Oct2007
పాటే నా ప్రాణం – సుద్దాల అశోక్ తేజతో ఇంటర్‌వ్యూ – 4
ప్రాణహిత: పాట చాలా శక్తివంతమైన మాధ్యమం దీన్ని మనం వాడుకోవాలి అన్నారు. అట్లా వాడుకునే పద్ధతిలో, ప్రజలకు ఉపయోగపడే విధంగా, లేదా మీరు చెప్పే భావాలకు ఉపయోగపడే విధంగా సినిమా రంగాన్ని వాడుకునే ప్రయత్నాన్ని మీరేమైనా చేస్తున్నారా?
అశోక్: నేను చేస్తున్నాను. నేను, అది ‘ఓసే రాములమ్మ’ సినిమా నుంచి ప్రారంభించాను. నేను నాకు సంబంధించిన, నాకు తెలిసిన జానపదకళా రూపాల్ని ప్రవేశపెట్టడంలో కానివ్వండి, యక్షగానాన్ని ప్రవేశపెట్టడంలో కానివ్వండి లేదా నేను నమ్ముకున్నటువంటి అభ్యుదయ భావాల తీవ్రతని అందులో తీసుకురావడంలో కానివ్వండి అనేక అంశాలలో నేను కృషి పెట్టడం జరిగింది. సందు దొరకితే పోయి దాంట్లో కూర్చుని ప్రయత్నం చేయడం జరుగుతా వుంది. అయితే, ఒక సినిమా పాట రచయితకి పూర్తి సాధికారత అక్కడ ఉండదు. చాలా పరిమితి ఉంటుంది. చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది, దాంట్లోనే నేను ట్రై చేసాను. మీకు చెప్పాను ‘సఫ్దర్ హష్మి’ అనే మాట, అట్లాంటి మాటలు ఇరికించడానికి నేను ట్రై చేసాను. అట్లాగే నాకు తెలిసినటువంటి, నేను పుట్టి పెరిగినటువంటి మట్టిలో మాట్లాడుకున్నటువంటి శబ్దాల్ని, ‘జమిలిగా బూసిన జాజి మల్లెవే’ అని రాసాను. అలాగే ‘నిట్టాడి గుడిసెలో ఇత్తాడి సెమ్మెలే’ అని రాసాను. ఇట్లా నేను నాదైనవటువంటి ప్రతీకలు పెట్టుకుని రాసాను. మొన్న ‘రామదాసు’ సినిమాలో పాట రాస్తూ కూడా నేను, ‘సెట్టుకు పందిరేయాలనే పిచ్చి పిచ్చి ఆశ నాది’ అన్నాను. చెట్టే ఒక పందిరి లాంటిది, అలాంటిది దానికి పందిరేయడం ఏమిటి? నేను నీకు గుడి కట్టించడం ఏమయ్యా? నువ్వే పెద్ద దేవుడివి నేనేం గుడి కట్టిస్తా అనే ఒక గిరిజన హృదయంలోకి వెళ్లి చెట్టుకు పందిరి వేయాలనే పిచ్చి పిచ్చి ఆశలన్నాను. ఇట్లా నేను ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఆ పరిస్థితుల నేపథ్యం ఉన్నటువంటి పదాలు వేయడంలో నేను బాగా ప్రయత్నం చేస్తున్నాను. నాకు తెలిసి నేను చాలా మందికన్నా ఎక్కవ చేసాను.
ప్రాణహిత: దీనికే అనుబంధ ప్రశ్నలాగా, ఇదివరకే సినిమా రంగంలో లబ్దప్రతిష్టులైన కవులు వున్నారు. వాళ్లకి మీకు మౌలికమైన తేడా ఉందని మీరు అనుకుంటున్నారా? అది మీరు వివరిస్తారా?
అశోక్: ఉంది. నేను దీన్ని సౌమ్యంగా చెప్పాలి. పుస్తకాలు చదివినటువంటి కవిత్వం నుంచి
వాళ్లు పాటలు రాస్తున్నారు. జీవితాలు చదివినటువంటి దాన్నుంచి నేను పాటలు రాస్తాను. ప్రధానమైనటువంటి, మౌలికమైన తేడా అది. నా పాటల్లో, ఏ సంబంధం లేని యుగళగీతం కూడా మీరు వినండి ఎక్కడో నా పల్లె టక్కున అక్కడ వొచ్చేస్తుంది. ‘రామసక్కనోడమ్మ…’ అంటాన్నేను. చందమామని వాళ్లు ఇంకోరకంగా అంటారు. ‘రామసక్కనోడమ్మ సందమామ, రాక రాక ఎందుకొచ్చె అయ్యో రామ’ అన్నాను. రామసక్కనోడు అనే మాట నాకు తెలిసిన మాట. ఇట్లా నేను నాకు తెలిసినటువంటి పల్లె పదాల్ని, పల్లెల్లో ఉన్నటువంటి కవి సమయాలంటారు చూశారా అట్లాంటివి వాడాను. ఇపుడు, ‘జడతోని దిష్టిదీస్తా’ అని ఓ చోట రాసాను. జడతోటి దిష్టితీస్తాను అన్న మాట ఎంత అద్భుతమైన మాటన్నా ఇది అని రాఘవేంద్రరావు తెగ ముచ్చటపడిపోయాడన్నమాట. నేను నీకు జడతోని దిష్టి తీసుకుంటా అని ఆ హీరోయిన్ తోటి అనిపించిన దగ్గర అన్నాను. అంటే నేను ప్రతీకలు మార్చుకునే ప్రయత్నం చేస్తాను. ఒక శృంగార గీతంలో కూడా తన ఆప్యాయతని తెలియజేసేటపుడు నా పెదాలతో నేను నీకు దిష్టి తీస్తా అని కూడా అనొచ్చక్కడ. దానికి నన్నెవరూ గ్రామర్ మిస్టేక్ అని పట్టుకోరు. కాని నేను నా జడతోని దిష్టితీస్తానన్నాను. ఇట్లాంటి ప్రతీకలు వేసుకోవడంలో, నా పల్లెటూర్లో నేను విన్నటువంటి విషయాలు వాడుతాను. మీకు జడతోని దిష్టి అంటే తెలుసుకదా… మొత్తం వెంట్రుకలు ముందుకేసుకుని దులుపుతూ థూ… థూ… అంటూ ఇరుగుదిష్టి పొరుగుదిష్టి తీస్తారు. అది నాకు బాగా గుర్తుంది. అది నేను నా పాటలో వాడాను. మిగతా రచయితలకి నాకు ఉన్న తేడా ఇది.
ప్రాణహిత: అయితే, సమాజంలో ఉన్న దోపిడీ శక్తులను ఎదుర్కొనే క్రమంలోగానీ, పేదరికాన్ని, దారిద్ర్యాన్ని ఎదుర్కొనే క్రమంలోగానీ, సమాజాన్ని మార్చే క్రమంలోగానీ పాట ఎలా ఉపయోగపడొచ్చు. ఆ దిశగా మీ సొంత అనుభవం నుంచి ఏమైనా చెపుతారా?
అశోక్: పాట కొన్ని వందల మందిని తెలంగాణా పోరాటానికి సమాయత్తం చేసిందని మా నాన్నగారు చెప్పారు. కేవలం పాటలు వినే వొచ్చి యుధ్దంలో పాల్గొని చచ్చిపోయిన వాళ్లు ఉన్నారు. అంతెందుకు, యాదగిరి మా నాన్న సాంస్కృతిక దళంలో ఒక సభ్యుడు. మా నాన్న పాటలు విని విని ‘బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లె వొస్తవు కొడుకో’ అని తనే పాట రాశాడు. మా నాన్న ఎంత మంచోడంటే, యాదగిరి పాట రాస్తే, దానికి ఒక అధ్బతమైన గుర్తింపు ఇచ్చి, ఇది యాదగిరి రాసిన పాట అని చెప్పేవాడు. అలాగే మా నాన్న దగ్గర వంతపాడే మబ్బు ఎల్లయ్య కూడా పాట రాశాడు. పాట పాడేటప్పడు, ఇది మబ్బు ఎల్లయ్య రాసిన పాట నేను రాసిన పాట కాదు అని మా నాన్న చెప్పేవాడు… గుర్తింపు తెచ్చేవాడు. ఇట్లా పాట యుద్ధానికి పురిగొల్పింది. తరువాత మనం చూసుకుంటే సిక్స్టీస్‌లో నక్సల్బరీ, శ్రీకాకుళం పోరాటాలు. జగిత్యాల, ఉత్తర తెలంగాణా పారాటాల్లో నాకు తెలిసి గద్దరన్న పాటలు విని ప్రభావితమై మేం ఉద్యమంలోకి వెళ్లినామని చెప్పిన వాళ్లు చాలా మంది ఉన్నారు. అంటే పాట తప్పుకుండా ప్రభావితం చేస్తుందనేది రెండు ఉద్యమ నేపథ్యాలనుంచి నేను తెలుసుకున్నాను. ఒకటి నాన్న చెప్పిండు, ఒకటి వాళ్లే చెప్పారు. ఇక సినిమాల గురించి చూసుకుంటే, బ్రహ్మాండమైన పాటలుంటే సినిమాలు బాగా ఆడినటువంటి కమర్షియల్ రుజువులు కూడా కొన్ని ఉన్నాయి. ‘ఒసే రాములమ్మే’ రుజువు. ‘ఓహో పాటలమ్మ’ అది. నారాయణమూర్తి ఎర్రసైన్యం సినిమాలోని ‘ఏమున్నదక్కో…. ఏమున్నదక్కా, ముల్లె సదురుకున్న, ఎల్లిపోతావున్న’ పాటలోని ఆ నాలుగు లైన్లకి మొత్తం ఉత్తర తెలంగాణ అంతా సినిమా థియేటర్లో ఉంది. ‘రామసక్కని తల్లి రాములమ్మో… రాములమ్మో…. నువ్వు రాయోలె కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా’ అని నేను రాసినటువంటి తల్లీబిడ్డల పురిటినొప్పుల పాటకు ట్రాక్టర్‌లు కట్టుకుని, సద్దులు కట్టుకుని పోయింరు. ‘అన్ల పాట ఉంది బిడ్డా! పురిటి నెప్పుల గురించి రాసిండ్రు దాన్ల, అది వింటే పేగులు దెగిపోయినయి, అందుకే సద్దిగట్టుకుని పోతున్నామయ్యా’ అని చెపుతుంది ఒకామె నాకు.
ప్రాణహిత: అది చాలా హృదయాన్ని కదిలించే పాట. ప్రపంచీకరణ మన తెలుగు సమాజం మీద, భారతీయ సమాజం మీద చాలా ప్రభావం కలుగజేస్తోంది.
అశోక్: పాట మీద కూడా…
ప్రాణహిత: ఆ! పాట మీద కూడా! అయితే ఈ ప్రపంచీకరణ మనకు ఉపయోగపడుతుందా? లేక కొల్లగొడుతోందా? పాటతో దానిని ఎదుర్కోవచ్చా? మీరు ఆ దిశగా ఏమైనా పాటలు రాశారా?
అశోక్: ఇప్పుడు ‘ప్రపంచీకరణను ఎదురుకొంటను… నేను ఎదురుకొంటను’ అనే పల్లవి తోటి పాట రాయాల్సిన పని లేదు. ప్రపంచీకరణ వచ్చి పాటలోని పద ప్రతీకలను మారుస్తున్న క్రమంలో వాటిని మన కనుచూపు మేరలో ఆ ఎల్లలకి అవతల్నే ఉంచేసి, మనకు పరిచయమైనటువంటి పదాల్ని పాటలో వాడుతున్నంత వరకు ప్రపంచీకరణను మనం దూరం పెట్టినట్టుగా నేను భావిస్తాను. ఇక మనం ప్రత్యేకంగా దాని గురించి ఉద్యమించి దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం లేదు. మన ప్రతీకలను మనం పోగొట్టుకోకుండా ఉంటే, మన మట్టిని, రక్తాన్ని, సీముని, మన పౌరుషాన్ని మనం పోగొట్టుకోకుంటే మనం దాన్ని కాపాడుతున్నట్టే అవుతది అని నేను అనుకునే విషయం. ఇక ప్రత్యేకించి ప్రపంచీకరణ మీదయితే నేను పాట రాయలేదు. కాని నేనేదయినా సామాజికమైన పాట రాస్తే మాత్రం నేను తప్పకుండా మన మూలాల్ని మాత్రమే వాడుకుంటున్నాను. పాట మీద విపరీతమైన ప్రపంచీకరణ ప్రభావం ఉన్నదన్న మాట వాస్తవం. అయితే అది ప్రజా కవుల మీద ఇంకా పడలేదని నా నమ్మకం. ఎందుకంటే, ఇప్పుడు రాస్తున్న గోరటి వెంకన్న గానివ్వండి, ఇంకా వేరే ఎవ్వరు రాస్తున్నా వాళ్లెవరూ కూడా ఆ పాటని ప్రపంచీకరణ ప్రభావంలో పడి, తమ యొక్క సహజత్వాన్ని కోల్పోనటువంటి స్టాండ్ లోనే వాళ్లున్నారు, ఉంటారు. అది కాపాడబడుతుంది. ప్రపంచీకరణ వల్ల పాట ట్యూన్ చెడిపోతోంది. అంటే పాట యొక్క వేగం మారిపోయి, శబ్ద కాలుష్యం ఎక్కువైపోయి, పాట తన సహజత్వాన్ని, స్వభావాన్ని కోల్పోతున్నటువంటి ప్రమాదం దండిగా కనపడుతోంది. ప్రధానంగా కమర్షియల్ సంబంధించిన వాటి మీదనే ఎక్కువ దాని ప్రభావం చూపిస్తుందనేది నా అవగాహన. ముఖ్యంగా సినిమాలలో బాగా చెడగొట్టేసిన మాట వాస్తవమే.
ప్రాణహిత: మీరు తెలంగాణా బిడ్డ! తెలంగాణా భాష, సంస్కృతి ఈ నేపథ్యంలోంచి, సుద్దాల హనుమంతుగారి పోరాట నేపథ్యంలోంచి వొచ్చారు. ఇవాళ ప్రత్యేక తెలంగాణా కోసం పెద్ద ఎత్తున పోరాటం జరుగుతోంది. ప్రజలు రోడ్ల మీదకి వస్తూ వున్నారు, 610 జివో కానివ్వండి, ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష కానివ్వండి. వీటి పట్ల మీ అభిప్రాయం ఏమిటి? మీరు తెలంగాణా ఉద్యమం కోసం ఏమైనా పాటలు రాశారా?
అశోక్: తెలంగాణా రాష్ట్రం కావాలి అనే ఉద్దేశంలో నాకు ఎలాంటి వేరే అభిప్రాయం లేదు. తెలంగాణా కావాల్సిందే. ఇవాళ అమెరికా అయితే ఏ విధంగా ఉందో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, అలాగ భారత సంయుక్త రాష్ట్రాలు కావాలనేది నా ఉద్దేశం. ఎప్పటికైనా నేను చనిపోయేటప్పటికి వింటానా అనుకుంటా నేను. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అనేది కావాలి, ఒక ముప్ఫయి నలభై రాష్ట్రాలు కావాలి. చిన్న చిన్న రాష్ట్రాలు కావాలనేది నా బలమైన అభిప్రాయం. తరువాత తెలంగాణాపై నేను రాసిన పాటల గురించంటే, తెలంగాణా ఉద్యమానికి నేను పాటలు రాసాను. కాకపోతే ఆ పాటలు నేను రాసానని తెలుసో తెలియదో తెలియదు కానీ నేను రాసాను. కెసిర్‌గారు చాలా కాలంగా నాకు స్నేహితులు. అంటే ఆయన ఉద్యమం స్టార్ట్ చెయ్యక ముందు కూడా నాకు స్నేహితులు. మా ఇంటికి ఆయన చాలా సార్లు వొచ్చారు. నేను కూడా వాళ్లింటికి చాలా సార్లు వెళ్లాను. అనేక సార్లు భోంచేస్తూ, నా పాటలు వింటూ సంతోషపడేవాళ్లు. కాబట్టి ఆయన తెలంగాణా పార్టీ, అలాగే ఉద్యమం చేస్తున్నప్పుడు నాతో మాట్లాడటం జరిగింది. అప్పటి మాటల్లో నేను కూడా పాల్గొన్నాను. పాల్గొన్నప్పుడు, నేను చెయ్యగలిగింది పాటే కదా! అపుడు నేను అనేకమైన పాటలు రాసిపెట్టాను. మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఇప్పటి వరకు కొన్ని వందల క్యాసెట్లు వొచ్చి వుంటాయి తెలంగాణా కాన్సెప్ట్ మీద. అయితే తెలంగాణా పార్టీ పెట్టినపుడు వొచ్చినటువంటి వొకటి, రెండు, మూడు క్యాసెట్లలో ఉన్నంత బలమైన పాటలు మళ్లీ ఇంతవరకు రాలేదు. ఇది ప్రతి వాళ్లకి కూడా తెలిసినటువంటి విషయం. నగ్న సత్యం! ఆ మొదటి మూడు క్యాసెట్లు రాసింది నేనే. ‘తెలంగాణ, కోటి రతనాల వీణ’ అనే పాట దాశరధి గారి లైన్ తీసుకుని రాసాను.
‘తెలంగాణ ప్రాంతంలున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు
తెలంగాణ ప్రాంతంలున్న కాంగిరేసు ఎమ్మెల్యేలు
సవాలేస్తే జవాబిస్తరా, నా ఎమ్మెల్యేలు
మొఖం చాటు చేసుకుంటరా, నా ఎమ్మెల్యేలు…’
ఇట్లా చాలా తేటతెల్లంగా ఉన్న పాటలు రాసాను. ఇక పోతే, తెలంగాణాలో నాయకులు ఒక సారి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటరు, ఒక సారి సరైన నిర్ణయాలు తీసుకుంటరు. ఒక్కో సారి ఇదేంటి ఇట్ట జేస్తున్నరు… అనిపించొచ్చు కానీ, మూడు కోట్ల తెలంగాణా ప్రజలలో పార్టీలకతీతంగా తెలంగాణా కావాలని అందరికీ కింది స్థాయి వరకు ఉంది. అసలు పెద్ద స్థాయి వాళ్లకి కూడా లోపల ఉంది, బయటికి అట్ల అంటే చంద్రబాబు నాయుడు ఏమంటడో, రాజశేఖర్ రెడ్డి ఏమంటడో, ఇంకెవరు ఏమంటరో, సుధాకర్‌రెడ్డి ఏమంటడో, రాఘవులు ఏమంటడో అన్నట్టుంటరు గానీ, తెలంగాణ ప్రజలలో తెలంగాణ కావాలనేటటువంటి మాట దండిగా ఉన్నది. తెలంగాణ నేపథ్యం, నల్గొండ నేపథ్యం పూర్తిగా అవగాహన ఉన్నవాడ్ని కాబట్టి నేను ఆ విధంగా చెపుతున్నాను. పోతే కెసిఆర్ ఉప ఎన్నికలప్పుడు కూడా మనకి ఆ విషయం అర్థం అయింది.
ప్రాణహిత: ప్రస్తుతం సినిమా రంగం అనేది ఎవరి చేతిలో వుందో అందరికీ స్పష్టంగా తెలుసు. తెలంగాణాకి సంబంధించిన వారిగా, సాధక బాధకాలు ఎదుర్కోవడంకానీ, వివక్షకు గురవడంకానీ జరిగిందా?
అశోక్: వివక్ష ఎదుర్కోవడం అంటూ పెద్దగా జరగలేదు. మామూలుగా నేను సినిమా ఫీల్డ్‌కి వొచ్చినపుడు పదమూడేళ్ల క్రితం నేను రకరకాల అవమానాలకు సాధకబాధకాలకు చాలా కన్నీళ్లకు నేను గురయ్యాను. ఒక సమయంలో నేను మదరాసులో పెద్ద అవమానం ఫీలయ్యి, నేనసలు ఇంటికొచ్చేసి బాగా ఏడ్చాను. హాయిగా టీచర్ గా ఉండి ఇదేమిటి అని ఏడ్చాను. నేనసలు వెళ్లనంటే, మా మిసెస్ వెళ్ళకుంటే పర్వాలేదులే, మనకి ఉద్యోగం లేదా అని చెప్పి మళ్లా మూడు రోజుల తరువాత ఒక మాట అంది. ‘నీ పాట వాడు విన్నంక అవమానం చేసిండా, లేక వినక ముందే అవమానం చేసిండా’ అని. అసలు పాటే రాయించుకోలేదంటే, పాట వినుడు ఎక్కడిది అని నేను చెప్పిన. పాట వినని వాడు నిన్ను అవమానం చేస్తే, తక్కువ అంచనా వేస్తే వాన్ని నువ్వు లెక్కపెడతవా? అది న్యాయమేనా నీకు? పాట బయటికి వొచ్చిన తరువాత బాలేదంటే బాధపడాలి కానీ, పాటే రాయించుకోనివాడు మాటంటే తక్కువగా ఎట్లా ఫీలవుతావు. రేపెన్ని అవార్డులు వొచ్చేదుందో నీవట్లా ఎందుకు ఫీల్ అవుతావు అంది. నీవి గొప్ప గొప్ప పాటలు ఒస్తయి కావచ్చు అంది. అందుకే నేను ఈ ‘నేలమ్మ నేలమ్మ’ పుస్తకాన్ని మా ఆవిడకు అంకితం చేస్తూ, ‘నేనొకసారి అవమానానికి గురయినపుడు, మరోసారి ఆశాభంగం చెందినపుడు, అస్త్రసన్యాసం చెయ్యాలనుకొని నేను నైరాశ్యంలోకి జారిపోతున్నప్పుడు, నీ పాట గురించి తెలియని వాళ్లు నిన్ను తక్కువగా అంచనా వేస్తే, వాళ్లను నువ్వు లెక్కించాల్సిన అవసరం లేదు అని నాకు గీతోపదేశం చేసిన, నాచే పాటల్ని సంధింప జేస్తున్న, నా బతుకు పూలముళ్ల బాటలో జతగా నడిచే స్నేహితురాలు, ఇల్లాలు, నా మేని సగభాగం నిర్మలకు అర్పితం, అంకితం, అర్చితం ఈ గేయ రూప కవిత్వం’ అని రాసాను. అయితే టాలెంట్‌తో మనం అన్ని అవమానాల్ని అధిగమించేటటువంటి అవకాశం ఉంది.
చదువరి Oct 3, 2007 1
ఇంటర్వ్యూ బ్రహ్మాండంగా ఉంది. అశోక్ తేజ బాల్యం నుండి సినిమా కవి అయ్యేదాకా ఆయన జీవితాన్నంతా వివరంగా చెప్పించారు. కొన్ని కొన్ని చోట్ల కళ్ళు చెమర్చాయి.
“వంద సంవత్సరాలు ప్రయత్నం చేసినా అది నేను రాయగలనా? “-ఒక గొప్ప పాట గురించి, కవి గురించి మరో కవి నిజాయితీగా చెప్పిన మాటలు నాకెంతో నచ్చాయి.
నేను చదివిన గొప్ప ఇంటర్వ్యూల్లో ఒకటి. ఇంటర్వ్యూ చేసినవారిని మనసారా అభినందిస్తున్నాను.
అలానే ప్రాణహితకు నా నెనర్లు.
కొత్తపాళీ Oct 3, 2007 2
ఈయన్ని ఇంటర్వ్యూ చెయ్యాలనే అవిడియా వచ్చినందుకూ, చక్కంటి ప్రశ్నలడిగి ఆయన ఆలోచనల flood gates ని తెరిచినందుకూ, అంతా చక్కగా కూర్చి ప్రచురించినందుకూ మీ గుంపుకి ప్రత్యేక అభినందనలు. అశోక్ తేజ గారు తన అనుభవాలు దృక్పథాల గురించే కాక కవిత్వ పద్ధతుల గురించి, పాట ప్రాణం గురించీ గొప్ప విషయాలు చెప్పారు. ప్రాచీన సమకాలీన కవుల్ని తల్చుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన వినయాన్నీ నిజాయితీనీ సూచిస్తాయి. ఈ ఇంటర్వ్యూ ఒక వండర్ఫుల్ ఎఛీవ్మెంట్!
achalla srinivasarao Apr 15, 2008 3
ఇంటర్వ్యూ మాటలనుండి కాక మనసు నుండి వచ్చింది. చాలా వాస్తవం గా ఉంది. ‘బువ్వెట్టే అమ్మ కయిన భూమే బువ్వెడతాది’ అని ఎప్పుడో వ్రాసుకున్న పాటలో కొన్ని పదాలు గుర్తుకొచ్చాయి.
Sasi Apr 22, 2009 4
నిజంగా చాల బాగుంది.సుద్దాల్ గారి సినీమా పాటలలొ కూడా తనదైన శైలిని చొప్పిస్తారు.
ముఖ్యంగా ఆడ కూతురా నీకు అడుగడుగున వందనం,టపటప వంటి పాటలు.
ముఖ్యముగా రచయితకు అధ్యయనము ఎంత అవసరం అనెది తన మాటలతొ తెలియచెశారు.ధన్యవాదాలు