేలకు అన్న భావన.

తైలాలు పూసింది నైలు నది
నీకు తలస్నానమయ్యింది గంగానది
గంధమే పూసిందహో
పొందుగా హోయంగ్ హో
ఖండాలలో రంగు రంగు పూలు
గండు కోయిలలు నైటింగేల్లు
కొలువయినదా వెండి కొండ
నీ జాలి గుండెల జెండా

దీనికి ఎంత మదన పడ్డానో, హిమాలయం లేకుండా నేలమ్మ పాట ఎట్లా? దాన్ని నేను హిమాలయం అని ఎలా పొందించాలి? నీ జాలి గుండె లాగా ఉంది తెల్లగా అని రాసాను.

కొలువయినదా వెండి కొండ
నీ జాలి గుండెల జెండా
ఇన్ని ఉన్నా మనిషి కన్నీళ్లు రక్తాలు
కన్నుల గనలేక కంపించిపోతావే నేలమ్మా

ఒక నెగటివ్ లక్షణాన్ని పాజిటివ్ చేసే ప్రయత్నం చేసాను. భూమి మీద పాట రాయాలన్నప్పుడు నాకు ప్రధానమైన సమస్య ఏమొచ్చిందంటే భూమి కంపించి కొన్ని వేలమందిని చంపేస్తది కదా, ఇది ఎలా మనం చెబుతాం. అక్కడ ఈ భూమి మీద జరుగుతున్న దారుణాలు చూడలేక నువ్వు కంపించిపోతే కూలి ఇంత మంది చనిపోతున్నారు తప్ప నీకు చంపాలని లేదమ్మా అని రాసాను.

ఇన్ని ఉన్నా మనిషి కన్నీళ్లు రక్తాలు
కన్నుల గనలేక కంపించిపోతావే నేలమ్మా

మా తల్లి నీ మట్టి బంగారం
అది మానవాళి నుదుట సింధూరం
అమ్మ నీ అనురాగమూ
కమ్మనీ సమభాగము
గొప్పలు తప్పులు చూడక
నువ్వు ఎప్పుడు మమ్మెడబాయక
జన్మించినా రారాజులై
పేరొందినా నిరుపేదలై
నీ ఒంటిపై సుతుల చితులు గాల్చుకున్న
నీ వంటి తల్లింక దేవుళ్లకే లేదు నేలమ్మా

ఎవరు చచ్చిపోయినా భూమిలోనే పూడ్చాలి లేదా భూమి గుండెల మీద కాల్చాలి. ఈ రెండు లక్షణాలు బిడ్డల్ని అలా చేస్కునే లక్షణం కిన్నెర కింపురుష ఖేచరులకు లేదు. మానవులకి మాత్రమే ఉంది. అంటే ఇట్లాంటి ఆలోచనలకు కూడా నాకు కొన్ని పాత కథలు, పురాణలు మేలు చేసాయి. మా ఊర్లె ఒకసారి ఒక సార్థకాల ఆయన పాడవుల కథ చెపుతూ- కృష్ణుడట కుంతికి వాగ్ధానం చేసిండట, ‘నేను నీ కొడుకుల యుద్ధం చేపిస్తి, నీ కొడుకులల్ల ఒక్కడు చచ్చిపోయినా కూడ నా రొమ్ముల మీద నీ కొడుకులను కాల్చుకుంటా’ అని. ‘నా రొమ్ముల మీద కాల్చుకుంట అత్తమ్మ, నువ్వు నీ కొడుకుల గురించి బేఫికరుండు. నేను నీ కొడుకులను కాపాడుకొస్త కదా!’ అని ఆయన కథ చెప్పెటోడు. రొమ్ముల మీద కాల్చుకుంట అని అన్నా నిజంగ కృష్ణుడు కాల్చుకోలేదు, ఎవరూ కాల్చుకోలేదు. కాని ఆ విన్న వినికిడి నాకు నేల మీద పాట రాసినప్పుడు సడెన్ గా గుర్తుకు వచ్చిందన్న మాట. మనం చచ్చిపోతే భూమిలోనే కదా పాతి పెట్టి ఉండేది. అందుకే -

నీ ఒంటిపై సుతుల చితులు గాల్చుకున్న
నీ వంటి తల్లింక దేవుళ్లకే లేదు నేలమ్మా

అందుకనే నేనేమంటానంటే నా పాటల మీద మా అమ్మానాన్నల ప్రభావమే కాదు, నేను చదువుకున్న పుస్తకాల ప్రభావమే కాదు, నేను చూసినటువంటి పల్లెపాటలు పాడుకునేవాళ్ల ప్రభావం, నేను విన్నటువంటి జానపద కళారూపాల ప్రభావం దండిగా, సంస్కృతంలో చెప్పాలంటే కంఠధగ్నంగా, హృదయధగ్నంగా ఉంది. అనేక మంది నాకు సహాయం చేసారు. వాళ్ల రక్తదానం లేకపోతే, వాళ్లు అన్నప్రాసన చేయకపోతే నా పాటలకింత depth వచ్చేది కాదు. ఇంత మట్టి అంటేది కాదు.

ప్రాణహిత: ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో విప్లవ సాహిత్యమని, స్త్రీవాద సాహిత్యమని, దళిత సాహిత్యమని, ముస్లిం సాహిత్యమని రకరకాలు ఉన్నాయి కదా! వీటి పట్ల, ఈ ఉద్యమాల పట్ల మీ అభిప్రాయమేమిటి?

అశోక్: నాకు సదభిప్రాయమే ఉంది. ఎటువంటి దురభిప్రాయం లేదు. నా ఉద్దేశ్యం ఏమిటంటే ఎవరి గురించి వాళ్లు చెప్పుకోవడమనేది జరగాలి. మన గురించి ఇంకొకరు చెప్పరు. అట్లా కొన్ని శతాబ్దాలు ఎదురు చూసాం, మన గురించి ఇంకెవరైనా చెప్తారా అని. అంటే మనం ఎదురు చూడలా, కాలం ఎదురు చూసింది లేదా నేల ఎదురు చూసింది ఫలానా వాళ్ల గురించి ఎవరైనా చెప్తారా అని. పోతే మన గురించి మన పల్లెల గురించి మనంత స్పష్టంగా ఇంకొకరు చెప్పలేరు. మా నాయన అనేవాడు, ‘అరేయ్! పాటలు రెండు రకాలుంటయిరా!’ అని. ఒకటట గట్టు మీద కూసోని పాడే పాటట. మా నాన్న పేర్లు చెప్పేవాడు కాదు గాని ఆనాటి కొంతమంది కవుల మీద తనకున్న అభిప్రాయాన్ని అట్లా చెప్పాడన్నమాట. గట్టు మీద ఉండి పాడేవాడట, ‘నడుం గట్టి కదలరా! నీకు ఎదురు లేదురా!’ అంటడట. అంటే వీనికి ఏమీ ఉండదట. మీరు చావండిరా అంటుంటడట. నాకు తెలిసి దీంట్లో ఉద్రేకం ఉంటది, అన్ని ఉంటయి కాని దీంట్లో నిజమైన పస ఉండదు నాయనా అనేవాడు. ఎవడైతే, ‘వేటుకి ఇద్దరు, పోటుకి ముగ్గురు, భీకర రణముల, దూకరా రణముల’ అని రంగంలో ఉండి రాసినోడికి, పైన ఉంది రాసినోడికి తేడా ఉంటదని చెప్పెటోడు. పైన ఉంది రాసినోడు తప్పని కాదు, పైన ఉంది రాసినోడి కవిత్వం గొప్ప కవిత్వం కాదని కాదు. కాని దానికి దీనికి ఉండే తేడా మాత్రం చాలా అంతరం ఉంటది నాయనా అని మా నాయన చెప్పెటోడు. అది నేను బాగా గుర్తుంచుకున్న వాణ్ని కాబట్టి మన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందని నమ్ముతాను. దళితుడు తన గురించి తాను చెప్పుకుంటడు. గోరటి వెంకన్న తన పాటలో, ‘తంగెడు చెక్క భంగపడ్డది’ అని అంటడు. తంగెడు చెక్క భంగపడ్డది’ అన్న మాట ఎవరు చెప్పాలె. ఆయనకు తెలుసు, అందుకే చెప్పగలిగాడు. ‘ఆరె రంపె పదునారిపోయినది’ అని రాసిండు. ఆరె రంపె పదునారిపోయిన సంగతి మనకెట్ల తెలుస్తది. నేను వంద సంవత్సరాలు ప్రయత్నం చేసినా అది నేను రాయగలనా? నేను పాటలు బాగ రాస్త కావచ్చు, నా పాటలు కొన్ని గొప్ప పాటలు ఉన్నయి కావచ్చు కాని నేను అది రాయగలనా? కాబట్టి ఎవరి హృదయాన్ని వాళ్లు ఆవిష్కరించుకోవటంలో, ఎవరి రుధిరాన్ని వాళ్లు, ఎవరి రక్తాన్ని వాళ్లు చూపించడంలో తప్పు లేదు. అది దళిత కవిత్వం కావచ్చు, అది మైనారిటీ కవిత్వం కావచ్చు. Yes! They must write. లేబర్ రూమ్ గురించి కొండేపూడి నిర్మల రాస్తది, ‘రంపపుకోతకు పడుతున్న ధూళి పడుతున్నటు వంటి బాధ పురిటి నొప్పులు’ అని. అది తెలుసు కాబట్టి ‘పురిటి నొప్పుల బాధ తెల్వని పురుష జాతికి తల్లివైతివి’ అని నేను రాసాను. కాబట్టి ఎవరి ఫీల్ వాళ్లు చెప్పాలి. అట్లాగే ఋతువు గురించి వాళ్లు రాయడం, ఋతువు గురించి మనం రాయగలమా? ఏ మగాడన్నా రాయగలడా? ఋతువు గురించి, పురిటి నొప్పుల గురించి స్త్రీ మాత్రమే చెప్పగలదు. శరత్ చంద్ర ఒక మాట అంటడు, ‘తన దుఃఖానుభవాన్ని ఇంతవరకూ సుస్పష్టంగా ప్రకటించగల భాష ఆవిష్కృతం కాలేదు.’ అని. మన దుఃఖానుభవాన్ని మనం చెప్పుకోడానికి వినియోగించబడే భాషే ఇంతవరకూ లేదని అంటున్నప్పుడూ ఎవరి బాధ వాళ్లు చెప్పే మేరలో యాభై శాతం చెప్పినా, ఢెబ్బై శాతం చెప్పినా చెప్పినట్టే కదా! అది జరగాల్సిన అవసరం ఉంది. చరిత్ర పరిణామంలో జరిగిందది.

1వ భాగం | 2వ భాగం | 3వ భాగం | 4వ భాగం | ఇంటర్వ్యూ విడియో


ఇంటర్‌వ్యూలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో