Nov2007
ఆశ్రయం
అప్పుడు ఊళ్లో కొంపైనా ఉండేది, తిన్నా తినక పోయినా కొంపలో పడి ఉంటే అడిగేనాధుడే ఉండడు. రెక్కలు ముక్కలు చేసుకోని చేసినన్నాళ్లు చేస్తిని. వాడికి రెక్కలు తెస్తిని. రెక్కలు వొచ్చినియ్యని పైపైకి ఎగిరిపోతుండాడు. ఇంక నాకేడ అందుతాడు.
నేను కడతేరి పోయిందాకా ఆ కొంప అమ్మొద్దని చెబుతూనే ఉండా. ఇంకా ఊళ్లో అది ఎందుకమ్మా ఎవురో ఒకరు ఆక్రమించేసుకుంటారు. నేనింత ఆపీసర్ని అయి కూడా నువ్వు ఒక్క దానివే అక్కడ ఉంటే నాకు ఎంత నామోషీగా ఉంటుందని ఎంత నైత్రంగా చెప్పాడు.
అయినా వాణ్ని అనుకోని లాబమే ముందిలే. నాది కదా తప్పు. రమ్మనడంతోనే ముడ్డి తిప్పుతా పోవడమేనా’ అక్కడ ఉండే తాహతు ఉండొద్దా. పల్లెటూరి మోటోళ్లు ఉండే చోటేనా అది. నా బుద్ధి గడ్డి తినబట్టలే. పెద్దోళ్లు ఊరికె సెప్పలా శాస్త్రాలు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా అనీ…. ఇప్పుడు పడాల్సొచ్చింది. ఏం జేద్దాం. ఆ పిలుపొచ్చే దాకా తప్పేదేముంది అనుకుంటూ నడుం వాల్చిందామే.
“ఏంది సుబ్బవ్వా నీలో నువ్వే గొణుక్కుంటున్నావు?” పక్కనే వొచ్చి కూర్చుంటూ అడిగాడు సుబ్బయ్య.
“ఈ వొయిసులో వొచ్చిన గాశారాన్నే అనుకుంటా ఉండా” నిట్టూరుస్తూ చెప్పింది. “బాద పడమాకలే. నీకు… ఎన్ని రోజులుంటాయి కష్టాలు. మాలాంటి వాళ్లమైతే నిష్ట దరిద్దరులుం కాబట్టి కాటికి యెల్లేదాకా తప్పవు. నీకేందప్పా, బంగారమంటి బిడ్డ ఉంటే. నువ్వే సొరగాన్ని కాదనుకోని వొచ్చావు. అయినా నీ కొడుకు ఊరుకుంటాడా నిన్నెత్తుక్కుంటా రాడా. తప్పకుండా వొస్తాడు. నువ్వేం బాద పడబాక పడుకో” అని తనూ పక్కనే పడుకున్నాడు.
కొద్దిసేపటికి అమ్మా అమ్మా అని వెతుక్కుంటూ ఎవరో రావడం కనిపించింది. ఎవురోలే అని పట్టించుకోలేదు వాళ్లు.
తన వైపుకే వొస్తూ లైటు వేసి చూడడం మసక మసగ్గా కనిపించింది. అతడు సరాసరి వొచ్చి ఆమె ముందే నిలబడ్డాడు.
‘ఎవరూ’ అంటూ పరీక్షగా అతనివైపు చూసింది.
“అమ్మా నేనమ్మా సాంబయ్యని. అయ్యగారు నీకోసం గుళ్లూ గోపురాలన్నీ తిరుగుతున్నాడమ్మా. ఇయ్యాల లేసినేళ బాగుండబట్టి నువ్విడ కనిపించావు. రా తల్లీరా బయటే ఉండారు అయ్యగారు. రామ్మా రా” వొంగి వొంగి దణ్ణం పెట్టసాగాడు.
“అయ్యగారా ఎవురికిరా అయ్యగారు. అహా ఎవురికంట అయ్యగారు” గదిమిందామె. ఆమె అరుపులకి అదిరి పడ్డాడతను.
“మీకు అంతరికి అయ్యగారేమో. నాకు మాత్రం ఎవురూ లేరు ఫో” విదిలించింది.
అతనికేమీ అర్థంగాక కాసేపు మౌనంగా నిలబడ్డాడు.
ఎంత సేపు నిలబడ్డా ఇంక ఆమెతో మాట్లాడటానికి ధైర్యం చేయ్యలేకపోయాడు. దాంతో నెమ్మదిగా వెనుదిరిగాడు.
చెమటలు పడుతూ వొచ్చిన అతన్ని చూసి “ఏరా ఇక్కడ కూడా లేదా” ప్రశ్నార్థకంగా చూశాడు.
“అయ్యా…. అదీ….” నీళ్లు నమిలాడు
“ఏందీ? త్వరగా చెప్పి చావు” గద్దించాడు
“అయ్యా అక్కడ ఉంది కానీ ఆడకి తమరు వొద్దయ్యా”
“ఏం…. ఏమైందంట వొస్తే” కోపంగా చూశాడు.
“అయ్యా అక్కడంతా అలగా జనం ఉండారయ్యా”
“ఏడిశావ్. ఉంటే ఉండార్లే రా” కారులో నుండి దిగి ముందుకి దారి తీశాడు.
డోర్ మూసేసి వెనుకనే అనుసరించసాగేడు సాంబయ్య.
లోపల రకరకాల మనుషులు పడుకుని ఉన్నట్టున్నారు. కొందరు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంకొందరు గురకలు పెట్టి నిద్రపోతున్నారు. వాళ్ల మధ్య నడవడం అతనికి ఎంతో అసహనంగా ఉంది.
‘రాత్రి కాబట్టి బతికిపోయాను లేకుంటేనా అమ్మో’ అనుకుంటూ నలు దిక్కులా చూస్తూ “ఎక్కడ్రా” నెమ్మదిగా డ్రైవర్ని అడిగాడు.
“అయ్యా అటువైపు” చెయ్యి చూపిస్తూ గుసగుసగా చెప్పాడు సాంబయ్య.
అక్కడ ఆ స్థితిలో ఆమెను చూడాల్సి వొస్తుందని కల్లో కూడా అనుకోలేదతను. కోపం ముంచుకొచ్చింది. అయినా అది సమయం కాదనుకుని కోపాన్ని బలవంతంగా అణుచుకున్నాడు.
ఆమెకు దగ్గరగా వొచ్చాడు.
“మ్మా” నెమ్మదిగా పిలిచాడు.
తన మాట తనకే సరిగా వినిపించలేదు.
వాళ్ల అందరి మధ్యలో ఆమెను అమ్మా అని పిలవాలంటే చాలా చిన్నతనమనిపించింది.
కొంచెం పెద్దగా పిల్చాడు ఈసారి.
అతని వైపు చూసిందామె. కానీ అతనెవరో తెలియనట్టు నిర్లక్ష్యంగా చూపులు తిప్పుకుంది.
“ఏంటమ్మా ఈ ఖర్మ? ఎందుకు వొచ్చావు ఇక్కడికి?” కంఠం కొంచెం కరుకుగా ధ్వనించింది.
ఆమె అప్పటికీ అతని వైపు చూడలేదు. సమాధానం చెప్పలేదు.
“అడుగుతుంది నిన్ను కాదూ. పదివేలు కట్టాను. అక్కడి కంటే ఇక్కడ అడుక్కోవడం బాగుందా నీకు” కొంచెం కఠినంగా అన్నాడు.
చివ్వున తలెత్తి అతని వైపు తీక్షణంగా చూసింది. ఆమె గుండెల్లో పెనుమంటలు చెలరేగాయి. సహనం హద్దులు దాటింది. మౌనం బద్దలయ్యింది. పొంగి వొస్తున్న దుఃఖం గొంతులోనే ఆగిపోయింది.
“అడుక్కుంటున్నానా నేను. ఎక్కడా? ఎవుర్ని అడిగి జేర్చావక్కడ? యాడకో తీసకపోతన్నాను. రమ్మని చెప్పావే. కార్లో ఎక్కించ్చుకోని తీసకెల్లడం బాగుందా. ఆ జైల్లో యెయ్యడం బాగుందా. ఏది బాగుంది చెప్పు నీకు. ఒక్క ముక్క మందు జెబితే నాదారి నేను జూసుకునేదాన్ని గదా. ఏమీ తెలియని అమాయకు రాలిననే గదా. రెండ్రోజులు ఆడ ఉండు మళ్లీ వస్తానని చెప్పియెళ్లావు నువ్వు” ఆమె గొంతు గాద్గదికమైంది. గతమంతా కళ్లముంది నిలిచింది. కళ్లు నీటి చెలమలే అయ్యాయి.
పవిట చెంగుతో కళ్లు వొత్తుకుంటూ, “ఈ వొయిసులో పడాల్సిన తిప్పలేనా ఇయ్యి” మాట జీరబోయింది.
“ఇప్పుడేమైందమ్మా నీకు? అక్కడ ఏంది లోటు చెప్పు?”
“ఇయ్యాల నువ్వు లచ్చలకి లచ్చలు తీరుడావు కాబట్టి నీకు లోటుపాట్లు తెలియవురా. ఈడ ఇంత లాపాయింట్లు లాగుతుండావే, నీ పెళ్లాం ముందు ఎందుకు మాట్లాడవు? అడ్డమైన వాళ్లందరికీ సెయ్యడం తనవల్ల కాదంటనే. నేను మీకు అడ్డమైనదాన్ని అయిపోయానా. నువ్వు నీ పెళ్లాం కూడ బలుక్కోని తీసకెళ్లి ఆ జైల్లో యేస్తారా. ఏం ఏమీ సెయ్యకుండానే ఇంతటి వాళ్లు అయ్యారు మీరు? ఎర్రని అగ్గిలో బడి రాత్రనకా పగలనకా కష్టపడితే గాదు నువ్వు ఇంత వాడివి అయ్యింది. నీకై నువ్వేమీ గాలికి పెరగలేదుగా” తన పుట్టు పూర్వోత్తరాలు తొవ్వసాగింది.
అందరూ వాళ్లవైపే చూస్తూ ఉండడంతో అతనికి చాలా అవమానంగా అనిపించింది.
“అమ్మా అవన్ని ఇప్పుడు ఎందుకు చెప్పు. ముందు ఇంటికి రా పోదాం” చెయ్యిపట్టి లాగబోయాడు.
చేతిని విదిల్చి కొట్టింది. “ఎక్కడికిరా పోయేది? మీ అయ్య సచ్చిపోయాడని నిన్ను గాలికి వొదిలేశానా. ఎకరాలెకరాలు ఉండోళ్లు గూడా పిల్లల్ని గొడ్ల కాడికీ, పొలాలకీ పంపుతుంటే నేను మాత్తరం నిన్ను సదివిచ్చి గొప్పోణ్ని చెయ్యాలని తపన పడిపోతినే. ఒరేయ్ ఒక్క రోజంటే ఒక్కరోజు రొండు కాళ్లూ ఒకచోట పెట్టిన పాపాన పోలేదే. ఏ రోజు నాగా బడితే నీ సదువులకి యాడ ఆటంకం వొచ్చుద్దోనని వానకీ వొరిపిడికీ భయపడకుండా ఆ దుక్కుల్లో పడి కొట్టుకుపోయే దాన్నే.
ఒంట్లో బాగలేకపోయినా సరే ఆస్పత్రికి పోతే యాడ డబ్బులు అయిపోతయ్యోనని కషాయమో పాడో తాగి యెల్ల బుచ్చుకునే దాన్నే గానీ, ఏనాడైనా రోగానికి ఒక్క రూపాయి పెట్టి ఎరుగుదునా. సుబ్బమ్మ పీనాసి కట్టెమ్మా, ఒక రూపాయి గూడా దేనికీ ఖర్చు పెట్టిన పాపాన పోదమ్మా అంటూ ఊర్లో అందరూ తలో రకంగా ఎగతాళి చేసినా పట్టించుకునేదాన్నా. ఇయ్యన్నీ నీ కోసం గాక ఇంకెవరి కోసం చేశాన్రా” ఏడుపూ, ఆవేదన కల గలిసిపోయాయి. దుఃఖం కట్టలు తెంచుకుంది.
అందరి ముందూ అంత అవమానం జరిగే కంటే భూమి బద్దలై రెండుగా చీలి లోపలికి కుంగిపోతే బాగుండుననిపించింది. అమాంతం అక్కడ నుండి మాయమైపోతే బాగుండునని కూడా అనిపించిందతనికి.
ఎవరి ముందూ వంచని తల భూమ్మీదకు వొంగి పోయిందా రోజు. “ఇంటికి పోదాం రామ్మా అక్కడ మాట్లాడుకుందాం” చెప్పలేక చెప్పలేక మళ్లీ చెప్పాడు.
“అయిన నీ ఇంటికి వొస్తో నీ పెళ్లాం పడనిచ్చిద్దా. మేం జెయ్యలేమమ్మా, మేం కడగలేమమ్మా, మేం ఉతకలేమమ్మా. ఇదే పాటాయెనే ఆపెకి.
వొద్దు వొద్దురా అని సిలక్కి చెప్పినట్టు సెప్పాను. ఉన్న ఊళ్లో లచ్చణమైన సమ్మందం. మర్యాదా మన్ననా ఉంటదిరా అంటే… ఊహూఁ… లచ్చలకి లచ్చలు లచ్చలకి లచ్చలు అని డబ్బు దావాద్రి బట్టి కదంట్రా నన్నియ్యాల ఈ గతికి తెచ్చింది.
ఏం మీ కంటా ఎత్తి పొయ్యకుండా, కడిగి చెయ్యకుండానే పెద్దోళ్లు అయ్యారా. అది కాదులే అసలుకి ముసిలి ముతకా ఆ ఏ క్లాసు బిల్డింగుల్లో అడ్డంగా ఉండారని యాణ్నో జైల్లల్లో పడేస్తారు. పో…. పో… రా ఎవుడిగ్గావాల మీ యేలూ లచ్చలూ. మీ దగ్గరే మూటలు కట్టుకోండి” అంటూ కసురుకుందామె.
“పోనీ పెద్దమ్మా అబ్బాయి అంతగా బతిమలాడుతుండాడు గదా. ఆయన చెప్పే మాట కూడా ఆలకించొచ్చు కదా” అప్పటి దాకా వాళ్ల సంభాషణ విన్న ముసలాయన అనునయంగా చెప్పాడు.
కోపంగా అతని వంక చూపులు తిప్పింది.
“నీకు తెలవదయ్యా. తల్లికి మొగుళ్లంటారే అట్టాంటి వొళ్లయ్యా ఈళ్లు. పాలు తాగి రొమ్ము గుద్దే రకమయ్యా ఈళ్లూ. ఇస్వాసం లేని ఘాతుకులు. ఈళ్లని పెంచి పెద్దజెయ్యడానికి మన రక్తమాంసాలు ధారపొయ్యాలి, వాళ్ల కోసం మన ఆస్తులు అరిగిపోవాలి. అనీ అమిరాక మనల్ని పులిస్తరాకులుండయ్యే… వాటిని ఇసిరేసినట్టు ఇసిరేస్తారు.
వాళ్ల ఇందు ఇనోదాలకీ ముసిలోళ్లు అడ్డమయ్యా. అందుకే ఈడ్సి బైటపారేస్తారు. ఈడి పెళ్లాం అనడమే గాకుండా…. దాని వాళ్ల సేతగూడా అనిపించేడయ్యా. ఒకరోజు కోపమొచ్చి యాడన్నా దూకుదామని కూడా పోయేనయ్యా. అంతకు ముందు మా ఊళ్లో ఒకాయన అట్నే సెర్లో దూకేడు. ఇప్పటికీ అబ్బని పొట్టన బెట్టుకున్నాడని పిల్లల్ని ఆడిపోసుకుంటున్నారు.
నా వల్ల నా బిడ్డకా అపనింద ఎందుకు రావాలని ఆగేను కాని, లేకపోతే ఏ వల్లకాట్లో బూడిదయ్యేదాన్నో…” రోదిస్తూ చెప్పిందామె.
ఆమె మాటలు వింటూ అతని మొహం నల్లగా మాడిపోయింది. అంత పెద్ద ఆపీసర్ని అయి ఉండి కూడా ఇక్కడ ఈమె వల్ల తల దించుకోవాల్సి వొచ్చిందని మధనపడసాగేడు. అంతకంతకూ ఆమె మాటలతో ఊబిలోకి దిగబడుతున్నట్టు అనిపించ సాగింతదనికి.
ఈ పరిస్థితి నుండి ఎలా బైట పడాలో కూడా అర్థం కాలేదనికి. బోనులో చిక్కిన ఎలుకలా గిలగిల్లాడి పోతున్నాడు.
“అయితే ఇప్పుడు నన్నేం చెయ్యమంటావమ్మా? ఇంటికి రమ్మంటే రానంటన్నావు. హోం నుండి పారిపోయి వొచ్చావు. ఇంక ఏం చెయ్యాలో చెప్పు” ఏడుపు ఒక్కటే తక్కువైంది అతని మాటల్లో.
“నీది దొంగల కొచ్చేనా. వాళ్లది దొంగల కొచ్చేనా. ఎవురింట్లో దన్నా దొంగల కొచ్చేనా. పారిపోయొచ్చావ్ పారిపోయొచ్చావ్ అంటన్నావు. నేనేం పారిపోయిరాలా… నాపాటికి నేనొచ్చేశా అంతే… ఆఁ… ఇంకోపాలి ఆ మాట అన్నావంటే మర్యాద దక్కదు. ఏ మనుకుంటన్నావో”
“ఏదో ఒకట్లే అమ్మా. ముందు ఇంటికి పోదాం పదమ్మా” కాళ్లూ పట్టుకుంటాను అనే పరిస్థితికి కూడా వొచ్చాడు.
హఠాత్తుగా ఆమె రెండు చేతులూ జోడించి, అతని వైపు చూయిస్తూ “అయ్యా మీకు ఒక దణ్ణం, మీ అభిమానానికొక దణ్ణం . నన్ను ఎవ్వురూ ఏ వొల్లకాట్లో దొర్లిచ్చాల్సిన పనిలేదు. ఏ జైల్లోనూ నేను ఊపిరాడకుండా ఉండలేను. నా మానాన నన్ను బతకనియ్యండి.
ఈ గుళ్లోనే ఒక ముద్ద ప్రసాదం తిని ఒక మూల ముడుక్కుంటాను.
రేపు ఎప్పుడన్నా కన్ను మూస్తే ఎవుడో ఒకయ్య… ఇదుగో… ఈ ముక్కుకీ సెవులకీ ఉండయ్యే… ఇయ్యి తీసుకోని అవతలకి ఈడ్సి పారేస్తాడు. అప్పుడు కూడా నీ జోలికి రాను”.
“పోనీ నీకు ఎంత డబ్బు కావాలో అడుగు. ఇస్తాను. నువ్వు ఎక్కడ ఉండాలీ అనుకుంటే అక్కడు ఉందువు గానీ” రాజీ మార్గానికి వొచ్చాడతను.
“డబ్బులు… డబ్బులు… అంటారు. ఎవుడికి తెలియని డబ్బులురా అయ్యి. ఇయ్యాల కట్టలు కట్టలు డబ్బు కూడేసరికి కళ్లు నెత్తికి ఎక్కినియ్యి. డబ్బులుంటే చాలా? ఎవుర్నయినా ఏమైనా చెయ్యొచ్చు అనుకుంటున్నారు దద్దమ్మలు.
మనసికి కావాల్సిన అంత ప్రేమ, ఇంత అప్యాయత డబ్బులు తెచ్చి పెడతయ్యా సుబ్బయ్యా. కాస్త సెప్పయ్యా ఈడికి”
కాలికేస్తే మెడకు మెడకేస్తే కాలికి… ఏం చెయ్యాల్రా దేముడా…. తల పట్టుకున్నాడతను.
సమస్యకి ఒక పరిష్కారం దొరికిందిలే అనుకుంటే మళ్లీ మొదటికీ వొచ్చి కూర్చుంది. గట్టిగా కణతలు నొక్కుకుంటూ తను చేసిన తప్పుకి చింతించసాగేడు.
అయినా చివరి ప్రయత్నం చేసి చూద్దాం అనుకున్నాడు.
“చివరి సారిగా అడుగుతున్నాను. వొస్తావా రావా” అసహనం చివరి హద్దుల్లో నుండి మాట్లాడాడు.
“ఒరేయ్ నువ్వింక అరిసినా రాను… గీపెట్టినా రాను… జరగాల్సినియ్యి అన్నీ జరిగి పోయినయ్యి. నాకు చెప్పా పెట్టకుండా నన్ను వొదిలించుకోవాలి అనుకున్నప్పుడే మీ అమ్మ సచ్చిపోయిందనుకో…”
“నీ మొండితనం నీదే గానీ నన్ను అర్థం చేసుకునేది లేదా. ఆఁ…” అరిచినంత పనిచేశాడు.
ఆమె మౌనంగా ఉండిపోయింది.
“ఒరే సాంబయ్య. ఇట్రారా. ఇటొచ్చి ఒక రెక్క బట్టుకో. తీసకెళ్లి కార్లో కుదేద్దాం” అని ఒక చెయ్యి పట్టుకోగానే, సాంబయ్య వొచ్చి రెండో చెయ్యి పట్టుకున్నాడు.
ఆమె ఇద్దరి చేతుల్లో పెనుగులాడసాగింది.
“ఇదుగో ఇదే సెబుతున్నా. నన్ను ఇక్కడ కూడా అల్లరి పెట్టడమేం బాగాలేదు.
ఒకవేళ గానీ నువ్వు ఇంత బలవంతంగా ఇంటికి తీసికెళ్లావే అనుకో… ఇంక ఈ భూమ్మీద కూడా ఉండకుండా పోతాను” చాలా ధృడంగా తన నిర్ణయాన్ని చెప్పేసింది.
అంతే పట్టుకున్న చేతిని వొదిలి వేశాడతను. దాంతో సాంబయ్య కూడా వొదిలే వేశాడు.
“ఛీ… ఎక్కడో చావు” అంటూ విసురుగా వెనక్కు తిరిగాడు.
సాంబయ్య అతన్ని అనుకరించ సాగేడు.
కొద్ది దూరం పోయిన తరువాత ఏదో గుర్తుకు వొచ్చినా వాడి లాగా ఆగేడు.
జేబు తడుముకున్నాడు. నోట్ల కట్టలు వెచ్చగా తగులాయి.
వడివడిగా ఆమె దగ్గరకు వొచ్చాడు.
అతన్ని చూసి భయపడ్డట్టుగా వెనక్కు జంకిందామె.
అతను జేబులో నుండి నోట్ల కట్టతీసి బలంవంతంగా ఆమె చేయివేళ్లు తెరిసి బలవంతంగా చేతిలో ఉంచి అంతే వేగంతో వెనుదిరిగాడు.
పోతున్న అతని వంకా, నోట్ల వంకా మార్చి మార్చి చూడసాగిందామే.
“బొందలో పూడ్చి పెట్టడానికా ఈ డబ్బు. ఇదే గదట్రా మిమ్మల్ని ఆడిస్తుంది. ఇది మూటలు మూటలు మూలగ బట్టి గదా మీకు మనుషులకు కనబడకుండా పోతంది” అంటూ కట్టను విసిరికొట్టింది.
అది ఎదురుగా ఉన్న స్తంభాన్ని తాకింది. నోట్లు గాల్లో గిరికీలు కొడుతూ ఎగరసాగేయి.
ముందుకి సాగుతున్న అతను ఆకాశంలో ఎగురుతున్న నోట్లవంక చూశాడు. అయినా ఆగలేదు. ముందుకి సాగుతూనే ఉన్నాడు.
ఆమె అతను పోయిన వైపు చూస్తూనే ఉంది.