Nov2007
చప్పుడు
“శీనుగా టీ తీసుకురా…”
రెడ్డి కేకేసాడు. ఆ కేకతో శీనుగాడు అనబడే కావాటి గునయ్య శ్రీనివాసులు అనబడే సర్పంచు రెడ్డిగారి ఇంట్లోకి పరుగున వెళ్లాడు.
రెడ్డిగారింట్లో హాల్లో ఎం.ఆర్.ఒ., ఎం.డి.ఒ., ఈ.ఒ.పి.ఆర్.డి., పంచాయతి సెక్రటరి, ఇంకా ఇద్దరు ముగ్గురు ఊరి పెద్దలనబడే వాళ్లు కూర్చుని ఉన్నారు. అందరిలోనూ ఏదో దర్పం తొంగిచూస్తోంది.
ఎంతైనా రెడ్డిగారు రెడ్డిగారే.
ఆఫీసర్లు ఆఫీసర్లే
జవాను జవానే
ఆఖరికి తలారోడూ తలారోడే.
ఎటోచ్చి శ్రీనివాసులు మాత్రం శ్రీనివాసులు కాకుండా పోయాడు. సర్పంచు సర్పంచు కాకుండా పోయాడు. ఎందుకంటే కారణం చాలాచాలా చిన్నది. అంతే పెద్దది కూడా.
అతడు గిరిజనుడు. వాళ్లింట్లో మూడు తరాల్లో మూడో తరగతి దాకా చదువుకుంది అతడొక్కడే.
ఊరిబయట కాపరం. వృత్తి పందుల పెంపకం. భార్య, ఇద్దరు పిల్లలు, ముసలి తల్లితండ్రులు, ఇద్దరు తమ్ముళ్లు, ముగ్గురు చెల్లెల్లు, సంసారం పెద్దదే. ఇంట్లో అందరిలోకీ శ్రీనివాసులే పెద్దోడు. కాబట్టి మోత్తం కుటుంబమే అతడిపైన ఆధారపడి వుంది. ఎస్టీ కాలనీ మొత్తం కూడా అతడిపైనే ఆధారపడి వుంది.
“శీనుగా ఎంతసేపు లేటవుతాండాది” రెడ్డిగారు గర్జించాడు. అతడికి అదో సరదా.
ఇద్దరే వున్నప్పుడైనా ఒక రకంగా మాట్లాడతాడు రెడ్డి. అదే మూడో మనిషుంటే మాత్రం శ్రీనివాసులు పైన అధికారం చెలాయిస్తాడు. ‘ఒరే’ అంటాడు. ‘నీయబ్బ’ అనీ అంటాడు.
“లోపలేం చేస్తాండావురా శీనుగా”
“వస్తాండా సామీ… వచ్చేస్తి” వినయం కనపడేటట్లు, వినపడేటట్లు బదులిచ్చాడు శ్రీనివాసులు.
లోపల అతనేం చేస్తాడు. రెడ్డిగారు ఇంటి మొత్తం శీనుగాడు తిరుగుతాడని, ఇంట్లో మనిషి మాదిరని రెడ్డిగారు గొప్పగా గొప్పలు చెప్పుకుంటూ వుంటాడు పై ఆఫీసర్లతో. అయినా అందులో నిజం లేదని చెప్పేవాళ్లకి తెలుసు. వినే వాళ్లకూ తెలుసు.
శీనుగాడు రెడ్డిగారి ఇల్లంతా తిరగతాడు. నిజమే, ఇల్లంతా అంటే హాలు, వరండా, పెరడూ అని అర్థం. రెడ్డిగారి భార్య సునందమ్మ శీనుగాడ్ని వంటింటి గుమ్మం తొక్కనీదు.
రెడ్డిగారు అతడ్ని తన గదిలోకి అస్సలు రానివ్వడు. పంచాయతి రికార్డులన్నీ ఆ గదిలోనే వుంటాయి. అదే పంచాయతి ఆఫీసు. అక్కడ ఆఫీసరైనా, గుమస్తా అయినా, సర్పంచు అయినా అది రెడ్డిగారే.
వంటింటి గుమ్మం ముందు నిలుచుని సునందమ్మ అందిచ్చిన ట్రే పుచ్చుకుని జాగ్రత్తగా అడుగులేస్తూ హాల్లోకి వచ్చాడు శ్రీనివాసులు.
అందరికి వంగి టీ అందించాడు. రెడ్డిగారు తలాడిస్తూ నవ్వుతున్నాడు. అందరికీ గ్లాసులు చేరాయి.
“నువ్వు తాగేసి రాబోరా” అప్యాయత వొలకబోసాడు రెడ్డి.
“సరే సామీ…” సునందమ్మ మొహం గుర్తొచ్చి “వొద్దు సామీ” అందామనుకున్నాడు. కానీ ఆ మాట గొంతులోనే వుండిపోయింది.
అదేకాదు, అప్పుడేకాదు. చాలాసార్లు చాలా చాలా మాటలు అతడి గొంతులోనే వుండిపోతాయి. లోపలికి నడిచాడు శీను.
“ఎదవ సంత ఎదవ సంత. ఎవుడు ఊళ్లోకొచ్చినా ఈ కొంపేనా కనపడేది. టీనీళ్లు కావ్ల, టిఫినీలు కావల్ల, నా పిండాకూడు కావల్ల. ఆడికి ఈడ నా ముడ్డికింద పదారు మంది ఏనోళ్లు వున్నెట్లు” సునందమ్మా గొణుగుతూనే వుంది.
ఆమె శీనుగాడికి టీ ఇవ్వనూలేదు.
అంతకు మించి శీను ఆమెని టీ అడగనూ లేదు. టీ తాగుతున్న వాడిలా కాస్సేపు అక్కడే వుండి ఆ తర్వాత చప్పుడు కాకుండా నడుచుకుంటూ వచ్చి హాల్లో నిలబడ్డాడు శీను.
“చేసేదేముండాది. రెడ్డిగారు చెప్పినట్లే చేసేద్దాం. ఎం.పి.పి.తో నేను మాట్లాడుకుంటా. బిల్లు అయినాక మిగతా విషయాలు ఏఈతో మీరే మాట్లాడుకోండి” ఎం.డి.ఒ. రెడ్డిగారికి ఏదో హామీ ఇచ్చేసారని మాత్రం అర్థం అయింది శీనుకు. ఇంకేం అర్థంకాలేదు.
అతడికి అర్థం కానిది రెడ్డిగారికి అర్థమైంది. రెడ్డిగారికి అర్థమైంది ఎం.డి.ఒ.కి అర్థమైంది. వాళ్లిద్దరికీ అర్థమవాల్సింది అర్థమైనాక ఇక శీనుకు అర్థమైతే ఎంత? అర్థం కాకపోతే ఎంత?
సిగిరెట్లు వెలిగాయి. కబుర్లు మొదలైనాయి. రాజకీయాలు, వ్యాపారాలు, సినిమాలు, కాలేజీలు – ఏమిటేమిటో మాట్లాడుకుంటున్నారు పెద్ద మనుషులు. అవన్నీ శీను ముందర మాట్లాడుకుంటున్నారు కానీ, అసలు విషయ ఏమిటనేది మాత్రం ఎవ్వరూ అతడికి తెలియనివ్వటం లేదు.
తెల్లకాగితం పైన ఖాళీ రిజిష్టర్ల పైన సంతకాలు పెట్టమంటాడు రెడ్డి. అతడు చెప్పిన చోట శీను సంతకం పెట్టాల్సిందే. ఎందుకూ అని ఇతడు అడగడు. ఎందుకో ఏమిటో అతడూ చెప్పడు.
ప్రతి పనికి గ్రామసభ ఆమోదం వుండాలి. పంచాయతి సమావేశం జరగాలి అనంటుంది ప్రభుత్వం.
పంచాయతిలో ఏపని జరగాలన్నా, నిలిపేయాలన్నా అది రెడ్డిగారిష్టం అంటారు అదే ప్రభుత్వానికి చెందిన ఆఫీసర్లు.
పంచాయతి పరిధిలో ఏం జరిగినా సర్పంచుకు తెలపాలని అంటుంది చట్టం. రెడ్డికి చెపితే చాలంటారు ఆఫీసర్లు.
ఊర్లో తాగటానికి నీళ్లకు కరువు. వానల్లేవు. చెరువులు బావులు ఎండిపోయాక నీళ్లకు కటకట మొదలైంది. జనం అర్జీలిచ్చారు. ధర్నాలు చేసారు. పేపర్లో వార్తలు, ఫోటోలు యథావిథిగా వచ్చాయి. రోజుకి ఇట్లాంటివి వంద వార్తలొస్తాయి, కాబట్టి ఆఫీసర్లూ పట్టించుకోలేదు.
మామూలుగా అయితే ఊర్లో జనం, కాలనీ జనం ఏం కావాల్సివచ్చినా రెడ్డిగారినే అడగట ఆనవాయితి. ఆ రకంగానే అడిగారు. అయినా పనికాలేదు. బోరు మంజూరు కాలేదు. జనం రెడ్డిగారిని తిట్టలేక శీనును తిట్టడం మొదలెట్టారు. గౌరవానికి, ఉనికికి, గుర్తింపుకి పనికి రాని సర్పంచు పదవి తిట్లు తినడానికి మాత్రం పనికొచ్చింది.
రెడ్డిగారికి తెలియకుండానే శీను ఎం.ఆర్.ఒ.ని, ఎం.డి.ఒ.ని, జిల్లా కలెక్టర్‌ని కలుసుకున్నాడు. కాళ్లావేళ్లా బడ్డాడు. అర్జీలు రాయించి ఇచ్చుకున్నాడు. కాళ్లు అరిగినాక, కష్టార్జితం కొంత కరిగినాక పై అధికార్లు కరుణించారు. బోరు మంజూరైంది.
జియాలజిస్టులు వచ్చారు. సర్వే చేసారు. ఎస్టీ కాలనీలో నీల్లు పడతాయని తేల్చిచెప్పారు. అదే మింగుడు పడలేదు రెడ్డిగారికి, ఊర్లో జనాలకి.
ఊర్లో బోరుంటే ఎస్టీ కాలనీ వాళ్లు నీళ్ల కోసం ఊర్లోకి వస్తారు. పెద్ద కులమోళ్లు నీళ్లు పట్టుకున్నాక కాలనీవాళ్లు పట్టుకోవచ్చు. ఊర్లో కొళాయిలున్నాయి. కానీ కాలనీలో ఒక కొళాయూలేదు. రెడ్డి వేయించలేదు. సర్పంచు వేయించుకోలేక పోయాడు.
కాలనీలో వుండేవాళ్లు ఎవరు? బట్టలు అల్లేవాళ్లు, పందులు పెంచుకునేవాళ్లు, ఉప్పు, ఎర్రమట్టి, కట్టెలు అమ్ముకునేవాళ్లు, బాతులు మేపేవాళ్లు. పొద్దంతా కష్టపడితే తప్ప పొద్దు గడవని వాళ్లు. కుళాయి కనెక్షనే వొద్దనుకున్న రెడ్డి కాలనీలో బోరువేయటం కూడా వొద్దనుకున్నాడు.
ఇప్పుడు రెడ్డి గారింట్లో సమావేశం కూడా అదే. సమావేశం కూడా అదే. కాలనీలో బోరు వేయడం అనివార్య కారణాల వల్ల కుదరనందువల్ల మరోసారి మరోచోట బోరు పాయింట్ పెట్టించటానికి గానూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని పంచాయతి ఆమోదించినట్లు శీను… సర్పంచు హోదాలో సంతకం పెట్టాలి.
“శీనుగా తెల్ల కాగితాలు, మినిట్స్ బుక్కు తేరా” ఆదేశించాడు రెడ్డి గంభీరంగా.
హాల్లోంచి కదిలి ఇంట్లోపలికి వస్తూ…. ఆలోచిస్తున్నాడు శీను. సునందమ్మ తెల్ల కాగితాలు, రిజిష్టరు తెచ్చి ఇచ్చింది. ఆలోచిస్తూనే శీను హాల్లోకి వచ్చాడు. పంచాయతి కార్యదర్శి ఏదో రాయబోతే రెడ్డి అతడ్ని వారించాడు.
“ఏం రామాయణమంతా రాయాల్నా. యాడ సంతకం పెట్టాల్నో గుర్తెట్టు చాలు, శీనుగా సంతకం పెట్రా”
శీను మెదడంతా గజిబిజిగా ఉంది. జిల్లా దళిత నాయకుల మాటలు, ప్రోత్సాహం గుర్తొచ్చాయి. మరచిపోయిన ఆత్మగౌరవం ఏదో గుర్తొచ్చినట్లయ్యింది. తదేకంగా తెల్ల కాగితాలవైపే చూస్తూ నిలబడ్డాడు సర్పంచు శ్రీనివాసులు అనే శీను. గాలికి కదులుతూ చప్పుడు చేస్తూన్నాయి ఖాళీ కాగితాలు.
December 6th, 2007 at 10:48 am
it is a special story which expesseses the right angle of the POOR S,T,S .Hope that it will straight away brought away the facts and about the structure of a S.T.family.Hearty welcome the writer”s new writings as a fresh voice ia a very simple manner