Oct2007
బతుకొక ఎర్రదీపం
ఆత్మవంచన మోనాపలీలో
“మహాఆత్మ” కలిగినట్లు కనిపిస్తూ
ఆడాళ్ళతో నగ్న శరీరిలా కనిపించే వాడొకడు
తనది బ్రహ్మచర్యమని నిలువునా బొంకుతాడు
ముక్కూమొహం తెలీనోడుకూడా
ఉప్పూ పప్పులు కొనుక్కున్నంత ఈజీగా
గ్రోసరీ షాపుకెళ్ళి సబ్బుకొనుక్కుని
వీపు రుద్దుకుని స్నానం చేసినంత మామూలుగా
వేదభూమిలో
ముద్దుబిడ్డలే కస్టమర్లై
దేశీయ ‘కామాటిపుర’ పరుపులమీద
ముక్కుపచ్చలారని నోళ్ళతో
నిస్సిగ్గుగా పొర్లుతుంటారు …
మానం
రాజపుత్ర వనితల వేషం గట్టి
పరువు కోసం అగ్ని ప్రవేశం చేసిన గడ్డమీద
నిఖా చదువురాని షేకు మొహం పెట్టుకుని
ఈ పేద దేశపు ఆడకూతుళ్ళను కూడగట్టుకుని
దేశపు సరిహద్దులు దర్జాగా దాటిపోతుంది.
దట్టమైన బందిపూర్ అడవుల్లోక
పులులను చూసే యాత్రకెళ్ళిన సింధీలు
ఉబుసుపోక ‘అంత్యాక్షరి’ పాడినట్లు
టీనేజి బాలికల గులాబి రేకులతో
ప్రతీ అమెరికన్ డాలరూ
అరోమా థెరపీ చేయించుకుంటున్నా
వేలాది బాలలు వీధుల్లో అడుక్కుతింటున్నా
కన్న కూతుర్ని అత్తారింటికి పంపినంత ఆనందంగా
ఎవడెవడికో పనికొచ్చే ఉపగ్రహాల్ని
రోదసీ ఏట్లోకి సాగనంపుతూ
కాలక్షేప బఠానీ సర్కారును నమిలేస్తోంది…
ఇండియా షైనింగుల
సెక్సు సూపర్ మార్కెట్లో
డైమండ్ల వ్యాపారపు బిల్ బోర్డులకూ
చంకలేని జాకెట్ల అమ్మాయిల
అందచందాలే కావల్సొచ్చినప్పుడు
పెళ్ళవకుండా తల్లయ్యే పసిమొగ్గలకూ
కన్నెపిల్లలతో అంకుళ్ళ శృంగారానికీ
ఉద్యోగినులతో ఆఫీసు కొలీగ్ ల చక్కిలిగింతలకూ
పురుషసూక్తం ఆమోదం పలుకుతుంది…
భావోద్వేగాల పరాకాష్ఠల కొండచిలువల మదరిండియాలో
ఏకపత్నీవ్రతులు పేర్చిన
ఈ చీకటి వధ్య శిలల మీదకు రాకముందు
అమ్మళ్ళూ!
మీరు కొందరి ముద్దుల కూతుళ్ళే గదూ..!
వేసుకున్న బట్టలు
దేహాన్ని మనిషిగా మారుస్తాయనుకునే
ఫాంటసీల ప్రపంచపు నీతివాక్యాల సంచయంలో
సువ్యస్థితమైన మీ సజీవదేహాలు
వర్తకపు సరుకులెప్పుడయ్యాయ్!
నేయిల్ పాలిష్ ల ఐ లిక్విడ్ లైనర్ల భూగ్రహం
లెక్కబెట్తలేని సీసాల మయమెప్పుడయిందీ!
పలాయనం చిత్తగించిన బానిసత్వం
ఆడాళ్ళకు మాత్రమే నిర్వచనమెట్లయ్యిందీ!
మేమలా పిల్చుకోము గానీ
మేముండేదీ రెడ్ లైట్ ఏరియానే
ఆకలికి శరీరాన్ని మీరమ్ముకుంటోంటే
సుఖాలకు ఆత్మను మేమమ్ముకుంటూ
బతుకు కార్లమీద ఎర్రలైట్లు వేసుకుంటున్నాం
చీకటి అస్థిపంజరాల్ని మీరు దాచుకుంటుంటే
సున్నం కొట్టిన సమాధుల్లో మేము దాక్కుంటాం…
కవిత్వాల వ్యభిచారాల సారూప్యాల కైఫియతులో
ఇప్పుడు మా కవిత్వమూ వ్యభిచారమైపోయింది.
మహానుభావుడెవరో అన్నట్లు
సమాజహితం కోసం మొదట్లో రాస్తాం…
పేరు ప్రతిష్టల కోసమే తర్వాత రాస్తుంటాం…
కీర్తి కిరీటాల కోసం
రాసి రాసి రంపాన పెడుతుంటాం…
Doddigarla Vijayabharathi Oct 2, 2007 1
విల్సన్ సుధాకర్ గారి కవిత హ్రుదయాల్ని కదిలించింది. రెడ్ లైట్ బతుకులకు ఈ కవిత ఒక నివాళి. కవిత్వమూ ఒక వ్యభిచారమైపోయిందనడం ఒక మంచి ఏక్స్ ప్రెషన్. కొత్త డిక్షన్లో వ్రాయడం, కొత్త పోలికల్తో వ్రాయడం ఆయనకు ఆయనే సాటి. సుధాకర్ గారి కవితలకోసం ఎదురు చూడాలనిపిస్తుంది. సామాజిక సమస్యల్ని పట్టించుకునేకవి సుధాకర్ గారికి నా అభినందనలు.
దొడ్డిగర్ల విజయభారతి
manoj kumar Oct 3, 2007 2
TV9లో వ్యభిచారగ్రుహాల్లో చిక్కుకుపోయిన అమ్మాయిల ఇంటర్వూలు చూశాం.మమ్మల్ని కాపాడండిబాబో అని టీవీలో మొత్తుకుంటున్న వాళ్ళ గోడువింటే మనస్సు కరిగిపోతుంది. వాళ్ళ జీవితాలగురించి వ్రాసిన విల్సన్ సుధాకర్ గారి కవిత పవర్ పుల్ గా ఉంది. ఆయనకు హేట్సాఫ్.
దాసరి మనోజ్ కుమార్.
khaja Oct 3, 2007 3
విల్సన్ సుధాకర్ గారి కవిత చాల బాగుంది. ఈ దేశం ధనవంతులకు, క్రికెట్ వీరులకు, పెట్టుబడిదారులకు, పై కులాలకు బానిస. రాయితీలన్నీ దొబ్బి తినేది వాళ్లే. కిందికులాల వాళ్లూ, పేదలూ పై వాళ్లకు వూడిగం చేయడానికే పుట్టారనుకునే కురచ బుధ్ధి అంత తొందరగా మారదు, హాఫ్నేనేకెడ్ ఫకీర్ల మోసం అంత త్వరగా వీడదు. కవిత్వపు నిజ రూపం ఎంత ఆగ్రహంగా వుంటుందో విల్సన్ సుధాకర్ గారు ఆవిష్కరించారు.. అభినందనలు..
S Kothuri Oct 28, 2007 4
కవి ఆవేదన కనబడుతొంది. excellent