నిర్దేశాత్మక వ్యాకరణం – ప్రాదేశిక భాషలు

-జిలుకర శ్రీనివాస్‌, పసునూరి రవీందర్‌

‘వ్యాకరణం’ మానవీయ శాస్త్రాలకు అత్యంత ప్రాధమిక అంశమూ కీలక అంశమూ అని విశ్వసించిన కాలం నుంచి వ్యాకరణశాస్త్ర అభ్యాసం, బోధన రెండూ అవసరమా అన్న విచికిత్స కొనసాగుతున్న సందర్భంలో తెలుగు వ్యాకరణాలను పునస్స­మీక్షించుకొంటున్నాం. వ్యాకరణం ప్రాభవం క్షీణించి భాషాశాస్త్రం వెలుగులో విశ్వవిద్యాలయాల్లోని తెలుగు శాఖలు నూత్న మార్గాలు అన్వేషిస్తున్న వర్తమానం యిది. తెలుగు భాషా సాహిత్యాలను పునరు మూల్యాంకనం చేస్తూ వున్న సమకాలీన సాహిత్య సందర్భంలోనూ మనం వ్యాకరణం గురించి సంభాషించుకొంటున్నాం. భాషా రాజకీయాలు నిర్దిష్టతను సంతరించుకున్న అనుభవం మనకుంది. తత్వశాస్త్రమైనా వ్యాకరణమైనా సాహిత్యమైనా స్థలకాలాలకు అతీతమైన అమూర్త విషయాలు కావు. సమాజం, సంస్కృతి, భాష ఇత్యాది విషయాలను వివేచించే క్రమంలో ప్రాదేశికత (స్థలం), కాలిక స్పృహ అన్న ద్విధాకృత సంబంధాలను విస్మరించలేం. తెలుగు భాషాజాతీయోద్యమం విజయం సాధించి తెలంగాణ జాతీయోద్యమం కొనసాగుతున్న కాలంలో భాషాసాహిత్యాల పునర్‌ మూల్యాంకనం తప్పకుండా ఒక రాజకీయ పఠనానికి దారితీస్తుంది.

ఈ పత్రంలో మాండలికాలు అన్న పదబంధం బదులు ప్రాదేశిక భాషలు అన్న పారిభాషిక పదబంధం ఎదురవుతూ వుంటుంది. మాండలికం అన్న భావనలో ఒక విధమైన హైన్యత వ్యక్తం అవుతుంది. ఆధునిక విలువల కారణంగా భాష ఆత్మగౌరవ విషయమని గుర్తిస్తున్నాం. మాండలికాలను భాషలు అనడం పట్ల భాషావేత్తలకు భిన్న అభ్యంతరాలున్నాయి. సాంప్రదాయిక నిర్వచనాల పరిధిలో ప్రాదేశిక వ్యవహారాలు భాషలు కాకపోవచ్చు. భాష పునర్‌ నిర్వచించబడడమే దానికి మార్గం. నిర్మాణవాద భాషాశాస్త్రవేత్త ఫెర్డినాండ్‌ డి. ససూర్‌ ప్రకారం సంజ్ఞల వ్యవస్థ భాష. సంజ్ఞలు నిర్దిష్ట సమాజంలోని సంస్కృతి ఉత్పత్తులు. అందువల్ల వాటి విభిన్నత ఆయా సంస్కృతుల మీద ప్రాదేశికతల మీద ఆధారపడి వుంటుంది. భిన్న ప్రాదేశిక సంస్కృతులున్న చోట ప్రామాణిక భాష ఒక సౌకర్యమే తప్ప పరిష్కారం కాదు. మాండలికాలు ఒక భాష యొక్క ఉపాంగమని భావిస్తే మాండలికాలు అర్థం కావాలి. తెలంగాణ, రాయలసీమ భాషల్లో వున్న రచనలు అర్థం కాకపోవడం వల్ల వాటికి అనువాదాలు అవసరం అవుతున్న దృష్ట్యా అవి ‘భాషలు’ అవుతున్నాయి. ఆకారణంగా మేము ప్రాదేశిక భాషలని వ్యవహరిస్తున్నాం.

రచయిత కేంద్రంగా కావ్య పఠనం తెలుగు పాఠక ప్రపంచానికి నవీనమైనది కాదు. రచన, పాఠకుడు యిద్దరే పఠనక్రియలో మిగలాలని నవ్యసంప్రదాయవాదులు, ఆధునికానంతర వాదులు చేసిన సూచన కన్న ముందే చిన్నయసూరి బాలవ్యాకరణం అధ్యయనంలో సూత్రకేంద్ర వివేచన ఆది నుంచీ ప్రవర్ధితమైంది. వ్యాకరణ గ్రంథాలు అన్నీ కొన్ని మినహాయింపులతో సూత్ర ప్రధాన చర్చ, పఠనం జరిగింది. యిది ఎంతో నవీనమైన అంశం. బాల ప్రౌఢవ్యాకరణాల గురించి సుదీర్ఘ వివేచన జరగడం వ్యాకరణ విశిష్టతను వ్యక్తం చేయడమే కాదు అవి బహుళ పఠన సంభావ్యతకు ఆకరాలు అన్న సారాన్ని ప్రకటిస్తున్నాయి. అందువల్ల, వ్యాకరణాలను పునఃసమీక్షించడమంటే వాటిని నిర్దిష్ట సందర్భంలో కొత్త దృక్పథాల నుంచి పరిశీలించడమని అర్థం. భాష, వ్యాకరణం అన్న రెండు ముఖ్యమైన విషయాలు అమూర్త విషయాలు కావన్న ఎరుక అందరికీ వుంది. తెలంగాణ ప్రాదేశిక దృష్టి నుంచి వ్యాకరణశాస్త్రాన్ని అవగాహన చేసుకోవడానికి చేసిన ప్రయత్నమే ఈ పత్రం.

వ్యాకరణాలు సాధారణంగా నిర్దేశాత్మక వ్యాకరణాలు. అంటే ఉచ్చారణ, సదసంయోజనం, వాక్యవిన్యాసం వంటివాటిని నిర్దేసిస్తాయి. అందుకు భిన్నమైన వ్యవహారాన్ని వ్యాకరణ దోషాలుగా పరిగణిస్తాయి. ఒక విధమైన భాషానియతివాదమే నిర్దేశాత్మక వ్యాకరణం.

వ్యాకరణానికి వస్తువు కావ్య భాష. భాషాశాస్త్రానికి వస్తువు ప్రామాణిక భాష. ప్రాదేశిక భాషలైన తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్రలను ‘మాండలికాలు’ కేటగిరిలో చేర్చి అనుషంగిక విషయాలుగానే పరిగణించారు. మాండలికాల పరిశీలనలోనూ వృత్తిపదాలదే సింహభాగం. వ్యాకరణం వ్యాకరించిన కావ్య భాషలో కూడా కవిత్రయం వాడిన భాష తప్ప ఆధునిక వ్యవహారం కాదు. ఆధునిక కాలంలో రచించిన బాలవ్యాకరణంలో పరిశీలనాంశం వేయేండ్ల కాలం నాటి భాష కావడం దాని ప్రాసంగికత రాహిత్యానికి హేతువు. కావ్య భాష పఠనానికి వ్యాకరణం ఉపయుక్తం అవుతుందని విశ్వసించినా అనేక కావ్యాలలోని మాండలికాల ప్రయోగాలు యిప్పటికీ పరిశీలనకు నోచుకోకపోవడం వల్ల ప్రాదేశికవాదం వ్యాకరణాలను అనుమాన దృష్టితో పరిశీలించే పరిస్థితి ఏర్పడింది.

వ్యాకరణశాస్త్రం ఆవిర్భావం ఎలా జరిగిందో పరిశీలించడం వల్ల ఎంతో ఉపయోగం వుంది. వేద పఠనం, మంత్రపఠనం పవిత్రమైనవీ, దివ్యమైనవీ అన్న అధిభౌతిక భావన వుంది. వాటి ఉచ్చారణలోనూ, యజ్ఞాల నిర్వహణలోనూ తప్పు జరిగితే ప్రమాదం. అది ఉచ్చరించిన వారి మీదే ప్రతికూలంగా పని చేసే అవకాశం ఉందని భయం వుండేది. ఆ అవసరం నుంచి ఆరు వేదాంగాలు రూపొందాయి. అవిః శిక్ష, జ్యోతిషము, కల్పము, నిరుక్తము, ఛందస్సు, వ్యాకరణము. ”వ్యాక్రియతే అనేనేతి వ్యాకరణమ్‌ -దీనిచే శబ్దములు వ్యాకరింపబడును. ప్రకృతి, ధాతు, ప్రత్యయ ­భాగము నిరూపింపబడును. శబ్ద స్వరూపము స్పష్టపరుచబడును” (రామచంద్రుడు 1974: X) అని ఆచార్య పుల్లెల రామచంద్రుడు వివరించారు. వేదాలు, మంత్రాలు ఉచ్చరించే సమయంలో తప్పు దొర్లకుండా సంస్కృత శబ్ద స్వరూపం, ధాతు, ప్రత్యయం, విభక్తి వంటివి తెలుసుకోవడం అవసరం. అంటే ఒక నిర్దేశిత ఉచ్చారణ లేదా ప్రామాణిక ఉచ్చారణ అన్నది ఏర్పడడానికి వ్యాకరణం ఉద్భవించింది. అదే శిష్ట వ్యవహారంగా ఆ తరువాత పరిణామం చెందింది. సంస్కృత వ్యాకరణకర్తలు భాషకు పరిణామ స్వభావం వుంటుందని అంగీకరించారు. పాణిని నుంచి వరరుచి వరకు జరిగిన భాషా పరిణామాన్ని పతంజలి పరిగణించాడు. ఆ తరువాత వచ్చిన చాలా మంది వైయ్యాకరణులు భాషలో నిరంతరం సంభవించే మార్పుల్ని పరిశీలనకు స్వీకరించారు. బాలవ్యాకరణ కర్త దృష్టిలో మాత్రం భాష స్థిరమైంది. కవిత్రయం వారి భాషాయనకు ప్రమాణం. అందుకు భిన్నమైన ప్రయోగాలు ఆయన దృష్టిలో దోషాలు. ప్రామాణిక భాషపట్ల కూడా ఆయనకు ఆదరణ వుండేది కాదు. అది కేవలం గ్రామ్యము. అంటే గ్రామీణ వ్యవహారమని అర్థం.

వ్యాకరణం శ్రీశ్రీ మాటల్లో చెప్పాలంటే ట్రాఫిక్‌ పోలీస్‌ వంటిది. ట్రాఫిక్‌ పోలిసింగ్‌ లాంటిదే భాషా పోలీసింగ్‌. ఒక సారి పోలీసింగ్‌ ఆరంభమైనదీ అంటే అది అన్నింటిని నియంత్రించడమే కాదు సెన్సార్‌ కూడా చేస్తుంది. అందుకే వ్యాకరణ సూత్రాల రచనకు ప్రాదేశిక భాషలు అనర్హం అన్న నిషేధాన్ని భాషా పర్యవేక్షణ (లింగ్విస్టిక్‌ పోలీసింగ్‌) చేస్తూ వచ్చింది. అది ఉచ్చారణ సరిదిద్దడమన్న సదాశయంతో మొదలై ప్రాదేశిక యాసల్ని రద్దు చేసే దిశగా పయనించింది. యాస కూడా భాషే అన్న కాళోజి నిర్వచనం వ్యాకరణశాస్త్రం యొక్క ఎజెండాకు వ్యతిరేకమైంది. అయినా వ్యాకరణ రాజకీయాలు పరిశీలించాలంటే ఈ కింది శ్లోకం చూద్దాం.

యద్యపి బహు నాధీషే
తథాపి పఠ పుత్ర వ్యాకరణమ్‌
స్వజనః శ్వజనో మాభూత్‌
సకలం శకలం సకృత్‌ శకృత్‌
అన్న సంస్కృత శ్లోకం కూడా ఉచ్చారణ ప్రాధాన్యతను బోధిస్తుంది. దీని గురించి ఆచార్య రవ్వా శ్రీహరి ” వ్యాకరణం చదవకపోతే శబ్ద స్వరూపం సరిగా తెలియదనీ, అందువల్ల ఉచ్చారణాదుల్లో పొరపాట్లు చేసే అవకాశముందనీ అలాంటి పొరపాట్లు చేయకుండా ఉండడానికి ప్రతి విద్యార్థీ తప్పకుండా వ్యాకరణం చదవాలనీ దీనిసారాంశం” (శ్రీహరి 1996: XI) అని వివరించారు. ఉచ్చారణలో క్రమశిక్షణను ఈ శ్లోకం సంకేతిస్తుంది. అయితే ప్రామాణిక వ్యవహారాన్ని కూడా అది నిర్బంధం చేస్తుంది. ప్రాదేశిక భాషలలో కొన్ని వర్ణాలు, ద్వనులు వుండవు. ఉదాహరణకు తెలంగాణ భాషలో ‘ల’ మాత్రమే వుంటుంది. ‘ళ’ వుండదు. ‘ఎవరు! రా?’ అన్న ప్రామాణిక వాక్యాన్ని తెలంగాణలో ‘ఎవల్లుల్లా?’ అంటారు. దీనికి పదమధ్యమంలోనూ పదాంతంలోనూ రకారం లకారంగా మారడం తెలంగాణలో కనిపిస్తుంది. ప్రామణిక వ్యవహారమే సరైనదని విశ్వసిస్తే తెలంగాణ ఉచ్చారణలన్నీ తప్పులుగా తోస్తాయి. ఆకారణంగా తెలంగాణ ఉచ్చారణను తరగతి గదుల్లో సరిదిద్దే కార్యక్రమం మొదలైంది. తెలంగాణ విద్యార్థులు క్రమంగా మాతృభాష ఉచ్చారణను పరిత్యజించి ఆంధ్ర ఉచ్చారణను అలవర్చుకొన్నారు. యిది వ్యాకరణ రాజకీయాల ఫలితాలలో ఒకటి.

చారిత్రకంగా పరిశీలిస్తే ఉచ్చారణ స్పష్టత వల్ల బహుళ ప్రయోజనం వుంది. వేదాలు పొరపాటుగా ఉచ్చరించ కూడదన్న దైవిక భావన ప్రాధమికం. అది పారమార్ధిక ప్రయోజనం. లౌకిక ప్రయోజనాలు అనేకం వున్నాయి. ఉచ్చారణ ప్రాధాన్యత, భాష మీద సాధికారికత ప్రాచ్య పాశ్చ్య దేశాలలో చారిత్రక పాత్ర పోషించింది. అందమైన, స్పష్టమైన ఉచ్చారణ కులీన వర్గాల ఆదరణకు కారణమైంది. వేద మంత్రాలు, సంస్కృతం అధ్యయనం చేసిన వ్యక్తి ఉచ్చారణ విశిష్టమైంది. అది పాలకులను పాలితులను మంత్ర ముగ్దుల్ని చేస్తుంది. ఉచ్చారణ విశిష్టత, భాష మీద సాధికారికత ద్వారా కులీన వర్గాల ఆదరణ పొందవచ్చని మధ్య యుగాల కాలం నాటి బ్రిటన్లు విశ్వసించేవారు. ఆధునిక కాలంలో ఇంగ్లీషు మీద ప్రభుత సాధించి ఉన్నతావకాశాలు పొందవచ్చని అమెరికాలోని మధ్యతరగతి పంథొమ్మిదో శతాబ్దంలో నమ్మేవారని కర్ల్‌ డబ్ల్యూ. డికేమా వివరించారు. అందుకే వ్యాకరణం పాఠ్యాంశాల్లో విధిగా చేర్చాలన్న డిమాండు ఆ సమాజాల్లో వుండేది. ప్రధానంగా మధ్యతరగతి ఆవిర్భావం వ్యాకరణం వికసించడానికి ఇంగ్లీషు భాషా సమాజాల్లో కారణమైంది. వారికి వ్యాకరణం ఒక అభివృద్ధి సాధనమైంది.

భాష కేవలం భావ వ్యక్తీకరణ సాధనమే కాదు. అది అణచివేత సాధనం కూడా అన్న ఎరుక ఆధునికానంతరవాదం అందించింది. అయితే అది ఆధిపత్య సాధనమే కాదు ఊర్ధ్వముఖ చలనానికి కూడా తోడ్పడుతుందని యూరోపియన్లు, భారతీయులు గుర్తించారు. అందుకే సంస్కృతం విముక్తి (మోక్షం) కలిగిస్తుందని విశ్వసించిన వారే దాన్ని యితరులు చదవకుండా నిషేదించారు. అందువల్ల భాష కేవలం భావవ్యక్తీకరణ మాధ్యమం అన్న నిర్వచనం నిర్వికల్ప భావన మాత్రమే. అయితే సంస్కృతం, ప్రాకృతం వంటి భాషల్లో ప్రభుత కలిగివుండడం పాలకుల ఆశ్రయం పొందడానికి ఉపయోగపడడం చరిత్రలో మనం ఎరుగుదుము. గ్రాంధికంలో రాయని, మాట్లాడని వారిని చిన్నచూపు చూడడం మన సారస్వతంలో నమోదైవుంది. గ్రాంధికమే కావ్య భాషని నమ్మినవారూ వున్నారు. నమ్మకం విశ్వాసంగా కూడా మారిందని డికేమా అమెరికన్ల నుద్దేశించి చేసిన వ్యాఖ్య మనకూ వర్తిస్తుంది. నేడు మన సమాజంలో ఇంగ్లీషు వస్తే సదావకాశాలు ఉపలబ్దం అవుతాయని అనుకుంటున్న వాస్తవం వుంది. వ్యాకరణంలోనూ సంస్కృతంలోనూ పట్టుసాధించని వారికి విద్యారంగంలో ఎటువంటి అగౌరవం అనుభవమౌతుందో అందరికీ ఎరుకే.

తెలుగులో చిన్నయసూరి వ్యాకరణం రాయడానికి కూడా యిలాంటి ఒక చారిత్రక కారణం వుంది. వైయ్యాకరణుడు, లాక్షణికుడు, కవి, అనువాదకుడు అయిన చిన్నయసూరి బాలవ్యాకరణం రాయడానికి ముందు తెలుగులో వ్యాకరణాలు వున్నప్పటికీ అవి సమగ్రమైనవి కావు. చిన్నయ సూరి కవిత్రయం వారి ప్రయోగాలను పరిశీలించి సంస్కృత వ్యాకరణాల వెలుగులో సూత్రరచన చేశారు. బాలవ్యాకరణం ఉద్దేశం కావ్య భాష పరిశీలన, కావ్యపఠనంలో పొరపాట్లు జరగకుండా చూడడం వరకే. ఉచ్చారణ పొరపాట్ల పట్ల బాలవ్యాకరణానికి ఆసక్తి లేదు. అప్పటికే సంస్కృత భాషాపఠనం వల్ల కొన్ని వర్గాలు తెలుగు సాహిత్య సాంస్కృతిక సమాజం మీద ఆధిపత్యం వహించి వున్నాయి. చిన్నయసూరికి సంస్కృత వ్యాకరణం ఎంత ప్రేరణ కలిగించాయో ఆంగ్లేయుల పాలనలో ఇంగ్లీషు ప్రభావం అంతే కీలకంగా ఆయన మీద పని చేసింది. ఇంగ్లీషు చదివిన వారికి విశేష గౌరవం, అపారమైన ఉద్యోగావకాశాలు దొరుకడం వారి అనుభవంలో వుంది. సంస్కృతం, తెలుగు చదివన వారికి కూడా అవకాశాలున్నాయి. అయితే మద్రాసు ప్రెసిడెన్సీలోని మద్రాసు యూనివర్శిటిలో ఇంగ్లీషు బోధనామాధ్యమంగా వుండేది. తెలుగు బోధించడానికి అనువైన భాష ఏదీ అన్న చర్చ నుంచే గ్రాంధిక వ్యవహారిక భాషా సంఘర్షణ ఆవిర్భవించింది.

సూరి కావ్య భాషకు రాసిన వ్యాకరణం ఆ తరువాత బోధనారంగంలో తిరుగులేని ఆధిక్యతను సాధించింది. వ్యాకరణం అధ్యయనం మధ్యతరగతి బ్రాహ్మణుల్ని విశేషంగా ఆకర్షించింది. కావ్య రచన చేయని వారికి పండితులుగా గుర్తింపు లేని కాలమది. ప్రతివ్యక్తి విద్యాసంపన్నుడు అని గుర్తించబడాలంటే వ్యాకరణం, ఛందస్సు తప్పని సరి. అందువల్ల, కావ్య రచనలో వ్యాకరణ దోషాలు లేకుండా వుండడానికి, గణబద్దంగా కవిత్వం చెప్పడానికి వ్యాకరణం, ఛందస్సు అనివార్యమైనవి. ఆంగ్లవిద్య గడించి ఉన్నతావకాశాలు పొందగలిగే అవకాశం వున్నప్పటికీ అందుకు తగినన్ని కళాశాలలు, బడులు ఉండేవి కావు. 1857 తరువాత మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీల్లో తక్కువ సంఖ్యలో పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేశారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో మద్రాసు ప్రెసిడెన్సీలో తెలుగు పాఠశాలలు మున్సిపాలిటీ స్థాయిలో ఆవిర్భవించాయి. వాటిలో స్థానిక భాషల్లోనే విద్యాబోధన జరిగేది. అందువల్ల మధ్యతరగతి నుంచి విద్యావంతులుగా ఎదిగినవారు ఆ సంస్థల్లో అధ్యాపకులుగా చేరడానికి ఆసక్తి కనబరిచేవారు. వాటిలో నియుక్తం కావడానికి సంస్కృత భాషా సాహిత్యాలు నేర్చుకొని వుండడం అర్హత. అందువల్ల చిన్నయసూరి బాల వ్యాకరణం విద్యారంగంలో ఆధికార స్థానం పొందింది. రామాయణం, భారతం, పురాణాలు వంటి వాటిల్లో ప్రవేశం వుండడమొక్కటే సరిపోయేది కాదు. వ్యాకరణం సమగ్రంగా తెలిసినవారినే పండితుడని గౌరవించేవారు.

తెలంగాణ భాషా వ్యవహర్తలకు బాలవ్యాకరణం అధ్యయనం చేయడం ద్వారా లేదా తెలుగు అధ్యయనం చేయడం వల్ల రాజ్యం ద్వారా ప్రయోజనం ఒకనగూర లేదు. తెలంగాణా హైదరాబాదు రాజ్యంలో వుండేది. యిక్కడ ఉర్దూ మాధ్యమిక భాష. పాఠశాలలు, కళాశాలలు అన్నీ ఉర్దూ మాధ్యమంతో నడిచేవి. యిక్కడి ప్రజల భాష తెలంగాణ. అయితే తెలంగాణ మీద ఉర్దూ, పార్శీ, మరాఠీ భాషల ప్రభావం వుంది. అధ్యయన భాషగా ఆంధ్ర భాషను తెలుగు భాష పేరుతో స్వీకరించడానికి గొప్ప పోరాటం చేయాల్సి వచ్చింది. గ్రంథాలయోద్యమం అందులో కీలకమైంది. గురజాడ, గిడుగులు వ్యవహారిక భాషోద్యమం సాగిస్తున్న కాలంలో కూడా ఈ ప్రాంతంలో ఉర్దూ అధికార భాష. అధ్యయన భాషకూడా. అందువల్ల భాషోద్యమం రాజ్య వ్యతిరేక పోరాట రూపంలో 1940 తరువాత గానీ రాలేదు. వ్యవహారిక భాషోద్యమం, గ్రాంధిక భాషోద్యమం వల్ల లబ్దిపొందింది మద్రాసు ప్రెసిడెన్సీలోని కోస్తాంధ్రులే. తెలంగాణవారికి వాటివల్ల కలిగిన ప్రయోజనం స్వల్పం.

తెలంగాణ ప్రాంతంలోని ఆధునిక కవులకు సంస్కృతంతో అనుబంధం ఉంది. అందువల్ల తెలంగాణ ప్రాంతంలోని బ్రాహ్మణులు, యితర అగ్రవర్ణాలు రాయలసీమ (ఆంధ్రలో భాగం)లోనూ ఆంధ్రలోనూ మద్రాసులోనూ చదువుకునేవారు. వారే కవిత్వం రాసేవారు. గోలకొండ కవుల సంచిక అందుకు ప్రబల ఉదాహరణ. తెలుగు భాష, కావ్యభాష రెండూ కోస్తాంధ్రా సాహిత్యకారుల వికాసానికి ఎంతో తోడ్పడ్డాయి. ఆ ప్రాంతవాసులు సాంస్కృతికంగా ఆధికులై విరాట్‌ రూపం ప్రదర్శిస్తున్న కాలంలో తెలుగు కోసం తెలంగాణవాసులు పోరాటం చేయాల్సి వచ్చింది.

ఆంధ్ర రాష్ట్రం అవతరించిన తరువాత తెలుగు విద్యారంగంలో వ్యాకరణం మరింత ఆధిక్యత సాధించింది. వ్యాకరణం ప్రామాణిక భాషను తెలంగాణ మీద రుద్దింది. విద్యార్థులకు ఉదాహరణలుగా బోధించిన అనేక శబ్దరూపాలు తెలంగాణా వాసులకు అపరిచితమైనవి. తెలంగాణ విద్యార్థులు మాతృభాషను కొల్పోవడానికి ఉచ్చారణను సరిదిద్దే కర్తవ్యం వ్యాకరణకర్తలు స్వీకరించడం ఒక కారణం.

వ్యాకరణ గ్రంథాలు ఆంధ్ర ప్రాంతంలోని రెండు జిల్లాల వ్యవహారానికి రూపసాధన చేసి చూపించాయి. రెండు మండలాల వారి భాషకు సూత్ర రచన జరిగింది. యితర ప్రాదేశిక భాషలకు సూత్ర రచన జరగలేదు. దానిక కారణాలు రెండుః ఒకటి ప్రాదేశిక వ్యవహారాలను మాండలికాలని నిమ్నీకరించడం. రెండు, ఆయా ప్రాంతాల నుంచి వైయ్యాకరణులు లేకపోవడం, వున్నా వారికి సంస్కృత వ్యాకరణం మీద తప్ప మిగతా వాటి మీద గౌరవం లేకపోవడం. ప్రధాన స్రవంతి వ్యాకరణాలు ప్రాదేశిక శబ్దరూపాలను వ్యాకరణ బాహ్యాలుగానూ కొన్ని అపవాదులకు నిదర్శనాలుగానూ వినియోగించుకుంది. వ్యాకరణ గౌరవం వాటికి దక్కకపోవడం రాజకీయ క్రమంలో ఒక భాగమని అంటే అభ్యంతర పెట్టక్కర్లేదు.

వ్యాకరణం నేర్చుకోవడం అంటే భాషను గురించిన విశేషాలను నేర్చుకోవడమని అర్థం. వ్యవహర్త తన సొంత భాష గురించి నేర్చుకోవడానికి వ్యాకరణం తోడ్పడాలి. ప్రాదేశిక భాషా వ్యవహర్తలకు మాత్రం వ్యాకరణం ఆ విధంగా సహకరించడం లేదు. అందుకు అది పరాయి భాషకు సంబంధించింది కావడమే. ప్రాదేశిక భాషల శబ్దస్వరూపం, ధాతు, ప్రత్యయ విభజన, నియమం, రూఢీ, వ్యవహారం, జాతీయాలు ప్రత్యేకమైనవీ ప్రామాణిక భాషకూ కావ్యభాషకూ సంపూర్ణంగా విభిన్నమైనవి కావడం వల్లనే ప్రాదేశిక భాషా సాహిత్యాల అర్థం ప్రామాణిక భాషావ్యవహర్తలకు బోధపడడం లేదు. ఉత్తరాంధ్ర భాషలో వున్న సాహిత్యం యితర భాషావ్యవహర్తలకు అర్థం కాకపోవడానికి ఉచ్చారణ భేదం ఒక్కటే కారణం కాదు. రాయలసీమ భాషలో వున్న ‘మాదిగోడు’ కతలు కూడా యితర భాషా వ్యవహర్తలకు అర్థం కాలేదు. అదే విధంగా తెలంగాణా భాషలో వున్న ‘కక్క’, ‘సిద్ధి’ ‘సూర’, ‘పురుడు’ వంటి నవలలు యితర భాషా వ్యవహర్తలకు అర్థం కాకపోవడానికి ఉచ్చారణ, యాస ఒక్కటే హేతువు కాదు. ప్రాదేశిక భాషల స్వరూప స్వభావాల్ని వివరించే విస్తృతి వ్యాకరణం సాధించకపోవడమే వ్యాకరణశాస్త్రం పరిమితి.

సమాజమూ, భాష నిరంతరం చలనంలో వుంటాయనీ, అందుకు అనుగుణంగా వాటి పరిశీలనా పద్ధతులు కూడా మారాలని తెలంగాణా ప్రాదేశికవాదం కోరుతుంది. ప్రామాణిక భాషను సైతం గ్రామ్యమని చిన్నబుచ్చే బాలవ్యాకరణం తెలంగాణ భాషకు తావివ్వదని గుర్తిస్తూ వ్యాకరణం యొక్క సర్వాధిపత్యాన్ని నిరాకరిస్తుంది. ప్రాదేశిక భాషలకు బాల వ్యాకరణం స్థాయిలో ఆధునిక వ్యాకరణ సూత్రరచన చేయడానికి వ్యాకరణాలను పునస్సమీక్షించడం అవసరమని గుర్తిస్తుంది. భాషాశాస్త్రం కూడా ప్రాదేశిక భాషల పట్ల తగినంత శ్రద్ధ కనబరచలేదన్నది గుర్తిస్తూనే వ్యాకరణశాస్త్రాన్ని విస్తరింప చేసుకోవడం ద్వారా మాత్రమే ప్రాదేశిక భాషాశాస్త్రాల్ని అభివృద్ధి చేసుకోగలమని, తద్వారా భాషా స్వరూపాన్ని మరింత సమగ్రంగా తెలుసుకోవడం వీలవుతుందని ప్రాదేశిక వాదం బలంగా విశ్వసిస్తోంది.

ఉపయుక్త గ్రంథాలుః
1. రామచంద్రుడు పుల్లేల (అను) (1996) ముందుమాట వాక్యపదీయం, ప్రథమ భాగం, హైదరాబాదు; తెలుగు అకాడమీ
2. గోపాలకృష్ణమూర్తి బూరుగల (1996) వ్యాకరణాదర్శము హైదరాబాదు నీల్‌కమల్‌ పబ్లికేషన్స్‌
3. Dykema Karl W. (1944) ‘Do We Need to Teach Grammar’, The School
Review, Vol.52, No.8 (Oct, pp 470-476)

(‘తెలుగు వ్యాకరణములు – పునస్సమీక్ష’ అన్న అంశం మీద హైదరాబాదు విశ్వవిద్యాలయం నిర్వహించిన జాతీయ సదస్సు (సెప్టెంబరు, 2007) లో సమర్పించిన పత్రం.)

6 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

6 Responses to “నిర్దేశాత్మక వ్యాకరణం – ప్రాదేశిక భాషలు”

  1. 1
    Rakesh Says:

    రవన్నా, శ్రీనన్నా నమస్తే.
    చాన మంచి topic గురించి రాస్తున్నరు!

    తెలంగాణ భాష అనేది ప్రత్యేకమైన భాష అని చెప్పుకొనేందుకు ఎన్నో ఆధారాలున్నై.
    కర్ణాటక రాష్ట్రంలసూత ఎన్నో భాషలున్నై. కానీ ఎక్కడికక్కడ వాండ్ల వాండ్ల భాషాసాంస్కృతుల పరిరక్షణ ఉన్నదిగన్కనే భాషలు స్వల్పతేడాలున్నా ఒక్కకాణ్ణే ఉన్నరు.
    తుళు, హవ్యక, కొంకణి, మాడీ వగైరాలు. ఐతే, లిపి అందరికి లేదు. చాలా భాషలను కన్నడ లిపిలల్లనే రాస్కుంటండ్రు.
    ఇగమరి ఒక్క భాషనే కాక, ఒక్క లిపివాడేటోల్లు వేర్వేరు రాష్ట్రాలల్ల ఉంటాండ్రు.
    అట్లనే, మల్ల హిందీభాష లిపిలనే కనీసం అయిదారు రాష్ట్రాలల్ల ఉండేటోల్లు వాల్ల వాల్ల భాషలను రాస్కుంటుండ్రు.
    మరాఠీ భాష లిపి చూస్తె అచ్చం హిందే. కాని ఒకట్రెండు అక్షరాలు (ళ, ఱ) హిందీల లెవ్వు.

    అసలు history తెలిసినోల్లకు తెల్సినమాట ఏందంటే, తెలంగాణరాజ్యంల తెలంగాణభాష ఎప్పటిసందో అధికారభాషే…….
    ఆంధ్రోల్లు మద్రాసుల ఉన్నప్పుడే ఈప్రాంతపోల్లెందరో దేశవ్యాప్తంగా పేరుగాంచిండ్రు.
    మాకుతెలిసిన శానమంది బొంబై, గ్వాలియర్, పూనా, బరోడా, ఇందోర్ సంస్థానాలల్ల ఆస్థానవైద్యులుగా, నేతగాండ్లుగా, వంటవాళ్ళుగా, పురోహితులుగా స్థిరపడి ఎన్నోతరాలైంది.
    వాల్లందరి ఇంటిపేరు ఒక్కటే…….. అదే… “తేలంగ్” లేదా “తేలంగి”.
    you can serch “orkut.com” or google to locate lacs of TELANG people spread across the country & world!!

    మరి వాల్లభాషకు “ప్రత్యేక” భాషగా గుర్తింపు “ప్రత్యేక తెలంగాణ” రాష్ట్రమైతేగాని రాదా ఏంది??

    మన దేశంలనే అధికారికంగ తమకొక “భాష” అన్న గుర్తింపు పొందిన తెగలవారు, ప్రాంతాలవారు చాన ఉన్నరు. మీకొక web-site లింకు ఇస్తున్న.
    http://www.languageshome.com

    ఇక్కడ మీరు భారతీయ భాషల గురించి తెల్సుకోవచ్చు.

    ఐతే,గమనించాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఒకటున్నది.
    “ANGIKA AWADHI BAGELKHANDI BHOJPURI BISHNUPRIYA BUNDELKHANDI MAITHILI MARWADI”
    ఇవ్వన్నీ రాష్ట్రమేలేని ఎన్నో భాషలు.
    ఐతే, వాటికీ అవి మాట్లాడే వాళ్ళున్నరాష్ట్రపు భాషకూ పెద్ద తేడా లేదన్నదీ చూడాచ్చు.
    కొంకణీ, మరాఠీ భాషలలోని ఎన్నో పదాలు, వాటి ఉచ్చారణా దాదాపు ఒక్కతీర్గనే ఉంటయి. కాని, దేనికదె భాషగా గుర్తింపున్నది.

    కనుక తెలంగాణ ప్రాంతపు భాష కూడా “ప్రత్యేక” మైనదని తెలియజేయాలంటే -తెలంగాణ ప్రాంతపు భాషలో ఒక అర్థాన్ని communicate చేసేందుకు popular గ వాడుతున్న ఒక పదానికి, ఆంధ్రలో అదే అర్థాన్ని communicate చేసేందుకు popular గ వాడుతున్న పదానికి గల తేడాలను సామ్యాలను గుర్తిస్తూ పోవాలె.

    అట్లనే -
    ఒకే పదం రెండు జాగలల్ల విభిన్న అర్థాలనిస్తె అవిగూడ సేకరించాలె.(విపరీత / విపత్కర అర్థాలుగూడ ఉన్నయి)
    ఉదాహరణకు:
    ఆంధ్రవాల్లకు “జెల్ల” నిస్తమంటె, తెలంగాణ వాల్లకు “ఠోంగు” ఇచ్చినట్టు
    తెలంగాణోనికి జెల్లలిస్తె, కమ్మగ పులుసొండుకోడా?
    మా పిల్లగాడు టేబుల్ “దొబ్బు”మంటె(నూకుడు), వాని దోస్తులు నవ్విండ్రట.
    వాల్లకు దొబ్బుడంటె, ఎత్తుకచ్చుడట!
    మరదే ఆంధ్ర పిల్లగాడో, పిల్లనో మనోల్లతో, “మీ బుల్లి ఫోటో బావుంది” అన్నా, “నాకు ఈ హీరో పిచ్చ ఇష్టం” అన్నా,మరి మనోల్లు ఏమంటరు?
    “దెంకపోవుడు” అన్నపదాన్ని తెలంగాణలో “పారిపోవుడు” అన్నఅర్థానికి వాడ్తరు.
    గట్నే పల్లెల్లో examination pad లను పరీక్ష వట్టలు (అట్ట కు గ్రామ్యం) అంటారు.
    అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ వాడితె ఎన్ని తిప్పలు మరె.

  2. 2
    GurramSeetaramulu Says:

    చాలా మంచి వ్యాసం రాసారు. జిలుకరకు అభినందనలు, రవీ నీకు కూడా.
    ప్రాణహితకు ధన్యవాదాలు.

  3. 3
    venkatesh Says:

    కొత్త ప్రతిపాదన తెచ్చిన రచయితలకు నమస్కారములు.కాని తెలంగాణ కు ప్రత్యెక వ్యాకరణం ఉండాలన్న ఆశ అంతా సబబు కాదెమొ!

  4. 4
    chavakiran Says:

    వెంకటేష్ గారూ,

    ఇలా ఊరికే సబబు కాదు అంటే ఎలా?

    ఎందుకు సబబు కాదో కూడా చెప్పాలి కదా!

  5. 5
    Rakesh Says:

    ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదితెలంగాణప్రజలు సంభాషించేటప్పుడు వాడుతున్న పదాలు, అవి వాక్యాలుగా మారుతున్న విధానం (వాక్యనిర్మాణం) ఏ పద్ధతుల్లో సాగుతున్నదో దాని గురించి చర్చిద్దాం.
    అదే మన తొలి అడుగుగా, ఈ project ను ముందటికి తీసుకపోదాం!!

  6. 6
    Rakesh Says:

    తెలంగాణ వ్యాకరణ పద్ధతులను అవగతం చేసుకునేందుకు ఒక్కొక్కటిగా ప్రయత్నించుదాం.
    1. వ్యావహారికంగా మాట్లాడే మాటలు / పద్ధతులు
    2. తెలంగాణప్రాంత రచయితలు “ఆంధ్రరాష్ట్రావతరణ”కు పూర్వం చేసిన రచనలల్లో వాడిన పదాలు / వాక్యాలు
    3. కేవలం తెలంగాణవాసులకే అర్థమయ్యే పదాలు / వాక్యాలు……

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో