నూరేళ్ల మార్టిన్‌ ఈడెన్‌

ప్రతి రచయితా ‘లక్షలు సంపాదించడం ఎలా?’ అనేది అలా ఉంచి, ‘కీర్తి ప్రతిష్ఠలు ఎప్పుడొస్తాయి? పాఠకులు ఎప్పుడు బ్రహ్మరథం పడతారు?’ అని కలలు కంటాడు. ఆ కలల్లో అసహజత్వమేమీలేదు. అత్యాశ కూడాలేదు. రాసేది అభిప్రాయ వ్యక్తీకరణ కోసమే అయినప్పటికీ, అది నలుగురూ చదువాలనే కోరిక అందరికీ ఉంటుంది. ఆ నలుగురూ నాలుగు లక్షల మందో, నలభై లక్షల మందో అయితే అతడికి కలిగే సంతృప్తి కూడా అదే మోతాదులో ఉంటుంది.

రెక్కాడితేగాని డొక్కాడని, రెక్కలు ముక్కలు చేసుకుని బతుకీడ్చే వాళ్ల కుటుంబంలో పుట్టాడు మార్టిన్‌ ఈడెన్‌. పసి ప్రాయంలోనే వీథిలోని అలగాజనంతో, రౌడీమూకల సాహచర్యంలో గడిపి, హోరాహోరీ యుద్ధాలు చేసి బలవంతులు మాత్రమే ఈ జనారణ్యంలో బతగ్గలరని అవగాహన చేసుకున్నాడు. ఒకటి రెండు సంవత్సరాలు స్కూలుకెళ్లాడేమోగాని, అది తప్ప చదువూ సంధ్యాలేదు. సంస్కారవంతమైన జీవిత పద్ధతులకు ఆమడ దూరం. పదకొండో ఏట కళాసీగానో, అంతకన్నా హీనమైన పనులో చేస్తూ, నౌకలెక్కి సముద్ర ప్రయాణాలు చేశాడు. అక్కడ అతడి అనుభవాలు చిన్ననాడు నేర్చుకున్న జీవితపాకాల్నే మరింత ధృవపర్చాయి. నౌకలు అతణ్ని ప్రపంచం నలుమూలలకూ తీసికెళ్లాయి. ఎన్నో రేవులు, ఎన్నో దేశాలు, ఎన్నో రకాల మనుషులు. కాని అంతటా ఒకటే పాఠం. బలహీనులకి ఈ లోకంలో స్థానంలేదు. బతక దల్చుకుంటే పోరాడు. నీతి, అవినీతీ, ధర్మం అధర్మం వగైరా అన్నీ శాసించేది బలవంతులే. బలహీనులు వారి ఆజ్ఞలను శిరసావహించాలి. బలవంతుడే పరిపాలకులు, బలహీనులు బానిసలు మాత్రమే.

అనుభవైకవేద్యమైన ఈ తాత్విక విషయాలను వంటపట్టించుకున్న మార్టిన్‌కు తన ఇరవయ్యవ యేట సంస్కారవంతులైన ఒక కులీనుల కుటుంబంతో పరిచయమేర్పడుతుంది. ఆ ఇంటిలోని రుత్‌కు ఇతడో అడ విమనిషిలా కన్పిస్తాడు. సంస్కారహీనుడు, స్వచ్ఛంగా మాట్లాడనైనాలేడు, మర్యాదలేదు, మానర్స్‌ తెలియవు. ఆమె మార్టిన్‌ గురించి ఎంత హీనంగా ఆలోచిస్తోందో, మార్టిన్‌కు ఆమె అంత వున్నతంగా కనిపిస్తుంది. జంతు సమానంగా గడిపిన తన జీవితమే కాదు, జీవితం అనేది ఇంత అద్భుతంగా, ఉన్నతంగా కూడా వుండగలడు. కాని, ఇదివరలో, ఇవన్నీ తెలుసుకోవటానికి తనకవకాశమేదీ! అర్ధాకలి జీవితాలతో, ఒక్కపూట తిండి సంపాదించటానికే పదిహేను హదహారు గంటల శారీరక శ్రమ సరిపోని తమకు సంస్కృతి అంటే ఏమిటో ఎలా తెలుస్తుంది? మురికివాడల్లో చిరుగుపాతల్లో, గుడిసెల్లో, పశువుల మందల్లా బతికిన తన తల్లిదండ్రులు తనకు సంస్కారమంటే ఏమిటో ఎలా చప్పగలరు? కాని తాము అలసమైన జీవితాలు గడపలేదని తనకు తెలుసు. ఒళ్లొంచి కష్టపడి పనిచేశాడు. కాకపోతే అనంతమైన తమ శ్రమశక్తి అంతా ఒక్కపూట తిండి సంపాదనకే సరిపోలేదు. అంత శ్రమా, అంత కష్టం ఈ కులీనుల విద్యా వ్యాసంగాలు నేర్చుకోవటానికి వెచ్చిస్తే అచిరకాలంలో తనకు మాత్రం ఇవి అలవడవూ!

సముద్ర జీవితంలో సంపాదించిన కాసిని డబ్బులూ తన పోషణకు వాడుకుంటూ విద్యాభ్యాసం ప్రారంభిస్తాడు మార్టిన్‌. ‘స్కూలు కెళ్లి చదుకోవటం మంచి పద్ధతి’ అంటుంది రుత్‌. ఆర్థికంగా అది తనకు వీలుపడదు. అంతేకాదు, స్కూలుకెళ్లి మీరు సంవత్సరంలో నేర్చుకోగలిగింది నేనొక్క నెలలోనే నేర్చుకోగలను అంటాడు మార్టిన్‌. అవును మరి. రోజుకు నాలుగైదు గంటలు మాత్రం తప్పనిసరి పరిస్థితిలో నిద్రపోయినా, మిగతా కాలమంతా లక్ష్య సాధనలో గడిపితే అసాధ్యమేముంది.

ఆమెకు మార్టిన్‌లో ఒక వింత ఆకర్షణ కనిపిస్తుంది. కష్టభూయిష్టమైన సముద్ర జీవితంతో వచ్చిన శరీరదార్ఢ్యం మానవాతీతమైనదనిపించే అతని పట్టుదల, కార్యదీక్ష చూసి ఆమె ముగ్ధురాలవుతుంది. రుత్‌ సుకుమార సౌందర్యం, సంస్కారం మార్టిన్‌కు గాలం వేస్తాయి. వాదోపవాదాలు, ఘర్షణలు ఎన్ని జరిగినా ఇద్దరూ, తమకు తెలియకుండానే, దగ్గిరవుతారు.

అద్భుతమైన ఈ ప్రపంచం అరుదైన తన అనుభవాలు, తన లౌకికదృష్టి – ఇదంతా రచనల్లో పెట్టాలనే తపన అతణ్ని వివశుణ్ని చేస్తుంది. ముఖ్యంగా తను రాసింది రుత్‌ చదివితే ఎంత బాగుంటుంది. తన సముద్రానుభవాల్ని గురించి ఒక రచన చేసి పత్రిక్కి పంపిస్తాడు. ఆ రోజు శుక్రవారం, వెంటనే ఆ ఆదివారం సాహిత్యానుబంధంలో అది వచ్చేస్తుందని అతడి నమ్మకం. కాని, అలా రాకపోవటంతో తొలిసారిగా ఆశా భంగమవుతుంది. కాని కృషి మాత్రం ఆగదు. పట్టువదలని విక్రమార్కుడు మార్టిన్‌.

మిత్రులూ, బంధువులూ, చివరికి రుత్‌ సైతం అతణ్ని ఎంత నిరుత్సాహపరిచినా ‘ఈ రచనా జీవితం నీ వొంటికి సరిపడదు. ఏదో ఉద్యోగం చూసుకో. అందర్లా బతుకు’ అని ఎంత చెప్పినా మార్టిన్‌ పట్టుదల మాత్రం సడలదు. పుంఖాను పుఖంగా రాస్తూనే ఉంటాడు. ఉన్న చివరి పావలా, అర్ధాకూడా కథలు పంపించటానికి తపాలా బిళ్లలు కొనటానికీ వెచ్చిస్తాడు. నెలలు గడుస్తాయి. ఏ రోజూ కడుపునిండా తిండిలేదు. కంటి నిండా కునుకులేదు. చేతితో కలం పట్టుకోగలిగిన శక్తి వున్నంతవరకూ మార్టిన్‌ రచనా తపస్సు ఆగదు.

పంపిన రచనలన్నీ తిరుగు టపాలో వచ్చేస్తుంటాయి. వాటిని తిరిగి ఇతర పత్రికలకు పంపుతూనే ఉంటాడు. ఇలోగా అనేక తాత్విక గ్రంథాలు, శాస్త్ర విషయాలు, సాహిత్యం అధ్యయనం చేస్తాడు. చూసిన ఏ పుస్తకాన్ని చదవకుండావదలేడు. రోజుకు ఇరవై నాలుగు గంటలే వున్నాయే? ఈ కాలాన్ని ఇంకెంత పొదుపుగా వాడాలి? నాలుగైదు గంటల నిద్ర కూడా వృథా అనుకుంటూ కన్రెప్పలు తెరచి వుంచగలిగినంత వరకూ చదువుతూనే వుంటాడు. వేళ్లు నొప్పిపుట్టి కలం దానంతటదే కిందపడేదాకా రాస్తూనే ఉంటాడు.

కాని…

పత్రికలకు అతని మీద సానుభూతిలేదు. ప్రతి పత్రిక నుండి ‘ఇవి ప్రచురణకు అంగీకరించబడలేదు. అన్యధా భావించవద్దు’ అంటూ చీటీలు వస్తూనే వుంటాయి. ఒకే పద్ధతిలో ముద్రితమై వచ్చే ఈ చీటీలు చూసి ‘అసలు పత్రికల్లో మనుషులు పనిచేస్తారా లేక మెషిన్లే ఇవి తిప్పి పంపిస్తుంటాయా? నిజమైన మనుషులే అక్కడుంటే ఒక్క సంపాదకుడో, సంపాదకుడి అసిస్టెంటో అదేమాట స్వదస్తూరీతో ఎందుకు రాయరు?’ అనుకుంటాడు మార్టిన్‌.

ఈలోగా ఆకలి బాధ పెరుగుతుంది. దుస్తులు చింకిపాతవైపోతాయి. ఎక్కడా అప్పుపుట్టదు. అయినా మార్టిన్‌ తన యుద్ధాన్ని మాత్రం విరమించడు. బలవంతులే ఈ లోకాన్నేలుతారని అతడు ఆనాడే తెలుసుకున్నాడు. పాతజ్ఞాపకాలు అతడి పట్టుదలను ద్విగుణీతకృతం చేస్తాయి… చిన్నప్పుడు, ఏడేళ్ల మార్టిన్‌ను తొమ్మిదేళ్ల కుర్రాడొకడు ఓ తగాదాలో పచ్చడి చేస్తాడు. ఒళ్లు హూనమైనా మార్టన్‌ మాత్రం పారిపోడు. ఎదురునిల్చి పోరాడతాడు. ”పోబే, దమ్ములుంటే రేపురా మళ్లీ” అంటాడా పెద్దకుర్రాడు. దమ్ములున్న మార్టిన్‌ తెల్లారి ఆ సమయానికి ముందే యుద్ధరంగానికి చేరుకుంటాడు. మళ్లీ ఒళ్లు హూనమవుతుంది. చూసేవాళ్లకు జాలేస్తుంది. ”వెళ్లరా! వాడితో నువ్వు పోట్లాడలేవు వెళ్లు” అంటారు. నెత్తురు కారినా, ఎముకలు విరిగినా, ఒళ్లంతా పచ్చిపుండయినా, కాళ్లూ చేతుల్లో సత్తువవుడిగినా పోరాటం ఆపడు. అనేక సంవత్సరాల తర్వాత మార్టిన్‌కు మళ్లీ ఆ పెద్దకుర్రాడు తారసపడతాడు. ఈసారి మార్టిన్‌ వాణ్ని చితకగొడతాడు.

”ఆనాడు వాణ్ని సాధించటానికి నాకు పదకొండేళ్లు పట్టింది. ఈ పత్రికా భూతంతో యుద్ధం పదకొండుసార్లు పదకొండేళ్లు చేయాల్సి వచ్చినా సరే నేను వెనుకాడను. అనుకుంటాడు మార్టిన్‌. పొంగివచ్చే నిరాశను అణచుకుంటూ. ఎవరెంత నిరుత్సాపరిచినా పట్టించుకునేవాడు కాదు మార్టిన్‌.

కాని తన ప్రేయసి, తన ఆరాధ్య దేవత రుత్‌ కూడా వెనక్కి లాగుతుంది. ”నువ్వంటే నాకిష్టం. నేను నిన్నేంతగానో ప్రేమిస్తున్నాను. నీతోనే నా జీవితమని ఏనాడో నిశ్చయించుకున్నాను. కాని నీలాంటి నిలకడలేని మనిషిని, ఓ స్థిరమైన ఆదాయం లేనివాణ్ని చేసుకోవటానికి మా అమ్మానాన్నా ససేమిరా అంగీకరించరు. పోనీ, వాళ్ల సంగతి వదిలేసినా, పెళ్లి చేసుకుంటే నువ్వు నన్నెలా పోషిస్తావు చెప్పు” అంటుందామె.

”రెండు సంవత్సరాలు వ్యవధి యివ్వు’ అంటాడు మార్టిన్‌. తన జీవితంలో వెలుగు లాంటి ఆమె లేకపోతే జీవితమే అంధకార బంధురం.

మరో సంవత్సరం గడుస్తుంది. కృషిలో లోపంలేదు. జాప్యం లేదు. కథలు, నవలలు, వ్యాసాలు, విమర్శలు, గేయాలు… ఒకటేమిటి రోజుకి ఇరవై నాలుగ్గంటలూ సరిపోని పద్ధతిలో రాస్తూ ఎన్ని వందల పేజీల రచనలు చేశాడో లెక్కలేదు. కానీ అన్నీ తిరిగి వస్తాయి. చివరికి ఇక పంపటానికి తపాలా బిళ్లలు కొనలేని స్థితిలో పత్రికలకు పంపటం మానేస్తాడు. తిండిలేక, నిదురలేక, పోషణ లేక అంత దృఢకాయుడు కూడా చిక్కి శల్యమైపోతాడు. ఎటు చూసినా అప్పులు. తను ఉంటున్న ఇంటి పేదరాలు దయతో తెచ్చిచ్చే గంజినీళ్లే అతడి ప్రాణాల్ని కాపాడుతుంటాయి.

ఆ దశలో రుత్‌ ఒకనాడు అతన్ని తమ ఇంటికి భోజనానికి పిలుస్తుంది. ఆమె తండ్రి సంపన్నుడు. భోజనం టేబుల్‌ వద్ద, అక్కడికి వచ్చిన ఘరానా అతిథి జడ్డిగారితో హెర్బర్ట్‌ స్పెన్సర్‌ తత్వశాస్త్రాన్ని గురించి వాదిస్తాడు మార్టిన్‌.

న్యాయశాస్త్రంలో ఎంత దిట్ట అయినా, తాత్విక విషయాలను గురించిన జడ్డిగారి అభిప్రాయాలు మూర్ఖమైనవని మార్టిన్‌ తెలుసు. చివరికి విసుగెత్తి ”స్పెన్సర్‌ గురించి మీ అజ్ఞానం అపారం” అని జడ్డీతో అంటాడు. మర్యాద తెలియని ఇతని ప్రవర్తనకు ఆ సజ్జనులు షాక్‌ అవుతారు. కాని సంజాయిషీ చెప్పుకోవటం అనేది మార్టిన్‌ స్వభావంలో లేదు.

”నీలాంటి వాడితో నాకు సరిపడదు. మనమింక కలుసుకోక పోవడం ఇద్దరికీ మంచిది” అంటూ ఉత్తరం రాస్తుంది రుత్‌. తను ప్రాణాధికంగా ప్రేమించిన రుత్‌ అలా రాయటంతో హతాశుడవుతాడు మార్టిన్‌. జీవితంలో కొత్త ఖాళీ ఏర్పడుతుంది. ఎందుకు రాయటం ఎవరి కోసం? ఏ ప్రయోజనాన్ని ఆశించి ఇన్నాళ్లూ రాశాడు? డబ్బులా? డబ్బులు అవసరమే – రుత్‌తో కలిసి సుఖంగా జీవించటానికి. కీర్తి ప్రతిష్ఠలా? అవును. తన కీర్తిని చూసి రుత్‌ గర్వపడాలనుకున్నాడు. మరిప్పుడు అవి రెండూ ఏం చేసుకోవడానికి?

ఆ దశలో మార్టిన్‌ రాసిన ఓ విమర్శన గ్రంథాన్ని ఒక ప్రచురణకర్త అంగీకరించి పదిహేను వందల కాపీలు వేస్తాడు. మార్టిన్‌ అడ్వాన్స్‌ అడిగితే ఇలాంటివి వెయ్యటమే ఘనం. ఎన్ని కాపీలు అమ్ముడవుతాయో సందేహమే అని జవాబు. అయినా వేసిన కాపీలు అతి త్వరగా అమ్ముడుపోతాయి. మరో ముద్రణ. ఈసారి రెట్టింపు కాపీలు అవి అమ్ముడుపోతాయి. మరో ముద్రణ. ఆ పుస్తకం సాహిత్య ప్రపంచంలో సంచలనం సృష్టిస్తుంది. అప్పటి దాకా అతడి రచనల్ని అల్మైరాలలో పడేసి ఉంచిన పత్రికా సంపాదకులు వాటిని బైటికితీసి ప్రముఖంగా ప్రచురిస్తారు. ఇంతకాలం అతని అముద్రిత రచనల్లో లోపాలే చూసినవాళ్లకు యిప్పుడు వాటిలో ఎనలేని ప్రతిభ కనిపిస్తుంది.

మార్టిన్‌ ఈడెన్‌ కొత్త యుగాన్ని ప్రారంభించాడంటారు వాళ్లు. ”మీ రచనల్తో మా పత్రికలంకరించండి. ఎంత పారితోషికమైనసరే యిస్తాం. మీ రచనలను అచ్చువేసే భాగ్యం మాకు ప్రసాదించండి” అంటూ పత్రికల దగ్గర నుండీ, ప్రచురణకర్తల నుండీ కుప్పలు కుప్పలుగా అభ్యర్థనలు వచ్చి పడతాయి. ఇన్నాళ్లు, అటకలమీదా, టేబుళ్ల కిందా, గదిలో యిక్కడా అక్కడా చిందరవందరగా అనాధల్లా పడివున్న రచనలన్నీ వాళ్లకి పంపిస్తాడు. డబ్బు, కీర్తి అతడి పాదాక్రాంతమవుతాయి. కాని యిప్పుడు వాటి అవసరం అతడికి లేదు. అవి అనవసరమైన, అత్యల్పమైన విషయాలతనికి.

నగరంలోని ప్రముఖుల నుండి రోజూ డిన్నర్లకు ఆహ్వానాలు. సభలకు ముఖ్య అతిథిగా విచ్చేయమని అభ్యర్థనలు. ‘అతడి అభిప్రాయాలు అమూల్యమైనవి. అతడి ప్రతి మాట వెనకా ఎంతో నిగూఢమైన అర్థం దాగి వుంటుంది’ మార్టిన్‌కు ఈ లోకరీతి అర్థం కాదు. ఈ తేనెపూసిన కత్తులు, తడిగుడ్డతో గొంతుకోసే ఈ సజ్జనులు, ఈ కులీనులు, ఈ సంస్కారవంతులు – వీళ్లకేం కావాలి అశలు? తిరిగి తిరిగీ అతణ్ని కలచివేసిన ఆలోచన ఒక్కటే. ఈ రచనలన్నీ తనెప్పుడో చేశాడు. ఆకలి మంటల్లో, బంధుమిత్రుల అవమానాలు కుంగదియ్యగా, ఎందుకూ ‘పనికిరాని చవట’ అని అందరూ అవమానించిన దశలో తానీ రచనలు చేశాడు. అందరికీ కాకపోయినా, కొందరికైనా తనేం రాశాడో అప్పుడే తెలుసు. మరి వాళ్లెందుకు అప్పుడే వీటిని కీర్తించలేదు? అప్పటికీ ఇప్పటికీ ఆ రచనల్లో మార్పేమీలేదే? తనంటే ఎందుకిప్పుడు వాళ్లకి గౌరవం? ఆకలికి మాడిన రోజుల్లో తనకెవ్వరూ తిండిపెట్టలేదే. ఎందుకిప్పుడు డిన్నర్లకు ఆహ్వానిసున్నారు? అప్పుడు తనను చూసి ఛీత్కరించిన వాళ్లు ఇప్పుడు ముఖ్యఅతిథిగా ఉండమని కాళ్లావేళ్లాపడుతున్నారు? ఎందుకు మనుషులకీ కక్కుర్తి? ఎందుకీ సంపన్నులు, కులీనులు, సంస్కారవంతులు ఇంత నీచంగా, ఆత్మద్రోహం చేసుకుంటూ బతుకుతారు? ఇంతకన్నా అలగాజనం, శ్రామికులు చాలా మెరుగు. వాళ్లకీ దొంగ విలువలు లేవు. శ్రామికుడిగా, కూలీగా నిమ్నవర్గంలోంచి వచ్చిన తాను ఈ దొంగల వర్గంలోకి ఎదగాలనుకున్నాడా? వీళ్ల విలువల్నీ నీతిసూత్రాల్నీ నిర్ణయించేది డబ్బు.

ఒకనాడు మార్టిన్‌ ఓ ఖరీదైన హోటల్లో ఉండగా రుత్‌ వస్తుంది. ”నేను పొరపాటు చేశాను. క్షమించు. నిన్ను పెళ్లి చేసుకోటానికే వచ్చాన్నేను. అమ్మా, నాన్నల్నెదిరించైనా సరే వచ్చేస్తాను. నీ షరతుల్తో, నీ దగ్గర ఎలాంటి హోదాలోనైనా వుంటాను. నన్ను స్వీకరించు” అని మీదపడి కన్నీళ్లు పెట్టుకుంటుంది.

ఆమెకెలా సమాధానం చెప్పాలో మార్టిన్‌కు అంతుబట్టదు. అనేకసార్లు తనలో తాను వేసుకున్న ప్రశ్నల్నే ఆమెతో మళ్లీ ఆత్మఘోషగా చెబుతాడు. ”రుత్‌! నేను మారలేదు. నేను – అప్పటి నేనే. నా అభిప్రాయాలు మారలేదు. నా స్వభావం మారలేదు. నా వ్యక్తిత్వం మారలేదు. ఇప్పుడు కూడా నేను మీ జడ్డీగారు హెర్బర్ట్‌ స్పెన్సర్‌ గురించి కనీస జ్ఞానంలేని గాడిద అనే అంటాను. అన్నట్టు అతడు మొన్న కనిపించి నన్ను వాళ్లింటికి డిన్నర్‌కు ఆహ్వానించాడు. నా అనాగరిక ప్రవర్తనకు మీ నాన్నగారు నన్ను మళ్లా ఇంటి ఛాయలకు రావద్దన్నాడే… నేను, ఆ నేనే… మీ నాన్న కూడా నన్ను ఇంటికి ఆహ్వానించాడు. మళ్లీ – ఎందుకూ పనికిరాని రచనలు చేస్తూ కాలయాపన చేస్తున్నావన్నావే – నేను ఆ నేనే. రుత్‌… మార్పు వచ్చింది నాలో కాదు, మీలో. డబ్బు, కీర్తి, సక్సెస్‌ చూసి మీరెందుకిలా మారిపోతారు రుత్‌. మీ కులీనులు, సంపన్నులు, సంస్కారవంతులూ అంతా ఇంతే. ఇది మీ వర్గ నైజం. మనుషుల మీద కాక డబ్బు, కీర్తి, సక్సెస్‌ల మీద మీకు మోజు. నాకు మాత్రం అవి పట్టవు…” అంటాడు మార్టిన్‌.

రచనలు అచ్చయ్యిం తర్వాత మళ్లీ కలం ముట్టుకోడు మార్టిన్‌. ఈ కృత్రిమ విలువల లోకం నుండి దూరంగా వెళ్లిపోవాలనుకుంటాడు. దక్షిణ సముద్ర ద్వీపాలకు ప్రయాణం చేస్తున్న నావ ఎక్కుతాడు. కాని లక్ష్య శూన్యమైన జీవితం అతడిలో అన్ని రకాల కోరికలనూ నిర్మూలిస్తుంది. చివరికి జీవితేచ్చ కూడ ఉండదు. దీవులకు చేరకముందే దారిలోనే అనంతసాగరంలో మునిగి ఆత్మహత్య చేసుకుంటాడు.

ఇది మార్టిన్‌ ఈడెన్‌ నవలా పరిచయమూ, కథా సంగ్రహమూ కాదు.

తాను నమ్మిన విషయాలతోనే రచనలు చేసి నిలదొక్కుకోవాలంటే ఎంతటి కార్యదీక్షా, అకుంఠిత శ్రమా, నిర్విరామ కృషీ అవసరమో మార్టిన్‌ ఈడెన్‌ పాత్ర ద్వారా మనకు తెలుస్తుంది. అమెరికన్‌ రచయిత జాక్‌ లండన్‌ ఆత్మకథగా చెప్పబడే ఈ నవల ప్రతి రచయితకూ అవశ్య పఠనీయం. శతాబ్దం కావస్తున్నా ఇదింకా తాజాగానేఉంటుందంటే, మనం ఆనాటి పరిస్థితుల్నించి బయటపడలేదన్న మాటే. ఔత్సాహిక రచయితలకు పెద్దబాలశిక్ష మార్టిన్‌ ఈడెన్‌.

3 అభిప్రాయాలు »ప్రపంచ సాహిత్యం, సాహిత్య వ్యాసాలు

3 అభిప్రాయాలు

  1. bhask Oct 5, 2007 1

    చాలా బాగుంది.

  2. Telugureader Nov 7, 2007 2

    Its a classic one. I loved it. I would like to reach more fine translations from this author.

  3. vijayasimha May 21, 2009 3

    Could you please post some more articles from Muktavaram Parthasarathi garu.
    He has translated many russian literature into telugu like Chehov kathalu etc..

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో