Dec2007
జాడ
సావు అయినా, పెండ్లి అయినా, ఇంటికొగరు పోవాలె. పాలోల్ల దాంట్ల ఎవ్వరు సచ్చిన గానీ నాలుగయిదు డప్పులు తీస్కోని పోవుడు గూడ తరీక. ఇంటికొగరు వోయి మన్ను జేసి రావాలె.
పాలోల్ల దాంట్ల నర్సప్పోల్ల ఇంటి ఆడ్విల్ల అందరికి ఆడ్విల్లనే. పాలోల్ల కందరికి సుట్టమే. అంతెందుకు ఊరికే ఆడ్విల్ల అయితది. ఏజ్ బారయి కాలం జేసింది. ఇంతకుముందే సావుసిద్ది ఒచ్చింది. అప్పటివరకు గొంగడి బొంత కప్పుకొని సలిమంట కాపుకుంటున్న నర్సప్ప హుషారైండు. బిగించుకొని కూసున్న గొంగడి బొంతను సర్రున గుంజి బుజం మీదేసుకున్నడు. మెసులుట్ల పక్కల కూసున్న మన్మరాలు సెంద్రమ్మకు తాత మోసేయి తాకి అడ్డం పడిపోయింది. ఎమె ముసలోడా నన్ను దొబ్బుతవు. డప్పుకొట్టుడంటేనే తాతకు బలం నూక్కోని వస్తది అన్నది. అవ్వే… మన్మరాల నీ పెండ్లికి కూడా ఇదే బలంతో డప్పుకొడత. అనుకుంట దిగ్గన లేసి ‘మన కేరీ అంత ఇంటికొకరు వోవాలె. అరేరే పిల్లలూ! కోపుల పనికి రాకొచ్చినమని చెప్పుండిరా’ అన్నడు నర్సప్ప.
ఇంతకు ముందు అనకపోతివి గదనే తాత! మాయప్ప గింతకు ముందే అంగడి వాయె అన్నడు అక్కడ ఉన్న బాబయ్య.
మీయప్ప పోతేమైంది నీవున్నవు గదనోయి పిలగా. ఇంట్ల సిలుకొయ్యకు తలిగేసిన డప్పు తీస్కోని రా! కొడుదువు నీవే అన్నడు నర్సప్ప.
నీయమ్మ మీ పెద్దోల్ల దాంట్ల నేనేం డప్పుకొడుదు. ఊకే మా ఇంటి వొంతుకు ఊకెనే వొచ్చి మన్నేస్త అన్నడు బాబయ్య. నర్సప్ప జెర్ర కోపానికొచ్చి మా దాంట్ల డప్పుకొడితే ఏమైందే మొగుడా! అంటే మీ సరీగ మేం గొట్టమన్నట్లా? ఎక్కడ జూసినవు నన్ను…. పులి ముసలిగయిందేమో కాని… పులి సారలు ముసలియిగావు ఎరుకున్నదా? మేము నేర్పితేనే గదా నీవు నేర్సుకున్నవు. గిదే సూడు – ఎనుకటికెవడో నీయసంటోడూ గురువుకే గూటం సూపిన్నేడంట గుద్దనీకే’ అన్నడు నర్సుతాత చిరు కోపంతో గులిగినట్ల.
‘నీ ముసలి కొడుకా మీరు మాల్యాక డప్పుకొడుతారు? రొండు సీసల కల్లు తాగితేనే మీ డప్పు మీద జోస్‌గ సిటికెవడ్తది. ఆ నిస ఉన్నంత సేపు. అది దిగిపాయెనంటే ఎన్కకు ఈర్గిల వడ్తరు. ఓయప్పో మీతోని ఒద్దప్పా. మీ తోని డప్పుగొట్టుడంటే సెట్ల నడుమ సెడుగుడు ఆడినట్లనే. కొట్టీ కొట్టీ మేం పుల్లసీలి పోవాలె.’ అన్నడు బాబయ్య.
అప్పుడు నర్సుతాత అరేరే అప్పప్పా అట్లనుకురా మాయప్ప గదా. అందరము పోవాలె మా దాంట్ల నీవు ఒక్కడివి కాదు నీ జతగాల్లందర్ని మనోల్లను ఎవరెరవు డప్పులు గొడ్తరో నీ జతగాల్లు, ఆ పెంటడు, సెంద్రుడు, సమ్మడు, నాగడు, గురువడు, ఎల్లడు అందర్ని తీస్కపోదం పడుసోల్లం, ముసలోల్లం అందరం గల్సి కొడుదం. నీకు నాకు యాస్టకు గూడ రాదు ఏమంటవ్? అన్నడు నర్సుతాత.
ఆని జతగాల్లంత వొస్తున్నరంటే అంతకంటే సంబరం ఏమున్నది బాబయ్యకు.
ఊఁ… పాండి అయితే అని తలూపిండు బాబయ్య.
ఇగ అందరూ బుజాలకు డప్పులను తగిలేసుకోని సావు సుద్దికి బయలుదేరిండ్రు. పీనుగు మన్ను అయిందాక డప్పులు దూందాం కొట్టవట్టిండ్రు.

చిత్రం: ఏలే లక్ష్మణ్
డప్పు కొట్టుకుంటనే భూమ్మీదవెట్టిన పైసను నుదురుతో అందుకొనుడు, మన్నుల పాతిన సూదిని డప్పు కొట్టుకుంట కంటితో తీసుడు, సాపుడప్పు చుట్టు ఉన్న పదూర్లకు తెల్వజెపుతున్నట్లు మోగుతున్నది. యాభై డప్పులు ఒక్క తీర్గ మోగుతున్నయి. ఆడోల్లయితే పాటలు వాడినట్టే ఏడుస్తున్నరు. కడుపులవుట్టినోల్లు తోడ వుట్టినోల్లు. మొగోల్లయితే రుమాలు కొంగులు మొకాలకు వెట్టుకొని ఆడ్విల్లలు ఏడ్సినట్లు ఏడుస్తున్నరు. జాతరోలే మంది నిండిండ్రు. భూమ్మీదికొచ్చి అన్ని జూసింది అన్ని జేసింది అందరి నడిమికెల్లి వోతున్నది సుక్కమ్మ. ‘సావంటె గిట్లుండాలే మంచి సావమ్మ సుక్కమ్మదీ’ అనుకోవట్టిండ్రు. ఎవ్వరితో శాతజేపించుకోలే. అందరికి శాత జేసింది కాని జేపించుకోలే. కోడండ్లతో జేపించుకోలే బిడ్డలతో జేపించుకోలే. బంగారమసొంటి సావు సుక్కమ్మది. అనుకుంట జనం జాతరోలె పోత పోత తొవ్వలోనే సేతులనిండ తంగెడుపువ్వు బరుక్కొని తొవ్విన సమాదిల అందరు పువ్వుల జల్లిండ్రు. ఎవరివంతుకు వారు పిడికిలి నిండ మన్ను నింపుకొని సుక్కమ్మ శవం మీదేసిండ్రు. సందం జెసిండ్రు. డప్పులోల్లు దొరికిన పైసలు లెక్కజూసుకొని అందరూ తలా ఇన్ని పంచుకున్నరు. ఆఖరుకు తలా ఒక సీస కల్లు తాగిండ్రు. పడుసోల్లు కల్లు తాగమని కల్లుకు బదులు ‘మేము కుంటి ఇస్మాల్ ఓటల్ల గారెలు తింటము తేండి’ అని పైసలు వసూలు జేసుకున్నరు. ఆల్ల దాంట్ల పెంటయ్య అందరియి కలిపి పైసలు దీసుకున్నడు. అందరు బస్సు నిలవడెతాడకు వొచ్చిండ్రు. కల్లు దాగెటోల్లు కల్లు దాగిండ్రు. గారెలు తినేటోల్లు గారెలు తిన్నరు. మర్లి పోవటానికి పొద్దు అయితున్నదని బస్సు కోసం ఎదిరి సూస్తున్నంతలోనే బస్సు రానేవొచ్చింది. అందరు ఒకరిని వట్టక ఒకరు బుజ్జ బుజ్జ బస్సు ఎక్కంగనే బస్సు వోవట్టే. సరిగ్గా మైలు దూరం ఒచ్చిందో లేదో బస్సు ఫేలయింది. కండక్టరు, డ్రైవరు దాని పరిస్థితి గమనించి టౌన్‌కు వోయి మెకానిక్‌ను తోల్కరావాలె. దాన్ని రిపేరు జెయ్యాలె ఇంతట్ల కదలదని అందరు బసు దిగుండని సెప్పవట్టిరి. ఈ పల్లె డప్పులోల్లంత ఒకరి మొఖాలు ఒకరు జూసుకున్నరు. వార్ని…. నా కొడుకా ”వొంకరోని పెండ్లికి వొనగండ్ల వాన” అన్నట్లు ఇదేందిరాప్ప సాడెసతినే వడేతు. పొద్దు ననంగ ఇంత చాయి సావుకాడ ఇంత కల్లు బొట్టు తాగినం. ఇంత దాక ఏమి తిన్నే లేదు. పానమంత తెమిడి వోయినట్లయింది. ఇక్కడ దగ్గెర నాగులపల్లె ఉన్నది. అందుట్ల ఏదన్నా హోటలున్నదంటే అది పరువు దూరానా కాలవడ్డది. ఎక్కడ పోయేటట్ల లేదు. కడుపుల నేమో పేగులు నములవట్టినయి. కాల్లు గుంజుకపోతున్నయి ఒడి వడుతున్నయి. ఏం జేతముండిరా పిల్లలు అన్నడు నర్సుతాత. పిల్లలు ఏమి అనకుండా గిక్కడ ఎక్కడనన్న ఇన్ని నీల్లబొట్టన్న తాగుదం. దగ్గెర పట్ల ఏదన్నా నీల్లతావు, ఆడ్క ఉన్నదేమో దేవులాడుండ్రి. గా మర్రి సెట్టు పోంటి గుంతలాక కనవడ్తున్నది. సూతం రాండ్రి అన్నడు అవ్వోల్ల నాగడు. నీల్ల కోసం దేవులాడుతున్నరు. వాడ్క పొడుగునా సూడంగ సూడంగ ఒక గుంతల అడుగుకు తోడెం నీల్లున్నయి. అవి గూడ ఎండుక పోయి తడి మిగిలి ఆకుపచ్చ నాసు వట్టినయి. దాని పక్కపోంటి పెంటయ్య, సెంద్రయ్య, బాబయ్య వోయి మూరెడు మూరెడు పొడువున్న కట్టెలు తీస్కోని దొవ్వుతుంటె ఇద్దరు మన్ను తీయ్యవట్టిండ్రు. మన్ను దొవ్వుత కొద్ది సెలిమలో సొతుకు సొతుకు నీళ్లు రావట్టినయి. అట్లనే మూరెడు లోతుదీసిండ్రు. నీల్లు అరసేతి మందం మడుగు గట్టినయి. ఇంకొంత లోపలికి సేతులు కుక్కి ఇసును తీసిండ్రు.సెలిమలో నీల్లు ఇంక ఊరవట్టినయి. నీల్ల మట్టం పెరిగింది. పక్కల్నే ఉన్న మోతుకు ఆకులు మంచి మంచివి తెంపి డొప్పలు జేయవట్టె ఎల్లుగాడు. సమ్మడు, గురువడు ఆ డొప్పలను దీస్కపోయి ఊరిన నీల్లను మొత్తం ఒండులేకుండా తీసి బయటికి పోసిండ్రు. మొత్తం నీల్లు తీసినంకా కిందికెల్లి తెల్లటి పాలవంటివి నీల్లు సల్లగా, తియ్యగా సెలిమల ఊరవట్టె. మంచి మంచి ఆకులు తెంపుకోని డొప్పలతోని సెలిమల ఊరిన నీల్లు ఊరినయి ఊరినట్లే తాగవట్టిండ్రు. అప్పుడు పెంటడు, బాబుగాడు ‘దాయె నర్సుతాత నీల్లు దాగుదువు’ అన్నడు. కల్లు కన్న కమ్మగున్నయి గదాయె. గింత కమ్మగుంటాదే నీ కల్లు. అనేటల్లకు అవుగదరా పిలగా సల్లగున్నయి. అందరు నగిండ్రు. అందరు ఒకరైనంగా ఒకరు నీల్లను ఒండు జేయకుండా కడుపునిండా, దామార నీల్లు దాగి భేవ్ మన్నరు. బస్సు నిలవడ్డ జెర్ర దూరంల ఉన్న మర్రి చెట్టు కిందికి వోయి అందరు గూసున్నరు. అందుట్ల నాగన్న ఒక్కడే లేడు. ఒచ్చిందాక ఏం జెయ్యాలెనో అని పెంటడెం జేసిండంటే? ‘గీ నాగడు కనిపియ్య కొచ్చెనేంరా’ అడిగిండు. ‘ఆడు కాలుమడువ వోయ్యిండో లేక అనుట్లనే కాదే బావ ఆడు సెంబట్క వొయిండేమో. ఒస్తడులే అన్నడు’ ఎల్లుగాడు. ‘అవురా! సెంబట్కునే వోయినట్లనే వాయే’ సెప్పిండు బాబుగాడు.
‘డప్పును సంకకేసుకోని పోయిండా లేకా ఎవ్వరికన్నా ఇచ్చిపోయిండా?’ అని పెంటన్న అందరితనిగిరాను జేసిండు. ఎవరిది వాల్లతనే ఉన్నది. ‘వాడు డప్పేసుకోనే వోయినట్లున్నడు ఎక్కడొండ పోయిండో పిలువుండి… బస్సురాగల్లది’ అన్నడు పెంటన్న. ‘అరే ఓరీ నాగ… నాగో… ఓ… ఊ…’ అని కూతేసిండు సమ్మన్న. నాగన్న పల్కుడు ఏ దిక్కునుండి ఇనవడకొచ్చింది.
అంతట్లనే ‘సేతుల డప్పు వెట్టుకోని అడిదెకు ఊకె ఒర్లుతవేమిరా’ అన్న సెంద్రయ్య డప్పుతోని పిలువుర నీయవ్వా. అవురా… డప్పుతోనే పిలుపు సెప్పిండు బాబయ్య. అవుగదప్ప అనుకుంట డప్పుతీస్కోని యాడున్నవు రారో… జెగ్గుతక్, జెగ్గుతక్, జెగ్గుతక్ డప్పుతో పిలిసిండు.
సెంబట్క వోయిన నాగన్న వస్తున్న వస్తున్న వస్తున్న జెగనింగుతక్, జగనింగ్‌తక్, జగనింగ్‌తక్ అని పల్కిండు.
రానే వచ్చిండు. అరేయి బస్సు గూడ ఇంతట్ల ఉన్నట్ల కనవడకొచ్చింది జాడ వట్టుడు ఆట ఆడుదమా? అడిగిండు పెంటన్న. అరేయి ఎంత సౌలతు జెప్పినవు గదరా అందరి కండ్లు తళుక్కున మెరిసినయి. ఎవ్వరు గొడ్తర్రా డప్పు అడిగిండు పెంటన్న.నోట్ల మాట నోట్లుండంగనే సెట్టుకొమ్మకు తగిలిచ్చిన డప్పును తీస్కపోయి బాబయ్యకిచ్చిండు సెంద్రయ్య.
బాబ్యయ సంకకు డప్పు తగిలేస్కోని డప్పుకు లోపలి వైపున సిటికెను చిర్రపుల్లలు తీసి డప్పు సరిగ్గా మోగుతున్నదా? లేదా అని టన్ టన్ గొట్టి సూసిండు. తన సేతికి ఉన్న రాతెండి ఉంగరం తీసిండు. పెంటయ్య వోయి నాగన్న దగ్గరున్న తువాలను దీసి సమ్మయ్య కండ్లకు గట్టిండు కనవడకుండా.
అప్పుడు ఎల్లయ్య వోయి పది, ఇరవై అడుగుల దూరంల తంగేడు పొదకింద ఉంగరాన్ని దాసి పెట్టి మీద సిల్పరాయి వెట్టిండు. అప్పుడు సమ్మయ్య వోయి ఉంగరాన్ని జిక్కవట్టుక రావాలె డప్పు దరువు ఆసరతో సైలతో.
బాబయ్య డప్పు కొట్టుడు సురువు జేసిండు. దరువులను గమనించడానికి సిద్దంగా ఉన్నడు సమ్మయ్య.
అందరూ సూడవట్టిండ్రు.
డప్పు సరీగ కొట్టాలె సూడురా బావ సెప్పిండు సమ్మయ్య.
‘సరిగ్గ…. మస్తు కొడ్త నీవు ఉంగురాన్ని జిక్కవట్టుబే’ అని కొట్టుడు సురువు జెసిండు. ఇగ జూస్త అనుకుంట ఉంగురాన్ని దేవాడనీకే ముందుకు కదిలిండు అపుడే జడ బుక్కు తక్, జడ బుక్ తక్, జడ బుక్ తక్, అని డప్పుసిటిక వడంగనే ఇంక ముందుకు పోవట్టిండు. అంటే ఇంక ముందున్నట్లు ఇంకా ముందున్నట్లు ఇంకా జోరుగ జడబుక్కుతక్, జడబుక్కుతక్, జడబుక్కుతక్ అని మోగంగానే జల్లి జల్లి వోవట్టిండు. పోతు పోతు ఉంగరమున్న తంగెడు పొదను దాటిపోయిండు. వెంటనే టన్ టన్, టన్ టన్ టన్ టన్ అని సిటికె పడింది. గిర్రున ఎంటకు మర్లి మెల్లెగ అడుగులేయవట్టిండు. ఎంటకొచ్చుకుంట కత్తెరాటం మద గావట్టిండు. నిదానంగా పక్కకు జరుగు అని జెగ్గుతక్ నింగుతక్, జెగ్గుతక్ నింగుతక్ అని సిటికె పడవడింది అంటె ఎడమ పక్కకు ఉంగరమున్న తావుంటే కుడి పక్కకు పోవట్టిండు. అప్పుడు వెనుకకు దిరగాలె అని టనణన్ టనణన్ అని కొట్టవట్టిండు. అప్పుడే గిర్రున ఎనుకకు తిరిగి తంగెడు పొద దిక్కు రావట్టిండు. వస్తూ వస్తూ దాని ఇడిసి పక్క సైడ్‌లకు పోతున్నడు. అప్పుడు నిదానంగా పోవాలె పోవాలని జెజ్జెగ్గుతక్, జెజ్జెగ్గుతక్, జెజ్జెగ్గుతక్ అని కొట్టినంక నిదానంగా నడువవట్టిండు. జెజ్జెడాకు జెగ్గుతాకు జెజ్జెడాకు జెగ్గుతాకు అని డప్పు అనంగానే ఎడమ పక్కకు పోయి డప్పును ఇనవట్టిండు ఇంక ఎక్కన్నో అన్నట్టు. జడబుక్కు తక్ జడబుక్కుతక్ అని డప్పు వడంగనే ఉన్న తావు దగ్గెరి కొచ్చినట్లున్న అనుకున్నడు. రెండడుగులు ముందుకు నడిసిండు. కిందికొంగి కాల్లు, సేతులు ఇసీరంగ సాపి అక్కడిక్కడ దేవులాడిండు. గప్పున డప్పు జెడబుక్కు తక్ అనంగనే రెండడుగులు ముందుకు నడిసి తుప్పున గూలవడ్డడు. అందరు గొల్లున నగవట్టిండ్రు.
సెంద్రయ్య కండ్లకున్న తువాలు వొలాతమయింది. వురుకుతొచ్చి తువాలును కండ్లకు బిగ్గిత గుంజి కట్టిండు. ఇగ ఎటొంకల పోవాలనో తెలువక ఎప్పటిలాక నిలవడ్డడు. ఉన్నట్లుండి ‘ఓరి అవుల కొడుకా కండ్లు మండుతున్నయిరా’ అని అట్లనే నిలవడ్డడు. జెర్ర సేపటికి జెగ్గు జెగ్గుతక్, నింగు తక్ జెగ్గు జెగ్‌తక్, నింగు నింగు తక్ అని మల్ల సిటికె డప్పు మీద వడేటాల్లకు దగ్గరలోనే ఉన్నదన్నదని నిదానంగ పొంద, కాల్లు దగ్గర దగ్గర పెట్టుకొని నిలవడ్డడు. ఎందుకో మల్ల టనణన్ టనణన్ మని డప్పు దర్వులో తేడా వచ్చింది. ఇదేందిరా నీ… అని మెల్లెగ ఎనుకకు జరిగి ఎక్కన్నో అన్నట్లు మల్లి ఆగిండు. డప్పు జెజ్జెడాకు జెగ్గుతాకు, జెజ్జెడాకు జెగ్గుతాకు అనంగనే నాలుగైదు అడుగులు దగ్గెర దగ్గెర వేసుకుంట ఆగి అక్కన్నే నిలవడి అన్ని దిక్కును పలకరించిట్టు సూస్తున్నడు. వెంటనే టనణన్ టనణన్ టనణన్ దరువు మారింది. ఎంటకు ఎంటకు సూడమన్నది. మెల్లెగా ఎంటకు జరిగిండు. జడ బుక్కుతక్ జడబుక్కుతక్… అన్నది దరువు. మల్ల మూడు అడుగులు నడిసిండు మల్ల నిదానంగ.. జడబుక్కుతక్, జడబుక్‌తక్ అన్నది. కాల్ల అడుగులు నిదానంగా జేసి నడువ వట్టిండు. టన్ టన్ టన్ టన్.. అని అక్కన్నే దగ్గరికొచ్చినవు అనగానే, మెల్లెగా కాల్లతోని జాడ నెంకవట్టిండు. మల్లి జెజ్జెగ్గుతక్ జెజ్జెగ్గు అని దర్వు మారింది. నిదానంగ జాడ దొరుకవట్టడానికి ప్రయత్నం జేస్తున్నడు. మస్తు కోపమొస్తున్నది సమ్మయ్యకు కాని ఆటలో కోపం అయితే ఓడిపోడానిక దగ్గరైతం అని దిగమింగుకోని, అరే! మంచిగ గొట్టుబే డప్పు ఎక్కడ గొడ్తున్నవురా, సరీగ కొట్టసనీ, అన్నడు. అప్పుడు డప్పు గొట్టెటి బాబయ్య గాడ వీకుబె పీకెడిది పీకుమంటె, కోల్లదర్మనీకె వోతున్నవు. అని టణనన్ టనణన్ అని గొట్టిండు. అప్పుడు మల్ల జెర్ర ఎంటకు జరిగిండు. మెల్లెగ తంగెడు పొదదగ్గరున్నడు. డప్పు, ఇంక, టణనన్, టణనన్, అని దర్వు పడుతున్నది. అతని రానె వొచ్చిండు తంగెడు పొదకాడికి. డప్పు డన్, డన్ అనవట్టింది. అక్కన్నే అక్కన్నే అన్నట్టు దర్వు పడుతున్నది. గప్పుడు సేతులతో దేవులాడుకుంటూ అక్కడిక్కడ సేతులను ఊపవట్టె, కింద కాల్లను కాల్లతో వెతుకులాడుంటే కాల్లకు తంగెడు పొద తగిలింది. నిక్కముగా గిక్కన్నే అనుకోని ఆగిండు. అప్పుడు డప్పు దర్వు మల్లి డన్, డన్, డన్ అనవట్టింది. పుసుక్కున గూసోని సేతులతోని దేవలాడంగా దేవులాడంగ రాయి తాకింది సేతికి. రాయిని దీసి సేయివెడితే ఉంగరం దొరికింది. ఉంగురాన్ని డప్పు దగ్గరికి తీసుకొచ్చిండు. ఈ లోపల సెవులు, కండ్లు నెత్తి ఉడికి పోతున్నయి. చెవులు రింగ్ మంటున్నయి. కండ్లు మాత్రం తెరిస్తే గూడ సీకట్లె అయ్నియి. ఇగ జెర్రయితే అయిపాయె అనుకోని లేసిండు. అప్పుడు జడబుక్కుతక్, జడబుక్కుతక్ అని డప్పు దర్వు ఇనవడంగనే ముందుకు వొచ్చిండు. చెవుల స్పర్శతో డప్పును వెదకి పట్టుకోని ఉంగరము నర్సుతాత సేతులో వెట్టి తువాల తీసేసుకున్నడు. గెలిసిండు.
అందరు జతగాల్లు, ఘనుడవేరా! బావ, నీవు అన్నరు. మరీ ఏమనుకున్నవురా మాయన్న అంటే అని ఎల్లయ్య అన్నడు. వోరి బావ మాయన్న గెలిసిండు. నీవు ఓడిపోయినవు. కల్లు కేసు దించుతవా, గాడిదిమీద ఎక్కుతవా; అన్నడు ఎల్లయ్య సమయ్య తరపునించి. అరేయి తుల్వకొడుకా మనం ముందనుకున్నాంరా ఓడినోల్లు గాడిది మీదెక్కాలె లేకుంటే కల్లుకేసు దించాలె అంటాని. అనుకున్నాంరా సెప్పరేం రర్రేయ్ అన్నడు పెంటయ్య. కాదు బావ, ఆని మాటలేం పట్టుకున్నవు. మనం ముందు అనుకోలేము గాని ఆడు నీ తోని పరశ్కమాడుతున్నడి కానీ ఊరికి పోయినంకా తలా ఒగ సీసా కల్లు దాగుతం పదా అన్నడు నాగయ్య. తాగేటోల్లు కల్లు తాగనోల్లు గారెలు. ఎట్లయినా తాగుతాం, తింటాం గదా పాండీ పోదాం. బస్సు దగ్గెరికి వోయి కూసుందం అని బస్సుకాడికి వోయిండ్రు. అయినా మొన్ననే గదా బాబయ్య ఆల్ల వొడ్లకల్లము అయిపోయినంకా వొడ్లు అర్తికేసి, పట్టి తెచ్చి అందరికి కల్లుకేసు దింపె నీవు గూడ సూస్తివి. పాపం మల్ల యాడ దింపుతడు. ఆనికి కోల్లల్యాక పిల్లలున్నరు. తినేటోల్లు కూలి బాయిగాడు కూలి జేసుకుంటెనే ఇంత కుండల కొస్తది. బావ మాత్రం డప్పు బేత్రీన్ కొట్టి తొండి జెయ్యాలనుట్లనే ఉంగరము దొరికె గదప్పా ఇంక తిప్పల వెడుదమనుకున్న సమ్మయ్య మాత్రం అని నాగయ్య అనుట్లనే బస్సు రెడీ రాండయ్య బస్సు ఎక్కండి అని కండక్టరు కూత ఏసేసరికి అందరు ఎవరి డప్పులు వాల్లు భూజాలకేసుకోని బస్సు ఎక్కిండ్రు. బస్సు డుర్‌ర్‌ర్‌ర్…. అని ఎల్లిపోయింది.


pasunoori ravinder Dec 12, 2007 1
కథ రాసిన శ్యామల గారికి అభినందనలు.
అణగారిన జీవితాల్లోని కళాత్మక సౌందర్యాన్ని పట్టుకోవడంలో
రచయిత్రి విజయం సాధించారు.
డప్పు కొట్టడంలో ఎన్ని దరువులుంటాయో చెప్పిన తీరు అద్భుతం.
ఒక పూర్తి స్థాయి గ్రామీణ దళిత జీవిత సంభాషణ
కథ చదువుతున్నప్పుడు కండ్లకు కనపడ్డది.
నిమ్న కులాల సంస్కృతి ఎంత గొప్పదో తెలుపడానికి
ఈ కథ ఒక చక్కని ఉదాహరణ.
ఇంకా వెలుగులోకి రాని అనేక చీకటి కోణాల్ని
కథలుగా రాయడానికి ఈ కథ ఒక ప్రేరణగా నిలుస్తుంది.
gurram seetaramulu Feb 28, 2008 2
ఈ కత డప్పు దరువు లొని శ్రమ్ సంస్క్రుతి ని
గొప్ప గా చెప్పింది దలిత సంస్క్రుతి కి కొత్త ఈస్థ/టిక్ ను
అందించిన గొగు శామల కు అభినందనలు
Srinivas Panthukala Apr 1, 2008 3
కథ మంచిగా ఉంది. నా చిన్నప్పటి సాంస్కృతిక జీవితాన్ని, ప్రజాకళలు సామాజిక్ నేపథ్యాన్ని గుర్తుకు తెస్తున్నాయి. మట్టి మనిషుల శ్రమ సౌందర్యాన్ని, జీవన్ శైలిని ప్రపంచానికి తెలుపుతోంది. కథ రాసిన గోగు శ్యామల గారికి అభినందనలు.