Nov2007
గజ్జె కట్టిన ‘తెలంగాణ కవిత – 2006′

Painting by ‘Chitra’
అంతేకాకుండా ఈ సంకలనానికి ‘రక్తము, కన్నీళ్లూ, చిందిన నేల….’ శీర్షికతో అన్వర్, సుంకర రమేశ్ (సంపాదకులు) రాసిన ముందుమాటలో ”ఇది సెంటిమెంట్ కాదు. కమిట్‌మెంట్” అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ”తెలంగాణ కోసం ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు ఉద్యమిస్తున్నారు, ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు లాభపడ్తున్నారు – ఇది సందర్భం కాదు. తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు గొంతెత్తే సందర్భమిది” అంటూ ఈ సంకలనంలోని కవులు నిరూపించిన తమ ఉద్యమధర్మాన్ని ప్రస్తుతించడం అత్యంత సమంజసంగా ఉంది.
మరో ముచ్చటేమంటే – స్థాలీపూలాకంగానే అయినా ఈ సంకలన సంపాదకులు కొన్ని ముఖ్యమైన విషయాల్ని తడిమారు. తెలంగాణ ప్రాంతపు అస్తిత్వం, జీవనవిధానం ఇతర ప్రాంతాలతో ఎక్కడ, ఎట్లా, ఎందుకు వేరుపడి ఉన్నదో వీరు భౌగోళిక, చారిత్రక, సామాజిక, సాంస్కృతిక పరమైన మూలాంశాలను ప్రస్తావించి తెలంగాణకున్న సాంస్కృతిక భిన్నత్వాన్నీ నిరూపణ చేయడంలో సఫలతని సాధించారు. ఇప్పటికీ నిరాఘాటంగా కొనసాగుతున్న భాషా మండలాల ప్రామాణికతని పునరాలోచించాల్సిన అవసరాన్ని చెప్పకనే చెప్పారు.
నిజానికి – నడమంత్రపుసిరి తెచ్చే మనీమంత్రపు భావజాలం ఇతర భాషల్ని మోటు భాషలంటుంది. గొట్టు భాషలంటుంది. కాదూ కూడదంటే ఒక మాండలిక యాసగా పరిగణిస్తుంది. తమదే ఫక్తు ప్రామాణికమంటుంది. స్థానిక మూలభాషల్ని మరపించే విధంగా ప్రామాణికత పేరుతో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న కోస్తాంధ్ర భాషని అసలు అది భాషేకాదు పొమ్మంటున్నాడు ‘కలంధారి’ చూడండి.
”మాభాషా? రామ సక్కదనాల బాస
మీ యాసా? కండ్లళ్ల ఊసు, పళ్లలో పాసు”
ఎంత వేదననుభవించితే యింతటి ఆగ్రహావేశం పెల్లుబూకుతుందో సులభగ్రాహ్యమే.
కోస్తాంధ్రులు దయతలచి నేర్పిస్తేనే తెలంగాణ జనానికి చదువూ, వ్యవసాయం అచ్చినాయన్న దురంహంకార వ్యాఖ్యల్ని ఖండిస్తూ – పొట్లపల్లి శ్రీనివాసరావు
”ఏందన్నో….. ఎట్లన్నో కూస్తాండు సూడు
దున్నరాని మనకు అడ్లేయడం తర్ఫీదిచ్చిండట
మనకిన్ని ఒంట్లు ఓనమాలు దిద్దించిండట”
అంటూ శాని తనాన్ని బట్టబయలు చేస్తాడు.
”మీ బాస అంకర పెట్టుకుని
మీ నెత్తులల్ల పురుగులు సోరగొట్టుకుని
మా యాసను హీనం జేసు”డేందని బోడ్లో చెయ్యేసి నిలదీసి ప్రశ్నిస్తాడు డా. ఉదారి నారాయణ.
తెలంగాణ సంస్కృతికి ‘బతుకమ్మ’ పర్యాయపదం కాదు. విలక్షణ సంస్కృతికదొక విశిష్ట చిహ్నం. ‘బతుకమ్మ’, ‘పాలపిట్ట’ తెలంగాణ జీవిన శైలికి సంకేతాలు. సుంకర రమేశ్, జ్వలిత తదితరులు తెలంగాణ పండుగల్ని ప్రస్తావించడమే కాదు అందులోని సామూహిక ఆత్మని ఆవిష్కరించారు.
”మా వూరు పోతంది
బతుకు భవిష్యత్తు పోతంది
మా సంస్కృతి పోతంది
పచ్చల పండుగ, భూమి పండుగలు బుగ్గిపాలౌతున్నాయ్”
అంటూ హనీఫ్ సాంస్కృతిక ఆధిపత్యాన్నీ ఎదుర్కొంటున్నాడు. మానేల మాకు కావాలెనని నేల మీది ప్రేమని నేటివిటినీ చాడుతాడు. ”సుట్టపు సూపుకు వచ్చి / సూరెక్కి కూసున్న” వైనాన్ని ఎం.డి. అహ్మద్ రట్టుచేసాడు.
”తెలంగాణ ఒక రాజకీయ విన్యాసం కాదు
ఒక చారిత్రక అసరం
తెలంగాణ నినాదం కాదు
అది జీవనావసరం” అంటాడు ఉదయమిత్ర.
అంతర్గత విభేదాలను దృష్టిలో ఉంచుకుని డా. నాళేశ్వరం శంకరం
”తెలంగాణ వచ్చినంక తన్నుకుంటే మంచిది
రాజకీయ పచ్చబొట్లు అప్పుడైతే ఉంటది” అని మాత్రా ఛాందస్సులో అనవసర వాదప్రతివాదాన్ని పక్కన బెట్టమంటాడు.
”రోషం గల్లపానం దిగూట్ల లడాయి మొదలు పెడ్తది
తెలంగాణ ఇంట్లకెళ్లి వలస కొంగల్ని తరిమి కొడ్తది” అంటూ వేముగంటి మురళీకృష్ణ తన ఆకాంక్షకి అక్షర రూపమిస్తాడు.
”నా మొల్దారాన్నీ దండెం కట్టి
నా కండకండమూ దోర్నాలు కట్టినోడా
నీకన్నా పసురం మేలు” అంటూ కాసుల ప్రతాపరెడ్డి – అంత కోపంలోనూ అవతలి వాడ్ని శపించని సహిఘ్నతని ప్రదర్శిస్తాడు. ”మొల్దారాన్ని దండెం కట్టి” అనడం నూత్నాభివ్యక్తి.
”తెలంగాణల నీరు లేదు / చెరువు లేదు
సముద్రం లేదని ఏడుపెందుకనీ
ఎన్‌కౌంటర్లైన కొడుకులు బిడ్డల శవాలముందు
పడిసేడిసి సముద్రాలయ్యే తల్లులున్నారు.
అయ్యాలు అడవుల్ల వున్నరు అజ్ఞాతంలా ఉన్నరని
అలల అల్లకల్లోలాల సముద్రాలయ్యే పిల్లలున్నారు” అంటూ సముద్రం లేని చోట సముద్ర పర్యంతాలయ్యే బతుకుల్ని కవిత్వీకరించాడు అన్వర్.
”బిడ్డా / గీ మీడియా కూడా మనది కాదురా
అదీ ఓ ఆధిపత్యానికి కేంద్రమేరా” అంటూ మీడియా కపట విన్యాస క్రీడల్నీ, వివక్షా పూరిత ప్రదర్శనలన్నీ నిరసిస్తాడు జూలూరి గౌరీశంకర్.
హైదరాబాద్‌ని ఇటీవల ”ఏ-1” నగరంగా ప్రకటించి తెలంగాణకూ హైదరాబాదు రాకుండా చేసే కుటిల యత్నాలను ఈ కవులు తిప్పికొడ్తున్నారు. ‘హైదరాబాద్ పాతబస్తీ’ని కళ్లకు కట్టించాడు డా. ఎస్వీ. డబుల్ డెక్కర్ బస్సునెక్కించి హైదరాబాద్ నగరమంతా చుట్టూ తిప్పి చూపిస్తాడు ఆశారాజు తన ‘రాజుగైడ్’ కవితలో. గతించిపోతున్న హైదరాబాద్ సంస్కృతిని తిలకింపజేసే మంచి కవిత యిది.
ఇంకా ఈ సంకలనంలోని ”మా భూమన్యాలు ఎర్కుండాలె” (ఏలేశ్వరం నాగభూషణాచార్య), ”నా మట్టితల్లి రావే” (అనిశెట్టి రజిత), ”దేవులాట” (డా. కాసుల లింగారెడ్డి) ”సమ్మక్క సారలక్క” (దర్భశయనం), ”తలవంచని గీతం” (నందిని సిద్ధారెడ్డి), ”రోడ్డు” (సుంకిరెడ్డి నారాయణరెడ్డి), ”అవ్వా” (నారాయణ స్వామి), ”సర్వ సన్నద్ధమైండ్రు” (వేణూ సంకోజు), ”మనాదిలకేయి పునాది” (చైతన్యప్రకాశ్), ”వలస” (ఏనుగు నరసింహారెడ్డి), ”నేను తెలంగాణను” (సి. కాశీం), ”ఆకలి” (సయ్యద్ గులాం అలీ) తదితర కవితలు కవిత్వాభిమానుల్ని అలరించడమే కాదు తెలంగాణ ఆవశ్యకతనీ, అనివార్యతనీ అర్థం చేయిస్తాయి. ‘తెలంగాణ కవిత – 2006′ తెచ్చిన సంపాదకులు అభినందనీయులు.
5 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు
November 4th, 2007 at 1:06 am
గజ్జ కట్టిన” తెలంగాణా కవిత-2006″ సమీక్షా వ్యాసం చాలా బాగుంది. సంపాదకుల కృషికి అభినందనలు. కవుల ఆత్మని చిన్న సమీక్షలో ఆవిష్కరించిన థింసా కి ప్రచురించిన మీకూ నా హ్రుదయపూర్వక ధన్యవాదాలు. ప్రాణహిత ని బాగా తీర్చిదిద్దుతున్నందుకు ప్రాణహిత సంపాదక వర్గానికి అభినందనలు—- క్రిష్ణ చైతన్య
November 5th, 2007 at 11:27 am
మీ పత్రిక సల్లగుండాలె.
మన ముచ్చట్లన్ని యాదిమర్శిపోతున్నమా? అనుకుంట తన్లాడుతున్న నా అసొంటోల్లందరికి పానంబోసినట్లున్నది.
కొర్రాయసొంటి ఎండలల్ల – ఒర్రి, ఒర్రి బొండిగలెండిపోయినోల్లకు, దూపైతాంటె..
సల్లటి నీల్లు తాపిచ్చి నిమ్మలంజేసినట్టున్నది.
మీరు గిట్నే తొవ్వజూపుతె, సుక్క సుక్కా గలిసి.. 4 కోట్లమంది మీ ఎన్కనె.
November 6th, 2007 at 9:51 am
సమీక్ష బాగుంది….
November 27th, 2007 at 10:14 am
Thimsa telangana kavita pai chesina sameeksha alochimpachese vidhanga vundi.
November 27th, 2007 at 10:19 am
Thimsa telangana kavita pai chesina sameeksha telangana kavulaki rachayitalaki spoorthy.
From:A.Paramatma Chary