ఆరోగ్యం, శుచీ, శుభ్రతల చరిత్ర

విజ్ఞానమనేది సమాజంలో అందరికీ సమానంగా అందుబాటులోకి రాదు. కేరళలో పల్లెపల్లెకూ తిరుగుతూ, సామాన్యప్రజలకు అంటురోగాల గురించీ, ఆహారం విషయంలోనూ, మరుగుదొడ్ల ఏర్పాటులోనూ పాటించవలసిన శుచీ శుభ్రత వగైరాల గురించీ, వివరించిన సంస్థ కేరళ శాస్త్రసాహిత్య పరిషత్తు. వీధి నాటికలూ, ప్రదర్శనల ద్వారా 1970లనుంచీ వామపక్ష బృందాలు నిర్వహించిన ఈ పెద్ద ఉద్యమంవల్ల గ్రామీణ ప్రాంతాల్లో అమ్మవారు మొదలైన గుడ్డినమ్మకాలు చాలావరకూ తగ్గిపోయాయని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటిది ఎప్పుడైనా, ఎక్కడైనా జరిగిందేమో తెలియదు. అధికసంఖ్యాకుల అజ్ఞానమే మన పాలక వర్గాలకు శ్రీరామరక్ష కనక ఏలినవారు ఇటువంటిది జరగకుండా చూసినా ఆశ్చర్యపడక్కర్లేదు. అయితే శుచిశుభ్రతల గురించి చరిత్రలో ఎవరికీ సరైన అవగాహనే లేదని ఈనాడు మనం అనుకోవక్కర్లేదు. ఈనాటి బాక్టీరియా పరిభాష లేకపోయినప్పటికీ పసుపు, వేపాకు మొదలైనవి క్రిమిసంహారకాలని ప్రాచీనులకు తెలిసినదే.

సూక్ష్మరూపంలో ఉండే బాక్టీరియా ప్రతిచోటా వ్యాపించి ఉంటాయి. వీటినుంచి తప్పించుకోవటం తక్కిన ప్రాణులకు అసాధ్యం. అయితే రోజువారీ జీవితంలో వీటినుంచి ఎక్కువ హాని కలగకుండా చూసుకోవటానికి మనుషులు తమ తెలివిని ఉపయోగించడం ఏనాడో నేర్చుకున్నారు. కంటికి కనబడని సూక్ష్మజీవులనేవి అసలు ఉంటాయని కూడా తెలియని రోజుల్లో కొన్ని పరిస్థితుల్లో తమ ఆరోగ్యం పాడవకుండా కాపాడుకోవడం మనుషులకు ఆచరణరీత్యా అలవడింది.

సూక్ష్మజీవులనేవి ప్రతిచోటా ఉన్నప్పటికీ, మనుషుల శరీరాల్లో ఉన్న బాక్టీరియాకన్నా బైటి నుంచి వచ్చి తగిలేవి ఎక్కువ హాని కలిగించేవిగా ఉంటాయి. మనం తినే ఆహారం వీటి “గృహ ప్రవేశానికి” రాజమార్గంగా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో వండని తిండి తినడం అరుదే. నాగరికత మొదలవనప్పుడు తొలి మానవులు వేటమీదా, ఏరుకు తినడంమీదా ఆధారపడేవారని అందరూ అంగీకరిస్తారు కాని వాళ్ళు జంతువుల కళేబరాలనూ, పచ్చి మాంసాన్నీ అదే పనిగా ఆరగించేవారా అనే విషయంలో పరిశోధకులకు సందేహాలున్నాయి. నిప్పులమీద కాల్చని మాంసం తినడంలో బాక్టీరియావల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఎక్కువ. కుళ్ళిన మాంసం ఎవరైనా తింటే అరిగించుకోలేక వాంతులూ, అజీర్తి వగైరాలతో చాలా ఇబ్బంది పడతారు. ఈనాటికీ వండని ఆహారంలో సాల్మొనెల్లా వంటి బాక్టీరియా ఉంటే మనకు ప్రమాదమే.

కుక్కలూ, తోడేళ్ళవంటి వాటికి ఈ పట్టింపులేవీ ఉండవు. ఎందుకంటే తక్కిన క్షీరదాలతో పోలిస్తే వాటి జీర్ణకోశాల్లో ఆమ్లగుణం తీవ్రంగా ఉంటుంది. పేగుల్లోకి వెళ్ళేముందు ఆహారం వాటి కడుపుల్లో ఎక్కువ సేపు నిలవ ఉంటుంది. తిన్నదాంట్లో ఉన్న బాక్టీరియా ఆమ్లం తాకిడికి నాశనమైపోతాయి. చిరత పులులవంటివి చంపిన జంతువును ఏ చెట్టుమీదనో దాచి, కొద్దికొద్దిగా తింటూ ఉంటాయి. వాటికి బాక్టీరియా భయమేమీ ఉండదు. ఆదిమానవులు తక్కిన క్రూరమృగాలు చంపిన జంతువులను పీక్కు తినేవారా అని అనుమానం కలగడానికి కారణాలున్నాయి. చచ్చిన జంతువు కళేబరంలో బాక్టీరియా మోతాదు చాలా త్వరగా పెరిగిపోతుంది. చంపిన జంతువు నోటి లాలాజలం నుంచీ, పైన వాలే కీటకాల నుంచీ “పరాయి” బాక్టీరియా కళేబరంలోకి ప్రవేశిస్తాయి. ఒకటి రెండు గంటల్లో మాంసమంతా మనుషులు తినడానికి పనికిరాని స్థితికి చేరుకుంటుంది. వేటాడే క్రూరమృగాల జీర్ణకోశవ్యవస్థలు ప్రత్యేకమైనవి కనక ఇటువంటి బాక్టీరియా బెడద వాటిని బాధించదు.

శరీరం సైజునుబట్టి చూస్తే మనుషులకున్నంత పెద్ద మెదడు మరే ప్రాణికీ ఉండదు. మాంసాహారం ద్వారా లభించే మంచి ప్రోటీన్ల వల్లనే (ముఖ్యంగా గర్భిణులకు) పెద్ద మెదడు కలిగిన సంతతి మనుషుల్లో మొదలై ఉంటుందని కొందరు పరిశీలకులు ఊహిస్తున్నారు. అందుచేత తొలి మానవులు మాంసాహారంపై ఆధారపడ్డారని భావిస్తున్నారు. తక్కిన ప్రైమేట్‌లలాగే మనుషులు కూడా సర్వాహారులు. ఈ విషయంలో ఈనాటి చింపాంజీలను చూస్తే తొలి మానవుల లక్షణాలు కొన్ని తెలిసే అవకాశముంది. వేటలో పెద్దగా ఆరితేరకపోయినా పళ్ళూ, గింజలతోబాటు చింపాంజీలు అప్పుడప్పుడూ కోతులను చంపి తింటాయి. ఒక సందర్భంలో ఒక చిరతపులి అడవిపందిని చంపగానే కొన్ని చింపాంజీలు గుంపుగా చేరి దాన్ని భయపెట్టి తరిమేశాయట. తీరా చచ్చిన జంతువు చేజిక్కాక ఆ “ఎంగిలి” మాంసాన్ని అవి తినకుండా వెళ్ళిపోయాయట. మరొక జంతువుద్వారా సోకే బాక్టీరియా గురించి తెలిసినట్టుగా అవి ప్రవర్తించాయని పరిశోధకులు గమనించారట. మనవంటి ఉష్ణదేశాల్లో ఆహారంలోని బాక్టీరియా త్వరగా పెరిగిపోతాయి కనకనే పాశ్చాత్యులలాగా కాకుండా మనకు అంటు, ఎంగిలి వగైరాల గురించిన పట్టింపులు ఏర్పడి ఉండవచ్చు.

ప్రైమేట్‌లూ, మనుషులలో తిన్న ఆహారం జీర్ణకోశంలో తక్కువ సేపు ఉండి, త్వరగా పేగుల్లోకి వెళిపోతుంది. కడుపులోని ఆమ్లాలవల్ల చావని బాక్టీరియా ఏవైనా మిగిలి ఉంటే అవి పేగులకు చాలా హాని కలిగించగలవు. అయినా హానికరమైన బాక్టీరియాని కొంతవరకూ నిరోధించి నాశనం చెయ్యగలిగిన ఎన్‌జైములు మన జీర్ణకోశవ్యవస్థలో లేకపోలేదు. ఏది ఏమైనా పచ్చిమాంసాన్ని ఎక్కువగా తిని అరిగించుకోవడం మనకు వీలవదు. విషతుల్యమైన ఆహారాన్ని గుర్తించడం జంతువులకూ, మనుషులకూ కూడా త్వరగా అబ్బే నేర్పు. అందుచేత నిప్పు చెయ్యడం తెలియని దశలో మనుషులు ఇతర జంతువులు చంపగా మిగిలిన మాంసాన్ని తినలేదనీ, తాము చంపిన జంతువులను కూడా మితిమీరి ఆరగించలేదనీ అనుకోవాలి.

బాక్టీరియా మాట ఎలాఉన్నా, ఈ విషయంలో మనుషులకూ, చింపాంజీలకూ ఆసక్తికరమైన తేడాలుండవచ్చని పరిశోధకులు ఊహిస్తున్నారు. రెండు జాతుల్లోనూ వేటాడేవి మగ ప్రాణులు. ఆడవి పిల్లలని వెంట వేసుకుని, పళ్ళూ, కాయలూ, గింజలూ ఏరుకుంటూ ఉంటాయి. మగ చింపాంజీలు తాము చంపిన జంతువులను ఆడవాటితో పంచుకుంటే పంచుకుంటాయి, లేకపోతే లేదు. తొలి మానవులు మాత్రం పచ్చి మాంసాన్ని మోసుకొచ్చి స్త్రీలూ, పిల్లలతో పంచుకుని ఉండాలి. బాలింతలైన స్త్రీలు తక్కిన జంతువుల్లా కాకుండా నిస్సహాయ స్థితిలో ఉండేవారనీ, అందుచేత పురుషులు ఆహారాన్ని తెచ్చి వారికి అందించేవారనీ, మనుషుల తొలి సముదాయాల్లో కుటుంబవ్యవస్థకు ఈ విధంగానే పునాది ఏర్పడి ఉంటుందనీ ప్రతిపాదిస్తున్నారు. ఇదంతా మనుషులకు నిప్పు చెయ్యడం తెలియని నాటిమాట.

నిప్పుకూ, ఆహారానికీ సంబంధం కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మొదలై ఉంటుందని పరిశోధకుల అభిప్రాయం. చచ్చిన జంతువుల మాంసం ప్రమాదకరమని గుర్తించిన ఆదిమానవులు అరణ్యాలు తగలబడినప్పుడు అందులో మాడి, చచ్చిపోయిన జంతువుల కళేబరాలు త్వరగా కుళ్ళటం లేదని గమనించి ఉంటారు. మొదట్లో కేవలం చలికాచుకోవటానికీ, క్రూరజంతువులను దూరంగా ఉంచటానికీ, పొగబెట్టి చిన్న జంతువులను వెలికి రప్పించటానికీ ఉపయోగపడిన నిప్పు వంటకు కూడా పనికొస్తుందని వారు గ్రహించి ఉంటారు. మండుతున్న నెగళ్ళమీద మాంసాన్నీ, ఇతర పదార్థాలనీ కాల్చుకు తినడంతో పాకశాస్త్రం ప్రారంభమై ఉంటుంది. ఎటొచ్చీ రాతితో, చెక్కతో, పుర్రెలతో తయారైన గిన్నెల్లోనూ, దొన్నెల్లోనూ, తినడానికి పనికొచ్చే మాంసాన్నీ, గింజలనూ, ద్రవ పదార్థాలనూ కాచడం సుమారు 30 వేల సంవత్సరాల క్రితంవరకూ మొదలైనట్టు కనిపించదు. రమారమి 12 వేల సంవత్సరాల క్రితం కుండలూ, పాత్రలూ తయారుచేసే కుమ్మరులు పని మొదలెట్టాక వంట అనేది ప్రత్యేకమైన కళగా పెరిగింది. కుక్కలను పెంచి వాటితో ఇతర జంతువులను వేటాడడం, గొర్రెలూ, మేకలూ, పందులూ, పశువుల వంటివాటిని పెంచడం మొదలైంది. వీటన్నిటి వల్లా మనుషులకు తినే తిండి యోగ్యతను గురించిన అనుమానాలు తగ్గుతూ వచ్చాయి.

వ్యవసాయం మొదలయాక ఆహారం విషయంలో ఖచ్చితమైన అలవాట్లు రూపొందసాగాయి. తినదగినవీ, తినరానివీ వగైరాలను గురించిన నియమాలూ, ఆంక్షలూ అమలులోకి వచ్చాయి. మనిషి మాంసమే కాక, పరిశుభ్రత దృష్య్టా కుక్కలూ, పందులూ (ముఖ్యంగా ముస్లిం దేశాల్లో), ఒంటెలవంటి జంతువుల మాంసం (కొన్ని ప్రాంతాల్లో) నిషిద్ధమైంది. నిలవ ఉంచినదీ, పాచిపోయినదీ, ఎలుకలూ వగైరాలు ముట్టినదీ అయితే ఆహారాన్ని విసర్జించడం మొదలైంది.

బాక్టీరియా వగైరాల గురించి ఏమీ తెలియకపోయినప్పటికీ, అనుభవాన్నిబట్టీ, తెలియకచేసిన తప్పులద్వారానూ మనుషులు ఆహారం విషయంలో ఆరోగ్య నియమాలు పాటించసాగారు. కరువు రోజుల్లో పనికొచ్చేందుకు ఆహారాన్ని మిగుల్చుకోవటానికి మనుషులు రకరకాల పద్ధతులు ప్రయత్నించారు. ఊరగాయలూ, చేపలూ, మాంసమూ వంటివాటిని నిలవ ఉంచటానికి ఉప్పు పనికొస్తుందని తెలుసుకున్నారు. జీర్ణవ్యవస్థలో ఉండే బాక్టీరియా గురించి తెలియని యుగాల్లో కూడా ఫలితాన్ని బట్టి ఆరోగ్యకరమైనవీ, ఉత్ప్రేరణనూ, ఉపశమనాన్నీ కలిగించేవీ, రుతువులను బట్టి తగినట్టివీ అయిన రకరకాల ఆహారాన్ని మనుషులు గుర్తించి, ప్రతిచోటా తగిన సంప్రదాయాలను పాటిస్తూ ఆహారనియమాలు ఏర్పాటు చేసుకున్నారు. పాకశాస్త్రం ఒక కళగా అభివృద్ధి అయింది.

కొన్ని రకాల పదార్థాలు నిలవ ఉంటే పులిసిపోతాయని అనాదిగా తెలుసుగాని, పంతొమ్మిదో శతాబ్దంలో లూయీ పాశ్చర్‌ కనిపెట్టినదాకా సూక్ష్మజీవుల గురించి ఎవరికీ తెలియదు. వండేసిన పదార్థాలను గాలి తగలకుండా సీసాల్లో మూతపెడితే అవి పాడవవని తెలుసుకున్న ఒక ఫ్రెంచ్‌ శాస్త్రవేత్తకు అంతకు కొన్ని సంవత్సరాలకు ముందే నెపోలియన్‌ బహుమతులు కూడా ఇచ్చాడట. బాక్టీరియా గురించి తెలుసు కనక ఆధునికయుగంలో రెఫ్రిజిరేషన్‌, రసాయనిక పద్ధతులూ, మరెన్నో మార్గాల ద్వారా ఆహారం పాడవకుండా చూస్తున్నారు. రేడియేషన్‌, జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ వగైరాలతో ఎన్నాళ్ళైనా పాడవని ఆహారపదార్థాలను తయారు చేస్తున్నారు. మన చుట్టూ పొంచి ఉన్న బాక్టీరియా మాత్రం ఏదో విధంగా మన కడుపుల్లోకి ప్రవేశించాలని నిత్యమూ ప్రయత్నిస్తూనే ఉంటాయి.

మనకు సూక్ష్మజీవుల సంగతి సరిగ్గా తెలిసి ఒకటిన్నర శతాబ్దం అయిందేమో కాని అంతకు ముందు శుచీ శుభ్రతల గురించిన స్థూల అవగాహన మాత్రమే ఉండేది. ఏ యుగానికా యుగంలో కనబడని శత్రువులతో యుద్ధం చేసే పద్ధతిలో ప్రజల ఆరోగ్యరక్షణకై జాగ్రత్తలు తీసుకోవడం ఏనాడో మొదలైంది. ముఖ్యంగా ప్రస్తుతం ఇరాక్‌ ఉన్నచోట సుమేరియన్‌ నాగరికతవంటివి మొదలైన రోజుల్లో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మంచినీటి సరఫరాకూ, మురుగునీటి పారుదల వ్యవస్థకూ తొలిసారిగా ఏర్పాట్లు జరిగాయి. సింధు నాగరికతలో కూడా ఇటువంటిదాన్ని గురించిన చక్కటి అవగాహన కనబడుతుంది. నిజానికి ఈనాటి పాకిస్తాన్ లో కూడా అంత మంచి ఏర్పాట్లు లేవట.

ఆధునికయుగంలో శుభ్రతకు సబ్బు వాడకం చాలా ముఖ్యమైపోయింది. సబ్బును గురించిన మొదటి ప్రస్తావన క్రీస్తుకు పూర్వం 3 వేలఏళ్ళ కిందటి సుమేరియన్‌ శాసనాల్లో ఉంది. ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉన్న సబ్బు తయారీ అప్పట్లో కష్టసాధ్యంగా ఉండేది. పంతొమ్మిదో శతాబ్దం మొదలయేదాకా మామూలు ప్రజలకు సబ్బు అందుబాటులోకి రాలేదు. ఈజిప్ట్‌ నాగరికతలో కూడా పరిశుభ్రత పట్ల మంచి అవగాహన ఉండేది. చెడిపోయిన కళేబరాలు విషప్రాయమని తెలుసుకున్నాక అప్పటి ప్రజలు కుళ్ళిన శవాలను ఉపయోగించి శత్రువుల ఆహారాన్నీ, నీటివనరులనీ కలుషితం చేసేందుకు ప్రయత్నించారు.

ఆరోగ్యరక్షణ పద్ధతులు కూడా ప్రాచీనమైనవే. క్రీ.పూ.3000 నుంచి క్రీ.శ.500 మధ్య కాలంలో మనదేశంలోనూ, చైనా, మధ్యధరా, మధ్య ప్రాచ్యదేశాల్లోనూ వైద్యశాస్త్రంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి కలిగింది. ఎవరి పద్ధతిలో వారు శరీరనిర్మాణాన్నీ, రోగకారణాలనీ, అర్థం చేసుకుని చికిత్స పద్ధతులను విజయవంతంగా చేపట్టడమే కాక శాస్త్రగ్రంథాలుకూడా రాసుకున్నారు. అప్పటికి సూక్ష్మప్రపంచం గురించి ఎవరికీ తెలియకపోయినప్పటికీ వైద్య పరిశీలనలోనూ, రోగనిదానంలోనూ అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శించడం వల్లనే ఈనాటికీ ఆయుర్వేదం, యూనానీ, చైనావారి పద్ధతులు ప్రజాదరణ పొందుతున్నాయి.
అతిప్రాచీనమైన ఈజిప్ట్‌, మెసపొటేమియా, చైనావారి పద్ధతుల్లో గాయాలకు పులిసిపోయినవీ, బూజుపట్టినవీ అనిపించే పదార్థాలను ఈనాటి పెనిసిలిన్‌వంటి ఏంటీబయాటిక్‌లలాగా వాడేవారు. నీటిని మరిగించి శుద్ధి చెయ్యాలనే సూత్రం సంస్కృతంలో క్రీ.పూ.2000 ప్రాంతంలోనే నమోదు చెయ్యబడిందట. క్రిమిదోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శుశ్రుతుడు దోమలకూ, మలేరియాకూ సంబంధం ఉందనీ, ఎలుకలు మహామారికి దారితీస్తాయనీ గుర్తించాడు. మశూచినుంచి కోలుకుంటున్న రోగుల చీమునుంచి వేక్సీన్‌ తయారుచేసి ఆరోగ్యవంతులకు టీకాలు వేసే పద్ధతి చైనాలో క్రీ.పూ.600 నాటికే మొదలైంది. జబ్బులు ఒకరినుంచి మరొకరికి సంక్రమిస్తాయనీ, జనం కిక్కిరిసి ఉండే ప్రాంతాల్లో రోగాలు ప్రబలడం సులువనీ, చెత్తా, మురికినీరూ పేరుకున్నచోట వ్యాధులు విజృంభిస్తాయనీ గ్రీక్‌, రోమ్‌ నాగరికతల్లో గుర్తించి వాటిని అరికట్టే చర్యలు తీసుకున్నారు.

క్రీ.శ.500 అనంతరం రోమన్‌ సామ్రాజ్యం పతనమైన తరవాత యూరప్‌లో కాలక్రమాన క్రైస్తవ మతాధికారుల పెత్తనంలో అంధయుగం మొదలైంది. అయినా అక్కడి కొందరు శాస్త్రవేత్తలూ, ఇస్లాం దేశాల పరిశోధకులూ గాలెన్‌వంటి ప్రతిభావంతులైన రోమన్‌ శాస్త్రజ్ఞుల వారసత్వాన్ని మరిచిపోలేదు. మామూలు ప్రజలు మాత్రం మతగ్రంథాల మూఢ విశ్వాసాలను వదిలించుకోలేక 14వ శతాబ్దపు ప్లేగ్‌ వ్యాధికి యూరప్‌లో వేలకొద్దీ ప్రజలు బలికావడాన్ని దైవశాసనంగానే భావించారు. మరొకవంక కైరోవంటి నగరాల్లో అప్పట్లో ఇటువంటి మతపరమైన దుష్ప్రభావాలు లేకపోవడంతో వైద్యశాస్త్రంలోనూ, రోగుల చికిత్సలోనూ మంచి అభివృద్ధి కలిగింది.

పదహారో శతాబ్దం తరవాత యూరప్‌లో సాంస్కృతిక పునరుజ్జీవనం (రినేసాఁస్‌) మొదలై ఆధునిక శాస్త్రవిజ్ఞానం పెరగడానికి మార్గం సుగమమైంది. అక్కడకూడా మొదట్లో సిఫిలిస్‌వంటి సుఖరోగాల గురించిన అపోహలూ, రాజకీయ వైరుధ్యాల కారణంగా వాటికి ఇతర దేశాలను తప్పు పట్టడమూ జరుగుతూ ఉండేది. హాలండ్‌లో 1676లో లీయువెన్‌హోక్‌ అనే శాస్త్రవేత్త మొదటగా మైక్రోస్కోప్‌ తయారుచేసి విస్తృతంగా పరిశోధనలు చేశాడు. సూక్ష్మజీవులు ప్రతిచోటా ఉన్నాయని అతను ప్రకటించడంతో రకరకాల ప్రభావాలు కలిగాయి. మంచినీరు తామనుకున్నంత స్వచ్ఛమైనది కాదని తెలుసుకున్న కొందరు ప్రబుద్ధులు చేతులు కడుక్కోవటమూ, స్నానాదులు చెయ్యటమూ మానేశారట. అప్పట్లో నీటి సరఫరా పూర్తిగా చెక్క గొట్టాలలో జరిగేది కనక వాటిలో పుష్కలంగా బాక్టీరియా పేరుకునేవి. అందుచేత వారి భయాలు పూర్తిగా నిరాధారమని అనలేం.

పద్ధెనిమిదో శతాబ్దం వచ్చేసరికి వేడినీళ్ళలో స్నానం చెయ్యడం మామూలయింది. ఎటొచ్చీ పేదవారికి మాత్రం ఇంతటి సుఖం దుర్లభంగా ఉండేది. సైన్యంలోనూ, కారాగారాల్లోనూ ప్రతిరోజూ చన్నీటి స్నానం తప్పనిసరిగా ఉండడం అక్కడివారిని బాధించేది. 1796లో ఇంగ్లండ్‌లో జెన్నర్‌ మశూచికి టీకాలు వెయ్యడంతో క్రిముల గురించిన అవగాహన పెరగసాగింది. ప్రసూతి సమయంలో పరిశుభ్రత చాలా అవసరమనీ, వైద్యసిబ్బంది శుభ్రంగా చేతులు కడుక్కోకపోవడం ప్రమాదకరమనీ గుర్తించసాగారు. 1858లో లూయీ పాశ్చర్‌ ఫ్రాన్స్‌లోనూ, 1880 ప్రాంతాల రోబర్ట్‌ కోఖ్‌ జర్మనీలోనూ చేసిన ప్రయోగాలతో బాక్టీరియా గురించిన ఆధునిక అవగాహన మొదలైంది.

బాక్టీరియాతో యుద్ధం చేసే సన్నాహాలలో సబ్బు వాడకం ముఖ్యమైనది. మురికిని పోగొట్టుకోవడానికి సబ్బులు ఉపయోగపడతాయనేది తెలిసినదే. నీటితో కడుక్కున్నప్పుడు మురికి వదులుతుందిగాని బాక్టీరియాకు హాని కలగదు. సబ్బుల్లో సామాన్యంగా సోడియం, పొటాసియం క్షారాలు కలిగిన కొవ్వు పదార్థాలుంటాయి. సబ్బు కణాలకు ఉండే రసాయనిక స్వభావం కారణంగా బట్టలకూ, ఇతర వస్తువులకూ అంటుకుని ఉన్న మురికి పదార్థాలు సబ్బునీటిలో ముంచినప్పుడు సులభంగా ఊడి, నీటిలో తేలుతాయి. దాంతో బాక్టీరియాకూడా చాలావరకూ తొలిగిపోతాయి. క్రీ.పూ. 2200లోనే బేబిలోనియన్‌ నాగరికతలో క్షారాలనూ, కొవ్వునూ, నీటినీ కలిపి శుద్ధి చెయ్యటానికి వాడినట్టు సాక్ష్యాలున్నాయి. క్రీ.పూ. 1500 ప్రాంతాల్లో ఈజిప్ట్‌లో జంతువుల, కాయగూరల కొవ్వు పదార్థాలతో క్షారలవణాలను కలిపి నీటితో శుభ్రంగా స్నానం చెయ్యటం పరిపాటిగా ఉండేది. ప్రాచీనకాలంలో రోమ్‌ సమీపాన ఒకామె నదిలో బట్టలు ఉతుక్కునేదట. అక్కడికి ఎగువ ప్రాంతంలో గొర్రెలనూ, మేకలనూ చంపుతూ ఉండేవారట. ఆ కొవ్వుతోబాటు చెట్ల కొమ్మలను కాల్చిన బూడిద కూడా కలిసి నీటితో కొట్టుకు వస్తూ ఉండేదట. ఇవన్నీ కలిసిన నీటితో ఉతికినబట్టలు ఎక్కువ శుభ్రపడుతున్నాయని ఆమె గుర్తించిందట. రోమ్‌ నాగరికతలో ఈ విధంగా మొదలైన సబ్బు తయారీ కారణంగా క్రీ.శ.79లోనే పాంపే నగరంలో సువాసన సబ్బుల కర్మాగారం ఒకటి ఉండేదట. ఆ తరవాతి శతాబ్దాల్లో మేక కొవ్వునూ,ఆలివ్‌నూనెలవంటి వాటినీ వాడేవారు. చెట్ల బూడిద స్థానంలో కృత్రిమ రసాయనిక పదార్థాలను ఉపయోగించసాగారు. ఈ విధంగా మానవజాతి బాక్టీరియాపై యుద్ధం ప్రకటించి కొంతవరకూ విజయాన్ని సాధించగలిగింది.

మనదేశంలో పల్లెల్లోనూ, నగరాల్లోని మురికివాడల్లోనూ కనీసస్థాయిలో కూడా పరిశుభ్రతకు ఆస్కారంలేని పరిస్థితులు కొనసాగుతున్నాయి. క్రిముల గురించీ, వాటివల్ల కలిగే వ్యాధుల గురించీ సరైన అవగాహన పేదప్రజల్లో కలిగించకపోగా, మరుగుదొడ్లవంటి కనీస సౌకర్యాలు కూడా వారికి అందకుండా చేస్తున్న “అధునాతన” వ్యవస్థ మనది. సైబర్‌ యుగం గురించి గొంతు చించుకుంటున్న మన రాజకీయనాయకులకు లాభాలు తెచ్చిపెట్టే కాంట్రాక్టుల మీద ఉన్న శ్రద్ధ సామాన్య ప్రజల గురించి ఏనాడూ లేదనేది ఈరోజుల్లో అందరికీ తెలిసిపోతోంది. చదువుకున్నవారికి కూడా తమ ఒళ్ళూ, తమ ఇల్లూ తప్ప మరేమీ పట్టినట్టు కనబడదు. కాని బాక్టీరియాకు ఇటువంటి వర్గవిభేదాలు ఉండవు. మురికి ఉన్నచోటు మనది కాదని నిర్లక్ష్యం చేస్తే అవి విజృంభించి అందరి ఆరోగ్యానికీ ముప్పు తేగలవు.

3 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు, సైన్స్

3 అభిప్రాయాలు

  1. రాజేంద్ర కుమార్ దేవరపల్లి Sep 2, 2008 1

    పెద్దలు ప్రసాద్ గారికి,మీరు చెప్పిన ఏ ఒక్క అంశంతోనూ ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన పనిలేదు.కానీ మీరన్న చదువుకున్నవారి ఇళ్ళలోని ఇన్ డోర్ పొల్యూషన్ గురించి కూడా మాకొక మంచి వ్యాసం అందించగలరా?

  2. vishnu murthy Jun 18, 2009 2

    మా స్నెహిథుదు ఉదయన్నె లెచి మజలమ్ నెత్ లొ చూసి తెలుగు వెలిగించదు పుస్తకమ్ కలి బూదిదఇంది

  3. vishnu murthy Jun 18, 2009 3

    సల్లగ బథుకు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో