నడిచే మోదుగ చెట్టు

గోడెక్కి దశన్న పూవు – మొగ్గదీరి మల్లె – చెమ్మగిల్లిన వాకిలి
ఆ వచ్చేది కచ్చితంగా అక్కనే
ఔ! తమ్ముడికచ్చే ఒక్కగానొక్క పండుగ అక్కే కదా
చెక్కర కుడుకతో రాఖీపండుగో ఏదో ఒక సందు
తెచ్చిన మక్కగారెలూ పడిశెం
ఇంటింటి రాజుల ఉత్సవం అక్కనే
అక్కంటే రెండిండ్ల నడుమ ఎడతెగక పారే వాగు కదా

అక్కతో చెప్పి బాపుతో కట్టిచ్చుకున్న ఉయ్యాల
ఇద్దరం ఊగీ ఊగీ కాకెంగిలి కథల్లో పడిపోతాం
బాల్యాన్ని చాటాగంపకెత్తి నవధాన్యాలుగా ఎండపొడపోస్తాం
పెరటి తోటలో తవుటంబెట్టి జామచెట్ట మీద రెండు చిలకలమవుతాం
ఎప్పట్లాగే ఇంటెనుక యాపచెట్టుమీద కోయిల చించుకుంటుంది
నాకింకా గుర్తే -
నడిపోరోల్ల రేగ్గాయ చెట్టు – నందయ్యోల్ల పులిచింత చెట్టు
జెగ్గమ్మా వాకిట్ల కుంటుడు టెక్క – ఆరెళ్ల సాయిలు పందిరి గిర్క
వాడకట్టంతా రెస్సాటే
”పల్లె పడుచులం – మేం రెతుబిడ్డలం
పొద్దున్నే లేచాము పల్లెపడుచులం”
మోస్సపోసుకుంట అక్క సింగులు జెక్కి ఆడుతుంటె
మట్టెల మోతకు అరుగు మద్దెలయ్యేది
ఇంటింటి బతుకమ్మతో ఊరేగింపై హనుమండ్ల గద్దెమీదికస్తంటె
మేం మా సోపతిగాల్లం
రోలు రోకట్ల పోటాష్‌ పోసీ ‘ఢా’మనిపించేదీ

సత్తుగట్టిన ముల్లె నా చేతికిచ్చి
పాడిన పాట పాడుకుండా పాడుతుంటే
రాంబాయమ్మ సుత లేసి రాముని పాటందుకునేది
‘పుటుక్కు జెర జెర డు బుక్కుమే’ పొడుపుకథ
అక్కనోట ఊటలూరేది
అక్క చనువుతో సాదమల్లె పందిరి చుక్కల్తో పోటీ వడేది
అసలుకు అక్కంటనే – బోళ్లాట గుర్తస్తది
ఊరెలుపు అల్లుకున్న రథం ముగ్గు గుర్తస్తది
రెండు చేతులా అడుక్కచ్చినా హనుమండ్ల పలారం గుర్తస్తది
బర్ల గుడిసెకు పూసిన ముద్దగౌరమ్మ గుమ్మడిపూవు గుర్తస్తది
కట్ట కర్కాస్‌ బట్టబంగారం నువ్వెన్నను
పోకుంట ఆడే కట్టకాయలాట గుర్తస్తది
గొడ్డు పంజమెక్కిచ్చే పచ్చీసు గుర్తస్తది
సోడుపల్లికాయగొట్టి కొనిచ్చిన ఐస్‌క్రేట్‌ గుర్తస్తది
‘సిబ్బిలేనింటికి నా బిడ్డనిస్తిని తాన తందయ్యలో వేవనందయ్యలో’
ఆ ఆర్తి గుర్తస్తది
నా వంతుకు దొంగై ఆడిన ఆటలు గుర్తస్తయి
నా పుస్తకాలకేసిన అట్టలు గుర్తస్తయి
పుట్టల్ల రాలిన రెండు కన్నీటి బొట్లు గుర్తస్తయి
మెడల కొనేసిన బచ్చీసీల దండ – కళ్లకు పచ్చ కళ్లద్దాలు
ఎక్కిన రంకురాట్నం – చేయివట్టి తిప్పిన జాతరలు గుర్తస్తయి
బండెడు పెండను ఒక్క చేత్తో చేసిన పిడుకలు గుర్తస్తయి
ఉరికురికి దున్నిన వడ్ల కల్లం – గుమ్ములు నింపిన గంపల లెక్క
కొప్పెర దించి పోసుకున్న ఉడుకుడుకు తానాలు
ఇడువని ‘అక్క వాసనే’ గుర్తస్తది
అక్కనే అమ్మై ఉట్టి దింపి చీమలు దులిపి తినిపించిన అన్నం ముద్దా
కల్లం కాంచి అమ్మరానప్పుడు
పేనుమీద బూడిద పోసి ‘ఇగో ఇటునుంచస్తుంద’ని
అమ్మ బెంగ దీర్చే సముదాయింపు
సాగదోలేకాడ ‘తమ్మీ పైల’మని చెప్పి చెమ్మను దాపెట్టుకోలేక
భంగపడ్డ ఆ కండ్లూ
ఇప్పటికే కండ్లల్ల కదులుతుంటై
నా కాలికి గుచ్చిన ముల్లుకు నిలువెత్తు కాంట – అక్క
నా తోవ పొడుగునా విన్పిస్తున్న మంగళహారతి పాట – అక్క
అక్కంటనే –
అరుసుకునే పుట్టెడు సారుగాలు
పోసే తీరుతీరు సకినాలు
కుట్టే ఇస్తారాకుల కట్ట
రెండు చేతులా గొట్టే పల్లికాయ
ఒక సాలు వొలిచి సేతికిచ్చిన మక్కజొన్న కంకి
ఒక చెయ్యేసి జెరాన్ని గుంజిన కనికట్టు

అసలుకు అక్కంటనే –
కొడవలి వంపు
కలుపుదీసే కుడిపె
సద్దిమోసే నడక
ఇత్తనపు సాల్లల్ల మొలక

అక్కంటనే –
ఇంటింటా ముట్టిచ్చిన ఎక్కా
ఎదురచ్చి బరువుదింపే సెయ్యి
గంపెడు మమకారాలు కురిసే మబ్బు
కండ్ల ముందట మెరిసే ఆ అరుంధతీ నక్షత్రం

అక్కకు పెండ్లై వెళ్లిపోయాక
చింతిత్తు చెమ్మలు తయారైతలెవ్వు
మొత్తం పచ్చీసు కాయలు దొరుకుతలెవ్వు
ఓన గుంతల పెట్టె ఎటు దెంకపోయిందో
పంచసాల కళ దప్పింది
బొట్టుపెట్టి – కైలేదు కుయిలేదు
జోడు జంచుల్ల ముడుపుగట్టిన ఇత్తనాలు ఇవుతలికి తొంగి సూతలేవు
పెరట్ల దశన్న పూల చెట్టు సక్కగ ఊగుతలేదు
ఊరపిచ్చుకలకు ఏంబుట్టిందో అవీ సప్పుడు జేత్తలేవు
బాపు జోల మంచంలనే పంటండు
బాపమ్మ పేండ్లతోనే పోరాడుతంది
అమ్మకు గోడల్తోనే ముచ్చట
వాడకట్టు చిన్నబోయింది

అక్కను ఊళ్లెనే ఇచ్చినందుకు ఏదో పనున్నట్టు
ఇట్లచ్చి అట్లవోతది
అట్టో… సర్వపిండో చేసి నన్నరుసుకొని పోతది
‘పారా చిన్నా’ అంటూ
అక్క పోతూ పోతూ నన్నెంబడి పెట్టుకొని పోతది
గోడెక్కి తెంపి కొంగున నింపిన మల్లె మొగ్గల్ని
తలో నాలుగు పిన్నీసు మందం పెడుతూ పోతుంటే
దారిలో ఎందరక్కలనీ
‘అక్కనది’తో సాగుతుంటే అనిపిస్తుంది
ఆ తీర నాగరికతను కోల్పోయి
అపురూపంగా చదువుకుంటున్న చరిత్రంతా అసమగ్రమయిందని
తమ్ముడి సదువుల ఎనక నాలుక మందమైన సరస్వతీదేవి అక్కంటే -
కుటుంబం ఒక పక్కకు ఒరగకుండా తన భుజం ఆన్చిన
గొప్ప పనిమంతురాలు పార్వతీదేవి – అక్కంటే

ఇప్పటికే అక్కంటనే -
చిటికెలు గొడ్తూ చెరిగే బియ్యపు చాట గుర్తస్తది
మాటి మాటికే మానెడు వట్టే గంజే గుర్తస్తది
పెంటపొస్కతోని పోయిన ఎడ్లబండి
వడ్లబోరెంతోని ఇంటికత్తదంటే…
అంగవడి చేసిన ఆ ‘గోడు కష్టం’ అదే పనిగ గుర్తస్తది
బావ బాగుకోసం గుండు కొట్చిచ్చుకున్న తిరుపతి మొక్కు
పిల్లలు ఎదగాల్నని సేసే సత్యనారాయణ వ్రతాలు
పల్లెటూరి మోటుభాష – ఆ బట్టసంచులు – మట్టి డుముంతలు
ఇంటికి వెళ్లాడే ఎండిన మామిడాకుల తోరణం
సిగన రుద్రాక్ష పువ్వు… నవ్వినా ఏడ్చినా పెద్దపెట్టున్నే
అక్క ఉత్త పిచ్చిదాన్లా కన్పిస్తది
వాసానికి గట్టిన ఎల్సిపోయిన బాసింగలా అగుపడ్తది
చీకటిపూట ఒక్కతై మోసుకొస్తున్న గడ్డిమోపు
ముందట మూన్నాలుగు బల్లు – నోట్లె జానపదం – బొడ్లె సంచిల రూపాయి బండి
నడిచే మోదుగు చెట్టు – అక్కంటే
సెల్కమీద పసుపు దీపాల ప్రవోజనం తంగేడు పూవు – అక్కంటే

3 అభిప్రాయాలు »కవితలు

3 అభిప్రాయాలు

  1. Rakesh Oct 3, 2007 1

    అధ్బుతమైన తెలంగాణ పదాలు!

    “”"”"” “దశన్న పూవు, చెక్కర కుడుక, పడిశెం, తవుటం, యాపచెట్టు, రేగ్గాయచెట్టు, పులిచింతచెట్టు, పందిరిగిర్క, మోస్సపోసుకుంట, సోపతిగాల్లం, సత్తుగట్టిన ముల్లె, సాదమల్లె, బోళ్లాట, హనుమండ్ల పలారం, బర్ల గుడిసె, పుస్తకాలకేసిన పుట్టలు, బచ్చీసీల దండ, ఎక్కిన రంకురాట్నం, బండెడు పెండ, ఉరికురికి, వడ్ల కల్లం, గుమ్ములు, గంపల లెక్క, కొప్పెర, ఉడుకుడుకు తానాలు, కల్లం కాంచి, తమ్మీ పైలం, భంగపడ్డ కండ్లు,
    నిలువెత్తుకాంట, అరుసుకునే, పుట్టెడు సారుగాలు,తీరుతీరు సకినాలు,
    చేతుల గొట్టే పల్లికాయ, కనికట్టు, కుడిపె, సద్ది, ఇత్తనపు సాల్లల్ల మొలక, ముట్టిచ్చిన ఎక్కా, చింతిత్తు చెమ్మలు, పచ్చీసు కాయలు, ఓనగుంతల పెట్టె, పంచసాల, కైలేదు కుయిలేదు, అట్టో… సర్వపిండో, నన్నెంబడి పెట్టుకొనిపోతది, తెంపిన మల్లెమొగ్గ,
    పన్నీసుమందం, మానెడు వట్టే గంజే, వడ్లబోరెం, బాసింగం , సెల్క “”"”"”

    తెలంగాణ భాషను పొరపాటుగా యాస అనో, మాండలికం అనో పిలిచేవాళ్ళకు కనువిప్పు కలిగించే విధంగా ఉన్నదీ పద ప్రయోగం…

    అక్క పామురవడ్డ ముచ్చట చదువుతాంటె, కండ్లముంగట -మా పెద్దమ్మ బిడ్డనే కనవడ్డది.

    “..తండ్రికి పట్నంల నౌకరి, తల్లి బడిల, పొలంల డబల్ పన్లతో పరేషానైతాంటె, తను స్వయాన చిన్నపిల్లైనా ఇద్దరు కవల తమ్ముల్లను కన్నబిడ్డల్లెక్క సాకిన మా ఇందక్క యాదికచ్చె.. కండ్లల్ల నీల్లుదిరిగె.”

    చిన్నప్పటి ఆటలన్ని యాదై, నాకొక ఆనందపు జలదరింపూ, ఒక కన్నీటితెరా….

  2. sampath reddy Oct 26, 2007 2

    sri ratnakar reddy garki na namaskaralu ,
    nenu sampath reddy (gangipelli).mee kavitha prapancham nako kotha lokaniki parichayam chesindi.

  3. ప్రాణహిత » అక్టోబర్ 2007 సంచిక Nov 3, 2007 3

    [...] చిత్రిస్తారు రత్నాకర్ తన ‘నడిచే మోదుగుచెట్టు’ తో! జీవితానికి ‘సొంతిల్లు’ ఇచ్చే [...]

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో