Dec2007
ఇడుపుగాయితం
పుస్తెలతాడు కట్టించి
తన్నుకు చావమని
సాపెన పెట్టిండు సచ్చినోడు.
1
తాటికమ్మల గుడిసన్నా లేదని
రాజప్రసాదంల ఆశ్రయమిచ్చిన.
కాసులు లేని కనాకష్ట కాలంల
నిలువ గరిసెలిచ్చి నిలబెట్టిన.
గొంతెండి ఎక్కిళ్లు పెడ్తె
కుడిదాయిని కుడిపి కుతిదీర్చిన.
నా రామసక్కని కుర్తీ ఇచ్చి
సదువుకున్నోనివని రాజును చేసిన.
నిన్నేమన్న కర్రె కుక్కను చేసి
ఎంటదిప్పుకుంటినా?
2
మర్లువెళ్లన్నా కాలేదు
కాళ్ల పారాణన్నా ఆరలేదు
ఒప్పందం తీసి ఒడ్డుమీద పెట్టి
నీకు నాకు నడుమ నియమాలెందుకంటివి.
పొలిమేరలు చెరిపేసిన నగ్న దేహాల మధ్య
నగ్నాత్మల ఊసులిప్పమంటివి.
సంపదలు నీకు
సందేశాలు నాకన్న సత్యం
నేనప్పుడే పసిగట్టి
ఈ కాపురం నేనొళ్లంనంటె
కూసున్న పెద్దమనుషులు
కాసింత సర్ది చెప్పి
కాయితం మీద కాపులం నిలిపిరి.
3
కుడి ఎడమల పెయ్యినొరుసుకుంటూ
కాలపు పలుగురాళ్ల మీద పదునెక్కి పారుతున్న
జీవనదులసొంటి భాష
బాగలేదని చీదరిస్తివి.
ఎగిలివారగట్ల
వరిమొవ్వలోని మంచు ముత్యమసొంటి
యాసనెక్కిరిస్తివి.
కట్టుబొమ్మ మీద కథలల్లి
కోట్లు కూడ పెడ్తివి.
సెలిమలు దోచి
సేనెండవెడ్తె
కన్నీళ్లు నాకాయె
నీళ్లు నీకాయె.
నిల్వ నీడలేదు
చెయ్య కొల్వులేదు
ఉనికి ఉనుక పొట్టైతుంటె
నా కుర్చి నాక్కావాలంటె
ఇక మతులతోటి
కాలం కమ్మలు మర్లేస్తివి.
4
నా ఇంటి చుట్టూ మొలిచిన
ప్రైవేట్ ఎస్టేట్ సర్కారు తుమ్మల మధ్య
నేను బందీనైన
ఆస్తమా రోగి లెక్క
శ్వాస కోసం తండ్లాడుతున్న.
సూర్యుడు నీవోడయ్యిండు
సుక్కలన్ని నీ కుక్కలయినవి.
బళ్లు నీవి
గుళ్లు నీవి
మడులు నీవి
మాన్యాలు నీవి
చెమట నెత్తుర్లు ధారపోసి
మిగిలిన బొక్కల పంజిరాన్ని నేను.
మల్లెసాల మీద మంచమేసి
సాధికారంగ సకులం ముకులం పెట్టి
చర్నాకోల చేతవట్టి
నా ఇంట్ల నన్ను బాంచెదాన్ని చేస్తివి.
5
ఇగ ఇప్పుడైనా
పనుగట్ల పంచాయితి పెట్టి
ఇడుపు గాయితం అడుగక
ఇంకేం చెయ్యాలే?
December 12th, 2007 at 5:48 am
చక్కని వ్యక్తీకరణ.
మంచి కవిత రాసిన కవికి అభినందనలు.