తెల్లకాకులు – నల్లపత్తి

మట్టి గోడకు కాళ్లాడుతున్న చిమ్మినీ దీపం ఆరిపోయింది.

కొటాయ్‌కు మెళుకు వచ్చింది. గుడిసెలో కటిక చీకటి. అతనికి కొంచెం దూరంలో పెళ్లాం పిల్లలు పడుకున్నారు. గురక మాత్రమే వినిపిస్తున్నదే కానీ మనుష్యులు అగుపించడం లేదు కొటాయ్‌కు. పైసలివ్వకపోతే దీపంలోకి కిరసనాయిలు కూడా పొయ్యనన్నాడు కోమటి కొట్టు సుబ్బారాయుడు.

వాకిటి తడికకు చిల్లు పడినచోట గోతంతో మూసినా ఖాళీ జాగాలోంచి బయట నుంచి పుష్యమాసపు చల్లటి గాలులు లోపలికి ప్రవేశించి హింసిస్తున్నయ్యి. కట్టుకున్న లుంగీనే లాక్కుని కప్పుకునే సరికి వున్న కాస్త చిరుగు పెద్దదిగా చిరిగింది. వున్న ఒకే ఒక లుంగీ చిరిగి పోయింది.

లేచి కూర్చున్నాడు నిద్రమత్తులోనే కొటాయ్‌. ఇవ్వాళ ఎలాగైన పత్తిని ఎలాగైనా గుంటూరు పంపించెయ్యాలి. చిన్న వాడికి పుట్టెంట్రుకలు తీయించాలి. వైకుంఠపురం తీసికెళ్లే ముందు కనకం బంగారు తాళిని కుదువనుంచి విడిపించాలి. పత్తి అమ్మిన డబ్బుతో కనకానికో మంచి చీరకొనాలి.

తడికకు కట్టిన పురికోసను విప్పాడు. బయట నుంచి పరిగెత్తుకొచ్చిన చల్లని గాలి మొహాన్ని తాకింది చల్లగా.

వీథిలోకి వచ్చి తూర్పు వైపు చూశాడు. ఆకాశం చీకటి లోంచి వెలుగులోకి వస్తున్నది. ఇప్పుడు పొలానికి వెడితే మధ్యాన్నానికి తిరిగిరావచ్చు. గబగబా మళ్లీ గుడిసెలోకి వచ్చి బోర్లా పడుకునున్న కనకాన్ని తట్టిలేపాడు.

”వూ…”

”పత్తి తియ్యడానికి కెడుతున్నాను… పొలానికి గంజి పట్టుకురా…”

”వూ…!” తిరిగి పడుకుంది.

నిన్న సాయంత్రం వరకూ పొలంలో పనిచేసిన అలుపు కనకానికి.

కొటాయ్‌ బయట వొచ్చి వేగంగా నడుస్తున్నాడు పత్తి పొలం వైపు. వెనకనుంచి ‘కొక్కొరకో’ అంటూ కోడి అరువు.

పత్తి చేనుకు చేరుకున్న కొటాయ్‌ని చేనులోని పత్తి చెట్లకున్న కాయలన్నీ విచ్చుకుని తెల్లటి పత్తితో నవ్వుతూ స్వాగతం పలికినయ్యి.

”పసుపు రాసుకుని నీళ్లోసుకు బిడ్డను కడుపులో మోసినన్నాళ్లు తిరిగి చూడకుండా బిడ్డను ప్రసవించి ఇంకా ప్రసవ వేదనలో ఉండగానే బిడ్డను లాక్కుపోవడాని కొచ్చావే…’ అని అమ్మమ్మ పాడే ఆ జానపద పాట గుర్తుకొచ్చింది, విచ్చుకున్న పత్తికాయల మీద పత్తిని పీకడానికని వచ్చిన కొటాయ్‌కు.

అమ్మమ్మ చచ్చిపోయి పాతిక సంవత్సరాలు పైన అయ్యింది.

ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే పత్తిని ఎప్పటికి పీకుతాను అని గొణుక్కుంటూ పత్తి చేన్లోకి దిగాడు. గబగబా పత్తిని పీకి గోతాలలో నింపుతున్నాడు.

ఎండ వేగంతో పోటీ పడలేక కొటాయ్‌ వేళ్లు వణుకుతున్నాయి. గోళ్ల చివర్లు చీమలు కుట్టినట్లు చిమచిమ మండుతున్నయ్యి. పెదిమలు పొడారిపోయినయ్యి. కడుపులో పేగులు ‘ఆకలి… ఆకలి’ అని గోల పెడుతున్నయ్యి.

సూర్యుడు నట్ట నడిమికి వచ్చాడు.

కొటాయి మెడకు పట్టిన చెమటను తుండుతో తుడుచుకుంటూ చింత చెట్టు వైపు చూశాడు. చేతిలో తాళ్లతో కట్టిన చట్టితో కనకం నిలబడడం చూశాడు.

గోతాన్ని చేలో పడేసి కొటాయ్‌ చెట్టు వైపుకు నడిచాడు. చేతిలో అరిటాకు పట్టుకునుంది… మొహం వాడుంది.

”ఏమిటి కనకం…? ఎందుకిలా వున్నావు..?”

”ఆ వెంకటాపురం పత్తివ్యాపారి ఇవ్వాళ ఇంటికొచ్చి నట్టింట నిల్చుని కేకలేసి వెళ్లాడు. ఆయనకివ్వాల్సిన పదిహేను వందల రూపాయలు మొదట్లో ఇచ్చెయ్యి మావా..”

”గుంటూరు వెళ్లి వచ్చాక ఇచ్చేద్దాం” ఇద్దరూ ఇంకేం మాట్లాడుకోలేదు. పెళ్లాం తెచ్చిన చద్దన్నాన్ని ఆవురావురుమంటూ తిన్నాడు.

”నేనూ ఇక్కడే వుండి పత్తి పీకనా?”

”వద్దులే. నువ్వెళ్లి హాలు శుభ్రంగా వూడిచి వుంచు. పత్తిని నొక్కి బేళ్లుగా కట్టే ఆ రామసామిని మధ్యాహ్నం మనింటికి రమ్మని చెప్పి పంపించు” అని, కొటాయ్‌ ఎంగిలి చెయ్యి కడుక్కుని పత్తి పీకడానికి పొలంలోకి దిగాడు.

పత్తి కాయలలోంచి పగలకొట్టుకు బయటికొచ్చిన పత్తిని కాయల మీదనుంచి గబగబా వేరు చేస్తున్నాడు. ఇంకా వందమొక్కల మీద పత్తికోసి బస్తాలకెత్తాలే. విచ్చుకున్న పత్తిని అలాగా వదిలేస్తె సుంటర గాలికి పత్తి కాస్తా ఎగిరిపోతుంది అనుకుని గబగబా కాయల మీద పత్తి కోస్తున్నాడు కొటాయి.

పత్తి అంతా కోసి గోతాలకు ఎత్తేసరికి మధ్యాహ్నం మూడు గంటలైంది. పత్తితో నింపిన గోతాలను తల మీద పెట్టుకు బయలుదేరాడు. ఎండవేడి మాడ్చేస్తోంది. గంటల మధ్య నుంచి నడకసాగించాడు. చెప్పులు లేకుండా నడుస్తుంటే కాళ్లు బొబ్బలెక్కుతున్నయ్యి. వీపంతా చెమటలు కారుతున్నయ్యి. నడక వేగం హెచ్చించాడు.

ఇంటికి చేరేసరికి కొటాయి పూర్తిగా చెమటతో తడిసి మద్దయిపోయాడు. పత్తి మూటలను అరుగు మీద పడేశాడు పెద్దగా ఊపిరి తీసుకుంటూ.

”వెంకటాపురం రామస్వామి వచ్చి వెళ్లాడు…” అని వంటింట్లోంచి కనకం మాటలు మాత్రం వినిపించినయ్యి.

లోపలకొచ్చి పేర్చిన పత్తి మూటలను లెక్కపెట్టాడు.

‘ఆరు క్వింటాళ్లు వుంటయ్యి. ఆరు బీళ్లకు సరిపడా గోనే పట్టాలు కొనాలి. ఆ రామసామిని తీసుకురావాలి. గుంటూరు వెళ్లి రావడానికి ఖర్చులకు కావాలి’.

షావుకారు వేదాచలం గుర్తుకొచ్చి తక్షణం బయలుదేరాడు.

తలకు కట్టుకున్న తుండు తీసి చేతిలో పట్టుకు నిల్చున్న పదిహేను నిముషాల అనంతరమే షావుకారు బయటకొచ్చాడు.

”ఇదిగో ఇందులో అయిదు వందల రూపాయలున్నయ్యి. పత్తి అమ్మాక బాకీ చెల్లించేప్పుడు అయిదొందల యాభై రూపాయలివ్వాలి తెలిసిందా..?”

డూడూ బసవన్నలా తలాడించాడు కొటాయ్‌.

”ఇవ్వాళ నీ పత్తి మార్కెట్‌కు తీసికెడదామా..?”

”ఆఁ…”

”వూఁ… సరే అయితే, సాయింత్రానికి లారీ వస్తుంది. వచ్చాక పత్తిని బేళ్లలోకి కూరుతూ కూర్చోకూడదు. ఇప్పుడే చెప్తున్నాను” అన్నతను సైకిల్‌ బ్రేక్‌ వేసి ఆపాడు ఎదురుకుండా వస్తున్న అమ్మాయిని చూడగానే.

కొటాయ్‌ వేగంగా బేళ్ల గోతాలు అమ్మే అంగడిలోకొచ్చాడు.

గోతాల కొట్టు సావేరి గోనె సంచులను విసురుతున్నాడు. ఎందుకూ పనికి రాకుండా చిరిగిపోయినవీ, రైస్‌ మిల్లు వాళ్లు ఎందుకు పనికిరానివని చెప్పి పారేసిన గోనె సంచులు. రెండు గోనె సంచులు చింపి కుడితే బేలుగా తయారవుతుంది. నలుగురైదుగురు జాగ్రత్తగా బేళ్ల గోతాలు తయారు చేస్తున్నారు.

”కోటాయ్‌కి ఏం కావాలి..?” అడిగాడు సావేర్లు.

”నూరు బేళ్లు కావాలి…” కొటాయ్‌ వెనుక నుంచి అడగడం వినిపించి వెనక్కి తిరిగి చూశాడు కొటాయి.
మైలారం పత్తి వ్యాపారి నిలబడుండడం కనిపించింది పెద్ద పొట్టతో. కోపంగా రామలింగం దగ్గరగా వచ్చాడు.

”బేళ్లకు గోతాలు కొనడానికొచ్చావా కొటాయ్‌? పత్తి పాలెం తీసికెళ్లి అమ్ముతావా. ఏదో ఒకటి అఘోరించు. బుధవారానికి పైసలు నా చేతిలో పడాలి. లేదంటే నిన్ను నడి రోడ్డులో నిలబెట్టి కడిగేస్తాను. పాలెం వాళ్ల డబ్బు మాత్రం తియ్యగా ఉంటుందా?” అన్న మైలారం పత్తి వ్యాపారికే సమాధానం చెప్పకుండా మౌనంగా నిల్చుండి పోయాడు.

తొందర తొందరగా నూరు బేళ్లకు గోతాలు చుట్టి రామలింగానికిచ్చాడు బేళ్ల వ్యాపారి అతని దగ్గర డబ్బులు తీసుకోకుండా.

”నీకు పాతిక చాలుగా?”

”ఆఁ… చాలు”

వ్యాపారి వెళ్లగానే సావేరి కొటాయ్‌ దగ్గరగా వచ్చాడు.

”మా వ్యాపారి దగ్గర డబ్బులు తీసుకుని పత్తినెందుకు పాళెం తీసికెళ్లి అమ్ముతున్నావు?” అడిగాడు సావేర్లు.

”శేషయ్య నాలుగు పత్తి బేళ్లు వేస్తే మోసం చేసి తూనికలో మూడు అని ఒక బేలు పత్తి దండుకుపోయాడా వ్యాపారి”

”అది నువ్వు చూశావా?” మాట్లాడుకున్నారు.

”చూడకుండా అభాండంగా అనకు, ఎవరో ఏదో చెప్పారని. ఆఁ… ఇంతకీ నీకెన్ని బేళ్లకు సరిపడా గోతాలు కావాలి?”

”పది…” అన్నాడు సంకోచంగా

”పదా. నూట యాభై రూపాయలు తియ్యి”

”ఏమిటండీ. వాళ్లకు పది వందకే ఇచ్చారుగా నాకెందుకు నూట యాభై అంటున్నారు? ఒకటి పదేగా?”

”అహాఁ..! అవును పదే. వందలు, వేలు కొనే వాళ్లు పది కొనే నువ్వు ఒకటేనా? పెద్ద మోతుబర్లకు పదే. చిల్లరగా కొనే వాళ్లకు పదిహేనే. ఇష్టం వుంటే కొను, కష్టం అయితే మాను”

మారు పలకకుండా కొటాయ్‌ నూటయాభై రూపాయలు సావేర్లు చేతిలో పెట్టాడు. పది గోనె పట్టాలను భుజం మీదవేసుకు బయలుదేరాడు కొటాయ్‌ దిగులుగా.

పత్తినంతా గోనేసంచుల లోంచి హాలులో కుప్పగా కుమ్మరించింది కనకం. తెల్లని మల్లెపూల రాసిలా చూడడానికి అందంగా కనిపిస్తున్నది. తెల్లటి మేఘాలను ముక్కముక్కలుగా కత్తిరించి హాలంతా పరిచినట్లుగా వుంది కొటాయ్‌కు.

కనకం, కొటాయ్‌ ఇద్దరు కొడుకులు, కూతురు, వెంకటాపురం నారిగాడు ఆరుగురు కలిసి పత్తినంతా గోనె పట్టాలలో నొక్కి పెట్టి పది బేళ్లగా పురికోసతో కట్టారు.

పత్తి అంతా పది వుండలుగా మారిపోయినయ్యి. బంతులుగా వాటిని వాకిట్లోకి తోశాడు. వెంకటాపురం నారిగాడు కొటాయ్‌ ముందొచ్చి నిలబడ్డాడు.

”నూరు రూపాయిలు ఇయ్యండి”

”ఏమిటి నూరు రూపాయిలే..?”

”ఆఁ… అవును… ఒక బేలులో పత్తి కూరినా వందే. నలభై బేళ్లలో కూరినా వందే”
వాకిట్లో నిండు గర్భిణిలా పత్తి బేళ్లను తనలో నింపుకు లారీ నిలబడింది.

లారి పైన ‘శుభం వినాయక ప్రసన్నం’ అని రాసుంది.

”లారీలో మా పత్తి బేళ్లను ఎక్కించడానికి జాగా ఎక్కడుంది?”

బేళ్లను లారీలోకి ఎక్కించే కుర్రకారు లారీ మీది నుంచి కిందికి దూకారు.

కొటాయ్‌ పది పత్తిబేళ్లను బంతిలా తోసుకుంటూ లారీ దగ్గరకు తీసికెళ్లి లారీ చివర్లోకి ఎక్కించి తాళ్లతో లాగి బిగించి కట్టారు, మెల్లగా.

”వెళ్లే దారిలో వెనక నుంచి కిందపడిపోతే?”

ఎక్కన్నుంచో లారీ డ్రైవర్‌, బ్రోకర్‌ పెరుమాళ్లు పరిగెత్తుకొచ్చాడు.

”వురేయ్‌ వెధవల్లారా… కొటాయ్‌ పత్తి బేళ్ల మీద అడ్రస్‌ రాయకుండా ఎక్కించారే. ఎక్కడైనా పోతే అందుకు నష్టం ఎవడబ్బ చెల్లిస్తాడురా?. ఏది ఆ సిరాబుడ్డి తీసుకు రండిరా” అని అన్నాడు.

”కొటాయ్‌ ఎవరి పేరు, ఏ అడ్రస్‌ రాయమంటావు?”

”నా కొడుకు సుందరం పేరు రాయండయ్యా. వాడే కాస్త రాసున్నవాడు”

కొందరు కుర్రాళ్లు సిరాబుడ్డి చిన్న కుంచె లాంటి కలం పట్టుకు పరిగెత్తుకొచ్చారు.

”కొటాయ్‌ కొడుకు సుందరం అని రాయండిరా”

పది పత్తిబేళ్ల మీద అదే రాశారు కుర్రాళ్లు.

సందేహిస్తూ సందేహిస్తూ కొటాయ్‌ బ్రోకర్‌ దగ్గకొచ్చాడు.

”లారీ బాడుగ, ఎక్కించే కూలీ?” మెల్లగా అడిగాడు

”కొత్తగా చెప్పేందుకేముంది? ఒక బేలుకు బాడుగ నలభై రూపాయులు, ఎక్కించే కూలీ ఇరవై”

”ఎక్కించే కూలీ పదిహేనేగా?”

”మొత్తంగా ఎక్కించే వ్యాపారికి పదిహేనే. చిల్లరగా ఎక్కించే వ్యవసాయికి ఇరవై రూపాయిలు. వురేయ్‌ కొటాయ్‌ ఇలారారా”

బ్రోకర్‌ ఎందుకు పిలుస్తున్నాడో తెలీక దగ్గరగా వెళ్లాడు.

”గుంటూరెళ్లే బస్సులో వెళ్లావంటే యాభై రూపాయలవుతుంది. లారీలోవెడితే యాభై రూపాయిలు మిగులుతీయ్యి. వెడతావా?”

”ఆఁ… అలాగే. వెడతానండీ” అన్నాడు కొటాయ్‌

”వెళ్లి వేరే మంచి పంచకట్టుకురా”

తొందర తొందరగా లోపలకెళ్లి కావిడి పెట్టెలోంచి, కొడుకు పుట్టాడని చెల్లెలు పెట్టిన పంచె తీసుకు కట్టుకున్న కొటాయ్‌ వెనక నిలబడుంది కనకం.

”కాస్త ఎంగిలి పడి వెళ్లవయ్యా. మధ్యాహ్నం కూడా గంజి మాత్రమే తాగావు” ప్రేమగా అన్నది.

”మనకోసం లారీ ఆగుతుందా? వెళ్లే దారిలో ఏ హోటల్లోనైనా తింటాలే” పైన వేసుకునే టవల్‌ మడతపెట్టి చేతి సంచిలో పెట్టుకున్నాడు.

”కొటాయ్‌, ఏం చేస్తున్నావు ఇంట్లో?”

”ఇదిగో వచ్చేస్తున్నానండీ” పంచ కాళ్లకడ్డం పడుతూంటే పరిగెత్తుకెళ్లి లారీలో ఎక్కి కూర్చున్నాడు కొటాయ్‌.

ఆనందంతో పరవశించే కళ్లతో కనకం పిల్లలు లారీని, లారీలో ఉన్న కొటాయ్‌ని చూస్తూ నిలబడ్డారు వాకిట్లో.

పత్తి బేళ్లను మోసుకెడుతున్న లారీ తనలోని దారి దీపాలతో చీకట్లను పారదోలుకుంటూ ముందుకు దూసుకెడుతున్నది.

డ్రైవర్‌, క్లీనర్‌ ఐశ్వర్యారాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌ పెళ్లి గురించి స్వారస్యంగా మాట్లాడుకుంటున్నారు.
ఆకలితోనే కొటాయ్‌ ఒళ్లెరగకుండా నిద్రపోయోడు.

కొటాయ్‌కి మళ్లీ మెలకు వచ్చేసరికి లారి ఆగివుంది. డ్రైవర్‌, క్లీనర్‌ లేరు. ఎక్కడికెళ్లారని బయటకి తొంగి చూశాడు. లారీ వెనకనుంచి ఇద్దరూ రావడం కనిపించింది.

”ఆఖర్న కట్టిన బేళ్లను కోసి పత్తిని నూకరాజు అంగట్లో పడేశాను. ఇరవై కిలోలుంటయ్యి” అని క్లీనర్‌ డ్రైవర్‌తో అనడం కొటాయ్‌కు వినిపించలేదు.

అలసటగా మళ్లీ కళ్లు మూసుకున్నాడు. లారీ ఘీంకరిస్తూ బయలుదేరింది.

అరగంట పయనించిన లారీ పక్కగా ఆగింది.

”లేవయ్యా కొటాయ్‌. దిగు శంకర్‌ విలాస్ లో బిర్యాణి బాగుంటుంది. ఆకలి పేగులను తినేస్తోంది. వెళ్లి ఓ ప్లేటు బిర్యాణి తినేసి వద్దాం” అని డ్రైవర్‌ కొటాయ్‌ని తట్టిలేపి దించాడు.

ఎదురుకుండా రంగు రంగు దీపాలతో శంకర్‌ విలాస్‌ అన్న హోటల్‌ పేరు మెరిసిపోతున్నది.
నిద్రమత్తులో ఉన్న కొటాయ్‌ని డ్రైవర్‌ క్లీనర్‌ చెరోరెక్క పుచ్చుకుని లాక్కెడుతున్నట్లుగా హోటల్‌ లోపలకు తీసికెళ్లారు.

ముగ్గురు టేబుల్‌ ముందున్న కుర్చీలలో కూర్చున్నారు.

”కొటాయ్‌ నీకేం కావాలి?”

”ఒక్క దోస చాలు” ఆకలితో ఉన్న కొటాయ్‌ అన్నాడు.

కొటాయ్‌ ఒక దోస తినే లోపల, వాళ్లిద్దరూ ఒక్కొక్క ప్లేట్‌ మటన్‌ బిర్యాణి, చికెన్‌ ఫ్రై రెండేసి చపాతీలు తిన్నారు.

”కొటాయ్‌, బిల్లు చెల్లించి లారీ దగ్గరకు వచ్చేయ్‌” అనేసి అతని సమాధానం కోసం ఆగకుండా లేచి వెళ్లిపోయారు క్లీనర్‌, డ్రైవర్‌.

కొటాయ్‌ దిగ్భ్రాంతుడయ్యాడు. ‘నూట యాభై ఒకటి…, బస్సులో వచ్చినా బస్సు టిక్కెట్టు యాభై రూపాయిలతో పోయేది. లారీలో వచ్చినందుకు…’ మారు మాట్లాడకుండా డబ్బులిచ్చేసి లారీ వద్దకొచ్చాడు కొటాయ్‌.

లారీ గుంటూరు చేరేసరికి అర్ధరాత్రి దాటింది.

పత్తి వ్యాపారి దుకాణం ముందున్న దీపాలు వెలిగనయ్యి. అడితీలోని కూలీ వాళ్లు విసుక్కుంటూ పత్తి బేళ్లను అంగడి లోపలకు తీసికెళ్లి కాటా వేశారు.

వాళ్లు కాటాకున్న వొక్కీని లాగినవేగంలో పత్తి బేలు చిరిగి అందులోంచి పత్తి నాలుగువైపులా పడింది. మన్నులో పడిన పత్తిని ఓ కుర్రాడు గంప తీసుకొచ్చి కొంచెం కూడ వదలకుండా గంపలోకెత్తి అంగట్లోని ఓ మూలలో పోశాడు.

కొటాయ్‌కో చాప ఇచ్చారు. కర్షకులు పడుకుని నిద్రపోతున్నారు. దోమలు కుట్టడం కూడా తెలీకుండా ఒళ్లెరక్కుండా, వాళ్ల శ్వాస సారాయి కంపు కొడుతున్నది. కొటాయ్‌ వాళ్ల చాప పరుచుకుని తలకింద సంచీ పెట్టుకుని పడుకున్నాడు. దోమలు నిద్రపోనియ్యక పోయినా ఎలాగో నిద్రపోయాడు. మెళుకు వచ్చేసరికి తెల్లగా తెల్లారిపోయింది.

ఏదో హోటలుకెళ్లి ఇడ్లీ తినేసి వచ్చాడు.

తొమ్మిది గంటలకు అకౌంటెంట్‌ వచ్చాడు. క్యాషియర్‌ (పద్దు రాసేవాడు) వచ్చాడు.

కొటాయ్‌ ఆయన్ని సమీపించి తన ఊరు పేరు చెప్పాడు. ఆయన తలూపాడు.

డబ్బు వస్తూ పోతున్నది. తోటి వ్యవసాయిల ద్వారా కొటాయ్‌ తెలుసుకున్నాడు. సాయింకాలం పత్తి కొనుగోలు చేసేందుకు మిల్లు యజమానులు వస్తారని.

మధ్యాహ్నం భోజనం చేసి కూర్చున్నాడు. కాఫీ, టీ, జంతికలు, జీడీలు, పప్పు చెక్కలు, చేగోడీలు అని రకరకాల చిరుతిళ్లు అమ్మకానికి వచ్చినయ్యి.

షావుకారు వద్ద తీసుకున్న అయిదు వందల రూపాయిలలో అరవై రూపాయిలు మాత్రమే ఉన్నయి.
సాయంత్రం కమిషన్‌ అంగడి వ్యాపారి వచ్చాడు.

… ఆయన మొహంలో చిరునవ్వు చిందులాడుతున్నది. కొటాయ్‌కు నమస్కారం పెట్టాడు. అప్పుడే మరో పత్తి వ్యాపారి భూతనాధం వచ్చాడక్కడికి. ఇద్దరు వ్యాపారులు చాప మీద కూర్చున్నారు ఎదురెదురుగా.

ఒక్కొక్క బేలులోంచి మచ్చు పత్తి కొద్ది కొద్దిగా తీశారు. మిల్లు యజమాని పత్తిని పరీక్షించాడు.
ఆఖరికి పశువుల సంతలో పశువులను పరీక్షించి వెలకట్టినట్లుగా టర్కీ టవల్‌ అడగున వేళ్లతో బేరం మాట్లాడారు. ఫైనల్‌ చేశారు పత్తి బేరాన్ని.

మైలవరం రైతు పండించిన పత్తి వెల ఒక క్వింటాల్‌ వెల రెండు వేల పద్దెనిమిది రూపాయలని రాశారు. మిల్లు యజమాని లేచాడు.

”ఇవ్వాల్టికి చాలు. పత్తి ధర ఎక్కువగా వుంది” అని ఆయన్ని లాక్కుని (పత్తి బేళ్లను) సర్దిపెట్టిన పత్తి బేళ్ల వెనక్కు లాకెళ్లాడు కమిషన్‌ వ్యాపారి.

”మధ్యలో లేచి వెడితే ఎలా? ఇంక పైన రైతులు పండించిన పత్తే. నూరు రూపాయిలు తగ్గించి రాద్దాం. తూకంలో ఒక కిలో తగ్గించి తూచిస్తాను” అన్నీ చాటు బేరం ఫైసలయాక మళ్లీ వ్యాపారం మొదలైం తరువాత కొటాయ్‌ పత్తికి గిరాకీ వచ్చింది.

ఒక వెయ్యి పద్దెనిమిది వందలని రాశాడు. ఆ పత్తి రేటు తగ్గడానికి కారణం ఎం.సీ. ఫైకీ పత్తిలో ఎల్‌.ఆర్‌.ఇ. కలిపి పంట పండించడం వల్లనని చెప్పారు.

కొటాయ్‌ విచారంగా గోడకు జారగిలపడ్డాడు.

ఈ మధ్యలో బేళ్లలోంచి శాంపులుకని తీసిన పత్తి మళ్లీ బేళ్లలో వెయ్యకుండా దుకాణంలోని కూలీలు తీసుకెళ్లారు.

అరవై ఏడు నిమిషాలు కరిగిపోయినయ్యి.

పది బేళ్లను తూకం వేసి తొమ్మిది కింటాల్స్‌ నలభై మూడు కిలోలకు గాను పదిహేను వేల చిల్లర చేతిలో పెట్టారు. లారీ బాడుగని పట్టుకున్నారు. దేముడి హుండీలోకని, కూలీ అని పట్టుకున్నారు.

”లారీ బాడుగ ఎంతేశారండీ…?” అడిగాడు కొటాయ్‌

”ఒక బేలుకు నలభైకు”

”పాపాత్ముడు, ముప్ఫై అని ఒప్పుకున్నాడు”

పైకాన్ని అతి జాగ్రత్తగా లోపలేసుకున్న బనీను జేబులో పెట్టుకున్నాడు. బయటకొచ్చిన కొటాయ్‌ తోటి రైతులతో గబగబా నడిచి బస్సు స్టాండుకొచ్చాడు.

ఆ రోజు అమరావతి అమరేశ్వర దేవాలయంలో ఏదో విశేష ఉత్సవం వుండటం వల్ల బస్సులన్నీ మహా రద్దీగా వున్నయ్యి.

రెండు మూడు బస్సులు స్టాండుకు రాకుండా అలాగే వెళ్లిపోయి నాలుగోది స్టాండులోకొచ్చి ఆగింది. ఎలాగో తోసుకుని బస్సులోకెక్కిన కొటాయ్‌కు కూర్చునేందుకు సీటు దొరికింది.

వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు తీసుకొన్న అయిదు వందలలో టిక్కెటుకు పోగా పది రూపాయిలు మిగిలినయ్యి.

బస్సు బయలు దేరింది. దిగులు మనసులోవొచ్చి కూర్చున్నది.

‘పత్తి వ్యాపారికి వెయ్యి ఇయ్యాలి. వడ్డీ వ్యాపారికి అయిదొందల యాభై. సొసైటీలో కుదువపెట్టిన కనకం తాళి బొట్టు విడింపించాలి. ఎరువుల అంగడి వాడిచ్చిన అప్పు కట్టాలి. పండుగకు కనకానికి పిల్లలకు బట్టలు కొనాలి. ఈ ఖర్చులన్నింటికీ డబ్బు సరిపోతుందా’ అన్న ఆలోచనలతో కొటాయ్‌కి సన్నగా కునుకు పట్టింది.

మెళుకువ వచ్చి కన్ను తెరిచేసరికి బస్సు రేపల్లె బస్టాండులో ఆగి వుంది.

బనీను లోపలి జేబు తడిమి చూసుకున్నాడు.

పైకం మాయం…!

అభిప్రాయాలు లేవు »కథలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో