Dec2007
బాక్టీరియాతో మన సంబంధాలు
బాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులూ అనేవి అసలు ఉన్నాయని తెలియడానికి భౌతికశాస్త్రంలో కొంత ప్రగతి అవసరమైంది. రకరకాల కటకాలతో మైక్రోస్కోప్‌లు తయారైన తరవాతనే సంగతులన్నీ బైటపడసాగాయి.
ఆధ్యాత్మిక ధోరణి ఉన్నవారు మానవమాత్రులను ఆడించే శక్తిని గురించి తలుచుకుంటూ ఉంటారు. ఎవరి కంటికీ కనబడని ఆ శక్తి ఏమిటో ఎవరికీ అంతుచిక్కదు గాని సైన్సుకు తెలిసినంతవరకూ అటువంటి శక్తేదో బాక్టీరియాకు ఉన్నట్టుగా కనిపిస్తుంది.
1676లో లీయువెన్‌హోక్ తయారుచేసిన మైక్రోస్కోప్
పాపపుణ్యాల చిత్రగుప్తుడి చిట్టా వాటివద్ద లేకపోయినా పరిస్థితినిబట్టి బాక్టీరియా మనకు మేలునూ, హానినీ కలిగిస్తూ, స్వర్గం కాకపోయినా అప్పుడప్పుడూ నరకాన్ని చవిచూపిస్తూ ఉంటాయి. వీటిలో మన చెప్పుచేతల్లో ఉండేవి తక్కువే. మనకన్నా ముందొచ్చినా అవి సూక్ష్మమైనవనీ, తక్కువ జాతికి చెందినవనీ మనం అనుకోవచ్చు. కాని అది జరిగేపని కాదు. అలాగని మనం వాటికి పూర్తిగా లోబడి ఉంటామనీ కాదు. ఆదినుంచీ ప్రకృతిలో సహజంగా జరుగుతూ ఉండే జీవపరిణామపు పెనుగులాటలో ఏ ఒక్క జాతిదీ పూర్తిగా పైచెయ్యి అవదు. హానికరమైన బాక్టీరియా మనపై దాడి చేసినప్పుడల్లా మన శరీరాలు వాటిని సమర్థవంతంగా ఎదుర్కుంటూ, తిప్పికొడుతూనే ఉంటాయి.అయితే మానవజాతికి ఆధునికవిజ్ఞానం అందుబాటులో లేని కాలంలోకూడా అంటురోగాలకు ప్రతిచర్యలు తీసుకునే సంప్రదాయం ఉండేది. మనవాళ్ళు పసుపుకూ, వేపచెట్టు భాగాలకూ ఇతర ఆహార పదార్థాలకూ క్రిమిసంహారక గుణం ఉందని ఏనాడో గుర్తించారు. అలాగే ఇంట్లో దగ్గరవారు చనిపోయినప్పుడు పాటించే “మైల” ఆధునిక భాషలో క్వారంటీన్ వంటిది. చనిపోవడానికి కారణం ఎటువంటిదైనా శవంలోకి బాక్టీరియా క్షణాల వ్యవధిలో ప్రవేశిస్తాయి కనక ఇటువంటి సంప్రదాయం మొదలై ఉంటుంది. పరామర్శకు వచ్చినవారంతా ఇంటికెళ్ళాక తప్పనిసరిగా స్నానాలు చెయ్యడం, మగ బంధువుల్లో కొందరైనా తలలు గొరిగించుకోవడం మొదలైనవన్నీ బాక్టీరియాను వదిలించుకునే చర్యలలాగా అనిపిస్తాయి. (శిరోముండనం వైధవ్యానికి సంకేతం కనక స్త్రీలను మినహాయిస్తారేమో). దీన్ని గుడ్డినమ్మకంగా పాటించేవారు మాత్రం, ఈరోజుల్లోకూడా, ఏ గుండెపోటో వచ్చి చనిపోయినవారిని చూసొచ్చాక కూడా స్నానాలు చేస్తూ ఉంటారు. పాత ఆచారం ఎందుకు ఏర్పాటయిందో వీరికి తెలియదు. అలాగే పదో రోజూ, పన్నెండో రోజూ జరిపే కర్మకాండ తమ ఇంట క్వారంటీన్ అయిపోయిందనీ, అందరూ నిర్భయంగా తమ ఇంటికొచ్చి భోజనం చెయ్యవచ్చనీ చేసే ప్రకటనలాగా అనిపిస్తుంది. పది పన్నెండు రోజులకు మించి బాక్టీరియా ప్రభావం ఉండదని మనవారు ఆచరణ ద్వారా తెలుసుకుని ఉంటారు.
మనవారు పాటించే ఎంగిలి, అంటు మొదలైన సంప్రదాయాలు కూడా అటువంటివే. పశ్చిమ దేశాలవారిలాగా చలిప్రాంతం కాదు కనక బాక్టీరియా సులువుగా వృద్ధి చెందే మనదేశంలో ఇవి ముఖ్యం. చలి దేశాలవారికి ఎంగిలి అనే భావన లేకపోవడానికి ఇదే కారణం అనిపిస్తుంది. ఆహారం తినడానికి కుడిచేతినీ, విసర్జన తరవాత ఎడమచేతినీ తప్పనిసరిగా వాడే మన సంప్రదాయం ఉష్ణప్రాంతాలైన పొరుగు దేశాల్లో కూడా ఉంది. క్రిమిరహితం కాని ప్రపంచంలో ఇవన్నీ మనుషులు తీసుకునే జాగ్రత్తలు.
తల్లి కడుపులో ఉన్నప్పుడు మనకు సామాన్యంగా బాక్టీరియా బెడద ఉండదు. పుట్టీపుట్టిన వెంటనే మాత్రం అవి హడావిడిగా మన శరీరాలని ఆక్రమించేస్తాయి. ఆ తరవాత కాలక్రమాన యథావిధిగా రకరకాల బాక్టీరియా చేరవలసిన స్థానాలకు చేరుకుంటాయి. మొదటగా పుట్టిన మూడు నాలుగు రోజుల్లోపలే తల్లి యోనిద్వారం నుంచీ, చర్మంనుంచీ పాకిన బాక్టీరియా చంటిపాపల నోళ్ళలోకి చేరుకుంటాయి. తక్కినవి తల్లి వదిలే ఊపిరినుంచీ, వారి మొహం మీద మొహం పెట్టి ముద్దు చేసే ఇతర పెద్దల నోళ్ళనుంచీ విజయం చేస్తాయి. పళ్ళు వస్తున్నప్పుడు మరికొన్ని ప్రవేశిస్తాయి. ఇవన్నీ ఇలా నోటి ప్రాంతాన్ని “కబ్జా” చేస్తాయి కనకనే బైటినుంచి సోకే హానికరమైన బాక్టీరియాకు చోటు లభించదు.
అయినా పిల్లలకు బాక్టీరియావల్ల కలిగే ప్రమాదాలు ఎక్కువే. పాకే పిల్లలు తిరిగే స్థలాలూ, ముట్టుకునే ఆటవస్తువులూ అన్నీ బాక్టీరియామయమే. వాటిని మాటిమాటికీ శుభ్రపరుస్తూ ఉండకపోతే డయేరియావంటివి చిన్నపిల్లలను చీకాకు పెడతాయి. ప్రతిదీ నోట్లో పెట్టుకోకుండా చూసి, కిందపడ్డవి తినకుండా, తింటున్నప్పుడు మధ్యలో ఇతర వస్తువులను ముట్టుకోకుండా శ్రద్ధగా అనుక్షణమూ చూసుకుంటూ ఉండాలని చదువుకున్న తల్లిదండ్రులుకూడా సామాన్యంగా గమనించరు. తమ అశ్రద్ధ్ధ కారణంగా పిల్లలకు జబ్బుచేస్తే మాత్రం దేవుడికి మొక్కుకుంటారు.
శిశువు పెరుగుతున్నప్పుడు జీవరసాయనిక పరిణామాలు జరుగుతాయి కనక వాటి ననుసరించి శరీరానికి రోగనిరోధక శక్తినిచ్చే ఇమ్యూన్ వ్యవస్థ ఏర్పడుతుంది. ఇదంతా జరిగి వ్యవహారం కుదుట పడడానికి ఆరేళ్ళు పడుతుంది కనక అంతకన్నా చిన్నవయసులో అంటువ్యాధుల భయం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో పిల్లలకి క్రమం తప్పకుండా రకరకాల వాక్సినేషన్లు విధిగా వేస్తున్నారు కనక కొన్నేళ్ళకు ముందున్నట్టుగా డిఫ్తీరియా మొదలైన అంటువ్యాధులు సోకడం అరుదుగా జరుగుతోంది. పిల్లలు పెద్దవారైన తరవాత యుక్తవయస్సు వచ్చినప్పుడు హార్మోన్ల కార్యకలాపాలకి తగినట్టుగా కొత్తరకం బాక్టీరియాకు మన శరీరాలతో పనిపడుతుంది.
అసలీ బాక్టీరియా గొడవేమిటని కొందరు శాస్త్రవేత్తలు క్రిమిరహిత వాతావరణంలో ఎలుకలవంటి జంతువులను పెంచే ప్రయత్నాలు చేశారు. ఇవి సహజంగా పుట్టేలోపునే సిజేరియన్ సెక్షన్ చేసి బాక్టీరియా ఏ మాత్రమూ తగలకుండా బైటికి తీసి కట్టుదిట్టంగా పెంచారు. వాటికని ప్రత్యేకంగా స్టీల్ డబ్బాలను తయారుచేసి, వాటికి అవసరమైన గాలినీ, నీటినీ, ఆహారాన్నీ స్టెరిలైజ్ చేసి, బాక్టీరియా వంటివేవీ సోకకుండా చూసి, నానా అవస్థలూ పడ్డారు. ఒక ఎలుకల జంటను ఈ పద్ధతిలో పెంచి, వాటి రెండిటికీ పుట్టిన సంతానానికి జన్మతః గాని, మరేవిధంగా కాని బాక్టీరియా తగలకుండా చూశారు. తల్లి పాలు తాగినప్పటీకీ బాక్టీరియా వాటి చాయలకు కూడా రాలేదు. కొన్ని పరిశోధనశాలల్లో అదే పనిగా ఇటువంటి జీవాలను వంద తరాలపాటు పెంచుతూపోయారు. ఆ అరవాత వాటిని మామూలుగా బాక్టీరియా ఉన్న వాతావరణంలో పెరిగినవాటితో పోల్చి చూశారు. ప్రాణులు పెరగడానికి బాక్టీరియా ఎంతవరకూ అవసరమో తెలుసుకోవడానికి అనేక పరిశోధనలు చేశారు.
1656లో నేప్‌ల్స్(ఇటలీ)లో ప్లేగుతో మరణించినవారి శవాలు
బాక్టీరియా లేనివి తక్కినవాటికన్నా పెద్దవిగా తయారై, దాదాపు రెండు రెట్ల ఆయుర్దాయంతో బతికాయి. వాటిలో కొన్నిటిని బైటకు తీసుకురాగానే మాత్రం తగిన ఇమ్యూనిటీ లేకపోవడంతో అవి త్వరగా రోగాలకు గురి అయిపోయాయి. కొత్తజాతికి 30 శాతం ఎక్కువ ఆహారం అవసరమౌతోందని గమనించారు. దీనర్థం ఏమిటంటే మన జీర్ణకోశ వ్యవస్థలో ఉన్న బాక్టీరియా మనం తినే తిండినుంచి ఎక్కువ శక్తిని రాబట్టగలుగుతున్నాయని. కృత్రిమ వాతావరణంలో పెరిగిన ఎలుకలు రక్తం గడ్డకట్టడానికి పనికొచ్చే విటమిన్ కె తయారు చేసుకోలేకపోతున్నాయని కూడా తేలింది. మామూలుగా ఈ బాధ్యతను మనలోని బాక్టీరియాయే నిర్వహిస్తాయి. అంతేకాదు, బాక్టీరియా లేని ఎలుకల పేగుల ఎదుగుదల కూడా సక్రమంగా జరగలేదు.
కొన్ని రకాల బాక్టీరియాకి మన పేగుల్లోని వాతావరణం ఎంతో ఇష్టమైనదిగా కనిపిస్తుంది. వెచ్చగా, తేమగా ఉండే ఆ చీకటి సొరంగంలో అవి వచ్చి తిష్ఠ వేస్తాయి. అన్నిటికన్నా మొదటగా వచ్చి కూర్చుని, జీవితమంతా మనతోనే ఉంటూ, తక్కినవి చేరకుండా అజమాయిషీ చేసే ఈ సూక్ష్మజీవులు పేగుల్లోని జీవకణాలతో అద్భుతమైన సంపర్కం ఏర్పరుచుకుంటాయి. జన్యుపదార్థాల ద్వారా జరిగే ఈ ఆశ్చర్యకరమైన “సంభాషణ” వల్ల బాక్టీరియాకి ఎటువంటి ఆహారం, ఎప్పుడెప్పుడు ఎంతెంత సరఫరా చెయ్యాలో పేగుల కణాలు తెలుసుకుంటాయి.
ప్రయోగశాలలో పెంచిన పెద్దపేగు కణాలకీ, బాక్టీరియాకీ సంపర్కం
అవసరమైనదాని కన్నా ఎక్కువ ఆహారం పోగుపడితే “శత్రువులు” వచ్చి భక్షిస్తాయి కనక ఈ ప్రక్రియ మోతాదు మించకుండా జరుగుతుంది. ఈ కార్యకలాపాల్లో పేగుల లోపలి గోడల మీద జిగటగా ఉండే మ్యూకస్ పొర ముఖ్యపాత్ర నిర్వహిస్తుంది. మన ప్రమేయం కాని, అనుమతిగాని లేకుండానే ఇదంతా జరుగుతూ ఉంటుంది. దీన్నిబట్టి ప్రాణులన్నీ సూక్ష్మజీవాలకు భోజన నిద్రాది వసతులు సమకూర్చే హోటళ్ళలా అనిపిస్తాయి. అలాగని అవి పరాన్నభుక్కులవంటివి కావు. వాటివల్ల మనకు కలిగే మేలు కాస్తాకూస్తా కాదు. మనం తినేదంతా అరగడానికి తోడ్పడడమే కాక, మనంతట మనం అరిగించుకోలేని గట్టి పదార్థాలను కూడా పేగుల్లోని బాక్టీరియా విడగొట్టి జీర్ణం చేస్తాయి. ఇందుకుగాను పేగుల జీవకణాల్లో మామూలుగా స్తబ్ధుగా పడిఉండే కొన్ని జన్యువులను అవి “మేల్కొలుపుతాయి”. ప్రకృతిలో జరిగిన ఇటువంటి సహజీవనపు ఏర్పాటు చూస్తే బాక్టీరియా లేని పరిస్థితిలో మన శరీరాలు అసంపూర్ణమైనవే అనిపిస్తుంది. తల్లిదండ్రులు సృష్టించి వదిలిన మన శరీరం బాక్టీరియా సహాయం లేనిదే బతకలేదు.
సూక్ష్మజీవుల సంగతులు చెప్పుకోవాలంటే చాలానేఉన్నాయి. వాటిగురించి మనం తెలుసుకుని జాగ్రత్తపడడానికి ఒక ముఖ్యకారణం వాటిద్వారా మనకు సంక్రమించే రకరకాల జబ్బులు. అవన్నీ వర్ణించాలంటే పెద్ద వైద్యగ్రంథమే తయారవుతుంది. వివిధ బాక్టీరియా మన శరీరాంగాలపై ఎటువంటి ప్రభావం కలిగిస్తాయో, జీవకణాల స్థాయిలో వాటికి ఎటువంటి ప్రతిఘటన ఎదురౌతుందో ఇదంతా ఒక ప్రత్యేక శాస్త్రమే. అంత లోతైన విశ్లేషణ అవసరం లేని మనవంటివారికి బాక్టీరియా గురించిన కొన్ని ముఖ్యవిషయాలు మాత్రమే ఆసక్తికరంగా ఉంటాయి.
ఉదాహరణకు మనం తీసుకోవలసిన జాగ్రత్తలు. కళ్ళకేమీ మురికిగా కనబడకపోయినా వీలైనన్నిసార్లు శుభ్రంగా సబ్బుతో చేతులు కడుక్కుంటూ ఉంటే మనం చాలారకాల రోగాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. అయినా తరుచుగా మనం “తెలిసిన మూర్ఖుల”లాగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇటువంటివన్నీ అలవాట్ల స్థాయిలో అమలైతే తప్ప “జ్ఞానం” మాత్రమే ఉండి మనకేమీ ప్రయోజనం ఉండదు. క్రిముల బెడద తగ్గాలంటే సబ్బుతో వేలి కొసలనూ, గోళ్ళకిందా కనీసం 20, 30 సెకండ్లపాటు నురుగు వచ్చేలా కడుక్కోవాలి. తుమ్ముతున్నప్పుడూ, దగ్గుతున్నప్పుడూ ముఖానికి జేబు రుమాలువంటిది అడ్డం పెట్టుకుంటూ ఉంటే మన బాక్టీరియా అందరికీ ఉచిత సరఫరా కాకుండా ఉంటుంది. ఇలా చెయ్యనివారిని సున్నితంగా హెచ్చరించడం కూడా మన బాధ్యతే. రోడ్డుమీద నడుస్తూ ఖళ్ళున దగ్గి, ముక్కు చీదుకుని, పక్కనే కాండ్రించి ఉమ్మేసి, చేతిని ఏ దీపం స్తంభానికో తుడిచేసుకునే సంప్రదాయం ఉన్న మన దేశంలో ఇలాంటివి చెప్పడం అరణ్యరోదనం అనిపిస్తుందేమో కాని, వీటి గురించి కనీసం ఒకసారి మననం చేసుకోవడం చాలా అవసరం.
మనలో ఆరోగ్యవంతులకు సామాన్యంగా పటిష్టమైన రోగ నిరోధకవ్యవస్థ ఉంటుంది కనక మనపై నిత్యమూ దాడిచేసే భయంకరమైన సూక్ష్మజీవుల గురించి మనం (“కర్మం కాలి” జబ్బుపడేదాకా) పట్టించుకోము.
సూక్ష్మజీవాల గురించిన మన నిర్లక్ష్యానికి ముఖ్యకారణం అవి మనకు కనబడకపోవడమే. అదే ఏ బొద్దింకో, పందికొక్కో అయి, మన కంటబడితే పాత చెప్పునో, బడితనో తీసుకుని దాని వెంటపడతాం. ప్రాణికోటిలో మనం స్పష్టంగా చూడగలిగిన జంతువులూ, మొక్కలూ, పుట్ట గొడుగులవంటి శిలీంధ్రాలూ మాత్రమేకాక సూక్ష్మజీవులుకూడా ఉన్నాయని మనకు తెలుసు. అయితే చాలామందికి తెలియనిదేమిటంటే ఈ మొత్తం పరిమాణంలో 80 శాతం సూక్ష్మజీవులేననే సంగతి. వీటిలో ఒక్కొక్కటీ ఎంతో సూక్ష్మమైనవి కనక వీటి మొత్తం సంఖ్య ఎంత అపారమైనదో మనం ఊహించుకోవచ్చు. మనలాంటి పెద్ద ప్రాణులన్నీ ఈ “రద్దీ”లోనే ఆవిర్భవించి పెరిగాయి కనకనే వాటితో సహజీవనం మనకు తప్పనిసరి అవుతోంది.
ఆదిమయుగం లగాయతు ఇప్పటిదాకా భూమి మీద మొత్తం పదివేల కోట్లమంది మనుషులు జీవించారని అంచనా. వీరంతా చచ్చిపోగానే శవాలమీద బాక్టీరియా తమ పని ప్రారంభిస్తాయి. మనుషులే కాదు, లెక్కలేనన్ని జంతువులూ, పక్షులూ, ఇవన్నీ చేసిన మలవిసర్జనా ఇదంతా తలుచుకుంటే పర్వతాలంతేసి పెరిగి, భయంకరమైన గుట్టలుగా పోగుపడిఉండేవని అర్థం చేసుకోవచ్చు. అసలు వీటితో కప్పబడిన నేలమీద మొక్కలూ, పంటలూ మొలవడం, కొత్త జాతి ప్రాణులు పుట్టుకురావడం, ఇవేమీ సాధ్యమై ఉండేవికావు. బాక్టీరియా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న పదార్థాలన్నిటినీ భక్షించి, మూలపదార్థాలుగా మార్చెయ్యడం వల్లనే బ్రహ్మాండమైన రీసైక్లింగ్ జరిగి ఈ ప్రాణికోటి బతకగలుగుతోంది. బాక్టీరియా జీర్ణించుకోలేని వింత ప్లాస్టిక్ వస్తువులు ఎక్కడపడితే అక్కడ వ్యర్థపదార్థాలుగా మిగిలిపోవడం మన ఆధునికసమాజం చేస్తున్న తప్పుల ఫలితమే. ఇలా బయో డిగ్రేడబ్‌ల్ కాని ప్లాస్టిక్ సంచులవంటి వస్తువులను నిషేధించే చర్యలు అందుకే అవసరమైనవిగా భావించాలి.
అయినా బాక్టీరియా రకాలన్నీ మనం అనుకున్నంత హానికరం కావు. వెయ్యి రకాల్లో ఒక్కటి మాత్రమే మనకు ప్రమాదకరం కావచ్చు. వీటిలో చాలావరకూ మనను జబ్బులతో పీడించి వదులుతాయి. ఆ జబ్బులు చావుకు దారి తీసినట్టయితే మనతోబాటు అవికూడా చచ్చిపోతాయి కనక అంతపని చెయ్యవు. అలా మనని ఇబ్బందులకు గురి చేసినందువల్ల వాటికేం లాభం అనిపిస్తుంది కాని వాటికి లాభం కలిగేమాట వాస్తవమే. మనకు వచ్చే తుమ్ములూ, వాంతులూ, విరోచనాలూ వగైరాలన్నీ వాటిని బైటికి రప్పించి ఇతర ప్రాంతాలకు చేరవెయ్యగలవు. దోమలవంటివి కూడా అవి అంతటా వ్యాపించటానికి తోడ్పడతాయి. ఈ విషయాలన్నీ అవి ఆలోచించగలవని కాదు. ఇదంతా జీవ పరిణామంలో భాగమే.
తీవ్రమైన హాని కలిగించి, మనుషులను చంపేసి, తాము కూడా వారితో బాటుగా తుడిచిపెట్టుకుపోయిన సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి. 15వ శతాబ్దం అంతంలో చెమటలు పట్టే ఒక వింత వ్యాధివల్ల ఇంగ్లండ్‌లో వేలకొద్దీ జనం చనిపోయారట. అంతుచిక్కని ఈ రోగానికి ఎటువంటి చికిత్సా పనిచెయ్యలేదు కాని అయిదారు దశాబ్దాల్లో చచ్చినవారు చావగా ఆ బాక్టీరియాకు “స్థావరాలన్నీ” మూతపడడంతో అవి అదృశ్యమైపోయినట్టుగా తెలుస్తోంది. మన రక్తంలో ఉండే తెల్లకణాలు ఎటువంటి దాడినైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటాయి. రకరకాల ఆకారాల్లో వచ్చిపడే సూక్ష్మజీవులను తగిన విధంగా అడ్డగించడానికి దాదాపు కోటి రకాల తెల్ల కణాలు “గస్తీ” తిరుగుతూ ఉంటాయి. రోగక్రిముల ఆచూకీ తెలియగానే ఫలానారకం కణాల “సేన” అవసరం కలుగుతోందనే సూచన అందుతుంది. వెంటనే అటువంటి కణాల తయారీ మొదలవుతుంది. మనం జబ్బుతో బాధపడేది ఆ పరిస్థితిలోనే. ఎదురుదాడి మొదలవగానే మన ఆరోగ్యం కుదుట పడనారంభిస్తుంది.
సూక్ష్మజీవుల ప్రపంచంలో ఉంటూ వాటికి మనం వెరిచి లాభంలేదు. మనకు ఇష్టం ఉన్నా, లేకపోయినా అవి యథేచ్ఛగా మన శరీరమంతటా వీలున్నచోటల్లా విహరిస్తూనే ఉంటాయి. మన దేహంలోనే ఒక ప్రాంతంలో నిరపాయకరమైన బాక్టీరియా ఏ ఊపిరితిత్తుల్లోకో వెళ్ళగానే ప్రాణం మీదికి తెస్తాయి. కొన్ని రకాలు చాలా ఏళ్ళపాటు “నిద్రాణం”గా కొనసాగుతూ, మరేదో కారణంవల్ల మన రోగ నిరోధకవ్యవస్థ కుంటుపడిన అవకాశం తీసుకుని విజృంభిస్తాయి. తూర్పు ఆసియాలో సునామీ చెలరేగినప్పుడూ, మొన్న ముంబాయిలో విపరీతంగా వర్షాలు కురిసినప్పుడూ, అలాగే అమెరికాలో కత్రినా దాడిచేసినప్పుడూ నీరంతా కలుషితం అయిపోయింది. మురుగునీరంతా మంచినీటితో కలిసిపోగానే అందులో ఉన్న బాక్టీరియా తమ ప్రతాపం చూపించడం మొదలెట్టాయి. అంతేకాక మనుషులవీ, జంతువులవీ కళేబరాలు కొట్టుకురావడంతో వాటికి విందుభోజనం ఏర్పడినట్టయింది. ఈ కారణాలవల్ల జీర్ణకోశవ్యాధులూ, కలరా, హెపటైటిస్, లెప్టో స్పైరోసిస్ మొదలైన భయంకరమైన రోగాలు ఎందరినో పొట్టనపెట్టుకున్నాయి.
సామాన్య పరిస్థితులలో సామూహికంగా మనం ఇటువంటి విషయాల గురించి తీసుకునే జాగ్రత్తలు ఎంత ముఖ్యమైనవో దీన్నిబట్టి తెలుస్తుంది. పెద్ద సిటీల్లో మురుగు నీరంతటినీ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు తరలించి అక్కడ పెద్ద టాంకుల్లో గాలి బాగా తగిలేలా బాక్టోరియా చేత “పని” చేయిస్తారు. “జీతం బత్తెం” లేకుండా అవి నీటిని శుద్ధి చేసి పెడతాయి.
చిన్న చిన్న రుగ్మతలు కలిగినప్పుడు తగిన వ్యవధినిస్తే మన దేహం రోగక్రిములను సమర్థవంతంగా ఎదుర్కోగలదు. ప్రతి చిన్న జబ్బుకూ ఏంటీబయోటిక్ మందులవంటివి తీసుకుంటూ ఉంటే ఒకవంక మనలోని ఉపయోగకరమైన బాక్టీరియా నాశనమౌతాయి. నిజంగా హానికరమైన బాక్టీరియా కొత్త పరిస్థితికి అనుగుణంగా తన లక్షణాలని మార్చేసుకుని మందులని నిరోధించగలిగే రెసిస్టెంట్ జాతిగా తయారౌతుంది. క్షణాల్లో రోగాలు నయం చేసెయ్యగలమని మందుల కంపెనీలు కేకలుపెట్టడంతో మామూలు ప్రజలు ప్రతిదానికీ ఇటువంటివి వాడడం మొదలుపెడితే జబ్బుకన్నా చికిత్సే ప్రమాదకరం అవుతుంది.
ఒక అభిప్రాయం »ప్రత్యేక వ్యాసాలు, సైన్స్
Rakesh Dec 12, 2007 1
ఈ రోజటి times of india పేపర్ లో “ఉపయోగకరమైన (మంచి) బాక్టీరియా” గురించి కొన్ని విషయాలను ప్రచురించారు.
(ఆ వార్తకు సంబంధించిన వెబ్-లింకు వాళ్ళింకా అప్-లోడ్ చేయలేదు.)