అపరాజిత 2 : అవ్వాతాతల వెచ్చని ఒడిలో కొంతకాలం

మా జాతి ప్రజల్లో కుటుంబ సంబంధాలు ఇప్పటికీ బలంగానే ఉన్నాయి. ఉన్నంతలో కుటుంబం మొత్తం పంచుకోవడం , ఒకరిపట్ల ఒకరు ప్రేమగా ఉండడం , పెద్దల , చిన్నపిల్లల సంరక్షణ వంటివి మా వారి సంస్కృతిలో భాగం . ఎప్పుడూ ఏ బంధువుకో సహాయం చేస్తూ ఉండడంవల్ల చాలావరకు ఎవరి దగ్గరా కూడబెట్టుకున్న డబ్బు ఎక్కువగా కనిపించదు . ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆతిథ్యమివ్వడమనేది ఇప్పటికీ తమ పవిత్ర విధి అని భావిస్తారు .ఇందువల్ల సూ జాతి స్త్రీలు పొద్దున్నుంచి రాత్రి దాకా వంట చేస్తూ కనిపిస్తారు. నాలుగైదు తరాల దాయాదులు కూడా బంధుత్వాలు నిలుపుకుంటూ దానితో వచ్చే అన్ని హక్కులను, బాధ్యతలను పాటిస్తారు.

పాత సూ సమాజం తియోస్పయే విధానంపై (Tiyospaye) ఆధారపడి వుండేది. తియోస్పయే ఉమ్మడి కుటుంబం లాంటిది. ఇందులో అవ్వలు , తాతలు, మామయ్యలు, అత్తలు, చిన్నాన్నలు , పిన్నమ్మలు ఉండేవారు. తొయోస్పయే అందరినీ రక్షించే తల్లి గర్భంలాంటిది.ఆ సమాజంలో పిల్లలు ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాళ్లు కాదు. వాళ్లను గారాబం చెయ్యడానికి, బతుకు పాఠాలు నేర్పడానికి ఎంతోమంది అమ్మలు, నాన్నలు ఉండేవారు. నిజానికి తమ పిల్లవాడిని సక్రమంగా పెంచడానికి సహాయంగా సొంత తండ్రి ముఖ్యమైన విద్యలు తెలిసిన మరో వ్యక్తిని ఎన్నుకునేవాడు. ఇతను కూడా ఆ పిల్లవాడికి నాన్నే. ఆడపిల్లలు కూడా ఇలాగే పెరిగేవారు. తల్లిదండ్రులు కుటుంబ పోషణ కోసం వేటకు వెళితే అవ్వాతాతలు పిల్లలను చూసుకునేవారు.

తెల్లవాడు ఈ తియోస్పయేను ధ్వంసం చేశాడు. అలా ద్వంసం చెయ్యడాన్ని ఒక విధానంగా అమలు చేశాడు. తెగలను దారికి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న మిషనరీలకు, గవర్నమెంటు ఏజెంట్లకు ఉమ్మడి కుటుంబంలాంటి తియోస్పయే పెద్ద అడ్డంకి అయిపొయ్యింది. ఈ కుంటుంబపు ఆచారాలు, పద్దతులు తెల్లవాడి ‘పురోగతి’ ‘నాగరికత’ అనబడే వాటికి అవరోధాలయ్యాయి. అందువల్ల గవర్నమెంటు తియోస్పయేను ముక్కలుచెక్కలు చేసి ‘చిన్న కుటుంబం’ అనే కొత్తరకపు బంధుత్వాన్ని సూ ప్రజలపై రుద్దింది – ఒక్కో కుటుంబానికి కొంత భూమిని కేటాయించి , వారికి “సంపూర్ణమైన స్వార్థంతో తప్ప సాధ్యం కాని గొప్ప నాగరికత వల్ల వచ్చే లాభాల” గురించి కొత్త పాఠాలు నేర్పడానికి ప్రయత్నించింది. తమ ఆచారాలను మార్చుకోవడనికి ఒప్పుకోనివారికి ఒంటరితనం , ఆకలి మాత్రమే మిగిలింది . ఈ నాగరికత వాదులు మా మీద ఏవేవో ప్రయోగాలు చేశారు. ఇప్పుడు తియోస్పయే లేదు, తెల్లవాడి చిన్న కుటుంబమూ లేదు. మిగిలిందల్లా తల్లిదండ్రులు లేని ఇండియను పిల్లలే. పాత తియోస్పయేని గుర్తుకు తెచ్చేది అవ్వాతాతలు మాత్రమే. తల్లో , తండ్రో లేక ఇద్దరూ లేని పిల్లలు ఉండడం సర్వసాధారణమైన ఈ రోజుల్లో ఆ పిల్లలను పెంచడంలో అవ్వాతాతలు ఎప్పటిలాగే ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.

మా నాన్న పేరు బిల్ మూర్ . ఆయనలో కొంచెం ఇండియన్ రక్తం ఉంది కానీ, చాలావారకు ఫ్రెంచి , స్పానిష్ రక్తమే . ఆయన మొదట్లో నౌకాదళంలో ఉండేవాడు కాని, తరువాత ట్రక్కు డ్రయివర్ అయ్యాడు. ఆయనిప్పుడు ఒమాహోలో (Omaho) ఉన్నాడనుకుంటా. నౌకాదళపు యునిఫారంలో ఉన్న ఆయన ఫొటొ ఒకటి మాత్రమే మా ఇంట్లో మిగిలింది. నేను ఇంకా అమ్మ పొట్టలో ఉండగానే ఆయన అమ్మను వదిలేసి వెళ్ళిపొయ్యాడు. ఆయనకు మా పిల్లల గురించి ఏమీ పట్టలేదు. ఆ తరువాత ఆయన ఇంకో పెళ్లి చేసుకుని , ఆమెకు కూడా పిల్లల పుట్టగానే ఆమెను వదిలేసాడు. ఆ పిల్లలు ఏమయ్యరో నాకు తెలీదు. అందరిలా నాకూ ఒక తండ్రి ఉన్నాడని గుర్తు చెయ్యడానికి ఆ ఒక్క ఫొటో మాత్రమే మిగిలింది. అమ్మ ఆయన గురించి ఎప్పుడూ మాట్లాడేది కాదు. మూర్ తాత – ఆయన సొంత తండ్రి, కూడా ఆయన ఊసెత్తేవాడు కాదు. అతడికి నేనంటే ఏమీ పట్టలేదని , అతడో తాగుబోతని మాత్రమే నాకు తెలుసు.

ఆయనను నేను రెండుసార్లు మాత్రమే చూశాను. నాకు పదకొండేళ్లేప్పుడు తన తండ్రిని డబ్బులు అడగడానికి వచ్చాడు. మరోసారి అతడి సోదరుడు చనిపోతే అంత్య క్రియల కోసం వచ్చాడు. నావైపు చూశాడు కాని, నేనసలు అక్కడ లేనట్లు నాలోంచి చూశాడు. నేనెవరో అడగలేదు. అసలాయన ఎవరితోనూ మాట్లాడలేదు. అంత్య క్రియల తరువాత అందరితో చేతులు కలిపి అక్కడనుంచి పారిపోతున్నట్లు మాయమైపొయ్యాడు. 1954 లో , నా ఒకటో ఏట అమ్మ ఆయనకు విడాకులు ఇచ్చింది.

నాకు తొమ్మిదేళ్లప్పుడు అమ్మ మరో పెళ్లి చేసుకుంది. ఈ పెంపుడు తండ్రి, కనీసం ఎప్పుడూ కనిపించని సొంత తండ్రి కంటే హీనంగా ఉన్నాడు. అతడో పచ్చి తాగుబోతు. నాకు పదేళ్లు వచ్చీ రాకముందే మా పిల్లలందరికీ తాగుడు నేర్పించాడు. అమ్మ అతడిని పెళ్లి చేసుకున్న తరువాత నేను ఇంటిపట్టున ఉండడం మానేశాను. అతడు నావైపు చూసే పద్దతి నాకు నచ్చేది కాదు. అతడి చూపులు ఇబ్బందిగా అనిపించేవి . ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు అమ్మతో గొడవపెట్టుకునేదాన్ని “ అతడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అతడిలో తండ్రి లక్షణాలు లేవు. అతడు మమ్మల్ని ప్రేమించడు, మాకోసం ఏదీ చెయ్యడు.”

అప్పట్లో అమ్మకు నాకు సరిగా పడేది కాదు. నేనేమో స్వతహాగా ఎదురుతిరిగే మనస్తత్వం ఉన్నదాన్ని. వాళ్లు పెళ్లి చేసుకోవడం గురించి నేనేమీ చెయ్యలేక పొయ్యాను. దీంతో బాగా తాగుతూ , జిప్సీల్లాగ తిరుగుబోతునయ్యాను. ఈ విధంగా అమ్మను కసిగా బాధ పెట్టేదాన్ని . నాలో మార్పు రావలసి ఉండింది, అమ్మలో మార్పు రావలసి ఉండింది. ఇప్పుడు మేమిద్దరం బాగానే కలిసిపోతాం. అప్పట్లో నేను చాలా అసహనంగా ఉండేదాన్నని ఇప్పుడు తెలుస్తోంది. అప్పట్లో అమ్మకు కూడా ఎక్కువ అవకాశాలు లేవు. మేము జీవించిన జీవితాలు అలాంటివి. బతుకు మీద ఆశలు ఉండేవి కాదు. ఆత్మలు కొంచెంకొంచెంగా ధ్వంసం చెయ్యబడేవి. ఉన్న పాఠశాలలు మమ్మల్ని చాలావరకు నిరక్షరాస్యులుగానే మిగిల్చాయి. మాకు వేరే పనులు కూడా నేర్పలేదు. ఉన్న భూమిని తెల్ల రైతులకు కౌలుకు ఇచ్చేశారు. అప్పట్లో మగవాళ్లు చేసేందుకు ఏ పనీ లేక మందు కొట్టేవాళ్లు. అలాంటి పరిస్థితుల్లోమంచి భర్తను ఎన్నుకోవడానికి అమ్మకు ఎక్కువ అవకాశం లేదు .

అమ్మకు మేం ఆరుగురు పిల్లలం. అందులో ఒకడు దత్తు పిల్లవాడు. అమ్మ వాడి ఇంటికి ఎందుకో వెళితే వాడొక్కడే ఇంట్లో ఉన్నాడు. ఒళ్ళంతా తడిసిపొయ్యి, మురికి ఓడుతూ ఆకలితో గుక్కపట్టి ఏడుస్తున్నాడట. వాడిని ఆ స్థితిలో చూసి అమ్మకు బాగా కోపం వచ్చింది. ఎలాగోలా వాడిని దత్తత తెచ్చుకున్నాం. వాడిని మేం బాగా గారాబం చేశాం. మా కుటుంబంలో కనీసం ఒక్కపిల్లవాడైనా గారాబంగా పెరిగాడు.

నాన్న వెళ్లిపొయ్యిన తరువాత కుటుంబ పోషణ భారం అమ్మ మీద పడింది. నర్సు ట్రైనింగు పూర్తి చేసిన తరువాత దాదాపు వందమైళ్ల దూరంలో ఉన్న పియెర్ అనే నగరంలో మాత్రమే ఆమెకు ఉద్యోగం దొరికింది. తను ఉద్యోగానికి వెళితే మమ్మల్ని చూసుకోవడానికి మమ్మల్ని అవ్వాతాతల దగ్గర వదిలి వెళ్లింది. అమ్మను ఎప్పుడో గాని చూసే వాళ్లం కాదు. అంతదూరం నుంచి రావడానికి రవాణా సౌకర్యం ఉండేది కాదు. కారు కొనడానికి తన దగ్గర అంత డబ్బు లేదు. మాకు తన అవసరం బాగా ఉన్నప్పుడు కూడా తెల్ల పేషంట్లను చూసుకుంటున్న ఆమె మాకు అందుబాటులో ఉండేది కాదు. నేను పెద్దయిన తరువాతనే ఆమెతో ఎక్కువ సమయం గడపగలిగాను.

చాలామంది రిజర్వేషను పిల్లల్లాగే మేం కూడా అవ్వాతాతల దగ్గరికి వెళ్లిపొయ్యాము. మేము కాస్త ఫర్వాలేదు. చాలా మంది ఇండియన్ పిల్లలు శరణాలయాల వంటి ఇళ్లలో చేరాల్సి వచ్చేది. ఆ పిల్లల తల్లిదండ్రులో, లేకపోతే వారి అవ్వాతాతలో తామే ఆ పిల్లలను చూసుకుంటామంటే ఒక్కోసారి చెల్లేది కాదు. ఆ నిర్ణయం సంఘ సేవకులు చేసేవారు. ఆ పిల్లల సొంత ఇళ్లల్లో సరియైన సౌకర్యాలు లేకపోవడమో , ఫ్లష్ టాయిలెట్లతో మంచి మరుగు దొడ్లు లేకపోవడమో, ఆ కుటుంబం బాగా దారిద్ర్యంలో ఉండడం వంటి కారణాలతో పిల్లలను శరణాలయాలవంటి ఇళ్లకు తరలించేవారు. పిల్లలను బాగా చూసుకునే అవ్వాతాతలకంటే ఫ్లష్ టాయిలెట్లు ముఖ్యమని తెల్ల సంఘ సేవకులకు అనిపిస్తుందేమో. పిల్లలకు “పరిశుభ్ర వాతావరణాన్ని ” పరిచయం చెయ్యడం కోసం వారికి ఏమాత్రం పరిచయం లేని తెల్లవాళ్ల దగ్గరకు పంపేవారు. ఇలా ముందు తరాల వారు ఎంతో మంది చాలా పోగొట్టుకున్నారు.

మమ్మల్ని కూడా బోర్డింగు స్కూలుకు తీసుకెళ్లేంతవరకూ మేము అవ్వాతాతల దగ్గరే పెరిగాం. మా అవ్వ పేరు లూయిస్ ఫ్లడ్ . ఆమె మొదటి భర్త పేరు బ్రేవ్ బర్డ్ . ఈ తాతగురించి తెలుసుకుందామని చాలా ప్రయత్నించాను. ఎన్నో లకోట చరిత్ర పుస్తకాలు చదివాను. బ్రేవ్ బేర్స్ , బ్రేవ్ బుల్స్ ఉన్నారు కానీ బ్రేవ్ బర్డ్స్ ఎక్కడా లేరు. అవ్వ బతికి ఉన్నప్పుడు తననే అడిగి ఉండాల్సింది. నాకు తెలిసినంతవరకూ అవ్వాతాతలు ప్రెయిరీలో తమ వంతు భూమిలో ఎక్కడో ఉండేవారట. అవ్వ చిన్నప్పుడు తెగ మొత్తం రేషనుపై ఆధారపడేవారట. అన్ని కుటుంబాలకు ఒక్కొక్క రేషను కార్డు ఉండేదట. ఆ కార్డును ఏదో విలువైన వస్తువులా పూసలతో కుట్టిన అందమైన చిన్ని సంచుల్లో పెట్టుకుని మెడకు తగిలించుకునేవారట. అలాంటి సంచులు ఇప్పుడు మూడు వందల డాలర్ల ఖరీదు చేస్తాయి. ప్రతినెలా కాఫీ, చక్కెర, పిండి సంచులు, మాంసం తెచ్చుకోవలసి వచ్చేది. చాలావరకు పిండి పదార్థమే అయినా అదే కడుపు నింపేది . ఒక్కోసారి బతికి ఉన్న బర్రెలను ఇచ్చేవారు. అవి సన్నగా ఎముకలు దేలి ఉండేవి. వాటిని ఒక పెద్ద దడిలోకి నెట్టేవాళ్లు. మగవాళ్లు పాతకాలపు వేటగాళ్లలా ఆ జీవాల్ని వేటాడే ఆట ఆడేవారు. ఒకసారి బ్రేవ్ బర్డ్ తాత రేషను తేవడానికి ఆరు గంటల దూరంలో ఉన్న టౌనుకు ఒంటరిగా వెళ్లాడు . ఇంటికి వచ్చే దారిలో పెద్ద వర్షం వచ్చింది. మెరుపులకు ఉరుములకు భయపడిన గుర్రాలు బండిని తలకిందులుగా చేస్తూ పరిగెట్టాయట. వాటి కళ్ళేల్లో చిక్కుకున్న తాతను రెండు మైళ్ళ వరకు రాళ్లు రప్పలమీదుగా, ముళ్ల కంచెలమీదుగా ఈడ్చుకెళ్ళాయి. చివరికి తాత శవం దొరికింది.

అప్పటికి అవ్వకు ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఉండేవారు. ఆ యిద్దరు మామయ్యలకు క్షయ వ్యాధి సోకి హాస్పిటల్లో ఆ రోగంతోనే చనిపొయ్యారు. క్షయ ఇప్పటికీ మా జాతికి పెద్ద మహమ్మారే. ఆడవాళ్లకంటే ఎక్కువగా మగవాళ్లకు ఈ వ్యాధి సోకుతుంది. మా మామయ్యలు కనీసం పెద్దయిన తరువాత ఈ జబ్బు బారిన పడ్డారు. చాలావరకు చిన్నప్పుడే ఈ జబ్బుతో ఎంతో మంది పిల్లలు చనిపోతారు. ఇంతకి అవ్వకు తెలిసిందల్లా తన పిల్లలు ఎక్కడ ఎలా చనిపొయ్యారన్నది మాత్రమే. వేరే రికార్డులేవీ లేవు. ఆమెకు చేరిందల్లా పూడ్చిపెట్టడానికి వారి శవ పేటికలు మాత్రమే.

నోబుల్ మూర్ అని ఒకాయన ఉండేవాడు. ఆయనకు పిల్లలు ఉండేవారు కాని భార్య చనిపొయ్యింది. మా అవ్వకూ పిల్లలున్నారు, భర్త చనిపొయ్యాడు. అలా వాళ్లిద్దరూ కలుసుకుని పెళ్లి చేసుకున్నారు. అప్పటికి మా అమ్మ పెద్దదయింది. మూర్ కు బిల్ అనే కొడుకు ఉండేవాడు. ఒక సంఘటన మరో సంఘటనకు దారి తీసి ఆఖరికి అమ్మ బిల్ ను పెళ్లి చేసుకుంది. ఇతనే మాకు కనిపించకుండా వెళ్ళిపొయ్యిన మా కుటుంబపు పెద్ద. అవ్వకు తాత దొరికితే అమ్మకు ఆయన కొడుకు దొరికాడు. మా అవ్వ మాత్రం అదృష్టవంతురాలు . కొడుకు ఎంత తాగుబోతు, తిరుగుబోతో, అతడి తండ్రి అంత మంచివాడు, బాధ్యతలెరిగినవాడు.

మూర్ అవ్వాతాతలు మమ్మల్ని చిన్నప్పట్నుంచి పెంచుతూ చాలా బాగా చూసుకున్నారు. నాకు తెలిసిన నాన్న మూర్ తాత మాత్రమే. కొడుకు స్ఠానంలో తను మా బాధ్యత తీసుకున్నాడు. తనకు సాధ్యమైనంత వరకూ మాకు మంచి ఇల్లు ఏర్పరచడానికి ప్రయత్నించాడు. పాఠశాలలో పనివాడిగా పని చేస్తూ, వచ్చిన కొంత డబ్బుతోనే తన కుటుంబాన్ని, తన కొడుకు కుటుంబాన్ని పోషించేవాడు. ఇంట్లో వున్న మా తొమ్మిదిమందిమే కాక ఉద్యోగాలు లేని కొంతమంది పేద బంధువులు కూడా ఇంటికి వచ్చేవారు. ఎలా చేసేవాడో కానీ, తాత మా అందరినీ బాగా చూసుకునేవాడు.

ప్రెయిరీలో హి-డాగ్ దగ్గర గుడిసెలాంటి ఇంట్లో మమ్మల్ని పెంచారు అవ్వాతాతలు. అప్పుడు మాకు ఎలక్ట్రిసిటీ లేదు, ఇల్లు వెచ్చబరుచుకునే సాధనాలేవీ లేవు. నది నుంచి నీళ్లు తెచ్చుకునేవాళ్లం. పేద తెల్లవాళ్ల దగ్గరో గెట్టోల్లో నివసించే నల్లవాళ్ల దగ్గర వుండే అతి సామాన్యమైన వస్తువుల గురించి కూడా మాకు అప్పట్లో తెలీదు. టీవి, రేడియో లేనందుకు మాకు బయటి ప్రపంచం గురించి తెలిసింది చాలా తక్కువ. అదొక వరమేమో.

థ్యాంక్స్ గివింగ్ రోజున మాత్రమే మాకు హాంబర్గర్లు దొరికేవి. అదే మాకు పెద్ద విందు భోజనం. వాటి అద్భుతమైన రుచి నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. తాత మాకు కుందేలు, జింక, ఉడుత, ముళ్ల పంది మాంసాలు పెట్టేవాడు. మంచి ఆహారం కొనుక్కోవడానికి కావలసిన డబ్బు ఎప్పుడూ ఉండేది కాదు. మూర్ తాత తన ఇద్దరు సోదరులతో కలిసి ఎప్పుడూ వేటకు వెళ్లేవాడు. అలా తప్ప మాకు మాంసం దొరికేది కాదు. తాత కొన్నిసార్లు చేపలు పట్టడానికి వెళ్లి, తాబేలు పట్టుకొచ్చేవాడు. తాబేలు మాంసంలో కోడి, పంది, కుందేలు, జింక, అడవి బాతు లాంటి జంతువుల రుచులు ఉంటాయని చెప్పేవాడు.

మేము గుడిసె లాంటి చిన్న ఇంట్లో ఉండేవాళ్లం . దాంట్లో ఒకే ఒక్క గది ఉండేది. అదే మాకు వంట గది, పడక గది, భోజనాల గది – ఏదనుకుంటే అది. ఏమయితేనేం ఆ ఒక్క గది మా అందరి ఇల్లు. అవ్వ ఎలాంటిదంటే ఎవరైనా ఇంటికి వచ్చారంటే వెంటనే వాళ్లకు తిండి పెట్టడం మొదలెట్టేది. ఆమె నాకు ఎప్పుడూ చెప్పేది: “ఇంట్లో ఎక్కువ లేకపోయినా , వాళ్లు తింటారు. వాళ్లు మనల్ని చూడడానికి ఎంతో దూరం నుంచి వచ్చారు, అందుకని వాళ్లు ముందు తింటారు. వాళ్లు వెళ్లిన తరువాత , ఏది మిగిలి ఉంటే అది, చిన్నరొట్టె ముక్క అయినా సరే మనం తింటాం.” ఇలాంటి విషయాలు నేను ఆమె దగ్గర నేర్చుకున్నాను. అవ్వ కాథలిక్ . మమ్మల్ని తెల్లవాళ్లలా పెంచడానికి ప్రయత్నించింది. తెల్లవాళ్లలా పెరిగితే మా భవిష్యత్తు బాగుంటుందని నమ్మేది. మేరీ ఫొటోలు, శిలువ ఫోటోలు గోడల మీద వేలాడుతున్నా , దైనందిన జీవితానికి వచ్చేసరికి ఆమె పూర్తి సూ అయిపొయ్యేది. తాను ఎంత ఇండియనుగా మిగిలిపోయిందో తాను గమనించిందోలేదో నాకు తెలీదు. అవ్వ స్వఛ్చమైన లకోట భాష మాట్లాడగలిగేది. ఆమెకు మూలికల గురించి కూడా బాగా తెలుసు. వాటి ఉపయోగాలను మాకు వివరించేది. బెర్రీలు, టీ ఆకులు తెంపుకురావడానికి మమ్మల్ని తనతో తీసుకు వెళ్లేది. చలికాలంలో చోక్ చెర్రీలు, వాటి బెరడు, కొమ్మలు ఇంటికి తీసుకెళ్లేవాళ్లం . వాటి లోపలి భాగాలను ఉడికించి ఆరోగ్యం బాగా లేనప్పుడు దాన్ని టీ లాగ తాగేవాళ్లం. ఆకురాలు కాలంలో చోక్ చెర్రీలు, అడని ద్రాక్షలను తెంపుకురావడానికి అవ్వతో వెళ్లేవాళ్లం. అప్పట్లో అవే మాకు తెలిసిన తీపి పదార్థాలు. స్కూలుకు వెళ్లేదాకా చాక్లెట్ల గురించి కూడా తెలీదు.

మాకు అప్పట్లో చెప్పులు కానీ కొత్త బట్టలు కానీ ఉండేవి కావు. సంవత్సరానికి ఒకసారి కాథలిక్ మిషను బేస్ మెంటులో జరిగే అమ్మకాలకు తీసుకెళ్లమని ఎవరో ఒకరిని అడిగేవాళ్లం. ఒక్కోసారి అక్కడ చలికాలంలో వేసుకోవడానికి చెప్పులో, సెకండ్ హాండు స్కర్టో దొరికేవి. మేంకూడా క్రిస్టమస్ జరుపుకునేవాళ్లం . కానీ తెల్లవాళ్లలా కాదు. క్రిస్టమస్ రోజున అవ్వ మాకు కాటన్ బ్యాగులు తయారు చేసి వాటిలో ఒక ఆపిల్ పండు, ఒక బత్తాయి పండు, గుప్పెడు పల్లీలు, కొంచెం చక్కర పెట్టి ఇచ్చేది. మా క్రిస్టమస్ అంతా అదే.

అప్పటికి ఇంకా చిన్న పిల్లనైనందున జాత్యహంకారం గురించి నాకింకా తెలీదు. నేను మూడో తరగతిలో ఉన్నప్పుడు ఒక బంధువుతో కలిసి పైన్ రిడ్జ్ లోని ఒక అంగడిలోకి వెళ్లాను. మా టీచరు ఒకరు అంగడిలో ఉండింది. నేను కూరగాయలు పళ్లు పెట్టేచోటికి వెళ్లి ఒక పెద్ద బత్తాయి పండు ఏరుకున్నాను. మా బంధువు ఒకరు నాకు కానుకగా ఇచ్చిన నికిల్ (ఒక సెంటు) తో ఆ పండు కొనాలనుకున్నాను. అంగడి యజమాని నాతో అన్నాడు “ఒక నికిల్ తో ఈ మేలు రకం బత్తాయిలు కొనలేవు. అవి తప్ప నా దగ్గర వేరే రకం లేవు. ఆ పండును గంపలో పెట్టెయ్ “. ఈ విషయం నాకింకా గుర్తుంది. పక్కనే వున్న తెల్ల టీచరు బత్తాయి పండు బుట్టలో పెట్టేస్తున్న నన్ను చూసి, అంగడి అంతా వినిపించేట్టు అరిచింది : “ఈ మురికి ఇండియన్లు తిండి మీద ఎందుకు చేతులు వేస్తారు? బత్తాయిలు కొందామనుకున్నాను. ఇప్పుడు వేరే చోటికి వెళ్లి కొనుక్కోవాలి.” ఏం జరిగిందో ఏమిటో నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ ఆ సంఘటన మాత్రం నా మనసులో నాటుకుపొయ్యింది.

అవ్వ నాకు చెప్పింది: “ఏమైనా చెయ్యి కానీ, తెల్లవాళ్ల ఇంట్లోకి వెళ్లొద్దు. వాళ్లు మన ఇంటికి వచ్చి మన పేదరికాన్ని చూసి నవ్వుతారు.” మేము హి-డాగ్ లో వున్నప్పుడు అక్కడ కొన్ని ఇండియన్ ఇళ్లు, ఒక బస్ స్టేషను, ఒక గ్యాస్ స్టేషను మాత్రమే ఉండేవి. తరువాత గవర్నమెంటు మమ్మల్ని పార్మలీ అనే చోటికి తరలించి, అక్కడ వాళ్లు ఏర్పరచిన గూళ్లలాంటి ఇళ్లల్లో పెట్టారు. వాటిని అందరూ “పేదరికపు ఇళ్లు” అనేవారు. అక్కడ ఒక పాఠశాల కట్టారు. అలా కొంతమంది తెల్ల టీచర్లు కూడా అక్కడ చేరారు. నేనొక చిన్న తెల్లమ్మాయితో స్నేహం చేశాను. “మా ఇంటికి రా” అందా అమ్మాయి . “నేను ఎవరింటికి వెళ్లకూడదు” అని చెప్పాను . “మా అమ్మ ఇంట్లో లేదు. పక్కింటికి వెళ్ళింది. వచ్చెయ్ !” అలా నేను అవ్వకు తెలీకుండా వాళ్లంట్లో దూరాను. ఆ అమ్మాయి దగ్గర చాలా బొమ్మలు ఉన్నాయి. అలాంటివి నేను కేటలాగుల్లో మాత్రమే చూశాను. ఆ అమ్మాయి “కూర్చుని నా బొమ్మలతో ఆడుకో.” అని వెళ్లిపొయ్యింది. తను నా స్నేహితురాలనుకుని ఆడుకోవడం మొదలెట్టాను. కొద్దిసేపటికి హఠాత్తుగా ఎవరో తలుపులు బాదుతున్న చప్పుడు వినిపించింది. ఆ అమ్మాయి వాళ్ల అమ్మ అరుస్తోంది “తలుపు తియ్యి ! నా ఇంట్లో దూరడానికి ఎంత ధైర్యం. నన్నే బయటేసి తాళం వేశావు.” ఆమె అరుస్తోంది, నేను వణికిపోతున్నాను. ఏం చెయ్యాలో తెలీలేదు నాకు. నేను ఆమెతో అన్నాను “తలుపులు నేను వెయ్యలేదు. దానికి తాళం వేసుందని నాకు తెలీదు.” “ నా బెల్టు ఎక్కడ?” ఆమె అరిచింది. ఇంట్లోకి నడిచి ఒక పెద్ద లెదరు బెల్టు పట్టుకుంది. “ఇక్కడికి రా! “ అందామె.

నేను అవ్వ దగ్గరికి వేగంగా పరిగెట్టాను. “ఆ తెల్లావిడ నన్ను బెల్టుతో కొడుతుందట”

“నువ్వేం చేశావు?”

“నేనేం చెయ్యలేదు. వూరికె వాళ్లింట్లోకి వెళ్లాను. అందుకని నన్ను కొడుతుందట . వాళ్ల అమ్మాయి నన్నిలా ఇరికించింది. అవ్వా నన్ను ఎక్కడైనా దాచెయ్ !” నేను చాలా భయపడిపొయ్యాను.

అప్పటికి ఆ తెల్లావిడ మా ఇంటిదగ్గరకి వచ్చేసింది. “నువ్వు ఇక్కడే ఉండు!” అవ్వ నాతో అని లోపల్నించి వేటకత్తి పట్టుకొచ్చింది. గడప దగ్గర నుంచుని ఆ తెల్లావిడతో అంది : “చండాలపు తెల్లతోలుదానా, ఇంకొంచెం ముందుకు వచ్చావంటే నీ చెవులు కోసి పడేస్తాను.” ఎవరూ ఆ తెల్లావిడలా పరిగెట్టడం నేను ఎప్పుడూ చూడలేదు.

సౌత్ డకోటాలో తెల్లపిల్లలు నడక నేర్చుకోకముందే జాత్యహంకారం నేర్చుకుంటారు. నాకు ఏడెనిమిదేళ్లప్పుడు మా ప్రిన్సిపల్ కూతురితో పోట్లాడాను. మంకీ బార్ మీద్ తలకిందులుగా వేలాడుతూ ‘రా కోతీ, ఇదిగో ఇది నీకోసమే తెచ్చాను .’ అని నన్ను వెక్కిరించింది . నేను ఇండియన్ వాసన వేస్తున్నానని, ఇండియనులా ఉన్నానని కూడా అంది. ఆ పిల్ల జుట్టు పట్టుకుని మంకీ బార్ మీదనుంచి పడలాగాను. ఇంకా ఏమైనా చేసేదాన్నేమో కానీ మా ప్రిన్సిపల్ అటువైపు రావడంతో ఆ పిల్ల బతికిపొయ్యింది.

ఇంతకుముందు చెప్పాను కదా, మా అవ్వ సూ భాష ధారళంగా మాట్లాడేదని. అమ్మ కూడా బాగానే మాట్లాడేది. కానీ పిల్లలకు మాత్రం ఆ భాష నేర్పేవారు కాదు, మాట్లడనిచ్చేవారు కాదు. “నాకుమన భాష ఎందుకు నేర్పవు?” అని అవ్వను చాలాసార్లు అడిగాను. ఆమె ఎప్పుడూ ఒకే జవాబు చెప్పేది: “ఎందుకంటే నువ్వు మంచి చదువు చదువుకుని, మాలా ఒకరిమీద ఆధారపడకుండా వుండాలని. రాను రాను చాలా కష్టాలుంటాయి. నీకు తెల్లవాడి చదువు లేకపోతే ఈ ప్రపంచంలో బతకలేవు. మన ఇండియన్ భాష మాట్లాడితే నువ్వు ముందుకు పోలేవు. “

ఇండియన్ పద్దతులు నేర్పకుండా మాకు మంచి చేస్తున్నానని ఆమె నమ్మేది . ఆమె కాథలిక్ అవడం కూడా ఇందుకు ఒక కారణం. మిషనరీలు ఇండియన్లకు ఎప్పుడూ గుర్తుచేసేవారు: “మనిషిని రక్షించాలంటే ఇండియన్ను చంపాలి!”. కష్టాలతో కూడిన జీవితాన్ని తప్పించుకోవడానికి అదో పద్దతి. చర్చికి వెళ్లడం , తెల్లవారిలా బట్టలు వేసుకుని , వాళ్లలా ప్రవర్తించడంతో మరో మంచి జీవితం సాకారిస్తుందని , తెల్లవాడి జీవితం , తెల్ల పెయింట్ చేసిన ఇల్లు , కార్పెట్ నేల, గరాజ్ లో మెరిసిపొయ్యే కారు, తాగుబోతు కాకుండా కష్టపడి పనిచేసే భర్త వంటివన్నీ దొరుకుతాయని ఆమె నమ్మేది.

ఏమి చేసినా, ముఖాల్లో కానీ, మనసుల్లో కానీ మార్పులు రావని ఆమె చుట్టూ చాలామంది ఉదాహరణలు చూసినా ఆమెకి తెలిసి వచ్చేది. అది చూడడానికి ఆమె ప్రయత్నించలేదు, ప్రయత్నించదు. ఒంటరితనంలోంచి రగిలిన నిష్ఫలమైన ఆశలు తనవి.

అవ్వ మిషన్ స్కూల్లో చదివింది. అక్కడే ఆమె ఇండియన్ పద్దతులు చాలావరకు విడిచిపెట్టింది. ఆమె నాకు ఇల్లిచ్చింది , ప్రేమనిచ్చింది కానీ ఇండియన్ పద్దతులు నేర్చుకోవాలంటే నేను ఇంకెక్కడికైనా వెళ్ళాల్సిందే . అందుకోసం అవ్వ వాళ్ల అక్క మేరీ దగ్గరికి వెళ్లేదాన్ని. ఆమె భర్త పేరు చార్లీ లిటిల్ డాగ్ . సూ పద్దతిలో వాళ్లను కూడా అవ్వ తాత అనే పిలిచేదాన్ని. తాతకు నూటానాలుగేళ్లు, అవ్వకు తొంభై ఎనిమిది. వాళ్లు చాలా ఆచారవంతులు, పాత పద్దతులు పాటించేవారు. నది నుంచి మాత్రమే నీళ్లు తెచ్చుకునేవాళ్లు . వాళ్లు ఇంకా వందేళ్ల కిందటి సూ పద్దతుల్లోనే జీవించేవారు. చార్లీ లిటిల్ డాగ్ మాట్లాడితే , పాతకాలపు సూ భాషనే మాట్లాడేవాడు. ఆయన భాష అరవై డెబ్బై ఏళ్ల వారికి మాత్రమే అర్థం అవుతుంది. అప్పటికీ ఇప్పటికీ భాష చాలా మారిపొయ్యింది. పాత పోరాట కథలు, జానపదాలు వినడానికి వాళ్ల దగ్గరికి వెళ్లేదాన్ని.

ఫూల్ బుల్ తాత దగ్గరికి కూడా వెళ్లేదాన్ని. ఆయనే నన్ను పెయూట్ పూజకు మొదటిసారి తీసుకెళ్లాడు. మా ఇంకో బంధువు ఎల్సీ ఫ్లడ్ ప్రభావం నా మీద చాలా ఉంది. ఆమె తనలో తాబేలు ఆత్మ ఉందని చెప్పేది. ఆమె చాలా గట్టిది, ఎవరిమీదా ఆధారపడేది కాదు , దృఢమైన మనస్తత్వం గలది. తాబేలు దృఢత్వానికి , దీర్ఘాయుష్షుకు ప్రతీక అని ఇండియన్లు నమ్ముతారు. తాబేలు చనిపోయిన కొన్ని రోజుల తరువాత కూడా దాని గుండె కొట్టుకుంటూ ఉంటుంది. సూ ఆచారాలు పాటించేవారి ఇళ్లల్లో తాబేలు ఆకారంలో చేసిన తాయెత్తును పిల్లల ఊయలకు కడతారు. పిల్లల బొడ్డు తాడును ఆ తాయెత్తులో పెడతారు. దీనివల్ల ఆ పిల్లలకు చెడుగాలి నుంచి రక్షణ ఉంటుందని, వారికి దీర్ఘాయుష్షు లభిస్తుందని నమ్మేవారు.

ఎల్సీ అత్త చెప్పే కథలు ఎంతో ఇష్టంగా వినేదాన్ని. ఆమె మా అవ్వ లాగే ఉండేది. ఆమె గొంతు ప్రవహిస్తున్న నీళ్లలా ఉండేది. ఇండియన్ , ఇంగ్లిషు కలిపేసి గబగబా మాట్లాడేసేది. ఆమె ఏం చెబుతుందో సరిగ్గ అర్థం చేసుకోవడానికి చెవులు రిక్కించి వినాల్సి వచ్చేది. ఆమె పూసలతో, ముళ్లపంది ముళ్లతో రకరకాల అందమైన వస్తువులు తయారు చేసి అమ్మేది. తను వైద్యురాలు కూడా (Medicine Woman – నేటివ్ అమెరికన్లలో ఈ వైద్యులకు, వైద్యురాళ్లకు , తెగ నాయకుడికున్నంత గౌరవం ఉంటుంది. వీరు ప్రకృతి సహజంగా లభించే మూలికలతో పసర్లతో , ప్రార్థనలు చేస్తూ వైద్యం చేస్తారు.) ఆమె తన తాబేలు శక్తిమీద తనకున్న గౌరవంవల్ల ఎవరినీ సహాయం అడిగేది కాదు, ఎవరి సహాయం స్వీకరించేది కాదు. ఎక్కడికి వెళ్లినా చిన్ని తాబేళ్లను, తాబేళ్ల ఆకారంలో చేసిన తాయెత్తులను ఇతర వస్తువులను తన వెంట ఉంచుకునేది. రోజ్ బడ్ కు, పైన్ రిడ్జ్ కు మధ్యలో ఉన్న మార్టిన్ అనేచోట ఒక్కతే నివసించేది. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేది కానీ, నేను తనను చూడడానికి వెళితే సంతోషించేది. ఒకరోజు ఆమె తన మూలికలు , ఇతర విచిత్రమైన వస్తువులతో నిండిన రెండు సంచులను మోసుకుంటూ మా ఇంటికి వచ్చింది. నాకు బహుమతి కూడా తెచ్చింది. రెండు చిన్ని తాబేళ్లు తెచ్చింది . వాటి చిప్పల మీద , కింది చర్మం మీద ఇండియన్ డిజైన్లు గీసింది. వాటికి పేర్లు కూడా పెట్టింది – ఒకదాని పేరు ‘రా’ ఇంకోదాని పేరు ‘పో” . తిండి కోసం పిలిస్తే అవి ఆమె దగ్గరికి దోగాడుతూ వెళ్లేవి. వాటికోసం సంచినిండా తిండిని ఇచ్చింది. ఆ చిన్ని తాబేళ్లు చిన్నిగానే ఉండిపొయ్యాయి, ఎప్పటికీ పెద్దగా అవలేదు. ఒకరోజు తెల్ల ప్రిన్సిపల్ కొడుకు వచ్చి వాటిని తొక్కేశాడు, ఊరికెనే వాటిని తొక్కి చంపేశాడు. అది విన్న అత్త తనకు అది చాలా చెడ్డ సంకేతమని చెప్పింది.

తాబేలు శక్తి ఉన్న ఆమె దేనికీ ఎప్పుడూ భయపడలేదు. ఒకచోటి నుండి మరో చోటికి వెళ్లడానికి ఎప్పుడూ దారిలో లిఫ్టు అడుగుతూ వెళ్ళేది. కొందరికి ఆమె మార్మికంగా కనిపించేది . ఇండియన్లు ఆమెను ఎంతో గౌరవంగా చూసేవారు, ఆమె “వాకన్ “ (wakan – పవిత్రమైనది )అని అనేవారు. 1976 వేసవి కాలంలో ఆమె ఇంట్లోనే ఎవరో ఆమెను కొట్టి చంపేశారు. మంచం కింద నగ్నంగా, తలనిండా పిచ్చి మొక్కలతో , బోర్లాపడి ఉన్న ఆమె శవం కనిపించింది. ఆమె ఎవరికీ ఏ హానీ చెయ్యలేదు, ఎవరినీ నొప్పించేది కాదు. అందరికీ తన చేతనైనంత సహాయం చేసేది. ఏ ఇండియన్ కూడా ఆమె వెంట్రుక కూడా తాకే సాహసం చెయ్యడు. ఆమె అలా చనిపొయ్యింది. ఆ చావుకు కారకులెవరో తెలుసుకోవడానికి ఎవరూ ప్రయత్నించలేదు. ఇండియన్ ప్రాణానికి సౌత్ డకోటాలో అంత ప్రాముఖ్యత లేదు. ఆమెలాంటి స్త్రీని నేను మళ్లీ చూడలేదు.

నాకు తెలిసిన ఎంతో మంది బంధువులు, ప్రాణ స్నేహితులు, నాకో, ఇతరులకో ఎంతో కావలసిన వాళ్లు ఎంతోమంది హత్యచెయ్యబడ్డారు. మంచి ఇండియన్లు ముందుగా పోతారు, వాళ్లు ఎప్పటికి ముసలివాళ్లు కారు. తాబేలు అత్త ఆమె తరంలో వాళ్లతో పోలిస్తే చాలా దృఢమైన వ్యక్తి. ఆమెతో వెళ్లిపోయిన జ్ఞానాన్ని తిరిగి సంపాదించాలంటే మరో రెండు తరాల కాలమైనా పడుతుంది.

మా అవ్వా తాతలు మంచి క్రిస్టియన్లుగా ఉండడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ కొన్ని ఇండియన్ నమ్మకాలు వారిని విడిచిపెట్టలేదు. నా చిన్నప్పుడు ఎవరికైనా జబ్బు చేస్తే మూర్ తాత పశువులకు నీళ్లు పట్టే దోనెలో బాతులను విడిచేవాడు, “బాతులు లోపలే ఉండి అటూ ఇటూ ఈదితే జబ్బు నయమవుతుంది. కానీ, అవి బయటకు గెంతి వెళ్లిపోతే జబ్బు బాగవదు.” అనేవాడు. అదెలా పని చేస్తుందో చెప్పేవాడు కాదు కానీ, దాని అందరూ నమ్మాలని ఆశించేవాడు. చాలాకాలం తరువాత మా అక్క బార్బరా తన పాపాయిని పోగొట్టుకున్నప్పుడు తనకోసం కొంతమంది బంధువులు , స్నేహితులు కలిసి పెయూట్ పూజ చేశారు. బార్బరా అమ్మను , అవ్వను పిలిస్తే , వాళ్లు నిజంగానే వచ్చారు. రాత్రంతా చేసిన పూజలో బాగా అలవాటు ఉన్నట్లు పాల్గొన్నారు. ఇదంతా తమ క్రైస్తవ గురువుకు ఎలా చెప్పుకోవాలా అని ఆలోచించారేమే కూడా. మా ఇంటి వెనుక వున్న ఎవరికో జబ్బు చేస్తే మూర్ తాత ఇండియన్ వైద్యుడిని పిలిపించాడని నా చిన్నప్పుడు ఎవరో చెప్పినట్టు గుర్తు.

హి- డాగ్ లో వున్నన్నాళ్లు , బోర్డింగ్ స్కూలుకు వెళ్లనన్నాళ్లు నేను చాల సామాన్యమైన జీవితం జీవించాను. పేదరికం వల్ల మేం పిల్లలం బాధ పడలేదు, పేదరికమంటే ఏంటో అప్పటికి మాకు తెలీదు. చుట్టు పక్కల వున్న ఇతర ఇండియన్లు మాలాగే జీవించేవారు . మా జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోవడానికి లేదు . మా లోపలి శూన్యాల్లో మేం జీవించేవాళ్లం . అక్కడెక్కడో ఇంతకంటే మంచి జీవితం వుంటుందని తెలియదు కనుక మాకు మా పరిస్ఠితులపట్ల కోపం ఉండేది కాదు. అలాంటి కోపాలు రావాలంటే న్యూ యార్క్ లో గెట్టోల పక్కనే పెద్ద పెద్ద లగ్జరీ అపార్టుమెంట్లు వున్నట్లు పేదరికం సిరితో భుజం భుజం రాసుకోవాలి . టీవీ వచ్చి మనుషుల మెదడు మీద పనిచెయ్యడం మొదలు పెట్టింది. టీవీ అడ్వర్టైజుమెంట్లలో చూపించే కార్లు, ఇళ్లు తాము ఎప్పటికీ కొనలేమని తెలిసిన పేదవారికి చాలా కోపం వస్తుంది. వందలవేల డాలర్లు అడ్వర్టైజుమెంట్ల మీద గుప్పించేవారికి తామొక విప్లవ సంకేతాన్ని పంపుతున్నామని తెలుసో లేదో .

మాకు ఎలక్ట్రిసిటీ లేనట్లే , ఇడియట్ బాక్సుగా పేరుగాంచిన టీవీ కూడా ఉండేది కాదు. ఆ తెల్లావిడ ఇంట్లో జరిగిన సంఘటన తప్ప అప్పటికి జాత్యహంకారం నా జీవితంలోకి ఇంకా ప్రవేశించలేదు. ఆ సంఘటన , మరికొన్ని వేరే వాళ్ల కథలు విన్న తరువాత మాత్రం నాకు తెల్లవాళ్లంటే భయం ఏర్పడింది. అప్పటికి నాకు ఎక్కువమంది తెల్లవాళ్లు ఎదురుకాకపోవటం వల్ల అందులో ఉన్న ఇబ్బంది ఏమిటో నాకు తెలిసి రాలేదు. నాకు దొరికిన తిండి నాకు నచ్చేది; వేరే రకం తిండి గురించి అప్పటికి తెలీదు, పైగా ఆకలి మంచి వంటగత్తె కదా. మా ఒక్కగది ఇల్లు కూడా నాకు నచ్చేది. అంతమంది ఉన్నందుకు అమ్మ పొట్టలో ఉన్నట్టు వెచ్చగా అనిపించేది. ఆ తెల్లావిడ ఇల్లు తప్ప మిగతా అన్నీ మా ఇళ్లు లాగానే ఉండేవి. గ్యాస్ స్టేషను వేరుగా వుండేది, కానీ అది ఇల్లు కాదు కదా. నాకు తిండి, ప్రేమ, నిద్రపోవడానికి స్థలం , చలికాలంలో చేతులు వెచ్చ చేసుకోవడానికి పొయ్యి వుండేవి. చివరగా తెల్లపిల్లలకు లేనిదొకటి నా దగ్గర వుండేది – స్వారీ చెయ్యడానికి గుర్రం. సూ ప్రజలు ఎంత పేదరికంలో వున్నా సరే కొన్ని గుర్రాలు అక్కడో ఇక్కడో వుండేవి. మా చిన్నప్పుడు పది డాలర్లు పెడితే మంచి గుర్రం వచ్చేది. నాకు జ్ఞానం వచ్చినప్పట్నుంచీ నేను గుర్రపు స్వారీ చేస్తున్నాను. స్వేఛ్చగా, ఇండియన్ గా అనిపిస్తుంది గుర్రంపై స్వారీ చేస్తుంటే. రిజర్వేషన్లో గుర్రంపై స్వారీ గురించి అందరూ నాలాగే అనుకుంటారు. నా చిన్నప్పటి కోరిక ఏమిటంటే ఎప్పుడైనా ఒక అపలూస (Appaloosa) జాతి గుర్రాన్ని స్వంతం చేసుకోవాలని. ఏదో పుస్తకంలో ఆ గుర్రాన్ని చూసి మోజు పడ్డాను.

మూర్ తాత 1972లో చనిపొయ్యాడు. రాత్రి నిద్దర్లో ప్రశాంతంగా చనిపొయ్యాడు. ఆయన చాలా మంచివాడు, ప్రేమను పంచేవాడు, బాగా కష్టపడేవాడు. అవ్వా తాత వాళ్లకు చేతనయినంత కాలం మమ్మల్ని సంరక్షించారు. కానీ బోర్డింగ్ స్కూలునుంచి మాత్రం మమ్మల్ని రక్షించలేకపొయ్యారు.

ఒక అభిప్రాయం »అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం

ఒక అభిప్రాయం

  1. B.AJAY PRASAD Nov 5, 2007 1

    అనువాదం చాలా బాగుంది. వచ్చే సంచిక కోసం చూస్తూ..

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో