Nov2007
‘ప్రజల మనిషి’లో ప్రజల జీవితం
అయితే, ఆలోచించవలసిందిగా అవతలివాళ్లను (శ్రీశ్రీ చెప్పినట్టు గీతకవతలివాళ్లు… అనికాదు) కోరడమేకాక, అందుకు నా ఆలోచనేమిటో చెప్పాలి కదా. ‘ప్రజల మనిషి’లో ఉన్న ప్రజాజీవితం ఆ తర్వాత కనిపించలేదనుకోడానికి నాకున్న కారణాలు చెబుతాను. అది ఉద్యమం నుంచీ జీవితాన్ని కాక, జీవితం నుంచీ ఉద్యమాన్ని చూసింది. అదీ క్రమక్రమంగా, అనివార్యంగా, అతి సహజంగా రూపొందిన ఉద్యమం. ప్రజల చైతన్యంతో, ప్రజల భాగస్వామ్యంతో వచ్చిన ఉద్యమం. ప్రజా నాయకుడుగా కాక, ప్రజల మనిషిగా (ఆళ్వారుస్వామి కానీ, కంఠీరవం కానీ) రూపొందిన మనిషి. ఆ పేరులోనే ప్రజాస్వామ్య దృక్పథం స్పష్టంగా కనిపిస్తోంది. ఉద్యమలక్ష్యాలు పరిమితమైనవే కావచ్చు, ఎంతటి ఉద్యమానికైనా సరిపడే సక్రమ వైఖరి అది. ఉద్యమాలకు ఉండవలసిన పునాది అది.
ఇక, తర్వాత వచ్చిన ఉద్యమ నవలల్లో ఇటువంటి పునాది లేకపోవడానికి అనేక కారణాలు కనిపిస్తాయి. ప్రజల మనిషిలో కనిపించిన ప్రాథమిక దశను దాటి ఉద్యమాలు చాలా ముందుకు వెళ్లాయి. సాయుధ పోరాటం నుంచీ విప్లవోద్యమం దాకా వెళ్లాయి. సాయుధపోరాటం కన్నా విప్లవోద్యమం అభివృద్ధి చెందినదా… అనడగవచ్చు. సాయుధపోరాట లక్ష్యాల కన్న విప్లవోద్యమ లక్ష్యం విస్తృతమైనది. ఆ దృష్టితో చూస్తే అభివృద్ధి చెందిన ఉద్యమ మనడానికి సందేహించనక్కర్లేదు. ఉద్యమ లక్ష్యం విస్తృతమైనదీ, అత్యవసరమైనదీ అవడంతో, పునాది నిర్మాణం పై దృష్టి తగ్గి, ఉద్యమ భవన నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించింది. పునాది పట్టిష్టంగాలేని నిర్మాణాల స్థితి ఏమవుతుందో, జీవితం లేని ఉద్యమ నవలల పరిస్థితి కూడ అలాఅయింది. ఇంకో విధంగా సృజనాత్మక ప్రక్రియలో వచ్చిన మార్పు… అంటే వస్తు శిల్పాల సమన్వయంలో ఏర్పడిన అభిప్రాయంగా ఇందుకు తోడయింది. శిల్పం అనవసరం అనడం నుంచీ ప్రారంభమై, శిల్పం వస్తుపరమైన నిజాయితీకి అడ్డు అనే విడ్డూరపు వాదం దాకా వెళ్లింది.
ఈ కారణాల రీత్యానూ, మరికొన్ని కారణాల రీత్యానూ తక్షణ ఫలితం (ఇన్‌స్టెంట్ రిజల్ట్) పై, తహతహ పెరిగింది. ‘మరికొన్ని కారణాలు’ అని, అవేవో చిన్నవైనట్టు దాటివేయడం కూడ తప్పే కాబట్టి చెప్పకతప్పదు. సాధారణంగా ఉద్యమకారులలో కనిపించే అహంభావం లాంటిది. అంటే, తమకుతాము ఉద్యమానికి కీలకమైన వ్యక్తులుగా భావించడం వంటిది, ఉద్యమ నవలాకారులకూ సంక్రమించింది. ప్రజల సాధారణ జీవితం గురించి చెప్పడం తమ స్థాయికి తగ్గింది కాదనుకుంటారు. అసలు సంగతేమిటంటే, జీవితం కనిపించే రచన చేయడం సులభమైన పనికాదు. అందువల్ల దగ్గర దారిలో వెళ్లి ఉద్యమరచన చేసిన రచయితగా పేరు ప్రతిష్ఠలు పొందాలనుకుంటారు.
ఎక్కన్నుంచీ ప్రారంభించవలసింది తెలీకపోతే, ఎక్కడికి వెళ్లాలో కూడ తెలీదు. జీవితం లేని పోరాటం నేల విడిచిన సామే. జీవితం కనిపిస్తుంటే, ఉద్యమం గురించి అవగాహన లేనివాళ్లు కూడా స్పందిస్తారు. పూర్తిగా ఉద్యమం మాత్రమే ఉంటే, ఉద్యమకారలూ, ఉద్యమం గురించిన అవగాహన ఉన్న వాళఉ్ల మాత్రమే స్పందిస్తారు. ఎరకం సాహిత్య సభకు అరకం శ్రోతలే వచ్చినట్టు ఉంటుంది. అది ఉద్యమానికైనా పెద్దగా ఉపసరించదని వేరే చెప్పనక్కర్లేదు. ప్రజాజీవితం ఉన్న రచన ప్రభావం నిలకడగా ఉంటుంది. ఉత్తి ఉద్యమ రచన ఆ ఉద్యమ విధానమూ, లక్ష్యమూ మారిపోతే అప్రస్తుతమవుతుంది.
‘ప్రజల మనిషి’కి ఈ ప్రమాదం లేదు. ముందే అనుకున్నట్టు అందులో ఉన్న ఉద్యమలక్ష్యాలు పరిమితమైనవి. మోయలేనిభారాన్ని నెత్తికెత్తుకుని తన సమర్థతని ప్రదర్శించాలనుకోలేదు. రచయితకు కావలసినంత నమ్రతా, నిజాయితీ, ప్రజాస్వామ్య దృక్పథమూ ఉన్నాయి. రచనలో ఉన్న కంఠీరవానికీ, రచన చేసిన ఆళ్వారుస్వామికీ ఎటువంటి తేడాలేదు. 1955లో ‘ప్రజల మనిషి’ ప్రథమ ముద్రణ సందర్భంగా రచయిత ‘మనవి’ని ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకుందాం.
”చాలా భయంతో ఈ నవలను బయటికి తెస్తున్నాను. సుమారు మూడేండ్ల కిందట ప్రారంభించిన ఈ నవలను చాలామంది మిత్రులకు చదివి వినిపించాను, చర్చించాను. విన్న ప్రతి మిత్రుడూ ప్రశంసించడం నాకు సమస్య అయిపోయింది. వారు కేవలం మిత్రత్వాన్ని పురస్కరించుకొని ప్రశంలనుకురిపించి, లోపాలను కప్పిపుచ్చడం లేదుగదా అని భయపడ్డాను. ఆ భయం ఇంకా బాధిస్తోంది. ఈ వాక్యాల ద్వారా నా మనోవేదనను ప్రకటిస్తున్నానే కానీ, మిత్రుల ప్రోత్సాహాన్నీ, ప్రశంసలనూ శంకించడంలేదు. నా మనో దౌర్భల్యమే ఈ వాక్యాలు రాయడానికి కారణం” ఈ మాటలకు ఇంకా వాఖ్యానం అవసరమా?
‘ప్రజల మనిషి’ లో ప్రజల జీవితం ఉండటం కాక, ఆ ప్రజలు సహజమైన వాళ్లుగా ఉండటం ఇంకో విశేషం. వాళ్లు రచయితకు ఇష్టమైనట్టుగా కనిపించేవాళ్లు కాదు. ఇందుకోక సందర్భాన్ని చూద్దాం. దిమ్మెగూడెం దొర రామభూపాల్‌రావు దోపిడీకి ఊరివాళ్లంతా బాధితులే. అంతా దొరను అసహ్యించుకునేవాళ్లే. అయినా, దొరబిడ్డ సందర్భంగా జరిగిన ఊరేగింపును చూడ్డానికి ఊరి వాళ్లేకాదు, పక్క ఊర్ల వాళ్లూ వచ్చారు. ”ఆ ఊరేగింపు ప్రజలకు ఒకవైపు ఆనందం కలిగిస్తే, మరోవైపు భయమూ కలిగించింది” ఆ ఆనంతమూ, భయమూ పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నప్పటికీ, రెండు సహజమైనవే. సహజంగా ఉండటంతోపాటు ఆ గ్రామ ప్రజల చైతన్యాన్ని తెలియజేస్తోంది.
కొమరయ్య భూమిలో దొర అర్కలు పెట్టి దున్నిస్తున్నట్టు తెలిసి, కొమరయ్య తల్లి అన్నమ్మ మనవడిని ఎత్తుకునే అర్కలకు అడ్డుపడింది. వెంకయ్య అనే అతను అన్నమ్మపైకి వెళ్లబోయే సరికి, కనకయ్యకు కోపం వచ్చింది. ”మాదిగోడివి, కాపు మనిషిని ముట్టుకోబోతున్నవుర” అని తిట్టాడు. ఆ ఇద్దరూ దొర తరపున వచ్చినవాళ్లే. దొర చేస్తున్న అన్యాయం పట్ల కనకయ్యకు కోపం లేదు. ‘మాదిగోడు కాపుమనిషిని ముట్టుకోబోవడం అన్యాయంగా కనిపించింది. ‘కులం’ ప్రజల్లో కలిగించే తప్పుడు చైతన్యాన్ని ఈ చిన్న సందర్భం ఎత్తి చూపింది.
తల్లిని కొట్టిన అన్నతో పోట్లాడి కంఠీరవం ఇంటి నుంచీ పొలాల్లోకి వెళ్లిపోతాడు. అక్కడ ఆకలితో ఉన్న కంఠీరవానికి పొలంలో పైర్లకు కాపలా ఉన్న పిల్లలు, సజ్జ కంకులూ, దోసపిందెలూ, పెసరకాయలూ తెచ్చి తినమని పెడతారు. కంఠీరవం వాళ్ల ప్రేమకు చలించిపోతాడు.
”మంచి నేర్చుకోవలసింది కాదేమో! నేర్చుకోవలసినవి చెడ్డవేనేమో” అనుకుంటాడు. ఈ ఒక్క మాట మొత్తం సమాజాన్ని వ్యాఖ్యానించతగిందిగా ఉంది. మనిషికి మంచితనం సహజమైనది. చెడ్డతనం అసహజమైనది. ఆ అసహజమై మొత్తం సమాజాన్ని అసహజంగా మారుస్తోంది. మనిషి సహజంగా మంచివాడు అనే అభిప్రాయం ఒకవైపూ, సహజంగా చెడ్డవాడు అనే అభిప్రాయం ఇంకోవైపూ ఉంది. ఈ రెండిట్లో ఏది సరైనదో ఈ మాట తెలియజేస్తోంది.
చారిత్రక సందర్భాలను వివరించడంలోనూ నిజాయితీగా ఉండటం ‘ప్రజల మనిషి’లో ఉన్న మరో అంశం. సభలు పెట్టుకోడానికి అనుమతి ఇవ్వకపోగా, అనేక ఆంక్షలు పెట్టింది నిజాం ప్రభుత్వం. సభల్లో రాజకీయాలను గురించి మాట్లాడరాదనీ, వక్తల ప్రసంగాలను ముందే పంపించాలనీ లాంటి షరతులను విధించింది. తెలంగాణలో 1940కి ముందు ఆంధ్రమహాసభలతో అనుబంధం ఉన్న వాళ్లకు ఇదంతా తెలుసేమో కానీ, సాహిత్యం ద్వారా తెలియజేసింది ప్రజల మనిషే. ఈ సమాచారమంతా వాస్తవమైనదని, కె. జితేంద్రబాబు ఇటీవల వెలువరించిన ‘తెలంగాణలో చైతన్యం రగిలించిన నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు’ మొదటి భాగం తెలియజేసింది.
ప్రత్యక్షంగా ‘ప్రజల మనిషి’ నవలతో సంబంధం లేకపోయినా ఈ సమాచారం ఏ సందర్భానికైనా ఉపకరించవచ్చని, ఈ కింది విషయం తెలియజేస్తున్నాను. 1947లో మద్రాసులో జరిగిన ‘అభ్యుదయ రచయితల మహాసభ’ ఆళ్వారుస్వామి అరెస్టును ఖండించే తీర్మానాన్ని ప్రవేశ పెట్టలేకపోయింది. అధ్యక్షత వహించిన రాజమన్నార్ అభ్యంతరం కారణంగా ఆగిపోయింది. అలాగే, తెలంగాణపై జరిగిన నిర్బంధాలపై నిరసన కూడా తెలియజేయలేకపోయింది.
(‘ఆంధ్ర కమ్యూనిస్టు కమిటీ అగ్రనాయకుల నగ్న సత్యాలు’ – చదలవాడ పిచ్చయ్య)
ఒక్క మాటలో చెప్పాలంటే, పరిమితి లక్ష్యంతో అపరిమిత ప్రయోజనాన్ని సాధించిన నవల ‘ప్రజల మనిషి’. అపరిమిత ప్రయోజనం ప్రజల జీవితమైతే, పరిమితి అందులోని భాషా.
అభిప్రాయాలు లేవు »సాహిత్య వ్యాసాలు