పారిస్ రివ్యూ – పాబ్లో నెరూడా ఇంటర్‌వ్యూ – 3

ప్ర: మీరు కార్లో ప్రయాణం చేస్తూ రాయడం చూసాను?

నె: నేనెక్కడ ఎప్పుడు రాయగలిగినా రాస్తాను. ఎల్లప్పుడూ రాస్తూ ఉంటాను.

ప్ర: మీరెప్పుడూ రచనలన్నీ చేత్తోనే రాస్తారా? లేదా టైపు యంత్రం వాడతారా?

నె: నేను ప్రమాదం లో నా వేలు విరగ్గొట్టుకుని టైపు యంత్రాన్ని కొన్ని నెలలు వాడలేక, మళ్ళీ చేత్తో రాసే నా యవ్వనపు రోజుల్లోని అలవాటు వైపు మళ్ళాను. తిరిగి నా వేలు బాగుపడి నేను టైపు చెయ్యగలిగినప్పుడు, నేను చేత్తో రాసిన కవిత్వమే గొప్ప సున్నితత్వంతోనూ, సునిశితత్వంతోనూ నిండి ఉందనీ, అత్యంత సృజనాత్మకంగానూ ఉన్నదనీ కనుక్కున్నాను. ఆ కవిత్వం ఎలా పడితే అలా మార్చడానికి వీలుగా మైశీలమైనదిగా ఉన్నట్టు అర్థమయింది. రాబర్ట్ గ్రేవ్స్ ఒక ఇంటర్వ్యూ లో ‘సరిగ్గా ఆలోచించాలంటే చుట్టూ యంత్ర సంబంధమైనవి, చేత్తో చేయబడనివి వీలయినంతగా లేకపోవడమే మంచిది.’ అంటాడు. కవిత్వం చేత్తోనే రాయాలని ఆయన అని ఉంటే బాగుండేది. టైపు యంత్రం నన్ను కవిత్వంతో ఒక లోతైన సన్నిహితత్వం నుండి దూరం చేసింది – మళ్ళీ నా చేయి నన్ను ఆ సన్నిహితత్వానికి దగ్గర చేసింది.

ప్ర: మీ పని గంటలేమిటి?

నె: నాకంటూ ఒక కాలసూచి లేదు. కానీ పొద్దుటే రాయడానికి ఇష్టపడతాన్నేను. అంటే ఇప్పుడు మీరు నన్ను ఇంటర్‌వ్యూ చేస్తూ మీ సమయం నా సమయం వృధా చేయక పోతే నేను రాసుకుంటూ ఉండే వాణ్ణి. నేను పగటి పూట పెద్దగా చదవను. నేను రోజంతా రాయడానికే ఇష్టపడతాను – కానీ తరచూ ఒక సంపూర్ణమైన ఆలోచన, భావం, వ్యక్తీకరణ – నాలోంచి పెను తుఫాను లా బయటపడి – దాన్ని మనకు అలవాటైన పురాతన బాషలో స్ఫూర్తి అనండి, ప్రేరణ అనండి – నన్ను పూర్తి సంతృప్తితో నిండిపోయేటట్టు, ఒక ప్రశాంతతతో నిండి పోయేటట్టు, అలసి పోయేటట్టు చేస్తుంది. ఇంక అంతే! నేనింక ముందుకు సాగలేను. నాకు నా బల్ల దగ్గర రోజంతా కూర్చోవడం ఇష్టం. అట్లే ఇంటికి సంబంధించి, రాజకీయాలకు సంబంధించి ప్రకృతికి సంబంధించి జీవితానికి సంబంధించి అనేక విషయాల్లోకి నేను ప్రవేశిస్తాను. నేను నిరంతరం లోపలికీ బయటికి ప్రయాణిస్తూనే ఉంటాను. ఎక్కడున్నా ఎప్పుడైనా నేను ఒక గొప్ప ఉద్వేగంతో, తీవ్రతతో రాసే ప్రయత్నం చేస్తాను. నా చుట్టూ చాలా మంది ఉన్నా నాకు పెద్ద ఇబ్బంది ఉండదు.

ప్ర: అంటే మీరు మీ పరిసరాల్నుండి పూర్తిగా విడిపోతారా?

నె: అవును. నన్ను నేను నా పరిసరాల్నుండి విడి పోతాను, అంతా నిశ్శబ్దం – కానీ అదే కొన్ని సార్లు నన్ను కదిలిస్తుంది.

ప్ర: మీరెప్పుడూ వచనానికి పెద్ద ప్రాముఖ్యత ఇచ్చినట్టు కనపడదు.

నె: వచనమా! నేనెప్పుడూ, నా జీవితాంతం కవిత్వం రాసే అవసరాన్నే గుర్తించాను. ఒక రకమైన భావాలని వ్యక్తీకరించడానికే వచనం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కథనంగా చెప్పదల్చుకున్నప్పుడు వచనం బాగుంటుంది. నిజానికి నేను పూర్తిగా వచనం రాయడం మానివేయగలను. అప్పుడప్పుడు మాత్రం రాస్తాను.

ప్ర: మీ రచనలని అగ్ని ప్రమాదం నుండి కాపాడాల్సి వస్తే వేటిని ముందు కాపాడుతారు?

నె: బహుశా వేటినీ కాదేమో? నాకేమి అవసరం అవి? వీలయితే ఒక అమ్మాయిని కాపాడుతాను. లేదా మంచి నేర పరిశోధక కథల సంపుటిని కాపాడుతాను. నా రచనల కంటే అవి ఎక్కువ వినోదాన్నిస్తాయి కదా!

ప్ర: ఏ విమర్శకులు మీ రచనలని బాగా అర్థం చేసుకున్నారు?

నె: ఆహా! నా విమర్శకులా! వాళ్ళు నన్ను గొప్ప ప్రేమతోనో ద్వేషంతోనో ముక్కల కింద తరిగేసారు! జీవితంలోనూ, కళలోనూ అందరినీ సంతోషపెట్టలేము కదా! బహుశా ఈ పరిస్థితి అందరికీ ఉంటుంది. చెంపదెబ్బలొక వైపు, ముద్దులొక వైపు, తన్నులొక వైపు బుజ్జగింపులొక వైపు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. బహుశా కవి జీవితమే అంతే నేమో? అది నేనర్థం చేసుకోగలను. కానీ నన్ను అమితంగా బాధించేదేమంటే కవిత్వాన్ని, కవి జీవితంలోని సంఘటనలనీ తప్పుగా విశ్లేషించడం, భ్రష్టు పట్టించేందుకు ప్రయత్నం చేయడం – ఇవీ నన్ను బాగా బాధిస్తాయి. ఉదాహరణకు P.E.N క్లబ్ వాళ్ళు న్యూ యార్క్ లో అన్ని ప్రాంతాల రచయితల్ని ఒక చోట చేర్చే ప్రయత్నం చేసినప్పుడు నేను సామాజిక స్పృహ ఉన్న కవితలని చదివాను. కాలిఫోర్నియా లో ఇంకా ఎక్కువ చదివాను. క్యూబా ను, క్యూబా విప్లవాన్ని సమర్థిస్తూ కవితలు చదివాను. అయినా కొంత మంది క్యూబా రచయితలు నన్ను విమర్శిస్తూ, నా కవితల్లోని అభిప్రాయాలని సందేహిస్తూ, నేను ఉత్తర అమెరికా చే రక్షించబడుతున్న కవిననీ, నిజానికి నన్ను అమెరికా లోనికి రానివ్వడమే నాకో బహుమతినిచ్చినట్టనీ ప్రచారం చేసారు. ఇంత కన్నా మూర్ఖమైన వాదన మరొకటి ఉండదు. గతంలో అమెరికాకు ఎందరో సోషలిస్టు రచయితలు వచ్చారు. నిజానికి క్యూబా రచయితలకు కూడా అహ్వానముండింది. మేము మా సామ్రాజ్యవాద వ్యతిరేక స్వభావాన్ని న్యూ యార్క్ వెళ్ళడం వల్ల కోల్పోలేదు. అయితే క్యూబా రచయితలు తమ తొందరపాటుతనం వల్ల అట్లా అర్థం చేసుకున్నారు. ప్రచారం చేసారు. ఇప్పుడు నేను మా పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానంటే నాకు నిజమైన విప్లవాత్మక చరిత్రా స్వభావమూ ఉన్నట్టే తెలుస్తోంది కదా! ఆ రోజు ఆ పత్రం మీద సంతకం చేసిన రచయితలెవరూ కూడా నేను చేసిందానిలో వందో వంతు ప్రజల కోసం చేయలేదు. విప్లవోద్యమం పట్ల వారికంత అంకిత భావమూ లేదు.

ప్ర: మీరు జీవించే విధానం పట్ల మీ ఆర్థిక స్థితిగతుల పట్ల విమర్శ ఉంది.

నె: నా దృష్టిలో అదంతా ఒక మిథ్య. ఒక రకంగా చెప్పాలంటే మేము స్పెయిన్ నుండి ఒక చెడ్డ వారసత్వాన్ని తెచ్చుకున్నాము. దేనిలోనయినా గొప్పగా ఉండడం, ఉన్నత శిఖరాల్ని అందుకోవడమంటే సరిపడని వారసత్వం. కొలంబస్ ని స్పెయిన్ కు తిరిగిరాగానే బంధించారు.
ముఖ్యంగా ఇది అసూయతో నిండి ఉన్న మధ్య తరగతి (పెటీ బూర్జువా) నుండి ఈ రకమైన అపవాదులు అభాండాలు ముందుకొస్తాయి. తమ వద్ద ఏమిలేదో ఇతరుల వద్ద ఏమి ఉందో అంటూ నిరంతరం ఆలోచిస్తూ గడుపుతారు వీళ్ళు. నా విషయంలో నేను నా జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసాను. నా ఇంట్లో ఉన్న నా ఆస్తి అంతా నా పుస్తకాలే. దశాబ్దాల నా రచనలు మాత్రమే నా ఆస్తులు. నేను ఎవరినీ దోచుకోలేదు, పీడించలేదు. నాకు చాలా ఆశ్చర్యమేస్తుంది. పుట్టుకతోనే ధనికులైన రచయితల మీద కన్నా నామీదే ఎక్కువ అపవాదులు వేస్తారు. ఒక యాభై ఏళ్ళుగా రచనలు చేస్తున్న ఒక రచయిత మీద వేస్తారు. ‘చూడు ఎంత విలాసంగా జీవిస్తున్నాడో! ఆయన ఇల్లు సముద్రం ఒడ్డున ఉంటుంది. మేలురకం వైన్ తాగుతాడాయన’ అంటూ అభాండాలు వేస్తారు. ఇదంతా వట్టి చెత్త కదూ! ముందు అసలు చిలీ లో చెడ్డ వైన్ దొరుకదు. ఇటువంటి అపవాదుల మన వాళ్ళ సంకుచితత్వాన్ని బయట పెడుతుంది. ఇది మన అభివృద్ధిలేమి వల్ల వచ్చిందే! ఉత్తర అమెరికాలో నార్మన్ మేలర్ కు మూడు వ్యాసాలు రాస్తే 90,000 డాలర్ల పారితోషికం ముట్టిందని మీరే కదా అన్నారు! ఇక్కడ అటువంటిదే జరిగితే ఎంత లొల్లి జరుగుతుంది? ఈ రచయితలంతా గగ్గోలు పెట్టరూ! నిజానికి ఒక సాటి రచయితకు అటువంటి పారితోషికం వస్తే సంతోషించాల్సింది పోయి ఎన్ని అభాండాలు వేసి ఎంత అరచి గగ్గోలు పెడతారు. ఇది దురదృష్టవశాత్తూ మన సాంస్కృతిక అభివృద్ది లేమిని బట్ట బయలు చేస్తోంది.

ప్ర: మీరు కమ్మ్యూనిస్టు పార్టీ సభ్యుడవడం వల్ల మీ మీద విమర్శ ఇంత తీవ్రంగా ఉంటోందా?

నె: సరిగ్గా అందుకే! ఎవరి దగ్గరైతే ఏమీ లేదో వాళ్ళకు పోగొట్టుకోడానికేమీ ఉండదు సంకెళ్ళు తప్ప! నా జీవితం లో ప్రతి క్షణం ప్రమాదాలతో నిండి ఉన్నది. నా జీవితం, వ్యక్తిగతం, పుస్తకాలు, నా ఇల్లు – అన్నీ రిస్క్ తీసుకున్నాను. నా ఇల్లును కాల్చేసారు. నన్ను పగబట్టి పీడించారు. అనేక సార్లు నిర్బంధించారు. ప్రవాసానికి పంపారు. నాతో ఎవరూ మాట్లాడరాదని ఆంక్షలు విధించారు. వేలాదిగా పోలీసులు నన్ను పట్టుకోవాలని చూసారు. నా దగ్గర ఏదీ ఉండడం నా కిష్టం లేదు. నా దగ్గర ఉన్నదంతా ప్రజలకిచ్చేసాను. ప్రజా పోరాటాలకిచ్చేసాను. ఇప్పుడు మనమున్న ఈ ఇల్లే 20 ఏండ్లుగా కమ్యూనిస్టు పార్టీ అధీనంలో ఉన్నది. ఈ ఇంటిని పార్టీ కిచ్చేసాను. ఇప్పుడు పార్టీ దయా దాక్షిణ్యాలమీదే నేనీ ఇంట్లో ఉంటున్నాను. నన్నివ్వాళ్ళ విమర్శిస్తున్న వారు ఎవరైనా ప్రజలకేమైన ఇచ్చారా? కనీసం వాళ్ళ బూట్లు అయినా ఇవ్వ గలిగారా?

ప్ర: మీరు చాలా గ్రంథాలయాలకు విరాళాలిచ్చారు కదా? ఇప్పుడు మీరు ఇస్లా నెగ్రా లో రచయితల కాలని నిర్మించే క్రమంలో ఉన్నారు కదా?

నె: ఒక గ్రంథాలయమ్మొత్తం నా దేశపు విశ్వవిద్యాలయాని కిచ్చేసాను. నా పుస్తకాల మీద వచ్చే ఆదాయమ్మీద ఆధారపడి జీవిస్తున్నాను. నా కంటూ మిగులు ధనమేమీ లేదు. నా పుస్తకాల మీద వచ్చే దానికన్నా నాకంటూ వచ్చే ఇతర ఆదాయమూ లేదు. ఆ ఆదాయంతో ఇక్కడ సముద్రపుటొడ్డున కొంత భూమిని కొని సేకరించాలనుకున్నాను. అక్కడకు రచయితలు వేసవిలో వచ్చి అద్భుత ప్రకృతి సౌందర్యం ఆస్వాదిస్తూ గొప్ప సృజనాత్మకతతో మంచి రచనలు చేసే వాతావరణం కల్పించాలనేది నా ధ్యేయం. దానికి కాంటలాలో సంస్థ, కాథొలిక్ విశ్వవిద్యాలయం నుండి చిలీ విశ్వవిద్యాలయం నుండీ రచయిత సంఘాలనుండీ ప్రతినిధులతో , బాధ్యత వహిస్తుంది.

ప్ర: మీ మొదటి కవితా సంకలనం “ఇరవై ప్రేమ కవితలు, ఒక విషాద గీతం” ను ఇంకా ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది చదువుతూనే ఉన్నారు కదా!

నె: మిల్లియన్ కాపీలు అమ్ముడైన సందర్భంగా వేస్తున్న ఈ కొత్త సంకలనానికి ముందుమాట రాస్తూ నేను “ఈ సంకలనం త్వరలో రెండు మిలియన్ల కాపీలు కూడా అమ్ముడవుతుంది. ఈ పుస్తకాన్ని ఎందుకింత మంది చదువుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ప్రేమ విషాదం, ప్రేమ బాధ నిండిన ఈ కవితా సంకలనాన్ని ఇంకా అనేకమంది, ముఖ్యంగా యువతరం చదవడం నాకు గొప్ప ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. నిజంగా నా కర్థం కాదు. బహుశా ఈ కవితల్లో యవ్వనం ముందుకు తెచ్చే అనేకానేక సవాళ్ళూ, వాటి నిగూఢత ప్రతిఫలిస్తుందేమో? బహుశా ఈ కవితలు వాటికి సమధానాలు చెబుతాయేమో? ఈ పుస్తకం విషాదం తో నిండింది. అయినా దాని సౌందర్యం ఎంత మాత్రమూ చెరిగి పోలేదు.

ప్ర: మీ కవిత్వాన్ని చాలా విస్తారంగా అనేక భాషల్లోకి, దాదపు ముప్ఫై భాషల్లోకి, అనువాదం చేసారు కదా! ఏ భాషలోకి మీ కవిత్వం చాలా బాగ అనువదించబడిందనుకుంటున్నారు?

నె: నా ఉద్దేశ్యంలో అన్ని భాషల్లోకెల్లా ఇటాలియన్ బాషలోకి నా కవిత్వం బాగ అనువాదమయ్యాననుకుంటాను. ఎందుకంటే స్పానిష్ , ఇటాలియన్ భాషలకు చాల దగ్గరి సంబంధముంది. ఇటాలియన్ మినహాయిస్తే ఇతర భాషలు ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలకు స్పానిష్ భాషకు ఎటువంటి సంబంధమూ పోలికా లేవు. ధ్వనిలో కానీ, పదాల పొందికలో గానీ, తూగులో గానీ, పదాల రంగు లో గానీ ఈ భాషలకు ఎటువంటి పోలికా లేదు. నేను అర్థానికి సంబంధించిన సమానత్వం గురించి అనడం లేదు. అర్థం సరిగ్గానే అనువాదం కావచ్చు కానీ ఈ అర్థాన్ని సరిగ్గా అనువాదం చెయ్యడం అనేది చాల సార్లు కవితను నాశనం చేస్తుంది. నా కవిత్వం ఫ్రెంచి అనువాదాల్లో – నా ఉద్దేశ్యం అన్నింటిలో అని కాదు – కానీ చాల వాటిల్లో కవిత్వం ఏమీ ఉండదు. నేనేమీ అభ్యంతరం చెప్పడానికి ఉందదు. ఎందుకంటే నేను రాసిన అర్థమయితే అట్లానే ఉంటుంది కదా! నేనదే ఫ్రెంచి కవినయితే ఆ పద్యాన్ని అట్లా రాసి ఉండే వాన్ని కాదు. ఎందుకంటే పదాల విలువ పూర్తిగా భిన్నమైనది. నేను పూర్తిగా విభిన్నంగా రాసి ఉండేవాన్ని.

ప్ర: మరి ఇంగ్లీషులో?

నె: ఇంగ్లీషు కూడా స్పానిష్ భాష కన్నా చాల భిన్నమైనది. చాలా సూటిగా ఉంటుంది. చాల సార్లు నా పద్యాల అర్థాన్నయితే పాఠకులకు అందిస్తుంది కానీ వాటిల్లోని వాతావరణాన్ని అందించలేదు. బహుషా ఒక కవిని ఇంగ్లీషు లోంచి స్పానిష్ లోకి అనువాదం చేసినా అంతే అవుతుందేమో?

ప్ర: మీరు నేర పరిశోధక సాహిత్యం ఎక్కువ చదివేవారు కదా! మీ అభిమాన రచయితలెవరు?

నె: ఇటువంటి రచనల్లో గొప్ప సాహిత్యంగా ఎరిక్ ఏంబ్లర్ రాసిన ‘ఏ కాఫిన్ ఫర్ డిమిట్రోస్’ ను చెప్పుకోవచ్చు. నేను దదాపు ఎరిక్ ఏంబ్లర్ రచనలన్నీ చదివాను. వేటిలోనూ ‘ఏ కాఫిన్ ఫర్ డిమిట్రోస్’ లో ని పరిపూర్ణత, పరిపక్వత, అద్భుత చమత్కృతీ, గూఢత్వమూ కనబడవు. సిమోనన్ కూడా ప్రముఖ రచయితే కానీ నా దృష్టిలో జేంస్ హాడ్లీ చేస్ టెర్రర్ లో, భయంలో, వినాశకరమైన స్ఫూర్తిలో ఇప్పటిదాకా రాయబడిన దానినంతా మించి పోయాడు. అతని ‘నో ఆర్చిడ్స్ ఫర్ మిస్ బ్లాండిష్’ పాత పుస్తకమైనా ఇప్పటికీ డిటెక్టివ్ సాహిత్యంలో మైలు రాయిగా నిలుస్తుంది. దానికీ ఫాక్నర్ రాసిన పుస్తకం – అందరికీ ఆమోదయోగ్యం కాకపోయినా చాల ముఖ్యమైన పుస్తకం – ‘సాంక్చుయరీ’ – కి దగ్గరి పోలికౌ కనబడతాయి. వీటిలో ఏది ముందో నేను చెప్పలేను. అట్లే డిటెక్టివ్ కథ పేరు చెప్పగానే నాకు గుర్తుకొచ్చేది డాషియెల్ హేమ్మెట్. అతడు ‘అసాహిత్య పిశాచి’ గా పిలవబడే డిటెక్టివ్ సాహిత్యానికి సాహిత్య గౌరవం తీసుకొచ్చి బలమైన వెన్నెముక నిచ్చాడు. అతనొక గొప్ప సృష్టికర్త మరియు అతని తర్వాత వందలాదిగా రచయితలొచ్చారు. వారిలో గొప్ప ప్రతిభావంతుడు జాన్ మెక్డొనాల్డ్. ఆ రచయితలంతా చాల విస్తారంగా రాస్తారు చాలా కష్టపడి పనిచేస్తారు. పైపెచ్చు ఉత్తర అమెరికా లో ఈ స్కూల్ కు చెందిన రచయితలంతా పతనమవుతున్న అమెరికా పెట్టుబడిదారీ విధానాన్ని తీవ్రంగా విమర్శించిన వారే! రాజకీయ నాయకుల, పోలీసుల అవినీతి, పెద్ద నగరాల్లో డబ్బు ప్రభావము, విచ్చలవిడి అవినీతి, ‘అమెరికన్ జీవిత విధానం’ – ఇవన్నీ ఈ రచనల్లో ప్రతిఫలిస్తాయి. నిజానికి సమాజం పట్ల ఇంత విమర్శనాత్మకంగా ఉండి కూడా డిటెక్టివ్ సాహిత్యం సాహితీ విమర్శకులచే సాహిత్యంగా పరిగణించబడడంలేదు.

(చివరి భాగం వచ్చే సంచికలో)

అభిప్రాయాలు లేవు »అనువాదాలు, ఇంటర్‌వ్యూలు, ప్రపంచ సాహిత్యం

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో