Oct2007
సూక్ష్మజీవుల శక్తి సామర్య్థాలు
“సృష్టి రహస్యాలను” గురించీ, “భగవంతుడి లీలలను” గురించీ నమ్మబలికే వేదాంతులు ప్రవచనాలు చేసేటప్పుడు సామాన్యంగా శాస్త్రవిజ్ఞానం ద్వారా తెలియవచ్చే సంగతుల మీదనే ఆధారపడతారు. వారికి స్వయంగా శాస్త్ర ప్రయోగాలు చేసే అవకాశం ఉండదు. వాటిని అంత ముఖ్యమైనవిగా వారు భావించకపోవచ్చు కూడా. టెలిస్కోప్ ద్వారా అంతరిక్షం గురించిగాని, మైక్రోస్కోప్ ద్వారా సూక్ష్మజీవుల గురించిగాని ముందుగా తెలుసుకునేది శాస్త్రవేత్తలే.
ఆ సంగతులు చెవినపడ్డప్పుడల్లా ఆధ్యాత్మికవాదులు “చూశారా, భగవంతుడి లీలలు?” అని పరవశం చెందుతూ, ఇహ పరలోకాలను గురించిన వివరణలు ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం తెలిసిన విషయాలను నమ్మి, ఊరుకుని, “తెలుసుకోవలసినదంతా తెలిసిపోయిందిలే” అని తృప్తిపడకుండా ఎప్పటికప్పుడు కొత్త పరిశోధనలు చెయ్యడమే శాస్త్రవేత్తల పని. బాబాల వెంట పడ్డట్టుగా వీరికెవరూ భక్తులుండరుగాని మనుషుల జీవితాలు రోజురోజుకీ కాస్తయినా మెరుగుపడుతున్నాయంటే అది వారివల్లనే. నిత్యజీవితాలకు అవసరమయే అంశాలే కాక, సైన్స్‌వల్ల ప్రపంచం గురించిన మొత్తం అవగాహన పెరుగుతుందనడంలో సందేహంలేదు. ఇందులో చిన్నా పెద్దా జీవాల గురించిన సమాచారం కూడా ముఖ్యమైనదే.
మనుషులు మొదటినుంచీ తమ ప్రాణరక్షణ గురించీ, మంచిచెడ్డల గురించీ ఆలోచించినంతగా తక్కిన జంతుజాలం గురించి “నిస్వార్థ” దృక్పథంతో గమనించలేదనే చెప్పాలి. ఒక కథలో ఒక రాజుగారు సభలో ప్రాణుల గురించిన చర్చ ఏర్పాటుచేస్తాడు. భగవంతుడి సృష్టిలో బొత్తిగా నిరుపయోగమైన ప్రాణులు దోమలూ, సాలీళ్ళూ మాత్రమేనని వేదాంతులు ఆ సభలో నిర్ణయిస్తారు. కొంతకాలానికి ఈ నిర్ణయం తప్పని రాజుకు స్వానుభవం ద్వారా తెలిసివస్తుంది. ఎలాగంటే ఆ రాజుపై శత్రుసేనలు దాడిచెయ్యగా అతను పారిపోయి దాక్కోవలసివస్తుంది. ఆ పరిస్థితిలో గుహలో రహస్యంగా తలదాచుకుని నిద్రపోతున్న రాజును వెతుక్కుంటూ శత్రుసైనికులు అక్కడికి వచ్చినప్పుడు సకాలంలో దోమలు కుట్టగా రాజు మేలుకుంటాడు. సాలెగూళ్ళ వెనకాల నక్కిన రాజును గుర్తించక శత్రువులు వెళ్ళిపోతారు. ఆ తరవాత జరిగే యుద్ధంలో తన రాజ్యాన్ని మళ్ళీ సంపాదించుకున్న రాజు దోమలూ, సాలీళ్ళవంటివి కూడా భగవంతుడు మనుషుల ప్రయోజనానికే దేవుడు సృష్టించాడని సభలో చెపుతాడు!
లోకమంతా మనుషుల కోసమే అనుకునే ఇటువంటి అమాయకత్వం ఈనాటికీ అంతం కాలేదనే అనిపిస్తుంది. ఉదాహరణకు ఆధునిక శాస్త్రపరిశోధనల ద్వారా అనుక్షణమూ ప్రపంచంలో బాక్టీరియావల్ల ఎంత ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోందో చాలామందికి తెలియదు. ఇలాగనక జరగకపోయి ఉంటే మనవంటి ప్రాణుల ఆవిర్భావం వీలయేదే కాదు. ఇది ఏ కారణం వల్లయినా నిలిచిపోతే మనమూ, మన వేదాంతమూ సోదిలోకి లేకుండా పోయినట్టే. ఈ పద్ధతిలో భౌగోళికంగా వందల కోట్ల సంవత్సరాలపాటు గొలుసుకట్టు పద్ధతిలో నిత్యమూ జరుగుతూ వచ్చిన జీవప్రక్రియలన్నీ ఎంత ముఖ్యమైనవో సైంటిస్టుల పరిశోధనల కారణంగానే అర్థం అవుతోంది. వీటిలో ముఖ్య పాత్రధారులు కంటికి కనబడని సూక్ష్మజీవులే.
సూక్ష్మజీవుల శక్తిసామర్థ్యాలు అసామాన్యమైనవి. ప్రపంచంలో మనుషులు రకరకాల ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరుచుకున్నారు. చలికీ, ఎండకూ, వానలూ వరదలకూ, అగ్నిపర్వతాల తాకిడికీ ఇలా ప్రాంతాన్ని బట్టి వేరువేరు కష్ట నష్టాలను సహిస్తూ జీవితాలు వెళ్ళబుచ్చుతున్నారు. చలి ప్రాంతాల్లో నివసించే ఎస్కిమోలనూ, సహారా, అరేబియా, రాజస్థాన్ ఎడారుల్లో జీవించే ప్రజలనూ చూసినప్పుడు వీళ్ళంతా ఇలాంటి చోట్ల ఎలా ఉండగలుగుతున్నారబ్బా అని ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. మనుషులే కాదు, తెల్ల ఎలుగుబంట్లూ, పెంగ్విన్ పక్షులూ, ఒంటెలూ ఇలా వివిధ ప్రాణులన్నీ ఏ మాత్రమూ నివాస యోగ్యంగా అనిపించని ప్రాంతాల్లో బతికేస్తూ ఉండడం మనకు తెలుసు. కానీ ఈ విషయంలో వీటన్నిటినీ తలదన్నగలిగినవి బాక్టీరియా. వీటికి ఉండతగని ప్రదేశమంటూ ఏదీ లేదని అనిపిస్తుంది. మనుషులూ, తక్కిన ప్రాణులూ జీవపరిణామంలో ఎంతగా ముందడుగు వేశాయో ఏమో కాని బాక్టీరియా విజయవంతంగా అభివృద్ధి అయిన ప్రాంతాలలోని వైవిధ్యం చూస్తే మటుకు వీటిని మించినది ప్రాణికోటిలో మరేదీ లేదనే నమ్ముతాం.
సయనోబాక్టీరియా తుట్టెల్లో ఉత్పత్తి అయే వాయువులు
వాటిని నీటిగుంటల్లో తేలేట్టు చేస్తాయి
ఇందుగల వందు లేవని…అన్న పద్ధతిలో ఎటువంటి పరిస్థితికైనా తట్టుకుంటూ, ఎటువంటి వాతావరణంలోనైనా నిలదొక్కుకుని “సై” అంటూ జీవించగలిగే బాక్టీరియా జాతులు శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరుస్తున్నాయి. “ఇక్కడ లాభంలేదు” అనకుండా ఎక్కడైనా నెట్టుకురాగలిగే ఈ సూక్ష్మజీవులు ఒక్కొక్కటీ జగదేకవీరుడిలా అనిపిస్తాయి. నిర్జీవంగా అనిపించే కొండలూ, బండరాళ్ళ మధ్య ఏదైనా ఒక రాతిని ఎత్తి చూస్తే దాని అడుగున కొద్దిగా పాచిగాని, నాచుగాని కనబడుతుంది. అవే ప్రతికూల పరిస్థితిని ఎదిరించి బతుకుతున్న నీలం, ఆకుపచ్చ రంగుల్లో ఉండే సయనోబాక్టీరియా. అమెరికా పశ్చిమ ప్రాంతంలో ఉన్న “మృత్యులోయ” (డెత్ వేలీ) వంటి ఎడారుల్లో గడ్డిపరకయినా మొలవకపోయినా ఉప్పు పేరుకుని ఉన్న నేల తవ్వితే అక్కడ కూడా బాక్టీరియా ఉన్న జాడ కనబడుతుంది. కొన్నిటికి ఆక్సిజన్ అవసరం లేదు. కొన్నిరకాలు గాలి లేని పరిస్థితుల్లో జీవిస్తూ తమ చుట్టూ ఉన్న గంధకం లవణాల్లోని ఆక్సిజన్ పీల్చేస్తాయి. మరికొన్నిటికి ఆక్సిజన్ పడనే పడదు. అంటార్క్‌టికా దక్షిణ ధ్రువప్రాంతాల్లో మందమైన మంచుగడ్డల అడుగున ఉన్న జలాశయాల్లోనూ, అగ్నిపర్వతాల పరిసరాల్లోని ఉడుకులెత్త్తున్న బురద గుంటల్లోనూ కూడా కొన్ని రకాలు “కడుపులో చల్ల కదలకుండా” బతుకుతున్నాయి. అమెరికాలోని యెల్లోస్టోన్ పార్క్ ఉష్ణజలాల ఊటల ప్రాంతంలోనూ, సముద్రాల అడుగున లావా వెదజల్లే అగ్నిపర్వతాల ముఖద్వారాల్లోనూ “ఉష్ణ ప్రేమ”ను ప్రదర్శించే కొన్ని రకాల బాక్టీరియా 104 డిగ్రీల (సెల్సియస్) వేడిమిలో నివాసం చేస్తున్నాయి. పైనున్న నీటి ఒత్తిడి కారణంగా నీరు ఆవిరిగా మారకుండా ద్రవ రూపంలోనే ఉంటుంది. ఏ కారణం వల్లనైనా ఉష్ణోగ్రత 90 డిగ్రీలకు తక్కువైతే ఆ సూక్ష్మజీవులన్నీ”చలి”కి తట్టుకోలేక చచ్చిపోతాయి! అలాగే మరికొన్ని మైనస్ 20 డిగ్రీల (సెల్సియస్) చలిలో ఎన్ని కోట్ల సంవత్సరాలైనా తట్టుకుని జీవించగలవు. గడ్డకట్టిన మంచు అడుగున నీరు ఉంటుంది. ఎందుకంటే ఆ నీరు ఘనీభవించకుండా మంచే కాపాడుతుంది. దీనికి భూగర్భం నుంచి తగిలే వెచ్చదనం తోడవడంతో ఏర్పడే నీటి కొలనుల్లో బాక్టీరియాకు స్థావరాలు లభిస్తాయి. వీటిలో ఒకటి 3.7 కిలోమీటర్ల అడుగున 500 మీటర్ల లోతు కలిగి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ నీటిలో ఎటువంటి బాక్టీరియా ఉన్నాయో తెలుసుకోగలిగితే జీవరాశి పుట్టిన తొలియుగపు విశేషాలు తెలుసుకోవచ్చునని శాస్త్రవేత్తల ఆశ.
అమెరికాలో యూటా ఎడారిలోని బాక్టీరియా మెథేన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి
ప్రాణులు బతకడానికి వాతావరణపు ఒత్తిడి మరీ ఎక్కువైనా పనికిరాదు. అయితే పసిఫిక్ మహాసముద్రంలో ఏడు మైళ్ళ లోతున 50 జంబో జెట్ విమానాల బరువుకు సమానమైన ఒత్తిడికి గురి అవుతూ మరికొన్ని బాక్టీరియా కాలక్షేపం చేస్తున్నాయి. కాంతికిరణాలు ఎన్నడూ తగలని గుహల్లోనూ, మహాసముద్రాల అడుగునా బతికే రకాలూ ఉన్నాయి.
మహాసముద్రాల అడుగున బాక్టీరియా
గనుల్లో జీవకణాలకు హానికరం అనిపించే ఆమ్ల జలాల్లోనూ, కొన్ని సరస్సుల్లో ఉండే అతి క్షారగుణం కలిగిన నీటిలోనూకూడా కొన్నిరకాల బాక్టీరియా ఉంటున్నట్టుగా రుజువైంది. ఇంకొన్ని రకాలకు రేడియోధార్మికత అంటే లక్ష్యం లేనట్టుగా కనిపిస్తుంది. అణు రియాక్టర్లనుంచి విడుదల అయే వ్యర్థపదార్థాల టాంకుల్లో ప్లూటోనియంవంటి భయంకరమైన రేడియోఆక్టివ్ రసాయనాలలో ఇవి పవ్వళించి, వాటినే భోంచేస్తూ సుఖంగా బతుకుతున్నట్టుగా రుజువైంది. వీటి డీఎన్‌ఏను రేడియో ధార్మిక కిరణాలతో విచ్ఛిన్నం చేశాక ఆ శకలాలన్నీ సైన్స్ ఫిక్షన్ పద్ధతిలో మళ్ళీ అతుక్కుని యథాప్రకారంగా కొనసాగుతున్నాయని తెలుస్తోంది. 2 వేల అడుగుల లోతున్న చమురు బావుల్లో కాలం గడుపుతున్న బాక్టీరియా జాతులు శిలల్లో కొద్ది మోతాదుల్లో ఉన్న ఇనుము, గంధకం, మాంగనీస్ వగైరా లోహాలను భక్షిస్తూ, ఇనుము, కోబాల్ట్, యురేనియం మొదలైన లోహాలకు సంబంధించిన వాయువులను పీలుస్తున్నట్టుగా తేలింది. ప్రమాదవశాత్తూ ఒలికిపోయిన చమురు, కీటనాశక పదార్థాల వంటివాటిని జీర్ణించుకుని, నిరపాయకరమైన పదార్థాలుగానో, పనికొచ్చేవిగానో మార్చగలిగిన బాక్టీరియా రకాలను అవసరమైనప్పుడు కృత్రిమంగాకూడా తయారుచేసి ఉపయోగిస్తున్నారు. 1980లో అమెరికాలో దీన్ని మొదటగా తయారుచేసిన ఆనంద చక్రవర్తి అనే శాస్త్రవేత్త జీవరాశిని కృత్రిమంగా సృష్టించవచ్చునని కోర్టులో పేటెంట్ హక్కును గెలుచుకున్నాడు కూడా.
భూగర్భంలోనూ, ఇతర ప్రతికూల పరిస్థితుల్లోనూ బతుకుతున్న బాక్టీరియా తమ జీవన ప్రక్రియలని కనీస స్థాయికి తగ్గించేసుకుంటాయి. వీటిలో కొన్ని విభజన చెంది పునరుత్పత్తి సాధించడానికి వందల సంవత్సరాలు పట్టవచ్చు. పరిస్థితినిబట్టి తమ లక్షణాలలో మార్పులు సాధించుకున్న బాక్టీరియా రకాల్లో ఒక్కొక్కటీ కొన్ని ప్రాంతాల్లోనే బతకగలవు. కొన్నిటికి మంచినీరు ప్రాణాంతకం అయితే మరికొన్నిటికి ఆక్సిజన్ విషతుల్యం. అలాగే వెలుతురునూ, చలినీ, వేడిమినీ, ఆమ్ల, క్షార గుణాలనీ భరించలేనివీ, అవి లేకుండా బతకలేనివీ కూడా ఉన్నాయి. శిలలూ, బండరాళ్ళ మధ్యలో కాలూనుకునే బాక్టీరియా కొంతకాలం బతికి, పరిస్థితి మరీ విషమించినప్పుడు చచ్చి, ఫాసిల్ సాక్ష్యాలుగా మిగిలిన సందర్భాలూ ఉన్నాయి. వీటిలో అన్నిటికన్నా పురాతనమైనవి 350 కోట్ల సంవత్సరాలనాటివి.
బాక్టీరియా “గట్టి పిండాలు” మాత్రమే కావు, చిరంజీవులు కూడా. చంద్రమండలం మీద రెండేళ్ళపాటు సీల్ చేసి ఉంచిన కెమెరా లెన్స్‌లో ఉన్న బాక్టీరియం అన్నిటికీ తట్టుకుని బతికే ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో “దుకాణం కట్టేసిన” బాక్టీరియా వాతావరణం మెరుగవగానే “మేలుకుంటాయి”. వందేళ్ళకు పూర్వం ఆహార, పానీయాల డబ్బాల్లోనూ, సీసాల్లోనూ ఉండిపోయిన ఈ సూక్ష్మజీవులు విడుదల కాగానే జీవనప్రక్రియలకు దిగాయి. దీన్ని మించిన సంగతేమిటంటే సైబీరియా మంచులోని 30 లక్షల ఏళ్ళనాటివీ, అమెరికా భూగర్భ లవణ నిక్షేపాల్లో 25 లక్షల ఏళ్ళనాటివీ బాక్టీరియా శాస్త్రవేత్తల ధర్మమా అని పునరుజ్జీవితం అవగలిగాయి. అలాగే అంటార్క్‌టికాలో ఎక్కడో మంచు అడుగున 300 కోట్ల సంవత్సరాలనాటి నుంచీ పడిఉన్న సూక్ష్మజీవులనుకూడా పరిశోధనశాలల్లో బతికించగలిగారు.
జాగ్రత్తగా గమనిస్తే ఇన్ని రకాల బాక్టీరియా ఉన్నా అన్నీ ఏదో ఒక విధంగా ఒకదాని మీద మరొకటి ఆధారపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఉదాహరణకు సముద్రజలాల్లోని జాతుల్లో కిరణసంయోగం ద్వారా సూర్యకాంతిపై ఆధారపడే ఆకుపచ్చని సయనో బాక్టీరియావల్ల ఆక్సిజన్ విపరీతంగా విడుదల అవుతూ ఉంటుంది. వీటితో సంబంధం లేనట్టుగా కింది “గంధక భూయిష్ఠమైన” ప్రాంతాల్లోని బాక్టీరియా తమ మనుగడకోసం సల్ఫేట్ లవణాలను సల్ఫయిడ్‌లుగా మార్చుకుంటాయి. అంటే రసాయనాల్లోకి వచ్చి చేరుతున్న “అదనపు” ఆక్సిజన్‌ను పరోక్షంగా వాడుకుంటాయని అర్థం. సూర్యకాంతి అయినా మరేదో అయినా మొత్తంమీద ఈ జీవకోటికంతటికీ సూర్యుడే ఆధారం. తక్కిన జీవాల్లాగా కాకుండా సూక్ష్మరూపంలో ఉన్న బాక్టీరియా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ “ఓటమి”ని అంగీకరించకుండా ప్రాణాలు కాపాడుకునే పద్ధతి చూస్తే జీవరాశికి అవే “తలమానికం”గా అనిపించకమానవు.
గంధకం ఉన్న ఉష్ణ జలాల్లో పెరిగే బాక్టీరియా
తక్కిన ప్రకృతి మాట ఎలా ఉన్నా మన జీవితాల్లో బాక్టీరియా ఎలా పనిచేస్తాయో చూద్దాం. సూక్ష్మజీవులకు ప్రాణులకు ఉండవలసిన ప్రాథమిక లక్షణాలన్నీ ఉన్నాయి. పుట్టడం, పెరగడం, చావడమే కాక బాక్టీరియా తమ పరిసరాలనుంచి శక్తిని సంగ్రహించి, దాని సహాయంతో పెరగడానికీ, జీవపరిణామానికీ, పునరుత్పత్తికీ అవసరమైన ప్రక్రియలను సాధిస్తూ ఉంటాయి. వీటిలో కొన్ని మొక్కల్లాగా కిరణసంయోగం ద్వారా శక్తిని పొందడానికి సూర్యరశ్మిని వాడుకుంటూ, వాతావరణంలోని కార్బన్ డయాక్సయిడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌ను విడుదల చేస్తూ ఉంటాయి. మరికొన్ని జంతువుల పద్ధతిలో తమకు పనికొచ్చే పదార్థాలను ఎంజైమ్‌ల సహాయంతో జీర్ణించుకుంటూ ఉంటాయి. మూడు నాలుగువందల కోట్ల సంవత్సరాలక్రితం భూమిమీద అన్నిటికన్నా ముందుగా అవతరించిన బాక్టీరియా “అనుమతి” లేకుండా తక్కిన ప్రాణులేవీ పుట్టలేదు. నేలా, నీరూ, గాలీ ఇలా ఎక్కడపడితే అక్కడ స్థావరాలు ఏర్పరుచుకున్న బాక్టీరియా తరవాత పుట్టుకొచ్చిన ప్రతి ప్రాణి శరీరంలోనూ కూడా చోటు సంపాదించుకున్నాయి. అంతేకాదు; ఆ ప్రాణులు మసిలే పర్యావరణపు లక్షణాలని కూడా ఆ సూక్ష్మజీవులే నిర్దేశించాయి.
సారాయిలోనూ (ఎడమ), పెరుగువంటి ఆహారంలోనూ (కుడి) ఉండే బాక్టీరియా మేలు చేస్తాయి
వందల కోట్ల సంవత్సరాలపాటు జరిగిన సుదీర్ఘమైన జీవపరిణామ క్రమంలో ఈ వ్యవహారంలో ఇచ్చిపుచ్చుకోవడాలు చాలానే జరుగుతూ వస్తున్నాయి. రెండంచుల కత్తివంటి సూక్ష్మజీవులు తమకన్నా చాలా పెద్దవైన ప్రాణి శరీరమంతా వ్యాపిస్తాయి. వాటివల్ల ప్రాణికి మేలూ జరుగుతుంది, సంబంధం “చెడినప్పుడు” కీడూ జరుగుతుంది. కీడు జరిగి ప్రాణి బలహీనపడడమో, చావడమో జరిగితే బాక్టీరియాకు కూర్చున్న చెట్టు కొమ్మను నరుక్కున్న పద్ధతిలో అసలుకే మోసం వస్తుంది. కనక అవి “స్వంతలాభం కొంత చూసుకు” తమను “భరిస్తున్న” ప్రాణిని ఇబ్బంది పెట్టకుండా జీవిస్తాయి. తమవల్ల ప్రాణికి లాభం కలిగేలా కూడా చూస్తాయి. ఉదాహరణకు చెట్లనూ, చెక్కలనూ తినే చెదపురుగులకు అవి జీర్ణం కావు. వాటిని భక్షించి శక్తినిచ్చే బాక్టీరియా వాటి కడుపులో చేరతాయి. “పెద్ద సైజు” చెక్కముక్కలను బాక్టీరియా తిన్నగా ఆరగించలేవు కనక వాటిని నమిలిపెట్టే చెదలపై అవి ఆధారపడతాయి. ఈ విధంగా పరస్పర సహకారంతో ఇవి చెట్లను నాశనం చేస్తూ ఉంటాయి.
బాక్టీరియావల్ల కొన్ని ప్రమాదాలు కలిగే అవకాశం ఉన్నప్పటికీ మన శరీరవ్యవస్థ అలా జరగకుండా చూస్తుంది. స్ట్రెప్టోకోకస్‌వంటి కొన్నిరకాల బాక్టీరియా ఊపిరితిత్తులలో ప్రవేశిస్తే మనకు న్యుమోనియా వస్తుంది. కాని అదే బాక్టీరియం మన శ్వాసకోశ వ్యవస్థలో తక్కిన చోట్ల ఉంటూనే ఉంటుంది కాని మనకెటువంటి హానీ కలగదు. అలాగే మరొకరకం బాక్టీరియం సామాన్యంగా మన చర్మంమీదనే ఉంటుందికాని గాయమై రక్తంలోకి ప్రవేశించినప్పుడే దానివల్ల మనకు హాని కలుగుతుంది. బాక్టీరియా ఇలా “చూసీ చూడనట్టు” ప్రవర్తించడం వాటికీ, మనకూ కూడా మంచిది.
మన పేగుల్లోని “మంచి” బాక్టీరియా
మన శరీరాల్లోని బాక్టీరియా చాలామటుకు మనకు “సేవ” చేస్తూ బతుకుతాయి. భూగ్రహం మీద ప్రాణులు నివసిస్తున్నట్టుగా ఇవి మన శరీరాల్లో స్థావరాలు ఏర్పరుచుకుంటాయి. పేగుల్లో ఆహారం జీర్ణమవడానికీ, ముక్కులోనూ, గొంతులోనూ హానికరమైన ఇతర బాక్టీరియా చేరకుండా ఉండడానికీ, మెదడువాపు వంటి రోగాల నిరోధానికి ప్రేరణ నివ్వడానికీ రకరకాల బాక్టీరియా మనకు అనుక్షణమూ తోడ్పడుతూ ఉంటాయి. మన శరీరాల్లోని “ఖాళీ” ప్రాంతాల్లో ప్రమాదకరమైనవి చోటు సంపాదించుకోకుండా అక్కడికి “మంచి” బాక్టీరియా ముందుగా వచ్చి ఆక్రమించేస్తాయి. ప్రతి బాక్టీరియాకూ ఒకే రకం వాతావరణం సరిపడదు. వీటిలో ఎక్కువ భాగం తేమ ఉన్నచోటే ఉంటాయి. మన శరీరాల్లోని వివిధ ప్రదేశాల్లో ఉష్ణోగ్రతా, తేమా, ఆమ్ల, క్షార స్వభావాలూ, పనికొచ్చే ఆహారమూ వేరువేరుగా ఉంటాయి. కొన్ని స్థలాలకు కొన్ని రకాలు తక్కినవాటికన్నా సులువుగా అతుక్కోగలవు. అనువైన చోటు సంపాదించుకోవటానికి బాక్టీరియా పరస్పరం పోటీపడడం కూడా కద్దు. ఇందులో మనం కలగజేసుకునే సందర్భాలూ ఉంటాయి. చర్మానికి స్ప్రేలూ, పేగుల్లోకి ఏంటీ బయాటిక్ మందులూ సోకినప్పుడల్లా ఆయా ప్రాంతాల్లోని బాక్టీరియా జనాభాకు బలంగా దెబ్బ తగులుతుంది. తత్ఫలితంగా చర్మం కందిపోవడమో, మచ్చలు రావడమో, అజీర్తి చెయ్యడమో జరిగిందంటే పనికొచ్చే బాక్టీరియా బలహీనపడి మరేవో రకాలు విజృంభించాయని అర్థం. పెద్ద ప్రాణుల్లాగే సూక్ష్మజీవులు కూడా తమ మనుగడకై “నిశ్శబ్దంగా” ఎడతెగని పోరాటాలు చేస్తూనే ఉంటాయి. ఎటొచ్చీ ఇదంతా “బుద్ధిపూర్వకంగా” జరగదనీ, డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రకారం ఇటువంటి శరీరవ్యవస్థలే ప్రకృతిలో నిలదొక్కుకోగలిగాయనీ అర్థం చేసుకోవాలి.
సూక్ష్మజీవులు మనకు కనబడకపోయినా ప్రపంచంలోనూ, మన జీవితాల్లోనూ వాటి పాత్ర ఎంతో ముఖ్యమైనది. అందువల్లనే వాటి గురించి తెలుసుకోవడం అవసరం.
7 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు, సైన్స్
Rakesh Oct 4, 2007 1
Dear Rohiniprasad Sir,
1. Your artciles are so wonderful!! (Informative, useful and what a fantastic narration on a highly technical / otherwise un-interesting sunbject)
2. For generating interest in other readers, I am qouting some parts of your artcile:
“మనుషులు మొదటినుంచీ తమ ప్రాణరక్షణ గురించీ, మంచిచెడ్డల గురించీ ఆలోచించినంతగా తక్కిన జంతుజాలం గురించి “నిస్వార్థ” దృక్పథంతో గమనించలేదనే చెప్పాలి”
“ప్రమాదవశాత్తూ ఒలికిపోయిన చమురు, కీటనాశక పదార్థాల వంటివాటిని జీర్ణించుకుని, నిరపాయకరమైన పదార్థాలుగానో, పనికొచ్చేవిగానో మార్చగలిగిన బాక్టీరియా రకాలను అవసరమైనప్పుడు కృత్రిమంగాకూడా తయారుచేసి ఉపయోగిస్తున్నారు. 1980లో అమెరికాలో దీన్ని మొదటగా తయారుచేసిన ఆనంద చక్రవర్తి అనే శాస్త్రవేత్త జీవరాశిని కృత్రిమంగా సృష్టించవచ్చునని కోర్టులో పేటెంట్ హక్కును గెలుచుకున్నాడు ”
“కొన్నిటికి మంచినీరు ప్రాణాంతకం అయితే మరికొన్నిటికి ఆక్సిజన్ విషతుల్యం”
” కీడు జరిగి ప్రాణి బలహీనపడడమో, చావడమో జరిగితే బాక్టీరియాకు కూర్చున్న చెట్టు కొమ్మను నరుక్కున్న పద్ధతిలో అసలుకే మోసం వస్తుంది. కనక అవి “స్వంతలాభం కొంత చూసుకు” తమను “భరిస్తున్న” ప్రాణిని ఇబ్బంది పెట్టకుండా జీవిస్తాయి. తమవల్ల ప్రాణికి లాభం కలిగేలా కూడా చూస్తాయి”
3. Excellent information on “HISTORY” of Bacteria!!
“అన్నిటికన్నా పురాతనమైనవి 350 కోట్ల సంవత్సరాలనాటివి”
“ఏ కారణం వల్లనైనా ఉష్ణోగ్రత 90 డిగ్రీలకు తక్కువైతే ఆ సూక్ష్మజీవులన్నీ”చలి”కి తట్టుకోలేక చచ్చిపోతాయి! అలాగే మరికొన్ని మైనస్ 20 డిగ్రీల (సెల్సియస్) చలిలో ఎన్ని కోట్ల సంవత్సరాలైనా తట్టుకుని జీవించగలవు. గడ్డకట్టిన మంచు అడుగున నీరు ఉంటుంది. ఎందుకంటే ఆ నీరు ఘనీభవించకుండా మంచే కాపాడుతుంది. దీనికి భూగర్భం నుంచి తగిలే వెచ్చదనం తోడవడంతో ఏర్పడే నీటి కొలనుల్లో బాక్టీరియాకు స్థావరాలు లభిస్తాయి. వీటిలో ఒకటి 3.7 కిలోమీటర్ల అడుగున 500 మీటర్ల లోతు కలిగి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ నీటిలో ఎటువంటి బాక్టీరియా ఉన్నాయో తెలుసుకోగలిగితే జీవరాశి పుట్టిన తొలియుగపు విశేషాలు తెలుసుకోవచ్చునని శాస్త్రవేత్తల ఆశ.”
4. శాస్త్రవేత్తలకు కలిగే ఇటువంటి ఆశలే, మానవకళ్యానికి, మనుగడకూ ప్రాణం పోస్తున్నాయి!!
Thank you very much for another wonderful artcile.
Thanks to Pranahita too!!
B.AJAY PRASAD Oct 5, 2007 2
రోహిణీ ప్రసాదుగారూ
మీకు నా పత్యేక అభినందనలు. మీ వ్యాసం చాలా బాగుంది. మీ సైన్సు వ్యాసాలు అనేక పత్రికలలో చదువుతున్నాను. మీ పుస్తకం కోసం ఎదురుచూస్తున్నాను. మీ నాన్నగారి సైన్సు వ్యాసాల పుస్తకం (విరసం ప్రచురణ) ఇప్పుడు ఎక్కడా దొరకడం లేదు.
Jayasri Oct 5, 2007 3
The article is very informative with amazing facts. Thanks.
The style of the language makes it further interesting.
But, is it necessary to comment on the people’s religious beliefs in every article? My personal view is : If such informative article starts with direct attacks on misinformed people, it will discourage them to read further. The purpose of the article itself may be defeated if spreading knowledge is the purpose.
Once any person becomes more and more informed about Scientific facts, Nature, the less and less he will be superstitious.
Rohiniprasadgaru, the person like you who has so much communication, writing skills and the necessary knowledge can really help to educate people provided you be more patient and tolerant in your approach of the ‘Religion’ subject. This as my request and not my comment.
Rohiniprasad Oct 5, 2007 4
జయశ్రీగారి కామెంటు గురించి:
సైన్సు వ్యాసాలు సైన్సు పాఠాలవంటివి కావు. సూక్ష్మజీవుల గురించి తెలుసుకోవాలనుకుంటే అందుకు పనికొచ్చే ప్రామాణిక గ్రంథాలెన్నో కనిపిస్తాయి. ప్రాణహిత సామాన్య పాఠకులు చదివే పత్రిక. విజ్ఞాన సర్వస్వం కాదు.
నిత్యజీవితంలో సైన్సుకు ఎటువంటి స్థానం ఉండాలి? సైన్సు విషయాలను అర్థం చేసుకోవడం వల్ల మన దృక్పథంలో ఏమైనా మార్పు కలుగుతుందా, లేక ఈ కొత్త విషయాలన్నీ ఏదో కొత్త సినిమా కథలాగా మనకు తాత్కాలిక ఆసక్తిని మాత్రమే రేకెత్తిస్తాయా?
ప్రముఖ దిన, వార పత్రికలన్నీ “ఆధ్యాత్మిక” పేజీలు కేలండరు టైప్ రంగుబొమ్మలతో నింపి, అర్థంలేని నమ్మకాలనూ, సంప్రదాయాలనూ ప్రచారం చేస్తూ ఉంటే ఎవ్వరూ నోరు మెదపడం లేదు. వీటిని నమ్మనివారూ, వామపక్షభావాలు కలవారూ మాత్రం వీటి గురించి ఊరికే “అదంతా గుడ్డినమ్మకం” అనేసి ఊరుకుంటున్నారు. గుడ్డి నమ్మకాలు ఎంత లోతుగా పాతుకుని ఉన్నాయో, సామాన్యుల్లో “గుడ్డితనాన్ని” ప్రోత్సహించడం ఏ స్థాయిలో జరుగుతోందో సైన్సు రచయితలు చెప్పితీరాలని నా ఉద్దేశం. సైన్సు భౌతికవాద, హేతువాద దృక్పథాలను నెలకొల్పలేకపోతే లాభం ఉండదు.
ఈ వ్యాసాలు పన్నెండో తరగతి పాఠాలు కావు. మన అవగాహనా, దృక్పథమూ ఆధునిక విజ్ఞానం సహాయంతో మెరుగుపడాలనీ, అందుమూలంగా మన వ్యక్తిగత, సామాజిక దృక్పథంలో కూడా మార్పు వచ్చి తీరాలనీ నా కోరిక. దీనికి ప్రధానంగా అడ్డుతగిలేవి సంప్రదాయం, సంస్కృతి పేరుతో కొనసాగుతున్న మతప్రచారమే.
కుటుంబమంతా సరదాగా తమ ఇంట్లో ఏ వినాయకచవితి పండగో జరుపుకుంటే కొంప మునిగేదేమీ లేదు. అయితే చదువుకున్నవారు పెద్ద ఎత్తున పబ్లిక్ గా జరిపే పూజల్లో పాల్గొంటున్నప్పుడు చదువురానివారికీ, వెనకబడినవారికీ ఎటువంటి మెసేజ్ వెళుతోందో ఎవరూ గమనించరు. అంధవిశ్వాసాలు పెద్దపెట్టున నిలదొక్కుకోవటానికి ఇలాంటివి దోహదపడతాయి. వాటి వికృతరూపం చేతబడి, బాణామతి పేర్లతో కుగ్రామాల్లో ఏ ముసలమ్మనో చంపినప్పుడు బైట పడుతుంది. “విద్యాధికులు” ఆ వార్తలను చదివి, ముఖం చిట్లించి, పేజీ తిప్పేస్తారు. అందులో తమ బాధ్యత ఏమైనా ఉందా అని ఆలోచించరు.
ఆధునికులుగా చలామణీ అవుతున్నవారి వెనకబాటుతనాన్ని సైన్సు వ్యాసాల్లో గుర్తు చేస్తూ ఉండక తప్పదు. అందుకు ఎవరైనా నొచ్చుకుంటే క్షమించమనడం తప్ప రచయిత చెయ్యగలిగినదేమీ ఉండదనుకుంటాను.
నార్లవారు చెప్పినట్టుగా “రామ నామమను తీపి మిఠాయి”ని ఎవరైనా తింటే తిని, ఆనందించండి. అభ్యంతరం చెప్పే హక్కు ఎవరికీ లేదు. అయితే ఇటువంటి భావనలు అసలు ఎందుకు తలెత్తుతాయో సైన్సు చెపుతుంది. ఆ వివరాలను నేనొక సందర్భంలో వివరించాను: http://prajakala.org/mag/category/essays/alochanalu_avagaahana/
ప్రవీణ్ గార్లపాటి Oct 5, 2007 5
రోహిణీ ప్రసాద్ గారు,
మీ వ్యాసం చాలా బాగుంది. మీరిచ్చిన వివరణలు, పరిణామ క్రమంలో సూక్ష్మజీవుల మార్పులు ఎంతో ఆసక్తి కలిగించేలా ఉన్నాయి.
P.Thirupalu Oct 27, 2007 6
రోహిణి ప్రసాదు గారు, మీ వ్యాసం చాలా విజ్ణా దాయకమంగా చాలా బాగుంది.
మీరు జయశ్రి గారికి ఇచ్చిన వివరణ ఇంకా బాగుంది.
Rohiniprasad Jun 16, 2009 7
ఇటీవలి ఈ వార్త ఆసక్తికరంగా ఉంది.
http://andhrajyothy.com/mainshow.asp?qry=/2009/jun/15main5
గ్రహాంతర జీవాన్ని పోలిన బ్యాక్టీరియా
లండన్, జూన్ 15: గ్రీన్‌ల్యాండ్ మంచు పొరల కింద నుంచి ఇటీవల అతి సూక్ష్మమైన బ్యాక్టీరియాను శాస్త్రజ్ఞులు వెలికితీశారు. ఇటువంటి జీవాలు.. ఇతర గ్రహాల్లోనూ, వాటి ఉపగ్రహాలలోనూ ఉండే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. దాదాపు 1,20,000 సంవత్సరాల క్రితం మంచుపొరల్లో కూరుకుపోయిన హిర్మినిమోనాస్ గ్లేషియా అనే బ్యాక్టీరియాను మూడు కిలోమీటర్ల లోతు నుంచి శాస్త్రజ్ఞులు వెలికితీశారు.
దీని ప్రత్యేకత ఏమిటంటే.. సాధారణ బ్యాక్టీరియా కంటే దాదాపు 50 రెట్లు చిన్నగా ఉండడం. ఆ కారణంగా మంచులో ఉండే దుమ్ము, ధాతువులు, నాచు మీద ఆధారపడి బతికేయగలగడం దీని ప్రత్యేకత. వెలికితీసినప్పుడు స్తబ్దుగా ఉన్న ఈ బ్యాక్టీరియాను ఏడు నెలల పాటు రెండు డిగ్రీల సెంటీగ్రేడు దగ్గర, ఆ తరువాత నాలుగున్నర నెలలు ఐదు డిగ్రీల సెంటీగ్రేడు దగ్గర ఉంచారు.
అప్పుడు ముదురు కాఫీ రంగులో ఈ బ్యాక్టీరియా సముదాయాలు ఏర్పడ్డాయి. అంగారక గ్రహంలోనూ, గురు గ్రహ చంద్రుడు యూరోపాలోనూ ఉండే మంచులో ఇటువంటి బ్యాక్టీరియా ఉండవచ్చని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. దీంతో ఇతర గ్రహాల్లో జీవం ఉనికి ఉంటే.. ఎలా ఉంటుందో తెలిసే అవకాశం ఈ బ్యాక్టీరియా వల్ల లభించింది.