వట్టికోట ఆళ్వారుస్వామి – ఎం.వి. తిరుపతయ్య

తెలంగాణలో వట్టికోట ఆళ్వారుస్వామి రచనా సంప్రదాయానికి చెందిన రచయిత ఎం.వి. తిరుపతయ్య అంటే ప్రచార సంరంభంలో పడిపోయిన తెలుగు సాహిత్యరంగం అంగీకరించక పోవచ్చు. నవలా రచయితలుగానే తీసుకుంటే ఇద్దరూ చెరి రెండు నవలలు రాసారు. ఆళ్వారుస్వామి గారు 1930లలో, 40ల ఆరంభంలో తెలంగాణ పరిస్థితులు, ఉద్యమాలు కథావస్తువుగా పదిహేనేళ్లు పోయినాక రాస్తే తిరుపతయ్య తెలంగాణ పరిస్థితులు, ఉద్యమాలు కథావస్తువుగా వరంగల్‌ కేంద్ర బిందువుగా 1980ల గురించి పదిహేనేళ్లు, ఇరవై అయిదేళ్లు పోయాక రాసాడు. ఆళ్వారుస్వామిగారి రెండోనవల ‘గంగు’ ఆయన 1961లో మరణించడంతో అసంపూర్తిగా మిగిలిపోయింది. తిరుపతయ్యగారి రెండో నవల ‘జీవన సమరం’ ఆయన క్యాన్సర్‌ వ్యాధితో ఆరు నెలల్లో చనిపోతాడని వైద్యులు ప్రకటించాక ప్రారంభించి పూర్తి చేసింది. ఆళ్వారుస్వామి తన అసంపూర్తి నవల ‘గంగు’ ప్రచురించబడక ముందే మరణించారు. 1965లో గానీ ‘విశాలాంధ్ర’ వారు ఆయన నవల ప్రచురించలేదు. తిరుపతయ్య ‘జీవనసమరం’, ముందే ‘చతుర’లో వెలువడిన ‘బతుకు’తోపాటు పుస్తకరూపంలో వెలువడి ఆయన స్వయంగా ఆవిష్కరణ సభలో పాల్గొని చూసుకున్నాడు. ఆ తృప్తితోనే కొద్దిరోజుల్లోనే మరణించాడు. అయితే ఆళ్వారుస్వామి నవలల వలె తిరుపతయ్య గారి నవలలు ఒకే నవలా పథకంలోని, ఒకే ఉద్యమ క్రమంలోని కొనసాగింపు నవలలుకాదు. ఉద్యమానికి సంబంధించి నేపథ్యం ఒకటే. జీవితం వరంగల్‌ నగరమే ఒక జీవితానికి ‘బతుకు’ నవలలో బాలసముద్రం, హనుమకొండ ఘటనా స్థలాలయితే, రెండో జీవితానికి వరంగల్‌లోని కరీమాబాదు, రచయిత బాల్య జీవితంతో ముడిపడిన ప్రాంతాలు. ముఖ్యంగా వరంగల్లు, మరికొన్ని గ్రామాలు ఘటనా స్థలాలు. ఈ పోలికల కన్నా తనకు స్పష్టంగా తెలిసి, అనుభవానికి వచ్చిన జీవితాన్ని జీవితమంత కఠోరసత్యంగా వివరించడం, ఆ వివరించడానిక బతుకునే, బతుకు పోరాటాన్నే రచనా శైలిగా ఎంచుకోవడం – అందువల్ల ఆ జీవితానుభవం గల పాఠకులు అందులో తాదాత్య్వం చెందడం ముఖ్యమైన సాదృశ్యం.

నవలలు చదివి రచయితలు గురించి తెలుసుకుంటే ఇద్దరికీ ఉద్యమ జీవితం ఉన్నది. ఆళ్వారుస్వామి వలె తిరుపతయ్య నిరుపేద కుటుంబం నుంచి రాలేదు. మధ్య తరగతి రైతు కుటుంబం నుంచి వచ్చాడు. ఆళ్వారుస్వామి గోర్కీ వలె జీవితమనే విశ్వవిద్యాలయంలోనే అపార జ్ఞానాన్ని పొందిన విద్యావంతుడయ్యాడు. తిరుపతయ్య బుద్ధిగా ఎం.ఎ. దాకా చదువుకొని తర్వాత జమ్మికుంట ఆదర్శ కళాశాలలో లెక్చరర్‌గా చేరిన దగ్గర్నించే జీవనసమరం ప్రారంభించాడు. ఆయన కష్టాలు ఉద్యోగం దొరికి, జీతాలిఇవ్వని యాజమాన్యంతో ప్రారంభమైవి.

ఆళ్వారుస్వామి జీవితకాలపు, రచనాకాలపు తెలంగాణ వలె తిరుపతయ్య రచనాకాలపు తెలంగాణ కూడ సంక్షుభితంగా ఉన్నది. ముఖ్యంగా ఆయన జమ్మికుంట ఆదర్శ కళాశాలలో లెక్చరర్‌గా చేరిన దగ్గర్నించీ తెలంగాణ బతుకుటేరు మరో నెత్తుటి ఏరుగా మారిన ‘జీవన సమరం’ ప్రారంభమైంది. ఆనాడు అటువంటి పోరాటానికి ఆళ్వారుస్వామిగారు జన్మించిన నలగొండ జిల్లా కేంద్రమైతే, డెబ్బై, ఎనబైలలో అటువంటి పోరాటానికి తిరుపతయ్య గారు జన్మించిన కరీంనగర్‌ జిల్లా కేంద్రస్థావరమైంది. ఆనాడు ఆళ్వారుస్వామి స్వయంగా ఆ ఉద్యమ కార్యకర్త అయితే, డెబ్బైలలో తిరుపతయ్య ఆ ఉద్యమానికి ఫ్రెండ్‌, టీచర్‌ అనవచ్చు. అట్లని ఆయన పడక కుర్చీ మేధావి కాదు. తన ఇరవయ్యవ ఏటనే వరంగల్‌ ‘మిత్రమండలి’కి కన్వీనర్‌ అయి (ఆయన కన్నముందు వరవరరావు, అంపశయ్య నవీన్‌లు ఆ బాధ్యతలు నిర్వహించారు) తన చుట్టూ అద్భుతమైన స్నేహ ప్రపంచాన్ని, ఉద్యమ సాహిత్య వాతావరణాన్ని సృష్టించుకున్నాడు. ఆళ్వారుస్వామి కార్యస్థానం ప్రధానంగా సికిందరాబాదు, హైదరాబాదు నగరాలయితే తిరుపతయ్య కార్యస్థానాలు వరంగల్‌, జమ్మికుంటలు. ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ వరంగల్‌ తిరుపతయ్య నివాస కేంద్రం. ‘మిత్రమండలి’ ఆయన సాహిత్య పరిమళాలు పంచిన పందిరి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు.

సంస్థలు స్థాపించడం, పత్రికలు పెట్టడం, ఉద్యమాలతో నిమగ్న సంబంధాలుండడం ఇద్దరికీ సారూప్య స్వభావాలే. ఒక సాహిత్య కార్యకర్తగా ఉద్యమ జీవిగా ఆళ్వారుస్వామికి ఆయన సమకాలీనుల్లో ఎటువంటి గుర్తింపు ఉండేదో, ఒక ఉత్తమ ఉపాధ్యాయునిగా, ముఖ్యంగా విద్యార్థులను ఉద్యమ చైతన్యంతో తీర్చిదిద్దిన ఒక నిశ్శబ్ద ప్రవాహంగా తిరుపతయ్యకూ ఉపాధ్యాయ, విద్యార్థి శ్రేణుల్లో అటువంటి గుర్తింపు ఉండేది. 1968-70ల మధ్య జమ్మికుంట నుంచి బి. విజయకుమార్‌, గోపు లింగారెడ్డి, ఉమ్మెంతలు వెంకటరెడ్డి నిర్వహించిన ‘విద్యుల్లత’ పత్రిక వెనుక విద్యుచ్ఛక్తిని కనిపెట్టిన శాస్త్రజ్ఞుడు తిరుపతయ్యే. ఆ కళాశాలనుంచి నల్ల ఆదిరెడ్డి, సాహు (శనిగరం వెంకటేశ్వర్లు) మాసాని రవీందర్‌, నేలకొండ రజిత వంటి విప్లవకారులు విద్యార్థి ఉద్యమం నుంచే ఎదిగివచ్చారు.

తిరుపతయ్య ‘న్యాయం’ పేరుతో ‘విద్యుల్లత’లో ఒక కథ రాసాడు. ‘ఒక దొర తన దగ్గర పాలేరుగా పనిచేస్తున్న ఒక నిరుపేద వాడి శ్రమ ఎంత అమానుషంగా దోచుకుంటాడో ఆ కథలో చిత్రించాడు. మోసానికి గురయిన ఆ పాలేరు కొడుకులు ఆ దొర పాలిస్తున్న గ్రామంలో న్యాయం దొరకడం అసంభవమని భావించి అడవుల్లో న్యాయం దొరుకుంతుందన్న ఆశతో అడవుల్లోకెల్లి పోయారు” (అంపశయ్య నవీన్‌ ‘బతుకు’ నవలకు ముందుమాట)ని కథ ముగించాడు. ఈ కథను నాటకరంగంలో ఉత్సాహం ఉన్న యువకులు కొందరు నాటికగా మలచి పలుచోట్ల ప్రదర్శించారు. 1974లో ‘ఉద్యమ సాహితి’ కరీంనగర్‌ ప్రచురించిన ‘బద్‌లా’ కథా సంకలనంలో కూడా ఈ కథ చోటు చేసుకున్నది. కవితా న్యాయమనాల్నో, అన్యాయమనాల్నో గానీ అప్పటికింకా జగిత్యాల, సిరిసిల్లా రైతాంగ పోరాటాలు ప్రారంభం కాలేదు. శ్రీకాకుళ ఉద్యమం పూర్తిగా అణచివేయబడింది. విరసం మాత్రం ఏర్పడి, 72లో జననాట్యమండలి కూడ ఏర్పడి తెలంగాణలో విద్యార్థి, యువజనుల మీద చాల ప్రభావాన్ని చూపుతున్నాయి. 1974 అక్టోబరులో రాడికల్‌ విద్యార్థి సంఘం కూడ ఏర్పడింది. అయితే 1975 జూన్‌లో ఎమర్జెన్సీ ప్రకటించే దాకా కూడ విద్యార్థులు తిరుపతయ్య గారు ‘న్యాయం’ కథలో భవిష్యత్‌ వాణిగా చెప్పినట్లు అడవుల్లోకి న్యాయం కోసం వెళ్లలేదు. అపుడాయనా తెలంగాణ మైదాన ప్రాంతాల్లో, ముఖ్యంగా కరీంనగర్‌, ఆదిలాబాద్‌ గోదావరి తీర గ్రామాల్లో, ఇతర ఇరుగు పొరుగు తాలూకాల్లో దళిత వాడల్లోకి, భూమిలేని నిరుపేదల ఇళ్లల్లోకి ఇందిరమ్మ ప్రకటించిన ఇరవై సూత్రాలు అమలు చూద్దామని వెళ్లారు. ఎమర్జెన్సీ అంతా ఆ ప్రజల మధ్యన ఉన్నాడు. అట్లా పెల్లుబికినవే ఎమర్జెన్సీ తర్వాత జగిత్యాల సిరిసిల్లా పోరాటాలు.

అయితే భవిష్యత్‌ పరిణామాలకు తిరుపతయ్య తన ‘న్యాయం’ కథ ద్వారా, ‘విద్యుల్లత’ పత్రిక ద్వారా, బోధనల ద్వారా విత్తనాలు చల్లుతున్నాడనుకున్నారేమో (ఆయన 70లో ఏర్పడిన విరసంలో చేరలేదు) ఎమర్జెన్సీలో అరెస్టు చేసి, తీవ్రమైన మానసిక వేదనకు గురిచేసే పోలీసు లాకపులో పెట్టారు. ఆ భయంకరమైన మానసిక క్షోభనంతా ఆయన డైరీ ఆధారంగా అంపశయ్య నవీన్‌ ‘చీకటి రోజులు’ అనే నవలలో ‘ఎమర్జెన్సీ’ ఎత్తి వేయగానే రాసాడు. అది పునర్ముద్రణ కూడ పొందిన గొప్ప జీవిత చిత్రణ. అంపశయ్య నవీన్‌ నవలల్లో ‘అంపశయ్య’ తన రక్త మాంసాలతో రాసిన స్వానుభవమైతే, ‘చీకటి రోజులు’ తిరుపతయ్యను తనలో ఆవహింప చేసుకొని రాసిన నవల.

ఆళ్వారుస్వామి గారు సుదీర్ఘమైన కాలం, రెండున్నర ఏళ్లు నిజామాబాదు, హైదరాబాదు జైళ్లలో ఉన్నాడు. నిజామాబాదు జైలులో దాశరథితో పాటు ఉన్నాడు. ఆ రోజుల్లో తెలంగాణ జైళ్లల్లో జీవితం దుర్భరంగా ఉన్నమాట నిజమే. కాని అది జైలు, జుడీషియల్‌ కస్టడే. తిరుపతయ్య ఇరవై నాలుగు గంటలకు మించి ఒకటి రెండు రోజులు కాదు ఇరవై ఏడు రోజులు పోలీసు కస్టడీలో ఉన్నాడు. అక్రమ నిర్బంధంలో ఉన్నాడు. ప్రాథమిక హక్కులు కూడ రద్దయిన ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో, భార్యాపిల్లలకు, బంధువులకు, సహోధ్యాపకులకు, స్నేహితులకు కూడ తెలిసింది చీకటి కొట్లల్లో ఉన్నాడు.

ఏ వారం పదిరోజులకో తన క్లాస్‌మేట్‌ అయిన మంచి పోలీసు అధికారి సహాయంతో ‘అంపశయ్య’ నవీన్‌ ఆయన ఆచూకీ తెలుసుకొని, విడుదలకు చేసిన ప్రయత్నం మనం ‘చీకటి రోజులు’ నవలలో కళ్లకు కట్టినట్లు చదువుకోవచ్చు. అయితే తిరుపతయ్య ‘జీవనసమరం’ చేసిన భయస్తుడు.

ఆళ్వారుస్వామికి కాలికి బలపం కట్టుకొని, చంకన పుస్తకాలసంచీ తగిలించుకొని ‘దేశోద్ధారక గ్రంథమాల’ కొరకు గ్రంథాలయ ఉద్యమాన్ని నిర్వహిస్తూ తెలుగు నేల తిరిగిన వైతాళిక ఉద్యమ చరిత్ర ఉన్నది. అందులో సాహిత్యానికీ, రాజకీయానికీ, సమాజానికీ దేనికీ తక్కువ చోటులేదు. ఆయన ఆంధ్రమహాసభ నుంచి కమ్యూనిస్టు పార్టీలోకి ప్రవేశించాడు. తిరుపతయ్య ముల్కనూరు ప్రాంతంలో సహకార ఉద్యమానికి ఆదర్శప్రాయమైన ఆకృతి యిచ్చిన కుటుంబ నేపథ్యం నుంచి ‘మిత్రమండలి’ నుంచి, విరసం సన్నిహిత ప్రభావంలోకి వచ్చాడు.

ఆళ్వారుస్వామి సికిందరాబాదులో గుమస్తాల సంఘం పెట్టాడు. తిరుపతయ్య జమ్మికుంటలో అధ్యాపక ఉద్యమాలకు కేంద్రంగా ఉన్నాడు. ఆదర్శాలు వల్లించి జీతాలు ఇవ్వని యాజమాన్యం గుండెల్లో అజ్ఞాత బెదురుకు కారణమైన అర్భకుడు. అందుకే ఆ కక్ష ఎమర్జెన్సీలో ఆయనమీద దెబ్బగా పడింది.

కాళోజీ గోదావరి నది అయితే ఆళ్వారుస్వామి కృష్ణానది అయితే తిరుపతయ్య మానేరు. ‘మనసంత మానేరు, మాట కోనేరు’ ఆయన బతుకు, జీవనసమరం నవలల్లో ‘విస్ఫోటనమైన మౌనం’. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత ఇరవయ్యేళ్ల దాకా ఆయన రాయలేదు. ఆ మధ్యకాలంలో అడవి బాపిరాజు నవలల మీద సిద్ధాంత వ్యాసం రాసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పి.ఎచ్‌డి. పట్టా పొందాడు. 1987లో ‘చతుర’ నవలల పోటీకి రాసిన నవలకు తృతీయ బహుమతి వచ్చింది. దానికి చలసాని ప్రసాద్‌ రావుగారు ‘బతుకు’ అని పేరు పెట్టి ప్రచురించారు. ‘ఒక పరిశోధక విద్యార్థి ఈ నవల మీద సిద్ధాంత వ్యాసం రాసి ఎం.ఫిల్‌. డిగ్రీని పొందడం నన్ను కదిలించింది’ అని తిరుపతయ్య గారు ‘బతుకు’ పుస్తక రూపంలో వెలువడినపుడు కృతజ్ఞతలు చెప్పుకున్నారు.

‘న్యాయం’ కథలోని నిప్పురవ్వ ఒకసారి ఎగసి ‘బతుకు’లోను, మళ్లీ ఇరవై ఏళ్ల తర్వాత వెలువడిన ‘జీవన సమరం’లోను వెలుగులు విరజిమ్మించె పొట్లపల్లి రామారావు గారివలె అంతర్ముభావంగా ఉండి ఇంటిపట్టున ఉండి దశాబ్దాల పాటు గుండెల్లోని లావాను దాచుకొని, ఎప్పుడోగానీ కాగితం మీద పెట్టక పోవడం వల్ల కావచ్చు తిరుపతయ్యకు రావల్సినంత పేరు రాలేదు. సంచలనాత్మకత లేకపోవడం ఆయన బలహీనత అయిందేమో.

‘జీవన సమరం’ నవలలో కనిపించినంత సమగ్రంగా తెలంగాణ జీవితం మరే నవలలోనూ కనిపించదు. బతుకమ్మ పండుగ, దసరా పీరీల పండుగ వంటి తెలంగాణ పండుగలు, సాంస్కృతిక విశేషాలు, విశ్వాసాలు – ఒక కదులుతున్న పోరాట నదీ తీరాల వలె ఇందులో కళ్లకు కడ్తాయి.

తెలంగాణ మళ్లీ తన అస్తిత్వాన్ని వెతుక్కుంటున్న ఈ తరుణంలో తిరుపతయ్య నవలలు ఒక గొప్ప జీవితావగాహనను, పోరాట స్ఫూర్తిని ఇస్తాయి. ఆయన వ్యక్తిగా, రచయితగా, ఉద్యమ జీవిగా అట్లా అంతర్‌, బహిర పోరాటాలు చేసాడు. క్యాన్సర్‌ వ్యవస్థలో రాజీలేకుండా పోరాడారు. భయంకరమైన క్యాన్సర్‌ వ్యాధితో పోరాడాడు. ఒక ఏడాది పాటు మూడు పెద్ద పెద్ద శస్త్ర చికిత్సలు సికిందరాబాదు యశోదా ఆసుపత్రిలో జరిగి ఇంక వైద్యశాస్త్రం చేయగలిగింది ఏమీ లేదని తేలిపోయాక ఆయన ఆరు నెలలపాటు మరణశయ్యపై బోర్లాపడుకొని అచ్చులో దాదాపు మూడు వందల పేజీలు వచ్చిన ఈ నవల రాసాడు. ఈ పుస్తకావిష్కరణ సభలో తిరుపతయ్య బోర్లాపడుకుని ఈ నవలరాసి, తలకిందులయిన సమాజాన్ని సరిచేసి చూసాడని, ‘కాకలు తీరిన యోధుడు’ నవల రాసిన రష్యన్‌ రచయితతో పోల్చదగిన రచయిత తిరుపతయ్య అని చెప్పాను.

అటువంటి సాహిత్య యోధుడు ఎం.వి. తిరుపతయ్య మనకందించిన తెలంగాణ పోరాట సాహిత్య సంప్రదాయాన్ని స్మరించుకుని ప్రేరణ పొందడం ఈనాటి అస్తిత్వ ఉద్యమకారుల కర్తవ్యమని భావిస్తాను.

ఎం.వి. తిరుపతయ్య వ్యక్తిత్వం-సాహిత్యం-ప్రభావం

ఈ సంవత్సరం ఆరంభకాలంలో ఎం.వి. తిరుపతయ్య గారి రెండు నవలలు ‘బతుకు’, ‘జీవన సమరం’ వెలువడినవి. ఆ రెండు నవలల ఆధారంగానే ఆయన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, సాహిత్యాన్ని – తెలంగాణ విద్యార్థి, యువజన, సాంస్కృతికోద్యమాల పై ఆయన ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తాడు.

ఈ రెండు పుస్తకాల వెనుక రచయిత గురించి చేసిన పరిచయాలు, ముందు మాటల్లో అంపశయ్య నవీన్‌ రాసిన విషయాలు, అంపశయ్య నవీనే తిరుపతయ్యను ప్రధానపాత్రగా పెట్టి రాసిన ‘చీకటి రోజులు’ నవల ఆధారంగా ఆయన సమగ్ర వ్యక్తిత్వాన్ని పునర్నిర్మించవచ్చు. ‘చీకటి రోజులు’ నవలలోని శ్రీనివాసరావు పాత్రకు ఆధారం తిరుపతయ్యేనని నవీన్‌ రాసాడు. ‘నన్ను ఒక పాత్రగా మలచి సాహిత్యంలో అజరామరుణ్ని చేసావని’ తిరుపతయ్య ఎంతో సంతోషించాడట.

2 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

2 అభిప్రాయాలు

  1. krishna chaitanya Nov 4, 2007 1

    “తెలంగాణలో వట్టికోట ఆళ్వారుస్వామి రచనా సంప్రదాయానికి చెందిన రచయిత ఎం.వి. తిరుపతయ్య అంటే ప్రచార సంరంభంలో పడిపోయిన తెలుగు సాహిత్యరంగం అంగీకరించక పోవచ్చు.” వరవర రావు గారు చెప్పిన మాట అక్షరాలా వాస్తవం.
    సాహిత్యాన్ని చారిత్రక పరిశీలనతొ అనుసంధానించడం అంటె ఇది. సమకాలికులకె కాదు ముందు తరాలకూ ఒక దారిని నిర్దేశిస్తున్న మంచి వ్యాసాన్ని అందించినందుకు కృతజ్ఞతలు. వరవర రావు గారికి ధన్యవాదాలు….క్రిష్ణ చైతన్య

  2. Rakesh Telangaan Nov 5, 2007 2

    తిరుపతయ్యగారి గురించీ, ఆళ్వారుస్వామితో ఆయనకుగల దగ్గరి పోలికలగురించీ, ఇంకా మా గురువుగారైన గోపులింగారెడ్డిగారి గురించీ ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోగలిగ్యా.
    వరవరరావుగారికి హృదయపూర్వక ధన్యవాదాలు!!

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో