Oct2007
విముక్తి గీతం
కొత్త రాగమెత్తుకో వద్దు
నే సవర్ణుణ్ని కాను
అతి శూద్రుణ్ని అసలేకాదు
గుట్టు చప్పుడు కాని జీనోసైడ్
వెర్బల్ దాడి చెయ్యొద్దు
మీ నాలుగు స్థంభాలాటలో
నేనెప్పుడూ లేను
పంగనామాలతో
పన్నగశయనులతో
నా డి.ఎన్.ఎ. సరిపోలేదు
ప్లీజ్! నా మతం మార్చొద్దు
అవసరానికి నన్నిట్లా
మీ చిట్టాలో చేర్చొద్దు
నేనీ జంబూద్వీప మూలవాసిని
ఎత్తిన ఆయుధం కింద
మళ్లీ మళ్లీ శంభూకుణ్ని కాలేను
కుబుసం విడువడం తెలియని వాణ్ని
వొంటిపై చర్మం వున్నవాణ్ని
తరాలుగా నిప్పులో కాగి
తప్పెటగా ఖంగుమంటున్న వాణ్ని
ఎందుకు మళ్లీ
దళిత గోవిందాల దగ్గరితనాలు
రహస్య వ్యూహాల కొత్త స్నేహాలు
ఫరో చెర నుండి
కనానుకు ప్రస్థానిస్తున్న వాణ్ని
కర్మ సిద్ధాంతాల సమాధి పెగల్చుకొని
పునరుత్థానమైన వాణ్ని
చీకటి కోణాన్ని దాటి వచ్చిన గాయాన్ని
రెండవ రాకడకు అభిముఖంగా
నడుస్తున్న విముక్త గీతాన్ని
అతి శూద్రుణ్ని – ఆవకాయ జాడీని కాను
నేనో అగ్నిపర్వతాన్ని
అర్థమైందా ? ఆమెన్!