నవంబర్ 2007 : సంపాదకీయం

‘ప్రజల మనిషి’ వట్టికోట ఆళ్వారుస్వామి
‘ప్రజల మనిషి’ వట్టికోట ఆళ్వారుస్వామి
నవంబర్ ఒకటి – ప్రముఖ సాహితీయోధుడు వట్టికోట ఆళ్వారుస్వామి జయంతి. 1915 లో తెలంగాణ లోని ఒక పల్లెటూర్లో జన్మించిన ఆళ్వారుస్వామి, తన 46వ ఏట 1961 లో మరణించారు. తన 46 ఏళ్ల పరిమిత జీవితంలోనే అపరిమిత విజయాలు సాధించారు. జీవితకాలమంతా సాహిత్య జీవనం, సంఘ కార్యాలు తన రెండు బుజాలుగా పనిచేసారు. ప్రజల మనిషి’, ‘గంగు’ – రెండు నవలలు రాసారు. ‘జైలు లోపల’ మరికొన్ని ఇతర కథలు రాసారు. ‘రామప్ప రభస’ అనే రాజకీయ వ్యంగ్య రచనలు చేసారు. ‘వీణ’, ‘తెలుగు తల్లి’ పత్రికలను నిర్వహించారు. ‘దేశోద్ధార గ్రంథమాల’ ను నెలకొల్పి దాదాపు 30 పుస్తకాలు తన ముద్రతో ప్రచురించారు. గ్రంథాలయోద్యమం లో క్రియాశీలకంగా పాల్గొని, రచయితగా అభ్యుదయ రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘాల్లో పనిచేసారు. సామాజిక చైతన్యకారుడిగా ఆర్య సమాజం, ఆంధ్ర మహాసభల్లో, రాజకీయ కార్యకర్తగా స్టేట్ కాంగ్రెస్ , కమ్యూనిస్టు పార్టీల్లో, కార్మిక నాయకుడిగా ‘గుమస్తాల సంఘం’, ‘రిక్షాకార్మికుల సంఘం’, ‘రైల్వే కార్మికులసంఘం’ కార్యకలాపాల్లో అంకిత భావంతో పనిచేసారు. గుమస్తాల సమస్యల పరిష్కారం కోసం ‘గుమస్తా’ పత్రిక నిర్వహించారు. పరిశోధకుడిగా ‘తెలంగాణం’ రెండు భాగాలు కూర్చడమే గాక పదివేల గ్రంథాలతో సూచీ గ్రంథాలయం నెలకొల్పారు. జీవిక కోసం గ్రంథాలయ సేవకుడిగా మొదలైన ఆయన, వంటవాడుగా, ప్రూఫ్ రీడర్ గా హోటల్ సర్వర్ గా, పుస్తక విక్రయదారుగా అతి సాధారణమైన జీవితం గడిపారు. నిజాం వ్యతిరేక రాజకీయ కార్యకలాపాలు నిర్వహించినందుకు రెండు సార్లు 1941, 1946 ల లో జైలు జీవితం గడిపారు. ఆయన, మహాకవి దాశరథి కలిసి జైలులో ఉన్న రోజులలో దాశరథి ‘అగ్నిధార’ పద్యాలను – ‘ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాక్షసాధముడు – తీగలను తెంచి అగ్ని లోన ముంచినావు – నా తెలంగాణ కోటి రతనాల వీణ’ – అంటూ జైలు గోడలమీద రాసి తీవ్రమైన దెబ్బలు తిన్నారు. వెనుకబడ్డ ప్రాంతం, వెట్టి నేపథ్యం, అతి తక్కువ అక్షరాస్యత, ఉన్న తెలంగాణ గ్రామం నుండి వచ్చిన నిరుపేద వైష్ణవ కుటుంబానికి చెందిన ఆళ్వారుస్వామి, తన స్వీయ అధ్యయనం తో అవగాహన పెంచుకుని, నవలా సృజనకు, ఒక గొప్ప సాహిత్య ఉద్యమానికి దిశా నిర్దేశం చేయ గలిగిన స్థాయికి ఎదిగిన మహోన్నత శిఖరం ఆళ్వారుస్వామి. అత్యంత పేదరికంతో గడిపినా, ఎక్కడా తలవంచక, మొక్కవోని కార్యదీక్షతో అసామాన్యమైన అంకితభావంతో తెలంగాణ కు, ప్రజలకు, సాహిత్యానికి జీవితాన్ని ధారవోసిన అపురూప వ్యక్తిత్వం ఆళ్వారుస్వామి. ఆ మహానుభావుని జయంతి సందర్భంగా ప్రాణహిత ఆయనకు, ఆయన మహోన్నత సాహితీ రాజకీయ వ్యక్తిత్వానికి అభివాదం చేస్తున్నది. ఆయన స్మరణలో, మహాకవి దాశరథి రాసిన పద్యాన్ని, ‘ప్రజల మనిషి’ పై పి. రామకృష్ణ విశ్లేషణను మీ కందిస్తున్నది.

అంపశయ్య నవీన్ రాసిన ‘చీకటిరోజులు’ నవల చదివిన వాళ్ళెవరూ అందులోని శ్రీనివాసరావు పాత్రను అంత సులభంగా మర్చిపోలేరు. ఆ నవలలో, తన ఒకానొక కథ లో ముగింపులో కథానాయక పాత్రధారి అడవికి పోయినట్టు రాసినందుకు ఎమర్జెన్సీ చీకటిరోజుల్లో రచయిత శ్రీనివాసరావును అరెస్టు చేసి తీవ్రమైన చిత్రహంసలకు గురిచేస్తారు. నిజానికి శ్రీనివాసరావు పాత్రకు ఒక సజీవమయిన వ్యక్తి ప్రేరణ అని, ఆ వ్యక్తి తిరుపతయ్య అని నవీన్ ఒక సందర్భంలో ప్రకటించారు. తిరుపతయ్య ఈ మధ్య కాలంలోనే అనారోగ్యం తో తీవ్రంగా పోరాడి మరణించారు. అయితే తాను మరణశయ్య పై నున్నపుడు, లేవలేని పరిస్థితుల్లో, బోర్లా పడుకునే తనలోని రచయితను బ్రతికించారు. ఒక అద్భుతమైన నవలను రాసారు. ఆళ్వారు స్వామి ని గుర్తు చేసుకుంటున్న సందర్భంలో తిరుపతయ్యను, ఆయన సాహితీ వ్యక్తిత్వాన్ని పరిచయం చేస్తూ వరవరరావు రాసిన వ్యాసాన్ని మీకందిస్తున్నాము.

Dried leaf art by ‘Vasantha Kumari Mukthavaram’
Dried leaf art by ‘Vasantha Kumari Mukthavaram’
అక్టోబర్ నెల తెలుగు వాళ్ళకు ఒక ప్రత్యేకమైన సందర్భం. ప్రపంచంలో ఇంకెక్కడా లేని ఒక సాంప్రదాయాన్ని పండుగ గా తెలుగు వాళ్ళు జరుపుకుంటారు. వానలు పడి, ప్రకృతి పులకరించి అద్భుతంగా పుష్పించిన వేళ, నీటికీ, పూలకూ, జన్మనిచ్చిన ప్రకృతికీ, బ్రతుకుకూ ఉన్న అవినాభావ సందర్భాన్ని తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగగా జరుపుకుంటారు. ఈ పండుగ తెలుగువాళ్ళందరికీ గర్వ కారణమైన సాంస్కృతిక సంపద అని ప్రాణహిత భావిస్తున్నది. ఈ పండుగను కేవలం తెలుగు నేలపైనే కాకుండా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. తెలుగువాళ్లకు బతుకమ్మ పండుగ ఒక సాంస్కృతిక చిహ్నమని ప్రాణహిత భావిస్తున్నది. ఈ సందర్భంగా ఒక బతుకమ్మ పాటను, కేవలం సహజంగా దొరికే ఆకులు, పూలతో ముక్తవరం వసంతకుమారి చిత్రించిన చిత్రాన్ని మీకందిస్తున్నాం.

పెద్దతనంలో, జన్మనిచ్చి, పెంచి పోషించిన తల్లిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన కొడుకు, డబ్బు కోసం, భోగలాలసత్వంతో నిర్లక్ష్యం చేసి ఆమెకున్న ఒకానొక గూడుని కూడా చెల్లాచెదరు చేసిన వైనాన్ని దయనీయంగా చెప్పే మంచికంటి కథ ‘ఆశ్రయం’ ను ప్రాణహిత ఈ సంచికలో మీకందిస్తున్నది. సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన శ్రీనివాసు సర్పంచు అయినా ఆధిపత్య కేంద్రమైన రెడ్డిగారు తరతరాలుగ తనకు సంక్రమించిన సామాజిక అధికారాన్ని ఎట్లా నెరపే ప్రయత్నం చేస్తాడో, సమాజం లో ఆధిపత్య సంబంధాలు ఎట్లా పనిచేస్తాయో చిత్రించే కథ పల్మనేరు బాలాజీ రాసిన ‘చప్పుడు’. 1980ల చివర్లో తెలుగు సాహిత్యంలోకి ఉప్పెనలా వచ్చిన స్త్రీవాద సాహిత్యలో విలక్షణమయిన గొంతు కొండేపూడి నిర్మల. ఆమె రాసిన లేబర్ రూం కవిత గొప్ప సంచలనాన్ని సృష్టించింది. అయితే ఈ సారి అదే లేబర్ రూం గురించి రాసిన ఒక విభిన్నమైన ఇతివృత్తాన్ని కథగా ‘సారీ ఘర్’ లో ప్రాణహిత మీకందిస్తున్నది.

సాహిత్య వ్యాసాల్లో ‘హిందుత్వ దాష్టీకాన్ని ప్రశ్నించిన ముస్లిం కవిత్వాన్ని’ పరిచయం చేసే స్కై బాబా వ్యాసాన్ని మీ కందిస్తున్నాం. ముస్లిం కవిత్వంగా, ముస్లింవాద కవిత్వంగా ఒక దశాబ్ద కాలంగా బలంగా వినబడుతున్న కవిత్వాన్ని, దాని వెనుక ఉన్న సామాజిక రాజకీయ అంశాల్ని స్కైబాబ ఈ వ్యాసంలో పరిచయం చేసారు. ‘తెలంగాణ కవిత – 2006’ పేరుతో వెలువడిన కవితా సంకలనాన్నిపరిచయం చేస్తూ థింసా రాసిన సమీక్షను మీ కందిస్తున్నాం. తెలంగాణ అస్తిత్వం బలంగా వినబడుతున్న ఈ సందర్భంలో ఈ మధ్య కాలంలో ముందుకొచ్చిన కవిత్వాన్ని ఈ వ్యాసం పరిచయం చేస్తుంది. ఆరోగ్యం,శుచీ, శుభ్రతల గురించి రోహిణీ ప్రసాదు రాసిన శాస్త్రీయ వ్యాసాన్ని కూడా ఈ సంచికలో అందిస్తున్నాం.

లకోటా తెగకు చెందిన నేటివ్ అమెరికన్ ప్రజల జీవితాన్ని, వారి పేదరికాన్ని, పోరాటాల్నీ అద్భుతంగా చిత్రిస్తున్న ఆత్మ చరిత్రాత్మక నవలకు మమత చేస్తున్న ధారావాహిక అనుసృజన తర్వాతి అధ్యాయాన్ని మీ కందిస్తున్నాము.

అట్లే ఈ సంచికలో, కోడూరి విజయకుమార్, ఉదారి నారాయణ, ఖాజా, ఎం. ఎస్ సూర్యనారాయణ, వెంకటేష్, పసునూరి రవీందర్ ల కవితలని మీకందిస్తున్నాము.

ఎప్పట్లాగే ప్రాణహితను ఆదరిస్తారని, మీ అభిప్రాయాలని ప్రకటించి నిర్మాణాత్మక చర్చను కొనసాగిస్తారని మా సవినయ విన్నపం.

అభిప్రాయాలు లేవు »సంపాదకీయం

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో