అక్టోబర్2007
అక్టోబర్ 2007 : సంపాదకీయం

చిత్రం: ఏలే లక్ష్మణ్
నిజమే ! ఒక సంఘటన జరిగినప్పుడు ‘మా నిషాదం కావ్యం’ లా, వ్యక్తీకరించిందంతా గొప్ప కవిత్వం కాక పోవచ్చు. అది కల కాలం నిలబడక పోవచ్చు! కానీ కవి స్పందన ముఖ్యం. గాయపడి జ్వలించిన కవి హృదయం వ్యక్తం చేస్తున్న కవిత్వం వెనుక దన్నుగా ఉన్న మానవీయ విలువ ముఖ్యం. కవి వ్యక్తం చేసే ధర్మాగ్రహం పాతుకుపోతున్న అమానవీయ విలువలను ధిక్కరిస్తుంది. ఆ ధిక్కారం ముఖ్యం. ఒక కొత్త విలువ ప్రతిపాదన చాలా సార్లు ముందు ధిక్కారం తోనే ప్రారంభమవుతుంది. అటువంటి ధిక్కారానికి ప్రాణహిత స్వాగతం పలుకుతున్నది. ఈ సంచికలో అన్యాయం పట్ల ధిక్కారాన్ని అనేక రూపాల్లో వ్యక్తం చేసే తెలుగు సాహిత్యాన్ని మీ కందిస్తున్నాం. తెలుగు సమాజంలో జరుగుతున్న అనేకానేక సంఘటనల పట్ల స్పందనలని, ధర్మాగ్రహాన్ని, వ్యక్తం చేసే రచనలని మీ ముందుకు తెస్తున్నాం. స్కైబాబ ‘నల్ల గొర్రె’ కవితలో సంప్రదాయాల్ని ధిక్కరించి నూతన మార్గాల్ని అన్వేషించడాన్ని చెబుతారు. సెల్ ఫోన్ ప్రపంచీకరణ సామాజిక మానవ సంబంధాలని ఎట్లా మార్చిందో బండ్ల మాధవరావు కవిత ‘గుప్పిట్లో భూగోళం’ చిత్రిస్తుంది. దళిత గోవిందం డొల్ల తనాన్ని లివింగ్ స్టన్ కవిత ‘విముక్తి గీతం’ బయటపెడితే, మృత్యునగరంగా మారిన హైదరా‘బాధ’ ను కె.గీత ‘సజీవ వీడ్కోలు’ వ్యక్తం చేస్తుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మారుతున్న విలువలని, క్షీణిస్తున్న సామాజిక దృశ్యాన్ని మన ముందుంచుతుంది తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ కవిత ‘బతుకొక ఎర్ర దీపం’. అరవై ఏళ్ళుగా అస్తిత్వం కోసం పెనుగులాడుతున్న తెలంగాణ ను అన్నవరం దేవేదందర్ తన ‘పెనుగులాట’ కవితలో ప్రకటిస్తే, పండగకి ఇంటికొచ్చిన అక్కను తెలంగాణ బతుకమ్మనూ కళ్ళకు కట్టినట్టు చిత్రిస్తారు రత్నాకర్ తన ‘నడిచే మోదుగుచెట్టు’ తో! జీవితానికి ‘సొంతిల్లు’ ఇచ్చే తాత్వికతను హృద్యంగా పట్టుకున్న ముకుంద రామారావు కవిత కూడా ఈ సంచికలో చదవండి.
ఈ సారి మీకు తెలుగు కథ సాధించిన అపురూపమైన వైవిధ్యాన్ని నాలుగు కథల ద్వారా ప్రాణహిత సగర్వంగా అందిస్తున్నది. ఒక అట్టడుగు వర్గానికి చెందిన మహిళ మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో గ్రామ సర్పంచ్ అయితే ఎదుర్కునే వివక్ష స్వరూప స్వభావాలని జూపాక సుభద్ర కథ ‘కలమ్మ కలకలం’ చిత్రిస్తుంది. అట్టడుగు వర్గాల వాళ్ళు అక్కడక్కడా రాజకీయంగా పైకి వచ్చినా, మన సమాజాన్ని నియంత్రిస్తున్న రాజ్యాంగ యంత్రమూ, దాని ఆధిపత్య రాజకీయాలు వారిని ఎట్లా అణచివేస్తాయో చిత్రిస్తుందీ కథ. సమాచార విప్లవం మానవ సంబంధాల్లో, ముఖ్యంగా పెళ్ళి సంబంధాల విషయంలో ఎటువంటి చిత్రమైన మార్పులు తెస్తున్నదో కొండేపూడి నిర్మల గల్పిక ‘సమాచార విప్లవం‘ అద్భుతమయిన వ్యంగ్యంతో చిత్రిస్తుంది. తెలుగు నేలపైన పత్తి రైతులూ, చేనేత కార్మికులంత శాపగ్రస్తులు మరొకరు లేరనేది అన్ని ప్రభుత్వాల హయాముల్లోనూ అత్యంత ఎక్కువ సంఖ్యలో జరిగిన వారి ఆత్మహత్యలే చెప్పకనే చెపుతాయి. దళారీల రంపపు పళ్ళలో చిక్కుకున్న పత్తి రైతుల దయనీయమైన పరిస్థితులని ఏ. సువర్ణ రాసిన ‘తెల్ల కాకులు - నల్ల పత్తి’ అద్భుతంగా చిత్రిస్తుంది. 90 సంవత్సరాల తర్వాత కూడా సజీవంగా చర్చించబడుతున్న ‘మైదానం’ నేపథ్యంలో జి. వెంకటక్రిష్ణ రాసిన ‘అడుగుజాడలు’ స్త్రీ పురుష సంబంధాలని చలం గారి అడుగుజాడల్లో ముందుకు తీసికెళ్తుంది.
ప్రాణహిత ఈ సంచికలో మీ ముందుకు ఒక కొత్త ప్రతిపాదనని తెచ్చే వ్యాసాన్ని అందిస్తున్నాం. జిలుకర శ్రీనివాస్, పసునూరి రవీందర్ రాసిన ‘నిర్దేశాత్మక వ్యాకరణం – ప్రాదేశిక భాషలు’ అనే వ్యాసం ముఖ్యంగా మాండలికాలుగా పిలువబడుతున్న భాషలను ఒక కొత్త కోణంలో పరిశీలించి వాటిని ప్రాదేశిక భాషలుగా గుర్తించాలని, వాటిని ఒక కొత్త నిర్దేశాత్మక వ్యాకరణం వెలుగులో విశ్లేషించాలనీ ప్రతిపాదిస్తుంది. ఏ కొత్త ప్రతిపాదన అయినా విస్తృతంగానూ , ప్రజాస్వామికంగానూ చర్చించబడాలి. ఈ వ్యాసం మీద కూడా మంచి చర్చ విస్తృతంగా జరగాలని ప్రాణహిత ఆకాంక్షిస్తున్నది. ప్రఖ్యాత అమెరికన్ నవలా రచయిత జాక్ లండన్ ఆత్మ కథ గా పేర్కొనే ‘మార్టిన్ ఈడెన్’ నూరేళ్ళ కింద వెలువడింది. ఇప్పటికీ దాని ప్రాసంగికతను వివరించే ముక్తవరం పార్థసారథి గారి వ్యాసాన్ని మీకందిస్తున్నాం. ఇంకా గత సంచిక తరువాయి సుద్దాల అశోక్ తేజ ఇంటర్‌వ్యూ మలిభాగం, నెరూడా ఇంటర్‌వ్యూ తరువాయి భాగం, మమత అనువదిస్తున్న నేటివ్ అమెరికన్ల చరిత్ర అనువాదమూ, రోహిణి ప్రసాద్ వ్యాసం ‘సూక్ష్మజీవుల శక్తిసామర్థ్యాలు’ ఈ సంచికలో మీ కందిస్తున్నాం.
ఎప్పటిలాగే మీ అమూల్యమైన సలహాలతో సూచనలతో విమర్శతో మమ్మల్ని ఆదరించాలని మీ అభిప్రాయాలని మాతో పంచుకోవాలనీ మా సవినయ విన్నపం.