అపరాజిత 3: చెర్నాకోలతో సంస్కరణోద్యమం

పాత ఇండియన్ బోర్డింగు స్కూలు ఎంత ఘోరంగా వుంటుందో సానుభూతిపరులైన తెల్లవాళ్లకు కూడా వివరించడం కష్టమే. ఆ వాతావరణంలోకి హఠాత్తుగా నెట్టబడ్డ ఇండియన్ పిల్లలు ఎలాంటి భయాలకు లోనవుతారో, ఎంత నిస్సహాయంగా వుంటారో, అక్కడినుంచి బతికి బయట పడేలోగా ఎన్ని కష్టాలు పడతారో వివరించడం చాలా కష్టం. మధ్యతరగతి అమెరికన్లకు నాజీ కాన్సంట్రేషన్ క్యాంపుల్లో తమ అనుభవాలను చెప్పుకోవడానికి ప్రయత్నించే యూదుల్లా వుంటారు బోర్డింగు స్కూల్ల లోని ఇండియన్ పిల్లలు. ఈ మధ్య ఆ పాఠశాలల్లో చాలా మార్పు వచ్చింది. కొత్త భవంతులు కట్టారు, పిల్లలకు ఫర్వాలేదనిపించే తిండి దొరుకుతోంది, ట్రెయినింగు పూర్తి చేసుకుని, బోధన మీద ప్రేమ వున్న మంచి టీచర్లు ఇప్పుడు ఎక్కువ మంది వచ్చారు. ఆ టీచర్లు పిల్లల సైకాలజీలో ట్రెయినింగు తీసుకుంటున్నారు కానీ దురదృష్టవశాత్తు, వారు తీసుకునేది తెల్లపిల్లల సైకాలజీలో ట్రెయినింగు – అది ఇండియన్ పిల్లల దగ్గర ఏమీ పనిచెయ్యదు. పాఠశాలల్లో ఎంత మార్పు వచ్చినా, ఇప్పటికీ కొత్తగా బోర్డింగు స్కూలులో అడుగుపెట్టిన పిల్లలు మానసికంగా కుంగిపోతారు. కొంతమంది తమలోకి తాము ముడుచుకుపొయ్యి, కొన్ని రోజులదాకా నోరుకూడా మెదపకుండా వుండిపోతారు. ఒక ఖాళీతనాన్ని కళ్లల్లో నింపుకుని వుంటారు. నాకు తెలిసిన ఒక పదకొండేళ్ల అమ్మాయి ఆ షాక్ తట్టుకోలేక ఉరివేసుకుని చనిపోయింది. మా పాఠశాలలో ఇంకో అమ్మాయి ఆ పరిస్థితులనుంచి బయటపడడానికి ఆత్మహత్యే దారి అనుకొని కిటికీలోంచి బయటకు దూకింది. ఆ మొదటి షాక్ ఎప్పుడూ వుంటుంది.

పాత తియోస్పయే ధ్వంసమైపోయినా, ఆచారవంతులైన సూ కుటుంబాల్లో పిల్లలు ఎప్పుడు ఒంటరిగా వుండరు. ఎంత చిన్నపిల్లలైనా సరే ఒక మనిషికి దొరకాల్సిన గౌరవం వారికి దొరుకుతుంది. ఎప్పుడోగాని వారికి ఇష్టంలేని పనులు చెయ్యవలసిన అవసరం వుండదు. ఎప్పుడో గాని ఎవరూ వారిని కోప్పడరు. ఎవరూ వారిని కొట్టరు. ఇలాంటి వాతావరణంలో వున్న పిల్లలను, బస్సులోనో కార్లల్లోనో వచ్చే ఆగంతకులు, ఆ పిల్లల బంధువుల ఒళ్లోంచి లాక్కెళ్లి బోర్డింగు పాఠశాలల్లో పడేసేవారు. ఆ పిల్లల పట్ల ఈ ఆగంతకుల ప్రవర్తన కిడ్నాపర్లను తలపిస్తుంది.

ఇప్పటికీ, కాస్త మంచి పాఠశాలల్లో కూడా మనుషుల మధ్య వుండాల్సిన దగ్గరితనం బదులు ఒక రకమైన అమానుషత్వమే కనిపిస్తుంది. వాతావరణం చాలా నిస్సారంగా, నిర్జీవంగా ఉంటుంది. అలవాటులేని దినచర్య, వారు ఇంట్లో మాట్లాడుకోని వేరే భాష, అన్నింటికి మించి మజస్కాన్ -స్కాన్ – ప్రకృతి సహజమైన ఇండియన్ సమయ పాలనకు బదులు, తెల్లవాడి సమయ పాలనను సూచించే మాయదారి గడియారం. ఇండియన్ సమయ పాలన అంటే గడియారం ఎప్పుడు చెప్తే అప్పుడు కాక, ఎప్పుడు ఆకలివేస్తే అప్పుడు తినడం, అలసిపొయ్యినప్పుడు నిద్రపోవడం.

నన్ను కొత్తగా వచ్చిన మంచి పాఠశాలలో వెయ్యలేదు. పాతకాలపు మిషన్ పాఠశాలకు తీసుకువెళ్ళారు. ఆ పాఠశాలను నన్సు, కాథలిక్ ఫాదర్లు నడిపేవారు. అది శతాబ్దం ఆరంభంలో కట్టిన పాఠశాల. అప్పట్నుంచి నేను వెళ్లేవరకు తిండిలోగాని, టీచర్ల పద్దతుల్లోగాని చెప్పుకోదగ్గ మార్పులులేవు.

పాతకాలంలోనైతే మా ప్రజలకు ప్రకృతే పాఠశాల. ఆడపిల్లలు బొమ్మలతో, టిపి ఇళ్ల లాంటి ఆటవస్తులతో ఆడుకుంటే, మగపిల్లలు బొమ్మ విల్లంబులతో ఆడుకునేవారు. అందరూ కలిసి గుర్రపు స్వారీ చేసేవారు, నదిలో ఈతలు కొట్టేవారు, ఇతర ఇండియన్ ఆటలు ఆడుకునేవారు. పిల్లలు తమ తోటివారిని, పెద్దలను గమనిస్తూ, సహజంగానే పెరిగి పెద్దయేవారు. విస్కీ పీపాలను బండ్లకొద్దీ తెచ్చే వ్యాపారులు తారసపడనంతవరకు, టిపి ఇంటిలోని జీవితం ఎంతో సామరస్యంగా వుండేది. నేను విస్కీమాట ఎరుగని రోజుల్లో పుట్టివుండవచ్చుకదా అని ఎన్నోసార్లు మధనపడేదాన్ని.

విచిత్రమైన విషయం ఏమిటంటే, ఇండియన్ల మీద ప్రేమ ఒలకబోసే ‘మంచి’వాళ్ల వల్లే మాకు భయంకరమైన బోర్డింగు పాఠశాలలు ప్రాప్తించాయి. నిజానికి షెర్మన్, షెరిడన్ వంటి జనరల్సు, సెట్లర్లు, ప్రాస్పెక్టర్లు తలపెట్టిన ఇండియన్ జాతి సంపూర్ణ నిర్మూలన పథకం నుంచి మమల్ని రక్షించే మిష మీద ఈ పాఠశాలలు ఏర్పడ్డాయి. “ఇండియన్ సమస్యను పరిష్కరించడానికి వారిని చంపెయ్యనక్కర్లేద”ని ఆ మంచి వాళ్ల వాదం. “తక్కువ వేతనానికి మీకోసం పని చేసే వ్యవసాయ కూలీలుగా, జీతగాళ్లుగా, పనిమనుషులుగా వారిని తీర్చిదిద్దడానికి మాకు ఒక అవకాశంఇవ్వండ”ని కోరారు. “అలా బోర్డింగు పాఠశాలలు ఏర్పడ్డాయి. దుప్పట్లలో, మొకసిన్సులో (moccasins – జంతు చర్మంతో చేసిన మెత్తని, వెచ్చని చెప్పులు) హాయిగా ఆడుకుంటున్న పిల్లలను వారి ఊర్లనుంచి లాక్కునివెళ్లి బోర్డింగు పాఠశాలల్లో పడేసేవారు. అలా వెళ్లిన పిల్లలు ఒక్కోసారి పదేళ్లదాకా ఇంటికు వచ్చేవారు కాదు. పదేళ్ల తరువాత, జిడ్డోడుతున్న పొట్టి జుట్టుతో, మెడకు గుచ్చుకుంటున్న కాలర్లతో పొట్టి చేతుల కోట్లతో, కాళ్లకు కరుస్తున్న బూట్లతో- తెల్లవారి క్యారికేచర్లుగా తయారైన పిల్లలు ఇంటికి వచ్చేవారు. ఇంటికి వచ్చిన తరువాత, వాళ్లకు తొందర్లోనే తెలిసిపొయ్యేది – తాము అటు తెల్లవారికి గానీ, ఇటు ఇండియన్లకు గానీ చెందకుండా పొయ్యామని. ఆ గందరగోళంలో తాగుడు మొదలుపెట్టిన ఎంతోమంది జీవితాంతం తాగుబోతులుగా మిగిలిపోతారు.

తాతయ్య వస్తువుల్లో దొరికిన ఒక పోస్టరు నాదగ్గర ఇంకా వుంది. గోడకు తగిలించమని మిషనరీలు ఇచ్చిన పోస్టరు అది. అందులో ఇలా వుంది:

1. జీసస్ నిన్ను రక్షించనివ్వు.
2. దుప్పట్లోంచి బయటకు రా, జుట్టు కత్తిరించుకో, తెల్లవారిలా దుస్తులు ధరించు.
3. ఒక్క భార్యనే పెళ్లాడి, క్రిస్టియన్ జీవితం జీవించు.
4. నీ తెల్లసోదరుడిలా ఇళ్లలో నివసించు. కష్టపడి పని చెయ్యి, శుభ్రంగా వుండు.
5. కష్టపడి సంపాదించిన డాలరు విలువ తెలుసుకో. దానధర్మాలు చేసి నీ డబ్బు వృధా చేసుకోవద్దు.
6. ఆస్తులు, అంతస్ఠులు అనేవి దేవుడు నిర్ణయించినవి అని నమ్ము.
7. విస్కీ అంగడికి, మద్యానికి దూరంగా వుండు.
8. నీ తెల్ల సోదరుడు మాట్లాడే భాషనే మాట్లాడు.
9. చర్చికి క్రమం తప్పకుండా, ఎక్కువసార్లు వెళ్లు.
10. ఇండియన్ నృత్యాలకు, మెడిసిన్ మెన్ దగ్గరికి వెళ్లొద్దు.

“ఇండియన్ సమస్యను పరిష్కరించడానికి” నడుంకట్టిన ఈ ‘మంచి వాళ్ల’ను ఓడించడానికి చాలా నిరసనోద్యమాలు జరగాల్సి వచ్చింది.

సెయింట్ ఫ్రాన్సిస్ దగ్గర బోర్డింగు పాఠశాల మా కుటుంబానికి తర తరాల శాపం అయింది. మొదట అవ్వ, తరువాత అమ్మ, అటు తరువాత అక్కలు చివరికి నేను ఆ పాఠశాల కబంధ కౌగిలిలో చిక్కాము. ఏదో ఒక్కసారైనా మేం అందరం ఏదోలా ఆ పాఠశాలనుంచి పారిపోవడానికి ప్రయత్నించిన వాళ్లమే.

సెయింట్ ఫ్రాన్సిస్ లో తన భయంకరమైన అనుభవాల గురించి అవ్వ నాకు చెప్పేది. అప్పట్లో పిల్లలను సంవత్సరానికి వారం రోజుల పాటు మాత్రమే ఇంటికి వెళ్లనిచ్చేవారు. రెండు రోజులు ప్రయాణానికే పోతే, మూడువందల అరవై అయిదు రోజుల్లో అయిదు రోజులు మాత్రమే వారి కుటుంబాలతో గడపడానికి వీలయ్యేది. అవ్వకు ముందు చాలా రిజర్వేషన్లలో పిల్లలను చదువు పూర్తయ్యేవరకు ఇంటికి పంపేవారు కాదు. నన్సును ఎవరైనా ఎదిరిస్తే కఠినంగా శిక్షించేవారు. ఆడపిల్లలకు మాత్రమే కేటాయించిన ప్రత్యేక బిల్డింగులో వుండేది అవ్వ. చివరి అంతస్థులో చిన్ని చిన్ని చీకటి అరలు వుండేవి. అవ్వ ఒకసారి చర్చిలో వుండాల్సిన సమయంలో ఆటలాడుకుంటూ వుండిపొయ్యిందట. అందుకు శిక్షగా ఆమెను ఆ చీకటి ఆరల్లో వారంరోజులపాటు వుంచారట. ఆ వారంరోజులూ బ్రెడ్డు, నీళ్లు మాత్రమే ఇచ్చారట. బయటకు వచ్చిన తరువాత, ఇంకో ముగ్గురు అమ్మాయిలతో కలిసి అక్కడినుంచి పారిపోవడానికి ప్రయత్నించిందట. కానీ వాళ్లని తొందర్లోనే పట్టుకుని వెనక్కి తెచ్చేశారట. వాళ్ల బట్టలు వూడదీసి గుర్రపు బగ్గీల్లో వుపయోగించే చెర్నాకోలతో కొట్టి అదే అరలో రెండు వారాల పాటు వుంచారట. అమ్మకు కూడా ఇలాంటి అనుభవాలే వున్నాయి కానీ ఆమె వాటిని మాతో పంచుకునేది కాదు. తరువాత అదే చోటికి నేను వెళ్లాను. ఆ పాఠశాలను ఇప్పుడు BIA (Bureau of Indian Affairs) నడుపుతోంది – అదికూడా ఓ పదిహేనేళ్లనుంచి మాత్రమే. 1960లో నేను అక్కడ వున్నప్పుడు ఆ పాఠశాలను చర్చి నడిపేది. అబ్బాయిల భాగాన్ని జెస్యూట్ ఫాదర్లు నడిపితే, ఆడపిల్లల భాగాన్ని సేక్రెడ్ హార్టుకు చెందిన నన్సు నడిపేవారు- అంతా చెర్నాకోల సహాయంతో నడిచేది. అవ్వ కాలం నుంచి నా కాలం వరకు ఆ పాఠశాలలో ఎలాంటి మార్పులు లేవు. 1970లో కూడా పిల్లలను కొట్టేవారని నాకు తెలిసింది. ఆ పాఠశాలనుంచి ప్రార్థనలు ఎలా చెయ్యాలో మాత్రమే నేను నేర్చుకున్నాను. ప్రార్థన చేసే పద్దతి సరిగా లేకపొయ్యినా, ఇండియన్ సృష్టికర్త అయిన వాకన్ – తాంకను స్మరించుకున్నా దెబ్బలు తప్పవని నాకు తొందర్లోనే తెలిసిపొయ్యింది.

ఆడపిల్లల భాగం F ఆకారంలో వుండేది. జైలు పద్దతిలో నడిచేది. ప్రతిరోజు ఉదయాన్నే అయిదు గంటలకు సిస్టర్లు మమ్మల్ని లేపేవారు. మేం వెంటనే మంచం పక్కనే మోకాళ్ల మీద కూర్చుని ప్రార్థన చేసేవాళ్లం. ఆరు గంటలకు మరోసారి ప్రార్థనల కోసం మమ్మల్ని చర్చిలోకి తోలేవాళ్లు. సమయానికి అనుగుణంగా లెఫ్టు-రైటు కొట్టడం నాకు అసలు నచ్చేది కాదు. ఎవరి బలవంతం మీదనో పనులు చెయ్యడం నాకు ఇష్టం వుండదు. ఏదైనా సరే నాకు ఇష్టమయితేనే చేస్తాను. నాకు ఊహ తెలిసినప్పటినుండీ ఇలాగే వున్నాను, అక్క బార్బరా కూడా అంతే. ఒక ముసలి మెడిసిన్ మ్యాన్ నాతో ఒకసారి అన్నాడు : “మనం లకోటాలం. దెబ్బలు తింటున్నా తోకాడించుకుంటూ, కొట్టిన చెయ్యినే నాకే కుక్కల్లాంటి వాళ్లం కాదు. మనం చిన్న పిల్లులు, పెద్ద పిల్లులు, అడవి పిల్లులు… ఏరకమయితేనేం ఎవరికీ మచ్చిక కాకుండా అడ్డువచ్చిన వారిని బరికేసే పిల్లుల్లాంటి వాళ్లం.” కానీ నేను అప్పటికి ఇంకా పిల్లికూనను మాత్రమే, నా పంజా చాలా చిన్నది.

నేను పాఠశాలలో అడుగుపెట్టేనాటికి బార్బరా ఇంకా అక్కడే ఉండింది. ఒకటి రెండు సంవత్సరాలపాటు ఆమె నన్ను కాస్త రక్షించగలిగింది. ఏడవ తరగతిలో వున్నప్పుడు, ఒకరోజు ఉదయాన్నే మరో అయిదుగురు అమ్మాయిలతో కలిసి పారిపొయ్యింది బార్బరా. వాళ్లను సాయంత్రం లోపల వెనక్కి తెచ్చేశారు. వాళ్లు మదర్ సుపీరియర్ ఆఫీసు దగ్గర ఆకలితో, చలికి వణికిపోతూ చాలా సేపు వేచివుండాల్సి వున్నారు. అది చలికాలమే కాక ఎక్కువ దూరం పారిపొయ్యేందుకు పగలంతా తిండిలేకుండా పరిగెడుతూనే వున్నారు. మదర్ సుపీరియర్ ఒక్కో అమ్మాయినే పట్టుకుని “ఈ పని మళ్లీ చేస్తావా?” అని గద్దించింది. వాళ్లను నెలరోజుల పాటు ఇంటికి పంపకుండా, వాళ్ళ కాళ్లు, చేతులు, చర్మం అరిగిపొయ్యేంతవరకూ వారితో పని చేయిస్తానని చెప్పింది. తన ప్రసంగం చివర్లో ఒక్కో అమ్మాయిని “లేచి, వంగి నిలబడు.” అని నిలబెట్టి వాళ్ల స్కర్టు ఎత్తి, నిక్కరు కిందకు లాగింది. వాళ్లు చిన్న పిల్లలు కూడా కాదు. ఎదిగిన ఆడపిల్లలు. ఒక అడుగు పొడవు నాలుగు ఇంచీల మందం వున్న చెర్నాకోలతో ఒకరి తరువాత ఒకరిని ఏడ్చేంతవరకు కొట్టింది. బార్బరా ఆమెకు అలాంటి సంతోషాన్ని ఇవ్వకుండా వుండడం కోసం పళ్లు బిగబట్టి దెబ్బలు తిన్నది. ఇంకో ఆమ్మాయిని మదర్ సుపీరియర్ తన చేతులు నెప్పి పెట్టేంతవరకు కొట్టింది.

నేను కూడా నా వంతు దెబ్బలను రుచి చూసాను. ఒకసారి, నాకు పదమూడేళ్లప్పుడు, ప్రార్థన చెయ్యడానికి వెళ్లలేదు నేను. ఒంట్లో బాగోలేక చర్చికి వెళ్లనని చెప్పాను. ఒక నన్ నా జుట్టు పట్టుకుని, పై అంతస్థుకి లాక్కెళ్లింది. అక్కడ నన్ను నుంచో బెట్టి, నా స్కర్టు, నిక్కరు లాగి చెర్నాకోలతో ఇరవై అయిదు దెబ్బలు కొట్టింది.

ప్రిన్సిపల్ ఆఫీసు పక్కనే మా తరగతి గది వుండేది. ఆయన ప్రతిరోజూ అబ్బాయిలను కొట్టడం మాకు వినిపించేది. దేనికైనా సరే దెబ్బలే శిక్ష అక్కడ. ఇదంతా నా మనసు మీద చాలా చెడ్డ ముద్ర వేసింది. ఎంతో కాలం దాకా నాకు తెలిసిందల్లా ఒకే రకమైన తెల్లవాళ్లు కనుక, ఎదురుపడిన ప్రతి తెల్ల వ్యక్తి మీద అపనమ్మకం ఏర్పడింది, వాళ్లను అసహ్యించుకునేదాన్ని. చాలా ఏళ్ల తరువాత గానీ మనసుకు దగ్గరైన తెల్ల స్నేహితులు దొరకలేదు. జాతి దురహంకారం వల్ల, దానికి గురయ్యే వాళ్లలోనూ, తిరిగి జాతి దురహంకారం తయారవుతుంది.

సెయింట్ ఫ్రాన్సిస్ రోజువారి బతుకు చాలా కష్టంగా వుండేది. పొద్దున ఆరుగంటలకు చర్చిలో గంటసేపు ప్రార్థనలు చేసేవాళ్లం. ఏడుగంటలకు బ్రేక్ ఫాస్ట్, ఎనిమిది గంటలకు నేల తుడిచి, కూరగాయలు తరగడం, తరగతి గదులు శుభ్రం చెయ్యడం, భోజనాల గదిని, బల్లలను రోజుకు రెండుసార్లు తుడిచేవాళ్లం. ఎప్పుడైనా అలసట తీర్చుకునేందుకు కొద్దిసేపు ఆగినా, గోళ్లతోనో కత్తితోనో బల్లలపై గీతలు గీసినా, కూనిరాగం తీసినా, నన్ వచ్చేసి మసిగుడ్డను మొఖంమీద కొట్టి, “నువ్వు చెయ్యాల్సింది మాట్లాడడం కాదు, పని చెయ్యి ” అని అరిచేది. మాకు సోమవారం పొద్దున మొక్కజొన్న ముష్, మంగళవారం ఓట్ మీల్, బుధవారం రెయిజిన్స్ కలిపిన అన్నం, గురువారం కార్న్ ఫ్లేక్స్, శుక్రవారం మిగిలిపోయిన వాటన్నిటినీ కలిపో ఒక్కోసారి చేపలో పెట్టేవారు. చాలాసార్లు తిండిలో పురుగులు, రాళ్లు వుండేవి. దాదాపు వారంరోజుల కిందటి తిండి మేము తింటూ వుంటే నన్సు మంచి తిండి తినేవాళ్లు. చలికాలంలో మా డార్మెటరీ చలికి గడ్డకట్టిపోతూ వుంటే నన్సు గదులు ఎప్పుడూ వెచ్చగా వుండేవి.

ఇంటినుంచి అప్పుడే లాక్కురాబడిన చిన్ని అమ్మాయిలకు తమకు ఎదురవబోతున్న అనుభవాల గురించి ఇసుమంతైనా అవగాహన వుండేది కాదు. మొదట అందమైన జడలు వేసుకొచ్చిన ఆ చిన్నారుల జుట్టు కత్తిరించేసి, మిగిలిన కొద్దిపాటి జుట్టును చెవుల వెనుక కట్టేసే వారు. తరువాత వారిని టబ్బులో వేసి, ఒకలాంటి ఆల్కహాలుతో “క్రిములను వదిలించడానికి” వారిని రుద్దేవారు. చాలామంది నన్సు జర్మనీ నుంచి వలస వచ్చిన వాళ్లు, కొంతమంది బవేరియా నుంచి వచ్చారు. అందుకని బవేరియా అంటే రాక్షసులు నివసించే డ్రాక్యులా దేశమని మేము నమ్మేవాళ్ళం. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఒక మోస్తరు లకోట – ఇంగ్లీషు నిఘంటువును ఇద్దరు జర్మన్ ఫాదర్లే తయారు చేశారు.

రాత్రుల్లు కొంతమంది అమ్మాయిలు వెచ్చదనం కోసం, స్వాంతన కోసం ఒకరినొకరు హత్తుకుని పడుకునేవాళ్లు. డార్ముకు కాపలాగా వున్న నన్ పరిగెట్టుకుని వచ్చి “మీ ఇద్దరూ ఒకే మంచంలో పడుకుని ఏం చేస్తున్నారు? ఈ గదిలో సైతాను వాసన వస్తోంది. మీరు నేరుగా నరకానికే వెళ్లి మంటల్లో మాడుతూనే వుంటారు.” అని అరిచేది. ఆ మధ్య రాత్రి వాళ్లను లేపి పొద్దుటి వరకు మోకాళ్లపై కూర్చోబెట్టి ప్రార్థన చేయించేది. ఏం జరుగుతోందో, ఆ రాద్దాంతం ఎందుకో మాకు అర్థమయ్యేది కాదు. ఇంటి దగ్గర వెచ్చదనం కోసం మేము ఇద్దరు ముగ్గురం ఒకే మంచంలో పడుకునేవాళ్లం.

చివరి రెండు తరగతుల అమ్మాయిలు, నన్సు ఎప్పుడూ కొట్టుకుంటూ వుండేవారు. ఒక్కోసారి గోళ్లతో రక్కుకోవడం, జుట్ల్లు పట్టుకుని కొట్టుకుంటూ వుండేవారు. నేను కూడా పిల్లికూన నుంచి చిన్నిసైజు పిల్లిలా తయారవడం మొదలెట్టాను. 1969 లోనో 1970లోనో ఒక తెల్ల అమ్మాయి రిజర్వేషన్లో కనిపించింది. పద్దెనిమిది ఇరవై ఏళ్ల అమ్మాయిలా అనిపించింది. అందంగా, పొడవాటి జుట్టుతో, మాసిపొయ్యిన జీన్సులో, బూట్లు తొడుక్కుని, భుజానికి సంచీ తగిలించుకుని వచ్చింది. అప్పటిదాకా మాకు ఎదురుపడిన తెల్లవారిలా లేదు ఆ అమ్మాయి. ఆమె పట్ల మాకు వుండిన అపనమ్మకాన్ని, నిరాసక్తతను ఎలా పోగొట్టిందో తెలీలేదు కానీ, మమ్మల్ని ఒకచోటికి చేర్చి మా పరిస్థితుల గురించి వాకబు చేసింది. తను న్యూ యార్కు నుంచి వచ్చానని చెప్పింది. నల్లవాళ్లు నడుపుతున్న బ్లాక్ ప్యాంథర్ వుద్యమం గురించి చెప్పింది. “నల్లవాళ్లు, సెయింట్ పాల్ లో, క్యాలిఫోర్నియాలోని ఇండియన్లు తమ హక్కులకోసం పోరాడుతున్నారు. మరి మీ మాటేంటి?” ఆమె అడిగింది. “మీరు ఒక రహస్య పత్రిక ఎందుకు నడపకూడదు? అది చాలా సులభం. ఉన్నది ఉన్నట్లు చెప్పండి. అంతా బట్టబయలు చెయ్యండి”. ఆమె విచిత్రమైన భాష మాట్లాడింది, కానీ మాకు చాలా నచ్చింది.

చార్లీన్ లెఫ్ట్ హ్యాండ్ బుల్, జీనా వన్ స్టార్ అనే ఇద్దరు ఇండియన్ అమ్మాయిలతో నేను ఎక్కువగా తిరిగేదాన్ని. మేం అన్ని పనులు కలిసి చేసేవాళ్లం. సూ తిరుగుబాటులో వాళ్లు నాకు తోడుగా వస్తామని చెప్పారు. రెడ్ ప్యాంథర్ అనే పత్రిక మొదలు పెట్టాం. మా పాఠశాల ఎంత చెడ్డగా వుందో, మాకు పెట్టే తిండి ఎంత ఘోరంగా వుంటుందో, మమ్మల్ని ఎలా కొడతారో అంతా రాశాం. అప్పటి మా ప్రిన్సిపల్, కీలర్ ఫాదర్ గురించి చాలా చెడ్డ వ్యాసం రాశాను. నాలోని కోపాన్ని, అసహ్యాన్ని వెళ్లగక్కాను. అతడికి ఇండియన్ల గురించి ఏమీ తెలియదని, తను వచ్చిన చోటికి తిరిగి వెళ్లిపోవాలని రాశాను. ఏ ఫాదర్ ఏ నన్ తో పడుకుంటాడో రాశాను. అది విషం వెళ్లగక్కే వ్యాసమే కాక, ఆత్మనుంచి పెద్ద బరువు దించుకునేట్టు చేసిన వ్యాసం కూడా.

సెయింట్ ప్యాట్రిక్స్ రోజు, అందరూ పౌ-వవ్ (ఇండియన్లు జరుపుకునే ఉత్సవం) జరుపుకుంటున్న చోట మా పత్రిక పంచి పెట్టాం. కారు అద్దాల మీద, బిల్ బోర్డుల మీద, బల్లల మీద, డార్ముల్లో, టాయిలెట్లలో కూడా మా పత్రికను పెట్టాం. కానీ ఎవరో మమల్ని చూసి, మా గురించి చెప్పేశారు. మా ముగ్గురినీ బోర్డు మీటింగుకు తీసుకువెళ్లారు. మా తల్లిదండ్రులను, నా విషయంలో మా అమ్మను, మీటింగుకు పిలిపించారు. మా కేసు చాలా తీవ్రమైన విషయమని, మా పాఠశాల చరిత్రలో ఇంతవరకూ ఇలాంటివి జరగలేదని చెప్పారు. ఒక నన్ మా అమ్మతో అంది, “మీ అమ్మాయితో గట్టిగా మాట్లాడాలి.” “మా అమ్మాయి ఏం తప్పు చేసింది?” అమ్మ అడిగింది. ఆమెకు రెడ్ ప్యాంథర్ కాపీ ఒకటి అందించారు. నన్ అమ్మకు పత్రిక పేరు, అందులో నా వ్యాసం చూపించి, అమ్మ ఏమనంటుందో అని ఎదురు చూసి, కొద్దిసేపాగి అడిగింది, “దీన్ని గురించి ఏం చెబుతారు?” అమ్మ మాటలు నాకింకా జ్ఞాపకం “ కొన్ని సంవత్సరాల క్రితం నేను ఈ పాఠశాలలో చదివాను, అప్పుడు పరిస్థితులు ఇంతకంటే ఘోరంగా వుండేవి. మా పట్ల ఇంతకంటే ఘోరంగా వ్యవహరించారు. నిజానికి వీళ్ల పరిస్ఠితి మా కంటే మెరుగే. అయినా, వీళ్లు చిన్నపిల్లలు కదా. వీళ్లను క్షమించండి. అంతేకాక ఇది స్వతంత్ర దేశం, స్వేచ్చగా మాట్లాడే హక్కు అందరికీ వుంది. వీళ్లు చాలా చెడ్డపని చేశారని నేను అనుకోవడం లేదు. “మొత్తం మీద దీనివల్ల నాకు ఏం జరిగిందో చెప్పనవసరం లేదు. ప్రతిరోజు మోకాళ్లమీద, చేతులమీద కూర్చుని ఆరు అంతస్థుల మెట్లు కడగవలసి వచ్చింది. అబ్బాయిల భాగం వైపు వెళ్ళకుండా కట్టడి కూడా చేశారు.

అప్పటికి కూడా అబ్బాయిలను, అమ్మాయిలను వేరువేరుగా పెట్టేవాళ్లు. సాయంత్రం నాలుగు నుంచి అయిదున్నర వరకు మాత్రమే దొరికే ఖాళీ సమయంలో స్టడీ హాలులోనో, బెంచీల దగ్గరో, వాలీబాల్ ఆడే చోటో మాత్రమే అబ్బాయిలతో కలుసుకునే అవకాశం వుండేది. దాన్ని కూడా చాలా కఠినంగా, గద్ద కళ్లతో చూశేవాళ్లు. ఒకసారి నేను, చార్లీన్ అబ్బాయిలు వుండే వైపు వెళ్లాం. మేం ఇద్దరం బాల్ టీమ్ లో వున్నందుకు మమ్మల్ని ప్రాక్టీసు చెయ్యనియ్యాల్సి వచ్చింది. మాకు కేటాయించిన సమయం కంటే మూడే మూడు నిమిషాలు ఎక్కువ ఆడాం. మా మీద కక్ష తీర్చుకోవడానికి నన్సుకు మంచి అవకాశం దొరికింది. మాకు ఒక్కొక్కరికి ఇరవై అయిదు చెర్నాకోల దెబ్బలు దొరికాయి. “పిర్రలమీద కొట్టించుకోవడానికి మనం ఇంక చిన్న పిల్లలంకాదు. పిల్లలను పుట్టించుకునే వయసులో వున్నాం. దీన్ని ఇలా సాగనివ్వకూడదు. ఈసారి మనం ఎదురు తిరగాల్సిందే.” చార్లీన్ తో అన్నాను. చార్లీన్ “హోకా – హే” అని అరిచి వూరుకుంది. (Hoka – Hey : నేటివ్ అమెరికన్లు యుద్దంలో వేసే పెడబొబ్బ- Translators note).

ప్రతిరోజు సాయంత్రం మేం స్నానాలు చెయ్యాల్సి వుండేది. ఒకసారి ఒక చిన్న అమ్మాయికి నన్ ముందు నిక్కరు విప్పాలంటే సిగ్గేసింది. నన్ ఆ అమ్మాయిని చూసి గద్దించింది “ఆ నిక్కరు విప్పు- లేకపోతే!” తన చెర్నాకోల బయటకి తీస్తూ అంది. నేను ఆ నన్ దగ్గరకు వెళ్ళి, ఆమె తల మీద ముసుగు లాగేసి, ఆమెని పడదోశాను. ఆ చిన్న పిల్లను కొట్టే బదులు తన సైజులో వున్న నాతో గొడవ పెట్టుకొమ్మని చెప్పాను. ఒక వారం రోజుల్లో ఆ డార్మిటరీ నుంచి బదిలీ చేయించుకుని వెళ్ళిపోయిందామె.

అలాంటి పాఠశాలలో చాలా ఫేవరిటిజమ్ వుంటుంది. సెయింట్ ఫ్రాన్సిస్ లో ఆ ఫేవరిటిజమ్ లో కూడా జాత్యహంకారం వుండేది. దాదాపు తెల్లవాళ్ల రంగులో వుండి, “మంచి కుటుంబాలు” అని నన్సు భావించే కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయిలను, నాలా రంగు తక్కువైన అమ్మాయిలను వేరుగా చూసేవాళ్లు. వాళ్లకు, మాకంటే చాలా మంచి తిండి కూడా పెట్టేవాళ్లు. ఇలా తెల్ల పిల్లలకు, నాలాంటి సంకర జాతి వారికి మధ్య, సంకరజాతికి అసలైన ఇండియన్ల మధ్య, ఈ పాఠశాలలు మనస్పర్థలు కలిగించేవి. ఒకసారి నేను, చార్లీన్ చర్చి వెనుక వున్న గదిలో గుట్టలుగా పడేసిన బట్టలు మడతపెడుతున్నాము. ఒక మూల మా తలల మీద శిలువ మీద వున్న క్రీస్తు నిలువెత్తు విగ్రహం వుంది. ఆయన శరీరమంతా రక్తం, దెబ్బలు. చార్లీన్ పైకి చూసి అంది, “పాపం, ఆ ఇండియన్ మీద ప్రతాపం చూపించారు వీళ్లు.” శిలువపై వున్న క్రీస్తు విగ్రహాన్ని అంత దగ్గరగా చూడడం అదే మొదటిసారి మాకు.

మా తరగతిలో నన్ను ఒక చెడ్డ ఉదాహరణగా చూపించేవారు, కానీ నేను దాన్ని పట్టించుకోలేదు. మగ స్నేహితుడిని కలిగి వుండే వయస్సు నాది, ఒక స్నేహితుడిని దొరికించుకున్నాను కూడా. మాకు దొరికే గంటన్నర ఖాళీ సమయంలో నేను నా స్నేహితుడు అమ్మాయిల, అబ్బాయిల భవంతుల మధ్య వుండే బెంచీలపై చేతిలో చెయ్యి వేసుకుని కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్లం. నన్సు అమ్మాయి, అబ్బాయిల సంబంధాల గురించి చాలా చాదస్తంగా వుండేవారు. ఒకరోజు రిలిజియన్ గురించిన ఒక తరగతిలో బెర్నార్డ్ సిస్టర్ నన్ను వేలెత్తి చూపుతూ కొన్ని రిమార్కులు చెయ్యడం మొదలెట్టింది. నేను అందరూ పాఠం నేర్చుకోవలసిన ఉదాహరణ అని చెప్పింది. నేను నా శరీరంతో చాలా ఫ్రీగా వున్నానని, మగ స్నేహితుడి చేతిలో చెయ్యి వేసి తిరుగుతానని, అందరూ నన్నుఒక చెడ్డ ఉదాహరణగా తీసుకోవాలని చెప్పింది. నేను అపవిత్రమైన బట్టలు వేసుకుంటానని, నా స్కర్టు నియమాలు ఒప్పుకునే దానికంటే పొట్టిగా వుంటుందని, అందుకు నన్ను శిక్షించాల్సి వుందని చెప్పింది.

నేను లేచి నిలబడి, “మిస్, మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. మీ జనాలు మా ఇండియన్ల కంటే ఎన్నో రెట్లు ఘోరమైనవాళ్లు. మీ గురించి నాకు బాగా తెలుసు. మా అవ్వా, పిన్నమ్మలు మీ గురించి అంతా చెప్పారు. పన్నెండు, పదమూడేళ్ల క్రితం సెయింట్ ఫ్రాన్సిస్ లో డ్రెయినేజి సమస్య వచ్చిందట. మిషనరీ కింద సొరంగాలు, పాసేజిలు, వాటర్ లైన్లు వుండేవట. అక్కడికి ప్రీస్టులు, నన్సు మాత్రమే వెళ్లేవారు, ఇంకెవరినీ అక్కడికి వెళ్లనిచ్చేవారు కాదు. నీళ్లు పోకుండా నిలిచిపొయ్యినప్పుడు ఆ వాటర్ లైన్ల లోకి వెళ్లి శుబ్రం చెయ్యల్సి వచ్చిందట. ఆ పెద్ద పైపుల్లో పసిపిల్లల కళేబరాలు కనిపించాయట. అవి అన్నీ తెల్ల పిల్లలవే, ఇండియన్లవి కాదట. కనీసం మాకు పిల్లలు పుట్టినప్పుడు వాళ్లను అలా పడెయ్యం. ఇకపోతే, పైన్ రిడ్జ్ లో హోలీ రోజరీ నుంచి ఇక్కడికి వచ్చిన ఆ ప్రీస్టు ఒక చిన్న అమ్మాయిని పాడు చేశాడట. అలాంటి వాడిని మా మీద వదిలెయ్యడం కంటే మంచి అలోచన మీకు రాలేదు. మొఖం మీద ఒక వెకిలి నవ్వు వేసుకుని ఎప్పుడూ అమ్మాయిల వైపు చూడడం తప్ప అతనికి వేరే పని లేదు. అతడిని చెడ్డ ఉదాహరణగా ఎందుకు ఎత్తి చూపరేం?” అని కడిగేశాను.

నేను, చార్లీన్ మా పత్రిక మీద పని చెయ్యడం మానలేదు. ప్రతిరోజు సాయంత్రం పత్రిక అచ్చువెయ్యడం కోసం వెళ్లేవాళ్లం. ఒక ప్రీస్టు ఫొటోగ్రాఫరుగా వుండేవాడు. ఫోటోలు ఎన్లార్జ్ చేసి, డెవలప్ చేసేవాడు. అతని గోర్లను పచ్చగా మార్చేసిన రసాయనాల వాసన వచ్చేది అతని దగ్గర. ఒకరోజు డేవెలప్మెంటు నేర్పుతానని చార్లీన్ను డార్క్ రూములోకి పిలిచాడు. అప్పటికే ఆమె బాగా డేవలప్ అయివుంది. అతనికంటే లావుగా, ఎత్తుగా వుండేది. చార్లీన్ దృడంగా వుండేది, ఎక్కడా కొవ్వు వుండేది కాదు కానీ బొద్దుగా వుండేది. హఠాత్తుగా డార్కు రూములోంచి అరుచుకుంటూ బయటికి వచ్చింది, “వెంటనే ఇక్కడినుంచి బయట పడాలి! వాడు నన్ను ఎక్కడెక్కడొ ముట్టుకోబొయ్యాడు.” ఉన్న పరిస్థితులు చాలవన్నట్టు చివరికి సెక్షువల్ హెరాస్మెంటు కూడా వాటికి తోడయ్యింది. అతడి గురించి ఫిర్యాదు చేస్తే మాదంతా చెడ్డ అలోచనలని మాత్రమే నన్సు అన్నారు.

ఇంగ్లీషు చెప్పడానికి కొత్త ఫాదర్ వచ్చాడు. వచ్చిన మొదట్లో ఒకబ్బాయిని ఏదో ప్రశ్న వేశాడు. ఆ అబ్బాయి చాలా సిగ్గుపడేవాడు. ఇంగ్లీషు బాగోలేకపోయినా కరెక్టు జవాబు చెప్పాడు. “సరైన విధంగా చెప్పలేదు నువ్వు. సరిదిద్దుకుని మళ్లీ చెప్పు.” అన్నాడు ఆ ఫాదర్. ఆ పిల్లాడు ఇంకా సిగ్గుపడిపొయ్యి నత్తులు కొట్టాడు. అతడి నోట్లోంచి ఒక్క పదం కూడా సరిగ్గా బయటకు రాలేదు. కానీ ఫాదర్ ఆ అబ్బాయిని వదల్లేదు “చెప్పేది వినిపించడం లేదా? అంతా మళ్లీ చెప్పమన్నాను కదా. ఈసారి సరిగ్గా చెప్పు.”

నేను నిలబడి, “ఫాదర్, అలా చెయ్యొద్దు. మీరు ఇండియన్ ఇంటికి వెళ్లి వారితో ఇండియన్ భాష మాట్లాడితే, వాళ్లు మిమ్మల్ని చూసి నవ్వి, “మళ్లీ చెప్పు, ఈసారి సరిగ్గా చెప్పు!” అంటారేమో” చూసుకోండి అన్నాను.

“మేరీ, ఈ క్లాసు తరువాత ఆగు. ఇప్పటికి కూర్చో!” అని అరిచాడాయన.

క్లాసు అయిన తరువాత బెల్లు కొట్టేదాకా ఆగాను. “ఇక్కడికి రా!” అని ఆయన నా చెయ్యి పట్టుకుని, బ్లాక్ బోర్డు వైపు నన్ను తోస్తూ, అరిచాడు, “ఎందుకు ఎప్పుడూ మమ్మల్ని హేళన చేస్తావు? అలా చెయ్యడానికి నీకు ఎలాంటి కారణమూ లేదు. “

నేను చెప్పాను, “కారణం వుంది. మీరు అతడిని చూసి నవ్వుతున్నారు. అతడు సిగ్గు పడేట్టు చేశారు. వీలాయితే అతడికి ధైర్యాన్నివ్వాలి కానీ, కించపరచకూడదు. మీరు అతడిని బాధ పెట్టారు. నేను మిమ్మల్ని ఏమీ బాధ పెట్టలేదు.”

అతడు నా చెయ్యి మెలికలు తిప్పుతూ, నన్ను బలంగా తోశాడు. నేను వెనక్కి తిరిగి అతడి ముక్కు పగిలేలా కొట్టి, గదిలోంచి పరిగెట్టి వెళ్లిపొయ్యాను. తరువాత నేను, అతను బెర్నార్డ్ సిస్టర్ ఆఫీసుకు వెళ్లాం. నేను ఆమెతో అన్నాను, “ఈరోజు నుంచి నేను పాఠశాల వదిలేస్తున్నాను. ఈ చెత్త ఇక భరించలేను. నా డిప్లోమా ఇచ్చేయ్యండి. మీలాంటి మనుషులతో నా సమయాన్ని వృధా చేసుకోలేను.”

బెర్నార్డ్ సిస్టర్ నావైపు చాలాసేపు చూసింది. చివరికి అంది, “సరే, మేరీ ఎల్లెన్, ఈ రోజు ఇంటికి వెళ్లిపో. కొన్ని రోజుల తరువాత వచ్చి నీ డిప్లొమా తీసుకువెళ్లు.” విచిత్రం, ఆ ప్రీస్టు మంచివాడయ్యాడు. అతను తన క్లాసు నుంచి కొంత గౌరవం మాత్రమే అశించినట్లున్నాడు. ఆయన అప్పటికి ఇంకా యువకుడే, తను చేసే పనుల పట్ల తనకు నమ్మకం లేనట్లు వుండేవాడు. ఏది ఏమైనా నేను ఆ పరిస్థితుల్లో చాలాకాలమే వున్నాను. ఆ తరువాత, అతను ఇండియన్లకు మంచి స్నేహితుడయ్యాడు, నాకు నా భర్తకు దగ్గరి స్నేహితుడయ్యాడు. వూండెడ్ నీ లో, ఆ తరువాతా, మాకు తోడుగా నిలిచాడు. తన పై అదికారులకు ఎదురుతిరిగేవాడు, నిజమైన ప్రజల ఫాదర్ అయ్యాడు. మా భాష కూడా నేర్చుకున్నాడు. చిన్న వయస్సులోనే కాన్సరుతో చనిపొయ్యాడు. మంచి ఇండియన్ల లాగే, మంచి తెల్లవాళ్లు కూడా యుక్తవయస్సులోనే చనిపోతారు. నిజానికి సిగ్గరులుగా వుండే వాళ్లకే ముసలితనం దాకా జీవించి వుండడం తెలుసు. మాకు బాసటగా నిలిచినందుకే కాక, నాతో గొడవ పెట్టుకుని – లేక నేను అతడితో గొడవ పెట్టుకున్నానా? – ఆ దుర్భర పరిస్థితులనుంచి నేను బయట పడేలా చేసినందుకుకూడా నేను అతడికి ఎప్పుడూ రుణపడే వుంటాను. అతడితో గొడవపెట్టుకున్న ఆ రోజే పాఠశాలలో నా చివరి రోజు.

3 అభిప్రాయాలు »అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం

3 Responses to “అపరాజిత 3: చెర్నాకోలతో సంస్కరణోద్యమం”

  1. 1
    sarath Says:

    చాలా బాగుంది కొనసాగించండి…….

  2. 2
    Rakesh Says:

    అత్యద్భుతమైన రచన+అనువాదం!!
    చదువుతుంటే మనసులో ఎన్నో భావోద్వేగాలు..
    ఇక్కడ ప్రస్తావించిన బలవంతపు జీవనవిధాన మార్పిడులూ, native భాష/సంస్కృతులపట్ల వ్యతిరేకతా అన్నవి చదువుతుంటే ఇవన్నీ మనమూ విన్నాము, చూశాము అనిపిస్తున్నది.
    కోయలు, కొండరెడ్లు, గోండ్లు, బంజారాలు, లంబాడాలు, చెంచులు లాంటి అసంఖ్యాక తెగలు (కొన్నైతే మరీ చిన్నవి.. అంతరించిపోతున్నవి) మన దేశంలోనే అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయి.
    మనిషి పుట్టిన కాలంనుంచి ఇప్పటివరకూ వాళ్ళు ఎటువంటి technology ల అవసరం లేకుండానే ఆనందపు జీవితాలను (సరే.. నాగరికులు దుర్భరం అనుకున్నా, వాళ్ళదృష్టిలో..) గడుపుతూ వచ్చారు. ఇప్పడు వారి జీవితాలను బాగుపరుస్తామంటే invasion కార్యక్రమాలకు ఒడిగట్టిన వాళ్ళు (either with vested interest OR with pure service motto) వాళ్ళ మానసిక పరిస్థుతులకు అనుగుణంగానే… లేదా.. అవసరమైనంతవరకే మార్పులను తెస్తున్నారా అన్నదే ప్రశ్న!

    మనం ఈ రోజు “నాగరికత” అనీ “సభ్యత” అనీ in vougue అనీ పాటిస్తున్న/ఏర్పరచుకున్న పద్ధతులూ, నియమాలూ బహుషా 100/150 ఏండ్ల తర్వాతి మన generations కే వెగటుగా, అసహ్యంగా అనిపించవచ్చు.

    ఎవరి భాషనూ, పండుగలనూ, సంబురాలనూ, culture నూ చిన్నదిగా చూడవద్దన్నప్రాథమిక సూత్రాన్ని మేరీ కథ మరోసారి గుర్తు చేస్తున్నది.
    మమతగారికి, ప్రాణహితకు ధన్యవాదాలు!!

  3. 3
    kolord97@gmail.com Says:

    india lo jarige matha marpidulanu baga support chestharem miiru, islamic vaalanu asalemi anaru, baaga bayam anukuntaa.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో