నవంబర్2007
జమీలా అడుగుల చప్పుడు
అగ్నికీలవి జమీలా
అశీర్షికవి… అస్మితవి
చీకటి చిత్రశాలలో
కరిగిన కేన్వాసువి
అయితేనేమి?
ఫీనిక్స్‌వి!
కన్నీటమరిగించిన
బతుకు తేనీటిలో
ఉడికిన తేయాకువి
కరిబురఖాని రగిల్చిన
దుఃఖ వర్షితివి
కాఠినపు క్రషర్‌కింద నలిగిన
చెరకు గడల పిప్పిని
తిరిగి - లేత చెరకులా తీర్చే
మాతృకవి!
నాటికవి… దహన వాటికవి
వర్ణానికి ఒక ఆత్మ ఉంటే
అది నువ్వే
అల్లాకి ఒక వాకిలుంటే
నీ నవ్వే
ఈ భూమ్మిద జమీలా అడుగుల చప్పుడు
నలుదిశలా వ్యాపించినప్పుడు
ఎదలోపలి ‘నిషాత్…’ అద్భుత నిశాంతం!
(జమీలా నిషాత్ ఉర్దూ కవయిత్రి. ‘అస్మిత’ కార్యకర్త ముఖ్యంగా ముస్లిం స్త్రీలలో చైతన్యం తీసుకు వచ్చేందుకు అహర్నిశలూ కృషి చేస్తున్న ఆమె కోసం ఈ కవిత)